దిద్దుబాటుకు సిద్ధపడతారా?
జాతిహితం
మోదీ పదవీ కాలంలోని ద్వితీయార్థ భాగం మొదలుకు కొంత ముందుగా జరిగిన ఈ ఎన్నికలు బీజేపీకి చెప్పుకోదగ్గ విరామాన్ని కల్పిస్తాయి. తదుపరి శాసనసభ ఎన్నికలు ఇంకా ఏడాది దూరంలో ఉన్నాయి. మోదీ ప్రభుత్వం ఈ విరామాన్ని తమ పరిపాలనపై దృష్టిని కేంద్రీకరించడానికి, సరిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ ఎన్నికల వల్ల తిరిగి నెలకొన్న ఆత్మవిశ్వాసాన్ని అది తన దిశను సరిచేసుకోడానికి వినియోగించుకోవాలి. నిరంతర పోరాటం నుంచి వైదొలగి పార్లమెంటు, పరిపాలనలపైకి దృష్టిని మరల్చాలి.
ఇటీవలి ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఉన్న కీలకమైన తేడాను నొక్కిచెప్పాయి. ఒక పార్టీ చేసిన తప్పుల నుంచి నేర్చుకోడానికి సిద్ధపడే దైతే, మరొక పార్టీ తన విజయాల నుంచి సైతం నేర్చుకోడానికి ఇష్టపడని బాపతు. బిహార్‌లో బీజేపీ, ఆ రాష్ట్రానికి నాయకత్వశక్తిగా ఓటర్లకు కనిపిం చడానికి ప్రయత్నించలేదు. పైగా దాని ప్రచారం మరీ చీల్చిచెండాడేట్టుగా, విభజనాత్మకంగా సాగింది. అసోంలో అది ఆ రెండు ధోరణులనూ వదిలే సింది. ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి సొంత స్థానిక నేతలు ఉండటమే కాదు, ఓటర్లలో దాదాపు 34 శాతం ముస్లింలు. కాబట్టి దూకుడుగా మతపరమైన కేంద్రీకరణ కోసం తహతహలాడకుండా అది నిగ్రహం చూపింది. బీజేపీ, బిహార్‌లోని తన ప్రత్యర్థుల నుంచి కలిసికట్టుగా పెద్ద కూటమిని ఏర్పరచా లనే విషయాన్ని నేర్చుకుంది. ఒకే ఓటు బ్యాంకు కోసం తమతో పోటీపడే వారితో సైతం కలవడానికి సిద్ధపడింది (ఏజీపీతో వలే).
మరోవంక కాంగ్రెస్... బద్రుద్దీన్ అజ్మల్‌తో కూటమిని నిర్మించడానికి నితీష్ కుమార్ చేసిన ప్రయత్నాలను తిరస్కరించింది. కూటములు పర స్పర అనుబంధంపై ఆధారపడి పనిచేసేవనీ, అలా అని గణాంకాలను తోసిపుచ్చలేమని మనకు తెలుసు. ఈ వారం వెలువడ్డ ఫలితాల్లో సైతం కాంగ్రెస్‌కు, అజ్మల్ ఏఐయూడీఎఫ్‌కు వచ్చిన మొత్తం ఓట్లు, బీజేపీ కూటమికి వచ్చినవాటికంటే ఎక్కువ! ఫలితం దిగ్భ్రాంతికరమైన బీజేపీ విజయం. దీంతో బిహార్‌లో కోల్పోయిన రాజకీయ ప్రతష్టను అది గణనీ యంగా పునరుద్ధరించుకోగలిగింది. మారగలమని నిరూపించుకున్నారు
కేరళలో బీజేపీ, మమతా బెనర్జీ మార్గాన్ని అనుసరించినట్టనిపిస్తోంది. అక్కడ అది వామపక్షాలకు ప్రధాన భావజాల ప్రత్యర్థి కావాలని ప్రయ త్నించింది. ఒక దశాబ్దికి పైగా బెంగాల్‌లో కాంగ్రెస్ మృదువైన వామపక్ష భావజాలానికి అంటిపెట్టుకుని ఉండగా... మమత వామపక్షాలతో పోరా డారు. తరచుగా అవి హింసాత్మక వీధి పోరాటాలుగా సైతం సాగాయి. పెరుగుతున్న వామపక్ష వ్యతిరేక జనాభా కాంగ్రెస్‌ను గాక ఆమెనే ప్రత్యామ్నాయంగా చూసింది. కేరళలో కాంగ్రెస్ నాయకత్వం వామపక్ష సానుభూతిదారుగా (పింకో-లెఫ్ట్) కొనసాగుతుంటే... బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్ వామపక్షాలకు నిజ మైన ప్రత్యర్థిగా ఎదుగుతోంది.
ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రచారం అంతా సరైన దిశకు మళ్లు తున్నదిగా స్పష్టంగానే కనిపించింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాల పట్ల ప్రధాని కటువైన విమర్శలు చేశారు. కానీ అంతకంటే ముఖ్యమైన విభజ నాత్మక స్వరాన్ని దూరంగా ఉంచారు. ఇక అసోంలో పాకిస్తాన్, గో సంరక్షణలను ప్రస్తావించక పోవడమే కాదు, ముస్లిం వ్యతిరేకతను సైతం ప్రదర్శించలేదు. ‘‘చట్టవిరుద్ధ బంగ్లాదేశీయులు’’ ఉండటాన్ని రాజకీయ సమస్యగా చేసినా, ఎవరినీ బయటకు గెంటేస్తామనే బెదిరింపులు లేవు. ఇప్పటికే వచ్చి స్థిరపడ్డవారిని తిరిగి వెనక్కు పంపేయడమనే యోచన ఆచరణ సాధ్యంకానిదని ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రత్యేకించి హేమంత బిశ్వశర్మ దృఢంగా చెప్పారు.
పశ్చిమబెంగాల్ నుంచి అసోం, కేరళల వరకు పార్టీ స్థానిక, జాతీయ నేతలంతా ఏం తింటారనేదే వ్యక్తిగత ఎంపికకు సంబంధించిన వ్యవహా రమని చెబుతూ ‘గోమాంస’ పరీక్షలో నెగ్గారు. ఆసక్తికరకంగా, ఒక చట్టం ప్రకారం గోవధ సాంకేతికంగా చట్టవిరుద్ధమైనదిగా ఉన్న అసోంలో సైతం ఆ పార్టీ ఇదే పంథాను అనుసరించింది. క్రోడీకరించి చెప్పాలంటే ఈ ఎన్నికలు బీజేపీకి మారగలిగే శక్తీ, తిరిగి తనను తాను మలుచుకోగలిగే సామర్థ్యం ఉన్నాయని తెలిపాయి. భావజాలపరమైన మూర్ఖత్వానికి (ఈ వ్యక్తీకరణను ప్రయోగిస్తున్నందుకు మన్నించాలి) బదులుగా రాజకీయ ఫలిత ప్రయోజన వాదాన్ని తాను అనుసరించగలనని బీజేపీ నిరూపించుకుంది. ఇదే వాస్తవిక వాద దృష్టి పరిపాలన పట్ల బీజేపీ వైఖరిలో కూడా ప్రతిఫలిస్తుందా? అనేదే ఇప్పడు ముందున్న ప్రశ్న.
కాంగ్రెస్ ఇంకా ముప్పుగా కనిపిస్తున్నంత వరకు బీజేపీ పార్లమెంటు లోనూ, పరిపాలనలోనూ సంఘర్షణాత్మక వైఖరిని అవలంబించడం అర్థం చేసుకోగలిగినదే. ‘‘కాంగ్రెస్ ముక్త్ భారత్’’ అనే దాని లక్ష్యం ఇప్పుడు చాలా వరకు నెరవేరింది. కాంగ్రెస్‌తోనూ, దాన్ని శాసించే కుటుంబంతోనూ ఇంత వరకు అనుసరించిన సంఘర్షణను ఇంకా అదే స్థాయిలో కొనసాగించడం కోసం బీజేపీ మూల్యాన్ని చెల్లించనుందా? లేక వాళ్లను కొంతకాలం పాటూ విస్మరించడమే మంచిదని అది అనుకుంటుందా? ప్రశాంత్ కిశోర్ (రాహుల్‌కు సలహాలిస్తున్నారంటున్న నితీశ్ సన్నిహితుడు) ఉన్నా, లేకున్నా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ దానికి పెద్ద సవాలును ఇచ్చేదేమీ కాదు. కాకపోతే పంజాబ్‌లో బీజేపీ ఆప్‌కు తలొగ్గాల్సి రావచ్చు.
విజయంతో లభించిన విరామం
కాంగ్రెస్ తన ఓట్ల వాటాను వేగంగా కోల్పోతుండగా, దాదాపుగా వాటిలో ఏవీ బీజేపీ/ఎన్డీఏకు చేరకపోవడం 2014 పూర్వ జాతీయ రాజకీయాల్లోని కీలక వాస్తవం. కాంగ్రెస్ కోల్పోతున్న ఓట్లలో చాలా వరకు కాంగ్రెస్‌లాగా పేదరికవాద భాషలో మాట్లాడే శక్తివంతమైన స్థానిక పార్టీలు (ఆప్ సహా) చేజిక్కించుకోవడం జరుగుతుండేది. మరోవిధంగా చెప్పాలంటే, కాంగ్రెస్ అవసానదశ క్షీణతలో ఉన్నా... దాని ఓటు బ్యాంకు మాత్రం చెక్కుచెదర కుండా ఉన్నదని అర్థం. ఇతర పార్టీలు దాన్ని తీసుకుంటున్నాయంతే. అదే పనిగా కాంగ్రె స్‌పైనే దృష్టిని కేంద్రీకరించడంవల్ల అధికార పార్టీ... ఇందిరా గాంధీ కుటుంబాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తూ రాజకీయ వాస్తవాలను విస్మరి స్తుండవచ్చు.
మోదీ పదవీ కాలంలోని రెండో సగభాగం మొదలు కావడానికి కొద్దిగా ముందు జరిగిన ఈ ఎన్నికలు బీజేపీకి చెప్పుకోదగిన విరామాన్ని కల్పిస్తాయి. తదుపరి జరగాల్సిన శాసనసభ ఎన్నికలు ఇంకా ఒక ఏడాది దూరంలో ఉన్నాయి. మోదీ ప్రభుత్వం ఈ విరామాన్ని తన పరిపాలనను చక్కదిద్దుకోడానికి, పరిపాలనకు సంబంధించి వెనుకబడిపోయిన పలు అంశాలపై దృష్టిని కేంద్రీకరించడానికి ఉపయోగించుకోవాలి. మంత్రివర్గాన్ని పునర్వ్య వస్థీకరించడం, తమ ప్రభుత్వంలోని కొన్ని శాఖలు పూర్తిగా సక్రమంగా పనిచేయడంలేదని అంగీకరించడంతో ముడిపడినది కావడం వల్లనేమో... ఆ అవసరాన్ని గుర్తు చేయడాన్ని మోదీ ఇష్టపడరు. పైగా ఆయన ఒత్తిడికిలోనై అలాంటి పనులను చేయడానికి అసలే ఇష్టపడరు. అందువలన ఆయన బలంగా ఉన్న ఈ సమయం వదులుకో కూడనిది.
రెండు ప్రధాన కారణాల వల్ల మోదీ 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఒకటి, క్రియాశీలకంగాలేని ప్రధానితో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వంపట్ల ప్రజలు విసిగిపోయి ఉండటం. రెండవది, ముఖ్యమైనది మోదీ వాగ్దానం చేసిన పరిపాలనాపరమైన సమర్థత, కల్పించిన ఆశ. 2019లో కూడా ఇదే కారణాలవల్ల తిరిగి గెలవగలమని ఆయన ఆశించలేరు. కాంగ్రెస్ అంతుచూసేశారు కాబట్టి వాటిలో ఒకటి లేకుండా పోయింది. రేపు ఆయన ఓటర్ల ముందుంచాల్సిన తన సంక్షిప్త పరిచయంలో వాగ్దానాల కంటే సాధించినవాటి గురించి ఎక్కువగా చెప్పుకోవడం అవసరం అవుతుంది. సంస్కరణల పూర్వ భారతంలో భావజా లేతరమైన ‘‘నేను ఎవరికీ ఏ బాధ్యత వహించా ల్సింది లేదు’’ అనే ధోరణి ఓటర్లలో పెరిగింది. ఇది రాజకీయ వేత్తలకు ఓటర్లతో ఉండే అనుబంధాన్ని మునుపెన్నడూ ఎరుగని రీతిలో పరివర్త నాత్మకమైనదిగా మార్చింది. దాన్ని గుర్తించక పోవడం లేదా దాన్ని ఖండించక పోవడం ఫ్యాషన్‌గా మారింది. ఏదేమైనా ఓటర్ల గుడ్డి విధేయత అనే రోజులు చెల్లిపోయాయి. నువ్వు నాకేమైనా చేశావా? దీని వల్ల నాకు ఒరిగేదేమిటి? వంటి ప్రశ్నలే ఓటర్లు అడిగేది. ఒక వంక ‘‘కేవలం నేను, నేను మాత్రమే, మరెవరితో సంబంధంలేని నేను’’ అనే యువతరం పెరుగుతుంది. మరోవంక రాజ్యాంగమే నిజమైన అధికా రమని, వామపక్ష లేదా మితవాద భావజాల వ్యాప్తిపై అది బలమైన పరిమితులను విధించగలదనే గుర్తింపు మెల్లగా పెరుగుతోంది.
అంతఃశోధన అవసరం
కాంగ్రెస్ తన వైఫల్యాలపై అంతఃశోధన జరుపుకుంటుందా లేదా అనేది ఇకనెంత మాత్రమూ మోదీ పట్టించుకోవాల్సినది కాదు. అందుకు బదులుగా తన ప్రభుత్వం ఇంతవరకు ఎంత బాగా పని చేసింది?అనే విషయమై ఆయన అంతఃశోధన చేసుకోవాలి. పార్ల మెంటులోని నిరంతర సంఘర్షణ ఉపయోగకరమైనదేనా? ఇప్పుడు తానూ, తన పార్టీ సురక్షితంగా ఉన్నా, మరింత బలీయంగా మారు తున్నా... ఇంత ప్రతికూలాత్మకత తమను ఆవరించి ఉండటం ఇంకా అవసరమేనా? సంఘర్షణాత్మక రాజకీయాలు వ్యసనంలాంటి మత్తును కలిగించేవి. కానీ అందుకోసం ఇకనెంత మాత్రమూ చెల్లించలేని మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది.
బడ్జెట్ సమావేశాల ఆఖరు రోజున ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శాసన, పారిపాలనా వ్యవస్థలను న్యాయవ్యవస్థ ‘‘దెబ్బతీస్తోంది’’ అంటూ శక్తివంత మైన ఉపన్యాసం చేశారు. వాస్తవాలకు సంబంధించి ఆయన సరిగ్గానే మాట్లా డారని అత్యంత అణకువతోనూ, భీతితోనూ విన్నవించుకుంటున్నాను. ఐపీఎల్ మ్యాచ్‌లను మార్చడం, బీసీసీఐ పరిధిని పునర్నిర్వచించడం, కరువు సహాయ చర్యలు చేపట్టమని ప్రభుత్వాన్ని ‘‘ఆదేశించడం’’ లేదా దీనిమీదో లేక దానిమీదో చట్టం చేయమని చెప్పడం ప్రారంభించడం ద్వారా న్యాయ వ్యవస్థ... సున్నితమైన అధికారాల పంపిణీ కోసం రాజ్యాంగం చేసిన ఏర్పా టును అస్థిర పరుస్తోంది. కానీ వాస్తవాలకు సంబంధించి జైట్లీ చెప్పింది సరైనదేగానీ, కోర్టులు ఎందుకు ఇలా శాసన, పరిపాలనా వ్యవస్థలలోకి చొరబడక తప్పడం లేదు? అవి ఎందుకు అలా ఉబలాటపడాల్సి వస్తోంది? ఇంకా అవి ఆ పని ఎలా చేయగలుగుతున్నాయి? అని ఆయనా, ఆయన ప్రభుత్వమూ ఆలోచించాలి. బలహీనమైన, రాజకీయ ప్రతిష్టలేని, విశ్వసనీ యతలేని యూపీఏ-2 హయాంలో న్యాయవ్యవస్థ, కార్యకర్తలు ఆ శూన్యం లోకి ప్రవేశించారు. ఇంకా ఆ ఖాళీ అలాగే మిగిలి ఉందంటే అందుకు కారణం... యూపీఏకున్న బలహీనతలు లేకున్నా ఈ ప్రభుత్వం సంఘ ర్షణల్లో తన రాజకీయ ప్రతిష్టను ఖర్చు పెట్టేయడమే. ఉత్తరప్రదేశ్, అరుణా చల్‌ప్రదేశ్‌లు అందుకు మంచి ఉదాహరణలు. ఈ ఎన్నికల వల్ల లభించిన విరామాన్ని, తిరిగి నెలకొన్న ఆత్మవిశ్వాసాన్ని అది తన దిశను సరిదిద్దు కోడానికి ఉపయోగించుకుని నిరంతర పోరాటం నుంచి దూరంగా జరిగి పార్లమెంటుపైనా, పరిపాలనపైనా దృష్టిని కేంద్రీకరించాలి.
- శేఖర్ గుప్తా
twitter@shekargupta