ఇస్లాంకు అసలు సవాలు ఇదే | real test to Islam by Shekhar gupta | Sakshi
Sakshi News home page

ఇస్లాంకు అసలు సవాలు ఇదే

Published Sat, Jul 9 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM

ఇస్లాంకు అసలు సవాలు ఇదే

ఇస్లాంకు అసలు సవాలు ఇదే

జాతిహితం

 

యువ ముస్లిం వృత్తి విద్యావంతులు గూగుల్ నుంచి, ఆధునిక టీవీ మతప్రబోధకుల నుంచి తమ మత ధర్మాన్ని గురించి నేర్చుకోవడం అనే అతి పెద్ద సమస్యతో ఎలా వ్యవహరిం చాలి? జకీర్ నాయక్ వంటి వారు ప్రచారం చేస్తున్న ముస్లింలు బాధితులుగా ఉంటున్నారనే కథనం వారి మనసులను ముంచెత్తుతోంది. ఈ సమస్య ఇక్కడ మన దేశంలోనే ఇంత జటిలంగా ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని పరిస్థితిని మీరే ఊహించుకోవచ్చు. దాదాపు 50 కోట్ల లేదా ప్రపంచ ముస్లిం జనాభాలో 40 శాతం మనసులపై ఈ దాడి జరుగుతోంది.

 

 

సుప్రసిద్ధ పాకిస్తానీ వ్యాఖ్యాత ఖలీద్ అహ్మద్ చెప్పేంత వరకు (1984) జకీర్ నాయక్ అనే వ్యక్తి ఉన్నట్టే నాకు తెలియదు. నా మొట్టమొదట పాకిస్తానీ మిత్రుడు కూడా అయిన ఖలీద్... ఆయనను నేను ఎరుగనని తెలిసి ఆశ్చర్య పోయాడు. 2009లో జరిగిన ఒక సమాంతర సమావేశం లాంటి సంభా షణలో, జకీర్ నాయక్ ఉపఖండంలోనేగాక ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఇస్లామిక్ టెలీ-మత ప్రబోధకునిగా వృద్ధి చెందుతున్నట్టు ఖలీద్ చెప్పారు. జకీర్ ప్రవచనాలు చాలా వరకు  ఇంగ్లిషులో సాగడం కూడా అందుకు కారణం. అప్పటికీ నాకు ‘పీస్ టీవీ’ అనేది ఒకటున్నదని తెలియనందుకూ అతను ఆశ్చర్యపోయాడు. ‘‘అది కూడా తెలుసుకోవయ్యా బాబూ, మన మంతా ముందు ముందు అతని గురించి ఇంకా చాలా ఎక్కువ వినాల్సి ఉంటుంది’’ అన్నారు. నైపుణ్యంతో కూడిన ఆయన భాషా పటిమకు, మిత వాద అంధ విశ్వాసాన్ని హేతుబద్ధతీకరించడానికి మంత్ర ముగ్దుడనైపోయా నని ఖలీద్ అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం అందరిలాగే నేనూ ‘‘హజరత్ (గౌరవనీయులైన) గూగుల్’’కు వెళ్లాను (ఈ పద ప్రయోగం నాది కాదు వేరొకరిది). జకీర్ గురించి చదవడం, ఆయన టీవీ ప్రవచనాల రికార్డింగులను చూడటం ప్రారంభించాను. ఇంగ్లిషు వైద్యుడైన జకీర్ టెలీ-మత ప్రబోధకునిగా మారి... సౌదీ తరహా మితవాద ఇస్లాంకు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన, వాక్పటిమగలిగిన, శక్తివంతమైన ప్రతినిధిగా అవతరించారు.

 

రాక్-స్టార్ మతప్రబోధకుడు

ఆయన భాష, దరహాస వదనంతో కూడిన నడవడిక, ఖురాను, భగవ ద్గీత, ఉపనిషత్తులు, బైబిల్ నుంచి అధ్యాయాలను, శ్లోకాలను అప్పటికప్పుడు అనర్గళంగా ఉల్లేఖించడం, క్రైస్తవులు, హిందువులు, నాస్తికులు సహా తన సమావేశాలకు హాజరైనవారు ఎవరు అడిగే ఏ ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి సుముఖంగా ఉండే వైఖరి అతనిని మౌలానా మూసపోతకు భిన్నంగా నిలుపుతుంది. నిజానికి ఆయన వారికి పూర్తిగా విరుద్ధం. సూటు, టై ధరించి, చక్కగా ఆలోచించి కూర్చిన ఇంగ్లిషు వాక్యాలను వేగంగా మాట్లాడతారు. ఆయన నడవడిక అంతటిలోకీ పలుచటి గడ్డం, మాడు మీది టోపీలే ఎక్కువగా ఆయన భక్తితత్పరుడైన ముస్లిం అని తెలుపుతాయి. నా సహచరులు కొందరి ద్వారా నేను ఆయనకు సంబంధించిన వారిని సంప్రదిం చాను. 2009 మార్చిలో ఆ ఇంటర్వ్యూ జరిగింది.

 

జకీర్ నాయక్‌కు ఏ అధికారికమైన లేదా మతపరమైన బిరుదూ లేదు. కెమెరా ముందు తనను మౌల్వీ లేదా మౌలానాగా అభివర్ణించడానికి ఆయన అభ్యంతరం తెలిపారు. టెలీ-మతప్రబోధక రాక్-స్టార్‌గా వర్ణించడానికి  అభ్యంతరం లేకపోవడమే కాదు, మహా ఆనందంగా అంగీకరించారు. ‘ఆస్తా’ చానల్‌లో ఎంతో ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కనిపించే చాలా మంది మత బోధకులు ఆయనకున్న టీవీ స్టార్ నైజాన్ని చూసి అసూయ చెందు తారు. ఆయన సంభాషణ చాలా వరకు ఘర్షణాత్మకమైనది కాదు. అత్యంత స్నేహపూర్వకమైన స్వరంతో మాట్లాడారు. భారత రాజ్యాంగంలో, న్యాయ వ్యవస్థలో తనకు పూర్తి విశ్వాసం ఉన్నదని అంటుంటే ఇక వాదించడానికి ఏం మిగిలి ఉంటుంది. దేశవిభజన విషయంలో ఆయన వైఖరి ఆర్‌ఎస్‌ఎస్ వైఖ రికి భిన్నమైనదేం కాదు. అది, భారతదేశమనే దేశంగా ఉపఖండానికి గొప్ప విషాదం. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ‘‘క్రీడల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు ప్రపంచ శక్తి’’గా ఎదిగి ఉండేవి అన్నారాయన. ముస్లింలలో చాలా మందికి ఎన్నడూ విభజన అవసరమే లేదు లేదా కోరలేదు, పాకిస్తాన్ ఉద్యమానికి నేతృత్వం వహించినవారిలో పలువురు

 

‘‘మతానుయాయులైన ముస్లింలు కూడా కారు.’’ అయితే అర్‌ఎస్‌ఎస్‌కు భిన్నంగా ఆయన ఈ అంశాన్ని ముస్లింల ప్రయోజనాల కోణం నుంచి చూశారు. మితవాద ముస్లింలు జమాత్ ఏ ఇస్లామీ నేతృత్వంలో సాగిన దేశ విభజనను వ్యతిరేకించడానికి నేపథ్యం ఉంది. అయితే నేటి చర్చలో భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, జాతీయవాదం, దేశవిభజనలపై ఆయన వైఖరి చాలా మంది పాకిస్తానీలకు మాత్రమే చికాకు కలిగిస్తుంది.

 కశ్మీర్‌పై జకీర్ అభిప్రాయాన్ని ఆయనను ద్వేషించేవారు, మహా దుర్మా ర్గునిగా చిత్రీకరించేవారిలో అత్యధికులు సైతం కొంత అయిష్టంగానైనా అంగీ కరిస్తారు. భారత్, పాకిస్తాన్‌లు రెండింటి పట్ల కశ్మీరీలు విసిగిపోయారు. స్వేచ్ఛగా ఓటింగ్‌ను నిర్వహిస్తే ఒంటరిగా వదిలేయమనే వారు కోరుకుం టారు. కానీ అది వారికి ఒక అవకాశంగా ఇవ్వజూపుతున్నది కాదు. కాబట్టి విద్య, ఉపాధులను మెరుగుపరచి, తన వైపు నుంచి శాంతిని నెలకొల్పి, సాధారణ పరిస్థితిని తీసుకురాగలగాలి అని ఆయన అభిప్రాయం.

 

అతి సౌమ్యుని అతి ప్రమాదకర పార్శ్వం

ఇక క్లిష్టమైన అంశాలకు వచ్చేసరికి సమస్యలు తలెత్తాయి. 26/11ను, 9/11ను సైతం ఆయన స్వేచ్ఛగా ఖండిస్తారు. కాకపోతే ‘‘జంట టవర్లను ధ్వంసం చేసిన వ్యక్తి మతధర్మాన్ని పాటించే ముస్లిం కాడు, అతన్ని ఖండిం చాల్సిందే...’’ నేనెప్పుడూ ప్రయాణిస్తూ ఉంటాను కాబట్టి నాకు 9/11 డాక్యు మెంటరీల నుంచి సమాచారం లభించింది. దాన్ని బట్టి జార్జ్ బుష్ స్వయంగా చేసిన, లోపలి వారి పనేనని తెలుస్తోంది... ఈ ఆధారాలు ఒసామా బిన్ లాడెన్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలకంటే చాలా మెరుగైనవి’’ అంటారు. ముస్లింల మస్తిష్కాలపై ఆయన పట్టు పెరుగుతుండటాన్ని గుర్తించి ‘ఇండి యన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక జాగ్రత్తగా ఎంపిక చేసిన 2010 వార్షిక శక్తివంతుల జాబితాలో జకీర్ పేరును చేర్చింది.

 

అయితే ఆయన ప్రయోగించే లాడెన్ తరహా సందిగ్ధ అభిభాషణా ధోరణి ఆయనలో ఉన్న తప్పుడు, ప్రమాదకరమైన అంశాన్ని నొక్కిచెబు తుంది. భార్యను ‘‘ఇస్లామిక్’’ పద్ధతిలో ‘‘ఏదో టూత్ బ్రష్‌తో కొట్టినట్టుగా మెల్లగా కొట్టడం’’ లేదా విశాలమైన అలంకారాలతో కూడిన ముస్లిం సమాధు లను ఇస్లాంకు విరుద్ధమైనవిగా ప్రకటించడం వంటి మూర్ఖత్వాలను ఆయన పదేపదే సమర్థిస్తుంటారు. ప్రతి మూడు వాక్యాలకు ఒకసారి ఒక సూక్తిని ఉల్లేఖించే జకీర్ ఉపన్యాస శైలి ఇస్లాం పట్ల లోతైన మితవాద, మతశాస్త్రవాద దృష్టికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆయన పద్ధతి చూడటానికి భయపెట్టని దిగా, స్నేహపూర్వకమైనదిగా కనిపిస్తుంది. కానీ నిజంగానే తెలుసుకోగోరే, అమాయక మనసులతో ఆడుకోగలగడం ప్రమాదకరం. తోటి మనుషులకు లేదా రాజ్యానికి వ్యతిరేకంగా హింసను ప్రయోగించమని ఆయన ఎన్నడైనా సూచిస్తారని నేను విశ్వసించను. అయితే ఆయన ఐఎస్‌ఐఎస్‌ను కచ్చితంగా ‘‘ఇస్లామ్ వ్యతిరేక కుట్ర’’గా ఖండిస్తారు.

 

ఇస్లాంకు ఆయన చెప్పే ఛాందస వాద వ్యాఖ్యానాలు.. అమాయక, యువ ముస్లింల మనసులు మరింత తీవ్ర పద్ధతులను అనుసరించడానికి సమంజసత్వాన్ని కలుగ జేసేట్టుగా విస్తరింప జేయగలుగుతాయి. బంగ్లాదేశీ ఉగ్రవాదులలో కొందరు ఆయన అనుయా యులు అయినందుకు నేను ఆశ్చర్యపోను. కొత్త, యువ ముస్లిం ఉగ్రవా దులు, ప్రత్యేకించి ఐఎస్‌ఐఎస్‌కు చెందినవారు బాగా చదువుకున్నవారు, సంపన్న కుటుంబాలకు చెందినవారు, ఇంగ్లిష్ మాట్లాడేవారుగా ఉంటున్నా రెందుకు? అనే ప్రశ్న ఈ రోజుల్లో తరచుగా ఎదురవుతోంది. క్లుప్తంగా చెప్పా లంటే కొత్త ముస్లిం ఉగ్రవాది, పాత పేద, నిరక్షరాస్యుడైన అజ్మల్ కసబ్ తరహా ఉగ్రవాద మూసపోతకు భిన్నంగా ఉంటున్నాడెందుకు? దీనికి సమా ధానం బహుశా హిందూ మితవాదులు ద్వేషించడానికి ఇష్టపడే మరో వ్యక్తి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీవద్ద ఉండవచ్చు.

 

ఓవైసీ లేవనెత్తిన అసలు సమస్య

ఆయన నన్ను ఒకసారి హైదరాబాద్‌లోని పాత బస్తీలోకి కార్లో తీసుకు పోయారు. ఆ ప్రాంతాన్ని ఆయన, ఆయన కుటుంబం దశాబ్దాలుగా నియం త్రిస్తోంది. ఒవైసీ నాకు తను నడుపుతున్న విద్యాసంస్థలను చూపించారు. ఆయన విద్యాసంస్థలోని ఎమ్‌బీబీఎస్ క్లాస్‌లో ఆడపిల్లలు/మగపిల్లల నిష్పత్తి 70:30గా ఉండటం చూసి సంతోషంతో నివ్వెరపోయాను. సోషల్ మీడి యాలో ఆ ఫొటోలను కొన్నిటిని పోస్ట్ చేశాను. వారంతా హిజబ్ (బురఖా) ధరించి ఉన్నారనే ఫిర్యాదుతో నన్ను తిట్టి పోస్తూ ఓ పెద్ద దుమారమే రేగింది. ‘‘ఈ ఆడపిల్లలు మెడికల్ కాలేజీకి వెళ్లాలా లేక మదారసాకు వెళ్లాలా? అని మిమ్మల్ని తిట్టిపోసే వాళ్లను ఆడగండి’’ అన్నారాయన.

 

ఆ తర్వాత ఆయన కొద్దిసేపు ఆగి ‘‘బహుశా ఈ యువ ముస్లింలు మదా రసాకు కూడా వెళ్లి ఉంటేనే బాగుండేదేమో. ఇస్లాం అర్థాన్ని, సూత్రాలను, జిహాద్‌ను సైతం ఒక మౌల్వీ అయితే చెబుతారు’’ అన్నారు. ఈ యువ ముస్లింలు ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంబీఏలు అవుతారుగానీ వారికి తమ మతంగురించి తెలియదు. తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. కాబట్టి  ‘‘హజరత్ గూగుల్’’ తప్ప వారు ఎక్కడకు వెళ్లగలుగుతారు? ఒక యువ ముస్లిం గూగుల్‌లో జిహాద్ అని కొడితే ‘‘బహుశా మొహ్మద్ హఫీజ్ సయీద్, అతని జమా ఉద్ దవానే  మొట్టమొదట కనబడొచ్చు’’ అంతకంటే మదా రసాకు వెళ్లడమే మంచిది అన్నారు ఒవైసీ.  నేడు ఇస్లాం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఇదే అన్నారు. ఆయనకు ఐఎస్‌ఐఎస్ అంటే  అసహ్యం, పాత బస్తీలో దానికి వ్యతిరేకంగా హోర్డింగ్‌లను పెట్టించారు.

 

ఒవైసీ చెబుతున్న మరింత పెద్ద, ప్రబలమైన సమస్య కూడా మీకు ఇప్పుడు కనబడుతుంది. యువ ముస్లిం వృత్తి విద్యావంతులు గూగుల్ నుంచి, ఆధునిక టెలివిజన్ మత ప్రబోధకుల నుంచి తమ మత ధర్మాన్ని గురించి నేర్చుకోవడం అనే సమస్యతో ఎలా వ్యవహరించాలి? జకీర్ నాయక్ వంటి వారి ప్రబోధాలు వారి వారి మనస్సులను ముంచెత్తుతున్నాయి. వారు ప్రచారం చేస్తున్న ముస్లింలు బాధితులుగా ఉంటున్నారనే కథనం విశ్వసించ దగినదిగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులు సహా కొందరు లౌకికవాదు లుగా చెప్పుకునేవారు- కేవలం దిగ్విజయ్‌సింగ్ మాత్రమేకాదు - ఇషత్ ్రజహాన్ కేసు నుంచి బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ వరకు ప్రతిదాన్ని ముస్లింలను బాధించడంగానే చూపుతూ ఆ బాధిత కథనానికి ఆజ్యాన్ని పోస్తుంటారు. ఈ సమస్య ఇక్కడ మన దేశంలోనే ఇంత జటిలంగా ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోని పరిస్థితిని మీరే ఊహించుకోవచ్చు. దాదాపు 50 కోట్ల లేదా ప్రపంచ ముస్లిం జనాభాలో 40 శాతం మనసులపై జరుగుతున్న దాడి ఇది.

 

http://www.afaqs.com/all/news/images/news_story_grfx/2014/06/41021/Shekhar-Gupta.jpg- శేఖర్ గుప్తా

twitter@shekargupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement