సుస్థిరమైన, పూర్తి మెజారిటీ ప్రభుత్వాలు ముగిసిన తర్వాతే, దేశంలో ఆర్థిక సంస్కరణలు స్పష్టమైన రూపం తీసుకోవడం కాకతాళీయం. కాంగ్రెస్ పార్టీ పతనం తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం స్వల్పకాలం మాత్రమే మనగలగడంతో సంస్కరణల పరీక్షలో పాస్ కాలేకపోయింది. కానీ అతిపెద్ద సంస్కరణల ప్రభంజనం పీవీ నరసింహారావు అస్థిర ప్రభుత్వం ద్వారానే సాకారమైంది. తర్వాత వచ్చిన చంద్రశేఖర్, వాజపేయి ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలే అయినా నాటి, నేటి సుస్థిర ప్రభుత్వాలు కూడా చేపట్టలేని సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నాయి. అందుకే మన భవిష్యత్తుకు సుస్థిర ప్రభుత్వాలు అవసరం అంటున్న అజిత్ దోవల్ ప్రతిపాదన వాస్తవ సమ్మతం కాదు.
రాబోయే పదేళ్ల కాలానికి భారత్‌కు కఠిననిర్ణయాలు తీసుకోగలిగే, సుస్థిరమైన, మెజా రిటీ ప్రభుత్వం అవసరం ఎంతైనా ఉందంటూ, ఈ గురువారం సర్దార్ పటేల్ స్మారకోపన్యాసం సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్ చేసిన వ్యక్తీకరణపై అన్యాయంగా దాడి చేస్తున్నారు. ఆయనపై ఈ రకమైన దాడి అభ్యంతరకరమైనది. జాతీయ భద్రతా సలహాదారు ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఆ పదవి రాజకీయ నియామకంతో కూడినది. కాబట్టి తన ఓటింగ్ ప్రాధాన్యతలను ఆయన దాచుకోవలసిన అవసరం లేదు. అలాంటి నిర్ణయాత్మకమైన ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ మాత్రమే అందించగలరని దోవల్ పేర్కొన్నా.. నేను ఆయనతో ఘర్షణకు దిగను.
దోవల్ చేసిన రాజకీయ ప్రతిపాదనపై కాకుండా ఆయన ప్రాథమిక వాదనపైనే నేను చర్చిస్తాను. సుస్థిరమైన, బలమైన, పూర్తి మెజారిటీ కలిగిన ప్రభుత్వాలు మాత్రమే భారత్‌కు మంచి చేస్తాయని, సంకీర్ణ ప్రభుత్వాలు అస్థిరమైనవని, అయోమయంతో కూడినవని, అస్పష్టమైనవని, అనిశ్చితమైనవని, అవినీతికరమైనవని, బ్లాక్‌మెయిల్‌కి వీలు కల్పిస్తాయని అజిత్ దోవల్ మౌలిక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రతిపాదన.. వాస్తవాల నిర్ధారణలో నిలబడటం లేదు. ముందుగా ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారిద్దాం. ఎందుకంటే ఈ రంగంలో డేటాకు పక్షపాతం ఉండదు. మన రాజకీయ చరిత్రను రెండు సుస్థిర దశలుగా విభజించవచ్చు. ఒకటి 1952–89 కాలానికి చెందింది. ఈ 37 సంవత్సరాల్లో దేశం దాదాపుగా సుస్థిరతను చవిచూసింది. 1970ల చివర్లో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి కానీ సాధారణంగా ఒకే పార్టీ అటు కేంద్రం లోనూ, చాలా రాష్ట్రాల్లోనూ పాలన సాగించిన కాలమది.
ఆ దశలో దశాబ్దాలు గడిచే కొద్దీ ప్రభుత్వాలు సుస్థిరతను సాధిం చాయి. ఒక పార్టీ నియంత్రణలో శక్తిమంతంగా అవతరించాయి. అది కూడా తిరుగులేని ఒకే కుటుంబం అంటే గాంధీల కుటుంబ యాజమాన్యంలోనే ప్రభుత్వాలు నడిచేవి. 1984–89లో లోక్‌సభలో గాంధీల పాలన దాదాపు 80 శాతం మెజారిటీని సాధించింది. ఇప్పుడు సరికొత్తగా ప్రతిపాదిస్తున్న సుస్థిరమైన, బలమైన, నిర్ణయాత్మకమైన ‘దోవల్ సిద్ధాంతం’ సరైందే అయితే, ఆ నాలుగు దశాబ్దాల కాలంలో భారత్ అత్యుత్తమ అభివృద్ధిని సాధించి ఉండాలి. కానీ వాస్తవానికి అది 3.5 శాతం కంటే తక్కువ ‘హిందూ అభివృద్ధి రేటు’నే అందివ్వగలిగింది.
ఇక రెండోది అస్థిరమైన యుగం. 1989లో రాజీవ్ గాంధీ పరాజ యంతో ఇది మొదలైంది. 2014 వరకు అంటే 25 ఏళ్ల పూర్తికాలం ఈ అస్థిర పాలనా దశ కొనసాగింది. సుస్థిరమైన, పూర్తి మెజారిటీ ప్రభుత్వాలు ముగిసిన తర్వాతే, దేశంలో ఆర్థిక సంస్కరణలు స్పష్టమైన రూపం తీసుకోవడం కాకతాళీయం. కాంగ్రెస్ పార్టీ పతనం తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం స్వల్పకాలం మాత్రమే మనగలగడంతో సంస్కరణల పరీక్షలో పాస్ కాలేకపోయింది. కానీ అతిపెద్ద సంస్కరణల ప్రభంజనం పీవీ నరసింహారావు అస్థిర ప్రభుత్వం ద్వారానే సాకారమైంది.
1996లో పీవీ హయాం ముగిశాక, తదుపరి ఎనిమిదేళ్ల కాలంలో భారత్ అయిదుగురు సంకీర్ణ కూటమి ప్రధానులను, నాలుగు సార్వత్రిక ఎన్నికలను చవి చూసింది. అయిదుగురు ప్రధానులు అని అంటున్నామంటే.. దేవేగౌడ, ఎల్‌కే గుజ్రాల్ స్వల్పకాలిక ప్రభుత్వాలతోపాటు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా మొదట 13 రోజులపాటు తర్వాత సంవత్సరం పాటు, చివరగా పూర్తికాలం పాలన చేశారు కదా.
ఇప్పుడు చూద్దాం. 1991లో మన్మోహన్ సింగ్ తర్వాత రెండవ అత్యంత సంస్కరణాత్మక బడ్జెట్ ఏదంటే 1997 నాటి పి. చిదంబరం ‘డ్రీమ్ బడ్జెట్’ అని చెప్పాలి.
ఈ డ్రీమ్ బడ్జెట్‌లోనే పన్నులు, వడ్డీరేట్లు తగ్గించారు. ఆదాయాన్ని స్వచ్చందంగా వెల్లడించే పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ కాలంలోనే జాతీయ పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్‌ని కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు స్టాక్ మార్కెట్‌లో ప్రవేశించడానికి తలుపులు తెరిచారు. తద్వారా ప్రైవేటీకరణకు నాంది పలికారు. దేవేగౌడ–గుజ్రాల్ ప్రభుత్వాలను ‘రోజు కూలీ’పై పనిచేసే ప్రభుత్వాలుగా వ్యంగ్యంగా పేర్కొనేవారు. తమాషా ఏమిటంటే మన దేశ చరిత్రలో వామపక్ష భావజాలం అధికంగా కలిగిన ప్రభుత్వాలు ఇవే మరి. మొట్టమొదటిసారిగానే కాదు.. చివరిసారిగా కూడా ఇద్దరు కమ్యూనిస్టు మంత్రులను కలిగిన కేంద్ర ప్రభుత్వాలు ఇవే.
వాజ్‌పేయి స్వర్ణచతుర్భుజి పేరుతో జాతీయ రహదారులను ప్రారంభించడానికి, ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలను ప్రైవేటీకరించడానికి, 11 ప్రభుత్వరంగ సంస్థలను, రెండు డజన్ల ఐటీడీసీ హోటళ్లను అమ్మేయడానికి తగిన శక్తిని కలిగి ఉండేవారు. అయితే గత నాలుగున్నర ఏళ్లలో అత్యంత శక్తివంతమైన మోదీ ప్రభుత్వం కనీసం ఒక్కటంటే ఒక్క పీఎస్‌యూని అమ్మలేకపోయింది. చివరకు ఎయిర్ ఇండియా వంటి అసమర్థ సంస్థను కూడా అది వదిలించుకోలేకపోయింది.
1989–2004 మధ్యలో సాగిన 15 ఏళ్ల అస్థిర శకంలో అతిస్పల్పకాలం మనగలిగిన ప్రభుత్వం చంద్రశేఖర్ ప్రభుత్వంగా చెప్పాలి. ఇది కేవలం నాలుగు నెలలు మాత్రమే పాలన సాగించింది. దీన్ని ‘క్యాష్ అండ్ క్యారీ’ ప్రభుత్వంగా అపహాస్యం చేసేవారు. ఎందుకంటే కేవలం 50 మంది సొంత ఎంపీలను మాత్రమే కలిగిన చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ బయటనుంచి ఇచ్చే మద్దతుపైనే ఆధారపడ్డారు. కానీ విదేశీ చెల్లింపుల సంక్షోభాన్ని అధిగమించడానికి ఈయన ప్రభుత్వమే భారత్ బంగారు నిల్వలను విదేశాలకు తరలిం చింది. సంపూర్ణ మెజారిటీ కలిగిన ప్రభుత్వం, చివరకు మోదీ ప్రభుత్వం కూడా దీనికి సాహసించేదని నేను భావించలేను. యశ్వంత్ సిన్హాను తన ఆర్థికమంత్రిగా తీసుకొచ్చిన చంద్రశేఖర్ మరోవైపు డాక్టర్ మన్మో హన్ సింగ్‌ని శక్తివంతమైన ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమించారు. ఆ హోదాలో మన్మోహన్ కేబినెట్ సమావేశాలకు హాజరు కాగలిగేవారు. తదనంతర సంవత్సరాల్లో ఈ ఇద్దరే మన సంస్కరణల రూపశిల్పులుగా అవతరించారు. బలహీనమైన సంకీర్ణ కూటముల హయాంలోనే ఇది చోటుచేసుకుంది.
స్థిరంగా 37 ఏళ్లపాటు మన అభివద్ధి రేటును పరిశీలిస్తే అది సగటున 3.5శాతంకు తక్కువే. తర్వాత పాతికేళ్లలో అది 5కు చేరుకుంది. ప్రస్తుతం 7కంటే ఎక్కువే నమోదవుతోంది. పాతదానికంటే రెట్టింపు అయ్యింది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంత వరకు స్థిరమైన ప్రభుత్వాలకు, వృద్ధిరేటుకు మధ్య గ్రాఫ్ వ్యతిరేకంగా ఉంటుంది. కానీ, జాతీయ భద్రత విషయానికి వస్తే సంకీర్ణ ప్రభుత్వాలు అసమర్థమైనవని భావిస్తారు. 1989–90 మధ్య వీపీ సింగ్ హయాంలో మినహాయిస్తే, జాతీయభద్రత విషయంలో మన ప్రభు త్వాలు బలహీనంగా ఎప్పుడూ లేవు. ఆ ప్రభుత్వంలోనూ దోవల్ పని చేశారు. పంజాబ్, కశ్మీర్‌లలో పరిస్థితులు చేయిదాటి పోతుంటే చూస్తూ ఊరుకున్నారు. తర్వాత అవకాశం వచ్చింది. తన సత్తా నిరూపించుకున్నారు.
ఇంతకు ముందు నేను రాసినట్టు, పంజాబ్‌లో చంపేసిన ప్రతి ‘ఏ’ కేటగిరీ ఖలిస్తానీ చొరబాటుదారుడినీ ‘గిల్ పట్టుకున్నాడు, దోవల్ పని పట్టాడు’అనే అభివర్ణించారు. చొరబాట్లను రూపుమాపడంలో ఐబీ, పంజాబ్ పోలీస్ మధ్య అది ఓ చక్కని ఆపరేషన్. ఇదే పద్ధతిలో 1991–96మధ్య అస్తవ్యస్థంగా వున్న çకశ్మీర్‌ని అదుపులోకి తీసుకొచ్చారు. దోవల్ కెరీర్ ఎదుగు దలకు ఇవన్నీ దోహదపడ్డాయంటే, అందుకు ఏమాత్రం చరిష్మాలేని ప్రధాని ఆధ్వర్యంలోని బలహీనమైన మైనార్టీ ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. అత్యంత శక్తిమంతురాలిగా వున్నప్పటికీ పోఖ్రాన్–1 పరీక్షలను అణుబాంబు ప్రయోగంగా చెప్పు కోడానికి ఇందిర సాహసించలేదు. శాంతి యుత ప్రయోజనాలకే అణు ప్రయోగాలు అనే ముసుగు కప్పుకోక తప్పలేదు. 24ఏళ్ల తర్వాత బల హీనమైన వాజ్‌పేయి హయాంలోని సంకీర్ణ ప్రభుత్వం అటువంటి ముసుగులు వేసుకోలేదు. వాజ్‌పేయి ప్రభుత్వం ఎంత బలహీనమైన దంటే పోఖ్రాన్–2 పరీక్షలు జరిగిన 11 నెలలకే ఒక్క ఓటు తక్కువ కావడంతో కూలిపోయింది.
పోఖ్రాన్–2 పరీక్షలు సాహసోపేతమైన విధాన నిర్ణయం అను కుంటే, యూపీఏ–1 హయాంలో మన్మోహన్ సింగ్ కుదుర్చుకున్న భారత్–అమెరికా అణు ఒప్పందాన్ని ఏమనాలి? మన్మోహన్ ప్రభుత్వం వామపక్ష పార్టీలపై ఆధారపడి ఉంది. పార్లమెంట్‌లో తన ప్రభుత్వం ప్రమాదంలో వున్నప్పటికీ ప్రపంచం దృష్టిలో భారత్ వ్యూహాత్మక దృక్పథాన్ని మార్చివేశారు. యూపీ ఏ–2 హయాంలో కూడా ఇలాగే రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐలను ఆహ్వానిం చారు. మోదీ ప్రభుత్వం అణు ఒప్పందాన్ని అప్పనంగా స్వీకరించింది. కానీ, రిటైల్ రంగంలో ఎఫ్‌డీ ఐల వ్యవహారాన్ని ముందుకు తీసుకుపోలేకపోయింది. ఇందులో దృక్ప థానికి సంబంధించిన విభేదాలేమీ లేవు.
ఆర్థిక వ్యవస్థ, అంతర్గత భద్రత, విధానాలకు సంబంధించిన అంశాల్లో స్థిరమైన ప్రభుత్వాలకంటే అస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వాలు చాలా నిర్ణయాత్మకంగా, ధైర్యంగా వ్యవహరించాయని దీన్నిబట్టి మనకుఅర్థమవుతుంది. మన నేతలు పరిపూర్ణులేమీ కాదు. కానీ, వాళ్లకు ఏది మంచో వాళ్లకు తెలుసు. ప్రతి ఎన్నికల్లో గెలవాలనుకుంటారు. ఒకసారి అధికారంలోకి వచ్చాక వదులుకోడానికి ఇష్టపడరు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంటే, శాంతిభద్రతలు కొనసాగుతుంటే ప్రజలు వారిని మళ్లీ ఎన్నుకుంటారు. సంకీర్ణ ప్రభుత్వం అస్థిరమైనది. దాంతో నేతలు సంప్రదింపులు జరుపుతారు. అవకాశాలు వెతుక్కుంటారు. ఇతరులు చెప్పేది వింటారు. స్థిరమైన ప్రభుత్వాలు నేతలను సుఖంగా, పొగరుగా, వ్యక్తిగత రాగద్వేషాలతో ఉండేలా చేస్తాయి. ఇందిర, రాజీవ్ నుంచి మోదీ వరకు రాజకీయ చరిత్ర చెబుతున్న పాఠం ఇదే. అందుకే మనం సంకీర్ణ ప్రభుత్వాలకు భయపడాల్సిన అవసరం లేదు.
వ్యాసకర్త: శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment