మనం గుర్తించని వ్యూహాత్మక తప్పిదం | Shekhar Gupta Article On Pakistan Intervening Into Indian Politics | Sakshi
Sakshi News home page

మనం గుర్తించని వ్యూహాత్మక తప్పిదం

Published Sat, Apr 13 2019 1:22 AM | Last Updated on Sat, Apr 13 2019 1:22 AM

Shekhar Gupta Article On Pakistan Intervening Into Indian Politics - Sakshi

పాకిస్తాన్‌ బూచిని చూపి మరోసారి అధికారంలోకి రావచ్చని బీజేపీ–మోదీలు పెను ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దానికి అడ్డుకట్ట వేశారు. పైగా ఎన్నికల నేపథ్యంలో భారతీయ ప్రజాభిప్రాయాన్ని వేరుపర్చే కీలక పాత్రను ఇమ్రాన్‌ పోషిస్తున్నారు. నరేంద్రమోదీ, బీజేపీ రెండోసారి అధికారంలోకి వస్తే పాక్‌కి మేలు చేకూరుతుందని, కశ్మీర్‌ సమస్యకు ఉత్తమ పరిష్కారం లభించవచ్చని ఇమ్రాన్‌ చేసిన ప్రకటన మన వ్యూహాత్మక తప్పిదాన్ని స్పష్టంగా ఎత్తిచూపింది. మన నేతలు ప్రజలను రాజకీయాల కోసం వేరుచేశారు. దేశం నిలువుగా చీలిపోయిన నేపథ్యమే మన ప్రత్యర్థికి మన అంతర్గత రాజకీయాల్లో వేలుపెట్టే అవకాశాన్ని కల్పించింది.

వార్తలు నివేదించడానికి నేను తరచుగా పాకిస్తాన్‌ ప్రయాణిస్తూ ఉండేవాడిని. ఆ క్రమంలో నేను పాక్‌ వెళ్లడానికి మరోసారి వీసా అప్లికేషన్‌ దాఖలు చేస్తున్నప్పుడు న్యూఢిల్లీలో బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రముఖ పాక్‌ హైకమిషనర్‌ ఒకరు నన్ను పరిహసించడమే కాకుండా కొంచెం ఆగ్రహంతో ప్రశ్నించారు. ‘‘నా దేశ వ్యవహారాల్లో మీరెందుకు ఇంత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు?’’

‘‘పాకిస్తాన్‌ రాజకీయాలు భారత అంతర్గత వ్యవహారం కదండీ’’ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో నేను ఆయనకు జవాబిచ్చాను. కాని ఇది తల్లకిందులుగా మారి, భారత్‌ రాజకీయాలు పాకిస్తాన్‌ అంతర్గత వ్యవహారాలుగా మారే పరిస్థితి వస్తుందని ఆరోజు మేం అస్సలు ఊహించలేకపోయాం. నరేంద్రమోదీ, బీజేపీ రెండోసారి అధికారంలోకి వస్తే పాకిస్తాన్‌కి మేలు చేకూరుతుందని, కశ్మీర్‌ సమస్యకు ఉత్తమ పరిష్కారం లభించవచ్చని ఈ వారం మొదట్లో ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన ప్రకటనను మనం ఇలాగే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భారతీయ ఎన్నికల ఫలి తంపై ఇంత స్పష్టంగా తన వైఖరిని గతంలో ఏ పాక్‌ ప్రధాని అయినా ప్రదర్శించిందీ లేనిదీ గుర్తు చేసుకోవడం కష్టమే. పాకిస్తాన్‌ పౌరులు భారత్‌లో ఓటు వేయరు. భారతీయ ఓటర్లు ఇమ్రాన్‌ మాటలను వినరు. కాబట్టి భారత్‌లో ఒక అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారంటూ మనం ఇమ్రాన్‌ను నిందించలేం. 

ఈ అంశంపై ఎలక్షన్‌ కమిషన్‌ ఇమ్రాన్‌కి నోటీసు పంపలేదు. ఎందుకంటే ఈసీ నియమావళి పాకిస్తాన్‌లో వర్తించదు. కానీ ఇమ్రాన్‌ ప్రకటనపై భారత విదేశాంగ శాఖ  సైతం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇక ఖండన గురించి చెప్పపనిలేదు. ఈ మౌనం మనకు ఏం సూచి స్తోంది? బహుశా ఈ మౌనానికి కారణం ఉంది. వ్యవస్థ మొత్తంగా ఒకే ఒక సుప్రీం లీడర్‌కి జవాబుదారీగా ఉంటున్నందున (ఇది నరేంద్రమోదీ గురించి నేను చేసిన వర్ణన కాదు. బీజేపీ ప్రతినిధి సంబిత్‌ పాత్రా వర్ణన) మోదీని సమర్థిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఇమ్రాన్‌ ప్రకటనను ఖండించే ప్రమాదాన్ని ఎవరూ స్వీకరించడం లేదు. ఆ ప్రకటన ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు. కానీ ఆ ప్రకటనను ఎవరూ స్వాగతించడానికి సాహసించడం లేదు. అలాగని ఇమ్రాన్‌కి ధన్యవాదాలు చెప్పడం లేదు. ఎందుకంటే, నరేంద్ర మోదీని మరోసారి భారత ప్రజలు ఎన్నుకుంటే పాకిస్తాన్‌కు అది మంచిచేస్తుందని, భారత్‌తో శాంతి స్థాపనకు ఇది సానుకూలమవుతుందని ఇమ్రాన్‌ చెప్పారు మరి.

కేంద్రప్రభుత్వ ఎన్నికల ప్రచారంలోని కీలక ప్రభావిత అంశాలకు ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కల్పన, దేశాభివృద్ధి వంటి అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని పాకిస్తాన్, ఉగ్రవాదం, ముస్లింలవైపు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వానికి నెలల సమయంపట్టింది. ఎంత సుదీర్ఘకాలం కొనసాగినా సరే.. నిర్ణయాత్మక యుద్ధం చేయడం ద్వారా పాక్‌కు గుణపాఠం చెబుతామనే హామీ ద్వారా మళ్లీ గద్దెనెక్కాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది. పాకిస్తాన్‌తో శాంతిస్థాపన అంశంపై అది ఓటు అడగటం లేదు. ఈ కోణంలో ఇమ్రాన్‌ వ్యక్తం చేసిన మెత్తటి మాటలు తనను ఏదోలా ఉచ్చులోకి దింపాలని చూస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో పాక్‌ కేంద్ర బిందువుగా మారడం మన రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారి అని ముగించడం సంబద్ధంగా ఉంటుంది. 

ప్రత్యర్థి విసిరిన ఉచ్చులో చిక్కుకున్నదెవరు, దాంట్లోంచి తప్పించుకున్నదెవరు? అనే అంశానికి సంబంధించి మనం చాలా విషయాలు చూడవచ్చు. ఇంతవరకు దేశ చరిత్రలో ఎవరూ చేయనివిధంగా భారతీయ వ్యూహాత్మక విధానాన్ని ఎన్నికల అంశంగా మార్చుకోవడానికి పాక్‌ పూనుకుంది. సరిగ్గా ఇలాంటి ఘటనకు సంబంధించి ఒక ఉదాహరణ ఉంది. 1980 నాటి ఎన్నికల కేంపెయిన్‌లో ఇందిరాగాంధీ పదేపదే ఒక విషయాన్ని ఎత్తి చూపేవారు. మొరార్జీ దేశాయి నేతృత్వంలోని జనతా ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉంటోందంటే అతి చిన్న దేశాలు సైతం భారత్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి పూనుకుంటున్నాయి అని ఆమె విమర్శించేవారు. 

ఇక పాకిస్తాన్‌కు సంబంధించినంతవరకు 1990ల ప్రారంభంలో బేనజీర్‌ భుట్టో భారత రాజకీయాలపై ముఖ్య ప్రకటన చేశారు. అది ఎన్నికల సమయం కాదనుకోండి. ఒకవైపు కశ్మీర్‌ తగలబడిపోతుండగా పీవీ నరసింహారావు మౌనమునిలా చూస్తుండిపోతున్నారని, భారత్‌లో ఎవరితో సంప్రదించవచ్చో తనౖకైతే తెలియదని ఆమె ప్రకటించారు. గాంధీ (నెహ్రూ, ఇందిర) కుటుంబసభ్యులు అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేదని ఆమె మరికాస్త జోడించారు.
బేనజీర్‌ చేసిన ఆ అహంకార ప్రకటనకుగాను బారత్‌ ఆమెకు భయానక అనుభవాన్ని రుచిచూపుతుందని ప్రధానమంత్రి పీవీ కొంతమంది సంపాదకులతో భేటీ సందర్భంగా ఆగ్రహ ప్రకటన చేశారు. దాంట్లో భాగంగానే ఆయన మొదట్లో కశ్మీర్‌ ఉగ్రవాదం తొలి దశ పోరాటాలను ధ్వంసం చేసిపడేశారు. అంతకంటే మిన్నగా పంజాబ్‌లో ఖలి స్తాన్‌ తీవ్రవాదాన్ని తుదముట్టించేశారు. దేశీయ రాజకీయాల్లో పాకిస్తాన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంలో పీవీ చాలా తెలివిగా ఉండేవారు. భారత ఎన్నికలపై ఏనాడూ ప్రభావితం చూపని పాకిస్తాన్‌ను అవకాశం ఇవ్వని వ్యూహాత్మక విజ్ఞత పీవీలో చాలా ఎక్కువగా ఉండేది. 

ప్రస్తుతం పాకిస్తాన్‌కి సరిగ్గా అలాంటి బహుమతినే బీజేపీ మోదీ ప్రభుత్వం అందించింది. ఇది తన ఉచ్చులో తానే పడిన చందంగా ఉంది. ఇప్పుడు భారత రాజకీయాలు పాకిస్తాన్‌ అంతర్గత వ్యవహారాలుగా కనిపిస్తున్నాయి. మన దేశీయ రాజకీయాల్లో పాకిస్తాన్‌ బహిరంగ జోక్యం పట్ల ఎలా ప్రతిస్పందించాలో మోదీ ప్రభుత్వానికి తెలియడం లేదు. ఇంకా పెద్ద సమస్య ఏమిటంటే, ఈ వైరుధ్యాన్ని తక్కిన ప్రపంచం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. భారత్‌లో అధికారంలో ఉన్న వారు పాకిస్తాన్‌ని శత్రువుగా చేసి తీవ్ర జాతీయవాద ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మరోవైపున పాకిస్తాన్‌ భారత్‌లో మోదీ ప్రభుత్వమే మళ్లీ ఎన్నికవ్వాలని కోరుకుంటోంది. దీనిపై మీరు సొంత వ్యాఖ్యానాలు చేసుకోవచ్చు. ఇది దక్షిణాసియాలో మాత్రమే సంభవిస్తుంది. ప్రపంచం ఇప్పుడు పైనుంచి కిందికి, కింది నుంచి పైకి తలకిందులుగా మారిపోయినట్లుంది.

కౌటిల్యుడి నుంచి మాకియవెల్లి, హెన్రీ కిసింజర్‌ వరకు ఎవరి విజ్ఞతకు ప్రాధాన్యత ఇవ్వాలనేది మీరే ఎంచుకోవచ్చు. మనందరం మూడు కీలక అంశాలపై ఏకీభావం తెలుపుతాం. 1. మీపై మీరే జోస్యం చెప్పుకోవద్దు. 2. ఏ దశలోనైనా సరే మీ ప్రజాభిప్రాయాన్ని విభజించేటటువంటి దుస్థితిని మీరు ఎన్నడూ అనుమతించవద్దు. 3.అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, నీ దేశ జనాభాలో 15 శాతం, ఆర్థిక వ్యవస్థలో 11 శాతం, మీ విదేశీ మారక నిల్వల్లో 2.5 శాతం మాత్రమే ఉన్న ఒక విఫలదేశానికి.. వచ్చే అయిదేళ్లు మిమ్మల్ని ఎవరు పాలించాలి అనే అంశంపై ప్రభావితం చేసే అవకాశాన్ని మీరు ఎన్నటికీ ఇవ్వవద్దు. దానికి అనుమతించవద్దు. అమెరికా ఎన్నికలపై రష్యా ప్రభావం గురించి ముల్లర్‌ విచారణ కొనసాగడం, జూలియన్‌ అసాంజె అరెస్టుతోపాటు మనకు కూడా తాజా సందర్భం సవాలు విసురుతోంది. ఒక అతిచిన్న, పేద, నిరంకుశ, అణ్వాయుధాలు కలిగిన దేశం.. ప్రపంచంలోనే అతి పెద్ద శక్తివంతమైన ప్రజాస్వామిక వ్యవస్థను దాని ఎన్నికల సందర్భంగా ప్రభావితం చేసి దాని ఫలితాన్ని నిర్దేశించేందుకు పావులు కదుపుతోంది.

పాకిస్తాన్‌ చేస్తున్న ఈ ప్రయత్నానికి మూడు కోణాలు ఉన్నాయి. అనేక రహస్యాలను తనలో ఉంచుకున్న వ్యవస్థకు వ్యతిరేకంగా ఉదారవాదంతో కూడిన వైరాగ్యాన్ని పెంచడం, ప్రజాస్వామిక వ్యవస్థల విశ్వసనీయతను ధ్వంసం చేయడం, బలమైన రాజకీయ నేతల వ్యక్తిత్వ హననాలకు పాల్పడటం. ఒకప్పుడు అసాంజే, స్నోడెన్‌ అమెరికా సమాజానికి నిజమైన ఉదార ప్రతీకలుగా ఉండేవారు ఇప్పుడు వారు అమెరికా రాజకీయాలను వినాశనం దారి పట్టించినందుకు వీరిని ద్వేషించాల్సిన వ్యక్తులుగా అమెరికా ఉదారవాద మీడియా ముద్రిస్తోంది. అయితే ఈ విషయంలో మనం మరీ అతిగా వ్యవహరిస్తున్నామా? చిన్నదేశమైన పాకిస్తాన్‌ని మహా రష్యాతో పోలుస్తున్నామా? ఒక విషయం గుర్తుంచుకోండి. రష్యన్‌ ఆర్థిక వ్యవస్థ నేడు భారత్‌ ఆర్థిక వ్యవస్థలో సగంకంటే ఎక్కువగానూ, అమెరికా ఆర్థిక వ్యవస్థ అతి చిన్న భాగంగానూ ఉంటోంది. 

మీరు మరీ మేధావిగా ఉండనక్కరలేదు. పాకిస్తాన్‌లో మూడు నక్షత్రాలు ధరించిన సగటు పాక్‌ జనరల్‌ ఐఎస్‌ఐలో లేక దాని ఒకానొక డైరెక్టొరేట్లలో కూర్చుని ఉంటున్నట్లు, అతడి తెలివి తన మెదడులో కాకుండా కాళ్లలో ఉంటుందని ఊహించుకోండి. మోదీ, బీజేపీ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలవాలని తామెందుకు భావిస్తున్నాం అనే అంశాన్ని ఇమ్రాన్‌ నిజంగానే ప్రపంచానికి చెబుతున్నారనుకోండి. ఇలాంటి సైనిక జనరల్‌ ఇమ్రాన్‌కి ఇచ్చే సలహా ఎలా ఉంటుందో తెలుసా? కశ్మీర్‌లోని కొంత భాగాన్ని ధ్వంసం చేయాలని, సర్జికల్‌ దాడులకు తిరుగు సమాధానం ఇవ్వాలని మాత్రమే. భారత్‌లో ఎవరైనా స్నోడెన్, అసాంజే లాంటి ఉదారవాదులు ఉన్నారా అని కనుగొనే ప్రయత్నం కూడా ఆ పాక్‌ జనరల్‌ చేయడు. 
పాకిస్తాన్‌ అలాంటి ప్రయత్నం చేస్తుందా? నాకైతే తెలీదు. చేస్తుం దని ఆశకూడా లేదు. మనం ఇప్పటికే చేసిన వ్యూహాత్మక ఘోర తప్పిదాన్ని చూడలేకపోవడం అనే బాధాకరమైన వాస్తవం నుంచి మనల్ని మనం దాపెట్టుకుంటున్నాం. ఆ తప్పిదం ఏమిటి? మన శత్రువును దేశీ యంగా ప్రజలను వేరుచేసే అంశంగా మల్చడం, మన అంతర్గత వ్యవహారాల్లో వారికి చోటు కల్పించడం.

వ్యాసకర్త : శేఖర్‌ గుప్తా, ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement