ప్రచారం వీడి ప్రధానిగా నిలవండి
జాతిహితం
విదేశాల్లో మాట్లాడటం కూడా స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రసంగించడం వంటిదే. అది ఉపయోకరమైనదే. కానీ ప్రతి రాష్ట్ర ఎన్నికల్లోనూ ఆ ఫలితంపైనే తమ ప్రభుత్వం, పార్టీ భవితా, తన పరువు ప్రతిష్టలు ఆధారపడి ఉన్నాయన్నట్టుగా ఆయన ప్రచారం సాగిస్తున్నారు. తమ పార్టీకున్న నిజ అవకాశాలేమిటో అంచనా వేయకుండానే ఆయన ఆ పని చేస్తున్నారు. కాంగ్రెస్‌కు గాంధీ కుటుంబీకులు ఎలాగో, నేడు బీజేపీకి కూడా ఆయన అలాగే మారారు, అధికారానికి దగ్గరి దారిగా కనబడుతున్నారు.
ఎన్నికల్లో ఓటర్లు విస్పష్టంగా తీర్పు చెప్పినప్పుడల్లా రాజకీయ విశ్లేషకులు అతి సరళీకరణలను చేసేస్తూ ఉంటారు. ఉదాహరణకు, నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించేవారంతా ఇప్పుడు బిహార్ తీర్పులో ఓటరు జాతీయ మాన సికస్థితిని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. 2014 నాటి మోదీ మాయాజాలం ముగిసిపోయిందని వారు వాదిస్తున్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ఈ వారం నాతో మాట్లాడుతూ... 2015 చివరి నాటి మోదీని 2008 నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీతో పోలుస్తూ ఇదే విషయాన్ని అతి సంక్షిప్తంగా చెప్పారు.
2006లో బుద్ధదేవ్ పారిశ్రామికీకరణకు అనుకూలంగా భారీగా ప్రజల మద్దతును సాధించారు. పార్టీ నడవడికను, శైలిని, భావజాల దిశను మార్చగలనని విశ్వసిస్తూవచ్చారు. 2008 నాటికి ఆయన పార్టీ సిద్ధాంతకర్తలు, ఆయనకంటే వామపక్షవాదులు ఆయనను ఎదురు దెబ్బతీశారు. దీంతో ఆయన చేతకానివారుగా మారారు. మోదీ కథ కూడా నేడు అలాగే ముగిసిపోతున్నదని ఆయన అన్నారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమే. కానీ ఆయనేమీ అల్పసంఖ్యాకుల్లో ఉన్నవారు కారు. ఉదారవాద మేధావుల్లో. కాంగ్రెస్‌లో, బీజేపీలోనే ఉన్న చిన్నపాటి మోదీ ద్వేషుల బృందంలో వివవస్తున్న రణగొణ ధ్వని ఇదే. అయినా, నేను మాత్రం ఇది తొందరపాటు, ఆశాభావము మాత్రమేనని చెప్పదలుచుకున్నాను.
‘అశ్వమేథం’ కథ ముగిసింది
ఎదురులేని విజేత, రాజకీయ చక్రవర్తి నరేంద్ర మోదీ అశ్వమేథ యాగాశ్వం ఒక్కొక్క రాష్ట్రాన్నే అజేయంగా దాటుకు పోవడమనే కథ ముగిసింది. అయితే, 2014 నుంచి రాహుల్ గాంధీ పేరు ప్రతిష్టలేమీ పెరగలేదు . కాబట్టి అత్యంత బలీయమైన జాతీయ నేతగా మోదీ స్థానం చెక్కుచెదరలేదు. ఇక నితీష్ కుమార్, ముందుగా తన యువ ఉప ముఖ్యమంత్రితో సామరస్య పూర్వకంగా పనిచేసే మార్గాన్ని అన్వేషించాల్సి ఉంది. మోదీ విదేశీ పర్యటనలను విమర్శకులు ఉత్త ఆర్భాటంగా గేలి చేస్తున్నా, యావత్ జాతికి నాయకునిగా ఆయన స్థాయి ఇనుమడించటానికి అవి తోడ్పడ్డాయి.
నితీష్‌కు, ఎవరో తెలియని అనామకునికి మధ్య ఎవ రో ఒకర్ని ఎంచుకోవడం సులువైన యువ బిహారీ ఓటర్ల వద్ద అది చెల్లకపోవచ్చు. కానీ 25 కోట్ల మంది భారతీయులు (వారిలో అత్యధికులు యువత) ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న సమయంలో... మార్క్ జుకెన్‌బర్గ్ తన ప్రధాన కార్యాలయంలో మోదీని కౌగలించుకోవడం ఆయన ప్రతిష్టకు గొప్పగా వన్నెతెచ్చేది. జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికల్లో ఇంకా మోదీయే మెజారిటీని సాధించగలిగే నేతగా నిలుస్తారు.
మోదీ ప్రచారానికి నేతృత్వం వహిస్తుండగా ఆయన పార్టీ రాష్ట్రాల ఎన్నికల్లో అవమానకరమైన పరాజయాల పాలవుతుండటానికీ, అయినా ఆయన ఇంకా జాతీయ స్థాయి విజేతగా ఉండటానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని వివరించడం సులువే. అధ్యక్ష తరహాలో జాతీయ స్థాయి ఎన్నికలు జరిపితే, మోదీ లేదా ఇంకా ఎవరో తెలియని వ్యక్తి లేదా రాహుల్ నుంచి ఎవరిని ఎంచుకోవాలో ఓటర్లకు సులువే. జాతీయ స్థాయిలో మోదీ బ్రాండ్ విలువ మసిబారడం మొదలయ్యిందే తప్ప ఇంకా చెక్కుచెదర లేదు. అయితే అది 2019 వరకు మార్కెట్‌లో నాయకత్వ స్థానంలో నిలుస్తుందనే హామీ లేదు.
మసిబారుతున్న మోదీ బ్రాండు
ఎందుకు మసిబారుతున్నట్టు? ఒకటి, బ్రాండ్‌ను అతిగా ప్రచారం చేయడం దాని విలువకు అతి పెద్ద ముప్పును కలుగజేస్తుందని ఏ మార్కెటింగ్ నిపుణుడైనా చెప్పేదే. విదేశాల్లో భారీ సంఖ్యలోని ప్రేక్షకులతో మాట్లాడటం, దేశంలో స్వాతం త్య్రదినోత్సవం నాడు లేదా ప్రధాన ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ప్రసంగిం చడం వంటిదే. అది ఉపయోగకరమైనదే, అందులో శత్రుపూరితమైనది ఏదీ ఉండదు. కానీ ప్రతి రాష్ట్ర ఎన్నికపైనా తమ ప్రభుత్వం, పార్టీ భవిష్యత్తు, తన పరువు ప్రతిష్టలు ఆధారపడి ఉన్నాయన్నట్టుగా ఆయన ప్రచారం సాగిస్తు న్నారు. తమ పార్టీకున్న నిజ అవకాశాలేమిటో అంచనా వేయకుండానే ఆయన ఆ పని చేస్తున్నారు. పార్టీ ఆ విషయాన్ని తనకు చెబుతుందని ఆయన ఆశించజాలరు. కాంగ్రెస్‌కు గాంధీ కుటుంబీకులు ఎలాగో అలా నేడు బీజేపీకి ఆయన కూడా అలాగే మారారు, అధికారానికి దగ్గరి దారిగా కనబడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఇతరులను వృద్ధి చెందనిచ్చే సంస్కృతే లేదు. కాబట్టి ఒక నేత చుట్టూ లేదా కుటుంబం చుట్టూ రాజకీయాలను నిర్మించడం దానికి సరిపోతుంది. కానీ బీజేపీ, జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకుల బృందాన్ని తయారుచేసుకోవడం వల్ల వృద్ధి చెందినది. వాజపేయీ-అద్వానీ ద్వయం ఆధిపత్యం వహించిన కాలంలో సైతం దానికి బలమైన రెండవ శ్రేణి నాయకత్వం ఉంది. వాజపేయీ బాగా నచ్చజెప్పే రకం ప్రచారకర్తగా ఉండేవారు. అద్వానీకి సొంతం అనుచరులూ, సొంత ఆలోచనలూ ఉండేవి. పద్ధతి, విధానం, భావజాలానికి సంబంధించి వారి మధ్య కొంత ఉద్రిక్తత కొనసాగేది.
కానీ, అది తమ ప్రత్యర్థి పార్టీలకంటే, ప్రత్యేకించి కాంగ్రెస్ కంటే ఎక్కువ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి దోహదం చేసే ఆరోగ్యకరమైన అంశమే అయింది. విజయానికైనా పరాజయానికైనా చాలా విస్తృతస్థాయిలో కలసి బాధ్యత వహించేవారు. నేటి మోదీ, అమిత్ షా ద్వయం పరిస్థితి విభిన్నమైనది. ఆ పెద్ద వాళ్లిద్దరూ సమానులుగా ఉండేవారు. కాగా నేటి ఇద్దరిలో ఒకరు నేత, రెండోవారు సేనాని. అద్వానీ కఠినమైన, సంఘర్షణా త్మక స్వరాన్ని వినిపిస్తుంటే, వాజపేయీ ఉన్నత నైతిక స్థానం నుంచి మాట్లాడేవారు. నేడు మోదీని ఏక వ్యక్తి అశ్విక దళంలా పోరాడేలా చేసి, ఓటమికి బాధ్యత వహించడం నుంచి మాత్రం తప్పించేది లేదనంటున్నారు. ఇది మోదీ ప్రతిష్టకు తూట్లు పొడవడమూ, ఆయనను ఓడించగలిగే వానిగా చూపడమూ మాత్రమే అవుతుంది.
ప్రధానికి తగని పని
ఏ ప్రధానీ తన పాలన మొదట్లోనే, రెండో ఏడాదిలోనే ఇలా జరగాలని కోరుకోరు. ఇది ఎన్నికైన ప్రభుత్వాలకు ‘‘బాధ్యతలను నిర్వర్తించే’’ దశ. నూతన ప్రభుత్వం కుదురుకున్న తర్వాత, ఈ రెండో ఏడాదిలోనే చాలా వరకు పని జరుగుతుంది. ఇక నాలుగో ఏడాదికి అది తిరిగి ఎన్ని కల పంథాకు మరలుతుంటుంది. అయితే, ఇది మోదీ స్వయంగా తనకు తాను చేసుకుంటున్న అపకారమే. ఆయన నిరంతరం ఆగ్రహంగా, శత్రుపూరితంగా, ప్రచార పంథాలో ఉంటున్నారు. ఈ పద్ధతి 2014 ఎన్నికల్లో పనిచేసింది. నిర్ణయ రాహిత్యానికి మారు పేరుగా మారిన యూపీఏపైనా, పరిపాలనలో తన ఉనికే కానరానివ్వకపోగా, తానే దానికి ఒక పెద్ద గుదిబండగా మారిన ప్రధానిపైనా విసిగిపోయి ఉన్న ఓటర్లు... కఠినంగా, దూకుడుగా ఎదురుదాడి చేయడాన్ని మెచ్చారు. సమాఖ్య స్వభావం పెంపొం దిన మన దేశంలో, కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులతో ఆచరణా త్మక భాగస్వామ్యం నెరపాలి. దేశవ్యాప్తంగా తమ సొంత ముఖ్యమంత్రులే ఉండటం అధికార పార్టీకి అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ప్రజలు అందుకు అంగీకరించకపోతే, వారు ఎన్నుకున్న ముఖ్యమంత్రుల పట్ల శత్రు భావంతో వ్యవహరించ డం మొదలెట్టరాదు. లేదా మరింత అధ్వానంగా వారిని పాకిస్తాన్ మిత్రులుగా తూలనాడటం తగదు. అది ప్రధానికి తగని పని.
ఇప్పటికైనా విజ్ఞత చూపుతారా?
మోదీ తన ప్రచార పంథా మనస్కత నుంచి ఇంకా బయటపడలేకపోతు న్నారు. లేదా గుజరాత్ సమస్యపై తనకు వ్యతిరేకంగా రాజకీయ శక్తుల నుంచి పౌర సమాజం వరకు అంతా కుమ్మక్కయ్యారని భావించి, ఆగ్రహంతో విరుచుకుపడుతూ ప్రదర్శించిన రక్షణతత్వాన్ని ఆయన ఇంకా వదుల్చుకోలేక పోయారు. ఆ సమస్య 2014లోనే ముగిసిపోయింది. భ్రమలు కోల్పోయి ఉన్న దేశ యువతలో అత్యధికులు వృద్ధి అనే ఆయన వాగ్దానాన్ని నమ్మి పెద్ద సంఖ్యలో ఓట్లు వేసి ఆయన్ను గెలిపించారు. అంతేగానీ, తమ పార్టీకి మిగతా దేశాన్నంతా జయించి పెట్టడం కోసం ఎన్నుకోలేదు. 2019లో మోదీని అంచనాకట్టేది, ఆయన ఎన్ని రాష్ట్రాలను గెలిచారు లేదా కోల్పోయారు అనేదాన్ని బట్టికాదు. ఆయన తిరిగి పరిపాలనపై దృష్టిని కేంద్రీకరించాలనీ, విదేశాల్లో మాట్లాడుతూ లేదా ఎన్నికల సభల్లో మాట్లాడుతూనేగాక, పార్ల మెంటు కార్యకలాపాల్లో పాల్గొనటాన్ని, మాట్లాడటాన్ని కూడా చూడాలని ఓటర్లు అనుకుంటున్నారు. అది వారిపట్ల ఆయన బాధ్యత.
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో నాలుగిట్లో ఆయన పార్టీకి వచ్చిపడేదేమీ లేదు. కాబట్టి ఎన్నికలపరంగా ఆయనకు కాస్త విశ్రాంతి లభిస్తుంది. అయితే అస్సాంలో ఆయన పార్టీ, ఓటర్లను శిబిరాలుగా చీల్చాలని ఇప్పటికీ ఉబలాట పడొచ్చు. ఆ ఎన్నికను కూడా సమైక్య ప్రతిపక్షాలకు, మోదీకి మధ్య మరో పోరాటంగా మార్చి, 34.2 శాతంగా ఉన్న ముస్లిం ఓటర్లను ప్రతిపక్ష కూట మికి ఓటు చేయాలని ఒప్పించే ప్రయత్నం చేయకుండటం విజ్ఞత అనిపించు కుంటుంది. ఒక ప్రధాని ప్రజలను ఎన్నటికీ చీల్చకూడదు. అలా చేసినా ఎన్నికల్లో ఓడిపోతున్నప్పుడు ఆ పని అసలే చేయకూడదు. జాతీయస్థాయిలో మోదీ ప్రతిష్ట ఇంకా చెక్కుచెదరకుండానే ఉంది. ఇక ఇప్పటికైనా చల్లబడి, పరిపాలన సాగించడం ఓటర్ల పట్ల ఆయన నేరవేర్చాల్సి ఉన్న బాధ్యత.
- శేఖర్ గుప్తా
twitter@shekargupta