పాక్‌ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: భారత్‌ | India summons Pakistan Diplomat Decision On Gurdwara Kartarpur Sahib | Sakshi
Sakshi News home page

పాక్‌ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసిన భారత్‌

Published Fri, Nov 6 2020 7:36 PM | Last Updated on Fri, Nov 6 2020 7:50 PM

India summons Pakistan Diplomat Decision On Gurdwara Kartarpur Sahib - Sakshi

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌:  కర్తార్‌పూర్‌ సాహెబ్‌ గురుద్వారా నిర్వహణ అంశంలో దాయాది దేశం పాకిస్తాన్‌ తీసుకున్న నిర్ణయంపై భారత్‌ స్పందించింది. ఈ విషయంపై వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా పాక్‌ దౌత్యవేత్తకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు.. సిక్కుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఉన్న పాక్‌ ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌  సాహెబ్‌ తనువు చాలించిన కర్తార్‌పూర్‌ గురుద్వారను సిక్కులు పవిత్ర స్థలంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో గల కర్తార్‌పూర్‌(భారత్‌- పాకిస్థాన్‌ సరిహద్దు నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది)లో ఉన్న ప్రసిద్ధ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని భావిస్తారు. అంతటి ప్రాముఖ్యం గల ఈ గురుద్వార నిర్వహణను ఇప్పటి వరకు పాకిస్తాన్‌ సిక్కు గురుద్వార ప్రబంధక్‌ కమిటీ(పీఎస్‌జీపీసీ) పర్యవేక్షించేది. 

అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాక్‌ ప్రభుత్వం ఈ బాధ్యతలను ఎవక్యూ ట్రస్ట్‌ ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ- ముస్లిం బాడీ- ప్రభుత్వ సంస్థ)కు అప్పగించిది. ఈ మేరకు నవంబరు 3న ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిక్కువర్గం, పీస్‌జీపీసీకి తిరిగి బాధ్యతలు అప్పగించాల్సిందిగా డిమాండ్‌ చేస్తోంది. భారత్‌లోనూ ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో శిరోమణి గురుద్వార ప్రభందక్‌ కమిటీ(ఎస్‌జీపీసీ) పాకిస్తాన్‌ హైకమిషన్‌కు లేఖ రాసింది.  ఇక పంజాబ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ ఈ అంశంలో జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు.(చదవండి: భగ్గుమన్న భారత్‌.. పీఓకే ఆక్రమణ..!)

సిక్కులపై వివక్ష చూపుతున్న పాక్, కనీస మర్యాద లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ఇక కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ సైతం.. పాక్‌ నిర్ణయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, గురుద్వార బాధ్యతలు తిరిగి సిక్కు బోర్డుకు అప్పగించాలన్న డిమాండ్‌ను పాక్‌ తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం, పాక్‌ దౌత్యవేత్త వివరణ కోరుతూ సమన్లు జారీ చేయడం గమనార్హం. కాగా గురునానక్ 550వ జయంతి సందర్భంగా... గతేడాది నవంబరు 9న కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తద్వారా భారత్‌లోని సిక్కు తీర్థ యాత్రికులు వీసా లేకుండా పవిత్ర కర్తార్‌పూర్‌ సాహిబ్‌ వెళ్లే అవకాశం లభించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement