jathihitam
-
అ‘ప్రజ్ఞా’వాచాలత్వం!
గత అయిదేళ్లకాలంలో ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలకు ప్రత్యర్థులు కూడా చేయలేకపోయిన భంగపాటును సొంత పార్టీకి చెందిన సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ దిగ్విజయంగా కలిగించారు. గాంధీ హంతకుడు దేశభక్తిపరుడు అంటూ ఆమె చేసిన పదప్రయోగం మోదీ, అమిత్ షాలను వారి ప్రజాజీవితం మొత్తంలో ఏ రకంగానూ సమర్థించుకోలేని స్థితిలోకి నెట్టివేసింది. గాంధీ హత్యానంతరం ఆ ఘటన కారకులనుంచి దూరం తొలిగిన బీజేపీ మాతృసంస్థ, సైద్ధాంతిక శక్తి అయిన ఆరెస్సెస్ సైతం గత ఏడు దశాబ్దాల్లో గాంధీని విమర్శించే సాహసం చేయలేదు. బీజేపీకి ఓట్లు రాబట్టే సమర్థత విషయంలో, లేక పార్టీ నైతిక ధృతిని పెంచడంలో మంచి పాత్ర పోషిస్తుందని భావించిన సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ దానికి భిన్నంగా తన ప్రధానమంత్రి, పార్టీ అధినేత దూకుడును ఘోరంగా దెబ్బతీశారు. సాధ్వీ ప్రజ్ఞా సింగ్ సాధించిన ఒక విజ యాన్ని మాత్రం మనం గుర్తించాల్సి ఉంది. నరేంద్రమోదీ, అమిత్ షాల విషయంలో ఎవరూ చేయలేని పని ఆమె చేసిపడేశారు. అదేమిటంటే ఒక్కసారిగా వాళ్లను ఆత్మరక్షణలో పడేశారు. అంతేకాకుండా తన పార్టీ అగ్రనాయకత్వం నిజంగా ద్వేషించే మరో పనిని కూడా చేయడంలో ఆమె విజయం పొందారు. పతాక శీర్షికలను నిర్ణయించే వారి శక్తిని కోల్పోయేలా చేశారామె. గత అయిదేళ్లుగా పత్రికల్లో పతాక శీర్షికలను మార్చడంలో, తమకు అనుకూలంగా నియంత్రించడంలో తమ వ్యూహాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న బీజేపీ, తాము కోరుకోని రీతిలో ఎన్నికల ప్రచారాన్ని ముగించాల్సి వచ్చింది. నరేంద్రమోదీ, అమిత్ షాలు తమ ప్రజా జీవితంలో మొట్టమొదటిసారిగా ఏరకంగానూ సమర్థించుకోలేని వ్యవహారంలో చిక్కుకున్నారు. గాంధీ, నాథూరాం గాడ్సేల వ్యవహారంపై తాజాగా సాధ్వీ ప్రజ్ఞా సింగ్ లేవనెత్తిన చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే, బీజేపీ ఐటీ సెల్ విభాగాధిపతి అమిత్ మాలవీయతో పాటు బీజేపీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాపీ అనుయాయులు వెనువెంటనే ఆమెకు సమర్ధనగా ముందుకురికారు. కానీ వారి ప్రయత్నాలన్నీ వమ్మయిపోయాయి. గత అయిదేళ్లుగా వ్యక్తులపై లేక సామాజికవర్గంపై బీజేపీకి చెందిన వ్యక్తి ఎలాంటి అసందర్భోచితమైన దాడికి తలపెట్టినా సరే వారిని కాపాడటానికి లేక వారిపై ఆరోపణలను తోసిపుచ్చడానికి ఆ పార్టీ శరవేగంగా పావులు కదపడాన్ని మనందరం చూస్తూ వచ్చాం. కానీ మహాత్మా గాంధీ విషయంలో మాత్రం బీజేపీ ఇలాంటి సాహసాలకు పూనుకోలేదు. పార్టీకి చెందిన కొందరు గాంధీ తప్పులు, దేశ విభజన సమయంలో ఆయన పాత్ర వంటి అంశాలపై తమ తమ డ్రాయింగ్ రూమ్‌లలో, గోష్టులలో లేక శాఖా సమావేశాల్లో మాత్రమే వ్యాఖ్యానించి ఉండవచ్చు కానీ బహిరంగంగా మాత్రం వారెవ్వరూ గాంధీపై వేలెత్తి చూపిన పాపాన పోలేదు. గాంధీ హత్యానంతరం ఆ ఘటన కారకులనుంచి దూరం తొలిగిన బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ సైతం గత ఏడు దశాబ్దాల్లో గాంధీని విమర్శించే సాహసం చేయలేదు. కానీ, కాషాయాంబరధారి అయిన అభ్యర్థి, ఉగ్రవాద కేసులో ముద్దాయిగా ఉన్న హిందూత్వ మూర్తి ఇప్పుడు గాంధీ హంతకుడిని దేశభక్తుడిగా పిలుస్తోంది. జాతిపితగా మీరు ప్రశంసించిన వ్యక్తి వారసత్వాన్ని మీరు బోనులో నిలబెట్టకూడదు. ఆయన 150వ జయంతి సందర్భంగా ఆ పని అసలు చేయకూడదు. కానీ బీజేపీకి ఓట్లు రాబట్టడంలో, లేక పార్టీ నైతిక ధృతిని పెంచడంలో మంచి పాత్ర పోషిస్తుందని భావిం చిన ప్రజ్ఞా ఠాకూర్ దానికి భిన్నంగా తన ప్రధాని, పార్టీ అధినేత దూకుడును ఘోరంగా దెబ్బతీశారు. స్వయానా సాధ్వి ప్రజ్ఞను ఉద్దేశపూర్వకంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చింది వారే కాబట్టి మోదీ–షా ద్వయం ఆమె చేసిన నిర్వాకానికి నిరుత్తరులైపోయారు. కాషాయ ఉగ్రవాదం అనే పదబంధాన్ని సృష్టించి హిందువులకు హాని తలపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రచారానికి వ్యతిరేకంగా తమ పార్టీ తలపెట్టిన సత్యాగ్రహమే సాధ్వీ ప్రజ్ఞ రాజకీయ ప్రవేశమంటూ మోదీతో కలిసి అమిత్ షా తాజాగా నిర్వహించిన పత్రికా సమావేశంలో వివరించారు. ఇక్కడ రెండు అంశాలను గమనించాలి. ఒకటి. సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ నుంచి దూరంగా జరగడం మోదీ–షాల పార్టీకి ఇప్పుడు అసాధ్యం అనడానికి కారణం ఉంది. ఎందుకంటే ఈ ద్వయం దూకుడుతో తీసుకొచ్చిన స్వయం ఎంపిక ఆమె. రెండు, పై రాజకీయ ప్రకటనను వివరించడానికి అమిత్ షా గాంధీ ట్రేడ్ మార్క్ అయిన సత్యాగ్రహ భావనను ఉపయోగించారు. గాంధీ హంతకుడిని దేశభక్తుడిగా ప్రశంసించిన వ్యక్తిని సమర్థించడానికి అదే గాంధీ మానవజాతికి బహుకరించిన విశిష్టమైన అహింసా పోరాటాన్ని మీరు అరువుతెచ్చుకుంటున్నప్పుడు మీరు ఎటువైపు వెళుతున్నారో మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. సరైన కారణాలతో కూడా ఎన్నడూ తప్పు పనులకు పాల్పడవద్దన్నది జీవితంలో కానీ రాజకీయాల్లో కానీ సత్ప్రమాణ సూత్రం. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ను బీజేపీ వివాదాల్లోకి లాగడం గురించి మనకు తెలుసు. హిందూ ఉగ్రవాదంపై తీవ్రాతితీవ్రంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో అగ్రగణ్యుడు దిగ్విజయ్ సింగ్. న్యూఢిల్లీలో బాట్లా హౌస్ వద్ద జరిగిన ఎన్కౌంటర్ గురించి, మోహన్ చంద్ శర్మ అనే పోలీసు అధికారి ధీరోదాత్త త్యాగం గురించి దిగ్విజయ్ వ్యంగ్యంగా ప్రకటనలు చేశారు. అది చాలదన్నట్లుగా 26/11 అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా దాన్ని ఆరెస్సెస్ కుట్రగా కూడా అభివర్ణించారు. బీజేపీ ఉద్దేశం ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణకు గురై అరెస్టైన హిందూ రాడికల్ కార్యకర్తలు దిగ్విజయ్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకోవలసి ఉండింది. కానీ గత నెల చివరలో ప్రజ్ఞ్నా ఠాకూర్ తొలిసారిగా పతాక శీర్షికల్లోకి వచ్చి హేమంత్ కర్కరేని, ఆయన కుటుంబాన్ని తాను శపించిన కారణంగానే అతడు చనిపోయాడని ప్రకటించారు. (హేమంత్ కర్కరే చనిపోయిన ఆరేళ్లకు ప్రత్యేకించి సెప్టెంబర్ 29న మాలెగావ్ బాంబు దాడి వార్షికోత్సవం రోజునే హేమంత్ కర్కరే భార్య కూడా మరణించారని మనం గుర్తించాలి). తర్వాత బాబ్రీమసీదును కూలగొట్టడానికి తాను స్వయంగా ఆ మసీదుపైకి ఎక్కానని సాధ్వీ ప్రజ్ఞా ప్రకటించారు. ఈ రెండు సందర్భాల్లోనూ బీజేపీ సత్వరం స్పందించి నష్టనివారణ చర్యలకు పూనుకొంది. సాధ్విని మౌనవ్రతం పాటించాల్సిందిగా ఆదేశించడమే కాకుండా మోహన్ చంద్ శర్మపై గతంలో అదేరకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది కూడా. కానీ ఇప్పుడు గాడ్సేని ప్రశంసించడానికి సాహసించిన సాధ్వీని కాపాడే అవకాశమే బీజేపీకి లేకుండా పోయింది. 1989 నుంచి, బీజేపీ నిదానంగానే అయినా, నియంత్రిత విధానంలో ముందుకెళ్లే వ్యూహాన్ని అవలంబిస్తూ వచ్చింది. అద్వాణీ తలపెట్టిన అయోధ్య ఉద్యమం ప్రారంభ దినాల నుంచి మొదలుకుని ఆ పార్టీ మరింత దూకుడు చర్యలకు తావిస్తూ పోయింది. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలు, నేతలను అది పక్కనబెడుతూ వచ్చింది కూడా. సాధ్వి రితంబర, ప్రవీణ తొగాడియా, వినయ్ కతియార్ వంటి వారిని గుర్తుంచుకోండి. అదేసమయంలో ఉమా భారతి, సాక్షి మహరాజ్, సాధ్వీ నిరంజన్ జ్యోతి (రంజాదే, హరాంజాదే ఫేమ్), యోగి ఆదిత్యనాథ్ వంటి మిలిటెంట్ స్వభావం కలిగిన వారిని జాతీయ స్రవంతిలోకి తీసుకొచ్చింది. ఇది మూడు దశాబ్దాలుగా పనిచేస్తోంది. కానీ, తెలివిగా సాగింది. మనలో కొందరం దీన్ని ముందే ఊహించాం. దాద్రిలో గోరక్షకులు అక్లాక్‌ను చంపిన వెంటనే నేను నా జాతి హితం కాలమ్‌లో రాసిన ‘మూక సంస్కృతి ప్రధాన స్రవంతి’ వ్యాసాన్ని పరిశీలించవచ్చు. ప్రజ్ఞా కేవలం ఓ తాజా ఉదాహరణ మాత్రమే, చాలా అవమానకరమైన ఉదాహరణ. ఇదేదో పొరపాటున జరిగిందని కూడా అనుకోలేం. ఇది ఉద్దేశపూర్వకంగా, బాగా ఆలోచించి చేసిన పని అని పార్టీ అధ్యక్షుడే స్వయంగా మనకు చెప్పాడు. ఇది పూర్తిగా దురభిప్రాయంతో కూడిన తెలివితక్కువ ప్రకటన. భారత జాతీయత ఎదిగిన తీరుపై తప్పుడు అవగాహన నుంచి అది వెలువడింది. భారత దేశాన్ని ఐకమత్యంగా ఉంచుతున్నది ప్రాథమికంగా హిందూయిజమే (హిందూత్వ) అనే తప్పుడు అవగాహనలో ఇదంతా ఉంది. తర్వాత ఆ హిందూయిజం, హిందూత్వ అనేవి ఒకే మతం, ఒకే ప్రజ, ఒకే భాష, ఒకే జాతి అనే ఆర్ఎస్ఎస్ స్థాయికి కుదించుకుపోయాయి. ఈ ఎన్నికల్లో మోదీ మెజారిటీ సాధించినప్పటికీ నాలుగు దక్షిణాది రాష్ట్రాలు(ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ)లోని 103 స్థానాలకు గాను కనీసం రెండు స్థానాలు గెలుచుకునే పరిస్థితి కూడా లేదని మోదీ గుర్తుంచుకోవాలి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా హిందూయిజాన్ని వ్యాపింపజేసి దాన్ని ఇరుసుగా మార్చుకున్నారు. స్వేచ్ఛాయుత రాష్ట్రాల స్ఫూర్తికి ఇది విరుద్ధం. ఒక మతం నుంచి ఒకే దృక్పథం, ఒకే ఆలోచనా విధానం, ఒకే గ్రంథం నుంచి ఒకే దార్శనికత ఏర్పడే అవకాశం లేదు. అందువల్లే మన దేశం ఐకమత్యంగా ఉండటమే కాదు, ప్రతి దశాబ్దానికీ మరిత బలమైనదిగా, సురక్షితమైనదిగా ఎదుగుతోంది. అదే సమయంలో ఒకే సిద్ధాంతం కలిగిన పాక్ ముక్కలవు తోంది. వైవిధ్యతతో కూడిన సౌఖ్యం భారత్ ఆధునిక ప్రపంచానికి ఇచ్చిన గొప్ప కానుక. ప్రపంచంలో మరెక్కడా వేర్వేరు సంస్కృతులు సంయమనంతో లేవు. విభిన్నతకు భారత్ ఒక బ్రాండ్ అయితే, స్విస్ తత్వవేత్త కార్ల్ జంగ్ అన్నట్టు దాని మూల బిందువు మహాత్మా గాంధీ. నెహ్రూ విధానాలతో పోరాడటం, వాటిపై బురద చల్లడం, దూషిం చటం సులభమే. ఇప్పటికే కొందరు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హంతకులను కూడా హీరోలుగా పిలవడం మొదలెట్టారు. కానీ మహా త్మాగాంధీని ముస్లింలను బుజ్జగించే రాజకీయాల సంస్థాపకుడిగా భావించే అత్యంత హిందూ మత ఛాందసవాదులకు కూడా గాంధీని లక్ష్యంగా చేసుకోవడం అంటే ఆత్మహత్యా సదృశంగానే కనిపించేది. అందుకే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ని ఎన్నటికీ క్షమించబోనని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలో నిజాయితీ ఉండవచ్చు. వచ్చే గురువారం ఎన్నికల కౌంటింగులో ఆమె ఓడిపోవాలని మోదీ ప్రార్థించవచ్చు. లేక గాంధీ పేరుతో గత అయిదేళ్లుగా ప్రమాణం చేస్తూవచ్చిన పార్టీకి ఆ గాంధీ హంతకుడినే హీరోగా ప్రశంసిస్తున్న వ్యక్తిని అదే పార్టీలో కొనసాగించడం కలవరపెట్టవచ్చు కూడా. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మాటు దాడితో రూటు మారేనా?
ప్రధానిగానూ, పార్టీ నేతగానూ మోదీ స్థానానికి తిరుగులేదు. కాకపోతే ఆయన ఇప్పుడు పార్టీని ఏ దిశగా నడుపుతున్నారో అటే సాగుతారా? లేక దిశను మారుస్తారా? అనేదే ప్రశ్న. అటే సాగ డమంటే, అధిష్టానం సంస్కృతిని వ్యవస్థీకృతం చేయడమే. 1969 తదుపరి కాంగ్రెస్ చేసిందదే. నిజానికి నేటి అసమ్మతి, ఆ పరిణామానికి వ్యతిరేక మైన రోగనిరోధక ప్రతిస్పందనా స్వభావం కలిగినది కూడా. అతి కేంద్రీకరణ అనే వాదన ఆర్ఎస్ఎస్ను సైతం మెప్పించగలుగుతుందని అసమ్మతివాదుల ఆశ. ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది వేసవికి బీజేపీలో మునుపెన్నడూ ఎరుగనంతటి అత్యంత ప్రధాన నేతగా ఆవిర్భవించారు. ఆయనకు ఇక తిరుగేలేదని అనిపించింది. పద్దెనిమిది నెలల కాలంలోనే అసమ్మతి, అంతర్గత కలహాలు పతాక శీర్షికలవుతాయని ఎవరూ ఊహించి ఉండరు. మొత్తంగా చూస్తే, బీజేపీ దాని ప్రత్యర్థి పార్టీలలో చాలా వాటి కంటే, తన మిత్రపక్షాలన్నిటికంటే నిస్సందేహంగా ఎక్కువ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కలిగిన, క్రమశిక్షణాయుతమైన పార్టీనే. అయితే ఆరోగ్యకరమైన అభిప్రాయ భేదాల చరిత్రా ఆ పార్టీకి ఉంది. ఉదా హరణకు, వాజ్‌పేయి, అద్వానీల మధ్య విభేదాలూ, 2002 గుజరాత్ అల్లర్ల త దుపరి మోదీపై ఏం చర్య తీసుకోవాలనే విషయంలో తలెత్తిన విభేదాలూ సుప్రసిద్ధమైనవి. అయితే సాధారణంగా అలాంటి సమస్య లన్నీ పార్టీ అంతర్గత చర్చ ద్వారానే పరిష్కారమయ్యేవి. కొన్ని సందర్భాల్లో ఒకరితో మరొకరు విభేదించడమూ, ముఖం మాడ్చు కోవడమూ కొనసాగుతూనే ఉండేది. ఇంకా ఏవైనా సమస్యలు మురిగిపోతూ ఉంటే, వాటిని పరిష్కరించడానికి దూరాన ఉన్న నాగపూర్లోనో, సమీపంలోని జందేవాలన్లోనో ఉండే ఆర్ఎస్ఎస్, అత్యున్నతమైన థర్డ్ ఎంపైర్‌గా ఎప్పుడూ అందుబాటులో ఉండేది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలేవీ బీజేపీ వ్యవహార శైలిలో సాగుతున్నవని అనిపించదు. మూడు దఫాలుగా లోక్‌సభ సభ్యునిగా ఉన్న కీర్తీ ఆజాద్, బాహాటం గానే అరణ్జైట్లీ అధికారాన్ని, ప్రతిష్టను సవాలు చేశారు. ప్రధాని మోదీకి బాగా కావాల్సినవారైన ముగ్గురు నేతల త్రయంలో జైట్లీ ఒకరు, నేటి ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నది ఆ నాయక త్రయమే. జైట్లీ, అరవింద్ కేజ్రీవాల్‌పై వేసిన పరువునష్టం దావా కేసులో బీజేపీ శాశ్వత అసమ్మతివాది రామ్ జెఠ్మలానీ, కేజ్రీవాల్ తరఫున కోర్టుకు హాజరవుతున్నారు. ఆ పార్టీ నేతలు, కీలక మద్దతుదార్లు, తదితరులు సామాజిక మాధ్యమాల ద్వారా వెలువరిస్తున్న అభిప్రాయాలను క్రమం తప్పకుండా మీరు గ మనిస్తూ ఉంటే, ఈ అసమ్మతిలో ఒక క్రమ పద్ధతి కనిపిస్తుంది. జైట్లీపై దాడి మోదీపైకి ఎక్కుపెట్టినదే నాయక త్రయంలోకెల్లా జైట్లీ అత్యంత దుర్బలమైన వారని భావించి, ఆయనను అడ్డుపెట్టుకుని అసమ్మతివాదులు మోదీపై దాడి సాగిస్తున్నారు. అయితే ఎవరూ మోదీకి వ్యతిరేకంగా నోరెత్తే సాహసం చేయలేకపోతున్నారు. ఇక అమిత్ షా గురించైతే, బిహార్ ఎన్నికల తదుపరి గుసగుసలాడుతున్నారు. అంతేగానీ బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. వారు జైట్లీని అన్నీ బాహాటంగా మాట్లాడే వానిగా, బహిర్గతమైపోయినవానిగా చూస్తు న్నారు. కొందరి లెక్కల ప్రకారమైతే, ఆయన మోదీకి ఉపయోగపడేవారు కారు కూడా. అందువల్లనే కీర్తీ అజాద్ నుంచి కేజ్రీవాల్ వరకూ, ఆర్ఎస్ఎస్కు సన్నిహితంగా ఉండే కొందరు స్వతంత్ర తిరుగుబాటుదారులూ, ఆగ్రహంతో ఉన్న వృద్ధ పార్టీ సీనియర్ల బృందమూ ఆయననే లక్ష్యంగా చేసుకున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారనే దాన్ని బట్టి ఆ వర్ణన మారుతుం డవచ్చు. సాధ్యమైనంత వరకు బలహీనమైన బ్యాట్స్మాన్నే లక్ష్యంగా ఎంచుకోవాలనేదే ఎప్పుడూ మీ బౌలింగ్ వ్యూహం కావాలి. రాజును బాధ పెట్టాలంటే ఆయనకెంతో ఇష్టమైన చిలుకను చంపాలంటూ బామ్మ చెప్పే కథల్లాంటిదే ఇదీ అని ఇంకెవరైనా అనొచ్చు. ఎలా చెప్పినా అది చెప్పే విషయం మాత్రం ఒక్కటే. జైట్లీని తప్పించగలిగితే, మోదీ తన బలాబలాల సంతులనాన్ని మార్చక తప్పకపోవచ్చు, లేదా ఆ అధికారాన్ని ఇతరులకు పంచాల్సి రావచ్చు. ఈ పరిస్థితుల్లో అందివచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని గ్రహించిన కేజ్రీవాల్... కీర్తీ, జెఠ్మలానీ వంటి తోడేళ్ల గుంపులో చేరారు. దీనితో పోల్చదగిన పరిణామాన్ని మనం గతంలోనూ చూశాం. మోదీ లేదా షా పైకి మాటుగాచి దాడి చేయడానికి జైట్లీని లక్ష్యంగా చేసుకున్నట్టే... వాజ్‌పేయి హయాంలో బ్రజేష్ మిశ్రాను లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆయన పార్టీకి బయటివారనీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానూ, జాతీయభద్రతా సలహాదారుగానూ ఆయన చేతుల్లో మరీ ఎక్కువగా అధికారం కేంద్రీకృతమై ఉందనీ, అమెరికాకు మరీ ఎక్కువగా అనుకూలురనీ, ఒకే మనిషికి వ్యక్తిగతంగా అంకితమైనవారనీ బ్రజేష్‌ను చిత్రీకరించారు. దీనికి తోడు వాజ్‌పేయి అల్లుడు రంజన్ భట్టాచార్య గురించి గుసగుసలూ సాగాయి. అయితే, బహిరంగంగా మాత్రం ఎవరూ ఏమీ మాట్లాడింది లేదు, ప్రత్యేకించి పార్టీ, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారు మాట్లాడింది లేదు. ఆనాడు సాగిన ఈ ప్రచారం ఎంత తీవ్రమైనదో, ఎంత లోతైనదో ఆ తర్వాత ... నాటి ఆర్ఎస్ఎస్ అధిపతి కేఎస్ సుదర్శన్ నాతో ‘వాక్ ద టాక్’ ఇంటర్వ్యూలో చెప్పారు. పార్టీ అసమ్మతివాదులు నేడు మోదీని కూడా అలాగే పరీక్షిస్తున్నారు. ‘కాంగ్రెసీయం’ చెందుతున్న బీజేపీ ఇప్పుడు దాడి సాగిస్తున్నవారు ఈ సమయాన్నే ఎంచుకోవడానికి కారణమైన నిర్ణయాత్మక అంశాలు మూడు. ఒకటి, వృద్ధి గణాంకాలమాటెలా ఉన్నా, చమురు ధరల తగ్గుదల ఫలితంగా ఒక్క కోశపరమైన లోటు పరిస్థితి మినహా, ఆర్థిక సూచికలేవీ నిజంగా పుంజుకోలేదు. రెండు, బిహార్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ పాలక కూటమిని బలహీనం చేసింది. మరే ముఖ్య రాష్ట్రమూ (అస్సాం చాలా చిన్నది) త్వరలోనైతే ఆ త ప్పులను సరిదిద్దుకునే అవకాశం దానికి ఇవ్వదు. మూడు, జనవరిలో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగాల్సి ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ముగిసే ఆ రె ండో దఫా అవకాశాన్ని షా వాంఛిస్తారనడం నిస్సందేహం. ఆ తర్వాత ఎలాగూ నాయకత్వ కొనసాగింపు కోసం పదవీ కాలాన్ని విస్తరింపజేస్తారని ముందస్తు అంచనా సైతం ఉంది. కాబట్టి అసమ్మతివాదులు, ఆశావహులందరికీ... వారు బహిరంగంగా మాట్లాడేవారైనా, మౌనంగా ఉంటున్నవారైనా... ఇదే చివరి అవకాశం అనిపిస్తోంది. అందుకే రాజకీయాలు ఇంతగా ఊపందుకున్నాయి. పార్టీ అనుయాయు లను, ఓటర్లను దూరం చేసే తలపొగరుతనం నుంచి, పార్టీని ‘‘గుజరా తీయం’’ చేస్తున్నారనేంత వరకు గుసగుసలు చెలరేగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ నుంచి వీటికి సానుభూతి లభిస్తోంది. కానీ, అది పరిస్థితిని మార్చడటానికి సుముఖంగా ఉన్న దాఖలాలేవీ లేవు. కనీసం వాజ్‌పేయి పాలన చివరి దశలో కలిగినపాటి అసంతృప్తి కూడా ఆర్ఎస్ఎస్కు కలిగినట్టు లేదు. గుజరాతీయీకరణ గురించి కంటే కూడా, పార్టీ కాంగ్రెసీకరణం చెందుతోందన్న ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. సాధారణంగా బీజేపీలోని అంతర్గత ప్రజాస్వామ్య సంస్థలు సక్రమంగా పని చేస్తుంటాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. షాకు పట్టంగట్టడానికి ఆమోదం తెలపడానికి సమావేశమైన పార్టీ జాతీయ కార్యవర్గం తిరిగి ఇంతవరకు సమావేశం కాలేదు. కొందరిని మినహాయిస్తే కేబినెట్ మంత్రులంతా తమకు అధికారం లేకపోవడం పట్ల కినుక వహించి ఉన్నారు. పటిష్టమైన మోదీ-షా నిఘా, పర్యవేక్షణ వ్యవస్థ ఎవరూ లంచాలు తీసుకోకుండా చూడటానికి సరిపోతుందని అనుకోవడమే అందుకు కారణమని అనుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ జోక్యం చే సుకుంటుందా? ప్రధానిగానూ, పార్టీ అత్యున్నత నేతగానూ మోదీ స్థానం తిరుగులేనిది. కాబట్టి ఆయన భవితవ్యం గురించిన ప్రశ్నే ఉత్పన్నం కాదు. కాకపోతే ఆయన పార్టీని ఏ దిశగా నడుపుతున్నారో అటే సాగుతారా? లేక దిశను మారుస్తారా? అనేదే ప్రశ్న. అటే సాగడమంటే, ఈ అధిష్టానం సంస్కృతిని లోతుగా విస్తరింపజేసి, వ్యవస్థీకృతం చేయడమే. 1969 తదుపరి కాంగ్రెస్ చేసిందదే. నిజానికి నేడు మనం చూస్తున్న అసమ్మతి, ఆ పరిణామానికి వ్యతిరేకమైన రోగనిరోధక ప్రతిస్పందనా స్వభావం కలిగినది కూడా. అతి కేంద్రీకరణ అనే ఈ వాదన ఆర్ఎస్ఎస్ను సైతం మెప్పించగలుగుతుందని కూడా అసమ్మతివాదులు ఆశిస్తున్నారు. బీజేపీపైన ఆర్ఎస్ఎస్ నీడ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అయితే, ఆ రెంటి మధ్య సమీకరణలు గతంలో కంటే చాలా మారాయి. 2009 ఎన్నికల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయాక అద్వానీ ప్రాభవం క్షీణిస్తుండగా అది చివరిసారిగా బీజేపీ వ్యవ హారాల్లో బహిరంగంగానూ, నిర్ణయాత్మకంగానూ జోక్యం చేసుకుంది. అప్పట్లో నలుగురు సీనియర్ నేతలు జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, అనంత కుమార్ కలిసి ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్‌ను కలుసుకున్నారు. తొలుత పార్టీ అధ్యక్షుడి ఎంపికతో ప్రారంభించి పార్టీ పునర్నిర్మాణానికి తోడ్పడాలని అభ్యర్థించారు. ఆర్ఎస్ఎస్, యువ నేతను కోరుకుంది. మనోహర్ పారిక్కర్‌ను అధ్యక్షుడ్ని చేయాలనుకుంది. కానీ ఆయన అద్వానీని పాత చింతకాయ పచ్చడిగా తీసిపారేస్తూ చేసిన ప్రకటనతో ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నారు. అలా నితిన్ గడ్కరీ తెర పైకి వచ్చారు. అలాంటి జోక్యం ఇప్పుడు జరిగే అవకాశం చాలా తక్కువ. నాగపూర్ పీఠాధిపతులు సైతం జోక్యం చేసుకోలేనంతటి శక్తివంతునిగా, ప్రజాదరణ కలిగిన నేతగా నేడు మోదీ ఉన్నారు. పైగా అధికారాన్ని పంచుకోవడంలో వాజ్‌పేయి కంటే కూడా ఆయనే ఆర్ఎస్ఎస్కు పెద్ద పీట వేశారు. కీలక మంత్రిత్వ శాఖలను, గవర్నర్ పదవులను కట్టబెట్టారు. ప్రత్యేకించి అది బాగా కోరుకునే ఈశాన్య రాష్ట్రాల గవర్నర్ పదవులను వారికే ఇచ్చారు. మోదీ-షా సమస్యకు సంబంధించి మోదీ ‘‘సర్దుబాటు ధోరణి’’తో వ్యవహరిస్తారా లేక తిరస్కార వైఖరిని చేపబడతారా? అనేది తేలాలంటే రానున్న నాలుగు వారాలు వేచి చూడాల్సిందే. (వ్యాసకర్త శేఖర్ గుప్తా) -
అర్ధసత్యాల దౌత్యం ఆత్మకథ
పాక్ సైన్యం, ఐఎస్ఐ ఉన్నతాధికారుల బృందం ప్రజలు ఎన్నుకున్న ప్రధానులనే కాదు, తమకు భిన్నంగా ఆలోచించే త్రివిధ దళాల అధిపతులను సైతం లెక్క చేసేది కాదు. కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా తాను ముందడుగు వేసినట్టు, అందుకు సైన్యం పూర్తి ఆమోదం తెలిపినట్టు కసూరీ సూచించారు. ముషార్రఫ్, కయానీ, ఐఎస్ఐ అధిపతి పాషా, తదితరులున్న కీలక సమావేశాల చర్చల గురించి ఆయన రాశారు. కానీ నాటి కాలక్రమాన్ని చూస్తే ఈ తెరచాటు చర్చల కీలక దశలోనే ‘‘ఎవరో కొందరు’’ 26/11 దాడులకు పన్నాగం పన్నుతున్నారని తెలుస్తుంది. అత్యున్నత దౌత్యవేత్తలకు పక్షులకు మధ్య సంబంధం ఏమిటి? వారు ‘గద్దా కాదు పావురమూ కాదు’ ఆ రెంటికి మధ్యస్త జాతి పక్షులు. పాకిస్తాన్ మాజీ విదేశాంగశాఖ మంత్రి కుర్షీద్ మొహమ్మద్ కసూరీ ‘నెయిదర్ ద హాక్ నార్ ఏ డోవ్: ఏన్ ఇన్సైడర్స్ ఎకౌంట్ ఆఫ్ పాకిస్తాన్స్ ఫారిన్ పాలసీ’ (గద్దా కాదు పావురమూ కాదు: పాకిస్తాన్ విదేశాంగ విధానంపై ఒక లోపలి మనిషి కథనం) అనే 851 పేజీల పుస్తకాన్ని రాశారు. వైకింగ్/ పెంగ్విన్ ప్రచురించిన ఆ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా కసూరీ పాక్ విదేశాంగ మంత్రిగా ఉండగా యూపీఏ-1 ప్రభుత్వ విదేశాంగ మంత్రిగా ఉన్న నట్వర్‌సింగ్ కూడా కనిపించారు. అప్పట్లో ఆయనను ఒక పాత్రికేయుడు మీరు గద్దా? పావు రమా? అని అడిగిన సంగతి గుర్తుకు తెచ్చుకోండి (దూకుడుగా లేదా కయ్యా నికి కాలుదువ్వే రీతిలో వ్యవహరించేవారిని గద్ద అనడం పరిపాటి). నట్వర్ దానికి నేను నడుపుతున్నది విదేశాంగ శాఖనా? లేక పక్షుల అభయార ణ్యాన్నా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదో సరదా వ్యవహారం అనుకోండి. కసూరీ స్వాతంత్య్రం నమ్మశక్యం కానిది కసూరీతో వచ్చిన తంటా ఏమిటంటే పక్షి మానవునిగా ఆయన తన విదేశాంగశాఖ కార్యకలాపాలను ఆ పుస్తకంలో ఏమంత శ్రద్ధగా పట్టించు కోలేదు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఆ దేశ విదేశాంగ విధాన భావజాల దిశను నిర్ణయించగలరన్నట్టుగా ఆయన నటించారు. లేదా విదేశాంగ విధాన పరమైన పక్షిశాస్త్రంలో తాను ఉండాల్సింది గద్దగానా లేదా పావురం గానా లేదా ఆ రెండింటికీ మధ్యస్తమైన మరో జాతి పక్షిగానా అని నిర్ణయించు కునే శక్తి ఉంటుందన్నట్టు సూచించారు. అది నమ్మశక్యం కానిది. ఆ పుస్తకం మరీ అతిగా సరళీకరించినది, కొన్ని భాగాలైతే చాలా హడావుడిగా, బాధ్యతా రహితంగా రచించినవి అని కూడా నేను జోడించాల్సి ఉంది. కానీ నేనలా అన డం ఎంతో కొంత కృతజ్ఞతారాహిత్యం, మొరటుదనం ప్రదర్శించడమే అవు తుంది. కసూరీ నాకు మిత్రుడు, సదుద్దేశాలు గలిగిన మేధావి. కాలం విష యంలోలాగే ఆతిథ్యంలోనూ మహా ఉదారమైన మనిషి. 1985లో రిపోర్టర్‌గా నేను పాకిస్తాన్‌కు మొదటిసారిగా పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన ఇంట్లోని అద్భుతమైన డైనింగ్ టేబుల్‌పై భోజనం చేశాను. అయినా నేనలా అనడానికి కారణం ఉంది. భారత-పాకిస్తాన్ సంబంధాలను నిర్వచించేది కశ్మీరే అన్నట్టున్నంత కాలం... కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఒక తరమే చాలదనిపిస్తుంది. ఒక భారత ప్రభుత్వానికి ఐదేళ్ల పదవీ కాలం అందుకు సరిపోదు. పాకిస్తాన్‌లోని సైనిక నియంతలు హత్యకు గురైన, ప్రవాసానికి పోయిన లేదా జైల్లో కె ళ్లిన మరునాడే వారి మాటలు, వాగ్దానాలు లెక్కలోకి రాకుండా పోతాయని చరిత్ర చెబుతోంది. కాబట్టి అలాంటి ఇంకొక నియంత ముషార్రఫ్ పాలనలో అది అసాధ్యం. వాటన్ని టినీ తర్వాత తిరగ దోడుతారు, తిరస్కరిస్తారని కూడా చరిత్ర చెబుతోంది. అదలా ఉంచితే, ముషార్రఫ్ సరిగ్గా దాదాపు అదే క్రమంలో సాగారు. దేశ ప్రధాని శాంతి కోసం ప్రయత్నిస్తుండగా... ఆయనకు వెనుక మాటున భారత్ దెబ్బకు మోకాళ్ల మీద పడి, శాంతి కోసం ప్రాధేయపడు తుందే తప్ప తిప్పికొట్టదని భావించి కార్గిల్ యుద్ధాన్ని ప్రారంభించిన జనరల్‌ను మీరు ఎంత ని నమ్మగలరు? ఆ తర్వాత ఆయన కేవలం ఫేస్బుక్ పేజీలోని ‘లైక్’ల సంఖ్యను బట్టి... నిజంగానే తన దేశం తనని ప్రేమి స్తోందని, తన కోసం తపించిపోతుందని, ఎలాగైనా తాను తిరిగిరావాలని కాంక్షిస్తోందని ఆయన నమ్మేశారు. అందుకే రాజకీయవేత్త అవతారం ఎత్తి ప్రవాసం నుంచి తిరిగి వచ్చారు. రాజద్రోహానికి పాల్పడ్డందుకు ఆయనపై ఇంకా విచారణ జరగలేదు. అందుకు కారణం సంస్థాగతంగానైతే సైన్యం, వ్యక్తిగతంగానైతే జనరల్ రహీల్ షరీఫ్ ఆయన్ను కాపాడు తుండటమే. శాంతి చర్చల మాటునే పన్నాగాలు పాకిస్తాన్ విదేశాంగ విధానాన్ని ఏదో ఒక విధంగా తానే నిర్ణయించానని లేదా కీలక పాత్ర వహించాలని భావించడం లేదా తాను గద్దగా వ్యవహరించాలా? లేక పావురంలానా? అనేది తన చేతుల్లోనే ఉండేదని కసూరీ భావించడం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. సరిగ్గా అదే నేను ఏ మాత్రం అంగీకరించలేని విషయం. సౌమ్యులైన పాశ్చాత్య విద్యావంతులనే పాకిస్తానీ సైనిక నియంతలు సాధారణంగా విదేశాంగ మంత్రులుగా లేదా సీనియర్ దౌత్యవేత్తలుగా నియమించేవారు. భావనాత్మక స్థాయి నుంచి ప్రారంభించి వివరాలకు చేరే రీతిలో తమ ఎజెండాను అమలు చేయాలని వారికి నిర్దేశించేవారు. జనరల్ అయూబ్‌ఖాన్, జుల్ఫీకర్ ఆలీ భుట్టోను నియమించడంతో ఈ ధోరణికి శ్రీకారం చుట్టారు. సైన్యం, పెద్ద గూఢచార యంత్రాంగమూ విధానాన్ని నిర్వచించగా, వారిని పరివేష్టించి ఉన్న అత్యున్నతాధికార బృందం ఆ విధానానికి మెరుగులు దిద్దడం ఆనవాయితీగా ఉండేది. విదేశాంగ మంత్రులు ఆ విధానానికి ప్రాతినిధ్యం వహించేవారు. ఆ విధానం కొనసాగింపునకే తప్ప మార్పునకు ప్రాతినిధ్యం వహించని వారుగా భావించే వారిలో అబ్దుల్ సత్తార్, సత్రాజ్ అజీజ్‌లే కాదు కసూరీ సైతం కనిపించేవారు. ఈ సంస్థాగతమైన పట్టు ఎంత బలమైనదంటే అది ప్రజలు ఎన్నుకున్న ప్రధానులను... అది భుట్టో అయినా లేదా నవాజ్ షరీఫ్ అయినా ధిక్కరించేది. అంతేకాదు, తమకు భిన్నంగా ఆలోచించే త్రివిధ దళాల అధిపతులను సైతం లెక్క చేసేది కాదు. సరిహద్దులలో మార్పులు లేని రీతిలో కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా భారత్‌తో చర్చలకు తాను ముందడుగు వేసినట్టు, అందుకు సైన్యం పూర్తి ఆమోదం తెలిపినట్టు కసూరీ సూచించారు. ముషార్రఫ్, జనరల్ అష్ఫాఖ్ పర్వేజ్ కయానీ, ఐఎస్ఐ అధిపతి షూజా పాషా, తదితర కీలక సైనికాధికారులంతా ఉన్న సమావేశాల్లో సాగిన చర్చల గురించి ఆయన వివరంగా రాశారు. కానీ నాటి కాల క్రమాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ తెరచాటు చర్చలు కీలకమైన దశలో ఉండగానే ‘‘ఎవరో కొందరు’’ 26/11 ముంబై దాడులకు ప్రణాళికను రచించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ముంబై ఉగ్ర దాడులు, పాక్ సైన్యం, ఐఎస్ఐల నియంత్రణకు లోబడని దుష్టులు చేసిన దాడులు మాత్రమేనని మీరు నమ్మదలుచుకుంటే నమ్మొచ్చు. నన్ను మాత్రం ఆ కోవలోకి చేర్చకండి. వాజ్‌పేయి, నవాజ్‌లు శాంతి చర్చలు సాగిస్తుండగా, ముఫార్రఫ్ కార్గిల్ యుద్ధానికి పథకం పన్నే పనిలో ఉన్నారు. భారత సైనిక గూఢచార సంస్థ రా మాజీ అధిపతి ఆనంద్ వర్మ పదవీ కాలంలో పాక్ ఐఎస్ఐకి లెఫ్టినెంట్ జనరల్ హమీద్ గుల్ అధిపతిగా ఉండేవారు. 1980లలో రాజీవ్, జియా ఉల్ హఖ్ల ఆదేశానుసారం వినూత్నమైన రీతిలో ప్రారంభమైన తెరచాటు చర్చలనే కొనసాగించారని వర్మ, గుల్ మరణం సందర్భంగా ‘హిందూ’ పత్రికలో రాశారు. సరిగ్గా ఆ చర్చల సమయంలోనే అంతుబట్టని రీతిలో జియా హత్య జరిగింది. గుల్ తన మాట వెనక్కు తీసుకుని అఫ్ఘానిస్థాన్‌లో పోరాటం తీవ్రతరం చేయడమే కాదు, మన పంజాబ్ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించారు. బ్లూస్టార్ (1984 జూన్), బ్లాక్ థండర్ (1988 మే), తదుపరి పంజాబ్‌లో మూడో దశ ఉగ్రవాదం ఐఎస్ఐ మద్దతుతోనే ఖలిస్థానీ పేరుతో సాగింది. అదృష్టవశాత్తూ అదే ఆఖరుది. కారణాలు అంతుబట్టకుండా జియా హత్య జరిగిన 1989లోనే క శ్మీర్లో సమస్య తిరిగి తలెత్తింది. ఇక 2008లో పాకిస్తాన్ తరఫున చర్చలో కీలకమైన వాడైన గుల్ ‘‘వినూత్నమైన’’ పరిణామం జరుగుతుండగానే 26/11 దాడులకు పథకాలు వేశారు. మరుగున పడ్డ కొన్ని ఆసక్తికర అంశాలు క శ్మీర్‌కు సంబంధించి ‘‘వెల్లడించిన విషయాల’’ గురించిన చర్చలన్నిట్లో పడి కసూరీ పుస్తకంలోని కొన్ని నిజమైన బంగారు కణికలు కనిపించకుండా పోయాయి. నాకైతే బీరాలు పలికే ముషార్రఫ్ 2005లో ఐరాస సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రసంగం అత్యంత హాస్యభరితమైనది, ప్రాముఖ్యత గలది. అది ఉద్రిక్తతలు సడలిన కాలం. హఠాత్తుగా ముషర్రాఫ్ కశ్మీర్‌పై ఏ మాత్రం పట్టువిడుపులు లేని కఠిన వైఖరిని ప్రకటించారు. అది విని భారత ప్రతినిధి బృందంలో కలకలం రేగుతుండగా తానూ నిర్ఘాంతపోయానని కసూరీ అంగీకరించారు. ప్రేమ యాత్ర మధ్యలో ముషార్రఫ్ స్క్రిప్ట్‌ను మార్చేశారా? మార్చలేదని, ఆయన మరెవరి స్క్రిప్ట్‌నో ఆ సమయంలో చదువుతున్నారని కసూరీ తెలిపారు. ఆ ఉపన్యాసాన్ని రాసినది మునీర్ అక్రమ్. ఆగ్రహావేశపరుడైన ఆ ఉన్నత దౌత్యవేత్త ఒకసారి భారత్‌ను ఆసియా రోగిష్టి అని, నాటి మన విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌ను కిరాయి ముస్లిం అని అన్నారు. మునీర్ అప్పట్లో ఐరాసలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధిగా ఉండేవారు. ఆ స్క్రిప్టు పూర్తిగా మునీర్‌దేనని, విదేశాంగ మంత్రినైన తనకు గానీ, ముషార్రఫ్‌కు గానీ లేదా తమ సహాయకులకు గానీ దాన్ని చూసే సమయం లేకపోయిందని కసూరీ చెప్పారు. అంటే ముషర్రాఫ్ వేదికపై నుంచి తన ప్రసంగాన్ని చదువుతున్నప్పుడే అది తనను ఎక్కడకు తీసుకుపోతోందో గ్రహించి ఉండాలి. దాన్నుంచి పలు గుణపాఠాలు తీయవచ్చు. మొదటిది, మన ఎస్.ఎమ్. కృష్ణ పోర్చుగీసు విదేశాంగ మంత్రి ఉపన్యాసాన్ని ‘‘పరధ్యానంగా’’ చదువుతుండటాన్ని చూసి మనం అన్యాయంగా నవ్వాం. రెండు, ముఫార్రఫ్, ఆయన సహాయకులు అసమర్థులు కాకున్నా, సోమరులు. మూడు, సైనిక నియంత అధికారంలో ఉండి అధికారం మీటలన్నీ చేతిలో ఉంచుకున్నా భారత్‌తో విదేశాంగ విధానాన్ని రచించిన చెయ్యి మరేదో శక్తికి స్పందించింది. అదే జరగకపోతే మునీర్ అక్రమ్‌ను వెంటనే కాల్చి పారేసేవారు. ఆ విషయం కసూరీ చెప్పేవారు కారు. భారత-పాకిస్తాన్లకు సంబంధించి ఏ నిజాన్ని చెప్పినా... అది ఏకపక్షమైనది, ఒక వ్యక్తి పక్షం నుంచి చెప్పినదే అయినా విలువైనదే. ఆ మేరకు, కసూరీ మన జ్ఞానానికి, అవగాహనకు చేర్పును చేశారు. కానీ పుస్తకం పేరును ‘‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ సింగింగ్ సింప్లిస్టిక్ కానరీ’’ (కూనిరాగాల పిట్ట ఆత్మకథ)గా మారిస్తే బాగుంటుంది. అయితే ఆ పుస్తకం మనలో చాలా మందిలో ఉన్న కొన్ని నిరాశాపూరితమైన పాత విశ్వాసాలను బలపరుస్తుందే తప్ప మార్పునకు భరోసాను కలిగించదు. (వ్యాసకర్త : శేఖర్ గుప్తా) -
అతి సుస్థిరతకు ‘మండల్’ ముగింపు
జాతిహితం ‘‘మోహన్ కంటే లల్లూ తెలివిగలవాడైతే?’’ఈ ప్రశ్న నాది కాదు. నేనొక వ్యక్తి నుంచి అరువు తెచ్చుకున్నది. ఆయన ప్రశంసలకంటే ఎక్కువగా దూషణలకు గురైన వ్యక్తి. అంతేకాదు, చాలా వరకు మరపున పడిపోయిన మనిషి కూడా. ఆయన, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) డిమాండ్లపై నియమించిన వివాదాస్పద కమిటీకి నేతృత్వం వహించిన బీపీ మండల్. ఆయన తన 426 పేజీల నివేదికను 1980లో, సరిగ్గా ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన ప్పుడు సమర్పించారు. దాన్నామె తక్షణమే పాతరేసేశారు. 1990 ఆగస్టు 7న నాటి ప్రధాని వీపీ సింగ్ దాన్ని అమలు చేస్తామని ప్రకటించేవరకు, ఒక దశాబ్ద కాలంపాటూ అది అలాగే పడి ఉంది. వీపీ సింగ్ మరోవారం తర్వాత, స్వాతంత్య్రదినోత్సవ ఉపన్యాసంలో అదే విషయంపై మాట్లాడటం మన రాజకీయా లను ఒక మలుపు తిప్పింది. దేశాన్ని, కనీసం చిన్న, పెద్ద పట్ట ణాల భారతాన్ని అది భగ్గున మండించేసింది. అగ్రకుల విద్యా ర్థుల్లో అవకాశాలు కోల్పోతామనే భయాన్ని రేకెత్తింపజేసింది. దురదృష్టకరంగా పలువురు ఆత్మాహుతులకు పాల్పడటానికి అది దారి తీసింది. సందర్భవశాత్తూ మన 68వ స్వాతంత్య్ర దినోత్సవం నాడే ఆ సందర్భపు 25వ వార్షికోత్సవం కూడా. ఆ సమస్యకు సంబం ధించిన సారాంశం దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో కొన్నిటి పరిష్కారం. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతల పరిష్కారానికి మించి మరింత ముఖ్యమైన సమస్య మరొకటి నాడు లేదు, నేడూ ఉండదు. మండల్ తన నివేదికలో అద్భుత మేధో ప్రతిభతో, దూరదృష్టితో సంధించిన ‘లల్లూ, మోహన్ల మధ్య పోటీ’ ప్రశ్నతో వివరించినది అదే. ‘మండల్’ చెరగని ముద్ర లల్లూ అనే ఇంగ్లిషు మాధ్యమ విద్యను అందుకోలేని, ఇంట్లో టీవీ లేని పల్లె టూరి పిల్లాడికి నగర వాసియైన మోహన్ అనే పిల్లాడికి ఉండేంత అవగాహన లేదనుకుందాం. లల్లూకి ఇంగ్లిషులో భావవ్యక్తీకరణ శక్తీ, ఇతరులతో కలసి మెలసి పోవడంలో ఆత్మవిశ్వాసమూ తక్కువగా ఉండి, మోహన్ కంటే ఎక్కువ తెలివైనవాడైనా అతనితో పోటీ పడలేడు. లల్లూ మరింత యోగ్యుడే అయినా మోహనే ఎక్కువ ప్రతిభావంతుడని మీరు తీర్పు చేయాల్సి వస్తుంది. ఇంతకూ మండల్ తాను ఆశించినట్టు ప్రతిభకు సంబంధించిన పాత వాదనను తలకిందులు చేయడంలో కృతకృత్యులయ్యారా? ఒక్కసారి ఉన్న ఆధారాలను చూడండి. 1984 తర్వాత పూర్తి మెజారిటీ సాధించినది నేటి మన ప్రధానే. ఆయన ఆ పదవికి ఎన్నికైన మొట్టమొదటి ఓబీసీ అభ్యర్థి కూడా. దేవెగౌడ కూడా ఒకరని అనొచ్చు. అలా అన్నా, అది ఈ వాదనను మరింత బలోపేతం చేసేదే. దేశంలోని ఆరు పెద్ద రాష్ట్రాల్లో (ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర) ఐదింటి ముఖ్య మంత్రులు ఓబీసీలే. దేశ జనాభాలో సగానికి సమానమైన రాష్ట్రాల్లో అధికా రం కోసం పోటీ పడేవారిలో ముఖ్యులంతా ఓబీసీలు లేదా దళితులే. ఆ విష యంలో ఉత్తరప్రదేశ్, బిహార్‌లు విడమరచాల్సిన అవసరమే లేనంతగా సుపరిచితమైనవి. రాజస్థాన్‌లో సైతం ఇప్పుడు వసుంధర రాజేకు, గుజ్జర్ అయిన సచిన్ పైలట్‌కు మధ్యనే పోటీ. బీజేపీ గెలుపు మంత్రం బీజేపీ విశాల హృదయంతో సులువుగా ఈ మార్పును ఆహ్వానించింది. కొత్తగా మండలీకరణం చెందిన బడుగువర్గాలకు సాధికారతను కల్పించింది. అత్యంత విధేయంగా బ్రాహ్మణీయ కుల అంతస్తుల వ్యవస్థను అనుసరించే తన స్వంత డీఎన్ఏనే అది అందుకోసం ధిక్కరించాల్సి వచ్చింది (అందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం!). ఈ కాలంలో బీజేపీ ఇంత అద్భుతంగా వృద్ధి చెందడానికి అది కూడా ఒక కారణం. సంఘ్ పరివార్ అనుబంధ సంస్థల్లో చాలా వరకు కూడా అదే బాట పట్టాయి. విశ్వ హిందూ పరిషత్‌లోని ప్రవీణ్ తొగాడియా, వినయ్ కతియార్లే కాదు సాధ్వీ ప్రాచీ సైతం వెనుకబడిన కులాలకు చెందినవారే. అలాగే ఎప్పుడూ పతాక శీర్షికల వేటలో ఉండే సాధ్వీ నిరంజన్ జ్యోతి, సాక్షి మహారాజ్ వంటి బీజేపీ, వీహెచ్‌పీ నేతలు కూడాను. ఆర్ఎస్ఎస్, ప్రత్యేకించి దాని నాగపూర్ పీఠాధిపతులు ఇంతవరకు ఈ మార్పును ప్రతిఘటిస్తూనే ఉన్నా, వారు సైతం అలాంటి పరివర్తన చెదడం ఖాయమేనని చెప్పగలను. మీరు అనుకుంటున్నంత కంటే ముందుగానే ఆ పరివర్తన మీకు కనిపిస్తుంది. ఇదేకాలంలో కాంగ్రెస్ కొందరు సీనియర్ నేతల పిల్లలు మినహా, చెప్పుకోదగిన ఓబీసీ నేతలను తయారు చేసుకోలేకపోయింది. ఈ కాలంలో అది క్షీణించిపోతూ ఉండటానికి అది కూడా ఒక కారణం. అయితే కొందరు ఓబీసీ నేతలను ఇక్కడి నుంచో, అక్కడి నుంచో అది అరువు తెచ్చుకోవడమో లేదా దొంగిలించడమో చేయకపోలేదు. ఉత్తరప్రదేశ్‌లో రామ్‌నరేష్ యాదవ్ (అవును, ఆయనే, మధ్యప్రదేశ్ ‘వ్యాపం’ గవర్నరే), గుజరాత్లో శంకర్ సింఘ్ వాఘేలా అది అలా సంపాదించుకున్నవారే. అయితే ఇలా వచ్చిన వారు నెరపిన ప్రభావం పరిమితం. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి అధికారం చలా యిస్తున్న ఏకైక ఓబీసీ నేత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రమే. ఆయనను కూడా మరీ ఇటీవలే అది దేవెగౌడ పార్టీ నుంచి తస్కరించిందని గుర్తుకు తెచ్చుకోండి. ‘మందిర్’ను వెనక్కు నెట్టిన ‘మండల్’ మన రాజకీయాల్లో 1989-91 కాలం పూర్తి గందరగోళం. అందులోంచే ఒక కొత్త రాజకీయ క్రమమూ ఆవిర్భవించింది. ‘మందిర్’, ‘మండల్’ అనే రెండు కాంగ్రెస్ వ్యతిరేక ప్రజా ఉద్వేగపు వెల్లువలు దేశ ప్రధాన భూభాగాన్ని కుదిపే శాయి. అవి రెండూ పరస్పర విరుద్ధమైనవి. మొదటిది హిందూ అగ్రకు లాలను ఆకట్టుకోగా, రెండోదాని ఉద్దేశం కుల విభజనను పూడ్చడమే అయినా, అది కొత్త కుల విభజనను సృష్టించాలని యత్నించింది. అవి రెండూ ఉమ్మడి శత్రువైన రాజీవ్‌గాంధీకి వ్యతిరేకంగా ఐక్యమయ్యాయి. అయితే ఆచరణయోగ్యం కాని ఆ భాగస్వామ్యం ఏడాదికన్నా తక్కువ కాలమే మనగలిగింది. మందిర్ నేత ఎల్కే అద్వానీ అయోధ్య రథయాత్రను ప్రారం భించడంతో అది ముగిసిపోయింది. మండల్ స్టార్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆ మందిర్ రథయాత్రను భగ్నం చేశారు. ఆ తర్వాతి కాలంలో మందిర్‌పై మండల్ పైచేయి సాధించింది. బీజేపీ వెనుకబడిన కులాల్లోని కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకొని తానే స్వయంగా మండలీకరణం చెందాల్సి వచ్చింది. దీంతో అయోధ్య గత 23 ఏళ్లుగా సమస్యగానే లేకుండా పోయింది. అంతేకాదు, మండల్ బిడ్డలు ఉత్తరప్రదేశ్, బిహార్లలో బీజేపీని అధికారంలోకి రాకుండా చేశారు. ఏ భావన ఎక్కువ శక్తివంతమైనదో మీరే గమనించొచ్చు. కులం హిందూ సమాజంలో తెచ్చిన విభజనను మతం ద్వారా ఐక్యం చెయ్యాలనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ల యోచన అని నా నమ్మకం. మండల్ ఆ భావనను తుత్తునియలు చేసేసింది. కూలిన కాంగ్రెస్ కోటలు మనం మాట్లాడుతున్న పరిష్కారం అది కాదు. 1989 వరకు దేశం ఎదు ర్కొన్న అతి పెద్ద సమస్య ‘టీనా’ (ప్రత్యామ్నాయం లేదు) అనే అంశం. అది, కాంగ్రెస్ తప్ప వేరే గత్యంతరం లేదనే పరిస్థితిని కల్పించింది. కొద్దిపాటి అంతరాయాలున్నా, కాంగ్రెస్ అటు కేంద్రంలోనూ, ఇటు చాలా రాష్ట్రాల్లోను పరిపాలన సాగించడం కొనసాగింది. ఒక విధంగా చెప్పాలంటే స్వాతం త్య్రానంతరం మనకు నాలుగు దశాబ్దాల అసాధారణ రాజకీయ స్థిరత్వం ఉండేది. ఇది మరీ అతి ఎక్కువ సుస్థిరత. ఏ ప్రజాస్వామిక దేశమూ అలా వృద్ధి చెందజాలదు. అది దేశాన్ని ప్రతిష్టంభనకు గురిచేసి, స్తబ్ధుగా మార్చే స్తుంది. దేశం పురోభివృద్ధి చెందాలంటే రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలి. కాంగ్రెస్‌కు అసాధారణమైన ఓట్ల సమ్మేళనం ఉండేది. మిగతా కులాలను సైతం గణనీయంగా ఆకర్షించగల ముస్లిం-బ్రాహ్మణ సమ్మేళనంతో అది దేశ ప్రధాన భూభాగాన్ని శాసించింది. బీజేపీని ఓడించగలిగే అవకాశమున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే కావడంతో, ముస్లింలకు వేరే దాన్ని ఎంచుకునే అవకాశమే ఉండేది కాదు. మండల్ ఆ అడ్డుకట్టను బద్ధలు కొట్టింది. విశ్వసనీయతగలిగిన వెనుక బడిన కులాల పార్టీలతో వీపీ సింగ్ నిర్మించిన మొదటి కూటమి ఉత్తరప్రదేశ్, బిహార్‌లను తుడిచిపెట్టేసింది. ఈ నేతలలో అత్యధికులు లోహియా అనుచ రులు, సోషలిస్టులు. లౌకికవాదులుగా వారికి మంచి గుర్తింపు ఉంది. ముస్లిం లకు వారు ఎంచుకోడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఫలితంగా రెండు పరిణామాలు సంభవించాయి. ఒకటి, కాంగ్రెస్ క్షీణించిపో యింది. ఆ తర్వాత మరెన్నడూ అది జాతీయ స్థాయి మెజారిటీని సాధించలేకపోయింది. రెండు, కాంగ్రెస్ గానీ, బీజేపీగానీ ఆ రెండు రాష్ట్రాలను మళ్లీ పరిపాలించ లేకపోయాయి. బీజేపీ, నితీష్‌కుమార్‌తో కలసి అధికారం చెలాయించినట్టు, ఇప్పుడు జీతన్ మాంఝితో కూటమిగట్టి తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నట్టు... ఏదో ఒక కుల పార్టీకి ఛోటా భాగస్వామిగా మాత్రమే ఆ పని చేయగలిగాయి. బీజేపీకి భిన్నంగా, కాంగ్రెస్ ఈ నూతన వాస్తవికతను అంగీకరించలేదు. ఆ పార్టీ నాయకత్వంలోని అన్నివర్గాలలోనూ ఉన్న వారసత్వ స్వభావం విధించిన పరిమితులు కూడా దానికి ఉన్నాయి. వీపీ సింగ్ ప్రభుత్వం ఓ ఏడాదికంటే తక్కువగానే నిలబడి ఉండొచ్చు. అయితే కాంగ్రెస్‌పై ఆయన పూర్తి ప్రతీకారం తీర్చుకున్నారు. రాజకీయాలే గనుక క్రికెట్ ఆట అయి ఉంటే, నేనా పరిణామాన్ని మండల్ బౌలింగ్‌లో కాంగ్రెస్‌ను వీపీ సింగ్ క్యాచ్ పట్టారని అనేవాడినే. మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయడం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేస్తుందని, సమా జాన్ని అస్థిరతకు గురిచేస్తుందని అప్పట్లో విస్తృతంగా భయ పడ్డారు. ఇరవై ఐదేళ్ల తర్వాత, ఈ వారంలో తిరిగిచూస్తే, అది మనల్ని సామాజికంగా మరింత ఐక్యం చేసింది. కరడుగట్టిన కాంగ్రెస్ ఓటు బ్యాంకులను ధ్వంసం చేసి నిజమైన పోటీతత్వం గల రాజకీయాలకు, ఆర్థిక విధానాలకు అవకాశా లను సృష్టించిం ది. అది ‘హిందూ (అల్ప) వృద్ధిరేటు’ను అధిగమించేట్టు చేసింది, పెచ్చరి ల్లుతున్న బీజేపీ హిందుత్వకు అడ్డుకట్ట వేసింది. కుల రాజకీయాల్లో తొలి పాఠాలు వాటిని బోధించినది వీపీ సింగ్‌గానీ లేదా సీతారాం కేసరిగానీ కారు. పాత కాలపువాడైన బాబూ జగజ్జీవన్ రాం. అంబేడ్కర్ తర్వాత దేశవ్యాప్తమైన గుర్తింపును కలిగిన అతి గొప్ప, ఆఖరు దళిత నేత ఆయనే. మొత్తంగా ప్రజాభి ప్రాయం ఆయనను ప్రధాన స్రవంతి నాయకునిగా గుర్తించడమే ఆయన సాధించినవాటిలోకెల్లా ముఖ్యమైనది. 1971 యుద్ధంలో చూపిన నాయకత్వ ప్రతిభతో ఆయన మన చరిత్రలోనే అత్యంత గౌరవనీయుడైన, ప్రేమాదరా లను చూరగొన్న రక్షణ మంత్రిగా నిలిచారు. పాతరేసి ఉంచిన మండల్ రిపోర్టు నుంచి ప్రేరణను పొంది గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలో తమ సొంత కమిషన్లను నియమిం చాయి. ఓబీసీ రిజర్వేషన్ల అమలును సూచించిన ఆ రెండు నివేదికలను అవి 1985లో అమలు చేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ అల్లర్లు చెలరేగాయి. వీపీ సింగ్ ఢిల్లీ భగ్గుమనిపోయేట్టు చేయడానికి ఐదేళ్ల ముందే ఇది జరిగిందని గుర్తుంచుకోండి. గుజరాత్లో ఏ అల్లర్లు మొదలైనా అవి హిందూ-ముస్లిం అల్లర్లుగా మారిపోతుంటాయి. ఎప్పటిలానే ఓబీసీ రిజర్వేషన్ల వ్యతిరేక అల్లర్ల విషయంలోనూ అదే జరిగింది. ‘ఇండియా టుడే’ కోసం ఆ పరిణామాలను నివేదించడం కోసం రిపోర్టర్‌గా నన్ను పంపారు. నిజం చెప్పాలంటే, ఓబీసీ, మండల్ అంశాలను నేను అధ్యయనం చేయడం అదే మొదటిసారి. జగజ్జీవ న్ రాంను కలుసుకోడానికి వెళ్లడానికి ముందు వరకు నాకు రిజర్వేషన్ల వ్యతి రేకుల వాదనలు వాస్తవికమైనవిగానే అనిపించాయి. అప్పటికి రాజకీయాల్లో కనుమరుగై ఉన్న ఆయన ఒక రిపోర్టర్నైన నాకు ఎంతో ఓపికగా రిజర్వేషన్ల సమస్యను వివరించారు. రిజర్వేషన్లు ఆర్థిక విషయాలకు సంబంధించినవి కావు, సాధికారతకు సంబంధించినవని ఆయన అన్నారు. ఆగ్రాలో ఉండే తమ ‘చమార్’ కులానికే చెందిన ఒక మిత్రుని గురించి మాట్లాడారు. అతని ప్పుడు ‘కోటీశ్వరుడు.’ అయినా తన కొడుకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కావా లని కోరుకుంటున్నాడు. ‘‘నేను వందల కోట్లు సంపాదించినా ఒక బ్రాహ్మ ణుడు మాత్రం నా కుమారుడికి నమస్కరించడు. అదే పోలీసు అధికారి అయితే, బ్రాహ్మణ కానిస్టేబుల్ కూడా సెల్యూట్ చేయాల్సి వస్తుంది’’ అని తన మిత్రుడు అన్నట్టు బాబూజీ తెలిపారు. అంతకన్నా ముఖ్యంగా, మండల్ నివేదికను చదవమని చెప్పారు. దానిలో ‘‘మోహన్‌తో లల్లూకు పోటీ’’ అనే ప్రశ్న ఉన్న భాగాన్ని ఆయన గుర్తు పెట్టి ఉంచుకున్నారు కూడా. ఆ తర్వాత ఆయన రాజీవ్‌గాంధీ వెర్రివాడు. అతనే గనుక గ్రామీణ భారత జీవిత వాస్తవాలను ఎరిగి ఉంటే మండల్ నివే దికను ఇప్పుడు అమలు చేయాల్సింది అన్నారు. ‘‘పట్టణంలో పుట్టి పెరిగినవాడు కాబట్టి రాజీవ్‌గాంధీ గ్రామీణ భార తాన్ని అర్థం చేసుకుని ఉండకపోవచ్చు’’ అన్నాను, నేనేదో మాట సాయం చేస్తున్నట్టుగా. కొంటెతనం తొంగిచూస్తున్న మొహంతో బాబూజీ అన్నారిలా ‘‘అరె, ఎవరన్నారలా అని? ఆసియా క్రీడల గ్రామానికి ఆయన ఎన్నోసార్లు వెళ్లాడే.’’ - శేఖర్ గుప్తా twitter@shekargupta