Sakshi Guest Column On Russia Wagner Group Rebellion, Check Inside - Sakshi
Sakshi News home page

Russia Wagner Group : తిరుగుబాటు టీ కప్పులో తుపానా?

Published Thu, Jun 29 2023 4:57 AM | Last Updated on Thu, Jun 29 2023 12:32 PM

Sakshi Guest Column On Russia Wagner Group

రష్యాలో వాగ్నర్‌ గ్రూపు తిరుగుబాటు ఎక్కువసేపు కొనసాగలేదు కానీ, ఉన్నతాధికార వర్గాల్లో ఒకింత అలజడినైతే సృష్టించింది. యుద్ధానికి కావాల్సిన ఆయుధాలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ నిరాకరించడమే ఈ తిరుగుబాటుకు కారణమని అంచనా. ఉక్రెయిన్‌లో వాగ్నర్‌ గ్రూపు సభ్యులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి ఉండొచ్చు.

నెపం రక్షణ మంత్రిత్వ శాఖపై నెట్టడం మంచి వ్యూహం. అయితే ఈ తిరుగుబాటు వల్ల ఉక్రెయిన్‌  యుద్ధాన్ని మరింత నిశితంగా పరిశీలించాల్సిన పరిస్థితి రష్యాకు ఏర్పడింది. వాగ్నర్‌ గ్రూపు లాంటి కిరాయి దళాలు రష్యా సాధించిన విజయాల్లో కొన్నింటికి కారణమైతే కావొచ్చు కానీ, అంతిమంగా ఇవి అధికార వ్యవస్థను బలహీన పరిచేవే!

వాగ్నర్‌ తిరుగుబాటు ఉక్రెయిన్‌పై పోరు విషయంలో రష్యా తన పరిస్థితిని పునఃసమీ క్షించుకునేందుకు పురిగొల్పవచ్చు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖపై వాగ్నర్‌ గ్రూపు తిరుగుబాటు ఎక్కువసేపు కొనసాగలేదు కానీ, రష్యా ఉన్నతాధికార వర్గాల్లో ఒకింత అలజడినైతే సృష్టించింది. తిరుగుబాటుకు మాత్రమే కాకుండా... అంతే వేగంగా అది సమసిపోయేందుకు కారణాలేమిటన్న దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. కొన్ని తప్పుడు అంచ నాల వల్ల జరిగిందా? లేదా పనిగట్టుకుని కుట్రపూరితంగా వెలుగు లోకి వచ్చిన విప్లవమా? వాగ్నర్‌ కమాండర్‌ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ , రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇప్పటికీ దోస్తులేనా?

ఉక్రెయిన్‌ పై యుద్ధంలో పైచేయి సాధించలేకపోవడంతో ఆఫ్రికా కార్యకలాపాల్లో నిమగ్నమైన వాగ్నర్‌ మూకలను రష్యా రప్పించాల్సి వచ్చింది. అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా, బాగా డబ్బున్న కిరాయి సైనికుడైన ప్రిగోజిన్‌  సారథ్యంలో నడుస్తున్న వాగ్నర్‌ గ్రూపు 2014లో ఉక్రెయిన్‌  నుంచి క్రిమియాను లాక్కోవడంలో రష్యాకు బాగా ఉపయోగపడింది. ప్రపంచానికి దీని గురించి తెలిసింది కూడా అప్పుడే. ఆ వెంటనే అమెరికా వాగ్నర్‌ గ్రూపు, ప్రిగోజిన్‌ లపై ఆంక్షలు ప్రకటించింది.



ఆ తర్వాత వాగ్నర్‌ గ్రూపు దాదాపు ఇరవై దేశాల్లో రష్యా ప్రయో జనాలను కాపుకాస్తూ వచ్చింది. అయితే, మొజాంబిక్‌లోని కాబో డెలగాడోలో చొరబాటుదారులను అణచడంలో విఫలమైంది. చివరకు అక్కడ రువాండా దళాలు శాంతి భద్రతలను పునఃస్థాపించాయి. లిబియా, సూడాన్‌ , మాలి, సెంట్రల్‌ ఆఫ్రికన్‌  రిపబ్లిక్, ఇలా పలు దేశాల్లో వాగ్నర్‌ గ్రూపు చురుకుగా పని చేసింది. అప్పటికే అక్కడున్న ఫ్రెంచి దళాలను తరిమేయడం లేదా అంతర్గత కుమ్ములాటల్లో ఒక పక్షం వహించడం వాగ్నర్‌ గ్రూపు చేసిన పనులు.

ప్రధాన లక్ష్యం మాత్రం రష్యా మద్దతిచ్చిన సంస్థలకు దన్నుగా నిలవడం. ఈ పను లకు ప్రతిఫలంగా వాగ్నర్‌ గ్రూపునకు రష్యా ఆయుధాల సరఫరా జరుగుతుంది. బంగారం ఇతర సహజ వనరుల వెలికితీతకు సంబంధించిన వాటిల్లో మినహాయింపులు లభిస్తాయి. ఈ నేపథ్యంలోనే వాగ్నర్‌ గ్రూపును ఉక్రెయిన్‌ పై యుద్ధానికి దింపింది రష్యా. ఫలితంగా ఆఫ్రికా దేశాల్లో ఈ గ్రూపు కార్యకలాపాలు ఆగిపోయాయి. ఉక్రెయిన్‌ బక్‌ముట్‌ నగరంలో వాగ్నర్‌ గ్రూపు యుద్ధ సామర్థ్యానికి పుతిన్‌  ప్రశంసలు కూడా లభించాయి.

తిరుగుబాటుకు కారణాలేమిటి?
బక్‌ముట్‌ ప్రాంతంలో యుద్ధానికి కావాల్సిన ఆయుధాలను ఇచ్చేందుకు రష్యా నిరాకరించడమే ప్రిగోజిన్‌  తిరుగుబాటుకు కారణ మని కొంతమంది విశ్లేషకుల అంచనా. బక్‌ముట్‌లో వాగ్నర్‌ గ్రూపు సభ్యులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కాస్తా వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి ఉండవచ్చు. నెపం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖపై నెట్టేందుకు ప్రయత్నించడం మంచి వ్యూహం.

రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగూ, చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ జనరల్‌ వాలెరీ గెరాసిమో వ్‌లపై కూడా ప్రిగోజిన్‌  అసంతృప్తితో ఉన్నారు. రష్యా దళాల్లో వాగ్నర్‌ గ్రూపును ఏకం చేయడంలో వీరు కీలకపాత్ర పోషించారు. వాగ్నర్‌ గ్రూపు సైనికులు రక్షణ మంత్రిత్వ శాఖతో కాంట్రాక్టులు కుదుర్చు కోవాలని పట్టుపట్టింది కూడా ఈ ఇద్దరే. ఈ కాంట్రాక్టులే కుదిరితే వాగ్నర్‌ గ్రూపు కేవలం ఆఫ్రికా కార్యకలాపాలకు పరిమితం కావాల్సి వచ్చేది.

అయితే ప్రిగోజిన్‌  మిలిటరీ స్థావరమైన రొస్తోవ్‌ను చేజిక్కించుకునే విషయంలో దాదాపు విజయం సాధించాడు. ఆ వెంటనే తన తిరుగుబాటును బహిరంగం చేసేశాడు. అంటే, ఉక్రెయిన్‌  యుద్ధం విషయంలో రష్యా పరిస్థితిలో ఏదో తేడా ఉందన్నమాట. ఇందుకు తగ్గట్టుగానే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖలో సమూల ప్రక్షాళన జరగా లని కోరుతున్న వారూ కొందరు ఉండటం గమనార్హం.

రష్యా భద్రతా సంస్థ ‘ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌’ (ఎఫ్‌ఎస్‌బీ అంటారు. కేజీబీ వారసత్వం) ప్రిగోజిన్‌  వైపు కొంత మొగ్గు చూపు తున్నట్లు కొన్ని కథనాలు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నత వర్గాల్లో మార్పులను ఎఫ్‌ఎస్‌బీ కూడా కాంక్షిస్తూండ వచ్చు. తద్వారా అటు మంత్రిత్వ శాఖ, ఇటు ఎఫ్‌ఎస్‌బీ రెండూ సమన్వయంతో పనిచేసే అవకాశం ఏర్పడుతుంది. 

యుద్ధం... ఇకపై ఎలా?
వాగ్నర్‌ గ్రూపు నాయకత్వం ప్రధానంగా సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. రష్యాను నియంత్రించేంత సత్తా అనుమానమే. కాకపోతే కొన్ని అంశాల్లో కీలకమైన ప్రభావం చూప గలదు. ఇందుకు తగ్గట్టుగానే తిరుగుబాటు సందర్భంగా వాగ్నర్‌ ప్రకటనలు వారి సత్తాకు మించి ఉన్నట్లు స్పష్టమైంది. పైగా ఈ తిరుగు బాటు వారి శక్తిని కాకుండా నిస్పృహను ప్రదర్శించినట్లు అయ్యింది.

ఈ దశ నుంచి ఉక్రెయిన్‌ పై యుద్ధం ఎలా సాగబోతోందనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ ప్రిగోజిన్‌  రక్షణ మంత్రిత్వ శాఖను బహిరంగంగానే విమర్శిస్తే ఇతరులు నిశ్శబ్దంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కి ఉంటారు. యుద్ధం సాఫీగా కొనసాగితే భవిష్యత్తులో ఇలా బహిరంగ కీచులాటలైతే ఉండవు. 

వచ్చే ఏడాది మార్చిలో రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోపుగానే ఉక్రెయిన్‌ పై పైచేయి సాధించడం పుతిన్‌కు చాలా అవసరం. ఇప్పటికే యుద్ధంలో పదహారు మంది జనరళ్లు మరణించారు లేదా పదవుల నుంచి తప్పించబడ్డారు. జనరళ్ల స్థాయిలో ఈ స్థాయి వేట్లు ఒక రికార్డనే చెప్పాలి. తాజాగా రక్షణ మంత్రి, చీఫ్‌ ఆఫ్‌ ద జనరల్‌ స్టాఫ్‌లపై వేటు వేస్తారా? అదే జరిగితే తిరుగుబాటు దారుల లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది.  

ఇప్పుడు ఉక్రెయిన్‌  యుద్ధాన్ని మరింత నిశితంగా పరిశీలించా ల్సిన పరిస్థితి రష్యాకు ఏర్పడింది. వాగ్నర్‌ ఉదంతం నుంచి పాఠాలు కూడా నేర్చుకోవాలి. ఇలాంటి ప్రత్యేక దళాలు రష్యా సాధించిన విజయాల్లో కొన్నింటికి కారణమైతే కావచ్చు కానీ, అంతిమంగా ఇవి అధికార వ్యవస్థను బలహీన పరిచేవే. కాబట్టి వీటిపై మరింత కఠినమైన నియంత్రణ అవసరమవుతుంది. రానున్న కొన్ని నెలల్లో రష్యా సైనిక దళం పుతిన్‌  రాజకీయ ఆకాంక్షలకు తగ్గట్టుగా మెరుగైన ప్రదర్శన కనపరచగలదా అన్నది కూడా ఒక ప్రశ్న.

ఉన్నతస్థాయిలో మార్పులు చేస్తే వ్యూహాలు, పద్ధతులకు మార్పులు, చేర్పులు అనివార్యమవుతాయి. ఎఫ్‌ఎస్‌బీ, రక్షణ మంత్రిత్వ శాఖలు సమన్వ యంతో పని చేయడం ఇప్పుడు పుతిన్‌కు అవసరం. వాగ్నర్‌ గ్రూపు సైనికుల్లో అధికులు ఇప్పటికీ రక్షణ శాఖతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశ ముంది. ఎంతైనా ఇవి ఠంచనుగా డబ్బులు తీసుకుంటూ పనిచేసే కిరాయి సైన్యాలే కదా? కానీ వీరు సాధారణ సైనికుల మాదిరిగా క్రమశిక్షణతో వ్యవహరించగలరా? 

ఆఫ్రికా దేశాల్లో రష్యా ప్రయోజనాలు కాపాడే ప్రాజెక్టులతో అటు రక్షణ శాఖకూ, ఇటు వాగ్నర్‌ గ్రూపునకూ ఆర్థిక దన్ను ఇచ్చే సామర్థ్యం ప్రిగోజిన్‌ కు ఉంది. అయితే రక్షణ శాఖ ఈ నిధులను దుర్వినియోగం చేస్తోందన్నది ప్రిగోజిన్‌  ఆరోపణ. ఇప్పుడు ప్రిగోజిన్‌  బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. వాగ్నర్‌ గ్రూపు మానవ నష్టాన్ని చవి చూసింది.

మిగిలిన వాళ్లు సమర్థంగా పని చేయాలంటే ఏం చేయాల న్నది ఆసక్తికరంగా మారింది. ఏమైనప్పటికీ రానున్న ఎనిమిది నెలల్లో వాగ్నర్‌ గ్రూపు తన వారిని, రష్యా సైనికుల కార్యచరణకు అనుగుణంగా పనిచేసేలా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఉక్రె యిన్‌ కూడా తన ప్రతిదాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా దీటు గానే తట్టుకుంటోంది కూడా. కానీ ప్రిగోజిన్‌  సృష్టించిన ప్రకంపనలు కాస్తా రష్యా వ్యవస్థలోని లోటుపాట్లను ఎత్తి చూపినట్లు అయ్యింది. 

గుర్జీత్‌ సింగ్‌
వ్యాసకర్త మాజీ రాయబారి
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement