ఒక పతనం.. ఒక ఉత్థానం..!
జాతిహితం
మీరు యూపీఎస్‌సి పరీక్షలకోసం సిద్ధమవుతున్నవారిలో భాగం కానట్లయితే, ఒలింపిక్స్‌లో నిజమైన బంగారు పతకాన్ని భారత హాకీ జట్టు ఎప్పుడు గెల్చుకుందనే విషయం మీకు గుర్తు ఉండకపోవచ్చు. నిజమైన అని ఎందుకంటున్నానంటే 1980లో మాస్కో ఒలింపిక్స్‌లో మనకు హాకీలో స్వర్ణ పతకం ఒక మినహాయింపు కింద లభించింది. ఎందుకంటే ఆప్ఘనిస్తాన్‌పై సోవియట్ దాడికి నిరసనగా బలమైన హాకీ జట్లు మాస్కో ఒలింపిక్స్‌ను బహిష్కరిం చాయి. పై ప్రశ్నకు సమాధానం.. 1968లో మెక్సికో నగరంలో మనం హాకీలో కంచుపతకం సాధించాం అన్నదే. దాని తర్వాత 1975లో కౌలాలంపూర్‌లో ప్రపంచ కప్ గెల్చుకోవడమే భారత హాకీ సాధించిన ఏకైక పెద్ద ట్రోఫీగా మిగిలిపోయింది. 60ల వరకు ప్రతి ప్రపంచ స్థాయి పోటీలోనూ భారత్–పాకిస్తాన్ హాకీ జట్లు ఫైనల్ చేరడం రివాజుగా ఉండేది. నిజం చెప్పాలంటే, పాకిస్తాన్ జట్టు నేటికీ తొలి మూడు లేదా నాలుగో స్థానంలో నిలబడటానికి కాస్త పోరాటం సాగిస్తోంది. ఒలింపిక్, ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీలకు అర్హత పొందడానికి కొట్టుమిట్టులాడుతూ చివరకు విఫలం అవుతున్న చందాన భారత హాకీ అంతిమ దిశకు చేరుకున్న విధంగా పతనమైపోయింది.
దీనికి మనం ముందుగా భారతీయ హాకీ సమాఖ్య అధికారులను తప్పు పట్టాల్సి ఉంటుంది. తర్వాత క్రీడాకారులకు ప్రోత్సాహకాల లేమిని, చివరగా ఆస్ట్రో టర్ఫ్ (అన్ని వాతావరణాల్లో, వర్షంతో పని లేకుండా హాకీ అడటానికి వీలిచ్చే కృత్రిమ ఉపరితలం)ని ప్రవేశపెట్టడాన్ని తప్పుపట్టాలి. గతంలో 9 ఒలింపిక్ స్వర్ణాలు, ఒక ప్రపంచ కప్ సాధించిన బలుపుతో హాకీ అధికారి కంగా మన జాతీయ క్రీడగా కొనసాగుతున్నప్పటికీ మనం హాకీ గురించి మాట్లాడుకోవడం మానేశాము. అనివార్యంగా పాకిస్తాన్ కూడా పెద్ద లీగ్ పోటీల్లో అర్హత సాధించలేక పతనమైపోయింది. ఎనిమిది దశాబ్దాలపాటు ప్రపంచాన్ని శాసించిన ఉపఖండ హాకీ శకం ముగిసిపోయింది.
జన్మస్థానంలోనే మహాపతనం
ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌తో పాటు యూరోపియన్ దేశీయ లీగ్, జాతీయ జట్లు కూడా ముందుగా భారత్‌పై, తర్వాత పాకిస్తాన్‌పై టెన్నిస్ తరహా స్కోర్లు సాధించడం రివాజుగా మారిపోయింది. అంతర్జాతీయ హాకీ సంస్థ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ కూడా భీతిల్లుతున్న స్థాయికి మనదైన హాకీ పతనమైపోయింది. హాకీకి జన్మస్థానమైన ఉపఖండంలోనే అది పూర్తిగా అంతరించిపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్న చింతతో వీరు ఇప్పుడు ఆటను కాపాడే పేరుతో భారతీయ హాకీ సమాఖ్యకు డబ్బులు గుమ్మరించడం ప్రారంభించారు. ఈ భీతితో కూడిన ఔదార్యంతోనే ప్రముఖ విదేశీ కోచ్‌లు (ఆస్ట్రేలియన్ దిగ్గజ కోచ్ రిక్ చార్ల్స్‌వర్త్‌తోపాటు) భారత్‌కు హాకీ పాఠాలు బోధించడానికి వచ్చేశారు.
హాకీ క్రీడ ఎంత మౌలికమార్పుకు గురైందంటే, బంతిని డ్రిబ్లింగ్ చేసే, అదుపులో ఉంచుకునే, ప్రత్యర్థిని ఏమార్చి బంతిని తప్పించే కళలో మన సాంప్రదాయిక నైపుణ్యాన్ని అది అసందర్భంగా మార్చి వేసింది. ఆస్ట్రో టర్ఫ్ కీలక సమస్య కాదు. అన్ని వాతావరణాలకు తట్టుకునే ఉపరితల పరిస్థితులను రూపొందించవలసిన అవసరం ఉంది. ఆటను వేగవంతంగా మార్చడంలో, గోల్ స్కోర్ చేయడంలో, రిఫరీ విజిల్స్‌ని పరిమితం చేయడంలో మార్పు తీసుకొచ్చిన స్థితి ఇది. కాబట్టి హాకీ స్టిక్ వాడే సమయంలో తప్పులు చేయడాన్ని (గట్టిగా బాదుతున్నప్పుడు హాకీ స్టిక్‌ను భుజంకంటే పైకి ఎత్తకపోవడం), బంతిని ప్రత్యర్థి పాదాల కేసి కొట్టడాన్ని పరిమితం చేశారు. ఇలాంటి అనేక సందర్భాల్లో మీరు ఇప్పుడు ఆటను కొనసాగించవచ్చు. ఆటకు వేగాన్ని కల్పించడమే ఈ భావన ఉద్దేశం. ఈ క్రమంలో సంక్లిష్టమైన ఉపఖండ నిపుణతలు మనకు అందించిన సానుకూలతను ఇది ధ్వంసం చేసింది. ఆధునిక లేక కొత్త హాకీ పూర్తిగా పవర్ హిట్టింగ్, వేగంతో కూడి ఉంది. పాత ఆసియన్ అటాకింగ్ సూత్రం 5–3–2–1 (అయిదుగురు ఫార్వర్డ్‌లు) భూస్థాపితమైపోయింది. కొత్త నిబంధనల వల్ల మీ డేంజర్ ఏరియా కుడివైపున పొంచివున్న ప్రత్యర్థి అటాకర్ లాంగ్ పాస్‌ని అడ్డగించి బంతిని గోల్‌లోకి తోసే అవకాశం ఉంటోంది. ఫీల్డ్ హాకీ అనేది షూకింద జారడానికి ధరించే స్కేట్‌లు లేని ఐస్–హాకీలా మారిపోయింది. మీకు బలం, వేగం, అవకాశం కోసం పొంచుకుని ఉండటం సాధ్యమైతే గోల్ చేయడం ఇప్పుడు చాలా సులభమైపోయింది. ఈ తరహా ఆట యూరోపియన్లకు సరిగ్గా సరిపో యింది. అక్కడే హాకీ స్వర్ణయుగాన్ని అది తన చేతుల్లోకి తీసేసుకుంది.
అధికారం చలాయించేవాళ్లదే ఆధిపత్యం
యూరోపియన్ల గుత్తాధిపత్యంలోని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్)ను 1924లో నెలకొల్పినప్పటినుంచి 2017లో భారతీయుడైన నరేందర్ బాత్రా కీలక స్థానం పొందేంత వరకు, ఆసియా ఆధిపత్యంలోని హాకీ క్రీడకు సంబంధించినంతవరకూ ఏ యూరోపియనేతర వ్యక్తి కూడా సమాఖ్య అత్యున్నత పదవిని చేపట్టలేకపోయాడు. అధికారం ఉన్న చోటే గేమ్ విధి నిర్ణయమైపోయింది. ఈ సమస్య ఇంకా ముందుకెళ్లింది. దీంతో మరొక సమస్య ఏర్పడింది. హాకీకి పతకాలు ఉన్నాయి కానీ మార్కెట్లు లేవు. డబ్బులు లేవు. హాకీ అంతర్జాతీయంగానే పతనమైపోయింది. మీకు అధికారం లేనట్లయితే అంతర్జాతీయ స్థాయిలో ఆ ఆటపై ఆధిపత్యం ఉన్న యజమానులు మీపై కూడా ఆధిపత్యం చలాయిస్తారన్నదే ఈ తొలి కథ గుణపాఠం.
ఇక రెండో కథ క్రికెట్‌కి సంబంధించింది. భారత్ లాగే పాకిస్తాన్ కూడా ఇంగ్లిష్ క్లబ్ వ్యవస్థ నుంచి తన క్రికెట్‌ని వారసత్వంగా పొందింది. కానీ భారత్ లాగా కాకుండా పాక్ ప్రభుత్వం ప్రారంభం నుంచే క్రికెట్‌పై ఆజమాయిషీని తనవద్దే పెట్టుకుంది. క్రికెట్‌పై ఆజమాయిషీ చేయడం జాతీయ విధి అని పాక్ పాలక వర్గం భావించింది. ప్రభుత్వాధికారం కిందే ఒక లెఫ్టినెంట్ జనరల్, ఒక అత్యున్నతాధికారి, రాజకీయ నేతలు, ఇప్పుడు ఒక సంపాదకుడు పీసీబీని నిర్వహించడానికి నియమితులవుతూ వస్తున్నారు. ప్రధాని లేదా అధ్యక్షుడు బోర్డు ప్రధాన సంరక్షకుడిగా వ్యవహరిస్తున్నారు.
విషాదకరమైన విషయం ఏమిటంటే, ఒక క్రికెటర్ లేదా ప్రొఫెషనల్ తప్ప మరెవరైనా పాకిస్తాన్ క్రికెట్ బోర్డును నిర్వహించే అవకాశముంది. దీని ఫలితం ఏమిటి? దేశంలో గొప్ప టాలెంట్ ఉన్నప్పటికీ పాకిస్తాన్ క్రికెట్‌కు దీనివల్ల జరిగిన మంచి ఏమిటి? అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ ఫిక్సింగ్, చీటింగ్, బాల్ ట్యాంపరింగ్, విదేశీ జైళ్లలో దాని టెస్టు ప్లేయర్లు శిక్ష అనుభవించడం, తిరిగొచ్చాక మళ్లీ దేశం కోసం ఆడటం. దాని ఆర్థిక వనరులు సంవత్సరాలుగా కుప్పగూలిపోయాయి. పాక్ క్రికెట్ బోర్డు 2004లో భారత్ పర్యటన సమయంలో మాత్రమే వాస్తవంగా చివరిసారిగా లాభాలను ఆర్జిం చింది. ఉగ్రవాదుల హెచ్చరికలు దేశీయ క్రికెట్‌ను ఇప్పుడు ధ్వంసం చేశాయి. కాని వాస్తవానికి గత ఏడు దశాబ్దాలుగా పాకిస్తాన్ దేశీయ క్రికెట్ భారత్‌లాగా ఎన్నడూ అభివృద్ధి చెందింది లేదు. ప్రపంచంలోని ఉత్తమ క్రికెటర్లను అందరినీ ఆకర్షించిన ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్ పతనంతో పాకిస్తాన్ క్రికెట్‌కు పెనుదెబ్బతగిలింది. కానీ ఆ పరిణామం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. వాస్తవానికి ప్రపంచంలోని ఉత్తమ ప్రతిభా సంపన్నులను ఆకర్షిస్తున్నదీ, వారిని ఇక్కడ ఆడిస్తున్నదీ భారత్ మాత్రమే. ప్రభుత్వం కానీ, న్యాయవ్యవస్థ కానీ ఎంత సదుద్దేశంతో అయినా సరే.. ప్రైవేట్ నాయకత్వంలో నడుస్తున్న ఒక ప్రొఫెషనల్ క్రీడలో జోక్యం చేసుకుంటే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయినేది ఈ రెండో కథ చెబుతోంది కదా.
వైఫల్యాలనుంచే పునరుజ్జీవం
ఇక మూడవది అత్యంత సంతోషకరమైన కథ. భారత హాకీని ఎలా పునరుద్ధరించవచ్చు అని చెబుతుందిది. దాదాపుగా అంత్యదశకు చేరుకున్న హాకీ క్రీడ బాధ్యతను కొత్త నాయకత్వం చేపట్టింది (ప్రభుత్వ మద్దతుతోనే), పైగా భారత క్రికెట్‌ను నిర్వహిస్తున్న వారి సలహా కూడా భారత హాకీ బోర్డు తీసుకుంటోంది. దేశీయంగా కూడా హాకీ లీగ్ పోటీల నిర్వహణకు ప్రయత్నం జరిగింది. కొన్ని వైఫల్యాలున్నప్పటికీ ప్రపంచంలోనే ఉత్తమ క్రీడాకారులను ఆకర్షించడం ద్వారా ఇది వాస్తవంగానే విజయం సాధించింది. దీంతో రాంచీ వంటి చిన్న పట్టణాల్లో కూడా స్టేడియంలు కళకళలాడాయి. ప్రతిభావంతులైన క్రీడాకారులకు దేశీయ లీగ్ పోటీలు విలాస జీవితాన్ని కల్పించాయి. కానీ, భారత్ ప్రపంచ విజేతగా మారలేదు. యూరోపియన్ నిబంధనలతో కూడిన హాకీ ఇప్పటికీ ఆసియా ఖండ జట్టుకు సవాలుగానే ఉంటోంది. కానీ భారత్ ఇప్పుడు ఆసియా నంబర్ వన్ గానూ ప్రపంచ హాకీలో 6వ స్థానంలోనూ ఉంటోంది. తద్వారా వరల్డ్ కప్, ఒలింపిక్స్, చాంపియన్స్ ట్రోఫీలకు ఆటోమేటిక్‌గా అర్హత సాధించింది. ప్రధాన జట్లపై మన జట్టు ఆటతీరు మెరుగుపడింది.
వాస్తవానికి ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లపై భారీ స్కోరుతో ఓడిపోయిన ఘటనలు మన జ్ఞాపకాల నుంచి తొలిగిపోతున్నాయి. ప్రపంచ స్థాయిలో గెలుపొందనప్పటికీ, స్వర్ణం గెలుచుకున్న రోజుల కంటే ఇప్పుడే భారత హాకీ ప్రపంచ హాకీ శక్తిగా పేరు సాధించింది. భారత్ హాకీకి మార్కెట్‌ను సాధించి దాన్ని ప్రపంచానికి బహుమతిగా అందించింది. దీని ఫలితం ప్రపంచ స్థాయి ఉత్తమ ఆటగాళ్లు ఇక్కడికి రావడమే కాకుండా ఈ సంవత్సరం అంతర్జాతీయ హాకీ సమాఖ్యకు ఒక భారతీయుడు అధ్యక్షుడయ్యారు. పతకాల కంటే అధికంగా డబ్బే మాట్లాడే అంతర్జాతీయ క్రీడలో మీ ఆర్థిక బలాన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేందుకు ఇది గొప్ప పాఠం.
ప్రపంచ క్రికెట్‌ను ‘లార్డ్స్’ నడుపుతున్నప్పుడు 1971–72 మధ్య కాలంలో భారత్ తన స్పిన్ బలంతో కేవలం రెండంటే రెండు సీరీస్‌లు నెగ్గగానే వారు లెగ్ ట్రాప్‌లోని ఫీల్డర్లపై నిబంధనలు విధించారు. తర్వాత వెస్టిండీస్ తమ పేస్ బౌలింగుతో శివతాండవమాడుతున్నప్పుడు ఈ కులీనులే బౌన్సర్లపై పరిమితి విధించారు. నలుగురు ఫాస్ట్ బౌలర్ల ఆధిపత్యంలోంచి పెరుగుతూ వచ్చిన వెస్టిండీస్ క్రికెట్ ఆనాటినుంచి కోలుకోలేదు. అలాంటి ఘటనలు గత రెండు దశాబ్దాలుగా జరగక పోవడానికి కారణం.. అధికారాన్ని ఎలా ఉపయోగించాలో భారత్ తెలుసుకుని ఉండటమే. ఇప్పుడు మళ్లీ అలాంటి అధికారాన్ని వదులుకుని మంచి బాలురుగా మారిపోవాలని మనల్ని ఆదేశిస్తున్నారు. నన్ను నమ్మడం లేదా.. అయితే ఐసీసీకి చెందిన నిర్వాహక కమిటీ (సీఓఏ) ఇటీవలే బీసీసీఐకి జారీ చేసిన రెండు ఫర్మానాలను ఒకసారి చూడండి.
శేఖర్ గుప్తా
twitter@shekargupta