క్రికెట్‌లో ‘బలిదాన్‌’ ఎందుకు? | Why Balidan Symbol In Cricket Asking Shekhar Gupta | Sakshi
Sakshi News home page

క్రికెట్‌లో ‘బలిదాన్‌’ ఎందుకు?

Published Sat, Jun 8 2019 3:48 AM | Last Updated on Sat, Jun 8 2019 3:48 AM

Why Balidan Symbol In Cricket Asking Shekhar Gupta - Sakshi

టీమిండియా వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోనీకి సైన్యంలో పనిచేయడం ఎంత ఇష్టమో తెలీనిది కాదు. కానీ తాను ఆడుతున్న మైదానంలో పిచ్‌ మీదికి తన రెజిమెంట్‌ చిహ్నాన్ని తీసుకుపోకుండా ఉండాల్సింది. క్రీడాకారులు ఎవరైనా సరే తమ దేశ సైనిక బలగాలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా కాకుండా ఆటలో గెలవడం ద్వారా మాత్రమే తమ తమ దేశాలకు వైభవాన్ని తెచ్చిపెట్టాలి. స్పర్థ మాత్రమే ఉండే ఒక క్రీడా మైదానంలో చంపటానికీ, చావడానికీ సిద్ధపడటాన్ని ప్రతీకగా చూపించే లోగోలకు తావు లేదు. అందుకే జనాభిప్రాయం అనే సముద్రానికి వ్యతిరేకంగా మనలోనూ కొందరం తప్పకుండా ఎదురు నిలబడాలి. ప్రత్యేకించి క్రికెట్‌ను ఎంతగానో ప్రేమిస్తూ, భారత జట్టు గెలవాలని కోరుకుంటున్న మనలాంటి వాళ్లం మన వ్యతిరేకతను ప్రకటించాలి. ఎవరైనా మన క్రీడాపరమైన జాతీయవాదాన్ని ప్రశ్నించినా సరే మనం వెనుకంజ వేయకూడదు.

రాజకీయాలు ప్రజలను విభజిస్తుంటే క్రీడలు ఐక్యపరుస్తాయన్న పాత నానుడిని మనం ప్రశ్నించలేం. అందులోనూ గతంలో రెండుసార్లు ప్రపంచకప్‌ గెల్చుకున్న భారతదేశం ప్రస్తుత ప్రపంచకప్‌ సీజన్‌కి ఇది మరింతగా వర్తిస్తుంది. క్రీడలు ఐక్యపరుస్తాయి కానీ స్వపక్షపాతంతో మాత్రమే అవి ఐక్యపరుస్తుంటాయి. భారతీయులుగా మనం మన దేశ జట్టుతో ఐక్యమవుతాం. అలాగే ఇతర దేశాల జట్లు కూడా. అందుకనే, మహేంద్రసింగ్‌ ధోనీ అత్యున్నత త్యాగానికి చిహ్నమైన బలిదాన్‌ డేగర్‌ సంకేతాన్ని తన వికెట్‌ కీపింగ్‌ గ్లోవ్స్‌లో ధరించిన ఘటన వివాదాస్పదమైంది. ఇది భారతీయ పారామిలిటరీ బలగాలకు సంబంధించిన చిహ్నం. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ధోనీ చర్యను వ్యతిరేకించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెటర్లు తమ శరీరాలపై, దుస్తులపై మత సంకేతాలను, జాతీయ లేక వాణిజ్య చిహ్నాలను లేదా లోగోలను ధరించడంపై పరిమితులున్నాయి. ఉదా‘‘కు ఐసీసీ, ఆయాదేశాల క్రికెట్‌ పాలనా సంస్థల ఆమోదం ప్రకారమే, క్రికెట్‌ క్రీడను స్పాన్సర్‌ చేస్తున్న సంస్థలకు చెందిన లోగోలను క్రీడాకారులు ధరించవచ్చు. అనుమతించిన జాతీయ చిహ్నాలను వారు ధరించవచ్చు. ఇవి కాకుండా ఏ ఇతర సాంప్రదాయిక చిహ్నాలను వీరు ధరించరాదు. సైన్యానికి సంబంధించిన చిహ్నాలను అసలు ధరించరాదు. ఎందుకంటే అది క్రీడామైదానమే తప్ప సైనిక దాడి కాదు. 

ధోనీని సైనిక లోగో కలిగిన గ్లోవ్స్‌ని ధరించేందుకు అనుమతించాలంటూ బీసీసీఐ.. ఐసీసీని అభ్యర్థించింది. ధోనీ గ్లోవ్స్‌ పట్ల భారీ స్థాయిలో ప్రజానుకూలత ఉంది. ప్రపంచకప్‌లో టీమిండియా, ధోనీ ధీరత్వంతో కూడిన ప్రదర్శనలకు మల్లే మన ప్రత్యేక సైనిక బలగాలు ఉడీ ఉగ్రవాద ఘటన అనంతరం మెరుపుదాడులు చేసి ఎంతోకాలం కాలేదు. మన సైనికబలగాలు పాక్‌ భూభాగంపై నిర్వహించిన ఈ మెరుపుదాడులకు విక్కీ కౌశల్‌ నిర్మించిన చిత్రం శాశ్వత స్థాయిని కల్పించింది. ఈ నేపథ్యంలో నిరోధించ వీలులేని మన జాతీయ వాదపు ఆకర్షక శక్తికి చెందిన రెండో వైపున నిలబడి ఏ భారతీయుడు వాదించబోతాడు? అయితే ఎవరో ఒకరు దీనికి వ్యతిరేకంగా నిలబడాలి. ఐసీసీ ఇక్కడే సరిగా వ్యవహరించింది. ధోనీ తన గ్లోవ్స్‌పై ధరించిన సైనిక లోగోనూ తీసివేయాలని ఐసీసీ తేల్చిచెప్పింది. స్పర్థ మాత్రమే ఉండే ఒక క్రీడా మైదానంలో చంపటానికీ, చావడానికీ సిద్ధపడటాన్ని ప్రతీకగా చూపించే లోగోలకు తావు లేదు. అందుకే జనాభిప్రాయం అనే సముద్రానికి వ్యతి రేకంగా మనలోనూ కొందరం తప్పకుండా ఎదురు నిలబ డాలి. ప్రత్యేకించి క్రికెట్‌ను ఎంతగానో ప్రేమిస్తూ, భారత జట్టు గెలవాలని కోరుకుంటున్న మనలాంటి వాళ్లం మన వ్యతిరేకతను ప్రకటించాలి. దీంతో ఎవరైనా మన క్రీడాపరమైన జాతీయవాదాన్ని ప్రశ్నించినా సరే మనం వెనుకంజ వేయకూడదు. దీనికోసం జీసస్‌ క్రైస్ట్‌ నుంచి పదాలు అరువు తెచ్చుకుందాం: తండ్రీ వీరిని క్షమించు. ఎందుకంటే వీరికి (దేశభక్తి లేదని మనల్ని నిందిస్తున్నవారు) తామేం చేస్తున్నదీ నిజంగానే తెలీదు. 

మొదటగా మన ‘జాతీయవాదుల’ వాదనలను, మన కమాండో– కామిక్‌ టీవీ చానల్స్‌లోని  వారి డబ్బారాయుళ్ల వాదనలను పరిశీలిద్దాం. వీళ్లు ఇప్పటికే ‘ధోనీ.. ఆ గ్లోవ్స్‌ను వాడటం కొనసాగించు’ అంటూ హ్యాష్‌ టాగ్స్‌ పెట్టి మరీ కామెంట్లు సంధిస్తున్నారు. వీరి వాదన ఏమిటంటే ముందుగా మన సాయుధ బలగాలను మనం తప్పక గౌరవిం చాలి. రెండు, పాకిస్తాన్‌ వల్ల భారత్‌ ఇప్పటికే రక్తమోడుతోంది కాబట్టి పాక్‌కు వ్యతిరేకంగా వీలైన ప్రతిచోటా ఇలాంటి ప్రకటనలు చేయాల్సిందే. మూడు, ఒక వ్యక్తి ఎంపికను మీరు తోసిపుచ్చలేరు. ప్రత్యేకించి ధోనీ భారత ప్రత్యేక బలగాల్లో గౌరవనీయ లెఫ్టినెంట్‌ కర్నల్‌. పైగా సైన్యంలో చేరేందుకు అర్హతా పరీక్షగా పారాచూట్‌ నుంచి దుమికి మరీ తన సైనిక చిహ్నాలను (డేగర్, వింగ్స్‌) సాధించుకున్నాడు. కాబట్టి తాను పనిచేసే రెజిమెంట్‌ లోగోను తను వాడటాన్ని మీరు తృణీకరించలేరు. ఈ మూడో ప్రశ్నకు మాత్రం సులభంగానే జవాబివ్వవచ్చు. ధోనీ రెజి మెంట్‌ భారత్‌ కోసం క్రికెట్‌ ఆడటం లేదు. పైగా రెజిమెంట్‌ దుష్టులతో పోరాడుతున్నప్పుడు బీసీసీఐ చిహ్నాన్ని, హాకీ లేక ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ చిహ్నాన్ని సైనిక  బలగాలు ధరించదు. కాబట్టి సాయుధబలగాలు వారి త్యాగాలను మనం తప్పక గౌరవించాలనడం ఆమోదిం చాల్సిందే. కానీ, కశ్మీర్‌లో పాకిస్తానీయులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా మన క్రికెటర్లు ఇంగ్లండ్‌లోని లార్డ్స్, ఓల్డ్‌ ట్రఫోర్డ్, ఓవల్‌ తదితర మైదానాల్లో ఇలాంటి నిరసన ప్రదర్శనలు చేయాలనటం అర్థరహితమైన విషయం. నిరసన ప్రదర్శనలు చేసేది రాజకీయనేతలు, దౌత్యవేత్తలు కాగా సైనికులు యుద్ధాలు చేస్తారు. ఆటల్లో గెలవడం ద్వారా క్రీడాకారులు తమ దేశాలకు పేరు తీసుకొస్తారు. అంతే తప్ప క్రీడా దుస్తులు ధరించిన సమయంలో తమ సైనిక బలగాలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారడం ద్వారా కాదు. 

ఎందుకంటే ఇలాంటి తరహా ఆటను ఇరుపక్షాలూ ఆడగలవు. భారతీయులు తమ సైనిక దుస్తులు, లోగోలను ధరించగలిగినప్పుడు, పాకిస్తానీయులు కూడా అదే పని చేయగలరు. ఇలాంటి స్ఫూర్తి తక్షణం సాధారణ ప్రజల్లోకూడా చొరబడగలదు. భారత్, పాక్‌ దేశాల్లో ప్రధానంగా జరిగేది ఇదేమరి. దీనివల్ల ఆటల్లో శతృత్వం పెరుగుతుంది. చివరకు ఇది ఇరాక్, ఇరాన్‌ దేశాల మధ్య గతంలో జరిగిన భీకర యుద్ధంగా మారిపోతుంది. జార్జ్‌ ఆర్వెల్‌ తన 1945 నాటి ‘ది స్పోర్టింగ్‌ స్పిరిట్‌’ అనే వ్యాసంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడలు నిజాయితీగానే యుద్ధతంత్రాన్ని అనుకరిస్తుంటాయని రాశాడు. వీటిలో ముఖ్యంగా చెప్పాల్సింది క్రీడాకారుల ప్రవర్తన గురించి కాదని, ప్రేక్షకుల వైఖరినే అని తేల్చిచెప్పాడు. మన క్రీడాకారులూ, క్రీడాకారిణులు పాకిస్తాన్‌తో తలపడుతూ గతంలో కంటే ఎక్కువగా విజయాలు సాధిస్తున్నారు. ఆటలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూనే ఎవరినీ బందీలుగా పట్టుకోవద్దనే పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూన్నారు. ఇరుదేశాల జట్లూ స్నేహపూర్వకరీతిలో, క్రీడాస్ఫూర్తితో ఆడుతున్నారు. తమ ప్రత్యర్థుల కుటుంబాలు, పిల్లలతో కూడా సరదాగా గడుపుతున్నారు. ఈ తరుణంలో, అదృష్టవశాత్తూ మూడునెలల క్రితం బాలాకోట్‌లో మన సైన్యం వాస్తవానికి యుద్ధం చేయలేదు. ఎవరికీ ప్రాణనష్టం జరగని చిన్నస్థాయి దాడి మాత్రమే చేశారు. 1971లో ఇరుదేశాలు పూర్తి స్థాయి యుద్ధంలో మునిగి ఉన్న తరుణంలో కూడా సునీల్‌ గవాస్కర్, జహీర్‌ అబ్బాస్‌ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నప్పుడు రెస్ట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ జట్టులో సభ్యులుగా కలిసి ఆడారు. మన వాయుసేన కరాచీపై బాంబుదాడులు జరుపుతున్న సమయంలోనే వారు ఈ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించారు. 1999లో కూడా కార్గిల్‌లో తీవ్రస్థాయి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరుదేశాల జట్లూ ఇంగ్లండ్‌లో సాగుతున్న ప్రపంచ కప్‌లో భాగం పంచుకున్నాయి. చేతులు కలిపారు. ప్రత్యర్థి జట్టులో ఎవరి షూ లేస్‌ అయినా ఊడిపోతే తాము వెళ్లి వాటిని సరిచేసేటంత గొప్ప ఔదార్యం ప్రదర్శించారు. 

మిలటరీ చిహ్నాలు, దుస్తులు, మెడల్స్, బ్యాడ్జిలు, బ్యాండ్‌లూ, కవాతులూ, ఫోజు వంటివన్నీ సాహసప్రవృత్తికి సంకేతాలు. ఆటగాళ్లు కూడా యుద్ధంలో విజయం, పరాజయం లాగే ఆటలో గెలుపు, ఓటమి అనే బ్యాగేజీని మోసుకెళుతూ ఉంటారు. జూన్‌ 16న భారత్‌–పాక్‌ జట్ల మధ్య జరిగే లీగ్‌ మ్యాచ్‌లో ఒక జట్టు గెలవడం మరొకటి ఓడిపోవడం తప్పదు. ఈ ఓటమిని మన సైన్యం యుద్ధాన్ని కోల్పోయింది అనే స్థాయిలో చూడాలా? ఓల్డ్‌ ట్రఫోర్డ్‌లో ఇరుపక్షాలూ తమ సైన్యాలను (ప్రేక్షకులు) తీసుకొస్తే ఏం జరుగుతుంది? బ్రిటిష్‌ ప్రభుత్వం పోలీసులను పురమాయించాల్సి వస్తుంది. ‘ఆటలు దేశాల మధ్య సద్భావనను సృష్టిస్తాయని, ఫుట్‌బాల్‌లో కానీ, క్రికెట్‌లో కానీ ప్రపంచంలోని సాధారణ ప్రజానీకం మాత్రమే హాజరైనట్లయితే, వారు యుద్ధరంగంలో తలపడాల్సిన అవసరం ఉండద’ని జార్జ్‌ ఆర్వెల్‌ చెప్పాడు. 1936 బెర్లిన్‌ ఒలింపిక్స్‌ను ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించాడు. మానవ నాగరి కత ప్రపంచయుద్ధాలు, ప్రచ్ఛన్నయుద్ధాల నుంచి చాలా ముందుకెళ్లింది. తరచుగా నెలకొనే క్రీడా సంబంధాలు పాత శత్రుత్వాలకు విరుగుడుగా పనిచేస్తాయి. ఇవి ఆటగాళ్లను, వారి అభిమానులను, వారి కుటుంబాలను, స్నేహితులను పరస్పరం నేర్చుకునేలా చేస్తాయి. ప్రజల మధ్య సంబంధాలను పెంచుతాయి.

ఒక్కొక్కసారి ఆట మధ్యలో ఏర్పడే నిస్పృహనుంచి బయటపడేలా పరస్పరం సహకారాన్ని పంచిపెడతాయి కూడా. ఒలింపిక్స్‌ నుంచి పింగ్‌ పాంగ్‌ వరకు, బాస్కెట్‌ బాల్‌ నుంచి క్రికెట్‌ వరకు, సాకర్‌ నుంచి హాకీ వరకు నిర్దాక్షిణ్యంగా సాగే క్రీడా స్పర్థ... సైనికీకరణకు గురైన శత్రుత్వాలను తగ్గించడంలో, మన మనస్సులకు తగిలిన గాయాలను మాన్పడంలో కూడా సహకరిస్తోంది. మన సైన్యం పట్ల వ్యక్తిగతంగా ప్రదర్శించే అంకితభావాన్ని మనం తప్పకుండా అభినందించాలి. పైగా సైన్యంలో గౌరవ హోదాలో పనిచేసే వ్యక్తి తన బ్యాడ్జిని ప్రదర్శించుకుంటే దాన్ని మనం గౌరవించాలి. ధోని ఇందుకు ఉదాహరణ. పద్మ అవార్డును స్వీకరించడానికి ధోనీ ప్రత్యేక బలగాలకు చెందిన పూర్తి లాంఛనాలు ధరించి వెళ్లాడు. ఇది నిజంగానే మంచి సంకేతం కూడా. ఎందుకంటే రాష్ట్రపతి సాయుధ బలగాల సర్వ సైన్యాధ్యక్షుడు మరి. అలాగని ధోనీ తన రెజిమెంట్‌ మొత్తాన్ని తీసుకుని మైదానంలోకి వెళ్లలేదు. పైగా వికెట్ల వెనుక ధోనీ ఏనాడూ శత్రువును సంహరించే సహజాతంతో ప్రవర్తించలేదు. క్రీజు దాటి ముందుకెళ్లిన బ్యాట్స్‌మన్‌ను స్టంపౌట్‌ చేసిన ప్రతిసారీ తన గ్లోవ్స్‌లో ధరించిన డేగర్‌ స్ఫూర్తిని పొందుతూనే ఉంటాడు. అంతే తప్ప ప్రపంచంలోకెల్లా అత్యంత భయంకరమైన స్టంపర్‌గా ధోనీ ఏరోజూ కనిపించలేదు.


శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement