అర్ధసత్యాల దౌత్యం ఆత్మకథ | opinion by shekhar gupta on indo pak relation | Sakshi
Sakshi News home page

అర్ధసత్యాల దౌత్యం ఆత్మకథ

Published Sat, Oct 10 2015 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

అర్ధసత్యాల దౌత్యం ఆత్మకథ

అర్ధసత్యాల దౌత్యం ఆత్మకథ

పాక్ సైన్యం, ఐఎస్‌ఐ ఉన్నతాధికారుల బృందం ప్రజలు ఎన్నుకున్న ప్రధానులనే కాదు, తమకు భిన్నంగా ఆలోచించే త్రివిధ దళాల అధిపతులను సైతం లెక్క చేసేది కాదు. కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా తాను ముందడుగు వేసినట్టు, అందుకు సైన్యం పూర్తి ఆమోదం తెలిపినట్టు కసూరీ సూచించారు. ముషార్రఫ్, కయానీ, ఐఎస్‌ఐ అధిపతి పాషా, తదితరులున్న కీలక సమావేశాల చర్చల గురించి ఆయన రాశారు. కానీ నాటి కాలక్రమాన్ని చూస్తే ఈ తెరచాటు చర్చల కీలక దశలోనే ‘‘ఎవరో కొందరు’’ 26/11 దాడులకు పన్నాగం పన్నుతున్నారని తెలుస్తుంది.


 అత్యున్నత దౌత్యవేత్తలకు పక్షులకు మధ్య సంబంధం ఏమిటి? వారు ‘గద్దా కాదు పావురమూ కాదు’ ఆ రెంటికి మధ్యస్త జాతి పక్షులు. పాకిస్తాన్ మాజీ విదేశాంగశాఖ మంత్రి కుర్షీద్ మొహమ్మద్ కసూరీ ‘నెయిదర్ ద హాక్ నార్ ఏ డోవ్: ఏన్ ఇన్‌సైడర్స్ ఎకౌంట్ ఆఫ్ పాకిస్తాన్స్ ఫారిన్ పాలసీ’ (గద్దా కాదు పావురమూ కాదు: పాకిస్తాన్ విదేశాంగ విధానంపై ఒక లోపలి మనిషి కథనం) అనే  851 పేజీల పుస్తకాన్ని రాశారు. వైకింగ్/ పెంగ్విన్ ప్రచురించిన ఆ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా కసూరీ పాక్ విదేశాంగ మంత్రిగా ఉండగా యూపీఏ-1 ప్రభుత్వ విదేశాంగ మంత్రిగా ఉన్న నట్వర్‌సింగ్ కూడా కనిపించారు. అప్పట్లో ఆయనను ఒక పాత్రికేయుడు మీరు గద్దా? పావు రమా? అని అడిగిన సంగతి గుర్తుకు తెచ్చుకోండి (దూకుడుగా లేదా కయ్యా నికి కాలుదువ్వే రీతిలో వ్యవహరించేవారిని గద్ద అనడం పరిపాటి). నట్వర్ దానికి నేను నడుపుతున్నది విదేశాంగ శాఖనా? లేక  పక్షుల అభయార ణ్యాన్నా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదో సరదా వ్యవహారం అనుకోండి.
 కసూరీ స్వాతంత్య్రం నమ్మశక్యం కానిది
 కసూరీతో వచ్చిన తంటా ఏమిటంటే పక్షి మానవునిగా ఆయన తన విదేశాంగశాఖ కార్యకలాపాలను ఆ పుస్తకంలో ఏమంత శ్రద్ధగా పట్టించు కోలేదు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఆ దేశ విదేశాంగ విధాన భావజాల దిశను నిర్ణయించగలరన్నట్టుగా ఆయన నటించారు. లేదా విదేశాంగ విధాన పరమైన పక్షిశాస్త్రంలో తాను ఉండాల్సింది గద్దగానా లేదా పావురం గానా లేదా ఆ రెండింటికీ మధ్యస్తమైన మరో జాతి పక్షిగానా అని నిర్ణయించు కునే శక్తి ఉంటుందన్నట్టు సూచించారు. అది నమ్మశక్యం కానిది.

ఆ పుస్తకం మరీ అతిగా సరళీకరించినది, కొన్ని భాగాలైతే చాలా హడావుడిగా, బాధ్యతా రహితంగా రచించినవి అని కూడా నేను జోడించాల్సి ఉంది. కానీ నేనలా అన డం ఎంతో కొంత కృతజ్ఞతారాహిత్యం, మొరటుదనం ప్రదర్శించడమే అవు తుంది. కసూరీ నాకు మిత్రుడు, సదుద్దేశాలు గలిగిన మేధావి. కాలం విష యంలోలాగే ఆతిథ్యంలోనూ మహా ఉదారమైన మనిషి. 1985లో రిపోర్టర్‌గా నేను పాకిస్తాన్‌కు మొదటిసారిగా పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన ఇంట్లోని అద్భుతమైన డైనింగ్ టేబుల్‌పై భోజనం చేశాను.
 అయినా నేనలా అనడానికి కారణం ఉంది. భారత-పాకిస్తాన్ సంబంధాలను నిర్వచించేది కశ్మీరే అన్నట్టున్నంత కాలం... కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఒక తరమే చాలదనిపిస్తుంది. ఒక భారత ప్రభుత్వానికి  ఐదేళ్ల పదవీ కాలం అందుకు సరిపోదు. పాకిస్తాన్‌లోని సైనిక నియంతలు హత్యకు గురైన, ప్రవాసానికి పోయిన లేదా జైల్లో కె ళ్లిన మరునాడే వారి మాటలు, వాగ్దానాలు లెక్కలోకి రాకుండా పోతాయని చరిత్ర చెబుతోంది. కాబట్టి అలాంటి ఇంకొక నియంత ముషార్రఫ్ పాలనలో అది అసాధ్యం. వాటన్ని టినీ తర్వాత తిరగ దోడుతారు, తిరస్కరిస్తారని కూడా చరిత్ర చెబుతోంది. అదలా ఉంచితే, ముషార్రఫ్ సరిగ్గా దాదాపు అదే క్రమంలో సాగారు.

 దేశ ప్రధాని శాంతి కోసం ప్రయత్నిస్తుండగా... ఆయనకు వెనుక మాటున భారత్ దెబ్బకు మోకాళ్ల మీద పడి, శాంతి కోసం ప్రాధేయపడు తుందే తప్ప తిప్పికొట్టదని భావించి కార్గిల్ యుద్ధాన్ని ప్రారంభించిన జనరల్‌ను మీరు ఎంత ని నమ్మగలరు? ఆ తర్వాత ఆయన కేవలం ఫేస్‌బుక్ పేజీలోని ‘లైక్’ల సంఖ్యను బట్టి... నిజంగానే తన దేశం తనని ప్రేమి స్తోందని, తన కోసం తపించిపోతుందని, ఎలాగైనా తాను తిరిగిరావాలని కాంక్షిస్తోందని ఆయన నమ్మేశారు. అందుకే రాజకీయవేత్త అవతారం ఎత్తి ప్రవాసం నుంచి తిరిగి వచ్చారు. రాజద్రోహానికి పాల్పడ్డందుకు ఆయనపై ఇంకా విచారణ జరగలేదు. అందుకు కారణం సంస్థాగతంగానైతే సైన్యం, వ్యక్తిగతంగానైతే జనరల్ రహీల్ షరీఫ్ ఆయన్ను కాపాడు తుండటమే.

 శాంతి చర్చల మాటునే పన్నాగాలు
  పాకిస్తాన్ విదేశాంగ విధానాన్ని ఏదో ఒక విధంగా తానే నిర్ణయించానని లేదా కీలక పాత్ర వహించాలని భావించడం లేదా తాను గద్దగా వ్యవహరించాలా? లేక  పావురంలానా? అనేది తన చేతుల్లోనే ఉండేదని కసూరీ భావించడం ఈ  పుస్తకంలో కనిపిస్తుంది. సరిగ్గా అదే నేను ఏ  మాత్రం అంగీకరించలేని విషయం. సౌమ్యులైన పాశ్చాత్య విద్యావంతులనే పాకిస్తానీ సైనిక నియంతలు సాధారణంగా విదేశాంగ మంత్రులుగా లేదా సీనియర్ దౌత్యవేత్తలుగా నియమించేవారు. భావనాత్మక స్థాయి నుంచి   ప్రారంభించి వివరాలకు చేరే రీతిలో తమ ఎజెండాను అమలు చేయాలని వారికి నిర్దేశించేవారు. జనరల్ అయూబ్‌ఖాన్, జుల్ఫీకర్ ఆలీ భుట్టోను నియమించడంతో ఈ ధోరణికి శ్రీకారం చుట్టారు. సైన్యం, పెద్ద గూఢచార యంత్రాంగమూ విధానాన్ని నిర్వచించగా, వారిని పరివేష్టించి ఉన్న అత్యున్నతాధికార బృందం ఆ విధానానికి మెరుగులు దిద్దడం ఆనవాయితీగా ఉండేది. విదేశాంగ మంత్రులు ఆ విధానానికి ప్రాతినిధ్యం వహించేవారు. ఆ విధానం కొనసాగింపునకే తప్ప మార్పునకు ప్రాతినిధ్యం వహించని వారుగా భావించే వారిలో అబ్దుల్ సత్తార్, సత్రాజ్ అజీజ్‌లే కాదు కసూరీ సైతం కనిపించేవారు.
 ఈ సంస్థాగతమైన పట్టు ఎంత బలమైనదంటే అది ప్రజలు ఎన్నుకున్న ప్రధానులను... అది భుట్టో అయినా లేదా నవాజ్ షరీఫ్ అయినా ధిక్కరించేది. అంతేకాదు, తమకు భిన్నంగా ఆలోచించే త్రివిధ దళాల అధిపతులను సైతం లెక్క చేసేది కాదు. సరిహద్దులలో మార్పులు లేని రీతిలో కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా భారత్‌తో చర్చలకు తాను ముందడుగు వేసినట్టు, అందుకు సైన్యం పూర్తి ఆమోదం తెలిపినట్టు కసూరీ సూచించారు.  ముషార్రఫ్, జనరల్ అష్ఫాఖ్ పర్వేజ్ కయానీ, ఐఎస్‌ఐ అధిపతి షూజా పాషా, తదితర కీలక సైనికాధికారులంతా ఉన్న సమావేశాల్లో సాగిన చర్చల గురించి ఆయన వివరంగా రాశారు. కానీ నాటి కాల క్రమాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ తెరచాటు చర్చలు కీలకమైన దశలో ఉండగానే ‘‘ఎవరో కొందరు’’ 26/11 ముంబై దాడులకు ప్రణాళికను రచించే పనిలో ఉన్నారని తెలుస్తుంది.

 ముంబై ఉగ్ర దాడులు, పాక్ సైన్యం, ఐఎస్‌ఐల నియంత్రణకు లోబడని దుష్టులు చేసిన దాడులు మాత్రమేనని మీరు నమ్మదలుచుకుంటే నమ్మొచ్చు. నన్ను మాత్రం ఆ కోవలోకి చేర్చకండి. వాజ్‌పేయి, నవాజ్‌లు శాంతి చర్చలు సాగిస్తుండగా, ముఫార్రఫ్ కార్గిల్ యుద్ధానికి పథకం పన్నే పనిలో ఉన్నారు. భారత సైనిక గూఢచార సంస్థ రా మాజీ అధిపతి ఆనంద్ వర్మ  పదవీ కాలంలో పాక్ ఐఎస్‌ఐకి లెఫ్టినెంట్ జనరల్ హమీద్ గుల్ అధిపతిగా ఉండేవారు. 1980లలో రాజీవ్, జియా ఉల్ హఖ్‌ల ఆదేశానుసారం వినూత్నమైన రీతిలో ప్రారంభమైన తెరచాటు చర్చలనే కొనసాగించారని వర్మ, గుల్ మరణం సందర్భంగా ‘హిందూ’ పత్రికలో రాశారు.

సరిగ్గా ఆ చర్చల సమయంలోనే అంతుబట్టని రీతిలో  జియా హత్య జరిగింది. గుల్ తన మాట వెనక్కు తీసుకుని అఫ్ఘానిస్థాన్‌లో పోరాటం తీవ్రతరం చేయడమే కాదు, మన పంజాబ్ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించారు. బ్లూస్టార్ (1984 జూన్), బ్లాక్ థండర్ (1988 మే), తదుపరి పంజాబ్‌లో మూడో దశ ఉగ్రవాదం ఐఎస్‌ఐ మద్దతుతోనే ఖలిస్థానీ పేరుతో సాగింది. అదృష్టవశాత్తూ అదే ఆఖరుది. కారణాలు అంతుబట్టకుండా జియా హత్య జరిగిన 1989లోనే క శ్మీర్‌లో సమస్య తిరిగి తలెత్తింది. ఇక 2008లో పాకిస్తాన్ తరఫున చర్చలో కీలకమైన వాడైన గుల్ ‘‘వినూత్నమైన’’ పరిణామం జరుగుతుండగానే 26/11 దాడులకు పథకాలు వేశారు.
 
 మరుగున పడ్డ కొన్ని ఆసక్తికర అంశాలు
 క శ్మీర్‌కు సంబంధించి ‘‘వెల్లడించిన విషయాల’’ గురించిన చర్చలన్నిట్లో పడి కసూరీ పుస్తకంలోని కొన్ని నిజమైన బంగారు కణికలు కనిపించకుండా పోయాయి. నాకైతే బీరాలు పలికే ముషార్రఫ్ 2005లో ఐరాస సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రసంగం అత్యంత హాస్యభరితమైనది, ప్రాముఖ్యత గలది. అది ఉద్రిక్తతలు సడలిన కాలం. హఠాత్తుగా ముషర్రాఫ్ కశ్మీర్‌పై ఏ మాత్రం పట్టువిడుపులు లేని కఠిన వైఖరిని ప్రకటించారు. అది విని భారత ప్రతినిధి బృందంలో కలకలం రేగుతుండగా తానూ నిర్ఘాంతపోయానని కసూరీ అంగీకరించారు. ప్రేమ యాత్ర మధ్యలో ముషార్రఫ్ స్క్రిప్ట్‌ను మార్చేశారా? మార్చలేదని, ఆయన మరెవరి స్క్రిప్ట్‌నో ఆ సమయంలో చదువుతున్నారని కసూరీ తెలిపారు. ఆ ఉపన్యాసాన్ని రాసినది మునీర్ అక్రమ్. ఆగ్రహావేశపరుడైన ఆ ఉన్నత దౌత్యవేత్త ఒకసారి భారత్‌ను ఆసియా రోగిష్టి అని, నాటి మన విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌ను కిరాయి ముస్లిం అని అన్నారు. మునీర్ అప్పట్లో ఐరాసలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధిగా ఉండేవారు. ఆ స్క్రిప్టు పూర్తిగా మునీర్‌దేనని, విదేశాంగ మంత్రినైన తనకు గానీ, ముషార్రఫ్‌కు గానీ లేదా తమ సహాయకులకు గానీ దాన్ని చూసే సమయం లేకపోయిందని కసూరీ చెప్పారు. అంటే ముషర్రాఫ్ వేదికపై నుంచి తన ప్రసంగాన్ని చదువుతున్నప్పుడే అది తనను ఎక్కడకు తీసుకుపోతోందో గ్రహించి ఉండాలి.

 దాన్నుంచి పలు గుణపాఠాలు తీయవచ్చు. మొదటిది, మన ఎస్.ఎమ్. కృష్ణ పోర్చుగీసు విదేశాంగ మంత్రి ఉపన్యాసాన్ని ‘‘పరధ్యానంగా’’ చదువుతుండటాన్ని చూసి మనం అన్యాయంగా నవ్వాం. రెండు, ముఫార్రఫ్, ఆయన సహాయకులు అసమర్థులు కాకున్నా, సోమరులు. మూడు, సైనిక నియంత అధికారంలో ఉండి అధికారం మీటలన్నీ చేతిలో ఉంచుకున్నా భారత్‌తో విదేశాంగ విధానాన్ని రచించిన చెయ్యి మరేదో శక్తికి స్పందించింది.  అదే జరగకపోతే మునీర్ అక్రమ్‌ను వెంటనే కాల్చి పారేసేవారు. ఆ విషయం కసూరీ చెప్పేవారు కారు. భారత-పాకిస్తాన్‌లకు సంబంధించి ఏ నిజాన్ని చెప్పినా... అది ఏకపక్షమైనది, ఒక వ్యక్తి పక్షం నుంచి చెప్పినదే అయినా విలువైనదే. ఆ మేరకు, కసూరీ మన జ్ఞానానికి, అవగాహనకు చేర్పును చేశారు. కానీ పుస్తకం పేరును ‘‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ సింగింగ్ సింప్లిస్టిక్ కానరీ’’ (కూనిరాగాల పిట్ట ఆత్మకథ)గా మారిస్తే బాగుంటుంది. అయితే ఆ పుస్తకం మనలో చాలా మందిలో ఉన్న కొన్ని నిరాశాపూరితమైన పాత విశ్వాసాలను బలపరుస్తుందే తప్ప మార్పునకు భరోసాను కలిగించదు.

 

          (వ్యాసకర్త : శేఖర్ గుప్తా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement