
ఆప్ కథ కంచికేనా?!
ఆవిర్భవించిన నాలుగేళ్లకే మనుగడ కోసం పోరాటం
ఢిల్లీ ఎన్నికల్లోనే సునామీ.. ఆనక అంతటా వట్టి గాలి
ఆది నుంచీ అంతర్గత సంక్షోభాలతో అతలాకుతలం
ఒక్కొక్కరుగా దూరమవుతున్న తొలినాటి సహచరులు
కేజ్రీవాల్‘నియంతృత్వ శైలి’పైనే నేతలందరి విమర్శలూ
ఉద్యమ పార్టీని వ్యక్తిస్వామ్య పార్టీగా చేశారంటూ ధ్వజం
ఢిల్లీ మునిసిపల్ఎన్నికల పరాజయంతో మళ్లీ సంక్షోభం
ఇప్పటికి చల్లారినా త్వరలో చీలిక తప్పదంటున్న నేతలు
ఆమ్ఆద్మీ పార్టీ.. భారత రాజకీయాల్లో ఒక సంచలనం. ఆవిర్భవించిన ఆర్నెల్లకే దేశ రాజధానిలో అధికార పీఠం అధిరోహించిన పార్టీ. అంతలోనే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఏడాది తిరగకుండానే సునామీలా చుట్టేసిన పార్టీ. దానికి కారణం.. అది సామాన్యుల కోసం పుట్టిన పార్టీ అని సామాన్య జనం నమ్మడం. విభిన్నమైన రాజకీయ సంస్కృతితో వినూత్న కార్యాచరణతో తమ కష్టాలు తీరుస్తుందని విశ్వసించడం. ఢిల్లీనే కాదు.. దేశ రాజకీయాలనూ ఈ పార్టీ సమూలంగా మార్చివేస్తుందన్న అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. కానీ.. పుట్టిన నాలుగేళ్లకే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దేశ రాజకీయాలను మార్చడం కాదు కదా.. ఢిల్లీ రాజకీయాల్లోనైనా ధీమాగా కొనసాగుతుందా అన్న సందేహం బలపడుతోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటివరకూ ఎక్కడా తన ముద్రను బలంగా వేయలేకపోయిన పార్టీ.. తాజాగా అదే ఢిల్లీ మునిసిపల్ఎన్నికల్లో పరాభవాన్ని ఎదుర్కోవడం.. ఆప్నీటి బుడగేనా అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆది నుంచీ అనేక సంక్షోభాలతో సతమతమవుతున్న పార్టీ తాజాగా మరో సంక్షోభంలో చిక్కుకుంది. ప్రస్తుతానికి అది సమసిపోయినట్లు కనిపిస్తున్నా.. మున్ముందు పార్టీ చీలిపోతుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం.. ప్రజా ఉద్యమం పునాదిగా నిర్మితమైన పార్టీ.. వ్యక్తిస్వామ్య పార్టీగా మారిపోవడమేనని చాలా మంది నాయకులు విమర్శిస్తున్నారు. పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించి.. పార్టీకి సూపర్స్టార్గా పేరుపడ్డ నాయకుడు కేజ్రీవాల్.. తాను పార్టీలో సూపర్మాన్గా మారేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఇప్పుడు పార్టీకి భారంగా మారారన్న అసంతృప్తి బలపడుతోంది.
అన్నా రాజకీయాలు వద్దన్నా..: దేశంలో అవినీతిని అరికట్టేందుకు జన్లోక్పాల్బిల్లును చట్టం చేయాలని అన్నా హజారే నాయకత్వంలో జరిగిన ఉద్యమం నుంచి ఆమ్ఆద్మీ పార్టీ పుట్టింది. ఆ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న అరవింద్కేజ్రీవాల్తదితర సామాజిక ఉద్యమకారులు, కార్యకర్తలు 2012 నవంబర్లో ఈ రాజకీయ పార్టీని స్థాపించారు. నిజానికి ఆ ఉద్యమం ఉద్యమంగానే ఉండాలని, రాజకీయ అనుబంధాలు సరికాదని హజారే బలంగా వారించారు. కానీ.. ఉద్యమం విఫలమైనందున, ప్రత్యక్ష రాజకీయ ప్రమేయం అవసరమని కేజ్రీవాల్వాదించారు. యోగేంద్రయాదవ్, ప్రశాంత్భూషణ్, కుమార్విశ్వాస్, మనీష్సిసోడియా, గోపాల్రాయ్, సంజయ్సింగ్వంటి ప్రముఖ సామాజిక ఉద్యమకారులతో కలిసి పార్టీ పురుడుపోసుకుంది.
ఢిల్లీ తర్వాత పరాజయాల పరంపర..: ఏడాది తిరగకుండానే ఢిల్లీ ఎన్నికల్లో గణనీయమైన విజయం సాధించింది. కాంగ్రెస్మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. కేజ్రీవాల్ముఖ్యమంత్రి అయ్యారు. కానీ.. కాంగ్రెస్తన కృషికి అడ్డుపడుతోందంటూ కేజ్రీవాల్50 రోజులు నిండకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు గాను 67 సీట్లు గెలుచుకుని ఆప్సంచలన విజయం సాధించింది. సామాన్యుడి కోసం సమరాంగణంలోకి దిగిన పార్టీగా.. విభిన్న వినూత్న రాజకీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఆప్ను ఢిల్లీ ప్రజలు ఆదరించారు. కానీ.. ఆప్విజయగాధ అంతటితోనే ఆగిపోయింది.
ఆ తర్వాత అంతా అపజయాల పరంపరగానే మారిపోయింది. ఢిల్లీ ఎన్నికల అనంతరం జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపకపోయింది. ఇటీవల గోవాలో చరిత్ర తిరగరాస్తుందనుకుంటే ఖాతానే తెరవలేకపోయింది. పంజాబ్లో పాగా వేస్తారనుకుంటే పాతిక సీట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 52 శాతం ఓట్లు దక్కించుకున్న ఢిల్లీలోనే తాజా మునిసిపల్ఎన్నికల్లో పాతిక శాతం ఓట్లు కూడా పొందలేకపోయింది.
తప్పుకుంటున్న తొలినాటి సహచరులు..: ఇక పార్టీలో సైతం ఎన్నో సంక్షోభాలతో సతమతమవుతోంది. 2015లో ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే అంతర్గత సంక్షోభం రాజుకుంది. కేజ్రీవాల్నియంతలా వ్యవహరిస్తున్నారంటూ వ్యవస్థాపక సహచరులైన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వారు క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ ఆప్బహిష్కరించింది. వారితో పాటు మరికొందరు నాయకులపైనా వేటు వేసింది. ఆతర్వాత షాజియా ఇల్మీ, మయాంకా గాంధీ వంటి అగ్ర స్థాయి నాయకులు కూడా కేజ్రీవాల్ వ్యవహార శైలిని తప్పుపడుతూ పార్టీ నుంచి తప్పుకున్నారు.
ఇక ఢిల్లీలోని ఆప్ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది తొలి ఏడాదే వివిధ అవినీతి, అక్రమాలు, క్రిమినల్ కేసుల్లో అరెస్టయ్యారు. పంజాబ్లో సగానికి పైగా ఎంపీలు పార్టీని వీడిపోయారు. సచ్చాసింగ్ఛోటేపూర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ వంటి వారితో ఆప్బలపడుతోందని భావించేలోగానే వారూ దూరమైపోయారు. ఇక మిగిలివున్న కేంద్ర బృందంలోనూ.. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలు నేపథ్యంగా లుకలుకలు తీవ్రమయ్యాయి.
బల్లాలదేవలా వ్యవహర శైలి..: పార్టీ విజయం సాధించినపుడు ఆ విజయ ఫలాలను పంచుకునే విషయంలో నాయకుల మధ్య విభేదాలు తలెత్తితే.. ఇప్పుడు పార్టీ వరుస పరాజయాల బాధ్యతను పంచుకునే విషయంలో సమస్యలు ముదిరిపోయాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. మయాంక్గాంధీ ఇటీవల బహిరంగ లేఖలో విమర్శించినట్లుగా.. పార్టీ లోపలా వెలుపలా సంక్షుభిత పరిస్థితులకు ప్రధాన కారణం కేజ్రీవాలేనని విశ్లేషిస్తున్నారు. ‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి పూర్తి ఘనత మీదేనని.. ప్రజలు అరవింద్కేజ్రీవాల్అనే వ్యక్తికి మద్దతిచ్చారని మీరు భావించారు.
కానీ.. వాస్తవానికి ప్రజలను ఆకర్షించింది సరికొత్త రాజకీయ సంస్కృతి అన్న విషయాన్ని విస్మరించారు’ అని మయాంక్ఆ లేఖలో ఎత్తిచూపారు. కేజ్రీవాల్ఆ కొత్త రాజకీయ సంస్కృతిని, తన సహచరులను, స్వచ్ఛంద కార్యకర్తలను బలోపేతం చేయడానికి బదులుగా.. తన వ్యక్తిగత అధికారం మీద, ఆకాంక్షల మీద దృష్టి కేంద్రీకరించారని.. పార్టీలో సూపర్హీరో సంస్కృతి ప్రబలిందని విమర్శకుల వాదన. బాహుబలిలో బల్లాలదేవ లాగా.. కేజ్రీవాల్తననను తాను గొప్పవాడిగా ప్రతిష్టించుకునే ప్రయత్నంలో తనకు పోటీ కాగల వారందరినీ తెరమరుగు చేసేందుకు, అసమ్మతి గళాన్ని నొక్కివేసేందుకు ప్రయత్నించారని పార్టీని తనను అనుయాయుల కోటరీగా మార్చారని ఆయన వ్యతిరేకులు తప్పుపడుతున్నారు.
విశ్వాస్తీవ్రస్వరం.. కేజ్రీవాల్రాజీ..: ఇటీవల పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్భంగపడింది. ఢిల్లీ మునిసిపల్ఎన్నికల్లోనూ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలని ఆప్వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన కుమార్విశ్వాస్పేర్కొన్నారు. ఈ ఓటములకు కారణం ఎలక్ట్రానిక్ఓటింగ్యంత్రాల దుర్వినియోగమేనని కేజ్రీవాల్చేసిన ఆరోపణలతో ఆయన విభేదించారు. అంతేకాదు.. అవసరమైతే పార్టీ నాయకత్వం మార్పు విషయంలో నిర్ణయం తీసుకోవడానికీ ఆప్సంకోచించదని ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు విశ్వాస్కు కీలక బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు కూడా.
దీంతో.. విశ్వాస్పార్టీ నాయకత్వం చేపట్టాలని తహతహలాడుతున్నారని, పార్టీని చీల్చడానికి బీజేపీ ఏజెంటుగా పనిచేస్తున్నారని ఆప్ఎమ్మెల్యే అమానుతల్లాఖాన్ఆరోపణలు ఎక్కుపెట్టడంతో వివాదం ముదిరిపోయింది. ఈ ఆరోపణలపై తీవ్రంగా కలత చెందిన విశ్వాస్.. తనకు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర జరుగుతోందని, ఖాన్కేవలం ఆ కుట్రకు ముసుగు మాత్రమేనని బాహాటంగా ఆరోపిస్తూ త్వరలో కీలకమైన నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. దీంతో కేజ్రీవాల్నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. ఉపముఖ్యమంత్రి మనీష్సిసోడియా తదితరులతో కలిసి మంగళవారం రాత్రి స్వయంగా విశ్వాస్ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. విశ్వాస్ కేజ్రీవాల్ల మధ్య రాజీ కుదిరిందని, సంక్షోభం సమసిపోయిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం అమానుతుల్లాఖాన్ని పార్టీ నుంచి సస్పెండ్చేశారు.
ఎదిగనంత వేగంగానే పతనం..?: కేజ్రీవాల్అనూహ్య రాజకీయ ఎదుగుదల అంతే వేగంగా పతనమవుతోందని.. పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, నాయకుల్లో అసమ్మతి పెరిగిపోతోందని.. అది త్వరలోనే కేజ్రీవాల్ను చుట్టుముట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆప్ఉద్యమ స్ఫూర్తిని కేజ్రీవాల్దగాచేశారని చాలా మందిలో ముఖ్యంగా పార్టీ ఎమ్యెల్యేలు కొందరిలో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్తున్నారు. కేజ్రీవాల్, ఆయన కోటరీ కార్యకర్తలకు దూరమైపోయారని.. నిర్ణయాధికారాన్ని కేంద్రీకృతం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. తాజా సంక్షోభంలో చాలా మంది ఎమ్మెల్యేలు విశ్వాస్కు మద్దతుగా నిలిచారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా, పార్టీ జాతీయ కన్వీనర్గా రెండు అత్యున్నత పదవుల్లోనూ కేజ్రీవాలే ఉన్నారని.. ఆయన ఏదో ఒక పదవి నుంచి తప్పుకుంటే ఉత్తమమని పార్టీలో మరికొందరు నాయకులు భావిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు సీఎం పదవి అప్పగించి.. కేజ్రీవాల్పార్టీ పునర్నిర్మాణంపై దృష్టిసారిస్తే బాగుంటుందని కొందరు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. సిసోడియా కూడా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆప్అనేది కేజ్రీవాల్కో మరొకరో ఎవరో ఒక్కరికి చెందిన పార్టీ కాదని, ఇది కార్యకర్తల పార్టీ అని, పార్టీని పరిరక్షించుకోవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఆప్రాబోయే రోజుల్లో చీలడం తధ్యమని, కేజ్రీవాల్ముఖ్యమంత్రి పదవిని కూడా కోల్పోవాల్సి రావచ్చునని ఢిల్లీ రాజకీయ వర్గాల్లోనే కాదు.. ఆప్నేతల్లోనే చాలా మంది బలంగా విశ్వసిస్తున్నారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్)