పార్టీ నియంతల ప్రజాస్వామ్యం | democracy of parties dictators by shekhar gupta | Sakshi
Sakshi News home page

పార్టీ నియంతల ప్రజాస్వామ్యం

Published Sat, Dec 5 2015 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM

పార్టీ నియంతల ప్రజాస్వామ్యం

పార్టీ నియంతల ప్రజాస్వామ్యం

జాతిహితం

 

సిరియా సమస్యపై బ్రిటన్ లేబర్ పార్టీ విప్‌ను జారీ చేయక, సభ్యులు తమ అభీష్టానుసారం ఓటు చేయడాన్ని అనుమతించింది. మన పార్టీలన్నీ అధిష్టానాల లేదా అధినేతల నియంతృత్వాలే. విప్‌ను సడలించడం కాదుగదా, ఎదుటి పక్షానికి చెందిన  ఒక విధానాన్నో లేదా వ్యక్తినో ప్రశంసించినా ద్రోహంగానే చూస్తాయి. ఫిరాయింపుల చట్టం భయం లేకుండా కొన్ని ముఖ్య సమస్యలపైనైనా సభ్యులు మాట్లాడటాన్ని, ఓటు చేయడాన్ని పార్టీలు అనుమతిస్తే... పార్లమెంటు మరింత మెరుగైనదిగా మారుతుంది.

 

మంచి విషయ పరిజ్ఞానమున్న తోటి భారతీయుణ్ణి ఎవరినైనా హిలారీ బెన్ అంటే ఎవరని అడిగి చూడండి. బహుశా తెల్లమొహం వేయడమే జరుగుతుంది. జెర్మీ కోర్బిన్ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రాడికల్ నేత. ఇటీవలి కాలంలో ఆయన పేరు ప్రపంచ  మీడియా పతాక శీర్షికలకు ఎక్కింది. బ్రిటిష్ లేబర్ పార్టీకి ఆయన నూతన నేత అయితే కావచ్చు, కేవలం కావచ్చు అంతే. బెన్ అలాంటి ప్రముఖుడు కాకపోవచ్చు. ఇతరులతో ఏ మాత్రం సంబంధం లేని, అత్యంత అంతర్ముఖీనమైన కాలమిది.

 

ఏదేమైనా బ్రిటన్ నేడు క్షీణిస్తున్న శక్తి. కాబట్టి గూగుల్‌లో ఆయన గురించి శోధించి, సిరియాలో ఐఎస్‌ఐఎస్‌కు వ్యతిరేకంగా తమ వైమానిక బలగాలను ప్రయోగించాలంటూ ఆయన కామన్స్ సభలో చేసిన 13 నిమిషాల ప్రసంగాన్ని వినడం ఉపయోగకరం. ఆ లేబర్ పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యుని ఉపన్యాసం కదిలించేదిగా ఉంది. తోటి యూరోపియన్ సోషలిస్టుల పట్ల (ఫ్రాన్స్‌లోని హోలాండ్) నెరవేర్చా ల్సిన బాధ్యతగానే గాక, అంతర్జాతీయత పట్ల లేబర్ పార్టీ నిబద్ధతలో భాగంగా కూడా ఆయన ఐఎస్‌ఐఎస్‌పై వైమానిక దాడులను సమర్థించారు. భావజాలపరమైన విభేదాలకు అతీతంగా పార్లమెంటు ఆ ఉపన్యాసానికి స్పందించిన తీరు మరింత కదిలించేదిగా ఉంది.

 

తమ పార్టీ నేత కోర్బిన్ ని మొరటుగా విమర్శించినందుకు గానూ బెన్, ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను దుయ్యబట్టి, క్షమాపణ చెప్పాలని కోరారు. దీంతో ఆ ప్రసంగం మొదట్లో  కామెరాన్ ఇబ్బందిగా కదులుతూ, కలవళపడుతూ కనిపించారు. ఆ తర్వాత బెన్ ముఖ్యమైన విషయాలపైకి మళ్లేసరికి ఆమోదసూచకంగా, ప్రశంసాపూ ర్వకంగా నవ్వుతూ కనిపించారు. ఐఎస్‌ఐఎస్‌ను నయా ఫాసిస్టు శక్తిగా పేర్కొన్న బెన్ దానికి వ్యతిరేకంగా పోరాడాలని ఉద్వేగభరితమైన పిలుపు నిచ్చారు. సిరియాలో వైమానికి దాడుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మా నానికి పార్లమెంటు సభ్యులంతా ఓటు చేయాలని కోరుతూ ముగించారు.

 

విప్ పార్టీ ప్రజాస్వామ్యానికి ముప్పు

చివరికి ఆ తీర్మానం భారీ ఆధిక్యతతో నెగ్గింది. ప్రతిపక్ష లేబర్ పార్టీ సభ్యులు 66 మంది కూడా తీర్మానానికి మద్దతుగా ఓటు చేశారు. అదే మన దేశంలో జరిగితే, అలా పార్టీ వైఖరికి భిన్నంగా ఓటు చేసినవారిని శిక్షించడమో లేదా ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారి సభ్యత్వాన్ని రద్దు చేయడమో జరిగేది. కానీ అందుకు భిన్నంగా, అంతర్గత భేదాభిప్రాయాలున్న ఆ సమ స్యపై లేబర్ పార్టీ విప్‌ను జారీ చేయకుండా, సభ్యులు తమ అభిప్రాయాలకు అనుగుణంగా ఓటు చే యడాన్ని అనుమతించింది.

 

ఈ ఉదంతం నుంచి భారత దేశంలోని మనం గమనించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. బ్రిటన్ రాజకీయాలు మన రాజకీయాలకంటే తక్కువగా చీలిపోయినవేమీ కావు. అయినా ప్రధాన ప్రతిపక్షం అంతర్గత ప్రజాస్వా మ్యాన్ని అనుమతించింది. మన దేశంలో అది అసాధ్యం. అన్ని పార్టీలూ ఇప్పుడు తమ పార్టీ అధిష్టానాల లేదా అధినేతల నియంతృత్వాలే. విప్‌ను సడలించడం కాదుగదా, ఎదుటి పక్షానికి చెందిన  ఒక విధానాన్నో లేదా ఒక వ్యక్తినో ప్రశంసించినా దాన్ని ద్రోహంగానే చూస్తాయి. పార్లమెంటులో స్వపర పక్షాలకతీతమైన సౌహార్ద్రత వ్యక్తమయ్యే సందర్భాలు అరుదు. యుద్ధాలు, ఉగ్రవాద దాడులు, ప్రకృతి వైపరీత్యాల వంటి సందర్భాల్లోనూ, సంప్రదా యక రాజకీయాలపై అన్నా హజారే తీవ్ర దాడి సాగించినలాంటి సందర్భా ల్లోనూ ఇది చూడగలం.

 

రాజకీయ విభేదాలు, విభజన కొనసాగుతున్నా, ఉన్నత స్థాయి చర్చ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జరుగు తున్న పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ దినోత్సవంపై సాగిన చర్చలో అలాంటి మెరుపులు కొన్ని కనిపించాయి. అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న రెండు సందర్భాల్లో (1996, 1999) లౌకికవాదంపై జరిగిన చర్చలు నాకు అత్యంత ఇష్టమైనవి. అయితే పార్లమెంటు సభ్యులు పార్టీ విప్‌కు విధేయులై, ప్రశ్నించకుండా, దృఢంగా దాన్ని అనుసరించే అనుయాయులుగా గాక, సొంత బుర్రలున్న ప్రజా ప్రతి నిధులుగా వ్యవహరించడం అంతకంటే చాలా భిన్నమైనది.

 

ప్రజాస్వామ్యం పార్లమెంటరీ కమిటీలకే పరిమితం

అయినా మన ఎంపీలు పార్టీ రోబోలకంటే భిన్నంగా తమ అభీష్టాను సారం ఉండగల ప్రదేశాలు మూడున్నాయి. మొదటిది, పార్లమెంటు సెంట్రల్ హాలు. రెండు, ఢిల్లీలో పనివేళల తదుపరి  సాయంత్రాలు బృందాలుగా కలగలిసే ప్రదేశాలు. వైమనస్యాలు, శత్రుత్వాలు అన్నీ  అదృశ్యమైపోయి, ఒప్పందాలు కుదిరేది అక్కడే. మూడోది పార్లమెంటరీ కమిటీలు. ఎంపీలు తమ సొంత అభిప్రాయాలను వెలిబుచ్చగలిగే వేదికలు అవి మాత్రమే. అక్కడ ఎంపీలు ఉన్నత స్థాయిలో ప్రశ్నలు కురిపిస్తుండటం జరుగుతుందని నేను హామీ ఇవ్వగలను.

 

ఎందుకంటే కొన్ని కమిటీల ముందు నేను సాక్ష్యం చెప్పాను. ముందస్తుగా తగు కసరత్తు చేసి మరీ సమావేశాలకు  వచ్చే ఎంపీల నివేదికల్లో కొన్ని అద్భుతంగా ఉంటాయి. గొప్ప గణాంక సమాచారం, విశ్లేషణ వాటిలో కనబడతాయి. అక్కడ ఓటింగ్ అంటూ ఉండదు కాబట్టి, కమిటీ అంతిమంగా చేసే సూచనల్లో దేన్ని ఏ ఎంపీ సమర్థించారు, వ్యతి రేకించారు అని ఎన్నటికీ చెప్పలేం. తీవ్ర విభేదాలతో విభజితమై ఉన్న రాజకీయ వ్యవస్థ అలాంటి ఏకాభిప్రాయాలను ఎలా సాధించగలుగుతోంది?

 

ఈ పార్లమెంటరీ సంస్థలు బహిరంగమైనవి కాకపోవడం లేదా మీడియా కవరేజికి అందేవి కాకపోవడం అందుకు ఒక విషాదకరమైన కారణం. సూత్రబద్ధంగానైతే ఇది దయనీయమైన పరిస్థితే. కానీ, ఆచరణలో అదో వరం. ఆ సమావేశాలనే బహిరంగంగా, మీడియా కవరేజికి అందేలా నిర్వహించేట్టయితే, మన ఎంపీల్లో ఏ ఒక్కరైనా తమ పార్టీ అధికారిక వైఖరికి భిన్నంగా మాట్లాడే సాహసం చేయగలరా? పార్లమెంటరీ కమిటీల్లో సభ్యులు తమ పార్టీ ైవె ఖరులకు భిన్నంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం నేడు సర్వసాధారణం. ఉదాహరణకు, యూపీఏ అధికారంలో ఉండగా, కొందరు కాంగ్రెస్ ఎంపీలు పెన్షన్ బిల్లును, బీమారంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల పెంపుదలను సంబంధిత కమిటీల్లో వ్యతిరేకించారు.

 

అతి తక్కువ చర్చతోనే, అతి కొన్నే చట్టాలను చేయగలిగేటంతగా, మన పార్లమెంటరీ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయిందని మనం కలత చెందుతుంటాం. ‘‘హల్లా’’ (గందరగోళం) మన మీడియాకు అత్యంత ఇష్టమైన పదం. ‘‘హల్లా’’ సృష్టించి చట్టాలు చేయడాన్ని అడ్డగించగల శక్తిని మన పార్లమెంటు సభ్యులు తరచుగా ప్రయోగిస్తున్నారు. అది కూడా, రైలు రోడ్డు చట్టాన్ని సైతం ‘‘హల్లా’’తో నిలిపివేయగలిగేటంత తలబిరుసుతనంతో. అమెరికన్ కాంగ్రెస్  సభ్యులు కాలహరణం ద్వారా బిల్లులను అడ్డగిస్తుంటారు. మన దేశంలో ఎంపీలు సభ వెల్‌లోకి దుముకుతారు, ఏదిబడితే అది ఒకరు మరొక రిపైకి విసురుకుంటారు, ఒక్కో సారి స్పీకర్‌పైకీ విసురుతారు. అధికారంలో ఉండగా పార్టీలు బిల్లులను ప్రతి పాదిస్తాయి, కోల్పోయిన మరుక్షణమే వాటిని వ్యతిరేకిస్తాయి. అదే పని ఆవలి పక్షమూ పునరావృతం చేస్తుంది. సంపాదకీయ వ్యాఖ్యలు రాసేవారు ఇది కపటత్వమని అంటూనే ఉంటారు. ప్రజలు తమ ప్రతినిధులపై విశ్వాసం కోల్పోతూనే ఉంటారు. అంతే తప్ప పార్టీల్లో మాత్రం ఎలాంటి కదలికా రాదు.

 

పిరాయింపుల చట్టాన్ని తిరగరాయాల్సిందే

మన పార్లమెంటే అయితే, బ్రిటన్ పార్లమెంటులో సిరియాపై జరిగినలాంటి చర్చతో ఎలా వ్యవహరించి ఉండేదనేదే అందుకు ఉదాహరణ. తీర్మానంపై సంక్షోభం నెలకొనడానికి కారకులుగా ఒకరి నొకరు తప్పుపట్టుకునేవారు.  ప్రతిపక్షం ఆ తీర్మానాన్ని అడ్డగించదలుచుకోక పోయినా, బహుశా వాకవుట్ చేసి ఉండేది. అందువలన, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తాజాగా తిరిగి పరిశీలించాల్సిన సమయమిది. ఫిరాయింపుల చట్టం భయం లేకుండా ముఖ్య సమస్యలపైనైనా సభ్యులు మాట్లాడటాన్ని, ఓట్ చేయడాన్ని- కనీసం కొన్ని సమస్యలపైనైనా- పార్టీలు అనుమతిస్తే పార్లమెంటు మరింత మెరుగైనదిగానూ, మరింత ఉత్పాదకమైనదిగానే మారుతుంది.

 

అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడటం భారత రాజకీయాలకే అత్యంత అవమానకరం. పార్లమెంటులో అలాంటి మార్పు వస్తే, అది మన రాజకీయాల్లో కూడా మార్పును తీసుకురాగలుగుతుంది. వర్కింగ్ కమిటీలు సహా పార్టీ సంస్థాగత నిర్మాణాలనన్నిటినీ కాంగ్రెస్ ధ్వంసం చేసేసింది. నామినేటెడ్ సభ్యులతో నిండిపోయిన వర్కింగ్ కమిటీలు ఎప్పుడో గానీ సమావేశం కావు. నూతన నాయకత్వం కింద బీజేపీ సైతం అదే బాటలో సాగుతోంది. సీపీఎంను మినహాయిస్తే చాలా పార్టీలు నేడు వంశపారంపర్య పాలనలోని రాజకీయ మాఫీయాల సొంత ఆస్తులుగా ఉన్నాయి. నేడు అమలులో ఉన్న రీతిలోని పార్టీ ఫిరాయింపుల చట్టం వారికి చుట్టంగా ఉంది. ఆ పరిస్థితి మారాలి. అప్పుడే బెన్ లాంటి కొందరు సూత్రబద్ధులైన నేతలు తమ పక్షాన్ని వీడి, తమ పార్టీ నేతను ధిక్కరించి మరీ తమ వైఖరిని స్పష్టం చేయడం చూడగలుగుతాం.

 

 - శేఖర్ గుప్తా

 

twitter@shekargupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement