నిష్కళంక దేశభక్తికి నిలువుటద్దం
జాతిహితం
భారత్ ప్రమాదకర స్థితిలో ఉండగా క్లింటన్ ప్రభుత్వం అణు కార్యక్రమాన్ని నిలిపి వేయాలని ఒత్తిడి తెచ్చింది. పీవీ అణు పరీక్షను నిర్వహిస్తూ దొరికిపోయినట్టు నటించి, దాన్ని ‘రద్దు చేసి’ క్లింటన్‌ను సంతృప్తి పరచారు. మన అణు శాస్త్రవేత్తలకు అవసరమైన సమయాన్ని సమకూర్చారు. నరేశ్ చంద్ర దీనిలో కీలకమైన ‘గూఢచారి’ పాత్ర ధరించి ఉండవచ్చు. ఇదంతా అత్యంత దేశభక్తియుత కారణంతో జరిగినదే. దీనికి ప్రతిఫలంగా చంద్రకు ముట్టినవి దేశ ద్రోహానికి పాల్పడ్డారన్న అనుమానాలే.
ప్రజా జీవితంలోని ఒక ప్రముఖుని మృతికి నివాళి అర్పించేటప్పడు మనం మహా బద్ధకంగా, సురక్షితంగా ఆయన ‘‘దేశభక్తుడు’’ అనేస్తుంటాం. బద్ధ కంగా అనడం ఎందుకంటే, దేశభక్తులు కారని రుజువైన ఎవరో కొందరిని తప్ప తోటి భారతీయులెవరినైనా దేశభక్తులని భావించాల్సిందే. మృతి చెందిన వారి గురించి అలా అనడాన్ని ఎవరూ ప్రశ్నించే అవకాశం ఉండదు. చనిపోయినవారి గురించి చెడుగా మాట్లాడరాదన్నంతగా మనం వినమ్రంగా ఉంటాం. మనం నివాళి అర్పించే వ్యక్తిని ద్రోహి అని సూటిగా అన కున్నా, ఒక సారి కంటే ఎక్కువగానే అలా అనుమానించి ఉన్నప్పుడు ఇది మారుతుంది.
భిన్న పార్టీలకు, కూటములకు చెందిన తొమ్మిది మంది ప్రధానుల హయాం లోని రెండు తరాల భారత వ్యూహకర్తలు ఆయనను అతి గొప్ప దేశభక్తులలో ఒకరుగా చూసినప్పుడు కచ్చితంగా అది జరుగుతుంది. వైవిధ్యభరితమైన వివిధ రాజకీయ పక్షాల ప్రభుత్వాలు మూడు దశాబ్దాలకు పైగా అంతగా నమ్మకం ఉంచి, గౌరవం చూపిన వ్యక్తులు అరుదు. నరేష్ చంద్ర అలా అంత సుదీర్ఘ కాలం ‘‘వ్యవస్థలో’’ ప్రభుత్వ అధికారిగా మనగలిగారు. భారత గూఢ చార సంస్థలో చేరి, దానికి అధిపతి అయిన తన అన్న ‘‘గ్యారీ’’ సక్సేనా గోప్యతను కాపాడాలని గామోసు నరేశ్ చంద్ర ఎన్నడూ తన ఇంటి పేరు ‘‘సక్సేనా’’ను వాడేవారు కారు. గ్యారీ ఇటీవలే ఏప్రిల్ 14న మృతి చెందారు. ఆయన విమర్శకులు సహా నరేష్ చంద్రతో పరిచయం ఉన్నవారెవరైనా ఆయన కేవలం ఐఏఎస్ పాసై, అధిష్టించగలిగిన పదవులన్నిటినీ చేపట్టిన సాధారణ ప్రభుత్వాధికారి మాత్రమే కారని అంగీకరిస్తారు. ప్రభుత్వ సర్వీ సుల సోపానాలలో నరేష్‌జీ ఎక్కని మెట్టు ఏదీ లేదు.
ఆయనకు సాటి మరెవరూ లేరు
ప్రభుత్వాధికార వ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరిన అధికారులు సాధా రణంగా రెండు రకాలు. ఒకటి, పదవీ విరమణ చేయడం, ఏదో ఒక సంస్థకు నియంత్రణాధికారిగా లేదా మరో పదవిని సంపాదించి విశ్రాంతిగా గడు పుతూ జీతాలు పుచ్చుకునేవారు. సీవీసీ, కాగ్, యూపీఎస్‌సీ,ఆర్‌టీఐ తదితర కమిషన్లలో నిజంగానే తమకు ప్రియమైన చట్టబద్ధమైన ఉద్యోగాల్లో చేరే వారు. నిజంగానే పాలకులకు ప్రీతి పాత్రులై ఉంటే సులువైన రాజ్‌భవన్ పని ఉండనే ఉంటుంది. ఇక మరో రకం వారు మరిన్ని సవాళ్ల కోసం అన్వేషిస్తూ, అసలు సిసలైన దేశ సేవలో తమ వృత్తి జీవితాన్ని పొడిగించుకుంటారు. నరేష్ చంద్ర ఈ రెండో కోవలో ఉంచదగినవారు.
ఆయన అతి విశిష్టమైన రకం మనిషి. పలు దశాబ్దాలుగా ఎందరో తెలి వైన మంతులను కలుస్తున్నా.. నేను అలాంటి వ్యక్తులను మరిద్దరినైనా కలి శానని కచ్చితంగా చెప్పలేను. కొత్త సవాలు లేదా మరింత సరిగ్గా చెప్పాలంటే సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆయన వైఖరే వేరు. సమస్యలను పరిష్కరిం చడంలో ఆయన రాణించారు, సంక్షోభంలో మరింత గొప్పగా రాణించారు. అలాంటి సమయాల గురించిన కథనాలను చెప్పడంలో ఆయన మరింత మెరుగు. జిల్లా సర్వీసులో తను నేర్చుకున్న విషయాలు ఎంతటి జటిలమైన సమస్యనైనా పరిష్కరించడంలో ఎలా ఉపయోగపడ్డాయనే దాన్ని అవేవో సరదా కబుర్లన్నట్టుగా చెప్పేవారు. ఆయన అన్ని వాస్తవాలను వెల్లడించేవారు కారు. కానీ మరెక్కడి నుంచైనా మీరు వాటిని తెలుసుకుంటే... మీరు ఆయన నమ్మకంలోకి తీసుకునే వ్యక్తులు అయితే... వాటిని సరిపోల్చి చెప్పేవారు.
నేను ఉదయాన్నే లేచే బాపతు కాదు. మన్‌హట్టన్ లెక్సింగ్‌టన్ హోట ల్‌లో మోగినట్టుగా, ఉదయం 6 గంటలకే ఫోన్ మోగడాన్ని ఇష్టపడేవాణ్ణి కాను. అది 1997 ఆకురాలు కాలం, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరుగుతోంది. నరేశ్ చంద్ర వాషింగ్ట¯Œ లోని భారత రాయబారి. 1992లోనే ఆయన కేబినెట్ కార్యదర్శిగా ఐఏఎస్ సర్వీసు నుంచి పదవీ విరమణ చేశారు. ‘‘అరె భయ్ మీరు ప్రచురించింది ఏమిటి? నేనిక్కడ రాయబారిని, ఈ పెద్ద మనిషేమో నేను గూఢచారిని అంటున్నాడు’’ అన్నారు నరేశ్ చంద్ర. ఆ రోజునే ఆయన నాటి ప్రధాని గుజ్రాల్‌తో కలసి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను కలుసుకోవాల్సి ఉంది. తన సహచరులు, అమెరికన్లు ఆ వ్యాసాన్ని చదివాక తను వారి మొహం ఎలా చూడాలి అంటూ ఆయన ఆక్రోశాన్ని ధ్వనిస్తూ విషయం చెప్పారు.
మన రాయబారే గూఢచారా?
ఆయన ప్రస్తావించిన ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వ్యాసాన్ని రాసినది స్వదేశీ జాగరణ్ మంచ్ కన్వీనర్, నా మిత్రుడు ఎస్. గురుమూర్తి. పీవీ నర సింహారావు పోఖ్రాన్‌లో అణు పరీక్షను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను చేస్తూ చివరి క్షణంలో వెనక్కు తగ్గడంలోని మర్మాన్ని గురించి గురుమూర్తి రాశారు. క్లింటన్ ప్రభుత్వం, పీవీ పథకాలకు సంబంధించి తమ ఉపగ్రహ గూఢచార సమాచార ఆధారాలను చూపడం వల్లనే అలా జరి గిందని, ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వానికి ఒక ‘‘గూఢచారి’’ చేరవేశా డని, అది చంద్రేనని గురుమూర్తి సూచించారు. ఆ వ్యాసం ప్రతితో సహా నరేశ్ చంద్ర లెక్సింగ్‌టన్‌లో నేను బసచేసిన హోటల్‌కు వస్తున్నానన్నారు. ఆ వ్యాసం ప్రచురితమైనది నేను సంపాదకునిగా ఉన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కాదని, అదే కుటుంబానికి చెందిన మరో శాఖ నిర్వహిస్తున్న ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అని నేను ఆయనకు వివరించాను. ఇదంతా బాగానే ఉందిగానీ ఇక ప్రపంచానికి నేను మొహం ఎలా చూపించాలి? అనేదే ఆయన సమస్య. ఈ విషయంలో నేను ఆయనకు ఏమీ ఉపయోగపడలేననేది స్పష్టమే. ఆయన కున్న విశిష్టమైన అర్హతలు, సంబం«ధాలు ఎలాంటివో నాకు బాగా తెలుసు. ఏదిఏమైనా కేబినెట్ కార్యదర్శిగా ఆయనకు మన దేశంలో రహస్యంగా ఉంచాల్సిన ప్రతి విషయమూ తెలుసు. పైగా రా సైతం కేబినెట్ సెక్రటేరి యట్ నియంత్రణలోనే ఉంటుంది. అలా అని గురుమూర్తి వ్యాఖ్యలు అంత తేలిగ్గా కొట్టిపారేయగలిగినవి కావు. ఆయనకు విషయ పరిజ్ఞానం, మేధస్సు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల నుంచి విదేశాంగ విధానం వరకు ఆయనతో ఏ విషయం మీదైనా విభేదిస్తూ వాదించవచ్చునే గానీ ఆయన దేశభక్తిని ప్రశ్నించలేం. మరి అసలు నిజం ఏమిటి?
దాదాపు ఒక దశాబ్ది పాటూ నేను అదేపనిగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషించాను. గుజ్రాల్, వాజ్‌పేయి, నరసింహారావుల వద్ద ఈ విష యాన్ని ప్రస్తావించాను. అందరి నుంచీ నిగూఢమైన నవ్వులూ, ‘‘ఆ విష యాన్ని మీరిక వదిలిపెట్టేయండి’’ అనే లాంటి మాటలే సమాధానమ య్యాయి. కానీ ఏళ్లు గడిచే కొద్దీ చంద్రపై పడ్డ మచ్చను అత్యున్నత అధికార వ్యవస్థలో ఎవరూ నమ్మలేదని సూచించే ఆధారాలు పోగుపడ్డాయి. పీవీ ఆయనను అణు సంబంధమైన, క్షిపణులకు సంబంధించిన సమస్యలపై అమెరికాతో చర్చలు జరిపే కీలక అధికారిగా నియమించారు. గురుమూర్తి అంతటివాడు ఆయనను గూఢచారిగా ఆరోపించినా గుజ్రాల్, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాలు ఆయనను అమెరికాలోని భారత రాయబారిగా కొన సాగించాయి. గురుమూర్తికి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ అగ్రనాయకత్వంలో పలుకు బడి ఉండటమే కాదు, వాజ్‌పేయి, అద్వానీల ఇళ్లకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లగలిగేవారు. జశ్వంత్ సింగ్, బ్రజేశ్ మిశ్రాలు సైతం చంద్రను పూర్తిగా విశ్వసించేవారు.
నిష్కళంక దేశభక్తికి అవమానాల మకుటం
చికాకుపరచే ఈ భ్రమణం పరిపూర్తి అయ్యేట్టుగా 2006లో నరేశ్ చంద్ర ఇతర ప్రముఖ వక్తలతో పాటూ జశ్వంత్ సింగ్ పుస్తకావిష్కరణ సభలో వేదికను అలంకరించారు. తన పుస్తకంలో జశ్వంత్ సింగ్, పీవీ ప్రభుత్వంలోని గూఢచారి గురించి ప్రస్తావించారు. ఏమాత్రం అనుమానం ఉన్నా చంద్రను ఆ పుస్తక ఆవిష్కరణ సభకు జశ్వంత్ పిలిచేవారా? ఈ విషయంపై నేను పీవీని వేధించినప్పుడల్లా ఆయన... దాన్ని అక్కడే ఉండనివ్వండి అన్నట్టుగా తన పొట్టను తట్టుకునేవారు. ఒక ‘వాక్ ద టాక్’ ఇంటర్వ్యూలో నేను, డిసెం బర్ 1995లో ఏం జరిగిందంటూ ఒత్తిడి చేశాను. ‘‘నాతో పాటూ చితిలోకి తీసుకు పోవడానికి కనీసం కొద్దిగానైనా మిVýæలనివ్వు’’ అంటూ నా నోరు కట్టే శారు. 2006లో వెలువడ్డ జశ్వంత్‌సింగ్ పుస్తకం నా అన్వేషణను కొన సాగించడానికి కొత్త ప్రేరణ అయింది. నా ‘జనహితం’లో మూడుసార్లు ఆ అంశంపై రాశాను. ఆ గూఢచారి చంద్ర అని, ఆయనను ప్రయోగించినది పీవీ అని నిర్ధారించాను. చంద్రతో నేను గంటల కొద్దీ గడిపినా, ఆయన నోరు విప్ప లేదు. పీవీ అణు పరీక్ష చేయాలనుకోలేదనే నా నిర్ధారణను ఇంతవరకు ఎవరూ సవాలు చేసింది లేదు. భారత్ ప్రమాదకర స్థితిలో ఉండగా క్లింటన్ ప్రభుత్వం అణు కార్యక్రమాన్ని నిలిపేయాలని ఒత్తిడి తెచ్చింది.
పీవీ అమెరికాను తప్పుదారి పట్టించే ఎత్తుగడ వేశారు. అణు పరీక్షను నిర్వహిస్తున్నట్టు, దొరికిపోయినట్టు నటించి... ‘‘రద్దు చేయడం’’ ద్వారా క్లింటన్‌ను సంతృప్తి పరచి, భారత శాస్త్రవేత్తలకు అవసరమైన సమయాన్ని సమకూర్చారు. బహుశా నరేశ్ చంద్ర దీనిలో పాత్రధారి కావచ్చు, ‘‘గూఢ చారి’’ పాత్ర ధరించి ఉండవచ్చు. ఇదంతా సత్సంకల్పంతో, దేశభక్తితో జరిగి నదే. దీనికి ప్రతిఫలంగా ఆయనకు ముట్టినవి పుకార్లు, తీవ్ర విద్రోహానికి పాల్పడ్డారన్న అనుమానాలే. 1989లో రాజీవ్ గాంధీ, చంద్రతో జనాంతి కంగా మాట్లాడుతూ ‘‘పాకిస్తాన్ అణ్వాయుధాల తయారీకి అతి చేరువలో ఉన్నది’’ అని చెప్పారు. మనకు వ్యూహాత్మకంగా కుటుంబ ఖజానాకు సమా నమైన నిధికి తాళాలను చంద్రకు అప్పగించారు. పోఖ్రాన్–2 అణు పరీక్షల వరకు దశాబ్దం పాటూ అతి చాకచక్యంగా ఆడిటర్లకు అనుమానం రాని రీతిలో మన అణు కార్యక్రమానికి ఆయన ఆర్థిక వనరులను సమకూర్చారు. అందువల్లనే ఆ విశిష్ట వ్యక్తికి నివాళులర్పించే సందర్భం ఏదో రివాజుగా సాగేది కాదు. ఎంతగా ఆయన దేశభక్తి సందేహానికి గురవుతున్నా చలించ కుండా మొండిగా నిలిచిన చిత్తశుద్ధితో కూడిన దేశభక్తి ఆయనది. తనపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి, దేశం కోసం తాను చేసినదాన్లో కొంతైనా చెప్పడానికి ఆయన తన జ్ఞాపకాలనైనా రాయలేదు. నేను రాయ గలిగిన దాన్ని ఎవరూ చదవరు అనేవారు. భరత మాతకు ఆయనలా అత్యు త్తమ సేవలందించిన ప్రభుత్వాధికారిని ఎవరినీ మనం చూడలేదు.
- శేఖర్ గుప్తా
twitter@shekargupta