మైనారిటీలు మారారు.. గుర్తించారా? | Shekhar Gupta Article On Indian Muslim Community | Sakshi
Sakshi News home page

మైనారిటీలు మారారు.. గుర్తించారా?

Published Tue, Dec 24 2019 12:25 AM | Last Updated on Tue, Dec 24 2019 12:29 AM

Shekhar Gupta Article On Indian Muslim Community - Sakshi

కల్లోలం పుట్టుకొచ్చిన ప్రతిసారీ దేశం తగులబడుతూనే ఉంది. ఢిల్లీలోని ధార్యాగంజ్‌లో కారు తగులబడుతోంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో హింసాత్మక శక్తులను చూస్తున్నాం. పశ్చిమబెంగాల్‌లో ఒక నిప్పురవ్వ దావానలమై మంటలు రేపుతోంది. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఢిల్లీలో లాగా భారతీయ ముస్లింలలో కలుగుతున్న గణనీయ మార్పును ప్రతిబింబించలేకపోయాయి. ఢిల్లీలో ఒక నూతన భారతీయ ముస్లింలు పెరుగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ముస్లింను చూసి ఇక భయపడనవసరం లేదు. వారి జాతీయతను ప్రశంసించడానికి ఇక సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకను, జాతీయ గీతాన్ని ఎత్తిపడుతూ.. అంబేడ్కర్, గాంధీలను గౌరవిస్తూ, హిందుస్తాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేస్తూ పోరాటం చేయడానికి ప్రయత్నిస్తున్న నూతన తరహా ముస్లింలు వీరు.

ఢిల్లీలోని జామా మసీదులో గుమికూడిన ముస్లింలు తాము మొదట భారతీయులం అని ప్రకటించడం ద్వారా, మెజారిటీ వర్గంలో ఉన్నందున మన రిపబ్లిక్‌ పునాదిని మార్చివేయగలమని అనుకుంటున్న వారి భావనను పూర్తిగా తోసిపుచ్చేశారు. అదేసమయంలో భారత రిపబ్లిక్‌ తన సెలబ్రిటీ రచయిత–కార్యకర్త అయిన అరుంధతీరాయ్‌కు ఎంతగానో రుణపడి ఉంది. ఆమె ఒంటిచేత్తోనే భారతదేశాన్ని మావోయిస్టు సాయుధ తిరుగుబాటుదారుల నుంచి కాపాడారు. 

మన మావోయిస్టులు ‘తుపాకులు ధరించిన గాంధేయవాదులు’ (‘గాంధియన్స్‌ విత్‌ గన్స్‌’) అని వర్ణించడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించారు. ఆమె చేసింది సర్వకాలాల్లోనూ అతి గొప్పగా కోట్‌ చేయదగిన ఉల్లేఖన. అణిచివేతకు గురవుతున్నవారిగా మావోయిస్టుల మీద అంతవరకు ఉన్న కాస్తంత సానుభూతిని కూడా రాయ్‌ వ్యాఖ్య సమాధి చేసేసింది. ఏకకాలంలో మీరు గాంధేయవాదిగా, మావోయిస్టుగా ఉండలేరు. 

బహదూర్‌ షా జాఫర్‌ మార్గ్‌ వద్ద కూర్చుని నేను ఈ వ్యాసం రాస్తూ, జామా మసీదుకు చెందిన 17వ శతాబ్ది నాటి మెట్లమీదుగా వేలాది ముస్లింలు నడుచుకుంటూ పోయిన ఘటనను ఆమె ఎలా వర్ణించి ఉంటారు అని నేను ఆశ్చర్యపోయాను. వీళ్లు ముస్లింలు. ముస్లింలలాగా దుస్తులు ధరించినవారు. ప్రజలు ధరించే దుస్తులు వారి ఉద్దేశాలను తెలుపుతాయని ప్రధానమంత్రి ఇప్పుడే సూచిం చినందున దీన్ని మనం నొక్కి చెబుతున్నాం. ఈ ముస్లింలు మువ్వన్నెల జెండా, రాజ్యాంగం, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చిత్తరువులను ధరించి వచ్చారు. 

కొంతమంది గాంధీ బొమ్మలను పట్టుకున్నారు. వీటితోపాటు జనగణమన, హిందూస్తాన్‌ జిందాబాద్‌లను వల్లిస్తూ పోయారు. భారత రిపబ్లిక్‌కి చెందిన అతి పెద్ద మైనారిటీ (ప్రతి ఏడుమంది భారతీయులలో ఒకరు) తమ పవిత్ర మసీదు మెట్లు దిగుతూ తాము ముందుగా భారతీయులమని, భారత రాజ్యాంగంపై, జెండాపై, జాతీయ గీతంపై తమకు విశ్వాసముందని, జనాభా పరమైన మెజారిటీ కారణంగా రిపబ్లిక్‌ పునాదినే మార్చివేయవచ్చనే భావనను వ్యతిరేకిస్తున్నామని ప్రకటిస్తే ఏం జరుగుతుంది?

భారతీయ దేశభక్తికి తామే వారసులమంటూ దేశంలోని మెజారిటీ జనాభా ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన ప్రకటనను ముస్లింలు తొలిసారిగా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. దేశంలో నివసించడానికే ఇక్కడున్నాం అంటూ వారు నినదించారు. వీళ్లతో ఇక ఎవరూ పోరాడలేరు. ఎలాంటి సమర్థనా లేకుండా వీరిపై ఎవరూ ఇక తుపాకులు గురిపెట్టి కాల్చలేరు. మన దేశం మారింది. లేక ‘మన దేశం ఇప్పుడు మారిపోతోంది మిత్రులారా’ అనే వాక్యాలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. అలాగే పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ పౌర పట్టికకు మధ్య పౌరులకు శరణార్థులకు మధ్య ఉన్న సూక్ష్మభేదాన్ని వివరించడం ద్వారా మీరు వారికి ఇక నచ్చచెప్పలేరు. 

ఇప్పటికే 2021లో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడేశారు. రెండు లక్ష్యాలను సాధించడానికి మీరు ఇప్పటికే ప్రయత్నాలు చేసి ఉన్నారు. ఒకటి, జాతీయ పౌర పట్టికలో దొరికిపోయే బెంగాలీ హిందువులను పునస్సమీక్షించి కాపాడటం, అదే సమయంలో బెంగాలీ ముస్లింలను బహిష్కరించడం. రెండు, రాష్ట్రంలోనూ దీన్నే పునరావృతం చేస్తామని హామీ ఇచ్చి పశ్చిమబెంగాల్‌ లోని బెంగాలీ హిందువులను ఆకట్టుకోవడం. అస్సాంలో మంటలు రేకెత్తించడానికి, పశ్చిమబెంగాల్లో మంటలు చల్లార్చడానికి చేసిన ప్రయత్నంలో మీరు ఇప్పుడు ఢిల్లీలో మంటలు రేపారు.

టోపీలు, బుర్ఖాలు, హిజబ్, ఆకుపచ్చ రంగు అనేవి ముస్లింలను గుర్తు చేసే అత్యంత స్పష్టమైన మూస గుర్తులు. అలాగే వారి మతపరమైన ప్రార్థనలు కూడా. ఒక స్నేహితుడికి పోలీసు లాఠీలకు మధ్యలో దూరి అతగాడిని కాపాడి దేశవ్యాప్తంగా నెటిజన్ల దృష్టి నాకర్షించిన ఇద్దరు యువతుల ఫోటోను ఫేస్‌ బుక్‌లో చూసినప్పుడు, ఆ యువతులు జాతీయవాదం లేక లౌకికవాదం పట్ల ఎలాంటి నిబద్ధత లేని, సంప్రదాయ ఇస్లాం మతంతో మాత్రమే ప్రభావితమయ్యారని చెప్పవచ్చు. ఇకపోతే ఏకే 47లు, ఆర్డీఎక్స్‌లు ధరించిన ముజాహిదీన్, లష్కర్, అల్‌ ఖాయిదా, ఐసిస్‌ వంటి సంస్థలకు ప్రాతినిధ్యం వహిం చిన అనేకమంది ఆగ్రహోదగ్రులైన ముస్లింలకు చెందిన బలమైన సంకేతాలను కూడా మనం  చూడవచ్చు. ఈ తరహా ముస్లింలతో సులభంగా పోరాడి ఓడించవచ్చు. 

కానీ భారతీయ ముస్లింలు నిజంగా నిరాశా నిస్పృహలకు గురై ఉగ్రవాదాన్ని చేపట్టి ఉంటే ఏమయ్యేది? సిమీ నుంచి ఇండియన్‌ ముజాహిదీన్‌ల వరకు అతి చిన్న ఉగ్ర బృందాలు దీన్ని నిర్ధారించాయి కూడా. అత్యంత ఉదారవాదిగా పేరొందిన నాటి ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ సైతం 2009 ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో సీనియర్‌ జర్నలిస్టులతో నిండిన సభలో మాట్లాడుతూ, ఇదేవిషయాన్ని నొక్కి చెప్పారు. ముస్లింలకు ప్రత్యేక రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆరోపించే వారెవరైనా సరే, భారతీయ ముస్లింలలో ఒక శాతం (ఇప్పుడు వారి సంఖ్య 20 కోట్లు) మందైనా భారత్‌లో తమకు ఇక భవిష్యత్తు లేదని నిర్ణయించుకుని ఉంటే దేశాన్ని పాలించడం ఎవరికైనా కష్టమయ్యేదని సింగ్‌ ఆ సభలో చెప్పారు. 

యూపీఏ ప్రభుత్వం ఏలిన దశాబ్దంలో ఇదీ పరిస్థితి. భారతీయ ముస్లింలు అపమార్గం పట్టకుండా దేశం వారిపట్ల ఔదార్యాన్ని ప్రదర్శించింది. కొంతమంది యువ ముస్లింలు ఉగ్రవాద బాట పట్టారు. కానీ నేడు ఎన్డీఏ ప్రభుత్వం లాగే నాడు యూపీఏ ప్రభుత్వం కూడా వారిపట్ల కఠినంగానే వ్యవహరించింది. ఈ వాస్తవాలపై అనేక భాష్యాలు ఉండవచ్చు. కానీ అంతిమ నిర్ధారణ మాత్రం ఒకటే. ఒక పక్షం మాత్రం ముస్లింలకు క్షమాపణ చెబుతూనే వారు జాతి వ్యతిరేకులుగా మారకుండా వారికి ఎంతో కొంత సహాయం చేయాలని కోరుకునేది. 

మరో పక్షం మాత్రం ఇప్పుడు కంటికి కన్ను సమాధానం అంటూ రెచ్చిపోతోంది. అలాగే మెజారిటీ వర్గం ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీవ్రతరం చేయాలని కోరుకుంటోంది. అటు రాజకీయపక్షం ఇటు మెజారిటీ వర్గం ఇద్దరూ ముస్లింలను అనుమాన దృష్టితో చూడటంపై ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఇక భారతీయ ముస్లింల గురించిన ప్రతికూల దృక్పథం ఏదంటే వారి మతాధిపతులే. జామా మసీదు బుఖారీలు, మదానీలు, కమాండో కామిక్‌ చానల్స్‌లో కనబడుతూ ఫత్వాలు జారీ చేస్తూ బవిరిగడ్డాలతో కనిపించే ముస్లిం మతగురువులను మెజారిటీ వర్గ ప్రజలు ప్రతికూల భావంతో చూస్తున్నారు.

ముస్లింల పట్ల ఈ ప్రతికూల భావనలలో చాలావాటిని నేడు సవాలు చేస్తున్నారు. జనగణమన, జాతీయ జెండా, అంబేడ్కర్, గాంధీ బొమ్మలు, హిందూస్తాన్‌ జిందాబాద్‌ నినాదాలు.. ఇలా ముస్లింలను పట్టిచ్చే సంప్రదాయ సంకేతాలు మారుతున్నాయి కానీ దుస్తులు మాత్రమే మారలేదు. నాగరికతల మధ్య ఘర్షణ సూత్రం వెలుగులో భారతీయ ముస్లింలను అంచనా వేసేవారు ఘోరతప్పిదం చేస్తున్నట్లే లెక్క. 1947లో భారత్‌లోని మెజారిటీ ముస్లింలు జిన్నాతోపాటు నడిచి తమ కొత్త దేశం పాక్‌ వెళ్లిపోయారు. కానీ జిన్నా తర్వాత గత 72 ఏళ్లలో వారు తమ దేశాధినేతగా ముస్లింను ఎన్నటికీ విశ్వసించలేదు. వారు ఎల్లవేళలా ముస్లిమేతర నేతనే విశ్వసిస్తూ వచ్చారు. దీనర్థమేమిటి?

కల్లోలం పుట్టుకొచ్చిన ప్రతిసారీ దేశం తగులబడుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో హింసాత్మక శక్తులను చూస్తున్నాం. పశ్చిమబెంగాల్‌లో ఒక నిప్పురవ్వ దావానలమై మంటలు రేపుతోంది. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఢిల్లీలో సంకేతాలు వెలువరించినట్లుగా భారతీయ ముస్లిం లలో గణనీయ మార్పును ప్రతి బింబించలేకపోయాయి. ఢిల్లీలో ఒక నూతన భారతీయ ముస్లిం పెరుగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ముస్లింను చూసి ఇక భయపడనవసరం లేదు. వారి జాతీయతను ప్రశంసించడానికి ఇక సిగ్గుపడాల్సిన అవసరం లేదు. 

రాజ్యాంగాన్ని, జాతీయ పతాకను, జాతీయ గీతాన్ని ఎత్తిపడుతూ.. అంబేడ్కర్, గాంధీలను గౌరవిస్తూ, హిందూస్తాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేస్తూ పోరాటం చేయడానికి ప్రయత్నిస్తున్న నూతన తరహా ముస్లింలు వీరు. ఇప్పుడు మనం సుప్రసిద్ధ ఉర్దూ కవి రహత్‌ ఇందోరి రాసిన అమర వాక్యాలను ఈ భయానకమైన కాలంలో తరచుగా ఉల్లేఖిస్తున్నాం. ఆ కవితా పాదాల అర్థం ఏమిటి? ‘‘ఈ నేలపై ప్రతి ఒక్కరూ తమవంతు రక్తం ధారపోశారు. భారత్‌పై ఓ ఒక్కరూ తమ ప్రత్యేక హక్కును ప్రకటించలేరు’’. జాతిలో కలుగుతున్న ఈ మార్పును చూసి రహత్‌ ఇందూరి తప్పకుండా చిరునవ్వులు చిందిస్తుంటారు మరి.
వ్యాసకర్త : శేఖర్‌ గుప్తా, ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement