అసంబద్ధ క్రీడ అరాచకపు జాడ | shekhsr gupta writes on sutlej yamuna link canal dispute | Sakshi
Sakshi News home page

అసంబద్ధ క్రీడ అరాచకపు జాడ

Published Sat, Mar 19 2016 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

అసంబద్ధ క్రీడ అరాచకపు జాడ

అసంబద్ధ క్రీడ అరాచకపు జాడ

జాతిహితం
 
మనకు పరిచయం లేని సట్లేజ్-యమునా లింక్ లేదా ఎస్‌వైఎల్ కాలువపై దృష్టిని కేంద్రీకరించడం మనకు కష్టమే ఆ మాటకొస్తే, లోక్‌సభకు 23 మంది ఎంపీలను మాత్రమే పంపుతున్న పంజాబ్, హరియాణాల మధ్య రేగుతున్న సంఘర్షణపైన దృష్టి పెట్టడమూ కష్టమే. అదీ కూడా కోల్‌కతాలో క్రికెట్ దిగ్గజాల పోరు సాగనుండగా అది పట్టించుకోవడం ఎలా? వార్తా చానళ్ల ప్రైమ్ టైమ్ అంతా దానితోనే నిండిపోతుంది. ఇంకా ఏమైనా కాస్త సమయం మిగిలితే అది, భారత్ మాతా కీ జై... తదితరాలకు సరిపోతుంది. కాబట్టి సట్ల్లేజ్-యమునా లింక్ గురించి పట్టించుకోవడం కష్టమే. కాస్త సంచలనాత్మ కతను ప్రదర్శించే ప్రయత్నం నేనూ చేస్తా. కాబట్టి హరియాణా, పంజాబ్, సట్లేజ్‌లనూ, శ్రీ శ్రీ అక్కడి నుంచి వెళ్లిపోయారు కాబట్టి యముననూ మరిచి పోండి. కానీ పటాన్‌కోట్ గురించి ఆలోచించండి.

మీ కళ్లను పటాన్‌కోట్‌కు ఉత్తరంగా పది మైళ్ల దూరాన మొదలయ్యే జమ్మూ-కశ్మీర్‌పైకి మరల్చండి. ఇప్పుడిక ఇలా ఊహించుకోండి... ఆ రాష్ట్ర శాసనసభ ఇప్పుడు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ చట్టం చేయబోతున్నది. ఇక మరింత దేశీయమైన విషయాల కొస్తే అది ఆ రాష్ట్రంలో భారత రైల్వేలు రైలు లైన ్లను నిర్మించడానికి అనుమతిని ఉపసంహరిస్తోంది. తమ రాష్ట్రం నుంచి భారత సైన్యం సైనిక చర్యలు చేపట్టడంపై నిషేధం విధిస్తోంది లేదా ఇంకా సరళమైన విషయాలకు వస్తే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని విధించడం చట్టవిరుద్ధమైనదని ప్రకటించనుంది అని కూడా అనుకోండి. అప్పుడిక, మనలో కొందరం నేరుగా ఇంటి కప్పెక్కి , టీవీ స్టూడియోల కోసం తెల్లబడ్డ మీసాలను మెరిపిస్తూ ద్రోహం అని గావు కేకలు వేస్తాం. మరికొందరం ఆయుధాగారాలకు వెళ్లి రైఫిళ్లను లోడ్ చేసుకుంటాం. మిగతా వాళ్లం... చూడండి, మేం ఇలాగవుతుందని చెప్పలేదా? అంటాం. కశ్మీరీల నుంచి మీరు ఆశించగలిగేది ఏముంటుంది? తక్షణమే ఆ దిక్కు మాలిన ఆర్టికల్ 370ని రద్దు చేయండి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయండి అంటాం.

నీళ్లు లేవంటే లేవంతే
ఇదంతా సంచలనాత్మకతే, ఒప్పుకుంటున్నా. అందుకే ఈ కాల్పనికతకు ఇన్ని క్షమాపణా పూర్వకమైన జాగ్రత్తలు. ఇక మీరు మీ దృష్టిని తిరిగి పటాన్‌కోట్‌కు, అది భాగంగా ఉన్న పంజాబ్ మీదకు మరల్చండి. ఆ రాష్ట్రం, తన పొరుగున ఉన్న సోదర రాష్ట్రమైన హరియాణాతో ఉన్న కీలకమైన నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసేస్తూ తాజాగా ఓ చట్టాన్ని ఆమోదించింది. పాతికేళ్లకు పైగా పూర్వం, సట్లేజ్ నదీ జలాల్లోని హరియాణా వాటా నీటిని తరలించడం కోసం  213 కిలో మీటర్ల పొడవు కాలువ తవ్వడం కోసం సేకరించిన రైతుల భూములను వారికి తిరిగి ఇచ్చేస్తున్నామని వారికి తెలిపింది. నమ్మశక్యం కానంతటి ఈ రాజ్యాంగపరమైన అరాచకత్వాన్ని గురించి ఒకే ఒక్క వార్తా పత్రిక ‘ద ట్రిబ్యూన్’ మాత్రమే మనల్ని ముందస్తుగా హెచ్చరించింది.

ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తున్నట్టు చేసిన ఈ కొత్త చట్టంపై పంజాబ్ గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి ఇంకా సంతకం చేయలేదనే వాస్తవం ఎవరికి పట్టింది? ఆ కాలువను పూడ్చేయడం కోసం వేలాది చెట్లను, శిథిలాలను, మట్టిని పోయడం కోసం జేసీబీలను, బుల్‌డోజర్లను నియ మించారు. మొత్తం దేశం, వ్యవస్థలు అదేదో ముందస్తు నిర్ణయమన్నట్టుగా మిన్నకున్నాయి. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించిన సుప్రీం కోర్టుకు... ఎవరికి ఇవ్వడానికీ మా దగ్గర నీళ్లు లేవని పంజాబ్ తెగేసి చెప్పేసింది.

ఇప్పటికే ఇది పూర్తి అసంబద్ధత అనుకుంటుంటే, పంజాబ్, హరియాణా రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉన్న గౌరవనీయులైన సోలంకి రెండు రాష్ట్ర శాసనసభలను ఉద్దేశిస్తూ విడి విడిగా ప్రసంగించారు. హరియాణాకు మనం నీరిచ్చే సమస్యే లేదని   పంజాబ్ శాసనసభలో  చెప్పి, ఇలాంటి అన్యాయాన్ని ఎంత మాత్రం సహించేది లేదు అని హరియాణాలో చెప్పారు. అయితే ఈ అసంబద్ధతతో ముగిసిపోలేదు. హరియాణా, పంజాబ్‌లు రెండూ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ దాని నాయక భాగస్వామి.

ఊహాత్మక సమస్యలతోనే తలమునకలు
రెండు బీజేపీ రాష్ట్రాలు నదీ జలాల గురించి ముష్టి ఘాతాల పోరును ప్రారంభిస్తుంటే, ప్రతి ఒక్కరూ ఈ ప్రహసనంలోకి  వచ్చి చేరుతున్నారు. హరియాణాలో, కాంగ్రెస్, చౌతాలా పార్టీ తమ రాష్ట్ర హక్కుల కోసం పోరాటంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నాయి. ఇక పంజాబ్‌లో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ అరాచకత్వానికి పూర్తి మద్దతునిస్తోంది. ఇక గోవు కంటే పవిత్రమైనదైన ఆమ్ ఆద్మీ  పార్టీ కూడా రంగంలోకి దూకింది. హరియాణాకు పంజాబ్ తన నీరు ఇవ్వరాదని కేజ్రీవాల్ అంటున్నారు. పంజాబ్‌తో ఆప్ సార్వత్రిక  అనుబంధాన్ని పెంచుకుంటున్నందున, అటు బాదల్లు, అమరిందర్‌లు ఓటర్లకు కేజ్రీవాల్ హరియాణా వాడని, మీ నీటిని దొంగిలించడానికి వచ్చాడని చెబుతున్నారు.

ఇక హరియాణాలో ప్రభుత్వం జాట్ల నుంచి దాక్కునే ప్రయత్నంలో, గో రక్షణలో (ఏ ఆవుకు హాని తలపెట్టడానికైనా ఎన్నడూ ఎవరూ సాహసించని రాష్ట్రంలో), సరస్వతీ నదిని తిరిగి కనిపెట్టడంలో తలమునకలై ఉంది. ఈ లోగా సట్లేజ్-యమునా లింక్ కెనాల్ అంతరించిపోయి, ఆ తర్వాత బహుశా త్వరలోనే యమునా నదీ అంతరించిపోతుంది. ఈ రాజ్యాంగపరమైన అసంబద్ధతను పరిపూర్ణం చేయ డానికి చేయాల్సిందిక ఒక్కటే. చెట్లను కొట్టేయవద్దని పంజాబ్ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)ఆదేశించడం. దానికీ సుప్రీం కోర్టుకు చెప్పిన సమాధానమే ఎదురవుతుంది. మాకు అసలు నీళ్లే మిగలలేదు కాబట్టి పరిరక్షించడానికి మాకు చెట్లే లేవు. శ్రీ శ్రీ కేసు నొక్కి చెప్పినట్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ తనకు ఇంకా బకాయిపడి ఉన్న ఆ రూ. 4.75 కోట్ల జరిమానాను రాబట్టుకోవడానికి ప్రయత్నించడమే ఉత్తమం.

దీన్నే ఇంగ్లిషులో మంత్రగత్తె మాయలమారి పులుసు అంటారు. పురుగులు లేదా కుక్కల ఫలహారం సహా అందులో ఏమైనా ఉండొచ్చు. ఢిల్లీలో పెరిగిపోతున్న భారీ చెత్తుకుప్పల్లో పడి  కుక్కలు తినే తిండి సైతం అంతకంటే మెరుగ్గా ఉంటుంది. పాకిస్తాన్‌తో, ఆర్థిక వ్యవస్థతో సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం తలమునకలై ఉండగా, అన్ని రకాల కొత్త ఆనవాయితీలు ఏర్పడుతున్నాయి.  ఈ విషయాలన్నిటితో వ్యవహరించాల్సిన కేంద్రం హోం మంత్రిత్వ శాఖ. అది,‘‘హఫీజ్ సయాద్ మద్దతున్న జేఎన్‌యూ తిరుగుబాటు’’ నుంచి  గుజరాత్‌లోని సోమనాథ్ దేవాలయాన్ని బాంబులతో పేల్చేయనున్న భీకరమైన పాకిస్తాన్ ‘‘ఉగ్రవాదులు’’ ఐఎస్‌ఐ ఇచ్చే టిఏ/డిఏ సరిపోక ఒక ఏటీఎమ్‌ను దోచుకుంటూ పట్టుబడటం వరకూ  ఏ రోజు కా రోజు ఊహాత్మకమైన కొత్త సమస్యలతో  పోరాడటంపై మొగ్గు చూపుతోంది.
నేను సంచలనాత్మకతకు పాల్పడుతున్నానని ఆరోపించకండి. మనం పటాన్‌కోట్ గురించి ప్రస్తావించినప్పటి నుంచి నేను చెబుతున్నవన్నీ వాస్తవాలు, నడుస్తున్న చరిత్ర, రాజ్యాంగపరమైన ద్రోహం,  అరాచకత్వం, గందరగోళం.

చరిత్రలోనే హేయమైన వివాదం
ఆసక్తికరమైన కొత్త ఆనవాయితీలను ఏర్పరుస్తున్నారు. కాకాపోతే ఇక అవసరమైనదంతా ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లు, హిమాచల్‌ప్రదేశ్ కూడా ఎందుకు కాకూడదు? తమ శాసనసభలను సమావేశపరచి వాటి జల పంపకం ఒప్పందాలను రద్దు చేయడమే. అదీ.. ఇవ్వడానికి మా వద్ద నీరే లేదు అనే చిన్న వాస్తవంతో ఆ పని చేసేయడమే. ఇలా చేయలేని ఏకైక ఎగువ రాష్ట్రం పాపం అరుణాచల్‌ప్రదేశ్ ఒక్కటే. బ్రహ్మపుత్ర, దాని ఉపన దులు అక్కడ మరీ ఉధృతంగా ప్రవహరిస్తుంటాయి. కాబట్టి టిబెట్‌లో ఆ పని ముగించేయమని చైనాకు కాస్త ఉప్పందిస్తే చాలు. మరో సంగతి, పంజాబ్‌లోని సట్లేజ్ నది కూడా పుట్టేది అక్కడే.

ఈ కాలం భారత నదీ జలాల చరిత్రలోనే అత్యంత అసహ్యకరమైన వివాదం చరిత్రను గుర్తుకు తెచ్చుకోవడంతో ప్రారంభించాం. కానీ ఎంతగా కుదించినా అదే ఈ పేజీని మొత్తాన్ని మింగేసి 2004 వరకే  చేరుతుంది. కాబట్టి మీరు  చండీగడ్ కేంద్రంగా పనిచేసే నా మిత్రుడు, విపిన్ ప్రభు ‘డైలీ ఓ’ వెబ్ వార్తా పత్రికలో ఈ విషయమై సవివరంగా  రాసిన వ్యాసాన్ని చూడమని సూచిస్తున్నాను. అది  ఎస్‌వైఎల్ చరిత్రలో పది ప్రధాన మలుపులను పేర్కొంది. 1978లో ప్రారంభమైన భూసేకరణ సమయంలో అకాలీలు పంజాబ్‌లో, జనతా పార్టీ (జనసంఘ్ అప్పుడు దాన్లోనే ఉంది) డిల్లీలో  అధికారంలోఉన్నారు. ఇదే ప్రకాశ్‌సింగ్ బాదల్ అప్పుడూ ముఖ్యమంత్రిగా ఉన్నారు.  1981లో పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఢిల్లీలో కుదిరింది. దానికి 1982లో ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. అమరేందర్ సింగ్ దాన్ని గొప్ప ముందడుగని ప్రశంసించారు.

1985 నాటి రాజీవ్-లాంగోవాల్ ఒప్పందం దాన్ని తిరిగి ధృవీకరించింది. అయితే 2004లో, అమరేందర్, రాజ్యాంగ ధిక్కారపు తొలి అడుగువేసి ఆ చట్టాన్ని (వ్యంగ్యం కాదు నిజమే) తప్పించుకుంటూ దొడ్డిదారిన పంజాబ్ ఒప్పందాల రద్దు చ ట్టాన్ని చేశారు. ఆయన అధికారాన్ని కోల్పోయినా, అది ఏకగ్రీవంగా ఆమోదంపొందింది. ఆకాలీలు సైతం ఆయనను తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి అదే పని చేశారు. అన్నిటికి మించి ఈ చట్టాన్ని రాష్ట్రపతి సుప్రీం కోర్టు అభిప్రాయం కోసం పంపడం ఇప్పటికి గాని జరగ లేదు. అదీ 12 ఏళ్ల తర్వాత, సరిగ్గా పంజాబ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుండగా చేశారు.

సిగ్గుచేటైనా ఈ చరిత్రలో మరో మైలు రాయిని కూడా ఉదహరించాల్సి ఉంది.  ప్రతి ఒక్కరూ ఆ కాలువ, నిర్మాణం సాగుతుందనే విషయంపై  ఏకాభిప్రాయంతో ఉన్నప్పుడు కూడా, ఆ విషయంపై ఉగ్రవాదులు సైతం నోరు మెదపలేదు. 1990లో వాళ్లు ఆ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌ను, అతని సహాయకుడిని మరో 35 మంది కార్మికులను పనులు జరుగుతున్న చోటనే చంపేసి దాన్ని అడ్డుకోగలిగారు. అకాలీదళ్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఇప్పుడు ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరింది.
 
- శేఖర్ గుప్తా
twitter@shekargupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement