‘‘పాక్ పాలకులపై ఆగ్రహంతో మనం ఎందుకని పాకిస్తాన్ పౌరులకు వీసాలను తిరస్కరిస్తున్నాం? పాకిస్తానీయులందరూ జిహాదీలేనని మనం నమ్ముతున్నామా? పాకిస్తానీ జనాభాలోని 99.99 శాతం మందికి ఏ మాత్రం సంబంధం లేని ఉగ్రవాద చర్యలకు ప్రతీకారం తీర్చుకోవడానికి సంఝౌతా ఎక్స్‌ప్రెన్‌ను ఎందుకు రద్దు చేయాలి? పాకిస్తానీయులను భారతదేశంలోని తమ బంధువులతో కలవనీయకుండా చేస్తే హురియత్ తన ఆజాదీ పిలుపును విరమించుకుంటుందని నిజంగానే మనం భావిస్తున్నామా?’’... ఈ ప్రశ్నలన్నిటినీ మనం ఎదుర్కోవలసిన అవసరం ఉందని మణి శంకర్ అయ్యర్ తన ఆత్మకథలో రాశారు. కరాచీలో కాన్సుల్–జనరల్‌గా ఆయన నాలుగేళ్ల కాలాన్ని పొందుపరచిన అధ్యాయం... మనవాళ్లలో చాలామంది శత్రువుగా భావించే దేశంలోని ప్రేమ, అవగాహనలను తెలియబరుస్తుంది.
మణి శంకర్ అయ్యర్ ఆత్మకథలోని మొదటి సంపుటం గురించి నా అభిప్రాయం ఏంటంటే – చెప్పడంలోని సొగసంతా క్లుప్తతలోనే ఉంటుందన్న మాటపై ఆయనకు నమ్మకం లేదని. ‘మెమోయిర్స్ ఆఫ్ ఎ మావెరిక్’లోని ప్రారంభ అధ్యాయాలు మరీ అంత మితిమీరిన సమాచారంతో ఉండవలసింది కాదు. ఉల్లాసమైనవీ విసుగు తెప్పించేవీ, ఆసక్తికరమైనవీ అసంబద్ధమైనవీ, హాస్యభరితమైనవీ నిస్సారమైనవీ... అన్నిటినీ కూడా అయ్యర్ తనకు సాధ్యమైనంతగా వివరాలతో కిక్కిరిసిపోయేలా చేశారు. అందంగా రాశారు, అందులో సందేహం లేదు. కానీ అవస రంలేని దీర్ఘమైన నిరంతరాయ సాగతీతలు ఉన్నాయి. నిజానికి ఆ విషయాన్ని ఆయన ఒప్పుకొన్నారు. అనివార్యంగా కథనంలో అంత స్సూత్రతను కోల్పోయానని తనను తాను తిట్టుకున్నారు కూడా.
అయితే అంతకుమించి ఆయన్ని తప్పు పట్టేందుకేమీ లేదని వెంటనే నేను గుర్తించాను. తన జన్మనక్షత్రాలు, కుటుంబ వివరాలు, పెంపుడు జీవుల విశేషాలు, లేదా తన డూన్ స్కూల్ నాటి జ్ఞాపకాలను అలుపు తెప్పించేలా చెప్పడంలోని ఆయన స్వీయ సంతృప్తిని మీరు క్షమించాలి. కేవలం యూనియన్ (విద్యార్థి సంఘం) అంటే ఉన్న మక్కువతో మాత్రమే ఆయన కేంబ్రిడ్జిలో చేరే సమయం రాగానే పుస్త కంలోని పఠనీయ పరిస్థితులు మెరుగవుతాయనడంలో సందేహం లేదు. యూనియన్ అధ్యక్షుడవడం ఆయన ఏకైక ఆశయం.
పాపం ఆ ఆశయాన్ని సాధించలేకపోయారు. వాస్తవానికి యూనియన్ అధ్యక్ష స్థానానికి చేరువయ్యే సోపాన క్రమంలో అట్టడుగున ఉండే స్థాయీ సంఘానికి ఎన్నికవడానికి కూడా ఆయనకు కష్టమయింది. కానీ ఆయన ప్రయత్నంలోని మనోహరమైన నిజాయితీ మీ మనసును గెలుచుకుంటుంది. అంతేకాదు, 21వ శతాబ్దపు తొలి దశాబ్దానికి చెందిన ఈ రాజకీయ నాయకుడు పన్నెండవ శతాబ్దపు రౌండ్ చర్చి వెనుక ఉన్న కేంబ్రిడ్జి యూనియన్ చాంబర్‌లో రూపొందాడన్నది స్పష్టంగా తెలుస్తుంది.
బంజరు భూముల వంటి ఈ ప్రారంభ పుటలను దాటితే డిసెంబరు మాసపు మొఘల్ గార్డెన్స్‌లా పుస్తకం వికసించి కనిపిస్తుంది. హఠాత్తుగా ఆయన అలవిమాలిన సమాచారం... చూపు తిప్పని వివరాలతో కూడిన కథనంగా మారిపోతుంది. కథకు అందే ప్రతి చిన్న చేరికతో ఆయన చూపుతున్న ప్రపంచం మనల్ని మరింతగా ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి నేను పుస్తకాన్ని కింద పెట్టలేకపోయాను. రాత్రి బాగా పొద్దుపోయే వరకు కూడా, దానికి ఏదీ సాటిరాని స్కాట్‌లాండ్ జలాలతో బలోపేతం అయిన పేజీలను తిప్పుతూ ఉండి పోయాను. ఓ, ఢిల్లీలోని ఉష్ణో గ్రతల కారణంగా కొంచెం ఐసుతో కూడా!
ఆయన ఫారిన్ సర్వీసుకు ఎప్పటికీ ఎలా చేరుకోలేక పోయా రనే గాథను పుస్తకంలోని ముఖ్యాంశంగా పత్రికలు ఇచ్చి తీరాలి. మన ప్రముఖ పత్రికలలో ఒకటేదైనా ఇస్తుందని నాకు గట్టి నమ్మకం కనుక ఆ వివరాలను ఇక్కడ వెల్లడించడం ద్వారా పాఠకుల ఆసక్తిని ముందే చెప్పి పాడు చేయలేను. ఒకటైతే చెబుతాను. పుస్తకంలోని ఈ ముఖ్యాంశాన్ని ఇవ్వకపోతే మీ అభిమాన దిన పత్రికను కొనడం మానేయండి.
ఏదేమైనా, కరాచీలో కాన్సుల్–జనరల్‌గా పాకిస్తాన్‌లోని ఆయన నాలుగేళ్ల కాలాన్ని పొందుపరచిన అధ్యాయం... మనవాళ్లలో చాలా మంది శత్రువుగా భావించే దేశంలోని ప్రేమ, అవగాహనలను తెలియ బరుస్తుంది. మీలో చాలామందిని అది అక్షరాలా ఆకట్టుకునేలా ఉంటుంది. పాకిస్తాన్‌ని ఆయన ఉన్నదున్నట్లుగా లేదా, నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ అప్పట్లో ఉన్న విధంగా... మనవాళ్లు మనలో కలిగించిన, విధేయతతో సత్యం అని మనం నమ్మిన అపోహలను, అబద్ధాలను చెల్లాచెదురు చేసేలా ఆయన చిత్రీకరించారు.
మర్యాదపూర్వకంగా, ఆప్యాయతతో ఉండండి, అప్పుడు పాకి స్తానీలు అదే విధమైన తమ ప్రతి స్పందనతో మిమ్మల్ని ముంచె త్తుతారు అని మణి కటువైనది కాని సూచనగా మీకు చెబుతారు. ‘‘భారతీయ శత్రుత్వం, లేదా శత్రుత్వ భావన పాకిస్తానీలను వారి ప్రభుత్వం లేదా సైన్యం వెనుక సమైక్యం అయ్యేలా చేస్తోంది’’అంటారు మణి. ఇప్పుడూ అంతే కదా... మనం వారిని వారి సైన్యం బాహువుల్లోకి విజయవంతంగా నెట్టేస్తున్నాం.
మనం ఎదుర్కోవలసిన అవసరం ఉన్న ప్రశ్నలను మణి లేవ నెత్తారు. ‘‘పాక్ పాలకులపై ఆగ్రహంతో మనం ఎందుకని పాకిస్తాన్ పౌరులకు వీసాలను తిరస్కరిస్తున్నాం? పాకిస్తానీయులందరూ మన దేశంలో విధ్వంసాన్ని సృష్టించే జిహాదీలేనని మనం నిజంగా నమ్ము తున్నామా? పాకిస్తానీ జనాభాలోని 99.99 శాతం మందికి ఏ మాత్రం సంబంధం లేని ఉగ్రవాద చర్యలకు ప్రతీకారం తీర్చు కోవడానికి సంఝౌతా ఎక్స్‌ప్రెన్‌ను ఎందుకు రద్దు చేయాలి? మనం కనుక పాకిస్తానీయులను భారతదేశంలోని తమ బంధువులతో కలవ నీయకుండా చేస్తే హురియత్ తన ఆజాదీ పిలుపును విరమించు కుంటుందని నిజంగానే మనం భావిస్తున్నామా?’’
ఇందుకు ఆయన ఇచ్చిన సమాధానాన్ని నేను సమర్థిస్తాను... అది భౌగోళికంగా కచ్చితంగా లేకుండా ధ్వనిపూర్వకంగా మాత్రమే దగ్గరగా ఉన్నప్పటికీ. ‘‘పరాగ్వేలో మనం పడిపోకుండా ఉన్నాం. పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో నిలబడలేకున్నాం.’’
మనలో చాలా మందికి తెలియని ఒక సత్యాన్ని సంగ్రహించే ఒక వాక్యాన్ని మీకు వదిలేస్తాను. అయితే కొద్ది మంది దానిని అంగీకరించరు. ‘‘శాంతి కోసం జరిగే ప్రయత్నాలు భారతదేశంలో కంటే పాకిస్తాన్‌లోనే ఎక్కువని అయిష్టంగానే నేను ముగించాల్సి వచ్చింది.’’
ఈ మాటను మీరు అంగీకరిస్తే... మీరు ఈ పుస్తకాన్ని చదివేందుకు, మీరెంత కచ్చితమైన వారో తెలుసుకునేందుకు అది మిమ్మల్ని ప్రలోభపెడుతుందని నా ఆశ. అలా కాకపోతే మీకు ఎన్నడూ చెప్పని, లేదా మీ నుండి దాచి పెట్టినవాటిని ఎదుర్కోడానికి మీలో కోపాన్నైనా రేకెత్తించనివ్వండి.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment