సప్తవర్ణ శోభితం | 70 years of Indian sports | Sakshi
Sakshi News home page

సప్తవర్ణ శోభితం

Published Wed, Aug 16 2017 12:15 AM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

సప్తవర్ణ శోభితం

సప్తవర్ణ శోభితం

ఒలింపిక్స్‌ వెలుగులు...
క్రికెట్‌ మెరుపులు...
70 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం


ఏడు దశాబ్దాలు... ఒక దేశం సొంతంగా క్రీడల్లో సాధించిన ప్రగతి గురించి చెప్పుకునేందుకు ఈ సమయం సరిపోతుంది. భారత్‌కు సంబంధించి ఇందులో తొలి సగం క్రీడల్లో ఉనికి కోసం చేసిన ప్రయత్నం కాగా... మిగతా సగం క్రికెట్‌ ప్రాభవం, దాని కారణంగా ఆదరణ కోల్పోయిన ఇతర క్రీడలు కనిపిస్తాయి.  

ప్రపంచ కప్‌ విజయాలు, ఒలింపిక్‌ పతకాలు, వ్యక్తిగత అత్యుత్తమ  ప్రదర్శనలు, దేశంలో ఆటకు దిశానిర్దేశం చేసిన క్షణాలు, ఫలితంతో సంబంధం లేకుండా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఘటనలు... స్వాతంత్య్రానంతరం భారత క్రీడా రంగం పురోగతిలో చెప్పుకోదగ్గ     ఘటనలు ఎన్నో. అలాంటి విశేషాల సమాహారం...    – సాక్షి క్రీడావిభాగం

క్రికెట్‌ (1983, 2011 వన్డే ప్రపంచ కప్‌లు, 2007 టి20 ప్రపంచకప్‌)
స్వాతంత్య్రానికి ముందు భారత క్రికెట్‌ జట్టు ఒక్క ఇంగ్లండ్‌తోనే నాలుగు టెస్టు సిరీస్‌లు ఆడి నాలుగూ ఓడింది. 1947 నవంబర్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో భారత్‌ కొత్త ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత పలు గొప్ప విజయాలు, అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చినా... 1983 వరకు కూడా క్రికెట్‌పై అభిమానం దేశంలో కొద్ది మందికే పరిమితం. వన్డే క్రికెట్‌ వచ్చిన తర్వాత 1975, 1979లలో మన ఘోర ప్రదర్శన ఆటపై ఆసక్తిని మరింత తగ్గించింది. అయితే 1983లో కపిల్‌ దేవ్‌ నాయకత్వంలోని భారత జట్టు వన్డేల్లో విశ్వవిజేతగా నిలవడంతో ఒక్కసారి అంతా మారిపోయింది. ఈ గెలుపు తర్వాత దేశ ప్రజల జీవితాల్లో క్రికెట్‌ ఒక భాగంగా మారిపోయింది. ఇంటింటా అభిమానులు, ప్రత్యక్ష ప్రసారాలు, భారీ ఎత్తున ఆదాయం, క్రికెటర్లను దేవుడిలా కొలవడం... ఇలా అన్నింటికీ ఈ విజయమే నాంది పలికింది. 28 ఏళ్ల తర్వాత 2011లో భారత్‌ మరోసారి ప్రపంచ కప్‌ గెలవడం అభిమానులను ఆనంద పర్చింది. అంతకుముందే 2007లో భారత్‌ మరో క్రికెట్‌ విప్లవానికి కారణమైంది. ఆ ఏడాది తొలి టి20 ప్రపంచ్‌కప్‌ను భారత్‌ గెలుచుకోవడం కూడా క్రికెట్‌లో కొత్త శకానికి తెర తీసింది. టి20 ఫార్మాట్‌ ఉజ్వలమైన భవిష్యత్తుకు, ఆటగాళ్ల కోసం బంగారు బాతులా పరిణమించేందుకు ఈ వరల్డ్‌ కప్‌ మేలి మలుపుగా చెప్పవచ్చు.  

హాకీ  (5 స్వర్ణాలు, 1975 ప్రపంచకప్‌)  
స్వాతంత్య్రానికి ముందు 3 ఒలింపిక్స్‌లలో స్వర్ణాలతో సత్తా చాటిన భారత జట్టు 1947 తర్వాత మరో 5 బంగారు పతకాలతో వెలు గులు విరజిమ్మింది. 1948 లండన్‌ ఒలింపిక్స్‌ నుంచి 1980 మాస్కో ఒలింపిక్స్‌ వరకు ఈ ప్రస్థానం కొనసాగింది. వీటికి తోడు 1975లో జరిగిన ప్రపంచకప్‌ను కూడా గెలుచుకొని హాకీలో తమ ఆధిక్యాన్ని భారత్‌ బలంగా ప్రదర్శించింది. కానీ 1983 తర్వాత క్రికెట్‌ పురోగతికి తోడు స్వీయ వైఫల్యాలతో భారత హాకీ ప్రాభవం తగ్గిపోయింది. ఆ తర్వాత 9 ఒలింపిక్స్‌ క్రీడలు జరిగితే ఐదో స్థానమే అత్యుత్తమ ప్రదర్శన. ఒకసారి అయితే కనీసం అర్హత కూడా సాధించలేకపోయింది. ఇక గత దశాబ్ద కాలంలో పడుతూ లేస్తూ మన హాకీ ప్రయాణం సాగుతోంది. ఆహా అనిపించే ఒక్క విజయం లభించే లోపే, అయ్యో అనిపించే మరో నాలుగు పరాజయాలతో  తీవ్రంగా నిరాశపర్చడం జట్టుకు అలవాటైంది.

టెన్నిస్‌ (ఒలింపిక్‌ పతకం, గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ విజయాలు)
ఒలింపిక్స్‌లో లియాండర్‌ పేస్‌ సాధించిన కాంస్య పతకమే నిస్సందేహంగా భారత టెన్నిస్‌లో అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పవచ్చు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో అతను ఈ ఘనత సాధించి అందరినీ అబ్బుర పరిచాడు. ఇక సింగిల్స్‌లో ఓపెన్‌ శకానికి ముందు 1961 సమయంలో రామనాథన్‌ కృష్ణన్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరుకోవడం గొప్ప ఘనత. ఈ తరంలో భారత టెన్నిస్‌కు గుర్తింపు తెచ్చిన త్రయంగా పేస్, మహేశ్‌ భూపతి, సానియా మీర్జాలను చెప్పవచ్చు. ఈ ముగ్గురూ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్నవారే. ఈ ముగ్గురి ఖాతాలో కలిపి మొత్తం 36 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ ఉన్నాయి.

ఆనందుడి విజయం...
చదరంగ క్రీడలో ఒక భారతీయుడు సాధించిన అద్భుతం ఇది. తన చతురంగ బలాలను సమర్థంగా నడిపిస్తూ చెస్‌ ప్రపంచానికి రారాజుగా నిలిచిన ఘనత మన విశ్వనాథన్‌ ఆనంద్‌కు దక్కింది. 2000లో తొలిసారి ఆనంద్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలిచి ఈ క్రీడలో భారత కీర్తిని శిఖరాన నిలిపాడు. ఆ తర్వాత కూడా మరో నాలుగు సార్లు ఆనంద్‌ విశ్వ విజేత కావడం విశేషం.  

పసిడి గురి (2008 ఒలింపిక్స్‌)
భారత షూటర్‌ అభినవ్‌ బింద్రా ఒలింపిక్‌ క్రీడల్లో సాధించిన స్వర్ణం మన ఆటల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో బింద్రా 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో పసిడి పతకం గెలుచుకున్నాడు. మన ఒలింపిక్‌ చరిత్రలో వ్యక్తిగత విభాగంలో ఇదే ఏకైక స్వర్ణం.

బ్యాడ్మింటన్‌  (2 ఆల్‌ ఇంగ్లండ్‌ టైటిల్స్, 2 ఒలింపిక్‌ పతకాలు)
భారత బ్యాడ్మింటన్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన క్షణం 1980 ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌. 9 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన ప్రకాశ్‌ పడుకోన్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ టైటిల్‌ గెలుచుకొని ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌తో సమాన విలువ గల ఈ టైటిల్‌ను ఆ తర్వాత 2001లో తెలుగు తేజం పుల్లెల గోపీచంద్‌ కూడా సొంతం చేసుకొని మన కీర్తిని పెంచాడు. దీని తర్వాత మరో రెండు ఘటనలు భారత్‌లో బ్యాడ్మింటన్‌ మేనియాను పెంచాయి. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్‌ కాంస్య పతకం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది. నాలుగేళ్ల తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో పూసర్ల వెంకట (పీవీ) సింధు దీనికంటే మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దేశంలో క్రికెట్‌ తర్వాత రెండో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా బ్యాడ్మింటన్‌ మారిందంటే ఈ ఘనతలే కారణం.  

అథ్లెటిక్స్‌  (మిల్కా సింగ్, పీటీ ఉష ప్రదర్శనలు)
భారత్‌లో పరుగుకు గుర్తింపు తెచ్చిన మొదటి వ్యక్తి మిల్కా సింగ్‌. స్వాతంత్య్రానంతరం 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో అతని ప్రదర్శన ఎప్పటికీ భారత క్రీడల్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ పోటీల 400 మీటర్ల పరుగులో అతను నాలుగో స్థానంలో నిలిచాడు. కేవలం 0.1 సెకను వ్యవధిలో కాంస్యం కోల్పోయాడు. కానీ నాటి పరిస్థితులు, సౌకర్యాలను బట్టి చూస్తే దీనిని చాలా పెద్ద ఘనతగా చెప్పవచ్చు. అథ్లెటిక్స్‌లో కూడా మన విజయాల గురించి మాట్లాడటం, అథ్లెట్లకు గుర్తింపు లభించడం పీటీ ఉషతోనే సాధ్యమైంది. ఈ ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌’ 1984 లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో సెకనులో వందో వంతు తేడాలో 400 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. అయితే 1986 సియోల్‌ ఆసియా క్రీడల్లో ఏకంగా 4 స్వర్ణాలు సాధించి భారత్‌ ఘనతను చాటింది. అప్పటి నుంచి పరుగెత్తే ప్రతీ పాపను పీటీ ఉషతో పోల్చడం మన దేశంలో అలవాటుగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.  

ఫుట్‌బాల్‌  (ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం)
ప్రపంచ ఫుట్‌బాల్‌లో భారత్‌ పరిస్థితి ఇప్పుడు చూస్తే అంతా అగమ్య గోచరం. ర్యాంకు 100కు చేరువలో... ఆట చూస్తే అంతకన్నా ఘోరమే. కానీ 1950 నుంచి 1962 వరకు పుష్కర కాలం పాటు మన ఫుట్‌బాల్‌ కూడా వెలిగింది. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు తయారయ్యారు. 1951, 1962 ఆసియా క్రీడల్లో విజేతగా నిలిచిన మన జట్టు 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో కూడా నిలవడం విశేషం. అయితే 80వ దశకం నుంచి తిరోగమన బాట పట్టిన ఈ ఆట క్రికెట్‌ వెల్లువలో దాదాపు కొట్టుకుపోయింది. లీగ్‌ల ద్వారా ప్రస్తుతం నిలబెట్టే ప్రయత్నం కొంత చేస్తున్నా అది కంటితుడుపుగానే సాగుతోంది.  

కబడ్డీలో అజేయం...
గ్రామీణ క్రీడ కబడ్డీలోనూ భారత్‌దే ఆధిపత్యం. 1990 బీజింగ్‌ ఆసియా క్రీడల్లో తొలిసారి కబడ్డీని మెడల్‌ ఈవెంట్‌గా ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి భారత్‌ వరుసగా ఏడు ఆసియా క్రీడల్లో అజేయంగా నిలిచి ఏడు స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. మూడుసార్లు నిర్వహించిన ప్రపంచకప్‌ పోటీల్లోనూ భారత్‌ చాంపియన్‌గా నిలిచింది. దక్షిణాసియా క్రీడల్లో మూడుసార్లూ టీమిండియాకు ఎదురేలేదు.   

అంజూ అద్భుతం...
ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌కు ఒకే ఒక్క పతకం దక్కింది. దిగ్గజాలు పాల్గొనే ఈ పోటీల్లో సాధించిన గెలుపు మన అథ్లెటిక్స్‌ చరిత్రలోనే అరుదైన ఘట్టం. 2003 పారిస్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో అంజూ బాబీ జార్జ్‌ లాంగ్‌జంప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత మరే భారత అథ్లెట్‌కు పతకం దక్కలేదు.  

కొన్నింట్లో ఇంకా వెనుకబాటే...
స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా కొన్ని రకాల క్రీడల్లోనే భారత జట్టు పరిస్థితి మెరుగ్గా ఉంది. వాటిలోనే మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నా... ఇంకా మన ముద్ర చూపించని క్రీడలు కూడా చాలా ఉన్నాయి. ఆర్చరీ, బాస్కెట్‌బాల్, జిమ్నాస్టిక్స్, స్క్వాష్,  స్విమ్మింగ్, టేబుల్‌ టెన్నిస్, వాలీబాల్‌లలో మన ఆట అంతంత మాత్రమే. మున్ముందు అయినా వీటిలో కూడా మన వైభవం పెరుగుతుందని ఆశిద్దాం.  

జాదవ్‌ నుంచి సాక్షి వరకు...
భారత్‌కు స్వాతంత్య్రం లభించేనాటికి మన దేశం తరఫున ఒక్కరు కూడా వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయారు. అయితే ఐదేళ్ల తర్వాత 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో ఆ కల ఫలించింది. ఖాషాబా జాదవ్‌ కుస్తీ పోటీల్లో కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. మెక్సికో, కెనడా, జర్మనీలకు చెందిన స్టార్‌ రెజ్లర్లను ఓడించి అతను సాధించిన ఈ విజయం అసమానం. ఆ తర్వాత కరణం మల్లీశ్వరి (2000 సిడ్నీ ఒలింపిక్స్‌; వెయిట్‌లిఫ్టింగ్‌–కాంస్యం), రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ (2004 ఏథెన్స్‌; షూటింగ్‌–రజతం), విజేందర్‌ సింగ్‌ (2008 బీజింగ్‌; బాక్సింగ్‌–కాంస్యం), సుశీల్‌ కుమార్‌ (2008 బీజింగ్‌; రెజ్లింగ్‌–కాంస్యం) కూడా ఒలింపిక్స్‌లో  తమ సత్తాను ప్రదర్శించారు. 

2012 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఏకంగా ఆరు పతకాలు సాధించి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. రెజ్లర్‌ సుశీల్‌ కుమార్, షూటర్‌ విజయ్‌ కుమార్‌లు రజత పతకాలు గెలుపొందగా...యోగేశ్వర్‌ దత్‌ (రెజ్లింగ్‌), మేరీ కోమ్‌ (బాక్సింగ్‌), గగన్‌ నారంగ్‌ (షూటింగ్‌), సైనా నెహ్వాల్‌ (బ్యాడ్మింటన్‌) కాంస్య పతకాలు సాధించారు. భారత ఒలింపిక్‌ చరిత్రలో వ్యక్తిగత క్రీడాంశంలో రెండు పతకాలు (రజతం, కాంస్యం) సాధించిన ఏకైక క్రీడాకారుడిగా సుశీల్‌ కుమార్‌ నిలిచాడు. 2016 రియో ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో సాక్షి మలిక్‌ కాంస్యంతో, షట్లర్‌ పీవీ సింధు రజతంతో తమ విలువను చూపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement