నైపుణ్యమే ‘అగ్ని’కి ఆజ్యం! | Sakshi Guest Column On Agnipath Scheme | Sakshi
Sakshi News home page

నైపుణ్యమే ‘అగ్ని’కి ఆజ్యం!

Published Tue, Aug 6 2024 5:34 AM | Last Updated on Tue, Aug 6 2024 9:33 AM

Sakshi Guest Column On Agnipath Scheme

విశ్లేషణ

అగ్నిపథ్‌ విషయంలో మొదటి నుంచీ సమస్య ఉంది. పైగా అగ్నివీర్‌లను కేవలం ఆరు నెలల శిక్షణతో సైన్యంలోకి చేర్చుకున్నారు. నిజానికి గ్రామీణ నేపథ్యం, విద్యా స్థాĶæయులు, చేర్చుకున్న వయస్సు దృష్ట్యా, అగ్నివీరుడు సమర్థమైన నైపుణ్యాలతో బయటకు వచ్చే అవకాశం లేదు. ప్రాణాంతక ఆయుధాల వ్యవస్థలు, సంక్లిష్టమైన యంత్రాలు, ఎలక్ట్రానిక్స్‌ ఆపరేషన్‌ లేదా నిర్వహణను కొత్తగా చేరినవారికి అప్పగించాలంటే వారి అనుభవం చాలదు. అలాగని మొత్తానికే ఈ పథకాన్ని అవతల పడేయవలసిన అవసరం లేదు. ఈ పథకాన్ని రద్దు చేసే బదులు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి లోపాలను అధిగమించ డానికి ప్రభుత్వం ఈ çపథకాన్ని సవరించాలి. అగ్నివీర్‌ పదవీ కాలాన్ని నాలుగేళ్ల నుండి ఏడేళ్లకు పొడిగించడం మంచి ఆలోచన కావచ్చు.

కార్గిల్‌ జిల్లాలోని హిల్‌ స్టేషన్‌ అయిన ద్రాస్‌లో గత శుక్రవారం జరిగిన కార్గిల్‌ విజయ్‌ దివస్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, కాస్త తీవ్రంగానే స్పందించి ఉండవచ్చు. అగ్నిపథ్‌ అంశాన్ని ప్రతి పక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపణ. సైన్యాన్ని నిత్య యవ్వనంతో ఉంచడం, అలాగే దానిని నిరంతరం యుద్ధానికి సన్నద్ధం చేయటం ఈ పథకం లక్ష్యం. ‘‘దురదృష్టవశాత్తు కొంత మంది వ్యక్తులు జాతీయ భద్రతకు సంబంధించిన ఈ సున్నితమైన విషయాన్ని రాజకీయ అంశంగా మార్చారు’’ అని ఆయన అన్నారు.

మోదీ మరింత శక్తిమంతంగా చెప్పడానికి మరిన్ని పదాలు వాడి ఉండవచ్చు కానీ ఈ సందర్భం వాటికి తగినదా అనేది ఒక ప్రశ్న. నిజానికి ఒక ఆదర్శవంతమైన, హూందా అయిన సంప్రదాయానికి నాంది పలుకుతూ ప్రతిపక్షం, ప్రధానమంత్రి ఈ వేదికను ఉమ్మడిగా పంచుకుని ఉండవలసింది. కానీ బహుశా అది మరీ ఎక్కువగా ఆశించటమే అవుతుంది. 

గడచిన 10 ఏళ్లలో సైన్యాన్ని సంస్కరించడం కోసం చాలా ఎక్కువగానే కృషి జరిగిందనటంలో సందేహం లేదు. ‘చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌’ నియామకం, ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మిలిటరీ అఫైర్స్‌’ ఏర్పాటు, ‘డిఫెన్స్‌ అక్విజిషన్‌ పాలసీ’ సంస్కరణ, రక్షణ పరిశ్రమ నిర్బంధ స్వదేశీకరణ, అలాగే రక్షణ పరిశ్రమలో ప్రైవేట్‌ రంగానికి తలుపులు తెరవడం, ఆ రంగానికి డిఫెన్స్‌ ‘ఆర్‌ అండ్‌ డి’ నిధుల నుండి 25 శాతం అందించడం... వీటిలో కొన్ని. 

కానీ అగ్నిపథ్‌ దానికై అదిగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ఈ పథకం కింద, ఒక అగ్నివీర్‌ సైనికుడిని 17–21 సంవత్సరాల వయస్సులో నియమిస్తారు. అతను/ఆమె నాలుగు సంవత్సరాలు సైన్యానికి సేవలందిస్తారు. ఆ తర్వాత సైన్యం నుంచి వేరుపడి తగిన ప్యాకేజీతో నిష్క్రమిస్తారు. ఇలా రిటైరైన వారిలో 25 శాతం మందికి మరో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పాటు తిరిగి సైన్యంలో చేరే అవకాశం ఉంటుంది. 

బహుశా వీరు పెన్షన్ కు అర్హులు అవుతారు. ఇక అగ్నివీర్‌లలో ఎక్కువ మంది విషయానికొస్తే, వారిలో 75 శాతం మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో చేరే అవకాశం కలిగి ఉంటారు. అక్కడ వారు ప్రాధాన్యతా ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్‌కు అర్హులు అవుతారు.  

2023 చివరలో, మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎమ్‌ఎమ్‌ నరవణే తన అముద్రిత జ్ఞాపకాల రచనలో ఈ పథకం నౌకాదళానికి, వాయుసేనకు పిడుగుపాటు వంటిది అని వ్యాఖ్యానించారు. ఆ రెండింటికీ కాకుండా దీనిని తాను కేవలం సైన్యం (ఇండియన్‌ ఆర్మీ) కోసం మాత్రమే, అది కూడా 75 శాతం సిబ్బందిని ఉంచుకొని 25 శాతం సిబ్బందిని వదిలించుకోవాలనీ ప్రతిపాదించానని వ్యాఖ్యానించారు. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ దీనిని కాస్తా మార్చేసి, 75 శాతం అగ్నివీర్‌లను పంపించి, 25 శాతం మందిని మాత్రమే ఉంచుకోవటం జరుగుతోందని అనడంతో వివాదం తలెత్తింది. 

అగ్నిపథ్‌ విషయంలో మొదటి నుంచీ సమస్య ఉంది. సైన్యం కోసం ఒక అగ్నివీర్‌ ఏమి చేయగలడు లేదా ఏమి చేయాలి?
అన్నదే ఆ ప్రశ్న. ఆర్మీ సగటు వయస్సును అగ్నిపథ్‌ తగ్గించేస్తుంది అనేది ప్రాథమిక వాదన. ఒక ప్రభుత్వ అఫిడవిట్‌... ప్రపంచవ్యాప్తంగా కనిష్ఠస్థాయి ర్యాంక్‌ సిబ్బంది సగటు వయస్సు 26 సంవత్సరాలు కాగా, ఇండియాలోనే ఆ సగటు వయస్సు 32 ఏళ్లు అని పేర్కొంది. 

కానీ మన సైన్యంలో నియామక వయస్సు దశాబ్దాలుగా 16.5–21 ఏళ్ల వయస్సులోనే ఉంటోంది. ఇప్పుడు అగ్నిపథ్‌లో భాగంగా 75 శాతం అగ్నివీర్‌లను బయటికి పంపించటం ద్వారా, ప్రతి వలయంలో కొత్త సిబ్బందిని చేర్చడం ద్వారా, ఈ పథకం సైనిక వయస్సును తగ్గించాలని ఆశిస్తోంది. అయితే దాని వల్ల ప్రతిఫలంగా ఏం పొందుతుంది?

భారతీయ నియామకాలలో గ్రహించవలసిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి. యువకులు లేదా యువతులు మొదట సైనికులుగా నియ మితులు అయినప్పుడు వారు తరచుగా తక్కువ బరువుతో, పోషకాహార లోపంతో ఉండి, విభిన్న నేపథ్యాల నుండి వచ్చినవారై ఉన్నారు. తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణ కేవలం శరీరాకృతి, క్రమశిక్షణ పరంగా వారిని ఒక కొలిక్కి తెస్తుంది. 

ఆ తర్వాత ట్యాంకులు, ఫిరంగిదళాలు, వాయు రక్షణ వ్యవస్థల నిర్వాహకులుగా మరింత సాంకేతిక ఉద్యోగాలు చేయగలిగిన పదాతిదళానికి తగిన ట్లుగా వీరికి వృత్తిపరమైన శిక్షణ అవసరం. ఇది కేవలం నైపుణ్యం కోసం. ఇది కాక మరొక సంవత్సరం వరకు ఎక్కడైనా వీరికి శిక్షణ అవసరం కావచ్చు.

ఇప్పుడు, అగ్నివీర్‌లను కేవలం ఆరు నెలల శిక్షణతో సైన్యంలోకి చేర్చుకున్నారు. గ్రామీణ నేపథ్యం, విద్యా స్థాĶæయులు, చేర్చుకున్న వయస్సు దృష్ట్యా, అగ్నివీరుడు సమర్థమైన నైపుణ్యాలతో బయ టకు వచ్చే అవకాశం లేదు. మెరుగైన దేశాల్లో, ఒక రిక్రూట్‌ అయిన సైనికుడు ముందే డ్రైవింగ్‌ వంటి నైపుణ్యంతో వస్తాడు, కానీ భారత దేశంలో దానికి మాత్రమే మూడు నెలలు పట్టవచ్చు.

కాగా, మాజీ అడ్మిరల్‌ అరుణ్‌ ప్రకాశ్‌ ఒక సందర్భంలో మాట్లా డుతూ... పదాతి దళ సిబ్బందికి, సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా అవసరం లేని సైన్యానికి అగ్నిపథ్‌ ఉపయోగపడుతుందనీ, అయితే వైమానిక దళానికి, నౌకాదళానికి ఇది పెద్ద సమస్యగా మారుతుందనీ పేర్కొన్నారు. ‘‘ప్రాణాంతక ఆయుధాల వ్యవస్థలు, సంక్లిష్టమైన యంత్రాలు, ఎలక్ట్రానిక్స్‌ ఆపరేషన్‌ లేదా నిర్వహణను అప్పగించ డానికి ముందు తగినంత అనుభవాన్ని పొందడానికి కనీసం అయి దారేళ్ల సమయం అవసరం అవుతుంది’’ అంటారాయన. 

అగ్నిపథ్‌ పథకంలో యువతీయువకుల ప్రొఫైల్‌ మిలటరీ అవసరాలకు కాకుండా మరి దేనికోసమో ఉద్దేశించినట్లు అనిపి
స్తోందన్న ఆరోపణలు ఉండగా ప్రభుత్వం వాటిని ఖండించింది. వాస్తవానికి ప్రభుత్వం పునరాలోచన తర్వాతనైనా ఈ పథకం దేశానికి ఆర్థిక పరిపుష్టిని చేకూర్చే అంశాలతో ప్రేరేపితమైందనే వాస్తవాన్ని ముందుగా తెలియజేయాల్సింది. అయితే ఈ పరిపుష్టి ఒక దశాబ్దం తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది. తాజా బడ్జెట్‌ ప్రకారం రూ. 1.41 లక్షల కోట్లు లేదా రక్షణ బడ్జెట్‌లో 22.7 శాతాన్ని వినియో గిస్తున్న పెన్షన్‌ బిల్లు సైన్యానికి గుదిబండ అయింది. 

యువశక్తి కోసం గతంలో వచ్చిన పిలుపుల దృష్ట్యా, మనం మొత్తానికే ఈ పథకాన్ని అవతల పడేయవలసిన అవసరం లేదు. ఈ పథకాన్ని రద్దు చేసే బదులు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి లోపాలను అధిగమించడానికి ప్రభుత్వం ఈ çపథకాన్ని సవరించాలి. అగ్నివీర్‌ పదవీ కాలాన్ని నాలుగు సంవత్సరాల నుండి ఏడేళ్లకు పొడిగించడం మంచి ఆలోచన కావచ్చు, ఇది కొంతకాలంగా ఉన్న ఆలోచన. 

ఇది శిక్షణ కోసం తగినంత సమయాన్ని నిర్ధారిస్తుంది. అలాగే సేవకు సమర్థవంతమైన సహకారాన్ని అందిస్తుంది. అగ్నివీర్‌లు సైన్యం నుంచి బయటికి వచ్చినప్పుడు వారి వయస్సు 24–28 సంవత్సరాల మధ్య ఉంటుంది, ఇది వారికి కొంత ఆలస్యంగా తెరచుకునే అనేక అవకాశాలకు అనువుగా ఉంటుంది.

1999లో కార్గిల్‌ యుద్ధంలో మరణించిన 550 మంది సైనికులు అగ్నివీరులు కాదని, శిక్షణ పొందిన, దృఢమైన, అంకితభావం కలిగిన సైనికులు అనే విషయం గుర్తుంచుకోండి. ఆ రకమైన సామర్థ్య పరీక్ష ఇప్పటికీ అగ్నివీర్‌ పథకం కోసం వేచి ఉంది.

మనోజ్‌ జోషీ 
వ్యాసకర్త న్యూఢిల్లీలోని అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌లో
డిస్టింగ్విష్డ్‌ ఫెలో ‘ (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement