మాటు దాడితో రూటు మారేనా? | will modi change route of party? | Sakshi
Sakshi News home page

మాటు దాడితో రూటు మారేనా?

Published Sat, Dec 26 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM

మాటు దాడితో రూటు మారేనా?

మాటు దాడితో రూటు మారేనా?

 ప్రధానిగానూ, పార్టీ నేతగానూ మోదీ స్థానానికి తిరుగులేదు. కాకపోతే ఆయన ఇప్పుడు పార్టీని ఏ దిశగా నడుపుతున్నారో అటే సాగుతారా? లేక దిశను మారుస్తారా? అనేదే ప్రశ్న. అటే సాగ డమంటే, అధిష్టానం సంస్కృతిని వ్యవస్థీకృతం చేయడమే. 1969 తదుపరి కాంగ్రెస్ చేసిందదే. నిజానికి నేటి అసమ్మతి, ఆ పరిణామానికి వ్యతిరేక మైన రోగనిరోధక ప్రతిస్పందనా స్వభావం కలిగినది కూడా. అతి కేంద్రీకరణ అనే వాదన ఆర్‌ఎస్‌ఎస్‌ను సైతం మెప్పించగలుగుతుందని అసమ్మతివాదుల ఆశ.
 
 ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది వేసవికి బీజేపీలో మునుపెన్నడూ ఎరుగనంతటి అత్యంత ప్రధాన నేతగా ఆవిర్భవించారు. ఆయనకు ఇక తిరుగేలేదని అనిపించింది. పద్దెనిమిది నెలల కాలంలోనే అసమ్మతి, అంతర్గత కలహాలు పతాక శీర్షికలవుతాయని ఎవరూ ఊహించి ఉండరు.
 మొత్తంగా చూస్తే, బీజేపీ దాని ప్రత్యర్థి పార్టీలలో చాలా వాటి కంటే, తన మిత్రపక్షాలన్నిటికంటే నిస్సందేహంగా ఎక్కువ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కలిగిన, క్రమశిక్షణాయుతమైన పార్టీనే. అయితే ఆరోగ్యకరమైన అభిప్రాయ భేదాల చరిత్రా ఆ పార్టీకి ఉంది. ఉదా హరణకు, వాజ్‌పేయి, అద్వానీల మధ్య విభేదాలూ, 2002 గుజరాత్ అల్లర్ల త దుపరి మోదీపై ఏం చర్య తీసుకోవాలనే విషయంలో తలెత్తిన విభేదాలూ  సుప్రసిద్ధమైనవి. అయితే సాధారణంగా అలాంటి సమస్య లన్నీ పార్టీ అంతర్గత చర్చ ద్వారానే పరిష్కారమయ్యేవి. కొన్ని సందర్భాల్లో ఒకరితో మరొకరు విభేదించడమూ, ముఖం మాడ్చు కోవడమూ కొనసాగుతూనే ఉండేది. ఇంకా ఏవైనా సమస్యలు మురిగిపోతూ ఉంటే, వాటిని పరిష్కరించడానికి దూరాన ఉన్న నాగపూర్‌లోనో, సమీపంలోని జందేవాలన్‌లోనో ఉండే ఆర్‌ఎస్‌ఎస్, అత్యున్నతమైన థర్డ్ ఎంపైర్‌గా ఎప్పుడూ అందుబాటులో ఉండేది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలేవీ బీజేపీ వ్యవహార శైలిలో సాగుతున్నవని అనిపించదు.

 మూడు దఫాలుగా లోక్‌సభ సభ్యునిగా ఉన్న కీర్తీ ఆజాద్, బాహాటం గానే  అరణ్‌జైట్లీ అధికారాన్ని, ప్రతిష్టను సవాలు చేశారు. ప్రధాని మోదీకి బాగా కావాల్సినవారైన ముగ్గురు నేతల త్రయంలో జైట్లీ ఒకరు, నేటి ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నది ఆ నాయక త్రయమే. జైట్లీ, అరవింద్ కేజ్రీవాల్‌పై వేసిన పరువునష్టం దావా కేసులో బీజేపీ శాశ్వత అసమ్మతివాది రామ్ జెఠ్మలానీ, కేజ్రీవాల్ తరఫున కోర్టుకు హాజరవుతున్నారు. ఆ పార్టీ నేతలు, కీలక మద్దతుదార్లు, తదితరులు సామాజిక మాధ్యమాల ద్వారా వెలువరిస్తున్న అభిప్రాయాలను క్రమం తప్పకుండా మీరు గ మనిస్తూ ఉంటే, ఈ అసమ్మతిలో ఒక క్రమ పద్ధతి కనిపిస్తుంది.

 జైట్లీపై దాడి మోదీపైకి ఎక్కుపెట్టినదే
 నాయక త్రయంలోకెల్లా జైట్లీ అత్యంత దుర్బలమైన వారని భావించి, ఆయనను అడ్డుపెట్టుకుని అసమ్మతివాదులు మోదీపై దాడి సాగిస్తున్నారు.  అయితే ఎవరూ మోదీకి వ్యతిరేకంగా నోరెత్తే సాహసం చేయలేకపోతున్నారు. ఇక అమిత్ షా గురించైతే, బిహార్ ఎన్నికల తదుపరి గుసగుసలాడుతున్నారు. అంతేగానీ బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. వారు జైట్లీని అన్నీ బాహాటంగా మాట్లాడే వానిగా, బహిర్గతమైపోయినవానిగా చూస్తు న్నారు. కొందరి లెక్కల ప్రకారమైతే, ఆయన మోదీకి ఉపయోగపడేవారు కారు కూడా. అందువల్లనే కీర్తీ అజాద్ నుంచి కేజ్రీవాల్ వరకూ, ఆర్‌ఎస్‌ఎస్‌కు సన్నిహితంగా ఉండే కొందరు స్వతంత్ర తిరుగుబాటుదారులూ, ఆగ్రహంతో ఉన్న వృద్ధ పార్టీ సీనియర్ల బృందమూ ఆయననే లక్ష్యంగా చేసుకున్నారు.

 ఎవరి గురించి మాట్లాడుతున్నారనే దాన్ని బట్టి ఆ వర్ణన మారుతుం డవచ్చు. సాధ్యమైనంత వరకు బలహీనమైన బ్యాట్స్‌మాన్‌నే లక్ష్యంగా ఎంచుకోవాలనేదే ఎప్పుడూ మీ బౌలింగ్ వ్యూహం కావాలి. రాజును బాధ పెట్టాలంటే ఆయనకెంతో ఇష్టమైన చిలుకను చంపాలంటూ బామ్మ చెప్పే కథల్లాంటిదే ఇదీ అని ఇంకెవరైనా అనొచ్చు. ఎలా చెప్పినా అది చెప్పే విషయం మాత్రం ఒక్కటే. జైట్లీని తప్పించగలిగితే, మోదీ తన బలాబలాల సంతులనాన్ని మార్చక తప్పకపోవచ్చు, లేదా ఆ అధికారాన్ని ఇతరులకు పంచాల్సి రావచ్చు. ఈ పరిస్థితుల్లో అందివచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని గ్రహించిన కేజ్రీవాల్... కీర్తీ, జెఠ్మలానీ వంటి తోడేళ్ల గుంపులో చేరారు.


 దీనితో పోల్చదగిన పరిణామాన్ని మనం గతంలోనూ చూశాం. మోదీ లేదా షా పైకి మాటుగాచి దాడి చేయడానికి జైట్లీని లక్ష్యంగా చేసుకున్నట్టే... వాజ్‌పేయి హయాంలో బ్రజేష్ మిశ్రాను లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆయన పార్టీకి బయటివారనీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానూ, జాతీయభద్రతా సలహాదారుగానూ ఆయన చేతుల్లో మరీ ఎక్కువగా అధికారం కేంద్రీకృతమై ఉందనీ, అమెరికాకు మరీ ఎక్కువగా అనుకూలురనీ, ఒకే మనిషికి  వ్యక్తిగతంగా అంకితమైనవారనీ బ్రజేష్‌ను చిత్రీకరించారు. దీనికి తోడు వాజ్‌పేయి అల్లుడు రంజన్ భట్టాచార్య గురించి గుసగుసలూ  సాగాయి. అయితే, బహిరంగంగా మాత్రం ఎవరూ ఏమీ మాట్లాడింది లేదు, ప్రత్యేకించి పార్టీ, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారు మాట్లాడింది లేదు. ఆనాడు సాగిన ఈ ప్రచారం ఎంత తీవ్రమైనదో, ఎంత లోతైనదో ఆ తర్వాత ... నాటి ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి కేఎస్ సుదర్శన్ నాతో ‘వాక్ ద టాక్’ ఇంటర్వ్యూలో చెప్పారు. పార్టీ అసమ్మతివాదులు నేడు మోదీని కూడా అలాగే పరీక్షిస్తున్నారు.

 ‘కాంగ్రెసీయం’ చెందుతున్న బీజేపీ
 ఇప్పుడు దాడి సాగిస్తున్నవారు ఈ సమయాన్నే ఎంచుకోవడానికి కారణమైన నిర్ణయాత్మక అంశాలు మూడు. ఒకటి, వృద్ధి గణాంకాలమాటెలా ఉన్నా, చమురు ధరల తగ్గుదల ఫలితంగా ఒక్క కోశపరమైన లోటు పరిస్థితి మినహా, ఆర్థిక సూచికలేవీ నిజంగా పుంజుకోలేదు. రెండు, బిహార్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ పాలక కూటమిని బలహీనం చేసింది. మరే ముఖ్య రాష్ట్రమూ (అస్సాం చాలా చిన్నది) త్వరలోనైతే ఆ త ప్పులను సరిదిద్దుకునే అవకాశం దానికి ఇవ్వదు. మూడు, జనవరిలో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగాల్సి ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ముగిసే ఆ రె ండో దఫా అవకాశాన్ని షా వాంఛిస్తారనడం నిస్సందేహం. ఆ తర్వాత ఎలాగూ నాయకత్వ కొనసాగింపు కోసం పదవీ కాలాన్ని విస్తరింపజేస్తారని ముందస్తు అంచనా సైతం ఉంది. కాబట్టి అసమ్మతివాదులు, ఆశావహులందరికీ... వారు బహిరంగంగా మాట్లాడేవారైనా, మౌనంగా ఉంటున్నవారైనా... ఇదే చివరి అవకాశం అనిపిస్తోంది.
 అందుకే రాజకీయాలు ఇంతగా ఊపందుకున్నాయి. పార్టీ అనుయాయు లను, ఓటర్లను దూరం చేసే తలపొగరుతనం నుంచి, పార్టీని ‘‘గుజరా తీయం’’ చేస్తున్నారనేంత వరకు గుసగుసలు చెలరేగుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వీటికి సానుభూతి లభిస్తోంది. కానీ, అది పరిస్థితిని మార్చడటానికి సుముఖంగా ఉన్న దాఖలాలేవీ లేవు. కనీసం వాజ్‌పేయి పాలన చివరి దశలో కలిగినపాటి అసంతృప్తి కూడా ఆర్‌ఎస్‌ఎస్‌కు కలిగినట్టు లేదు.  


 గుజరాతీయీకరణ గురించి కంటే కూడా, పార్టీ కాంగ్రెసీకరణం చెందుతోందన్న ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. సాధారణంగా బీజేపీలోని అంతర్గత ప్రజాస్వామ్య సంస్థలు సక్రమంగా పని చేస్తుంటాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. షాకు పట్టంగట్టడానికి ఆమోదం తెలపడానికి సమావేశమైన పార్టీ జాతీయ కార్యవర్గం తిరిగి ఇంతవరకు సమావేశం కాలేదు. కొందరిని మినహాయిస్తే కేబినెట్ మంత్రులంతా తమకు అధికారం లేకపోవడం పట్ల కినుక వహించి ఉన్నారు. పటిష్టమైన మోదీ-షా నిఘా, పర్యవేక్షణ వ్యవస్థ ఎవరూ లంచాలు తీసుకోకుండా చూడటానికి సరిపోతుందని అనుకోవడమే అందుకు కారణమని అనుకోవచ్చు.
 ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం చే సుకుంటుందా?
 ప్రధానిగానూ, పార్టీ అత్యున్నత నేతగానూ మోదీ స్థానం తిరుగులేనిది. కాబట్టి ఆయన భవితవ్యం గురించిన ప్రశ్నే ఉత్పన్నం కాదు. కాకపోతే  ఆయన పార్టీని ఏ దిశగా నడుపుతున్నారో అటే సాగుతారా? లేక దిశను మారుస్తారా? అనేదే ప్రశ్న. అటే సాగడమంటే, ఈ అధిష్టానం సంస్కృతిని లోతుగా విస్తరింపజేసి, వ్యవస్థీకృతం చేయడమే. 1969 తదుపరి కాంగ్రెస్ చేసిందదే. నిజానికి నేడు మనం చూస్తున్న అసమ్మతి, ఆ పరిణామానికి వ్యతిరేకమైన రోగనిరోధక ప్రతిస్పందనా స్వభావం కలిగినది కూడా. అతి కేంద్రీకరణ అనే ఈ వాదన ఆర్‌ఎస్‌ఎస్‌ను సైతం మెప్పించగలుగుతుందని కూడా అసమ్మతివాదులు ఆశిస్తున్నారు.
 బీజేపీపైన ఆర్‌ఎస్‌ఎస్ నీడ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అయితే, ఆ రెంటి మధ్య సమీకరణలు గతంలో కంటే చాలా మారాయి. 2009 ఎన్నికల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయాక అద్వానీ ప్రాభవం క్షీణిస్తుండగా అది చివరిసారిగా బీజేపీ వ్యవ హారాల్లో బహిరంగంగానూ, నిర్ణయాత్మకంగానూ జోక్యం చేసుకుంది. అప్పట్లో నలుగురు సీనియర్ నేతలు జైట్లీ,  సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, అనంత కుమార్ కలిసి ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్‌ను కలుసుకున్నారు. తొలుత పార్టీ అధ్యక్షుడి ఎంపికతో ప్రారంభించి పార్టీ పునర్నిర్మాణానికి తోడ్పడాలని అభ్యర్థించారు. ఆర్‌ఎస్‌ఎస్, యువ నేతను కోరుకుంది. మనోహర్ పారిక్కర్‌ను అధ్యక్షుడ్ని చేయాలనుకుంది. కానీ ఆయన అద్వానీని పాత చింతకాయ పచ్చడిగా తీసిపారేస్తూ చేసిన ప్రకటనతో ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నారు. అలా నితిన్ గడ్కరీ తెర పైకి వచ్చారు.
 అలాంటి జోక్యం ఇప్పుడు జరిగే అవకాశం చాలా తక్కువ. నాగపూర్ పీఠాధిపతులు సైతం జోక్యం చేసుకోలేనంతటి శక్తివంతునిగా, ప్రజాదరణ కలిగిన నేతగా నేడు మోదీ ఉన్నారు. పైగా అధికారాన్ని పంచుకోవడంలో వాజ్‌పేయి కంటే కూడా ఆయనే ఆర్‌ఎస్‌ఎస్‌కు పెద్ద పీట వేశారు. కీలక మంత్రిత్వ శాఖలను, గవర్నర్ పదవులను కట్టబెట్టారు. ప్రత్యేకించి అది బాగా కోరుకునే ఈశాన్య రాష్ట్రాల గవర్నర్ పదవులను వారికే ఇచ్చారు. మోదీ-షా సమస్యకు సంబంధించి మోదీ ‘‘సర్దుబాటు ధోరణి’’తో వ్యవహరిస్తారా లేక తిరస్కార వైఖరిని చేపబడతారా? అనేది తేలాలంటే రానున్న నాలుగు వారాలు వేచి చూడాల్సిందే.

 

(వ్యాసకర్త శేఖర్ గుప్తా)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement