ఏఐలో మనం మేటి కావాలంటే... | Sakshi Guest Column On Artificial Intelligence for India | Sakshi
Sakshi News home page

ఏఐలో మనం మేటి కావాలంటే...

Apr 7 2025 12:04 AM | Updated on Apr 7 2025 4:02 AM

Sakshi Guest Column On Artificial Intelligence for India

విశ్లేషణ

కొత్త సంవత్సరం మొదలై మూడు నెలలే అయింది కానీ... కృత్రిమ మేధ రంగంలో ఈ స్వల్ప అవధిలోనే పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. జనవరిలో విడుదలైన డీప్‌సీక్‌ ఆర్‌–1 ఒకటైతే... ఫిబ్రవరిలో ప్యారిస్‌లో జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సు ఇంకోటి. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌లు సంయుక్తంగా అధ్యక్షత వహించిన ఈ సదస్సులోనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఏఐ తీసుకురాగల రాజకీయ, భద్రతాపరమైన సవాళ్లను ప్రపంచం ముందుంచారు. చివరగా మోదీ తాజా అమెరికా పర్యటనలో ఇరు దేశాల మధ్య ఏఐ వంటి కీలక రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. ఏఐ రంగం నేతృత్వాన్ని ఆశిస్తున్న భారత్‌పై ఈ పరిణామాల ప్రభావం ఏమిటి?

డీప్‌సీక్‌ ఆర్‌–1 సంచలనం తరువాత భారత్‌లో నడుస్తున్న చర్చ ఏమిటీ అంటే... మనదైన లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (ఎల్‌ఎల్‌ఎం) ఒకటి తయారు చేసుకోవాలని. ఇందుకు అవసరమైన ఏఐ చిప్స్‌ అందు బాటులో ఉండేలా చూసుకోవాలని! మరోవైపు ప్రభుత్వం కూడా సొంత ఎల్‌ఎల్‌ఎం అభివృద్ధిపై ప్రకటన చేసింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పింది. నేషనల్‌ ఏఐ మిషన్‌  స్టార్టప్‌లు, పరిశోధకుల కోసం పది వేల జీపీయూలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. అంతేకాకుండా... ఎల్‌ఎల్‌ఎంలతోపాటు స్మాల్‌ లాంగ్వేజ్‌ మోడళ్లు, ప్రాథమికమైన ఏఐ మోడళ్ల తయారీకి పిలుపునిచ్చింది.

ఈ చర్యలన్నీ ఆహ్వానించదగ్గవే అయినప్పటికీ... ఇవి మాత్రమే సరిపోవు. డీప్‌సీక్‌ విజయవంతమైన నేపథ్యంలో చేపట్టాల్సిన పనుల ప్రాథమ్యాల్లోనూ ఇవి లేవనే చెప్పాలి. అతి తక్కువ ఖర్చు, శిక్షణలతోనే అద్భుతమైన ఎల్‌ఎల్‌ఎంను రూపొందించవచ్చునని డీప్‌సీక్‌ ఇప్పటికే రుజువు చేసింది. చౌక ఆవిష్కరణలకు పేరుపొందిన భారత్‌కు ఇది ఎంతో సంతోషించదగ్గ సమాచారం. అయితే దీనర్థం సొంత ఎల్‌ఎల్‌ఎం అభివృద్ధే ఏఐ ఆధిపత్యానికి తొలి అడుగు అని కాదు. అమెరికా, ఇతర దేశాల ఎల్‌ఎల్‌ఎంలకు, డీప్‌సీక్‌కు ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే... శిక్షణకు సంబంధించి భిన్నవైఖరి తీసుకోవడం! ఈ వైఖరి కారణంగానే దాని శిక్షణకు అయిన ఖర్చు చాలా తక్కువగా ఉంది. 

భారత్‌లోని టెక్నాలజీ నిపుణులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు స్థూలంగా మూడు. ఏఐలో సృజనను పెంచే అన్ని ప్రాథమిక అంశాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇందుకు ఏఐలో అత్యున్నత నైపుణ్యం కలిగిన వారు అవసరం. అలాగే మనదైన డేటా సెట్లు, రేపటి తరం రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మంట్‌ దృష్టికోణం కావాల్సి వస్తాయి. ప్రస్తుతం భారత్‌లో అత్యున్నత స్థాయి ఏఐ నైపుణ్యం లేదు. భారతీయ మూలాలున్న ఏఐ నిపుణులు దురదృష్టవశాత్తూ సిలికాన్‌  వ్యాలీలో పనిచేస్తున్నారు. 

పెర్‌ప్లెక్సిటీ ఏఐ సృష్టికర్త అరవింద్‌ శ్రీనివాస్‌ భారత్‌లో చేపట్టే ఏఐ కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు సిద్ధమని అంటున్నాడే కానీ... ఇక్కడకు వచ్చేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. అమెరికాలో పెర్‌ప్లెక్సిటీ ఏఐ బాగా పాపులర్‌ కాబట్టి ఈ నిర్ణయం సరైందే అనిపిస్తుంది. కానీ ఏఐ విషయంలో భారత్‌ నుంచి మేధా వలసను అరికట్టేందుకు ఏదైనా చేయాల్సిన అవసరాన్ని కూడా చెబుతోంది ఇది. 

దేశంలోని టెక్నాలజీ రంగాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు తగిన వ్యూహం కూడా కావాలిప్పుడు! యూపీఐ లాంటి వ్యవస్థల ద్వారా భారత్‌కు సంబంధించిన డేటా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నా వీటి ఆధారంగా డేటాసెట్లను ఇప్పటివరకూ ఏఐ స్టార్టప్‌లు తయారు చేయలేకపోయాయి. ఇలాంటివే అనేక డేటాసెట్లు వేర్వేరు చోట్ల పడి మూలుగుతున్నాయి. వీటన్నింటినీ ఉపయోగించడం ఎలాగో చూడాలి. అలాగే భారతీయ ఆర్‌ అండ్‌ డీ (పరిశోధన–అభివృద్ధి) రంగానికి కూడా భారీ ప్రోత్సాహకం అవసరం. 

మోదీ  ఆ మధ్య అమె రికా పర్యటనకు వెళ్లినప్పుడు అనుసంధాన్‌  నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ , అమెరికాకు చెందిన నేషనల్‌ సైన్‌ ్స ఫౌండేషన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అలాగే ఏఐలో పరిశోధనలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వంతోపాటు, ప్రైవేట్‌ రంగం కూడా పెట్టుబడులు పెట్టేలా చేయాలి. ఇవన్నీ చేయడం ద్వారా మాత్రమే సుశిక్షితమైన ఎల్‌ఎల్‌ఎం లేదా ఇంకో వినూత్న ఏఐ ఉత్పత్తి ఆవిష్కృతమవుతుంది. ఇలా చేయడం ద్వారా భారత్‌ ప్రపంచస్థాయిలో తనదైన గుర్తింపు పొందగలుగుతుంది. 

రెండో విషయం... ఏఐలో వినూత్న ఆవిష్కరణల కోసం ఓపెన్‌ సోర్స్‌ పద్ధతిని అవలంబించడం మేలు. డీప్‌సీక్‌–ఆర్‌1, మిస్ట్రల్‌ వంటివి అన్నీ ఓపెన్‌  సోర్స్‌ పద్ధతిలో అభివృద్ధి చేసినవే. ఇలాంటివి మేలా? ఛాట్‌ జీపీటీ వంటి క్లోజ్డ్‌ సోర్స్‌ ఎల్‌ఎల్‌ఎంలు మేలా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఫ్రాన్‌ ్సకు చెందిన మిస్ట్రల్, యూఎస్‌ కంపెనీ మెటా, చైనా కంపెనీ డీప్‌ సీక్‌లు ఓపెన్‌  సోర్స్‌ బాట పట్టాయి. 

భారత్‌ కూడా ఇదే పద్ధతిని ఎంచుకోవాలి. ఓపెన్‌  సోర్స్‌ ద్వారా భారతీయ స్టార్టప్‌ కంపెనీలు, పరిశోధకులు మెరుగ్గా పోటీపడగలరు. అదే క్లోజ్డ్‌ సోర్స్‌ అనుకోండి... విదేశీ ఏఐలపై ఆధారపడటం మరింత ఎక్కువ అవుతుంది. ఓపెన్‌ సోర్స్‌ బాట పట్టేందుకు యూరప్‌తో పాటు దక్షిణ దేశాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి భారత్‌ అందరికీ మేలు చేసేలా ఆ యా దేశాలతో ఏర్పాటు చేసుకోవడం మంచిది.

మూడో అంశం... ఏఐలో పోటీతత్వాన్ని పెంచేందుకు భారత్‌ తక్షణం ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అంతర్జాతీయ స్థాయిలో ఏఐ నుంచి రక్షణ ఎలా అన్న అంశంపై ప్రస్తుతానికి అంత దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ప్యారిస్‌ సదస్సులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఏఐపై అమెరికా వైఖరి ఏమిటన్నది సుస్పష్టంగా చెప్పారు. ఈ రంగంలో చైనా పైస్థాయిలో ఉంది కాబట్టి... అమెరికా కూడా ఎలాగైనా ఈ రేసులో తనది పైచేయి అనిపించుకోవాలని చూస్తోంది. ఈ పోటీలో భారత్‌ కూడా తనదైన ప్రత్యేకతను నిరూపించుకోవాలి. ఎప్పటికప్పుడు మారిపోతున్న ఈ పోటీ తీరుతెన్నులను ఒడిసిపట్టుకోకపోతే కష్టమే.

అందుకే ఏఐ నైపుణ్యాలను పెంచేందుకు, ఏఐ ఆర్‌ అండ్‌ డీకి సంబంధించి ఏర్పాటు చేసిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీల వాడకానికి తగిన వ్యూహం రూపొందించాలి. యూపీఐ వంటి భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన డేటా సాయంతో ఏఐ రంగంలో సృజనకు వీలుకల్పించే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రపంచం ఏఐ ఆటలో మనల్ని గుర్తించగలదు.

అనిరుధ్‌ సూరి 
వ్యాసకర్త ఇండియా ఇంటర్నెట్‌ ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement