లౌకిక కూటమి ‘శివ’సాయుజ్యం | Shekhar Gupta Article On Post Election Politics In Maharashtra | Sakshi
Sakshi News home page

లౌకిక కూటమి ‘శివ’సాయుజ్యం

Published Sat, Nov 16 2019 1:07 AM | Last Updated on Sat, Nov 16 2019 1:07 AM

Shekhar Gupta Article On Post Election Politics In Maharashtra - Sakshi

సోనియా గాంధీ బీజేపీని ఒక రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా ఒక శత్రువులాగా పరిగణిస్తున్నారని గతంలో అడ్వాణీ ఆరోపించారు. తన రాజకీయాలను ఇలా నిర్వచించుకున్న అదే పార్టీ, బీజేపీతో దాని పొత్తుదార్లతో పోరాడటం అనే లక్ష్యంలో భాగంగా ఎవరితోనైనా సరే పొత్తు పెట్టుకోవడానికి సుముఖత చూపుతోంది. స్వాతంత్య్రానంతర చరిత్రలో.. శివసేన వంటి పక్కా హిందుత్వ పార్టీని కాంగ్రెస్‌ కౌగలించుకోవడం ఇదే మొట్టమొదటిసారి. రెండు పరస్పర భిన్నమైన తీవ్ర భావజాలాలు కలిగిన బీజేపీ, వామపక్షం తమ ఉమ్మడి శత్రువుగా భావించిన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కలవడానికి ఏమాత్రం సందేహించనప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్‌ అదే పని ఎందుకు చేయకూడదు? ఒకప్పుడు కాంగ్రెస్‌ భారత రాజకీయాలను ఏకధ్రువంగా మార్చింది. ఇప్పుడు బీజేపీ ఆ పని చేస్తోంది. మరి కాంగ్రెస్‌కు ఆ వెసలుబాటు ఎందుకు ఉండకూడదు?

రాజకీయాల్లో కానీ, యుద్ధంలో కానీ అతి ప్రాచీన సూత్రం ఏమిటంటే, శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అనే. అందులోనూ కనీసం పోరాడేందుకు కూడా వీల్లేని స్థితిలో మిమ్మల్ని చరిత్ర పక్కకు తోసేసినప్పుడు ఇక మీరేం చేస్తారు? అలాంటప్పుడు సాంప్రదాయిక సూత్రాలు ఎంతమాత్రం సరిపోవు. ఒకసారి మీరు నిస్పృహలో కూరుకుపోయాక ఆ సూత్రాలను వెనక్కు తిప్పడానికి కూడా మీరు ప్రయత్నిస్తారు. శత్రువుకు మిత్రుడు మీకు మాత్రం మిత్రుడు కాదా? వారి సంబంధంలో కాస్తంత చీలిక కనిపిస్తున్నా సరే.. దాన్ని  అతి చిన్న పదునైన గొడ్డలితో ఎందుకు చీల్చివేయకూడదు? 

మహారాష్ట్రలో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ సరిగ్గా ఇదే గేమ్‌ను ఆడుతున్నాయి. ఈ కథనం రాసే సమయానికి వారి మధ్య ఒప్పందం ఇంకా కుదరలేదు. కానీ  భారత రాజకీయాల్లో ఎంత మార్పు చోటు చేసుకుంటోందో గ్రహించడానికి శివసేనతో కలిసి తాము అధికారం పంచుకోవడానికి సుముఖంగా ఉన్నామని వారు ప్రకటించిన వాస్తవం  చాలు.. దశాబ్దాలుగా లౌకిక కూటమికి కట్టుబడి ఉన్న ఈ రెండు పార్టీలూ మితవాద హిందుత్వ, మతతత్వ పార్టీగా ఇంతకాలం తాము ఖండిస్తూ వచ్చిన పార్టీతో  సంప్రదింపులకు సిద్ధమవుతున్నాయి. ఇది తన భావజాలపరమైన లక్ష్మణరేఖను దాటుతున్న భారత ప్రధాన లౌకిక సమ్మేళనంకి స్పష్టమైన సంకేతం మరి. శరద్‌ పవార్‌ ఇన్నేళ్లుగా బీజేపీ, శివసేనలతో పోరాడుతూనే వచ్చారు. ఈ రెండు పార్టీలు ఆయన్ను దొంగ అనీ వక్రరాజకీయవేత్త అని నిత్యం పిలుస్తూ వచ్చేవి. పైగా ఈ దఫా  మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్ట రేట్‌ ఒక కుంభకోణంలో శరద్‌ పవార్‌ పేరును ఇరికించింది కూడా. అయితే ఇదే మోదీ ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. ఇది భారతరత్న తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన అవార్డు. పవార్, థాక్రేలు కూడా కొన్ని  సార్లు వాస్తవదృష్టితో కూడిన రాజకీయ సంబంధ బాంధవ్యాలను నెరుపుతూ వచ్చారు.

మరోవైపున కాంగ్రెస్‌ ఆ మార్గంలో ఎన్నడూ నడవలేదు. కాంగ్రెస్‌ పట్ల బద్ధ విమర్శకులు దీంతో విభేదించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్‌.. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ ఒవైసీకి చెందిన మజ్లిస్‌ పార్టీతోనూ సంప్రదింపులు జరిపింది.  అలాంటి ఒప్పందాల్ని స్థానిక పరిమితులతో, స్వల్ప స్థాయిలో, మరీ ముఖ్యంగా మైనారిటీ రాజకీయాలపై స్వారీ చేస్తున్న చిన్న బృందాలతో మాత్రమే కుదుర్చుకునేది. అయితే స్వాతంత్య్రానంతర చరి త్రలో.. పక్కా హిందుత్వ పార్టీని కాంగ్రెస్‌ కౌగలించుకోవడం ఇదే మొట్టమొదటిసారి. కాంగ్రెస్‌ రాజకీయాల సారాంశాన్ని ప్రత్యేకించి సోనియాగాంధీ నాయకత్వంలో గత రెండు దశాబ్దాలుగా సాగుతూ వచ్చిన దాని రాజకీయాలను మీరు అర్థం చేసుకున్నట్లయితే హిందుత్వ పార్టీలను అది తన ప్రధాన సైద్ధాంతిక శత్రువులుగా చూస్తూ వచ్చేది. తన రాజకీయాలను మొత్తంగా హిందుత్వ పార్టీలకు వ్యతిరేకంగానే నడుపుతూ వచ్చేది. 2003లో ఎన్డీటీవీ వాక్‌ ది టాక్‌ షోలో నాతో నిర్వహించిన ఇంటర్వ్యూలో అడ్వాణీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సోనియా గాంధీ బీజేపీని ఒక రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా ఒక శత్రువులాగా పరిగణిస్తున్నారని అడ్వాణీ ఆరోపిం చారు. తన రాజకీయాలను ఇలా నిర్వచించుకున్న అదే పార్టీ, బీజేపీతో దాని పొత్తుదార్లతో పోరాడటం అనే లక్ష్యంలో భాగంగా ఎవరితోనైనా సరే పొత్తు పెట్టుకోవడానికి సుముఖత చూపుతోంది. శిరోమణి అకాలీ దళ్, శివసేన ఇంతవరకు బీజేపీ మిత్రపక్షాలు అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సోనియా నేతృత్వంలో, కాంగ్రెస్‌ వామపక్షాలతో అనేకసార్లు పొత్తు కుదుర్చుకుంది. మతతత్వ శక్తులను అధికారం నుంచి దూరంగా పెట్టడానికి హెచ్‌.డి. దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌ల యునైటెడ్‌ ప్రంట్‌ ప్రభుత్వాలకు బయటినుంచి మద్దతివ్వడంతో ప్రారంభించి 2004 సార్వత్రిక ఎన్నికల ఫలితం తర్వాత యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ (యూపీఏ)కు నాయకత్వం వహించి తన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది.

సంకీర్ణ యుగంలో, కాంగ్రెస్‌ పార్టీ ఒకటీ, రెండూ సందర్భాల్లో గతంలో బీజేపీతో పొత్తు కూడిన పార్టీలతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇలా కాంగ్రెస్‌ పార్టీ పొత్తు కుదుర్చుకున్న బీజేపీ మిత్రుల్లో మమతా బెనర్జీ, చంద్రబాబునాయుడు, నితీశ్‌ కుమార్‌ ఉన్నారు. అంతే కానీ హిందుత్వ పార్టీతో లేక అకాలీలతో కాంగ్రెస్‌ ఎన్నడూ పొత్తుకు సిద్ధం కాలేదు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం లేక పొటాను రద్దు చేయడానికి అంగీకరించడం ద్వారా మైనార్టీవాదాన్ని కూడా కౌంగ్రెస్‌ దగ్గరకుతీసుకుంది. తర్వాత ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిని పరిశీలించడానికి సచార్‌ కమిటీని కూడా కాంగ్రెస్‌ ఏర్పర్చింది. కాబట్టి ఇంత పెద్ద సైద్దాంతిక పెనుగంతు వేయడానికి ముందు కాంగ్రెస్‌ పార్టీ అనేక అంతర్మథనాలను సాగించింది. పైగా పార్టీలో వాస్తవికవాదంతో నడిచే పాతతరం రాజకీయనేతలకు వామపక్ష సైద్ధాంతిక భావాలు కలిగి ఉండి రాహుల్‌ గాంధీ చుట్టూ చేరిన యువ నాయకత్వానికి  మధ్య జరిగిన వాదనలను కూడా మీరు చూడవచ్చు. మొదటగా కాంగ్రెస్‌ లోని వృద్ధ నాయకత్వం నేరుగా చెప్పడానికి సాహసించనప్పటికీ, రాహుల్‌ అనేకసార్లు విఫలమయ్యారని, తమ రాజకీయ కెరీర్లు ముగిసేలోపు తిరిగి కోలుకుంటామని కానీ, అధికారంలోకి వస్తామని కానీ ఏమాత్రం ఆశలేదని వారు భావిస్తున్నారు. రెండు, ఏదో ఒక సమయంలో సీబీఐ లేక ఈడీ కస్టడీలో తమ జీవితాలు కడతేరతాయని వారు భయపడుతున్నారు కూడా. మూడు, సాపేక్షికంగా జేఎన్‌యూ నుంచి దిగుమతవుతున్న రాడికల్‌ నాయకత్వంతో కూడిన కొత్త తరంలా కాకుండా పాతతరానికి తమ రాజకీయ చరిత్ర ఏమిటో స్పష్టంగా తెలుసు. 

ఇందిరాగాంధీ కాంగ్రెస్‌ నేతృత్వంలో భారత రాజకీయాలు ఏకధ్రువంగా మారిపోవడంతో జనసంఘ్, సోషలిస్టు విమర్శకులు కూడా చాలాసార్లు ఒకటై కలిసిపోయారు. పైగా తమకు పూర్తిగా భిన్నమైన భావజాలం కలిగిన వామపక్షంతో ఉమ్మడి లక్ష్యంకోసం వీరు ఐక్యమయ్యారు. వీపీ సింగ్‌ హయాంలో బీజేపీ, వామపక్షాలు చేతులు కలపడాన్ని మన జీవితకాలాల్లోనే చూశాం. తర్వాత 2008లో, 2012లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని లౌకిక సమ్మేళనమైన యూపీఏ ప్రభుత్వాలను రెండు సార్లు ఓడించడానికి కూడా వీరు ప్రయత్నిం చారు. ప్రత్యేకించి భారత–అమెరికన్‌ అణు ఒప్పందం, మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ వ్యాపారంలో ఎఫ్‌డీఐలను అనుమతించిన సందర్భంలో ఇలాంటి ఐక్యత కొట్టొచ్చినట్లు కనబడింది. 

రెండు పరస్పర భిన్నమైన తీవ్ర భావజాలాలు కలిగిన బీజేపీ, వామపక్షం తమ ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా కలవడానికి గతంలో ఏమాత్రం సందేహించనప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్‌ అదే పని ఎందుకు చేయకూడదు? ఒకప్పుడు కాంగ్రెస్‌ భారత రాజకీయాలను ఏకధ్రువంగా మార్చింది. ఇప్పుడు బీజేపీ ఆ పని చేస్తోంది. మరి కాంగ్రెస్‌కు ఆ వెసలుబాటు ఎందుకు ఉండకూడదు? కాంగ్రెస్‌లోని వాస్తవికవాదులు అడుగుతున్నది దీన్నే మరి. కొన్నిసార్లు బోఫోర్స్‌ తరహా అవినీతిపై యుద్ధం చేయడానికి వామపక్షం, బీజేపీ కలిసి పోరాడాయి. లేక వారసత్వ రాజకీయాలను సాగనంపడానికి కలిసి పోరాడాయి. కొన్ని సందర్భాల్లో అమెరికా భూతాన్ని (అణు ఒప్పందం), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను బంగాళాఖాతంలో కలిపివేయడానికి ఈ రెండు విరుద్ధ శక్తులు పొత్తు కలిపాయి.

మరి ఇప్పుడు కాంగ్రెస్‌ దాన్నే ఎందుకు కొనసాగించకూడదు? ప్రత్యేకించి మహారాష్ట్రలో మోదీ, షాల బీజేపీని అధికారానికి దూరం పెట్టే అవకాశం పొంచి ఉన్నప్పుడు ఇలాంటి అవకాశాన్ని వదులుకుంటే ఎలా? లోక్‌సభలో 52 స్థానాలను, మహారాష్ట్రలో 44 అసెంబ్లీ స్థానాలను మాత్రమే చేజిక్కించుకున్న కాంగ్రెస్‌కు పోయేదేముంది. మహారాష్ట్రలో అతి తక్కువ కాలం పాటు తాను అధికారంలో ఉండి తర్వాత బీజేపీ గద్దెకెక్కినా సరే అదేమంత పెద్ద విషయం కాదు. ఏదోలా బీజేపీని తరిమేయాలి. పవార్‌ ఇలాంటి గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్‌ ముందు పెట్టి ఉండకపోతే కాంగ్రెస్‌–శివసేనల మధ్య పొత్తు గురించి ఇంత హైరానా పడాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీగా ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు గడ్డిపోచ సాయం దొరికినా గట్టిగా పట్టుకోవలసిందే మరి. ఆ గడ్డిపోచ ముదురు కాషాయరంగు పార్టీ అయినా సరే దాన్ని కరుచుకోక తప్పదు మరి.


శేఖర్‌ గుప్తా 
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement