ఢిల్లీ : ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు శత్రు దేశాల మధ్య సంధి కుదిర్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ వారంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటించనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ.. రష్యా, ఉక్రెయిన్ పర్యటించారు. మోదీ పర్యటన అనంతరం అజిత్ దోవల్ రష్యా వెళ్లడం యుద్ధం ముగింపు పలికే అవకాశం ఉందని మిత్రదేశాల అధ్యక్షులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గత ఆగస్ట్ నెలలో మోదీ ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా కాకుండా, శాంతివైపు ఉందని మోదీ చెప్పారు. అంతేకాదు యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా, ఉక్రెయిన్‌లకు పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు భారత్ సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.
ఇది చదవండి: కిమ్‌కు పుతిన్ గిప్ట్.. ఎందుకంటే
ఉక్రెయిన్ పర్యటనపై ఆగస్ట్ 27న రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో భారత్ వైఖరి గురించి వివరించారు. ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న సంక్షోభానికి ముగింపు పలికేలా శాంతియుతంగా చర్చలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
పుతిన్ కీలక ప్రకటన
వరుస పరిణామల నేపథ్యంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై వ్లాదిమీర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. రష్యాలోని నార్త్ కొరియా,చైనా సరిహద్దు ప్రాంతమైన వ్లాడివోస్టోక్ నగరంలో సెప్టెంబర్ 3 నుంచి 6 వరకు ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య భారత్, బ్రెజిల్, చైనాలు శాంతి చర్చలు జరిపి అంశంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
స్పందించిన ఇటలీ
పుతిన్ ప్రకటన అనంతరం..అజిత్ దోవల్ ఈ వారం రష్యాలో పర్యటించడంపై మిత్ర దేశాలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం త్వరలో ముగియనుందనే అశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర ఇటలీలోని సెర్నోబియో నగరంలోని అంబ్రోసెట్టి ఫోరమ్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా – ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో భారత్, చైనా వంటి దేశాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయంటూ జార్జియా మెలోని పేర్కొన్నారు. ఇప్పటికే భారత్ ఈ విషయంలో స్పందించిందని గుర్తుచేశారు.
రెండేళ్లకు సమీపిస్తున్న యుద్ధం
సెప్టెంబర్ 24, 2022 నుంచి కొనసాగుతున్న ఉక్రెయిన్ -రష్యా యుద్ధంలో సుమారు 5లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment