
న్యూఢిల్లీ : సైన్యంలో యువరక్తాన్ని నింపడానికి, మరింత టెక్ సేవీగా మార్చడానికే అగ్నిపథం పథకాన్ని తీసుకువచ్చామని, దానిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ స్పష్టం చేశారు. మన జాతికి ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ పథకం విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవసరమైతే తన రాజకీయ జీవితాన్ని మూల్యంగా చెల్లించడానికి సిద్ధమయ్యారని కొనియాడారు.
కాంగ్రెస్ హయాంలో 2006లోనే ఈ తరహా పథకం తీసుకువద్దామని అనుకున్నారని వెల్లడించారు. ప్రపంచ దేశాలో యువ జనాభా అత్యధికంగా ఉన్న మన దేశం ఆర్మీ విషయాన్నికొస్తే సగటు వయసు అత్యధికంగా ఉన్న దేశంగా ఉందని , అందుకే సైనిక రంగంలో సంస్కరణలు తప్పవన్నారు. మంగళవారం ఒక వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌పై చెలరేగుతున్న నిరసనల్లో పాల్గొంటున్న వారెవరూ అసలైన ఆశావహులు కాదని, వారంతా ఇళ్లలో కూర్చొని పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు.
అగ్నివీరుల భవిష్యత్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఒకటే జీవితం–రెండు కెరీర్లు , ఒక్కోసారి మూడు కెరీర్లు అని యువత మాట్లాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అగ్నివీరుల మొదటి బ్యాచ్ పదవీ విరమణ చేసిన సమయానికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్లు (దాదాపుగా రూ.385 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అప్పుడు పరిశ్రమలకి ఇలాంటి శిక్షణ పొందిన యువతరం అవసరం ఉంటుందన్నారు. యుద్ధభూమిని టెక్నాలజీ తన చేతుల్లోకి తీసుకుంటోందని ఇకపై కాంటాక్ట్‌లెస్ యుద్ధాలు కూడా వస్తాయని, అందుకే ఇలాంటి మార్పులు తప్పవన్నారు. అగ్నివీరులుగా శాశ్వత కెరీర్ కొనసాగించడానికి నాలుగేళ్ల తర్వాత దరఖాస్తు చేసుకోవాలని వారిలో ఎంపికైన 25% మందికి మళ్లీ కఠోర శిక్షణ ఉంటుందని అజిత్ దోవల్ వివరించారు.