దాచేస్తే దాగదు ‘రఫేల్‌’ | Shekhar Gupta Article On Rafale Deal | Sakshi
Sakshi News home page

దాచేస్తే దాగదు ‘రఫేల్‌’

Published Sat, Feb 9 2019 12:38 AM | Last Updated on Sat, Feb 9 2019 1:29 AM

Shekhar Gupta Article On Rafale Deal - Sakshi

రఫేల్‌ ఒప్పందంపై తాజా సంచలనాత్మక వివరాల నేపధ్యంలో స్పష్టమవుతున్నది ఒక్కటే. అహంకారంతో, మూర్ఖత్వంతో కేంద్రం తనకుతానుగా తెచ్చిపెట్టుకున్న కుంభకోణంగా తప్ప మరే కోణంలోనూ దీన్ని చూడలేం. కేంద్రప్రభుత్వం వాస్తవాన్ని ముందే యధాతథంగా చెప్పి ఉన్నట్లయితే, సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి కుంభకోణంలో ఇరుక్కునే ప్రమాదం నుంచి తప్పించుకుని ఉండేది. ప్రత్యర్థులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఆశించగల అర్హత వారికి లేదని, తాము అన్ని అంశాల్లోనూ సరిగా ఉన్నామనే స్వీయ అహంకారంలో మునిగిపోయి ఉన్నప్పుడే ఇలా జరుగుతుంటుంది. రఫేల్‌ వివాదంలో మోదీ ప్రభుత్వం పతన దశ ఇక్కడే మొదలైంది.

రఫేల్‌ యుద్ధవిమానాల ఒప్పందంపై తాజాగా ద హిందూ పత్రికలో ఎన్‌ రామ్‌ వెల్లడించిన విషయాలు, వాటికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యక్తపరిచిన సమర్థనలు ఈ అంశంపై జరుగుతున్న చర్చను ముందుకు తీసుకుపోవడంలో మరింతగా సహాయపడ్డాయి. ఈ నేపథ్యంలో రఫేల్‌ ఒప్పందం గురించి స్పష్టమవుతున్నది ఒక్కటే. ఇది అహంకారం, మూర్ఖత్వంతో కేంద్రం తనకుతానుగా తెచ్చిపెట్టుకున్న కుంభకోణంగా తప్ప మరే కోణంలోనూ దీన్ని చూడలేం. 

రఫేల్‌ స్పష్టపరుస్తున్న తాజా వివరాలను ఒకటొకటిగా చూద్దాం. 1. మనోహర్‌ పారికర్‌ నేతృత్వంలోని రక్షణ శాఖ ఉన్నతాధికారులు రఫేల్‌ చర్చలు పట్టాలెక్కిన తీరుపై చాలా అసౌకర్యంగా లేక అభద్రతను ఫీలయ్యారు. ఈ ఒప్పందం పట్ల తమ అభ్యంతరాన్ని వారు రికార్డు చేశారు కూడా. 2. కానీ వారి అభ్యంతరాలను మరీ అతిగా స్పందించారని పేర్కొంటూ రక్షణ మంత్రి తోసిపుచ్చారు. పైగా ప్రధానమంత్రి పీఎస్‌ (బహుశా ప్రిన్సిపల్‌ కార్యదర్శి)తో సంప్రదింపులు జరపాల్సిం దిగా శాఖాధికారులను ఆదేశించారు. 3. దీనర్థం ఏమిటి? అత్యున్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకత్వం ఉన్నతాధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చిందనే కదా. ఈ ఒప్పందాన్ని సత్వరంగా కుదుర్చుకోవాలని నాయకత్వం కోరుకుంది. 4. సూత్రబద్ధంగా చూస్తే ఇది సరైందే. ఎందుకంటే సందేహాలను లేవనెత్తడం ఉన్నతాధికార వర్గం సహజ స్వభావం. నిర్ణయాత్మక శక్తి కలిగిన రాజకీయ నేత అలాంటి అభ్యంతరాలను తోసిపుచ్చి తన నిర్ణయానికి బాధ్యత తీసుకుంటాడు. 

ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడినుంచి మనం సమస్యను కొనితెచ్చుకుంటాం. పై నాలుగు అంశాలు నిజానికి ఏం చెబుతున్నాయి? అంటే.. ఒక ఒప్పందం కుదరాల్సి ఉంది. సాధారణంగానే ఉన్నతాధికారులు తమ స్వచర్మరక్షణను చూసుకుంటారు, కానీ దృఢమైన, జాతీయవాదంతో కూడిన నిజాయితీ కలిగిన ప్రభుత్వం తమముందు ఉన్న అవరోధాలను తొలగించుకుని ఒప్పందాన్ని ఖాయపరుస్తుంది. అలాంట ప్పుడు సాహస ప్రవృత్తి కలిగిన అదే ప్రభుత్వం ఈ విషయాన్ని నేరుగా ప్రకటించడానికి ఎందుకు సిగ్గుపడుతున్నట్లు?

అలా వాస్తవాలను ప్రకటించడానికి భిన్నంగా తన చర్యపై వరుస సమర్థనల వెనుక ఎందుకు దాక్కుంటున్నట్లో? కేంద్రప్రభుత్వం వాస్తవాన్ని ముందే యధాతథంగా చెప్పి ఉన్నట్లయితే, సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి రక్షణ శాఖ కుంభకోణంగా తలెత్తే ప్రమాదం నుంచి తప్పించుకుని ఉండేది. అప్పుడు ఆ సత్యం ఇలా ఉండేది: యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2012 ప్రారంభంలో 125 యుద్ధవిమానాల కొనుగోళ్లకు గాను తక్కువ బిడ్‌ దాఖలు చేసిన రఫేల్‌ని ఎంచుకున్నారు. కానీ, 14 మంది సభ్యులతో కూడిన ధరల సంప్రదింపు కమిటీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తపరిచింది. నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఈ అంశాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పర్చి ఈ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడానికి ముగ్గురు బాహ్య పర్యవేక్షకుల బృందాన్ని నియమించారు. తర్వాత ఈ అభ్యంతరాలను 14 మంది సభ్యులతో కూడిన పూర్తిస్థాయి కమిటీ తోసిపుచ్చింది. ఒక కమిటీపై మరో కమిటీ, ఆ కమిటీ మరొక కమిటీ చర్చల ప్రక్రియ కొనసాగాక 126 యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం ఖరారైంది. ఆపై ఏం జరిగింది?

యధావిధిగానే నాటి రక్షణ మంత్రి ఆంటోనీ సందేహిస్తూనే ఈ కమిటీ తుది నిర్ణయంతో విభేదించి మళ్లీ బిడ్లను ఆహ్వానించాల్సిందిగా సూచించారు. వాస్తవానికి ఈ ఒప్పందం 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో వెలుగులోకి వచ్చింది. అయితే ఆంటోనీ దీనిపై నిర్ణయాన్ని తదుపరి ప్రభుత్వానికి వదిలిపెట్టడానికే మొగ్గు చూపారు. తన హయాంలో ఏ రక్షణ కొనుగోలు కుంభకోణం చోటు చేసుకోకుండా ముగించాలన్నది ఆయన వైఖరి. ఒప్పందంలో ఒక భాగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. పెద్దగా కొనుగోలు చేసిందీ లేదు. కానీ ఆయన సైతం చివరకి అగస్టా వెస్ట్‌లాండ్‌ కుంభకోణంతో పదవిని ముగించాల్సి వచ్చింది. మరి మన నిర్ణయాత్మకమైన, రాజీలేని మోదీ ప్రభుత్వం ఏం చేసింది? అది చాలా మొరటుగా వ్యవహరించింది. భారత వాయుసేన తన అవసరాలకు శాశ్వతంగా ఎదురు చూడలేదు.  కాబట్టి కొన్ని విధివిధానాలను పాటించకుంటే ఏం కొంప మునుగుతుంది? పైగా ఆ విధానాలు కార్యనిర్వాహక నిబంధనలే తప్ప రాజ్యాం గబద్ధమైన ఆదేశాలు కావు. కాబట్టి ప్రధాని విశాల జాతి ప్రయోజనాల రీత్యా ఈ విధానాలను పక్కకు తోసేయగలడు. 

ఇదంతా బాగుంది. కానీ మోదీ ప్రభుత్వం ఈ ఒప్పంద వివరాలను పూర్తిగా ఎందుకు బహిర్గతం చేయలేదు? ఇంతకుముందే దాన్ని బహిర్గతపర్చి ఉంటే  గత ఆరునెలలుగా రఫేల్‌ ఒప్పందంపై వస్తున్న పతాక శీర్షికలు పూర్తి అసందర్భంగా వెలిసిపోయి ఉండేవి. పైగా మీడియా కెమెరాల ముందు, పార్లమెంటులో ప్రస్తుత రక్షణ మంత్రి నిర్మలా  సీతారామన్‌ రెచ్చిపోతూ మాట్లాడాల్సిన అవసరం అసలు ఉండేది కాదు. పైగా నచ్చబలికే వాస్తవాలు, ప్రస్తావనలతో ఆమె మంచి ఒప్పందాన్ని కుదుర్చుకుని ఉండి ఉంటే, రాహుల్‌ పదేపదే ఈ ఒప్పందంపై సంధిస్తున్న ప్రశ్నలకు ఆమె ఎందుకు సమాధానాలు ఇవ్వడం లేదు? రఫేల్‌ ఒప్పం దంపై రక్షణ శాఖ అభ్యంతరాలు లేవనెత్తిందా లేదా? ఈ ప్రశ్నకు ఆమె నిజాయితీగా అవునని సమాధానం చెప్పి ఉంటే, ఒప్పందంపై వచ్చే అన్ని ప్రశ్నలను ప్రభుత్వం తన విజ్ఞతతో తోసిపుచ్చి ఉండేది. 

ప్రభుత్వాలు తమను తాను స్వచ్ఛంగా ఉంచుకోవడానికి సాధారణ అంశాలను కూడా పాటించకపోవడానికి సాధారణంగా రెండు కారణాలు ఉంటుంటాయి. మరిన్ని విషయాలను తాను దాచి ఉంచి, వాటిని విమర్శకులు కనుగొనలేరని ప్రభుత్వం భావిస్తున్న సందర్భంగా ప్రభుత్వ వివేకం స్పష్టం కానప్పుడు ఇలా జరుగుతుంటుంది. రెండోది. ప్రత్యర్థులు సంధించే ప్రశ్నలకు  సమాధానాలు ఆశించగల అర్హత వారికి లేదని, తాము అన్ని అంశాల్లోనూ సరిగా ఉన్నామనే స్వీయ అహంకారంలో మునిగిపోయి ఉన్నప్పుడూ కూడా ఇలా జరుగుతుంటుంది. నన్ను  ప్రశ్నించడానికి కూడా నీకెంత ధైర్యం? నీకు లాగ నేను కూడా అవినీతిలో కూరుకుపోయానని అనుకుంటున్నావా? రఫేల్‌ వివాదంలో మోదీ ప్రభుత్వం పతన దశ ఇక్కడే మొదలైంది. ఒక విశ్లేషకుడిగా, సంపాదకుడిగా ఈ రెండు నిర్ధారణల్లో మొదటిదాన్ని ప్రకటించడానికి నాకు మరింత సాక్ష్యాధారం కావాలి. అదేమిటంటే ప్రభుత్వం విషయాన్ని దాచి ఉంచడానికి ఏవైనా  ముడుపులు తీసుకున్నటువంటి తప్పు మార్గంలో నడిచిందా? అదే జరిగివుంటే ప్రతిపక్షం సహనంగా ఉండటానికి కారణమే లేదు. ఇక రెండో నిర్ధారణ నిస్సందేహంగా ఇప్పుడు స్పష్టమైంది. 

గత మూడు దశాబ్దాల్లో ఈ డ్రామాను రెండు సార్లు విభిన్నమైన ఫలితాలతో చూశాం. మొదటిది బోఫోర్స్‌. రాజీవ్‌ గాంధీ స్పష్టంగా విజ్ఞతను ప్రదర్శించి ఉంటే ఆరోపణ వచ్చిన తొలిరోజే విచారణకు ఆదేశించి, నేరస్థులను శిక్షిస్తానని హామీ ఇవ్వడం ద్వారా బోఫోర్స్‌ కుంభకోణం నుంచి బయట పడేవారు. కానీ రాజీవ్‌ తప్పు మీద తప్పు చేసుకుంటా వెళ్లిపోయారు. స్విస్‌ అకౌంట్‌ వివరాలు వెలికి రాకముందే రాజీవ్‌ ఈ అంశంలో నిజాయితీతో లేరని, తప్పు చేశారని అనుమానం వచ్చేలా వ్యవహరించారు. దీని పర్యవసానమేమిటో స్పష్టమే. సరే, మీరు పరిశుద్ధులే. కానీ, ఎవరో చేసినప్పటికీ దేశం కోసం సరైన, నిజ మైన, పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి దోషులను పట్టుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అందుకే 32 ఏళ్లు గడిచినా బోఫోర్స్‌ ముడుపులకు సంబం ధించి ఎవరినీ పట్టుకోలేకపోయారని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించగలిగింది. కనీసం ఒక్క క్రోనా(స్వీడిష్‌ కరెన్సీ) స్వాధీనం కాలేదు. అదేసమయంలో కోల్పోయిన కాంగ్రెస్‌ ప్రతిష్ట కూడా తిరిగి రాలేదు. ఢిల్లీ హైకోర్టు దాన్ని కొట్టేసిందనే విషయం పక్కనబెడితే, బోఫోర్స్‌ మచ్చ మిగిలే ఉంది.

ఇక రెండోది, సుఖోయ్‌–30 కొనుగోళ్లు కూడా పెద్ద కుంభకోణ మేనని మార్మోగింది. 1996లో ఎన్నికలు ప్రకటించినప్పటికీ పి.వి.నర సింహారావు ప్రభుత్వం ఈ ఒప్పందంపై సంతకం చేయడమే కాకుండా, పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌ కూడా చెల్లించింది. ఈ విషయంలో ఏ నిబంధనలూ సక్రమంగా పాటించలేదు. ఇప్పటి ప్రమాణాలను బట్టి చూస్తే దాన్ని దేశద్రోహంగానే పిలవాల్సి ఉంటుంది. ప్రతిపక్ష బీజేపీ నాయకులపై నమ్మకంతోనే ఆయన అలా వ్యవహరించారు. తరువాత ప్రధాని అయిన దేవెగౌడ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న ములా యం సింగ్‌ యాదవ్‌ అన్ని ఫైళ్లను తెరిచి ప్రతిపక్షంలోని పెద్దలందరినీ వదిలిపెట్టేశారు. తెలివిగా సాగిన రాజకీయ నేతల కుమ్మక్కు వ్యవహా రంపై మనం గతంలో ఓ కథనంలో పేర్కొన్నాం. 23 ఏళ్లు గడిచిపోయినా ఇంతవరకూ ఎవరూ సుఖోయ్‌ గురించి ప్రశ్నించలేదు. భారత వైమానిక దళానికి ఇప్పటికీ సుఖోయ్‌ విమానాలే ప్రధాన ఆధారం, బలం కూడా.

మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం ఎక్కడిదో మీరు గమ నించే ఉంటారు. తాను పరిశుద్ధుడనని, తనను నిష్కారణంగా అనుమా నిస్తున్నారని, తాను బాధితుడనని చెప్పుకుని తనకున్న పేరు ప్రఖ్యాతుల ద్వారా మోదీ బయటపడిపోతారనుకుంటే పొరపాటు. రహస్యాలను కాపాడుకోవడంలో ఈ సర్కారుకు అమోఘమైన ప్రావీణ్యం ఉన్నదన్న అభిప్రాయానికి భిన్నంగా రఫేల్‌æ పత్రాలు ప్రముఖులంతా కొలువుదీరే ఢిల్లీలోని లూటెన్స్‌లో సులభంగా లభ్యమవుతున్నాయి. కనీసం ఈ దశ లోనైనా ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బావుంటుంది. విమ ర్శకులు, జర్నలిస్టులపై దాడి చేయడం కాకుండా, వారి ప్రశ్నలకు సమా ధానాలివ్వాలి. అలా చేయకపోతే, ఈ వ్యవహారం చాలా సులువుగా వారిని ముంచెత్తకమానదు.


శేఖర్‌ గుప్తా 
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement