
జాతిహితం
మూడేళ్ల క్రితం తాను అనుభవించిన రాజకీయ అధికారంలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే ఆప్ ఇప్పుడు అనుభవిస్తోంది. ఈరోజు ఢిల్లీలో ఏ ఉప ఎన్నిక నిర్వహించినా ఆ పార్టీయే గెలుస్తుంది. కానీ, సగం ఢిల్లీ రాష్ట్రానికి పరిమితమై మమతా బెనర్జీతో సమానంగా నిలబడటం అనేది కేజ్రీవాల్, అతడి పార్టీ పెట్టుకున్న లక్ష్యం కానేకాదు. వాళ్లు వ్యవస్థను మార్చడానికి వచ్చారు. భారత్‌ను రక్షించడానికి వచ్చారు. ఇప్పుడు అదంతా ముగిసిపోయింది. మళ్లీ వీరు పూర్వ ప్రాభవాన్ని సాధించగలరా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎప్పుడు పుట్టిందీ ఖచ్చితంగా చెప్పడం కష్టమే. ఆప్‌ను స్థాపించింది 2012 ఆగస్ట్ 4న అని చెప్పవచ్చు. ఎందుకంటే, అదే రోజు ఈ పార్టీ స్థాపకులు అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా రాజ కీయాలు మురికి కూపం అని వర్ణించాక కొత్త పార్టీ పెడుతున్నట్టు వెల్లడిం చారు. ఇండియా అగ్నెస్ట్ కరప్షన్ పేరిట అవినీతి వ్యతిరేక పోరాటం ఉధృ తంగా దేశవ్యాప్తంగా సాగిన 2010లో ఆప్ పుట్టుకకు మూలాలు ఉన్నాయని నా పుస్తకంలో రాశాను. ఈ పార్టీకి ప్రధాన చిహ్నంగా, ప్రచారకర్తగా అన్నా హజారే దొరికారు. ఈ అవినీతి వ్యతిరేక ఆర్కెస్ట్రా నిర్వాహకుడు(కండక్టర్)గా అరవింద్ కేజ్రీవాల్ నిలబడ్డారు. ఈ కొత్త రాజకీయశక్తి స్పష్టమైన రూపం సంపాదించలేకపోయింది.
దీనికి గట్టి మేనిఫెస్టో గానీ, అజెండా గానీ ఎప్పుడూ లేదు. జన్ లోక్‌పాల్ అనే జనాస్త్రంతో అవినీతి రాక్షసిని అంతమొం దించడం ఒక్కటే దాని లక్ష్యంగా కనిపించింది. పార్టీకి సిద్ధాంతమంటూ లేదు. దాని వల్ల దేశం నలుమూలల నుంచీ జనం ఆప్ వేదికపైకి వచ్చి అన్నా హజారే వెలుగులో మురిసిపోవడానికి, మెరిసిపోవడానికి వీలయింది. పత్రి కల్లోనే గాక, సామాజిక మాధ్యమాల్లో కూడా వారికి మంచి ప్రచారం లభిం చింది. ఏ విషయంపైనా బలమైన అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా దేని పైనా విభేదాలు రాకుండా నివారించడమే పంథాగా ఈ వేదిక మొదలైంది.
పూర్తి వ్యతిరేక భావాలున్న ఇద్దరు కాషాయాంబరధారులైన స్వామి అగ్నివేశ్, బాబా రాందేవ్ ఈ వేదికపై ఒకేసారి కనిపించే అవకాశం వచ్చింది. వామ పక్షం వైపు మొగ్గే లాయర్ ప్రశాంత్ భూషణ్, మితవాదిగా ముద్రపడిన కవి కుమార్ విశ్వాస్–ఈ ఇద్దరికీ ఆప్ స్థానం కల్పించింది. ఆప్ తెగింపు, ఆదర్శాలు మీడి యాలోని పలువురు యువకులను ఆకట్టుకున్నాయి. జర్నలిస్టులుగా పని చేసిన ఆశిష్ ఖేతాన్, మనీష్ సిసోడియా, అశుతోష్‌లు వారిలో ప్రముఖులు.
సామాజిక కార్యకర్తలకు కేంద్రం!
మేధా పాట్కర్ నుంచి అఖిల్ గోగోయ్, మయాంక్ గాంధీ వరకూ అనేక మంది సామాజిక కార్యకర్తలకు ఇది పెద్ద కేంద్రస్థానంగా మారింది. వివిధ వృత్తుల్లో నిపుణులు(మీరా సన్యాల్), విశ్రాంత సీనియర్ ఉన్నతాధికారులు (పుణెలో అరుణ్ భాటియా), జడ్జీలు(సంతోష్ హెగ్డే) వంటి ప్రముఖులెంద రినో ఆప్ ఆకర్షించింది. అలాగే, యోగేంద్ర యాదవ్ వంటి వామపక్షవాదు లైన లిబరల్ మేధావులూ ఈ కొత్త రాజకీయపక్షానికి చేరువయ్యారు. ఆప్ అంటే విపరీత స్థాయిలో ప్రజల్లో ఉత్సాహం ఉప్పొంగిన ఆ రోజుల్లో ప్రజా ఉద్యమంగా పుట్టిన ఆప్ ఉద్దేశాలు, పద్ధతులను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఓ మోస్తరుగా ప్రశ్నించిన మాలాంటి వారిని దుర్భాషలాడారు. దుమ్మెత్తిపోశారు.
ఈ వేదిక దేని కోసం నిలబడుతోంది? అనేదే మా ప్రధాన ప్రశ్న. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సొంతగా రాసిన సంక్షిప్త మేనిఫెస్టోను చదవాలని మాకు సలహా ఇచ్చారు. దీన్ని చదవగానే కొన్ని వాస్తవ దూరమైన కథలను ఒక చోట గుచ్చినట్టు (అరవింద్ చిత్ర కథ) అనిపించింది. ఓ సిద్దాంతం లేకుండా నాలుగు కాలాలు సాగే రాజకీయ మార్గాన్ని నిర్మించలేరనీ, కేవలం అవినీతి వ్యతిరేకంగా పోరాడితే చాలదనేది మా వాదన. దీంతో, రాజకీయాలపై ఆసక్తి లేకుండా ఇలాంటి ప్రశ్న అడిగే ధైర్యం మీకు ఎక్కడిదంటూ మాపై మండిపడ్డారు. మేరా నేతా చోర్ హై(మా నాయకుడు దొంగ) అనేది వారి ప్రధాన నినాదమైతే వారికి రాజకీయ సిద్ధాం తం ఎక్కడుంటుంది? పార్లమెంటును దొంగలు, బందిపోట్ల స్థావరంగా వారు వర్ణించారు. జన్‌లోక్‌పాల్‌లో నోబెల్, మేగససే అవార్డుగ్రహీతలు సహా రాజకీయాలతో సంబంధం లేని వారు ఉండాలనీ, సీబీఐ సర్వస్వతంత్ర సంస్థగా పనిచేయాలనేవి వారి నిశ్చితాభిప్రాయాలు. చివరికి, ‘‘వ్యవస్థను మార్చడానికి మరో మార్గం లేదు’’ అంటూ వారే ఓ శుభ ముహూర్తాన రాజ కీయ నాయకులుగా అవతారమెత్తారు.
పొందిక లేని ‘యువ’ నేతల పార్టీ ఆప్!
సంప్రదాయానికి భిన్నంగా కాస్త చిన్న వయసులో ఓ ప్రజా ఉద్యమాన్ని తెలివిగా, చురుకుగా నడిపిన నాయకులు రాజకీయపక్షంగా రూపాంతరం చెందారు. ముందే ఊహించినట్టే పొందిక, కుదురు లేకపోవడమే ఆప్‌కు ప్రధాన సవాలుగా మారింది. అధికారం అందుకున్నాక వారిని కలిపి ఉంచా ల్సిన లక్ష్యం గాలికి కొట్టుకుపోయింది. ఇప్పుడు వారిని నడిపించే లక్ష్యం అవినీతిని తుదముట్టించడం కాదు. సాధ్యమైనంత వరకూ స్వచ్ఛమార్గంలో పాలన అందిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలబడటమే వారి ఉద్దేశంగా కనిపిం చింది. ఇలాంటి ప్రణాళికలు ఎప్పుడూ విజయవంతం కావని అనుభవాలు చెబుతున్నాయి.
అత్యంత జనాదరణ కలిగిన అస్సాం విద్యార్థి ఉద్యమం బలమైన రాజకీయ పార్టీగా (అస్సాం గణపరిషత్) నిలబడలేక కుప్ప కూల డమే ఇందుకు మంచి ఉదాహరణ. ఆప్‌లాగే ఈ విద్యార్థి నేతలు 1985లో జరి గిన తమ తొలి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. విదేశీ పౌరులను బయటికి పంపాలనే లక్ష్యం ఆచరణలోకి రాలేదు. ఈ పార్టీ నేతలు ఎంతో కాలం కలిసి నడవలేకపోయారు. విదేశీయుల వ్యతిరేక ఉద్యమ నేతలు ఎంతోమంది నేడు బీజేపీలో ఉన్నారు. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, కీలక మంత్రి హిమంతా బిశ్వశర్మ ఇలాంటి నేతలే. ఏజీపీగా మిగిలిన అతి పెద్ద చీలికవర్గం ప్రస్తుతం బీజేపీ జూనియర్ భాగస్వామిగా సంకీర్ణ సర్కా రులో కొనసాగుతోంది. గతంలో ఏజీపీ వామపక్షాలతో కలిసి పాలన సాగిం చడం విశేషం. లక్ష్యం మాయమైంది. శూన్యాన్ని భర్తీ చేయడానికి సిద్ధాంతం మిగలలేదు. ఎవరి దారి వారిది. ఇవే ఏజీపీ దుస్థితికి కారణాలు.
ఒక్క తేడా మినహాయిస్తే ఆప్ కూడా పైన చెప్పిన పరిస్థితినే ఎదుర్కొం టోంది. ఆప్ స్థాపకుల్లో ప్రముఖులైన ఎందరో నిరాశానిస్పృహలతో పార్టీ నుంచి దూరమయ్యారు. వారిలో ప్రసిద్ధులైన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ సామ్యవాద సిద్ధాంతాలతో రాజకీయపార్టీ ప్రారంభించారు. మరి కొందరు ఆప్‌పై తమ ఆగ్రహాన్ని భిన్న మార్గాల్లో వ్యక్తంచేస్తున్నారు. కేజ్రీవాల్ అధికార ఉన్మాదంతో నడుస్తున్నారని అన్నాహజారే తరచు విమర్శిస్తున్నారు. మయాంక్ గాంధీ ఇటీవల ఆప్ నేతల పోకడలపై ఆగ్రహం ప్రకటిస్తూ పుస్తకం రాశారు. కేజ్రీవాల్ తన కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన మాజీ మంత్రులు ఆయనకు వ్యతిరేకంగా ట్విటర్‌లో నిప్పులు కక్కుతున్నారు.
తాజాగా ఇప్పుడు పంజాబ్‌లో పార్టీ నాయకత్వం కీచులాటల నుంచి సంక్షోభంలోకి పయనిస్తోంది. ఏడాది క్రితం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించి జాతీయ శక్తిగా ఆవిర్భవిస్తుందని అంచనాలు వేశారు. అయితే, ఇక్కడ మనం ప్రజా ఉద్యమాల నుంచి రాజకీయపక్షాలుగా అవతరించిన ఏజీపీ, ఇతర చిన్న పార్టీలకూ, ఆప్‌కూ మధ్య ఉన్న ఒక తేడా గమనించాలి. ఈ పార్టీలకు లేని తిరుగులేని నేత అరవింద్ కేజ్రీవాల్ ఆప్‌కు ఉన్నారు. 2010 నుంచి అంటే గడచిన ఎనిమిదేళ్లుగా అధికార రాజకీయాలను ప్రధాని నరేంద్ర మోదీ తరహాలో ఎలాంటి దయాదాక్షిణ్యాలకు తావులేకుండా నడుపుతున్న నేతగా కేజ్రీవాల్ పేరు తెచ్చుకున్నారు. ఫలితంగా ఆప్ తన లక్ష్యాలను కోల్పో యింది. వ్యక్తిపూజకు నిలయంగా మారింది.
ఈ క్రమంలో ఎలాంటి నిచ్చెన మెట్ల అధికార వ్యవస్థలేని రాజ కీయపక్షంగా రూపుదిద్దుకుంది. తన నాయక త్వానికి పోటీ లేదా సవాలు ఎదురైతే–మోదీ మాదిరిగానే కేజ్రీవాల్ కూడా ‘మమ్మల్ని ఢీకొనే వారెవరైనా పచ్చడి పచ్చడి కావాల్సిందే’ అనే సూత్రాన్ని అమలు చేస్తారు. అయితే, పార్టీ లోపల సవాలు చేసేవారిపై, బయటి ప్రత్య ర్థులపై కేజ్రీవాల్ మరో ఎత్తుగడ ప్రయోగిస్తారు. వారిపై అత్యంత తీవ్ర ఆరో పణలు చేయడం, ముఖ్యంగా ఆ వ్యక్తుల నిజాయితీని అనుమానించే రీతిలో అడ్డగోలుగా దాడిచేయడం ఆయ నకు ఆనవాయితీ. ఈ అభియోగాల నిరూ పణకు సాక్ష్యాధారాలు ఉన్నాయా? లేవా అన్నది ఆయనకు అనవసరం.
దూషణలతో భయపెట్టే ఎత్తుగడలు చెల్లుతాయా?
నిజజీవితంలో ప్రతిదీ దాని నిర్దిష్ట గడువుతేదీతో వస్తుంటుంది. అనాగరికమైన నిందలతో భయపెట్టే ఎత్తుగడ మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది. తన పరిశుద్ధమైన ప్రతిబింబం ఆ ఆరోపణలకు బలం చేకూర్చుతుంది. రెండు తాను ఏ కోశానా భయం లేని తిరుగుబాటుదారు కాబట్టి తాను చేసే ఈ దాడులు ప్రజల ప్రశంసకు పాత్రమవడమే కాకుండా తను గురిపెట్టిన లక్ష్యాలను నైతికంగా దిగజార్చివేస్తాయి. చివరగా, అతడి బాధితులు న్యాయస్థానానికి వెళ్లినప్పటికీ, న్యాయ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతుంటుంది. భారత్‌లో ఉత్తమ విద్యావంతులైన నేతల నేతృత్వంలో ఉన్న అతి తరుణ రాజకీయ పార్టీ కూడా అత్యంత అసభ్యంగా, మొరటుగా వ్యవహరిస్తుందనే ఒక విచారకరమైన రాజకీయ అభాసను అది సృష్టిస్తుంది.
ఈ మూడు కారణాలు కూడా ఇప్పుడు మారిపోయాయి. అధికారంలో కొనసాగుతున్న మూడేళ్ల కాలంలోనే కేజ్రీవాల్ తాను స్వయంగా ఎంపిక చేసుకున్న పార్టీనేతలను.. అవినీతి నుంచి నైతిక పతనం దాకా వివిధ నేరారోపణలతో మంత్రిమండలి నుంచి తొలగించాల్సి వచ్చింది. దీంతో పార్టీ గొప్పగా చెప్పుకున్న పరిశుద్ధత తన మెరుగును కోల్పోయింది. అరుణ్ జైట్లీపై నిందారోపణలకు సంబంధించి న్యాయ ప్రక్రియ వేగవంతం కావడం కేజ్రీవాల్‌ను భయపెట్టింది. తన బాధితులనుంచి తానెదుర్కొంటున్న న్యాయపరమైన సవాళ్లు (30 పైచిలుకు) దృఢమైనవని, తనను కాపాడలేవని కేజ్రీవాల్‌కి తెలుసు. కాబట్టే ఆయన వెంటనే తిరోగమన బాట పట్టారు. ‘భయంలేని తిరుగుబాటుదారు’ అనే ప్రతిష్టను ఈ వెనుకంజ మసకబార్చేసింది.
మూడేళ్ల క్రితం తాను అనుభవించిన రాజకీయ అధికారంలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే ఆప్ ఇప్పుడు అనుభవిస్తోంది. ఈరోజు ఢిల్లీలో ఏ ఉప ఎన్నిక నిర్వహించినా ఆ పార్టీయే గెలుస్తుంది. కానీ, సగం ఢిల్లీ రాష్ట్రానికి పరిమితమై మమతా బెనర్జీతో సమానంగా నిలబడటం అనేది కేజ్రీవాల్, అతడి పార్టీ పెట్టుకున్న లక్ష్యం కానేకాదు. వాళ్లు వ్యవస్థను మార్చడానికి వచ్చారు. భారత్‌ను రక్షించడానికి వచ్చారు. ఇప్పుడు అదంతా ముగిసి పోయింది. మళ్లీ వీరు పూర్వ ప్రాభవాన్ని సాధించగలరా? రాజకీయాల్లో ఇది జరగదని మీరు ఎన్నటికీ చెప్పలేరు. ఏఏపీ మళ్లీ పునరుత్థానం చెందడాన్ని మనం చూడవచ్చు కానీ అదేరకమైన దూషణ రాజకీయాలతో మాత్రం కాదు.
- శేఖర్ గుప్తా
వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment