national intrest
-
ద్విజాతి ఛాయలో కశ్మీర్ లోయ
జాతిహితం అవమానభారంతో కుంగిపోతున్నవారి, ఆగ్రహంతో ఉన్న వారి మనసులను సైన్యాలు గెలవలేవు. శత్రువును నిరోధించాలంటే లేదా ఓడించాలంటే సైన్యాన్ని ఉపయోగించాలి. అలా కాకుండా అన్యమనస్కంగా ఉన్న సోదరుడిని తిరిగి దారికి తెచ్చుకోవాలంటే పెద్ద మనసు అవసరం. ఇది పని చేయగలదా? ఒక్క వాక్యంతో వాజ్‌పేయి తీసుకువచ్చిన నాటకీయ మార్పును గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. రాజ్యాంగ పరిధిలోనే ఎందుకు, నేను మానవత్వం పరిధి నుంచి మీతో మాట్లాడతాను అన్నారాయన. కశ్మీర్ లోయలో జరుగుతున్న తాజా పరిణామాలన్నీ మన లోలోపలి వికృ తాలే. ఇది కశ్మీర్ భూభాగం గురించి కూడా కాదు. లేదా కశ్మీరీల గురించి అయినా కాదు. లేదంటే భారత్, పాకిస్తాన్ల వ్యవహారం కూడా కాదు. ఇప్పుడు ఇది హిందువులు, ముస్లింల గొడవగా తయారయింది. ఎవరికీ లబ్ధి చేకూర్చని ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తింది? మిగతా విషయాలు పక్కన పెట్టి ఇలాంటి వాదనలో ఉన్న కనీస తర్క బద్ధ వాస్తవాలనైనా చూద్దాం. మొదట: బుర్హన్ వనిని సాయుధదళాలు కాల్చి చంపడంతో తాజా కల్లోలం ఆరంభమైంది. ఈ పరిణామం సంభవించ కూడ నిదేమీ కాదు. అతడు రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, సోషల్ మీడియాలో హల్చల్ చేసినప్పుడే చావుకు అత్యంత సమీపంగా వచ్చాడని అర్థమైంది. నిజానికి ఇంతకాలం జీవించి ఉన్నాడంటే అదంతా అతడి చాక చక్యమే. పెద్ద వింత కూడా. సాయుధబలగాల దృష్టిలో పడి, వారు వెతుకు తున్న వారి ‘ఏ’ జాబితాలో పేరు ఎక్కిన ఆరేళ్ల తరువాత కూడా బతికి బట్ట కట్టడం మామూలుగా సాధ్యంకాదు. అతడి పట్ల నేను సానుభూతితో ఉండాలా? సోదర భారతీయుడు ఎవరు మరణించినా నేను దుఃఖిస్తాను. అయితే బుర్హాన్ వని పట్ల కొంత వరకు నేను సానుభూతి చూపాలి. ఇలాంటి ప్రాణాంతకమైన మార్గంలోకి అతడు వెళ్లేటట్టు మిత్రులు, కుటుంబం అతడిని అనుమతించినందుకు, బహుశా అలాంటి దానికి ప్రోత్సహించినందుకు కూడా నేను సానుభూతి చూపవచ్చు. అతడు మరణించిన తీరుకు కూడా సానుభూతితో ఉండవచ్చు. కానీ ఒకసారి ఆయుధం చేపట్టి జనాన్ని చంపడం మొదలుపెట్టిన తరువాత చట్టేతర విధానాలతో చంపుతున్నారంటూ అవతలి వారిని ఆరోపించే కనీస నైతిక అర్హత కోల్పోయినట్టే. అయినా అలాంటి చావును అతడు స్వచ్ఛందంగా కోరుకున్నాడు. ఇది విషాదం. తరువాత డజన్ల కొద్దీ సాధారణ పౌరులు, యూనిఫారాలలో ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఇది మరింత విషాదం. నా వరకు, ఇంకా అశేష భారతీయ జనాభా, ధైర్యం చేసి జేఎన్‌యూ ప్రాంగణంలో నేను చెప్పినట్టు ఎలాంటి సంకోచాలు లేని వాస్తవం- కశ్మీర్, ప్రస్తుతం దేశం అధీనంలో ఉన్న ఇతర భూభాగాలు భారత్ నుంచి అవిభా జ్యాలు. గణతంత్ర భారత్‌లోని అంతర్భాగాలు. అలాగే, కొంతమంది తిట్టినా, పాకిస్తాన్, చైనాల ఆక్రమణలో ఉన్న ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం ఉన్నప్ప టికీ పాకిస్తాన్ చేతిలో ఉన్న భూభాగాలు అక్కడే ఉంటే ఉండనివ్వమనే నేనంటాను. అణ్వాయుధాలు కలిగి ఉన్న మూడు ఇరుగు పొరుగు దేశాలు కూడా యుద్ధం ద్వారా ఇతరుల భూభాగాలను దఖలు పరుచుకోలేవు. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ మూడు దేశాలలో రెండు దేశాలకు వ్యతి రేకంగా ఎవరు వ్యవహరించినా కశ్మీర్ భూభాగం, కశ్మీర్ ప్రజానీకం ఆ మూడు దేశాల దాయాదుల చిరకాల పోరులో చిక్కుకోవడం తథ్యం. కాబట్టి ఎవరూ తొందరపడరు. ఆఖరికి డజను తాజా యుద్ధాలు చేసుకున్నా, భారత్-పాక్ తమ అణ్వాయుధాలు మొత్తం వినియోగించినా కూడా ఎటు వైపు వారైనా కూడా వారి వైపు ఉన్న కశ్మీరాలను కోల్పోరని నేను పందెం కట్టి మరీ చెబుతాను. భద్రతా మండలి తీర్మానాలు కూడా పాకిస్తాన్ లేదా భారత్ లకే అవకాశం కల్పించాయి. పాకిస్తాన్ చెబుతున్న ఆజాద్ కశ్మీర్, ప్రజా భిప్రాయ సేకరణ, ఆజాదీకి మద్దతు ఇవేమీ ఇక్కడ వర్తించవు. ఇవన్నీ కపట నాటకాలే. ఆజాదీ ఏమీ లేదు. స్కాట్లాండ్ లేదు. క్విబెక్ లేదు. ఆఖరికి బ్రిక్జిట్ కూడా ఇక్కడ లేదు. ఏది ఏమైనా ఐక్యరాజ్య సమితి తీర్మానాలను, సిమ్లా ఒప్పందాన్ని కూడా తుంగలో తొక్కినది పాకిస్తానే తప్ప భారత్ కాదు. ఏడేళ్లకు ముందు సైన్యం సహాయంతో కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుందామని ఆ దేశం యత్నించి పూర్తిగా విఫలమైంది. కశ్మీర్‌ను కోల్పోతున్నామని భారతీయులు ఎప్పటికీ విచారించవలసిన అవసరం లేదు. అక్కడ చాలినంత సైన్యం ఉంది. మన భూభాగంలోని ఆ లోయను రక్షించుకోవాలన్న మన ఆశయం వజ్ర సదృశంగా ఉంది. ‘‘మన’’ కశ్మీరీలు అనేది ఇప్పుడు ఒక అంశమే కాదు, అంతకు మించిన వివాదాస్పద అంకంలోకి ప్రవేశిస్తున్నాం. పౌరులనీ, భూభాగాలనీ సైన్యాలు కాపాడగలవు. కానీ ఆగ్రహంతో ఉన్నవారి మనసును సైన్యం మార్చలేదు. ఈ మాటని చాలా మంది సైనికులు, మిత్రులు వెంటనే అంగీకరిం చలేరు. అవమానభారంతో కుంగిపోతున్నవారి, ఆగ్రహంతో ఉన్న వారి మనసులను సైన్యాలు గెలవలేవు. శత్రువును నిరోధించాలంటే లేదా ఓడించా లంటే సైన్యం ఉపయోగించాలి. అలా కాకుండా అన్యమనస్కంగా ఉన్న సోదరుడిని తిరిగి దారికి తెచ్చుకోవాలంటే పెద్ద మనసు అవసరం. ఇది పని చేయగలదా? ఒక్క వాక్యంతో వాజ్‌పేయి తీసుకువచ్చిన నాటకీయ మార్పును గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. రాజ్యాంగ పరిధిలోనే ఎందుకు, నేను మానవత్వం పరిధి నుంచి మీతో మాట్లాడతాను అన్నారా యన. అదే ఆరేళ్ల పాటు రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పింది. ఆ బాటలోనే మన్మోహన్సింగ్ ప్రయాణించారు. భారతదేశ సంకీర్ణ ప్రభుత్వాల చరిత్రలోనే అసంభవం అనదగ్గ తీరులో ముఫ్తీ స్థాపించిన పీడీపీతో బీజేపీ జత కట్టిన దృష్ట్యా నరేంద్ర మోదీ కూడా ఇలాగే వ్యవహరించగలరని మనం ఊహించాం. కశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి పరిస్థితులు ఇంతగా విషమించడానికి కారణం- సంకీర్ణం ఏర్పాటు చేయడంలోని ఉద్దేశం గురించి బీజేపీ తన కార్యకర్తలకు సరిగా ప్రచారం చేయలేదు. మరీ ముఖ్యంగా తన సిద్ధాంతకర్తలకీ, మేధావి వర్గానికీ, అజెండా నిర్ణేతలకీ కూడా ఉద్దేశాన్ని ఎరుక పరచలేదు. సైద్ధాంతికంగా ఎడమొహం పెడ మొహంగా ఉండే రెండు విభిన్నశక్తులు జాతీయతా సూత్రంతో (ముఫ్తీ గురించి ఆయన రాజకీయాల గురించి కూడా నేను ఇదే చెబుతాను) ఒకే తాటిపైకి వచ్చాయి. ఎన్నికలు తెచ్చిన విభజనను అధిగమించి ఐక్యత సాధించే ఉద్దేశంతో అవి ఈ పనిచేశాయి. అందుకే ఈ సంకీర్ణం భేషజంతో కాకుండా, రాజనీతిజ్ఞతతో వచ్చిందని అంటాను. జమ్మూ కశ్మీర్లో ద్విజాతి సిద్ధాంతంతో సమానమైన సిద్ధాంతానికి తెర తీసిన ఎన్నికలవి. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలలో ఒక రకంగాను, ముస్లిమేతరులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మరో తీరు లోను ఓటింగ్ జరిగింది. పీడీపీతో భాగస్వామ్యానికి నరేంద్ర మోదీ చొరవ చూపినప్పటికీ, ఆయన పార్టీ కార్యకర్తల సిద్ధాంతం, మోదీ రాజకీయ వాస్త వాలు ఆయనను వెనక్కు తగ్గేటట్టు చేశాయి. బాధితుల పట్ల చిన్నపాటి సానుభూతి మాట కూడా చెప్పకుండా, వారు దేని గురించి అడుగుతున్నారో కూడా ప్రస్తావించకుండా కశ్మీర్లో భద్రతాదళాల కార్యకలాపాలను సమర్థించ డానికి రోజూ సాయంకాలం మోదీగారి పార్టీ వక్తలు టీవీ స్టూడియోల చుట్టూ ఎలా తిరుగుతున్నారో మనమంతా చూస్తున్నాం. సంకీర్ణ భాగస్వామిని ఆదు కోవడమన్న పేరుతో బీజేపీ చేస్తున్న ఈ పని వికృతమైనదే కాదు, స్వీయ విధ్వంసకమైనది కూడా. కశ్మీర్ మొత్తం మనదే అంటూ నినదించేవారు, గుండెలు బాదుకునే వారు కశ్మీర్ అంటే వారి దృష్టిలో ఒక్క భూభాగమా లేక కశ్మీరీలు కూడానా? అన్న ప్రశ్న వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే తమకు విధేయులుగా (హిందు వులు, బౌద్ధులు) ఉండేవారేనా? అని కూడా ప్రశ్నించుకోవాలి. అలాగే ముస్లింలు కోరుకుంటే వారు పాకిస్తాన్ వెళ్లిపోవాలన్నదే తమ వాంఛితమా? వాస్తవంగా మనసులో ఉన్నది అదే అయితే, విభజన తరువాత అసం పూర్ణంగా మిగిలిన అజెండాయే కశ్మీర్ అంటూ పాకిస్తాన్ ఇప్పటివరకు అడ్డూ అదుపు లేకుండా దేని గురించి మాట్లాడుతున్నదో మీరు కూడా అదే మాట్లా డుతున్నారు. ఆ భూభాగాన్ని, కొంత జనాన్ని (ముస్లింలు) వారు కోరు తున్నారు. మనం కూడా అంతే, ఆ భూభాగం, కొంత జనం కావాలని కోరు తున్నాం. విభజించు పాలించు అన్న సూత్రం మనకి బ్రిటిష్ జాతి నేర్పింది. మనం మాత్రం విభజించు- వదులుకో అన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నాం. నిజానికి 97 శాతం ముస్లింలు భారతదేశంలోని ప్రధాన భూభాగంలోనే నివశిస్తున్నారు. వీరి దేశభక్తిని నిరంతరం శంకించినప్పటికీ వీరు ఏనాడూ కశ్మీరీల నినాదంతో గొంతు కలపలేదు. ఆఖరికి కొత్త సున్నీ రైట్ సిద్ధాంత కర్తలు, అంటే జకీర్ నాయక్ వంటి వారు కూడా కశ్మీర్ అంశం గురించి ఆచి తూచి మాట్లాడుతున్నారు. ఆ సమస్యను లోయకు పరిమితంగా ఉంచడానికి ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తున్నది ఇదే. ఈ మార్గం గురించి ఆలోచించండి. పాకిస్తాన్ వెళ్లిపోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే సరిహద్దులు తెరిచి ఉన్నాయి అని ముస్లింలతో భారత్ చెప్పవలసి వస్తే ఎలా ఉంటుంది? ఏ ఒక్కరు భారత భూభాగం విడిచి వెళ్లరు. నా అనుమానం ఏమిటంటే, మంచి జీవనం కోసం పాకిస్తాన్, బంగ్లాల నుంచే ఇంకొందరు ముస్లింలు ఇక్కడికే రావచ్చు. రాజకీయ, ఆర్థిక స్థిరత్వాలే మనం ఎక్కడ ఉండాలి అన్న విషయాన్ని నిర్ధారిస్తాయి. కశ్మీర్ సరిహద్దులలో కూడా ఇదే చెబితే? ఆజాదీ కశ్మీర్ గురించి కల్పనలు ఉన్న వారు, జీహాదీల వలలో పడినవారు ఏ కొందరో మినహా ఎవరూ దేశం విడి చిపోరు. కశ్మీర్లో ‘మన జనం’ అంటూ మాట్లాడేవారే ఇంకో ప్రశ్నను కూడా వేసుకోవాలి. ‘మన’ కశ్మీరీలు ‘వారి’ భూభాగంలో ఉండాలా? లేకపోతే భూభాగం ఇక్కడ వదిలి పాకిస్తాన్ వెళ్లిపోవాలా? దీనికి నిజాయితీతో కూడిన సమాధానం రాబట్టుకోవడం నా ఉద్దేశం కాదు. హిందూ-ముస్లిం పరి భాషతో కశ్మీర్ సమస్యను పునర్ వ్యాఖ్యానిస్తే వచ్చే ప్రమాదం ఏమిటో ఆలో చించాలనే నా ఉద్దేశం. అలాగే కనుక ఆలోచిస్తే కశ్మీర్‌ని పోగొట్టుకోకపోవచ్చు. కానీ కశ్మీరీలను పోగొట్టుకుంటాం. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
ఇస్లాంకు అసలు సవాలు ఇదే
జాతిహితం యువ ముస్లిం వృత్తి విద్యావంతులు గూగుల్ నుంచి, ఆధునిక టీవీ మతప్రబోధకుల నుంచి తమ మత ధర్మాన్ని గురించి నేర్చుకోవడం అనే అతి పెద్ద సమస్యతో ఎలా వ్యవహరిం చాలి? జకీర్ నాయక్ వంటి వారు ప్రచారం చేస్తున్న ముస్లింలు బాధితులుగా ఉంటున్నారనే కథనం వారి మనసులను ముంచెత్తుతోంది. ఈ సమస్య ఇక్కడ మన దేశంలోనే ఇంత జటిలంగా ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని పరిస్థితిని మీరే ఊహించుకోవచ్చు. దాదాపు 50 కోట్ల లేదా ప్రపంచ ముస్లిం జనాభాలో 40 శాతం మనసులపై ఈ దాడి జరుగుతోంది. సుప్రసిద్ధ పాకిస్తానీ వ్యాఖ్యాత ఖలీద్ అహ్మద్ చెప్పేంత వరకు (1984) జకీర్ నాయక్ అనే వ్యక్తి ఉన్నట్టే నాకు తెలియదు. నా మొట్టమొదట పాకిస్తానీ మిత్రుడు కూడా అయిన ఖలీద్... ఆయనను నేను ఎరుగనని తెలిసి ఆశ్చర్య పోయాడు. 2009లో జరిగిన ఒక సమాంతర సమావేశం లాంటి సంభా షణలో, జకీర్ నాయక్ ఉపఖండంలోనేగాక ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఇస్లామిక్ టెలీ-మత ప్రబోధకునిగా వృద్ధి చెందుతున్నట్టు ఖలీద్ చెప్పారు. జకీర్ ప్రవచనాలు చాలా వరకు ఇంగ్లిషులో సాగడం కూడా అందుకు కారణం. అప్పటికీ నాకు ‘పీస్ టీవీ’ అనేది ఒకటున్నదని తెలియనందుకూ అతను ఆశ్చర్యపోయాడు. ‘‘అది కూడా తెలుసుకోవయ్యా బాబూ, మన మంతా ముందు ముందు అతని గురించి ఇంకా చాలా ఎక్కువ వినాల్సి ఉంటుంది’’ అన్నారు. నైపుణ్యంతో కూడిన ఆయన భాషా పటిమకు, మిత వాద అంధ విశ్వాసాన్ని హేతుబద్ధతీకరించడానికి మంత్ర ముగ్దుడనైపోయా నని ఖలీద్ అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం అందరిలాగే నేనూ ‘‘హజరత్ (గౌరవనీయులైన) గూగుల్’’కు వెళ్లాను (ఈ పద ప్రయోగం నాది కాదు వేరొకరిది). జకీర్ గురించి చదవడం, ఆయన టీవీ ప్రవచనాల రికార్డింగులను చూడటం ప్రారంభించాను. ఇంగ్లిషు వైద్యుడైన జకీర్ టెలీ-మత ప్రబోధకునిగా మారి... సౌదీ తరహా మితవాద ఇస్లాంకు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన, వాక్పటిమగలిగిన, శక్తివంతమైన ప్రతినిధిగా అవతరించారు. రాక్-స్టార్ మతప్రబోధకుడు ఆయన భాష, దరహాస వదనంతో కూడిన నడవడిక, ఖురాను, భగవ ద్గీత, ఉపనిషత్తులు, బైబిల్ నుంచి అధ్యాయాలను, శ్లోకాలను అప్పటికప్పుడు అనర్గళంగా ఉల్లేఖించడం, క్రైస్తవులు, హిందువులు, నాస్తికులు సహా తన సమావేశాలకు హాజరైనవారు ఎవరు అడిగే ఏ ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి సుముఖంగా ఉండే వైఖరి అతనిని మౌలానా మూసపోతకు భిన్నంగా నిలుపుతుంది. నిజానికి ఆయన వారికి పూర్తిగా విరుద్ధం. సూటు, టై ధరించి, చక్కగా ఆలోచించి కూర్చిన ఇంగ్లిషు వాక్యాలను వేగంగా మాట్లాడతారు. ఆయన నడవడిక అంతటిలోకీ పలుచటి గడ్డం, మాడు మీది టోపీలే ఎక్కువగా ఆయన భక్తితత్పరుడైన ముస్లిం అని తెలుపుతాయి. నా సహచరులు కొందరి ద్వారా నేను ఆయనకు సంబంధించిన వారిని సంప్రదిం చాను. 2009 మార్చిలో ఆ ఇంటర్వ్యూ జరిగింది. జకీర్ నాయక్‌కు ఏ అధికారికమైన లేదా మతపరమైన బిరుదూ లేదు. కెమెరా ముందు తనను మౌల్వీ లేదా మౌలానాగా అభివర్ణించడానికి ఆయన అభ్యంతరం తెలిపారు. టెలీ-మతప్రబోధక రాక్-స్టార్‌గా వర్ణించడానికి అభ్యంతరం లేకపోవడమే కాదు, మహా ఆనందంగా అంగీకరించారు. ‘ఆస్తా’ చానల్లో ఎంతో ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కనిపించే చాలా మంది మత బోధకులు ఆయనకున్న టీవీ స్టార్ నైజాన్ని చూసి అసూయ చెందు తారు. ఆయన సంభాషణ చాలా వరకు ఘర్షణాత్మకమైనది కాదు. అత్యంత స్నేహపూర్వకమైన స్వరంతో మాట్లాడారు. భారత రాజ్యాంగంలో, న్యాయ వ్యవస్థలో తనకు పూర్తి విశ్వాసం ఉన్నదని అంటుంటే ఇక వాదించడానికి ఏం మిగిలి ఉంటుంది. దేశవిభజన విషయంలో ఆయన వైఖరి ఆర్ఎస్ఎస్ వైఖ రికి భిన్నమైనదేం కాదు. అది, భారతదేశమనే దేశంగా ఉపఖండానికి గొప్ప విషాదం. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ‘‘క్రీడల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు ప్రపంచ శక్తి’’గా ఎదిగి ఉండేవి అన్నారాయన. ముస్లింలలో చాలా మందికి ఎన్నడూ విభజన అవసరమే లేదు లేదా కోరలేదు, పాకిస్తాన్ ఉద్యమానికి నేతృత్వం వహించినవారిలో పలువురు ‘‘మతానుయాయులైన ముస్లింలు కూడా కారు.’’ అయితే అర్ఎస్ఎస్కు భిన్నంగా ఆయన ఈ అంశాన్ని ముస్లింల ప్రయోజనాల కోణం నుంచి చూశారు. మితవాద ముస్లింలు జమాత్ ఏ ఇస్లామీ నేతృత్వంలో సాగిన దేశ విభజనను వ్యతిరేకించడానికి నేపథ్యం ఉంది. అయితే నేటి చర్చలో భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, జాతీయవాదం, దేశవిభజనలపై ఆయన వైఖరి చాలా మంది పాకిస్తానీలకు మాత్రమే చికాకు కలిగిస్తుంది. కశ్మీర్‌పై జకీర్ అభిప్రాయాన్ని ఆయనను ద్వేషించేవారు, మహా దుర్మా ర్గునిగా చిత్రీకరించేవారిలో అత్యధికులు సైతం కొంత అయిష్టంగానైనా అంగీ కరిస్తారు. భారత్, పాకిస్తాన్‌లు రెండింటి పట్ల కశ్మీరీలు విసిగిపోయారు. స్వేచ్ఛగా ఓటింగ్‌ను నిర్వహిస్తే ఒంటరిగా వదిలేయమనే వారు కోరుకుం టారు. కానీ అది వారికి ఒక అవకాశంగా ఇవ్వజూపుతున్నది కాదు. కాబట్టి విద్య, ఉపాధులను మెరుగుపరచి, తన వైపు నుంచి శాంతిని నెలకొల్పి, సాధారణ పరిస్థితిని తీసుకురాగలగాలి అని ఆయన అభిప్రాయం. అతి సౌమ్యుని అతి ప్రమాదకర పార్శ్వం ఇక క్లిష్టమైన అంశాలకు వచ్చేసరికి సమస్యలు తలెత్తాయి. 26/11ను, 9/11ను సైతం ఆయన స్వేచ్ఛగా ఖండిస్తారు. కాకపోతే ‘‘జంట టవర్లను ధ్వంసం చేసిన వ్యక్తి మతధర్మాన్ని పాటించే ముస్లిం కాడు, అతన్ని ఖండిం చాల్సిందే...’’ నేనెప్పుడూ ప్రయాణిస్తూ ఉంటాను కాబట్టి నాకు 9/11 డాక్యు మెంటరీల నుంచి సమాచారం లభించింది. దాన్ని బట్టి జార్జ్ బుష్ స్వయంగా చేసిన, లోపలి వారి పనేనని తెలుస్తోంది... ఈ ఆధారాలు ఒసామా బిన్ లాడెన్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలకంటే చాలా మెరుగైనవి’’ అంటారు. ముస్లింల మస్తిష్కాలపై ఆయన పట్టు పెరుగుతుండటాన్ని గుర్తించి ‘ఇండి యన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక జాగ్రత్తగా ఎంపిక చేసిన 2010 వార్షిక శక్తివంతుల జాబితాలో జకీర్ పేరును చేర్చింది. అయితే ఆయన ప్రయోగించే లాడెన్ తరహా సందిగ్ధ అభిభాషణా ధోరణి ఆయనలో ఉన్న తప్పుడు, ప్రమాదకరమైన అంశాన్ని నొక్కిచెబు తుంది. భార్యను ‘‘ఇస్లామిక్’’ పద్ధతిలో ‘‘ఏదో టూత్ బ్రష్‌తో కొట్టినట్టుగా మెల్లగా కొట్టడం’’ లేదా విశాలమైన అలంకారాలతో కూడిన ముస్లిం సమాధు లను ఇస్లాంకు విరుద్ధమైనవిగా ప్రకటించడం వంటి మూర్ఖత్వాలను ఆయన పదేపదే సమర్థిస్తుంటారు. ప్రతి మూడు వాక్యాలకు ఒకసారి ఒక సూక్తిని ఉల్లేఖించే జకీర్ ఉపన్యాస శైలి ఇస్లాం పట్ల లోతైన మితవాద, మతశాస్త్రవాద దృష్టికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆయన పద్ధతి చూడటానికి భయపెట్టని దిగా, స్నేహపూర్వకమైనదిగా కనిపిస్తుంది. కానీ నిజంగానే తెలుసుకోగోరే, అమాయక మనసులతో ఆడుకోగలగడం ప్రమాదకరం. తోటి మనుషులకు లేదా రాజ్యానికి వ్యతిరేకంగా హింసను ప్రయోగించమని ఆయన ఎన్నడైనా సూచిస్తారని నేను విశ్వసించను. అయితే ఆయన ఐఎస్ఐఎస్ను కచ్చితంగా ‘‘ఇస్లామ్ వ్యతిరేక కుట్ర’’గా ఖండిస్తారు. ఇస్లాంకు ఆయన చెప్పే ఛాందస వాద వ్యాఖ్యానాలు.. అమాయక, యువ ముస్లింల మనసులు మరింత తీవ్ర పద్ధతులను అనుసరించడానికి సమంజసత్వాన్ని కలుగ జేసేట్టుగా విస్తరింప జేయగలుగుతాయి. బంగ్లాదేశీ ఉగ్రవాదులలో కొందరు ఆయన అనుయా యులు అయినందుకు నేను ఆశ్చర్యపోను. కొత్త, యువ ముస్లిం ఉగ్రవా దులు, ప్రత్యేకించి ఐఎస్ఐఎస్కు చెందినవారు బాగా చదువుకున్నవారు, సంపన్న కుటుంబాలకు చెందినవారు, ఇంగ్లిష్ మాట్లాడేవారుగా ఉంటున్నా రెందుకు? అనే ప్రశ్న ఈ రోజుల్లో తరచుగా ఎదురవుతోంది. క్లుప్తంగా చెప్పా లంటే కొత్త ముస్లిం ఉగ్రవాది, పాత పేద, నిరక్షరాస్యుడైన అజ్మల్ కసబ్ తరహా ఉగ్రవాద మూసపోతకు భిన్నంగా ఉంటున్నాడెందుకు? దీనికి సమా ధానం బహుశా హిందూ మితవాదులు ద్వేషించడానికి ఇష్టపడే మరో వ్యక్తి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీవద్ద ఉండవచ్చు. ఓవైసీ లేవనెత్తిన అసలు సమస్య ఆయన నన్ను ఒకసారి హైదరాబాద్‌లోని పాత బస్తీలోకి కార్లో తీసుకు పోయారు. ఆ ప్రాంతాన్ని ఆయన, ఆయన కుటుంబం దశాబ్దాలుగా నియం త్రిస్తోంది. ఒవైసీ నాకు తను నడుపుతున్న విద్యాసంస్థలను చూపించారు. ఆయన విద్యాసంస్థలోని ఎమ్‌బీబీఎస్ క్లాస్‌లో ఆడపిల్లలు/మగపిల్లల నిష్పత్తి 70:30గా ఉండటం చూసి సంతోషంతో నివ్వెరపోయాను. సోషల్ మీడి యాలో ఆ ఫొటోలను కొన్నిటిని పోస్ట్ చేశాను. వారంతా హిజబ్ (బురఖా) ధరించి ఉన్నారనే ఫిర్యాదుతో నన్ను తిట్టి పోస్తూ ఓ పెద్ద దుమారమే రేగింది. ‘‘ఈ ఆడపిల్లలు మెడికల్ కాలేజీకి వెళ్లాలా లేక మదారసాకు వెళ్లాలా? అని మిమ్మల్ని తిట్టిపోసే వాళ్లను ఆడగండి’’ అన్నారాయన. ఆ తర్వాత ఆయన కొద్దిసేపు ఆగి ‘‘బహుశా ఈ యువ ముస్లింలు మదా రసాకు కూడా వెళ్లి ఉంటేనే బాగుండేదేమో. ఇస్లాం అర్థాన్ని, సూత్రాలను, జిహాద్‌ను సైతం ఒక మౌల్వీ అయితే చెబుతారు’’ అన్నారు. ఈ యువ ముస్లింలు ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంబీఏలు అవుతారుగానీ వారికి తమ మతంగురించి తెలియదు. తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. కాబట్టి ‘‘హజరత్ గూగుల్’’ తప్ప వారు ఎక్కడకు వెళ్లగలుగుతారు? ఒక యువ ముస్లిం గూగుల్‌లో జిహాద్ అని కొడితే ‘‘బహుశా మొహ్మద్ హఫీజ్ సయీద్, అతని జమా ఉద్ దవానే మొట్టమొదట కనబడొచ్చు’’ అంతకంటే మదా రసాకు వెళ్లడమే మంచిది అన్నారు ఒవైసీ. నేడు ఇస్లాం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఇదే అన్నారు. ఆయనకు ఐఎస్ఐఎస్ అంటే అసహ్యం, పాత బస్తీలో దానికి వ్యతిరేకంగా హోర్డింగ్‌లను పెట్టించారు. ఒవైసీ చెబుతున్న మరింత పెద్ద, ప్రబలమైన సమస్య కూడా మీకు ఇప్పుడు కనబడుతుంది. యువ ముస్లిం వృత్తి విద్యావంతులు గూగుల్ నుంచి, ఆధునిక టెలివిజన్ మత ప్రబోధకుల నుంచి తమ మత ధర్మాన్ని గురించి నేర్చుకోవడం అనే సమస్యతో ఎలా వ్యవహరించాలి? జకీర్ నాయక్ వంటి వారి ప్రబోధాలు వారి వారి మనస్సులను ముంచెత్తుతున్నాయి. వారు ప్రచారం చేస్తున్న ముస్లింలు బాధితులుగా ఉంటున్నారనే కథనం విశ్వసించ దగినదిగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులు సహా కొందరు లౌకికవాదు లుగా చెప్పుకునేవారు- కేవలం దిగ్విజయ్‌సింగ్ మాత్రమేకాదు - ఇషత్ ్రజహాన్ కేసు నుంచి బాట్లా హౌస్ ఎన్కౌంటర్ వరకు ప్రతిదాన్ని ముస్లింలను బాధించడంగానే చూపుతూ ఆ బాధిత కథనానికి ఆజ్యాన్ని పోస్తుంటారు. ఈ సమస్య ఇక్కడ మన దేశంలోనే ఇంత జటిలంగా ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోని పరిస్థితిని మీరే ఊహించుకోవచ్చు. దాదాపు 50 కోట్ల లేదా ప్రపంచ ముస్లిం జనాభాలో 40 శాతం మనసులపై జరుగుతున్న దాడి ఇది. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
భేషజాలు తొలగిన బంధం
జాతిహితం భారత విదేశాంగ విధానంలో ప్రచ్ఛన్న యుద్ధానంతర దిద్దుబాటు ప్రక్రియను పీవీ ప్రారంభించారు. ‘‘బలమైన, సంపన్నవంతమైన భారతదేశం.. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంద’’ని ప్రకటించడం ద్వారా మోదీ ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. చరిత్రకు సంబంధించిన శషభిషలను అధిగ మించి, భారత్–అమెరికా సంబంధాలపై ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న పద్ధతిలో ఈ వారం కాలమ్‌లో అంశంగా ఎంచుకోవడానికి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి చరిత్రలోని స్వవచన వ్యాఘాతాలు, రెండు చరిత్రలోని భేష జాల గురించి. లేదా రెండింటి గురించి కూడా. వ్యూహాత్మక సంబంధాలు చాలా కాలం తరువాత ఏర్పడినాయి గానీ, 1947 నుంచి కూడా భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములు, మిత్రులు అయి ఉండాలి. కానీ యుద్ధానంతర పునర్నిర్మాణ దశలో తూర్పు, పశ్చిమా లలోని ఐరోపా, జపాన్‌లను దాటి సంబంధాలు నెరపడం అమెరికాకు సాధ్యం కాదు. భారత నాయకత్వం మౌలికంగా బ్రిటన్ చుట్టూ పరిభ్రమిం చేది. కానీ త్వరలోనే భాగస్వాములు ఇద్దరినీ కూడా ప్రచ్ఛన్నయుద్ధం హరించి వేసింది. పాకిస్తాన్ అమెరికా వైపు మొగ్గింది. భారత్ మాత్రం అలీనోద్యమ నాయకత్వాన్ని ఆశించింది. అలీనో ద్యమం ఎప్పుడూ సోవియెట్ కూటమి వైపే మొగ్గు చూపింది. పశ్చిమదేశాల పట్ల వ్యతిరేక భావం ఉన్న ఇద్దరు ప్రముఖ భారతీయ నేతలు నెహ్రూ, ఇందిర రెండు సంక్షోభాల వేళ అమెరికాకు చేరువయ్యారు. చైనా దురాక్రమణ, ఆహార నిల్వల కొరత వచ్చినప్పుడు ఆ పరిణామం జరిగింది. తరువాత వచ్చిన ప్రధానమంత్రులంతా (నరేంద్ర మోదీ సహా) హరిత విప్లవాన్ని విజయవంతం చేయడంలో అమెరికా నిర్వహిం చిన కీలక పాత్రను గుర్తు చేస్తూనే ఉన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం –1989– పరిసమాప్తితోనే భారత్–అమెరికా సంబంధాల నూతన చరిత్ర ప్రారంభమైందని భావించడం మరింత సముచితంగా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధానంతర ప్రపంచ చరిత్ర తర్వాత సంభవించిన గొప్ప మూల మలుపు భారత్‌ను నేర్పులేని ఒక మోటు స్థితిలోకి నెట్టింది. ఈ దశలో భారత్ ఆత్మవిశ్వాసం స్వల్ప స్థాయిలో ఉండటంతో ప్రచ్ఛన్న యుద్ధ పరిసమాప్తి దేశానికి ఒక అవ కాశం కంటే ఒక సంక్షోభంగానే కనిపించింది. ఆర్థిక రంగంలో యధాతథ స్థితిని భారత్ సాహసోపేతంగా బద్దలు చేసింది కాని దాని రాజకీయ నాయకత్వం మాత్రం పాత వ్యూహాత్మక మానసిక స్థితిలోనే చిక్కుకుని ఉండేది. ఆ తర్వాత ఇజ్రాయెల్‌తో సంబం« దాలను ఏర్పర్చుకోవడం, అమెరికాను సందర్శించడం వంటి కొన్ని దిద్దుబాట్లు జరిగాయి. చివరగా, భారత్–అమెరికా సంబంధాలు ఇంకే మాత్రం గత బంధనాలతో ఉండబోవని, కొత్త అవకాశాలకు ఆకాశమే హద్దని పీవీ నరసింహారావు కేపిటల్ హిల్‌లో సాహస ప్రకటన చేశారు. ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య అవకాశాల కంటే చికాకులు ఎక్కువగా ఉండేవి. అయితే పీవీ.. ప్రపంచంలో జరుగుతున్న మౌలిక మార్పును మేధోవం తంగా గ్రహించి దాన్ని స్వీకరించారు. భారత విదేశాంగ విధానంలో ప్రచ్ఛన్న యుద్ధానంతర దిద్దుబాటు ప్రక్రియను పీవీ ప్రారంభించారు. బలమైన, సంపన్నవంతమైన భారత దేశం.. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుం దని ప్రకటిం^è డం ద్వారా మోదీ ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఈ దశకు చేరడానికి భారత్ ఊగిసలాటలతో కూడిన పాతికేళ్ల సమయం తీసుకుంది. దీన్నే మోదీ చరిత్ర భేషజాలుగా అద్భుతమైన రీతిలో ఇటీవలి అమెరికా పర్యటనలో వర్ణించారు. వాస్తవానికి మూడు దశాబ్దాలకు పైగా భారత–అమెరికా సంబం« దాల పునఃస్థాపన క్రమాన్ని మనం ఒక రిలే రేస్‌గా చూడవచ్చు. పీవీ ఈ పరుగుపందేనికి దారి సిద్ధం చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ తొలి పరుగు ప్రారంభించి బ్యాటన్‌ను మన్మోహన్‌సింగ్‌కు అందించారు. సింగ్ యూపీఏ–1 హయాంలో అణు ఒప్పందం ద్వారా తుది అంగను చేరు కున్నారు. కానీ యూపీఏ–2వ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఊగిసలాట వల్ల తడబడ్డారు. ఇప్పుడు ఆ బ్యాటన్ని మోదీ అందుకుని చివరి పరు గును పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో పావుశతాబ్దం కలిగించిన ప్రయోజనానికి తోడుగా మోదీ తన బలాన్ని కూడా తీసుకొచ్చారు. వీటిలో మొదటిది 282 స్థానాల మ్యాజిక్ నంబర్. అయితే మోదీకి ఇంత మెజారిటీ ఒక బహు మతిగా రాలేదనుకోండి. ఆయన దాన్ని సాధించుకున్నారు. రెండు. ప్రచ్ఛన్న యుద్ధానంతర శకంలో రూపొందిన ప్రొఫెషనల్ దౌత్యవేత్తల బృందంతో మోదీ ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. మూడు, భారత కులీన వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు భారీ స్థాయిలో అమెరి కాకు వలస వెళ్లినందున అమెరికాతో భావోద్వేగ బంధం ఇంకా పెద్దది. నాలుగు.. తన పూర్వ ప్రధానులతో పోలిస్తే మోదీ అత్యంత పిన్న వయస్కు డైన ప్రధానిగా ఉన్నారు. ప్రధాని మంత్రిత్వం అనేది మరింత యుక్తవయస్సులో ఉన్నవారు చేయవలసిన పని అంటూ మన్మోహన్ సింగ్ తరచూ చెప్పేవారు. భారతదేశపు అత్యంత విజ్ఞులైన ప్రధాన మంత్రులు.. పీవీ నరసింహారావు, వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్ వారి జీవితాల్లో కనీసం పదేళ్లు ఆలస్యంగా ప్రధాని పదవిని చేపట్టారు. తన సమకాలీన ప్రపంచ నేతలతో పోలిస్తే మోదీ కాస్త ముసలివాడిగానే కని పించినప్పటికీ, తన వయస్సు తనకు అనుకూలంగానే ఉంటూ వస్తోంది. అయితే మోదీకున్న అతిపెద్ద బలం చెక్కుచెదరని ఆయన మనస్సే. చరిత్ర భారాలు లేదా కపటత్వాలతో ఆయన నలిగిపోవడం లేదు. ఏళ్ల తరబడి దౌత్యపరమైన అంచనాలు, కేబుల్ వార్తలు చదవడం ద్వారా కలిగే విశ్లేషణ–పక్షవాత భారానికి ఆయన గురికాలేదు. ఈ అనిశ్చితివల్లే తన ప్రభుత్వాన్ని పణంగా పెట్టి అణు ఒప్పందాన్ని అమలులోకి తీసుకు వచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ మానసికంగా స్తంభించిపోయింది. రక్షణ సహకార ఒప్పందాల విషయంలో ముందుకెళ్లడంలో దాని స్తంభనే భీతిగా మారిపోయింది. తాను, తన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విధానాలను పూర్తిగా వ్యతిరేకించిన విషయాన్ని పక్కనబెట్టి మోదీ స్వచ్ఛ మానసిక స్థితితో, దాపరికంలేనితనంతో అధికారంలోకి వచ్చారు. అధి కారం చేపట్టిన తొలిరోజు కొత్త చరిత్రకు నాంది కావచ్చు కాబోలు. ఈ చెక్కుచెదరని మనస్సే మోదీని ప్రధానంగా దౌత్యంలో, నిర్ణ యాల రూపకల్పనలో వాస్తవిక వ్యవహార దృక్పథాన్ని చేపట్టేలా చేసి ఉంటుంది. అమెరికాతో మరింత వ్యూహాత్మక అవకాశాలను సృష్టించు కోడానికి, వ్యాపార, వాతావరణ సంప్రదింపుల్లో కూడా ఇచ్చి పుచ్చు కోవడానికి ఆయన అభిలషిస్తున్నారు. అలాగే ఆర్థిక, వాణిజ్య అవకా శాలను విస్తరించుకోవడానికి చైనాతో వ్యూహాత్మక ఎత్తుగడలకు సంబం« ధించిన అలజడిని చల్లబర్చుకోవాలని కూడా మోదీ ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో జూనియర్ బుష్ లేదా రీగన్ తరహాలో మోదీ వ్యవహ రిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. చరిత్రకు సంబంధించిన సందే హాలు – బేషజాలు– నుంచి విముక్తి చెందిన, సమస్యతో నేరుగా వ్యవ హరించే సరైన వ్యక్తిగా మోదీ ఆవిర్భవించారు. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
దిద్దుబాటుకు సిద్ధపడతారా?
జాతిహితం మోదీ పదవీ కాలంలోని ద్వితీయార్థ భాగం మొదలుకు కొంత ముందుగా జరిగిన ఈ ఎన్నికలు బీజేపీకి చెప్పుకోదగ్గ విరామాన్ని కల్పిస్తాయి. తదుపరి శాసనసభ ఎన్నికలు ఇంకా ఏడాది దూరంలో ఉన్నాయి. మోదీ ప్రభుత్వం ఈ విరామాన్ని తమ పరిపాలనపై దృష్టిని కేంద్రీకరించడానికి, సరిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ ఎన్నికల వల్ల తిరిగి నెలకొన్న ఆత్మవిశ్వాసాన్ని అది తన దిశను సరిచేసుకోడానికి వినియోగించుకోవాలి. నిరంతర పోరాటం నుంచి వైదొలగి పార్లమెంటు, పరిపాలనలపైకి దృష్టిని మరల్చాలి. ఇటీవలి ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఉన్న కీలకమైన తేడాను నొక్కిచెప్పాయి. ఒక పార్టీ చేసిన తప్పుల నుంచి నేర్చుకోడానికి సిద్ధపడే దైతే, మరొక పార్టీ తన విజయాల నుంచి సైతం నేర్చుకోడానికి ఇష్టపడని బాపతు. బిహార్‌లో బీజేపీ, ఆ రాష్ట్రానికి నాయకత్వశక్తిగా ఓటర్లకు కనిపిం చడానికి ప్రయత్నించలేదు. పైగా దాని ప్రచారం మరీ చీల్చిచెండాడేట్టుగా, విభజనాత్మకంగా సాగింది. అసోంలో అది ఆ రెండు ధోరణులనూ వదిలే సింది. ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి సొంత స్థానిక నేతలు ఉండటమే కాదు, ఓటర్లలో దాదాపు 34 శాతం ముస్లింలు. కాబట్టి దూకుడుగా మతపరమైన కేంద్రీకరణ కోసం తహతహలాడకుండా అది నిగ్రహం చూపింది. బీజేపీ, బిహార్‌లోని తన ప్రత్యర్థుల నుంచి కలిసికట్టుగా పెద్ద కూటమిని ఏర్పరచా లనే విషయాన్ని నేర్చుకుంది. ఒకే ఓటు బ్యాంకు కోసం తమతో పోటీపడే వారితో సైతం కలవడానికి సిద్ధపడింది (ఏజీపీతో వలే). మరోవంక కాంగ్రెస్... బద్రుద్దీన్ అజ్మల్‌తో కూటమిని నిర్మించడానికి నితీష్ కుమార్ చేసిన ప్రయత్నాలను తిరస్కరించింది. కూటములు పర స్పర అనుబంధంపై ఆధారపడి పనిచేసేవనీ, అలా అని గణాంకాలను తోసిపుచ్చలేమని మనకు తెలుసు. ఈ వారం వెలువడ్డ ఫలితాల్లో సైతం కాంగ్రెస్‌కు, అజ్మల్ ఏఐయూడీఎఫ్‌కు వచ్చిన మొత్తం ఓట్లు, బీజేపీ కూటమికి వచ్చినవాటికంటే ఎక్కువ! ఫలితం దిగ్భ్రాంతికరమైన బీజేపీ విజయం. దీంతో బిహార్‌లో కోల్పోయిన రాజకీయ ప్రతష్టను అది గణనీ యంగా పునరుద్ధరించుకోగలిగింది. మారగలమని నిరూపించుకున్నారు కేరళలో బీజేపీ, మమతా బెనర్జీ మార్గాన్ని అనుసరించినట్టనిపిస్తోంది. అక్కడ అది వామపక్షాలకు ప్రధాన భావజాల ప్రత్యర్థి కావాలని ప్రయ త్నించింది. ఒక దశాబ్దికి పైగా బెంగాల్లో కాంగ్రెస్ మృదువైన వామపక్ష భావజాలానికి అంటిపెట్టుకుని ఉండగా... మమత వామపక్షాలతో పోరా డారు. తరచుగా అవి హింసాత్మక వీధి పోరాటాలుగా సైతం సాగాయి. పెరుగుతున్న వామపక్ష వ్యతిరేక జనాభా కాంగ్రెస్‌ను గాక ఆమెనే ప్రత్యామ్నాయంగా చూసింది. కేరళలో కాంగ్రెస్ నాయకత్వం వామపక్ష సానుభూతిదారుగా (పింకో-లెఫ్ట్) కొనసాగుతుంటే... బీజేపీ/ఆర్ఎస్ఎస్ వామపక్షాలకు నిజ మైన ప్రత్యర్థిగా ఎదుగుతోంది. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రచారం అంతా సరైన దిశకు మళ్లు తున్నదిగా స్పష్టంగానే కనిపించింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాల పట్ల ప్రధాని కటువైన విమర్శలు చేశారు. కానీ అంతకంటే ముఖ్యమైన విభజ నాత్మక స్వరాన్ని దూరంగా ఉంచారు. ఇక అసోంలో పాకిస్తాన్, గో సంరక్షణలను ప్రస్తావించక పోవడమే కాదు, ముస్లిం వ్యతిరేకతను సైతం ప్రదర్శించలేదు. ‘‘చట్టవిరుద్ధ బంగ్లాదేశీయులు’’ ఉండటాన్ని రాజకీయ సమస్యగా చేసినా, ఎవరినీ బయటకు గెంటేస్తామనే బెదిరింపులు లేవు. ఇప్పటికే వచ్చి స్థిరపడ్డవారిని తిరిగి వెనక్కు పంపేయడమనే యోచన ఆచరణ సాధ్యంకానిదని ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రత్యేకించి హేమంత బిశ్వశర్మ దృఢంగా చెప్పారు. పశ్చిమబెంగాల్ నుంచి అసోం, కేరళల వరకు పార్టీ స్థానిక, జాతీయ నేతలంతా ఏం తింటారనేదే వ్యక్తిగత ఎంపికకు సంబంధించిన వ్యవహా రమని చెబుతూ ‘గోమాంస’ పరీక్షలో నెగ్గారు. ఆసక్తికరకంగా, ఒక చట్టం ప్రకారం గోవధ సాంకేతికంగా చట్టవిరుద్ధమైనదిగా ఉన్న అసోంలో సైతం ఆ పార్టీ ఇదే పంథాను అనుసరించింది. క్రోడీకరించి చెప్పాలంటే ఈ ఎన్నికలు బీజేపీకి మారగలిగే శక్తీ, తిరిగి తనను తాను మలుచుకోగలిగే సామర్థ్యం ఉన్నాయని తెలిపాయి. భావజాలపరమైన మూర్ఖత్వానికి (ఈ వ్యక్తీకరణను ప్రయోగిస్తున్నందుకు మన్నించాలి) బదులుగా రాజకీయ ఫలిత ప్రయోజన వాదాన్ని తాను అనుసరించగలనని బీజేపీ నిరూపించుకుంది. ఇదే వాస్తవిక వాద దృష్టి పరిపాలన పట్ల బీజేపీ వైఖరిలో కూడా ప్రతిఫలిస్తుందా? అనేదే ఇప్పడు ముందున్న ప్రశ్న. కాంగ్రెస్ ఇంకా ముప్పుగా కనిపిస్తున్నంత వరకు బీజేపీ పార్లమెంటు లోనూ, పరిపాలనలోనూ సంఘర్షణాత్మక వైఖరిని అవలంబించడం అర్థం చేసుకోగలిగినదే. ‘‘కాంగ్రెస్ ముక్త్ భారత్’’ అనే దాని లక్ష్యం ఇప్పుడు చాలా వరకు నెరవేరింది. కాంగ్రెస్‌తోనూ, దాన్ని శాసించే కుటుంబంతోనూ ఇంత వరకు అనుసరించిన సంఘర్షణను ఇంకా అదే స్థాయిలో కొనసాగించడం కోసం బీజేపీ మూల్యాన్ని చెల్లించనుందా? లేక వాళ్లను కొంతకాలం పాటూ విస్మరించడమే మంచిదని అది అనుకుంటుందా? ప్రశాంత్ కిశోర్ (రాహుల్‌కు సలహాలిస్తున్నారంటున్న నితీశ్ సన్నిహితుడు) ఉన్నా, లేకున్నా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ దానికి పెద్ద సవాలును ఇచ్చేదేమీ కాదు. కాకపోతే పంజాబ్‌లో బీజేపీ ఆప్‌కు తలొగ్గాల్సి రావచ్చు. విజయంతో లభించిన విరామం కాంగ్రెస్ తన ఓట్ల వాటాను వేగంగా కోల్పోతుండగా, దాదాపుగా వాటిలో ఏవీ బీజేపీ/ఎన్డీఏకు చేరకపోవడం 2014 పూర్వ జాతీయ రాజకీయాల్లోని కీలక వాస్తవం. కాంగ్రెస్ కోల్పోతున్న ఓట్లలో చాలా వరకు కాంగ్రెస్‌లాగా పేదరికవాద భాషలో మాట్లాడే శక్తివంతమైన స్థానిక పార్టీలు (ఆప్ సహా) చేజిక్కించుకోవడం జరుగుతుండేది. మరోవిధంగా చెప్పాలంటే, కాంగ్రెస్ అవసానదశ క్షీణతలో ఉన్నా... దాని ఓటు బ్యాంకు మాత్రం చెక్కుచెదర కుండా ఉన్నదని అర్థం. ఇతర పార్టీలు దాన్ని తీసుకుంటున్నాయంతే. అదే పనిగా కాంగ్రె స్పైనే దృష్టిని కేంద్రీకరించడంవల్ల అధికార పార్టీ... ఇందిరా గాంధీ కుటుంబాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తూ రాజకీయ వాస్తవాలను విస్మరి స్తుండవచ్చు. మోదీ పదవీ కాలంలోని రెండో సగభాగం మొదలు కావడానికి కొద్దిగా ముందు జరిగిన ఈ ఎన్నికలు బీజేపీకి చెప్పుకోదగిన విరామాన్ని కల్పిస్తాయి. తదుపరి జరగాల్సిన శాసనసభ ఎన్నికలు ఇంకా ఒక ఏడాది దూరంలో ఉన్నాయి. మోదీ ప్రభుత్వం ఈ విరామాన్ని తన పరిపాలనను చక్కదిద్దుకోడానికి, పరిపాలనకు సంబంధించి వెనుకబడిపోయిన పలు అంశాలపై దృష్టిని కేంద్రీకరించడానికి ఉపయోగించుకోవాలి. మంత్రివర్గాన్ని పునర్వ్య వస్థీకరించడం, తమ ప్రభుత్వంలోని కొన్ని శాఖలు పూర్తిగా సక్రమంగా పనిచేయడంలేదని అంగీకరించడంతో ముడిపడినది కావడం వల్లనేమో... ఆ అవసరాన్ని గుర్తు చేయడాన్ని మోదీ ఇష్టపడరు. పైగా ఆయన ఒత్తిడికిలోనై అలాంటి పనులను చేయడానికి అసలే ఇష్టపడరు. అందువలన ఆయన బలంగా ఉన్న ఈ సమయం వదులుకో కూడనిది. రెండు ప్రధాన కారణాల వల్ల మోదీ 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఒకటి, క్రియాశీలకంగాలేని ప్రధానితో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వంపట్ల ప్రజలు విసిగిపోయి ఉండటం. రెండవది, ముఖ్యమైనది మోదీ వాగ్దానం చేసిన పరిపాలనాపరమైన సమర్థత, కల్పించిన ఆశ. 2019లో కూడా ఇదే కారణాలవల్ల తిరిగి గెలవగలమని ఆయన ఆశించలేరు. కాంగ్రెస్ అంతుచూసేశారు కాబట్టి వాటిలో ఒకటి లేకుండా పోయింది. రేపు ఆయన ఓటర్ల ముందుంచాల్సిన తన సంక్షిప్త పరిచయంలో వాగ్దానాల కంటే సాధించినవాటి గురించి ఎక్కువగా చెప్పుకోవడం అవసరం అవుతుంది. సంస్కరణల పూర్వ భారతంలో భావజా లేతరమైన ‘‘నేను ఎవరికీ ఏ బాధ్యత వహించా ల్సింది లేదు’’ అనే ధోరణి ఓటర్లలో పెరిగింది. ఇది రాజకీయ వేత్తలకు ఓటర్లతో ఉండే అనుబంధాన్ని మునుపెన్నడూ ఎరుగని రీతిలో పరివర్త నాత్మకమైనదిగా మార్చింది. దాన్ని గుర్తించక పోవడం లేదా దాన్ని ఖండించక పోవడం ఫ్యాషన్‌గా మారింది. ఏదేమైనా ఓటర్ల గుడ్డి విధేయత అనే రోజులు చెల్లిపోయాయి. నువ్వు నాకేమైనా చేశావా? దీని వల్ల నాకు ఒరిగేదేమిటి? వంటి ప్రశ్నలే ఓటర్లు అడిగేది. ఒక వంక ‘‘కేవలం నేను, నేను మాత్రమే, మరెవరితో సంబంధంలేని నేను’’ అనే యువతరం పెరుగుతుంది. మరోవంక రాజ్యాంగమే నిజమైన అధికా రమని, వామపక్ష లేదా మితవాద భావజాల వ్యాప్తిపై అది బలమైన పరిమితులను విధించగలదనే గుర్తింపు మెల్లగా పెరుగుతోంది. అంతఃశోధన అవసరం కాంగ్రెస్ తన వైఫల్యాలపై అంతఃశోధన జరుపుకుంటుందా లేదా అనేది ఇకనెంత మాత్రమూ మోదీ పట్టించుకోవాల్సినది కాదు. అందుకు బదులుగా తన ప్రభుత్వం ఇంతవరకు ఎంత బాగా పని చేసింది?అనే విషయమై ఆయన అంతఃశోధన చేసుకోవాలి. పార్ల మెంటులోని నిరంతర సంఘర్షణ ఉపయోగకరమైనదేనా? ఇప్పుడు తానూ, తన పార్టీ సురక్షితంగా ఉన్నా, మరింత బలీయంగా మారు తున్నా... ఇంత ప్రతికూలాత్మకత తమను ఆవరించి ఉండటం ఇంకా అవసరమేనా? సంఘర్షణాత్మక రాజకీయాలు వ్యసనంలాంటి మత్తును కలిగించేవి. కానీ అందుకోసం ఇకనెంత మాత్రమూ చెల్లించలేని మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ సమావేశాల ఆఖరు రోజున ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శాసన, పారిపాలనా వ్యవస్థలను న్యాయవ్యవస్థ ‘‘దెబ్బతీస్తోంది’’ అంటూ శక్తివంత మైన ఉపన్యాసం చేశారు. వాస్తవాలకు సంబంధించి ఆయన సరిగ్గానే మాట్లా డారని అత్యంత అణకువతోనూ, భీతితోనూ విన్నవించుకుంటున్నాను. ఐపీఎల్ మ్యాచ్‌లను మార్చడం, బీసీసీఐ పరిధిని పునర్నిర్వచించడం, కరువు సహాయ చర్యలు చేపట్టమని ప్రభుత్వాన్ని ‘‘ఆదేశించడం’’ లేదా దీనిమీదో లేక దానిమీదో చట్టం చేయమని చెప్పడం ప్రారంభించడం ద్వారా న్యాయ వ్యవస్థ... సున్నితమైన అధికారాల పంపిణీ కోసం రాజ్యాంగం చేసిన ఏర్పా టును అస్థిర పరుస్తోంది. కానీ వాస్తవాలకు సంబంధించి జైట్లీ చెప్పింది సరైనదేగానీ, కోర్టులు ఎందుకు ఇలా శాసన, పరిపాలనా వ్యవస్థలలోకి చొరబడక తప్పడం లేదు? అవి ఎందుకు అలా ఉబలాటపడాల్సి వస్తోంది? ఇంకా అవి ఆ పని ఎలా చేయగలుగుతున్నాయి? అని ఆయనా, ఆయన ప్రభుత్వమూ ఆలోచించాలి. బలహీనమైన, రాజకీయ ప్రతిష్టలేని, విశ్వసనీ యతలేని యూపీఏ-2 హయాంలో న్యాయవ్యవస్థ, కార్యకర్తలు ఆ శూన్యం లోకి ప్రవేశించారు. ఇంకా ఆ ఖాళీ అలాగే మిగిలి ఉందంటే అందుకు కారణం... యూపీఏకున్న బలహీనతలు లేకున్నా ఈ ప్రభుత్వం సంఘ ర్షణల్లో తన రాజకీయ ప్రతిష్టను ఖర్చు పెట్టేయడమే. ఉత్తరప్రదేశ్, అరుణా చల్ప్రదేశ్లు అందుకు మంచి ఉదాహరణలు. ఈ ఎన్నికల వల్ల లభించిన విరామాన్ని, తిరిగి నెలకొన్న ఆత్మవిశ్వాసాన్ని అది తన దిశను సరిదిద్దు కోడానికి ఉపయోగించుకుని నిరంతర పోరాటం నుంచి దూరంగా జరిగి పార్లమెంటుపైనా, పరిపాలనపైనా దృష్టిని కేంద్రీకరించాలి. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
కొత్త దేవతల వరాల జల్లులు
జాతిహితం ద్రవిడ సాధికారతా మహోద్యమాన్ని ప్రజ్వలింపజేసిన నాస్తికత్వం నేడు పాతకాలపు ఉద్వేగంగా మారిపోయింది. ద్రవిడ పార్టీలు నాస్తికత్వాన్ని వదిలేయడంతో తాయిలాల పంపకం కొత్త దేవునిగా అవతరించింది. హేతువాదం క్షీణించి, ద్రవిడ రాజకీయాలు చీలి పోవడంతో ఏర్పడ్డ రెండు పార్టీలూ నేడు పూర్తి భావజాలరహితమైనవిగా మారాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో పెద్ద సమస్యలూ లేవు, ఒకరినొకరు అవినీతిపరులని ఆరోపించుకునే అవకాశమూ లేదు. రెండు పార్టీల ఉమ్మడి విశ్వాసం తాయిలాల పంపకమే. మన దేశంలో పర్యటిస్తున్నప్పుడు కనిపించే గోడల మీద రాతలు కొత్త పరిణామాల ఆవిర్భావాన్ని సూచిస్తుంటాయి. ప్రత్యేకించి ఎన్నికల సమ యంలోననే కాదు, ఎప్పుడైనా జరిగేదే. నగరాలు, వేగంగా పట్టణీకరణ చెందుతున్న గ్రామాలతో కూడిన పల్లెపట్టున పర్యటిస్తున్నప్పుడు మనం పూర్తిగా కళ్లు విప్పార్చి, చెవులు రిక్కించి గోడల మీద ఏమి రాసున్నదో లేదా మన చెవుల్లో ఏమి మారుమోగుతున్నదో గమనించాలి. మన దేశంలో ఏది మారుతోందో, ఏది మారడం లే దో అనివార్యంగా మీకు తెలుస్తుంది. భారత ఉపఖండం తన హృదయాన్ని గోడల మీద పరుస్తుంది. తమిళనాడు రాజ కీయాలు ప్రత్యేకమైనవి అయినంత మాత్రాన ఆ రాష్ట్రం అందుకు మినహా యింపనడానికి హేతువేమీ కనిపించదు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, పేరెన్నికగల పట్టు వస్త్రాలకు పేరుమోసిన కాంచీపురం నాకు దేశంలోకెల్లా అత్యంత ఇష్టమైన స్థలం. చెన్నైకి వంద కిలోమీటర్ల దూరంలోని ఆ పాత పట్టణం శివారున పురాతనమైన శంకర మఠం ఉంది. అది శంకారాచార్యుల నివాసస్థానం. సనాతన హిందూవాద ఆధ్యాత్మిక అధికారానికి అతి ప్రముఖ కేంద్రం. అక్కడ మీరు తగినంత ఎక్కువ కాలమే గడిపేట్టయితే, నేను అక్కడికి వెళ్లిన మొదటిసారి చేసినట్టే మీరూ శంకరాచార్యులను సందర్శించడానికి వెళ్లేట్టయితే... ఆయన ‘‘జూని యర్’’ రాక కోసం వేచి చూస్తున్న శ్రోతలకు వినిపించే రికార్డు చేసిన సంస్కృత శ్లోకాలూ, మఠానికి బయట పక్కనే ఉన్న జుమా మసీదు నుంచి వినిపించే అజాన్ (ప్రార్థనకు పిలుపు) అనుద్దేశపూర్వకంగానే కలగలసి జుగల్ బందీలా ధ్వనించడాన్ని వినకుండా ఉండలేరు. మతతత్వం, నాస్తికత్వాల సహవాసం సరిగ్గా ఆ వీధి కూడలిలో శంకరాచార్యుల కోసం పూలు, పళ్లు కొనడానికి దిగే చోట... 20వ శతాబ్దపు అత్యంత సుప్రసిద్ధ విగ్రహ విధ్వంసకుడైన పెరియార్ బస్ట్ సైజు విగ్రహం కనిపిస్తుంది. ఆయనను మరచిపోయిన తరాలవారు సునీల్ ఖిలానీ తాజాగా రాసిన ‘ఇన్కార్నేషన్స్’ను త్వరత్వరగా తిరగేసి చూడొచ్చు. బ్రాహ్మణవాదం, కులవాదం, సామాజిక అసమానత, మూఢ నమ్మకాల వ్యతిరేక పోరాటంతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన, వివాదాస్పదమైన సామాజిక-రాజకీయ పరివర్తన ఉద్యమాన్ని పెరియార్ ప్రారంభించారు. ఆయన వీటన్నిటినీ హేతువాదం, నాస్తికత్వం అనే ఒకే భావజాల ఛత్రం కింద చేపట్టారు. ఇప్పుడాయన మఠం, మసీదులను చూస్తూ ఉన్నారు. అంతేకాదు విగ్రహానికి కింద దేవుడిని, దైవత్వాలను ఖండిస్తూ చేసిన ఆయన వ్యాఖ్యలు పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కించుకుని మరీ పరివేష్టితులై ఉనారు. దేవుడు లేడు/దేవుడు లేడు/దే వుడు లేనే లేడు/దేవుణ్ణి కనిపెట్టివవాడు మూర్ఖుడు/దేవుణ్ణి ప్రచారం చేసేవాడు వంచకుడు/దేవుణ్ణి పూజించేవాడు ఆటవికుడు: దేశంలోని మరే ప్రజా నాయకుడు దేవుణ్ణి ఖండించి, ధిక్కరించి ఎరుగని రీతిలో ఆయన... గొప్ప హిందూ సాంస్కృతిక కేంద్రం, ప్రముఖ మసీదులతో పాటూ ఆ వ్యూహాత్మక ప్రదేశాన్ని పంచు కుండటమే ముఖ్యమైన విషయం. గాఢమైన, సనాతన మతతత్వం, అత్యంత సూటియైన హేతువాదం కలసి ఒకే రెండు వందల చదరపు గజాల స్థలాన్ని పంచుకోవడాన్నిమరే దేశంలో చూడగలం? హిందూ గ్రూపులు దీన్ని అపచారమంటూ సవాలు చేశాయి. కానీ మద్రాసు హైకోర్టు 1979 తీర్పులో ఒక వ్యక్తి విగ్రహంతో పాటూ అతని అభిప్రాయాలను లిఖించడంలో తప్పేమీ లేదని తీర్పు చెప్పింది. ఆ ఆదేశాల సారాంశం సైతం కళ్ల జోడు పెట్టుకున్న పెరియార్‌కు దిగువన మరో నల్ల రాతిపై కనిపిస్తుంది. సుప్రసిద్ధ విగ్రహ విధ్వంసకుడే నల్ల రాతి ప్రతిమ అవతారమెత్తి దేవుళ్లను వెక్కిరించడం, అది నల్ల రాతిపై తెల్ల అక్షరాలతో చెక్కి ఉండ టానికి మించిన వ్యంగ్య పరిహాసం ఇంకేమంటుంది? నాస్తికత్వానికి ద్రవిడ పార్టీల చెల్లు చీటి ఒకప్పడు ద్రవిడ సాధికారతా మహోద్యమాన్ని ప్రజ్వలింపజేసిన నాస్తికత్వం నేడు పాతకాలపు ఉద్వేగంగా మారిపోయింది. బ్రాహ్మణ కులానికి చెందిన జయలలిత తన మతతత్వాన్ని ఎన్నడూ దాచుకున్నది లేదు. ఇక క రుణానిధి, ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త యోగేంద్ర యాదవ్ (నా వాదనకు మద్దతు కోసం ఆధారపడుతున్నది ఆయనపైనే) అన్నట్టు... పాత హేతువాదపు చివరి ప్రముఖ స్వరంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నా, ఆయన తర్వాత ఇప్పట్లో అలాంటి వారు ఆవిర్భవించరు. ఆయన కుమారుడు స్టాలిన్ కుటుంబం తరచుగా దేవాలయాలను సందర్శిస్తుంది. పురావస్తు, చారిత్రకపరమైన ఆసక్తితోనే వెళుతున్నామనేదే వారు చెప్పే ప్రధానమైన సాకు. ఎన్నికలు జరగ నున్న తమిళనాడులో నేను గడిపిన ఐదు రోజుల్లో దేవుడులేడనే తత్వం గుర్తున్న ఒక్క ఓటరు కూడా నాకు కనబడలేదు లేదా నా దృష్టికి రాలేదు. ఆలయాల నిండా భక్తులున్నారు. పెద్ద సంఖ్యలో బ్రాహ్మణేతర పురోహితు లున్నారు. దక్షిణాదిలోని ప్రముఖ దైవాంశ సంభూతులైన బాబాలు, గురు వుల అనుయాయులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీ రవిశంకర్‌లు సైతం వారిలో ఉన్నారు. కరుణానిధి భార్య లలో ఒకరు పెద్ద కుంకుమ బొట్టును పెట్టుకుంటారని డీఎండీకే నేతగా మారిన సినీ నటుడు విజయ్‌కాంత్ చెబుతున్నారు. తమిళ రాజకీయాలు, సంస్కృతికి సంబంధించిన ప్రముఖ చరిత్రకారులలో ఒకరైన ఏఆర్ వెంకటాచలపతి నేను కనుగొన్న విషయాలతో ఏకీభవిస్తూనే... సీఎన్ అన్నాదురై సైతం 1940ల చివర్లో పెరియార్‌తో విడిపోయినప్పుడు ఆయన నాస్తికత్వానికి దూరంగా జరిగారనే విషయాన్ని నొక్కి చెప్పారు. ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనే సమస్యపై అన్నాదురై, పెరియార్‌కు దూరమయ్యారు. ఏడు దశాబ్దాల తర్వాత సరిగ్గా అదే విషయంపై కేజ్రీవాల్, అన్నా హజారే నుంచి విడిపోయారు. సామాజిక అసమానతపై దాడి చేయడానికి హేతు వాదాన్ని ఉపయోగించుకోవడం, అందుకు వ్యతిరేకులుగా ఉన్న ఓటర్లను ఆక ట్టుకోవడం పూర్తిగా భిన్నమైనవని అన్నాదురై గుర్తించారని వెంకటాచలపతి గుర్తుచేశారు. తమిళనాడులోకెల్లా అత్యంత జనాదరణగల దేవుడు గణేశుడు. అంతేకాదు పెరియార్ పగలగొట్టిన దేవుళ్ల విగ్రహాల్లో గణేశుని విగ్రహాలే ఎక్కువ. ‘‘నేను పిళ్లయ్యార్కు కొబ్బరికాయలూ కొట్టను, ఆయన విగ్రహాలూ పగులగొట్టను’’ అని అన్నాదురై 1954లో చెప్పిన సుప్రసిద్ధ వాక్యాలను ఆయన గుర్తుకు తెచ్చారు. అమ్మ, స్టాలిన్ల నడుమ ఆ ఎడబాటు ఇప్పడు పరిపూర్ణమైంది. జనాకర్షణ కోసం పాట్లే భావజాలం బ్రాహ్మణాధిపత్య క్షీణత కూడా ఇందుకు తోడ్పడింది. పీకే సినిమాలోని అమీర్‌ఖాన్ అంగారక గ్రహవాసి బాబాలకు ‘‘దేవుని మేనేజర్లు’’ అని పేరు పెట్టడానికి చాలా ముందే ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపకులు ఆ విషయాన్ని గుర్తించారు. ఇప్పుడా మేనేజర్లు ధైర్యంగా మాట్లాడుతుండగా... నాటి ద్రవిడ ఉద్యమ నేతల పిల్లలకు దేవలతో అలాంటి పేచీయే లేకుండా పోయింది. ఆ పార్టీల్లోని కరడుగట్టిన నాస్తికులు దీనికి చుట్టుదారిని కనుగొన్నారు. వృద్ధ కరుణానిధిలాగే నేనూ కొంతకాలం ప్రముఖ యోగా బోధకుడు టీకేవీ దేశి కాచార్ (కృష్ణమాచార్య యోగా మందిరం) వద్ద యోగాభ్యాసం చేశాను. ఆయన ఎన్నడూ ‘‘ఓం’’ అని పలికి ఎరుగరు. ‘‘సూర్యుడు, ఎంతైనా మా పార్టీ గుర్తే కదా’’ అంటూ ఆయన తనకు సూర్య నమస్కారాలతో సమస్యేమీ లేదని చెప్పారు. హేతువాదం క్షీణించిపోయి, ద్రవిడ రాజకీయాలు చీలిపో వడంతో దాదాపు ఒకే భావజాలంగల రెండు పార్టీలు ఏర్పడ్డాయి. అయితే ఆ రెండు పార్టీలూ నేడు పూర్తి భావజాలరహితమైనవిగా మారిపోయాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో శ్రీలంక సహా పెద్ద సమస్యలంటూ ఏమీ లేవు. తమిళ రాజకీయాల్లోని ఆ రెండు ధ్రువాలను సూచించే ప్రత్యేక సూత్రాలు, భావాలు లేదా నినాదాలు ఏవీ లేవు. ఒకరు మరొరిని అవినీతిపరులని ఆరోపించే అవకాశమైతే అసలుకే లేదు. ఉన్నవల్లా యుద్ధానికి దిగిన కుటుంబాలే. అవి కరుణానిధి కుటుంబం, ఎమ్జీఆర్ కుటుంబం. రెండు పార్టీల ఉమ్మడి విశ్వాసం ఓటర్లకు తాయిలాల పంపకమే. అమ్మ ఓటరుకు పూర్తి వంటగది సామాను, కుటుంబ వినోదం, కొంత బంగారం కూడా ఉచితంగా ఇచ్చేస్తారు. డీ ఎంకే ఆమె ఇచ్చే ఉచిత కానుకలను దుమ్మెత్తి పోస్తుందనిగానీ, అదీ విద్యార్థుల, రైతుల రుణాలను మాఫీ చేస్తానంటుంది. ఇక విజయకాంత్ ఈ అర్థరాహిత్యాన్ని మరో స్థాయికి లేవ నెత్తి ఉచితంగా రేషన్ సామానంతా ఇంటికే సరఫరా చేస్తామంటారు. దేవుడు పూర్తిస్థాయిలో పునఃప్రవేశం చేయడంతో తాయిలాల పంపకమే నూతన రాజకీయ భావజాలంగా మారింది. అయినా ద్రవిడవాద పునరు ద్ధరణ మొలకలు కొన్ని కనిపిస్తున్నాయి. అతి చిన్న పట్టణాలలో పుస్తకాలు, పేపర్ల దుకాణాల్లో పెరియార్ రచనలు అత్యధికంగా అమ్ముడు పోతున్నాయి. ‘‘ఒక రాజకీయ మతాన్ని దాని అనుచరులు వదులుకున్నాక దాని అంచులలో మనుగడ సాగిస్తున్నవారు మరింత గట్టి భావజాలవాదులుగా మారారు’’ అని వెంకటాచలపతి అన్నారు. నేటి తమిళనాడులో పెరియార్వాదులైన యువత, విద్యార్థులు పెరగడం, విద్యావంతులైన దళిత యువత ఆయనపట్ల ఆకర్షితులు కావడం పెరగడం దాన్నే ప్రతిబింబిస్తోంది. ఈ నూతన కేంద్రీ కరణ ఎంత శక్తివంతమైనదో మనం ఇప్పటికే మద్రాసు ఐఐటీలో అంబేడ్కర్-పెరియార్ గ్రూపు ఏర్పాటు ద్వారా చూశాం. భారత రాజ కీయాలు ఎప్పుడూ విస్మయకర అంశాలను బయటపెడుతుంటాయి. అదే మన రాజకీయాలకున్న ప్రబల ఆకర్షణ శక్తి. - శేఖర్ గుప్తా Twitter@ShekarGupta -
అసంబద్ధ క్రీడ అరాచకపు జాడ
జాతిహితం మనకు పరిచయం లేని సట్లేజ్-యమునా లింక్ లేదా ఎస్‌వైఎల్ కాలువపై దృష్టిని కేంద్రీకరించడం మనకు కష్టమే ఆ మాటకొస్తే, లోక్‌సభకు 23 మంది ఎంపీలను మాత్రమే పంపుతున్న పంజాబ్, హరియాణాల మధ్య రేగుతున్న సంఘర్షణపైన దృష్టి పెట్టడమూ కష్టమే. అదీ కూడా కోల్‌కతాలో క్రికెట్ దిగ్గజాల పోరు సాగనుండగా అది పట్టించుకోవడం ఎలా? వార్తా చానళ్ల ప్రైమ్ టైమ్ అంతా దానితోనే నిండిపోతుంది. ఇంకా ఏమైనా కాస్త సమయం మిగిలితే అది, భారత్ మాతా కీ జై... తదితరాలకు సరిపోతుంది. కాబట్టి సట్ల్లేజ్-యమునా లింక్ గురించి పట్టించుకోవడం కష్టమే. కాస్త సంచలనాత్మ కతను ప్రదర్శించే ప్రయత్నం నేనూ చేస్తా. కాబట్టి హరియాణా, పంజాబ్, సట్లేజ్లనూ, శ్రీ శ్రీ అక్కడి నుంచి వెళ్లిపోయారు కాబట్టి యముననూ మరిచి పోండి. కానీ పటాన్‌కోట్ గురించి ఆలోచించండి. మీ కళ్లను పటాన్‌కోట్‌కు ఉత్తరంగా పది మైళ్ల దూరాన మొదలయ్యే జమ్మూ-కశ్మీర్‌పైకి మరల్చండి. ఇప్పుడిక ఇలా ఊహించుకోండి... ఆ రాష్ట్ర శాసనసభ ఇప్పుడు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ చట్టం చేయబోతున్నది. ఇక మరింత దేశీయమైన విషయాల కొస్తే అది ఆ రాష్ట్రంలో భారత రైల్వేలు రైలు లైన ్లను నిర్మించడానికి అనుమతిని ఉపసంహరిస్తోంది. తమ రాష్ట్రం నుంచి భారత సైన్యం సైనిక చర్యలు చేపట్టడంపై నిషేధం విధిస్తోంది లేదా ఇంకా సరళమైన విషయాలకు వస్తే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని విధించడం చట్టవిరుద్ధమైనదని ప్రకటించనుంది అని కూడా అనుకోండి. అప్పుడిక, మనలో కొందరం నేరుగా ఇంటి కప్పెక్కి , టీవీ స్టూడియోల కోసం తెల్లబడ్డ మీసాలను మెరిపిస్తూ ద్రోహం అని గావు కేకలు వేస్తాం. మరికొందరం ఆయుధాగారాలకు వెళ్లి రైఫిళ్లను లోడ్ చేసుకుంటాం. మిగతా వాళ్లం... చూడండి, మేం ఇలాగవుతుందని చెప్పలేదా? అంటాం. కశ్మీరీల నుంచి మీరు ఆశించగలిగేది ఏముంటుంది? తక్షణమే ఆ దిక్కు మాలిన ఆర్టికల్ 370ని రద్దు చేయండి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయండి అంటాం. నీళ్లు లేవంటే లేవంతే ఇదంతా సంచలనాత్మకతే, ఒప్పుకుంటున్నా. అందుకే ఈ కాల్పనికతకు ఇన్ని క్షమాపణా పూర్వకమైన జాగ్రత్తలు. ఇక మీరు మీ దృష్టిని తిరిగి పటాన్‌కోట్‌కు, అది భాగంగా ఉన్న పంజాబ్ మీదకు మరల్చండి. ఆ రాష్ట్రం, తన పొరుగున ఉన్న సోదర రాష్ట్రమైన హరియాణాతో ఉన్న కీలకమైన నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసేస్తూ తాజాగా ఓ చట్టాన్ని ఆమోదించింది. పాతికేళ్లకు పైగా పూర్వం, సట్లేజ్ నదీ జలాల్లోని హరియాణా వాటా నీటిని తరలించడం కోసం 213 కిలో మీటర్ల పొడవు కాలువ తవ్వడం కోసం సేకరించిన రైతుల భూములను వారికి తిరిగి ఇచ్చేస్తున్నామని వారికి తెలిపింది. నమ్మశక్యం కానంతటి ఈ రాజ్యాంగపరమైన అరాచకత్వాన్ని గురించి ఒకే ఒక్క వార్తా పత్రిక ‘ద ట్రిబ్యూన్’ మాత్రమే మనల్ని ముందస్తుగా హెచ్చరించింది. ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తున్నట్టు చేసిన ఈ కొత్త చట్టంపై పంజాబ్ గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి ఇంకా సంతకం చేయలేదనే వాస్తవం ఎవరికి పట్టింది? ఆ కాలువను పూడ్చేయడం కోసం వేలాది చెట్లను, శిథిలాలను, మట్టిని పోయడం కోసం జేసీబీలను, బుల్డోజర్లను నియ మించారు. మొత్తం దేశం, వ్యవస్థలు అదేదో ముందస్తు నిర్ణయమన్నట్టుగా మిన్నకున్నాయి. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించిన సుప్రీం కోర్టుకు... ఎవరికి ఇవ్వడానికీ మా దగ్గర నీళ్లు లేవని పంజాబ్ తెగేసి చెప్పేసింది. ఇప్పటికే ఇది పూర్తి అసంబద్ధత అనుకుంటుంటే, పంజాబ్, హరియాణా రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉన్న గౌరవనీయులైన సోలంకి రెండు రాష్ట్ర శాసనసభలను ఉద్దేశిస్తూ విడి విడిగా ప్రసంగించారు. హరియాణాకు మనం నీరిచ్చే సమస్యే లేదని పంజాబ్ శాసనసభలో చెప్పి, ఇలాంటి అన్యాయాన్ని ఎంత మాత్రం సహించేది లేదు అని హరియాణాలో చెప్పారు. అయితే ఈ అసంబద్ధతతో ముగిసిపోలేదు. హరియాణా, పంజాబ్‌లు రెండూ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ దాని నాయక భాగస్వామి. ఊహాత్మక సమస్యలతోనే తలమునకలు రెండు బీజేపీ రాష్ట్రాలు నదీ జలాల గురించి ముష్టి ఘాతాల పోరును ప్రారంభిస్తుంటే, ప్రతి ఒక్కరూ ఈ ప్రహసనంలోకి వచ్చి చేరుతున్నారు. హరియాణాలో, కాంగ్రెస్, చౌతాలా పార్టీ తమ రాష్ట్ర హక్కుల కోసం పోరాటంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నాయి. ఇక పంజాబ్‌లో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ అరాచకత్వానికి పూర్తి మద్దతునిస్తోంది. ఇక గోవు కంటే పవిత్రమైనదైన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రంగంలోకి దూకింది. హరియాణాకు పంజాబ్ తన నీరు ఇవ్వరాదని కేజ్రీవాల్ అంటున్నారు. పంజాబ్‌తో ఆప్ సార్వత్రిక అనుబంధాన్ని పెంచుకుంటున్నందున, అటు బాదల్లు, అమరిందర్లు ఓటర్లకు కేజ్రీవాల్ హరియాణా వాడని, మీ నీటిని దొంగిలించడానికి వచ్చాడని చెబుతున్నారు. ఇక హరియాణాలో ప్రభుత్వం జాట్ల నుంచి దాక్కునే ప్రయత్నంలో, గో రక్షణలో (ఏ ఆవుకు హాని తలపెట్టడానికైనా ఎన్నడూ ఎవరూ సాహసించని రాష్ట్రంలో), సరస్వతీ నదిని తిరిగి కనిపెట్టడంలో తలమునకలై ఉంది. ఈ లోగా సట్లేజ్-యమునా లింక్ కెనాల్ అంతరించిపోయి, ఆ తర్వాత బహుశా త్వరలోనే యమునా నదీ అంతరించిపోతుంది. ఈ రాజ్యాంగపరమైన అసంబద్ధతను పరిపూర్ణం చేయ డానికి చేయాల్సిందిక ఒక్కటే. చెట్లను కొట్టేయవద్దని పంజాబ్ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ఆదేశించడం. దానికీ సుప్రీం కోర్టుకు చెప్పిన సమాధానమే ఎదురవుతుంది. మాకు అసలు నీళ్లే మిగలలేదు కాబట్టి పరిరక్షించడానికి మాకు చెట్లే లేవు. శ్రీ శ్రీ కేసు నొక్కి చెప్పినట్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ తనకు ఇంకా బకాయిపడి ఉన్న ఆ రూ. 4.75 కోట్ల జరిమానాను రాబట్టుకోవడానికి ప్రయత్నించడమే ఉత్తమం. దీన్నే ఇంగ్లిషులో మంత్రగత్తె మాయలమారి పులుసు అంటారు. పురుగులు లేదా కుక్కల ఫలహారం సహా అందులో ఏమైనా ఉండొచ్చు. ఢిల్లీలో పెరిగిపోతున్న భారీ చెత్తుకుప్పల్లో పడి కుక్కలు తినే తిండి సైతం అంతకంటే మెరుగ్గా ఉంటుంది. పాకిస్తాన్‌తో, ఆర్థిక వ్యవస్థతో సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం తలమునకలై ఉండగా, అన్ని రకాల కొత్త ఆనవాయితీలు ఏర్పడుతున్నాయి. ఈ విషయాలన్నిటితో వ్యవహరించాల్సిన కేంద్రం హోం మంత్రిత్వ శాఖ. అది,‘‘హఫీజ్ సయాద్ మద్దతున్న జేఎన్‌యూ తిరుగుబాటు’’ నుంచి గుజరాత్‌లోని సోమనాథ్ దేవాలయాన్ని బాంబులతో పేల్చేయనున్న భీకరమైన పాకిస్తాన్ ‘‘ఉగ్రవాదులు’’ ఐఎస్ఐ ఇచ్చే టిఏ/డిఏ సరిపోక ఒక ఏటీఎమ్‌ను దోచుకుంటూ పట్టుబడటం వరకూ ఏ రోజు కా రోజు ఊహాత్మకమైన కొత్త సమస్యలతో పోరాడటంపై మొగ్గు చూపుతోంది. నేను సంచలనాత్మకతకు పాల్పడుతున్నానని ఆరోపించకండి. మనం పటాన్‌కోట్ గురించి ప్రస్తావించినప్పటి నుంచి నేను చెబుతున్నవన్నీ వాస్తవాలు, నడుస్తున్న చరిత్ర, రాజ్యాంగపరమైన ద్రోహం, అరాచకత్వం, గందరగోళం. చరిత్రలోనే హేయమైన వివాదం ఆసక్తికరమైన కొత్త ఆనవాయితీలను ఏర్పరుస్తున్నారు. కాకాపోతే ఇక అవసరమైనదంతా ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లు, హిమాచల్‌ప్రదేశ్ కూడా ఎందుకు కాకూడదు? తమ శాసనసభలను సమావేశపరచి వాటి జల పంపకం ఒప్పందాలను రద్దు చేయడమే. అదీ.. ఇవ్వడానికి మా వద్ద నీరే లేదు అనే చిన్న వాస్తవంతో ఆ పని చేసేయడమే. ఇలా చేయలేని ఏకైక ఎగువ రాష్ట్రం పాపం అరుణాచల్‌ప్రదేశ్ ఒక్కటే. బ్రహ్మపుత్ర, దాని ఉపన దులు అక్కడ మరీ ఉధృతంగా ప్రవహరిస్తుంటాయి. కాబట్టి టిబెట్‌లో ఆ పని ముగించేయమని చైనాకు కాస్త ఉప్పందిస్తే చాలు. మరో సంగతి, పంజాబ్‌లోని సట్లేజ్ నది కూడా పుట్టేది అక్కడే. ఈ కాలం భారత నదీ జలాల చరిత్రలోనే అత్యంత అసహ్యకరమైన వివాదం చరిత్రను గుర్తుకు తెచ్చుకోవడంతో ప్రారంభించాం. కానీ ఎంతగా కుదించినా అదే ఈ పేజీని మొత్తాన్ని మింగేసి 2004 వరకే చేరుతుంది. కాబట్టి మీరు చండీగడ్ కేంద్రంగా పనిచేసే నా మిత్రుడు, విపిన్ ప్రభు ‘డైలీ ఓ’ వెబ్ వార్తా పత్రికలో ఈ విషయమై సవివరంగా రాసిన వ్యాసాన్ని చూడమని సూచిస్తున్నాను. అది ఎస్‌వైఎల్ చరిత్రలో పది ప్రధాన మలుపులను పేర్కొంది. 1978లో ప్రారంభమైన భూసేకరణ సమయంలో అకాలీలు పంజాబ్‌లో, జనతా పార్టీ (జనసంఘ్ అప్పుడు దాన్లోనే ఉంది) డిల్లీలో అధికారంలోఉన్నారు. ఇదే ప్రకాశ్‌సింగ్ బాదల్ అప్పుడూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1981లో పంజాబ్, హరియాణా, రాజస్థాన్ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఢిల్లీలో కుదిరింది. దానికి 1982లో ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. అమరేందర్ సింగ్ దాన్ని గొప్ప ముందడుగని ప్రశంసించారు. 1985 నాటి రాజీవ్-లాంగోవాల్ ఒప్పందం దాన్ని తిరిగి ధృవీకరించింది. అయితే 2004లో, అమరేందర్, రాజ్యాంగ ధిక్కారపు తొలి అడుగువేసి ఆ చట్టాన్ని (వ్యంగ్యం కాదు నిజమే) తప్పించుకుంటూ దొడ్డిదారిన పంజాబ్ ఒప్పందాల రద్దు చ ట్టాన్ని చేశారు. ఆయన అధికారాన్ని కోల్పోయినా, అది ఏకగ్రీవంగా ఆమోదంపొందింది. ఆకాలీలు సైతం ఆయనను తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి అదే పని చేశారు. అన్నిటికి మించి ఈ చట్టాన్ని రాష్ట్రపతి సుప్రీం కోర్టు అభిప్రాయం కోసం పంపడం ఇప్పటికి గాని జరగ లేదు. అదీ 12 ఏళ్ల తర్వాత, సరిగ్గా పంజాబ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుండగా చేశారు. సిగ్గుచేటైనా ఈ చరిత్రలో మరో మైలు రాయిని కూడా ఉదహరించాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ ఆ కాలువ, నిర్మాణం సాగుతుందనే విషయంపై ఏకాభిప్రాయంతో ఉన్నప్పుడు కూడా, ఆ విషయంపై ఉగ్రవాదులు సైతం నోరు మెదపలేదు. 1990లో వాళ్లు ఆ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌ను, అతని సహాయకుడిని మరో 35 మంది కార్మికులను పనులు జరుగుతున్న చోటనే చంపేసి దాన్ని అడ్డుకోగలిగారు. అకాలీదళ్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఇప్పుడు ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరింది. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
ప్రజాస్వామ్యానికి ‘అర్హతల’ తూట్లు
జాతిహితం ఎలాంటి అర్హతల ఆంక్షలూ లేని శాసనసభ్యులు పంచాయతీలకు ఎన్నికయ్యే వారికి అర్హతలను నిర్ణయిస్తారు. పూర్తి నిరక్షరాస్యులైన హరియాణా పౌరులు ఎవరైనా శాసనసభకు ఎన్నికై, తమలాంటి వారిని పంచాయితీ ఎన్నికలకు అనర్హులను చేస్తూ చట్టాలు చేయొచ్చు. బ్రిటిష్‌వారు ఓటింగ్ హక్కుకు పెట్టిన అర్హతలన్నిటినీ అంబేడ్కర్ రాజ్యాంగం చెత్తబుట్టలో పడేసింది. కాబట్టే మన ప్రజాస్వామ్యం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. కాగా ఎన్నుకోదగినవారు ఎవరనే ఉన్నత వర్గవాద వైఖరిని చేపట్టిన పాకిస్తాన్‌కు దానివల్ల ఎంత మంచి జరిగిందో మీరే చూడొచ్చు. నేనే గనుక యువకుడిని, మరింత ధైర్యవంతుడిని, విద్వత్తుగలవాడిని అయితే, స్వయంగా నేనే ఈ మాటలను రాసేవాడిని. వాటిలో ఏదీ కాను కాబట్టి అవన్నీ ఉన్న మరొకరు రాసిన మాటలను నిస్సంకోచంగా అరువు పుచ్చుకుంటాను. గౌరవనీయ భారత అత్యున్నత న్యాయస్థానంతో వాదనకు దిగేటప్పుడు ఆ వ్యక్తి మాటల వెనుక దాక్కోవడానికి వెనుకాడను. ఇది, ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గత గురువారం వెలువరించిన తీర్పు గురించి. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడానికి విద్య, ఆర్థిక, సామాజిక అర్హతా ప్రమాణాలను నిర్దేశిస్తూ హరియాణా ప్రభుత్వం తెచ్చిన చట్టం సమంజసమైనదేనని సుప్రీం ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ‘ఓటు హక్కు, అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కేగానీ, ప్రభుత్వ పదవుల్లోకి ఎన్నిక కావడం ప్రాథమిక హక్కు కాదు.’ ఇది, కనీసం పట్టణ ఉన్నత వర్గీయుల మన్ననలందుకున్న సంక్లిష్టమైన ఈ చట్టానికి సమర్థనగా గౌరవ న్యాయస్థానంవారు చేసిన కీలక వాదన సారం. మంచీచెడు విచక్షణ చదువుకున్నోళ్ల సొత్తా? మరోవంక ఇది, ఎవరు ఎన్నిక కావాలనేదాన్ని నిర్ణయించే విశేషహక్కును (ఈ పదం మాత్రం నేను ఎంచుకున్నది) చట్టసభలకు కట్టబెట్టటం కూడా అవుతుంది. ఈ నిర్దిష్ట సందర్భానికి సంబంధించి అది, ప్రాథమిక విద్య లేదా అక్షరాస్యత, రుణగ్రస్తులు కాకుండటం (కొన్ని పరిమితులతో), ఇంట్లో మరుగు దొడ్డి ఉందా లేక గత్యంతరం లేకనో, స్వచ్ఛందంగానో బిహిరంగ మల మూత్ర విసర్జన చేస్తున్నారా? అనేలాంటి సామాజిక పారిశుద్ధ్యానికి సంబంధించిన కొన్ని నియమాలకు మాత్రమే పరిమితమైంది. భారతీయుల్లో 60% బహిర్భూములనే ఉపయోగిస్తున్నారు. ‘‘విద్యవల్ల మాత్రమే మను షులకు మంచీచెడూ, తప్పూఒప్పూ విచక్షణ చేయగల శక్తి సమకూరుతుంది’’ అని న్యాయమూర్తులు అత్యంత ప్రాధాన్యంగల వాక్యాన్ని ప్రయోగించారు. అది ఆమోదనీయమైన మాటేగానీ, ప్రశ్నింపదగినది? ఇపుడింతకూ విద్యకు నిర్వచనం ఏమిటి? పంచ్ లేదా సర్పంచ్ కావాలనుకునే వారికి అర్హత కాలేజీ డిగ్రీనా, ప్రజ్ఞా సూచిక పరీక్షా (ఐక్యూ టెస్ట్), స్థాయిని తగ్గించిన ‘కాట్’ (కామన్ అడ్మిషన్ టెస్ట్)లాంటి దానికి సమానమైనదా? విద్వత్తుకు, పరిపాలనాపరమైన నాణ్యతకు మధ్య లంకె ఉన్నదనడానికి ఉన్న ఆధారాలు క్లిష్టమైనవి. ఈ తీర్పు, బీజేపీ చేసిన చట్టానికి ఆమోద ముద్రవేసింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత చరిత్రలోనే అత్యంత అధ్వాన ప్రభుత్వాన్ని నడిపారనీ, నేటి ప్రభుత్వం అత్యుత్తమమైనదనీ విశ్వ సించే ఆ పార్టీ మద్దతుదార్లైన పట్టణ ‘‘విద్యావంతుల’’ నుంచి ఈ చట్టానికి విస్త్రుతమైన మద్దతు లభించింది. సాంప్రదాయక విద్యాపరమైన తెలివితేటల తర్కానికి ఈ అంశం ఎలా నిలుస్తుందని ప్రశ్నించాలనే దుగ్ధ ఇప్పుడు కలుగు తోంది. కానీ ఆ విషయం జోలికి కూడా మనం పోవద్దు. ఎవరు ‘‘మంచీచెడులను, తప్పుఒప్పులను విచక్షణ చేయగల శక్తి’’ కలిగినంతటి విద్యావంతులు అయ్యారో నిర్ణయించేది ఎవరు? అత్యంత వ్యక్తిగతమైనదైన ఆ నిర్ణయాన్ని పైనుంచి కింది వరకు తీసుకోవాల్సినవారు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులు. తమకంటూ అలాంటి ఏ అర్హతలు ఏవీ ఇంతవరకూ లేనేలేని వారే పంచాయతీలకు ఎన్నికయ్యే వారికి కనీస అర్హతలను నిర్ణయిస్తారు. మీరే గనుక పూర్తి నిరక్షరాస్యులైన హరియాణా పౌరులైతే, ఇప్పుడు మీరు శాసనసభకు ఎన్నికై, మీలాంటి వారిని పంచాయితీ ఎన్నికలకు అనర్హులను చేస్తూ చట్టాలు చేసేయొచ్చు. నా సొంత రాష్ట్రమైన అక్కడ 25% ప్రజలు పూర్తి నిరక్షరాస్యులే. లోక్‌సభకు కూడా అలాంటి ఆంక్షలు వర్తించవు. నేటి లోక్‌సభలోని 543 మంది సభ్యులలో 16 మంది మెట్రిక్యులేషన్ లోపు చదువుకున్నవారు. ఇది హర్యానా శాసనసభ పంచాయితీలకు నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువ. అన్నా హజారే ఉద్య మం, జన్‌లోక్‌పాల్ ప్యానెల్‌కు నోబెల్, మెగసెసే బహుమతులందుకున్న వారిని నామినేట్ చేయడాన్ని మాలాంటి వాళ్లం ఉన్నత వర్గవాదమని ప్రశ్నించ సాహసించాం. జనతాదళ్-యూకు చెందిన శరద్‌యాదవ్ పార్ల మెంట్ వైఖరికి మద్దతుగా నిలిచి, మన ప్రజాస్వామ్య వ్యవస్థే లేకపోతే పకోరీలాల్ వంటి వాళ్లు ఇక్కడ కూచునేవారేనా? అని ప్రశ్నించారు. పకోరీలాల్ ఉత్తరప్రదేశ్‌లోని రాబర్ట్స్‌గంజ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్పీ సభ్యుడు. మెట్రిక్యులేషన్లోపు చదువుకున్న ఎంపీలలో ఆయనా ఉన్నారు. చెత్తబుట్టలోని ‘అర్హతలకు’ పట్టం ఇది సుప్రీం కోర్టు ఆదేశం కాబట్టి, దాని అంతరార్థాన్ని ఇతర సందర్భాలకు అన్వయించడాన్ని అనుమతించవచ్చునేమో. అయితే దాన్ని పైకి కూడా వర్తింపజేయవచ్చు. అంటే ఇక లోక్‌సభలో పకోరీలాల్లు ఉండరా? అత్యు న్నత విద్యావంతులు మనకు ప్రాతినిధ్యం వహించడమనేది అద్భుతమైన ఆలోచన. కానీ ప్రజాస్వామ్యమంటే ముందస్తుగా నిర్వచించిన లోపరహిత మైన స్థితి కాదు. సరికదా, అందుకోసం నిరంతరం పోరాడటం. 1935లో బ్రిటిష్ వారు వయోజన ఓటింగ్‌ను కొంత మేరకు అనుమతించినప్పుడు అలాంటి కనీస అర్హతలను నిర్ణయించారు. అలా కేవలం 3.5 కోట్ల మందికి లేదా జనాభాలో 20 శాతానికి ఓటు హక్కును ఇచ్చారు. మహిళలు వారిలో కేవలం ఆరో వంతు మాత్రమే. అంబేడ్కర్ రచించిన అద్భుత రాజ్యాంగం ఆ అర్హతలన్నిటినీ తీసి చెత్తబుట్టలో పడేసింది. కలవరపడాల్సిన పలు లోపా లున్నా 65 ఏళ్లుగా మన ప్రజాస్వామ్యం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుండటం దాని ఫలితమే. ఎన్నుకోదగినవారు ఎవరనే ఆ ఉన్నత వర్గవాదవైఖరినే పాకి స్తాన్ కొనసాగించింది. దానివల్ల ఎంత మంచి జరిగిందో మీరే చూడొచ్చు. పాకిస్తానీ ఉన్నత వర్గాలు ఆ అభూత కాల్పనికతకు మళ్లీ మళ్లీ వెళ్లి వచ్చాయి. 2002లో పర్వేజ్ ముషర్రాఫ్, పోటీకి కనీసార్హతగా గ్రాడ్యుయేషన్‌ను నిర్ణయిం చారు. అయితే మతపెద్దల మాటకు తలొగ్గి మదరసాల సనద్లను (డిప్లొ మాలు) కూడా వాటితో సమాన అర్హతగానే గుర్తించారు. ఆయన నిష్ర్కమణ తదుపరి సక్రమంగా జరిగిన ఎన్నికల్లో ఆ నిబంధనను రద్దుచేశారు. బ్యాంకు లకు రుణపడి ఉన్నవారు మొదలు, ఎన్నిక ఫలితంపై ఎలాంటి ప్రభావమూ చూపనివారి వరకు అనర్హులను చేస్తూ ఆ దేశం పలు ప్రయోగాలు చేసింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాల ద్వారా మద్దతు తెలిపిన హరియాణా చట్టం సహకార సంస్థలకు, విద్యుత్ సంస్థలకు బకాయిలుపడ్డవారిని కూడా అనర్హు లను చేసింది. ఎన్నికలన్నీ వ్యయంతో కూడుకున్నవేనని అది పేర్కొంది. కాబట్టి, ఎవరైనా, ఏదైనా పదవికి పోటీ పడుతున్నారంటేనే ఆమె లేదా అతడు ముందుగా తమ రుణాలను చెల్లించేయాలి లేదా ప్రజా ప్రతినిధి కావా లనే యోచనే చేయకుండా ఉండాలి. చక్కటి నైతిక వాదన. కానీ మీరు దీన్ని బకాయిదారుల ఛాంపియన్ అయిన రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యాతో మొదలు పెట్టి, ఆ తర్వాత అప్పు చేసి గేదెను కొనుక్కోగా, అది కాస్తా ఆంత్రాక్స్ రోగంతో చనిపోయి బాధపడుతున్న దళిత మహిళ అప్పు జోలికి వెళ్లరాదూ? హరియాణా ప్రజలను విఫలం చేసిన రాజకీయ వర్గమే ఈ చట్టం ద్వారా వారిని నేడు పరాభవం పాలు చేసింది. తలసరి ఆదాయాల రీత్యా అది దేశం లోనే అతి సంపన్న రాష్ట్రం, కానీ సామాజిక సూచికల విషయానికొస్తే సిగ్గుప డాల్సిన స్థితి. స్రీ, పురుష నిష్పత్తి నేరంగా పరిగణించాల్సిన 879. కాగా అక్షరాస్యత రేటు, ప్రత్యేకించి మహిళల్లో అధమం. ఎన్నికైన ఏ ఉన్నత స్థాయి నేతా ప్రశ్నించడానికి సాహసించని కప్ పంచాయతీల పాలనసాగే ఆ గడ్డ మీదనే స్త్రీ, శిశుహత్యలు అతి విస్తృతంగా సాగుతున్నాయి. పాలకుల వైఫల్యాలకు ప్రజలకు శిక్షా? సుసంపన్నమైన ఒక రాష్ట్రం మీకు అక్షరాస్యత, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పించ డంలో విఫలమైంది. అందుకుగానూ అది ఇప్పుడు మీకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును నిరాకరిస్తోంది. నాకైతే ఇది మరోసారి ‘‘సాలా మై తో సాహిబ్ బన్ గయా’’ అనే సజీనా (1974) సినిమాలోని దిలీప్‌కుమార్ పాటను గుర్తుకు తెస్తుంది. ప్రత్యేకించి ‘‘తుమ్ లంగోటీ వాలా న బద్లా హై న బద్లేగా, తుమ్ సబ్ కలా లోగే కిస్మత్ హమ్ సాలా బద్లేంగా ’’ (మీ గోచిపాతలోళ్లు మారలేదు, మారరు, కానీ నేనిప్పుడు ఎలా మీ తలరాత మార్చేస్తానో చూడండి) అనే చరణాలు గుర్తుకొస్తున్నాయి. ఈ ఉద్వేగంలో పడి కొట్టుకుపోవడం వల్ల ముంచుకొచ్చే ప్రమాదాలేమిటనే స్పృహ నాకుంది. కానీ తమరు ఆమోదముద్ర వేసినది ఇలాంటి ఆలోచనా రీతికేనని విన్నవిం చుకోవాల్సి ఉంది. గౌరవనీయులైన తమరు సదుద్దేశాలతోనే ఇది చేశారను కోండి. నాకంటే యువతరానికి చెందిన, ధైర్యవంతులు, పండితులు అయిన ఒక వ్యక్తి మాటలను దొంగిలించి, ఆమె వెనుక దాక్కుంటానని మీకు ముందే చెప్పాను. ఆమె పేరు అర్పితా ఫుకాన్ బిస్వాస్. అద్భుతమైన సామాజిక శాస్త్రవేత్త, పొవాయ్ ఐఐటీ పీహెచ్డీ స్కాలర్. ఈ ఉదయం ఆమె ఈ తీర్పుపై తన వరుస ట్వీట్లతో (@Arpitapb) విద్య మాత్రమే మనకు మంచీ చెడు విచక్ష ణా శక్తిని ఇస్తుందా? ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించడానికి పరిపా లనాపరమైన నైపుణ్యం ముందు షరతా? వంటి ప్రశ్నలను ట్వీట్లతో కురిపిం చింది. ఆమె హాష్‌టాగ్‌తో ుట్రంప్ఎవే అని ప్రయోగించింది. ఇప్పుడు నేను కూడా అంతే నిర్లక్ష్యంగా, దీని అర్థం సుప్రీంకోర్టు ఆదేశం సమాజం పట్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న నేత డోనాల్డ్ ట్రంప్ దృష్టిని ప్రతిబింబిస్తోందని చెప్పాలా? అంతకంటే నేనామె వెనుక నక్కి, ఆమె అలా అంది అంటాను. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
పార్టీ నియంతల ప్రజాస్వామ్యం
జాతిహితం సిరియా సమస్యపై బ్రిటన్ లేబర్ పార్టీ విప్‌ను జారీ చేయక, సభ్యులు తమ అభీష్టానుసారం ఓటు చేయడాన్ని అనుమతించింది. మన పార్టీలన్నీ అధిష్టానాల లేదా అధినేతల నియంతృత్వాలే. విప్‌ను సడలించడం కాదుగదా, ఎదుటి పక్షానికి చెందిన ఒక విధానాన్నో లేదా వ్యక్తినో ప్రశంసించినా ద్రోహంగానే చూస్తాయి. ఫిరాయింపుల చట్టం భయం లేకుండా కొన్ని ముఖ్య సమస్యలపైనైనా సభ్యులు మాట్లాడటాన్ని, ఓటు చేయడాన్ని పార్టీలు అనుమతిస్తే... పార్లమెంటు మరింత మెరుగైనదిగా మారుతుంది. మంచి విషయ పరిజ్ఞానమున్న తోటి భారతీయుణ్ణి ఎవరినైనా హిలారీ బెన్ అంటే ఎవరని అడిగి చూడండి. బహుశా తెల్లమొహం వేయడమే జరుగుతుంది. జెర్మీ కోర్బిన్ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రాడికల్ నేత. ఇటీవలి కాలంలో ఆయన పేరు ప్రపంచ మీడియా పతాక శీర్షికలకు ఎక్కింది. బ్రిటిష్ లేబర్ పార్టీకి ఆయన నూతన నేత అయితే కావచ్చు, కేవలం కావచ్చు అంతే. బెన్ అలాంటి ప్రముఖుడు కాకపోవచ్చు. ఇతరులతో ఏ మాత్రం సంబంధం లేని, అత్యంత అంతర్ముఖీనమైన కాలమిది. ఏదేమైనా బ్రిటన్ నేడు క్షీణిస్తున్న శక్తి. కాబట్టి గూగుల్‌లో ఆయన గురించి శోధించి, సిరియాలో ఐఎస్ఐఎస్కు వ్యతిరేకంగా తమ వైమానిక బలగాలను ప్రయోగించాలంటూ ఆయన కామన్స్ సభలో చేసిన 13 నిమిషాల ప్రసంగాన్ని వినడం ఉపయోగకరం. ఆ లేబర్ పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యుని ఉపన్యాసం కదిలించేదిగా ఉంది. తోటి యూరోపియన్ సోషలిస్టుల పట్ల (ఫ్రాన్స్‌లోని హోలాండ్) నెరవేర్చా ల్సిన బాధ్యతగానే గాక, అంతర్జాతీయత పట్ల లేబర్ పార్టీ నిబద్ధతలో భాగంగా కూడా ఆయన ఐఎస్ఐఎస్పై వైమానిక దాడులను సమర్థించారు. భావజాలపరమైన విభేదాలకు అతీతంగా పార్లమెంటు ఆ ఉపన్యాసానికి స్పందించిన తీరు మరింత కదిలించేదిగా ఉంది. తమ పార్టీ నేత కోర్బిన్ ని మొరటుగా విమర్శించినందుకు గానూ బెన్, ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను దుయ్యబట్టి, క్షమాపణ చెప్పాలని కోరారు. దీంతో ఆ ప్రసంగం మొదట్లో కామెరాన్ ఇబ్బందిగా కదులుతూ, కలవళపడుతూ కనిపించారు. ఆ తర్వాత బెన్ ముఖ్యమైన విషయాలపైకి మళ్లేసరికి ఆమోదసూచకంగా, ప్రశంసాపూ ర్వకంగా నవ్వుతూ కనిపించారు. ఐఎస్ఐఎస్ను నయా ఫాసిస్టు శక్తిగా పేర్కొన్న బెన్ దానికి వ్యతిరేకంగా పోరాడాలని ఉద్వేగభరితమైన పిలుపు నిచ్చారు. సిరియాలో వైమానికి దాడుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మా నానికి పార్లమెంటు సభ్యులంతా ఓటు చేయాలని కోరుతూ ముగించారు. విప్ పార్టీ ప్రజాస్వామ్యానికి ముప్పు చివరికి ఆ తీర్మానం భారీ ఆధిక్యతతో నెగ్గింది. ప్రతిపక్ష లేబర్ పార్టీ సభ్యులు 66 మంది కూడా తీర్మానానికి మద్దతుగా ఓటు చేశారు. అదే మన దేశంలో జరిగితే, అలా పార్టీ వైఖరికి భిన్నంగా ఓటు చేసినవారిని శిక్షించడమో లేదా ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారి సభ్యత్వాన్ని రద్దు చేయడమో జరిగేది. కానీ అందుకు భిన్నంగా, అంతర్గత భేదాభిప్రాయాలున్న ఆ సమ స్యపై లేబర్ పార్టీ విప్‌ను జారీ చేయకుండా, సభ్యులు తమ అభిప్రాయాలకు అనుగుణంగా ఓటు చే యడాన్ని అనుమతించింది. ఈ ఉదంతం నుంచి భారత దేశంలోని మనం గమనించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. బ్రిటన్ రాజకీయాలు మన రాజకీయాలకంటే తక్కువగా చీలిపోయినవేమీ కావు. అయినా ప్రధాన ప్రతిపక్షం అంతర్గత ప్రజాస్వా మ్యాన్ని అనుమతించింది. మన దేశంలో అది అసాధ్యం. అన్ని పార్టీలూ ఇప్పుడు తమ పార్టీ అధిష్టానాల లేదా అధినేతల నియంతృత్వాలే. విప్‌ను సడలించడం కాదుగదా, ఎదుటి పక్షానికి చెందిన ఒక విధానాన్నో లేదా ఒక వ్యక్తినో ప్రశంసించినా దాన్ని ద్రోహంగానే చూస్తాయి. పార్లమెంటులో స్వపర పక్షాలకతీతమైన సౌహార్ద్రత వ్యక్తమయ్యే సందర్భాలు అరుదు. యుద్ధాలు, ఉగ్రవాద దాడులు, ప్రకృతి వైపరీత్యాల వంటి సందర్భాల్లోనూ, సంప్రదా యక రాజకీయాలపై అన్నా హజారే తీవ్ర దాడి సాగించినలాంటి సందర్భా ల్లోనూ ఇది చూడగలం. రాజకీయ విభేదాలు, విభజన కొనసాగుతున్నా, ఉన్నత స్థాయి చర్చ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జరుగు తున్న పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ దినోత్సవంపై సాగిన చర్చలో అలాంటి మెరుపులు కొన్ని కనిపించాయి. అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న రెండు సందర్భాల్లో (1996, 1999) లౌకికవాదంపై జరిగిన చర్చలు నాకు అత్యంత ఇష్టమైనవి. అయితే పార్లమెంటు సభ్యులు పార్టీ విప్‌కు విధేయులై, ప్రశ్నించకుండా, దృఢంగా దాన్ని అనుసరించే అనుయాయులుగా గాక, సొంత బుర్రలున్న ప్రజా ప్రతి నిధులుగా వ్యవహరించడం అంతకంటే చాలా భిన్నమైనది. ప్రజాస్వామ్యం పార్లమెంటరీ కమిటీలకే పరిమితం అయినా మన ఎంపీలు పార్టీ రోబోలకంటే భిన్నంగా తమ అభీష్టాను సారం ఉండగల ప్రదేశాలు మూడున్నాయి. మొదటిది, పార్లమెంటు సెంట్రల్ హాలు. రెండు, ఢిల్లీలో పనివేళల తదుపరి సాయంత్రాలు బృందాలుగా కలగలిసే ప్రదేశాలు. వైమనస్యాలు, శత్రుత్వాలు అన్నీ అదృశ్యమైపోయి, ఒప్పందాలు కుదిరేది అక్కడే. మూడోది పార్లమెంటరీ కమిటీలు. ఎంపీలు తమ సొంత అభిప్రాయాలను వెలిబుచ్చగలిగే వేదికలు అవి మాత్రమే. అక్కడ ఎంపీలు ఉన్నత స్థాయిలో ప్రశ్నలు కురిపిస్తుండటం జరుగుతుందని నేను హామీ ఇవ్వగలను. ఎందుకంటే కొన్ని కమిటీల ముందు నేను సాక్ష్యం చెప్పాను. ముందస్తుగా తగు కసరత్తు చేసి మరీ సమావేశాలకు వచ్చే ఎంపీల నివేదికల్లో కొన్ని అద్భుతంగా ఉంటాయి. గొప్ప గణాంక సమాచారం, విశ్లేషణ వాటిలో కనబడతాయి. అక్కడ ఓటింగ్ అంటూ ఉండదు కాబట్టి, కమిటీ అంతిమంగా చేసే సూచనల్లో దేన్ని ఏ ఎంపీ సమర్థించారు, వ్యతి రేకించారు అని ఎన్నటికీ చెప్పలేం. తీవ్ర విభేదాలతో విభజితమై ఉన్న రాజకీయ వ్యవస్థ అలాంటి ఏకాభిప్రాయాలను ఎలా సాధించగలుగుతోంది? ఈ పార్లమెంటరీ సంస్థలు బహిరంగమైనవి కాకపోవడం లేదా మీడియా కవరేజికి అందేవి కాకపోవడం అందుకు ఒక విషాదకరమైన కారణం. సూత్రబద్ధంగానైతే ఇది దయనీయమైన పరిస్థితే. కానీ, ఆచరణలో అదో వరం. ఆ సమావేశాలనే బహిరంగంగా, మీడియా కవరేజికి అందేలా నిర్వహించేట్టయితే, మన ఎంపీల్లో ఏ ఒక్కరైనా తమ పార్టీ అధికారిక వైఖరికి భిన్నంగా మాట్లాడే సాహసం చేయగలరా? పార్లమెంటరీ కమిటీల్లో సభ్యులు తమ పార్టీ ైవె ఖరులకు భిన్నంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం నేడు సర్వసాధారణం. ఉదాహరణకు, యూపీఏ అధికారంలో ఉండగా, కొందరు కాంగ్రెస్ ఎంపీలు పెన్షన్ బిల్లును, బీమారంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల పెంపుదలను సంబంధిత కమిటీల్లో వ్యతిరేకించారు. అతి తక్కువ చర్చతోనే, అతి కొన్నే చట్టాలను చేయగలిగేటంతగా, మన పార్లమెంటరీ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయిందని మనం కలత చెందుతుంటాం. ‘‘హల్లా’’ (గందరగోళం) మన మీడియాకు అత్యంత ఇష్టమైన పదం. ‘‘హల్లా’’ సృష్టించి చట్టాలు చేయడాన్ని అడ్డగించగల శక్తిని మన పార్లమెంటు సభ్యులు తరచుగా ప్రయోగిస్తున్నారు. అది కూడా, రైలు రోడ్డు చట్టాన్ని సైతం ‘‘హల్లా’’తో నిలిపివేయగలిగేటంత తలబిరుసుతనంతో. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కాలహరణం ద్వారా బిల్లులను అడ్డగిస్తుంటారు. మన దేశంలో ఎంపీలు సభ వెల్‌లోకి దుముకుతారు, ఏదిబడితే అది ఒకరు మరొక రిపైకి విసురుకుంటారు, ఒక్కో సారి స్పీకర్పైకీ విసురుతారు. అధికారంలో ఉండగా పార్టీలు బిల్లులను ప్రతి పాదిస్తాయి, కోల్పోయిన మరుక్షణమే వాటిని వ్యతిరేకిస్తాయి. అదే పని ఆవలి పక్షమూ పునరావృతం చేస్తుంది. సంపాదకీయ వ్యాఖ్యలు రాసేవారు ఇది కపటత్వమని అంటూనే ఉంటారు. ప్రజలు తమ ప్రతినిధులపై విశ్వాసం కోల్పోతూనే ఉంటారు. అంతే తప్ప పార్టీల్లో మాత్రం ఎలాంటి కదలికా రాదు. పిరాయింపుల చట్టాన్ని తిరగరాయాల్సిందే మన పార్లమెంటే అయితే, బ్రిటన్ పార్లమెంటులో సిరియాపై జరిగినలాంటి చర్చతో ఎలా వ్యవహరించి ఉండేదనేదే అందుకు ఉదాహరణ. తీర్మానంపై సంక్షోభం నెలకొనడానికి కారకులుగా ఒకరి నొకరు తప్పుపట్టుకునేవారు. ప్రతిపక్షం ఆ తీర్మానాన్ని అడ్డగించదలుచుకోక పోయినా, బహుశా వాకవుట్ చేసి ఉండేది. అందువలన, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తాజాగా తిరిగి పరిశీలించాల్సిన సమయమిది. ఫిరాయింపుల చట్టం భయం లేకుండా ముఖ్య సమస్యలపైనైనా సభ్యులు మాట్లాడటాన్ని, ఓట్ చేయడాన్ని- కనీసం కొన్ని సమస్యలపైనైనా- పార్టీలు అనుమతిస్తే పార్లమెంటు మరింత మెరుగైనదిగానూ, మరింత ఉత్పాదకమైనదిగానే మారుతుంది. అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడటం భారత రాజకీయాలకే అత్యంత అవమానకరం. పార్లమెంటులో అలాంటి మార్పు వస్తే, అది మన రాజకీయాల్లో కూడా మార్పును తీసుకురాగలుగుతుంది. వర్కింగ్ కమిటీలు సహా పార్టీ సంస్థాగత నిర్మాణాలనన్నిటినీ కాంగ్రెస్ ధ్వంసం చేసేసింది. నామినేటెడ్ సభ్యులతో నిండిపోయిన వర్కింగ్ కమిటీలు ఎప్పుడో గానీ సమావేశం కావు. నూతన నాయకత్వం కింద బీజేపీ సైతం అదే బాటలో సాగుతోంది. సీపీఎంను మినహాయిస్తే చాలా పార్టీలు నేడు వంశపారంపర్య పాలనలోని రాజకీయ మాఫీయాల సొంత ఆస్తులుగా ఉన్నాయి. నేడు అమలులో ఉన్న రీతిలోని పార్టీ ఫిరాయింపుల చట్టం వారికి చుట్టంగా ఉంది. ఆ పరిస్థితి మారాలి. అప్పుడే బెన్ లాంటి కొందరు సూత్రబద్ధులైన నేతలు తమ పక్షాన్ని వీడి, తమ పార్టీ నేతను ధిక్కరించి మరీ తమ వైఖరిని స్పష్టం చేయడం చూడగలుగుతాం. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
ప్రచారం వీడి ప్రధానిగా నిలవండి
జాతిహితం విదేశాల్లో మాట్లాడటం కూడా స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రసంగించడం వంటిదే. అది ఉపయోకరమైనదే. కానీ ప్రతి రాష్ట్ర ఎన్నికల్లోనూ ఆ ఫలితంపైనే తమ ప్రభుత్వం, పార్టీ భవితా, తన పరువు ప్రతిష్టలు ఆధారపడి ఉన్నాయన్నట్టుగా ఆయన ప్రచారం సాగిస్తున్నారు. తమ పార్టీకున్న నిజ అవకాశాలేమిటో అంచనా వేయకుండానే ఆయన ఆ పని చేస్తున్నారు. కాంగ్రెస్‌కు గాంధీ కుటుంబీకులు ఎలాగో, నేడు బీజేపీకి కూడా ఆయన అలాగే మారారు, అధికారానికి దగ్గరి దారిగా కనబడుతున్నారు. ఎన్నికల్లో ఓటర్లు విస్పష్టంగా తీర్పు చెప్పినప్పుడల్లా రాజకీయ విశ్లేషకులు అతి సరళీకరణలను చేసేస్తూ ఉంటారు. ఉదాహరణకు, నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించేవారంతా ఇప్పుడు బిహార్ తీర్పులో ఓటరు జాతీయ మాన సికస్థితిని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. 2014 నాటి మోదీ మాయాజాలం ముగిసిపోయిందని వారు వాదిస్తున్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ఈ వారం నాతో మాట్లాడుతూ... 2015 చివరి నాటి మోదీని 2008 నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీతో పోలుస్తూ ఇదే విషయాన్ని అతి సంక్షిప్తంగా చెప్పారు. 2006లో బుద్ధదేవ్ పారిశ్రామికీకరణకు అనుకూలంగా భారీగా ప్రజల మద్దతును సాధించారు. పార్టీ నడవడికను, శైలిని, భావజాల దిశను మార్చగలనని విశ్వసిస్తూవచ్చారు. 2008 నాటికి ఆయన పార్టీ సిద్ధాంతకర్తలు, ఆయనకంటే వామపక్షవాదులు ఆయనను ఎదురు దెబ్బతీశారు. దీంతో ఆయన చేతకానివారుగా మారారు. మోదీ కథ కూడా నేడు అలాగే ముగిసిపోతున్నదని ఆయన అన్నారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమే. కానీ ఆయనేమీ అల్పసంఖ్యాకుల్లో ఉన్నవారు కారు. ఉదారవాద మేధావుల్లో. కాంగ్రెస్‌లో, బీజేపీలోనే ఉన్న చిన్నపాటి మోదీ ద్వేషుల బృందంలో వివవస్తున్న రణగొణ ధ్వని ఇదే. అయినా, నేను మాత్రం ఇది తొందరపాటు, ఆశాభావము మాత్రమేనని చెప్పదలుచుకున్నాను. ‘అశ్వమేథం’ కథ ముగిసింది ఎదురులేని విజేత, రాజకీయ చక్రవర్తి నరేంద్ర మోదీ అశ్వమేథ యాగాశ్వం ఒక్కొక్క రాష్ట్రాన్నే అజేయంగా దాటుకు పోవడమనే కథ ముగిసింది. అయితే, 2014 నుంచి రాహుల్ గాంధీ పేరు ప్రతిష్టలేమీ పెరగలేదు . కాబట్టి అత్యంత బలీయమైన జాతీయ నేతగా మోదీ స్థానం చెక్కుచెదరలేదు. ఇక నితీష్ కుమార్, ముందుగా తన యువ ఉప ముఖ్యమంత్రితో సామరస్య పూర్వకంగా పనిచేసే మార్గాన్ని అన్వేషించాల్సి ఉంది. మోదీ విదేశీ పర్యటనలను విమర్శకులు ఉత్త ఆర్భాటంగా గేలి చేస్తున్నా, యావత్ జాతికి నాయకునిగా ఆయన స్థాయి ఇనుమడించటానికి అవి తోడ్పడ్డాయి. నితీష్‌కు, ఎవరో తెలియని అనామకునికి మధ్య ఎవ రో ఒకర్ని ఎంచుకోవడం సులువైన యువ బిహారీ ఓటర్ల వద్ద అది చెల్లకపోవచ్చు. కానీ 25 కోట్ల మంది భారతీయులు (వారిలో అత్యధికులు యువత) ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న సమయంలో... మార్క్ జుకెన్‌బర్గ్ తన ప్రధాన కార్యాలయంలో మోదీని కౌగలించుకోవడం ఆయన ప్రతిష్టకు గొప్పగా వన్నెతెచ్చేది. జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికల్లో ఇంకా మోదీయే మెజారిటీని సాధించగలిగే నేతగా నిలుస్తారు. మోదీ ప్రచారానికి నేతృత్వం వహిస్తుండగా ఆయన పార్టీ రాష్ట్రాల ఎన్నికల్లో అవమానకరమైన పరాజయాల పాలవుతుండటానికీ, అయినా ఆయన ఇంకా జాతీయ స్థాయి విజేతగా ఉండటానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని వివరించడం సులువే. అధ్యక్ష తరహాలో జాతీయ స్థాయి ఎన్నికలు జరిపితే, మోదీ లేదా ఇంకా ఎవరో తెలియని వ్యక్తి లేదా రాహుల్ నుంచి ఎవరిని ఎంచుకోవాలో ఓటర్లకు సులువే. జాతీయ స్థాయిలో మోదీ బ్రాండ్ విలువ మసిబారడం మొదలయ్యిందే తప్ప ఇంకా చెక్కుచెదర లేదు. అయితే అది 2019 వరకు మార్కెట్లో నాయకత్వ స్థానంలో నిలుస్తుందనే హామీ లేదు. మసిబారుతున్న మోదీ బ్రాండు ఎందుకు మసిబారుతున్నట్టు? ఒకటి, బ్రాండ్‌ను అతిగా ప్రచారం చేయడం దాని విలువకు అతి పెద్ద ముప్పును కలుగజేస్తుందని ఏ మార్కెటింగ్ నిపుణుడైనా చెప్పేదే. విదేశాల్లో భారీ సంఖ్యలోని ప్రేక్షకులతో మాట్లాడటం, దేశంలో స్వాతం త్య్రదినోత్సవం నాడు లేదా ప్రధాన ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ప్రసంగిం చడం వంటిదే. అది ఉపయోగకరమైనదే, అందులో శత్రుపూరితమైనది ఏదీ ఉండదు. కానీ ప్రతి రాష్ట్ర ఎన్నికపైనా తమ ప్రభుత్వం, పార్టీ భవిష్యత్తు, తన పరువు ప్రతిష్టలు ఆధారపడి ఉన్నాయన్నట్టుగా ఆయన ప్రచారం సాగిస్తు న్నారు. తమ పార్టీకున్న నిజ అవకాశాలేమిటో అంచనా వేయకుండానే ఆయన ఆ పని చేస్తున్నారు. పార్టీ ఆ విషయాన్ని తనకు చెబుతుందని ఆయన ఆశించజాలరు. కాంగ్రెస్‌కు గాంధీ కుటుంబీకులు ఎలాగో అలా నేడు బీజేపీకి ఆయన కూడా అలాగే మారారు, అధికారానికి దగ్గరి దారిగా కనబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇతరులను వృద్ధి చెందనిచ్చే సంస్కృతే లేదు. కాబట్టి ఒక నేత చుట్టూ లేదా కుటుంబం చుట్టూ రాజకీయాలను నిర్మించడం దానికి సరిపోతుంది. కానీ బీజేపీ, జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకుల బృందాన్ని తయారుచేసుకోవడం వల్ల వృద్ధి చెందినది. వాజపేయీ-అద్వానీ ద్వయం ఆధిపత్యం వహించిన కాలంలో సైతం దానికి బలమైన రెండవ శ్రేణి నాయకత్వం ఉంది. వాజపేయీ బాగా నచ్చజెప్పే రకం ప్రచారకర్తగా ఉండేవారు. అద్వానీకి సొంతం అనుచరులూ, సొంత ఆలోచనలూ ఉండేవి. పద్ధతి, విధానం, భావజాలానికి సంబంధించి వారి మధ్య కొంత ఉద్రిక్తత కొనసాగేది. కానీ, అది తమ ప్రత్యర్థి పార్టీలకంటే, ప్రత్యేకించి కాంగ్రెస్ కంటే ఎక్కువ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి దోహదం చేసే ఆరోగ్యకరమైన అంశమే అయింది. విజయానికైనా పరాజయానికైనా చాలా విస్తృతస్థాయిలో కలసి బాధ్యత వహించేవారు. నేటి మోదీ, అమిత్ షా ద్వయం పరిస్థితి విభిన్నమైనది. ఆ పెద్ద వాళ్లిద్దరూ సమానులుగా ఉండేవారు. కాగా నేటి ఇద్దరిలో ఒకరు నేత, రెండోవారు సేనాని. అద్వానీ కఠినమైన, సంఘర్షణా త్మక స్వరాన్ని వినిపిస్తుంటే, వాజపేయీ ఉన్నత నైతిక స్థానం నుంచి మాట్లాడేవారు. నేడు మోదీని ఏక వ్యక్తి అశ్విక దళంలా పోరాడేలా చేసి, ఓటమికి బాధ్యత వహించడం నుంచి మాత్రం తప్పించేది లేదనంటున్నారు. ఇది మోదీ ప్రతిష్టకు తూట్లు పొడవడమూ, ఆయనను ఓడించగలిగే వానిగా చూపడమూ మాత్రమే అవుతుంది. ప్రధానికి తగని పని ఏ ప్రధానీ తన పాలన మొదట్లోనే, రెండో ఏడాదిలోనే ఇలా జరగాలని కోరుకోరు. ఇది ఎన్నికైన ప్రభుత్వాలకు ‘‘బాధ్యతలను నిర్వర్తించే’’ దశ. నూతన ప్రభుత్వం కుదురుకున్న తర్వాత, ఈ రెండో ఏడాదిలోనే చాలా వరకు పని జరుగుతుంది. ఇక నాలుగో ఏడాదికి అది తిరిగి ఎన్ని కల పంథాకు మరలుతుంటుంది. అయితే, ఇది మోదీ స్వయంగా తనకు తాను చేసుకుంటున్న అపకారమే. ఆయన నిరంతరం ఆగ్రహంగా, శత్రుపూరితంగా, ప్రచార పంథాలో ఉంటున్నారు. ఈ పద్ధతి 2014 ఎన్నికల్లో పనిచేసింది. నిర్ణయ రాహిత్యానికి మారు పేరుగా మారిన యూపీఏపైనా, పరిపాలనలో తన ఉనికే కానరానివ్వకపోగా, తానే దానికి ఒక పెద్ద గుదిబండగా మారిన ప్రధానిపైనా విసిగిపోయి ఉన్న ఓటర్లు... కఠినంగా, దూకుడుగా ఎదురుదాడి చేయడాన్ని మెచ్చారు. సమాఖ్య స్వభావం పెంపొం దిన మన దేశంలో, కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులతో ఆచరణా త్మక భాగస్వామ్యం నెరపాలి. దేశవ్యాప్తంగా తమ సొంత ముఖ్యమంత్రులే ఉండటం అధికార పార్టీకి అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ప్రజలు అందుకు అంగీకరించకపోతే, వారు ఎన్నుకున్న ముఖ్యమంత్రుల పట్ల శత్రు భావంతో వ్యవహరించ డం మొదలెట్టరాదు. లేదా మరింత అధ్వానంగా వారిని పాకిస్తాన్ మిత్రులుగా తూలనాడటం తగదు. అది ప్రధానికి తగని పని. ఇప్పటికైనా విజ్ఞత చూపుతారా? మోదీ తన ప్రచార పంథా మనస్కత నుంచి ఇంకా బయటపడలేకపోతు న్నారు. లేదా గుజరాత్ సమస్యపై తనకు వ్యతిరేకంగా రాజకీయ శక్తుల నుంచి పౌర సమాజం వరకు అంతా కుమ్మక్కయ్యారని భావించి, ఆగ్రహంతో విరుచుకుపడుతూ ప్రదర్శించిన రక్షణతత్వాన్ని ఆయన ఇంకా వదుల్చుకోలేక పోయారు. ఆ సమస్య 2014లోనే ముగిసిపోయింది. భ్రమలు కోల్పోయి ఉన్న దేశ యువతలో అత్యధికులు వృద్ధి అనే ఆయన వాగ్దానాన్ని నమ్మి పెద్ద సంఖ్యలో ఓట్లు వేసి ఆయన్ను గెలిపించారు. అంతేగానీ, తమ పార్టీకి మిగతా దేశాన్నంతా జయించి పెట్టడం కోసం ఎన్నుకోలేదు. 2019లో మోదీని అంచనాకట్టేది, ఆయన ఎన్ని రాష్ట్రాలను గెలిచారు లేదా కోల్పోయారు అనేదాన్ని బట్టికాదు. ఆయన తిరిగి పరిపాలనపై దృష్టిని కేంద్రీకరించాలనీ, విదేశాల్లో మాట్లాడుతూ లేదా ఎన్నికల సభల్లో మాట్లాడుతూనేగాక, పార్ల మెంటు కార్యకలాపాల్లో పాల్గొనటాన్ని, మాట్లాడటాన్ని కూడా చూడాలని ఓటర్లు అనుకుంటున్నారు. అది వారిపట్ల ఆయన బాధ్యత. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో నాలుగిట్లో ఆయన పార్టీకి వచ్చిపడేదేమీ లేదు. కాబట్టి ఎన్నికలపరంగా ఆయనకు కాస్త విశ్రాంతి లభిస్తుంది. అయితే అస్సాంలో ఆయన పార్టీ, ఓటర్లను శిబిరాలుగా చీల్చాలని ఇప్పటికీ ఉబలాట పడొచ్చు. ఆ ఎన్నికను కూడా సమైక్య ప్రతిపక్షాలకు, మోదీకి మధ్య మరో పోరాటంగా మార్చి, 34.2 శాతంగా ఉన్న ముస్లిం ఓటర్లను ప్రతిపక్ష కూట మికి ఓటు చేయాలని ఒప్పించే ప్రయత్నం చేయకుండటం విజ్ఞత అనిపించు కుంటుంది. ఒక ప్రధాని ప్రజలను ఎన్నటికీ చీల్చకూడదు. అలా చేసినా ఎన్నికల్లో ఓడిపోతున్నప్పుడు ఆ పని అసలే చేయకూడదు. జాతీయస్థాయిలో మోదీ ప్రతిష్ట ఇంకా చెక్కుచెదరకుండానే ఉంది. ఇక ఇప్పటికైనా చల్లబడి, పరిపాలన సాగించడం ఓటర్ల పట్ల ఆయన నేరవేర్చాల్సి ఉన్న బాధ్యత. - శేఖర్ గుప్తా twitter@shekargupta