మధ్య తరగతి ప్రజలే లోకువ | shekhar gupta write article on nda government | Sakshi
Sakshi News home page

మధ్య తరగతి ప్రజలే లోకువ

Published Sat, Feb 3 2018 1:18 AM | Last Updated on Sat, Feb 3 2018 1:15 PM

shekhar gupta write article on nda government - Sakshi

జాతిహితం
గొప్ప ప్రభుత్వం ఆ 1.7ను విస్తరింపచేయడానికి ఏదో ఒకటి చేయాలని ఇది సూచిస్తుంది. ఆ క్రమంలో మొదటి తెలివైన చర్య పెద్ద నోట్ల రద్దు అని భావించారు. తర్వాత జీఎస్టీని తీసుకొచ్చారు. కానీ ఆశించిన పెరుగుదల ఏదీ? వాస్తవానికి ఈ ఒక్క లక్ష్య సాధనలోనే అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఫలితంగా, పెద్దమొత్తంలో పన్ను ఎగవేతదారు లను, లేదా పన్ను చెల్లించని కోట్లాదిమందిని పట్టుకోవడానికి బదులుగా దాచుకోవడానికి తమవద్ద ఏదీ లేని వారిపైనే దాడిచేయడానికి సిద్ధమవుతున్నారు.

తరతరాలుగా కాసాబ్లాంకా సంస్కృతి విస్తరిస్తున్నది. ఆ కారణంగా దానికి సంబంధించినవే శిలాక్షరాల వంటి రెండు పంక్తులతో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్‌ భారత మధ్య తరగతి ప్రజానీకానికి ఏం ఒరగబెట్టిందనే విషయం చెప్పవచ్చు. రిక్‌ కేఫ్‌ అమెరికన్‌ ఉదంతం సందర్భంలో  కెప్టెన్‌ రెనాల్ట్‌ అనే ఎందుకూ కొరగాని పోలీసు చెబుతాడు చూడండి, ‘ఎప్పుడూ పట్టుకునే అనుమానితులనే పట్టు కోండి!’ అని. అలాగే జరిగింది. 

భ్రష్టత్వం వల్ల కావచ్చు, రాజకీయం ప్రయోజనాలతో ఓట్ల కోసం డబ్బును వెదజల్లడం వల్ల కావచ్చు– మన ప్రభుత్వానికి నిరంతరం డబ్బుకి కొదవే. ప్రభుత్వం ఎప్పుడూ ఈ దురదృష్టకర మధ్య తరగతి మీదే పడుతుంది. మరీ ముఖ్యంగా వేతనాల మీద ఆధారపడి జీవించే ఉద్యోగులే కనిపిస్తూ ఉంటారు. వీళ్లని ఎంతవరకు వీలుంటే అంత వరకు ఊపిరి సలపకుండా చేసేయవచ్చు. వీళ్ల గురించి మాట్లాడేవారు లేరు. ప్రజా ప్రతినిధులు లేరు. అలాగే వీరందరికీ సమంగా వర్తించే ఏకసూత్రం కూడా ఏదీ లేదు. అలా వాళ్ల మెడ పట్టుకుని, వెనక ఒక్క తన్ను తన్నితే చాలు వారి నుంచి ఏదైనా సరే కక్కించవచ్చు. పైగా రాజ కీయాలకు వచ్చిన ప్రమాదం కూడా ఏమీ ఉండదు. 

పెద్ద నోట్ల రద్దు తరహా రాజకీయం
ఒకవేళ వారి నుంచి ఏదైనా పెద్ద ఆరోపణ వస్తే, అది పేదందరికి దృశ్యానం దపు తృప్తిని కలిగించేదే అవుతుంది. ప్రస్తుత వాతావరణంలో ఈ పరిస్థితిని పెద్ద నోట్ల రద్దు తరహా రాజకీయం అని పిలవవచ్చు. ఏదో ఒకటి నాటకీ యంగా చేయాలి. అది పేదల దగ్గరకు తీసుకెళ్లి, ఆ చర్యతో వారు నష్టపోయే అవకాశం ఉందని చెప్పేటట్టు చేయాలి. నేను చెప్పేది కొంచెం ఓర్పుగా వినండి, ధనవంతులు ఎంతగా నష్టపోతున్నారో మీకు అవగాహన లేదు. అయితే వాస్తవానికి ధనికులు ఎప్పుడూ దెబ్బతినరు. అది వేరే విషయం. పేదలు నమ్ముతారు. వారిలో గందరగోళం అనంతంగా సాగుతూనే ఉంటుంది. ఇక మధ్య తరగతినైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు గాయ పరచవచ్చు. 

ఈ బడ్జెట్‌ మన స్మృతిపథంలో ఎంతోసేపు ఉండదు. అది వెంటనే వార్తాకథనం కూడా కాలేదు. అందులో చాలా విషయాలు 2019 సంవత్సరం వేసవిలో బీజేపీ ఎన్నికల ప్రణాళిక తయారయ్యే వరకు కూడా మనని వెంటా డుతూనే ఉంటాయి. కానీ స్టాక్, బాండ్ల మార్కెట్‌లో మారణహోమం సృష్టిస్తూ ఇవాళ మాత్రం సజీవంగానే ఉంది. మార్కెట్‌ విధ్వంసక అత్యవసర బడ్జెట్‌గా వెళ్లింది కాబట్టి, ఇది దాదా ప్రణబ్‌ ముఖర్జీ పునరావృత ఒడాఫోన్‌ సవరణ తరగతికి చెందుతుంది. చాలా విషపూరితం. ఆయన తరువాత ఇద్దరు ఆర్థికమంత్రులు బడ్జెట్లు సమర్పించిన ఆరేళ్ల కాలంలో కూడా శస్త్ర చికిత్స చేసేటప్పుడు ధరించే గ్లోవ్స్‌ ధరించి కూడా  అలాంటి బడ్జెట్‌ జోలికి మాత్రం వెళ్లలేదు. బ్యాంకు నగదు లావాదేవీలపై పన్ను, సెక్యూరిటీల లావాదేవీల మీద పన్ను, ఉద్యోగుల స్టాక్‌ ఆప్షన్‌ను తిర గరాసిన పన్నులను కూడా వెంటపెట్టుకుని వచ్చిన పి. చిదంబరం బడ్జెట్‌ కూడా మార్కెట్లను కకావికలు చేసింది. పైన ముగ్గురు ఆర్థిక మంత్రులలో ఆయన కూడా ఒకరు.

మధ్య తరగతి మదుపునకు దెబ్బ
కానీ ఈ బడ్జెట్‌ చేసిందేమిటంటే, మధ్య తరగతి మదుపులకు దశాబ్దంగా ఉన్న భద్రత మీద దాడి. మధ్య తరగతికి ఎటూ పాలుపోని పరిస్థితిని కల్పిం చింది. ఇదంతా నేను బిజినెస్‌ స్టాండర్డ్‌ లిమిటెడ్‌ సంస్థ చైర్మన్, ఆర్థిక వ్యవస్థ విశ్లేషకుడు టీఎన్‌ నైనన్‌ మాటల ఆధారంగా రాస్తున్నాను. ఆయన షేర్ల మీద దీర్ఘకాలిక కేపిటల్‌ గెయిన్స్‌ పన్నును ఉపసంహరించుకోమని గట్టిగా కోరారు. 2017, జనవరి 6న ఆయన నిర్వహించిన వారాంతపు జ్ఞాపకాల కార్య క్రమంలో ఈ విషయం గురించి వాదించారు. లోటును తగ్గించాలని ఆర్థిక మంత్రి కోరుకుంటే  ఈక్విటీ ప్రాఫిట్ల మీద పన్ను విధించడం తప్ప మరో మార్గం లేదని నైనన్‌ చెప్పారు. ఆర్థికమంత్రి కూడా నైనన్‌ సలహా విలువైన దని గ్రహించారు. లోటును తగ్గించడానికి ఆయన సూచించిన విధానం బల మైనదని కూడా గుర్తించారు. ఈ అంశాన్నే నేను  మరో కోణం నుంచి వివరి స్తున్నాను. ఆ కోణం పరిశీలించడానికి అనువైనది కూడా.

రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా?
మొదటిగా ఒక ప్రశ్న. ఆర్థిక విధానంలో ఎదరుయ్యే పరిణామాలతో, ఎగుడు దిగుళ్లతో ఏమాత్రం సంబంధం లేకుండా ఒక ప్రభుత్వం ఎన్నికల రాజకీ యాల కోసం ప్రజాధనం యథేచ్ఛగా వెచ్చించగలదా? అలాగే తన ఇష్టం వచ్చినట్టు పన్నులు విధించగలదా? అలా అని నేను పేదల అనుకూల పథ కాలను లేదా రాయితీలను విమర్శించడం లేదు. అయితే పెద్ద నోట్ల రద్దు వంటి ఒక వికృత ఆలోచన ఒక సంవత్సరపు స్థూల జాతీయోత్పత్తిలో 1 నుంచి 2 శాతం పెరుగుదలకు మంగళం పాడింది. అక్కడితో ఆగకుండా చిన్న చిన్న వ్యాపారులకు నష్టం చేయడంతో పాటు ఎన్నో ఉద్యోగాలను ఊడ గొట్టింది. దీని వెనుక ఉన్న ఆర్థికపరమైన ప్రతిపాదన లక్షలాది మందిని అధికారిక ఆర్ధిక వ్యవస్థ నుంచి అనధికార ఆర్థిక వ్యవస్థకు నెట్టింది. ఆర్థికవేత్త కౌశిక్‌ బసు ఆర్థికసర్వేలో ప్రత్యేకంగా కనిపించే కొన్ని వాక్యాలను కను గొన్నారు. అవి పెద్ద నోట్ల రద్దు ఆలోచన విఫలమైందని అంగీకరించేవి. ముందు తీసుకున్న విధాన పరమైన చర్యల ప్రభావం అదృశ్యం కావడమే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత మందగమనానికి కారణమని  2017–18 ఆర్థిక సర్వేలో చెప్పడమంటే పెద్ద నోట్ల రద్దు పెద్ద తప్పిదమని అంగీకరించడమేనని కౌశిక్‌ ట్వీట్‌ చేశారు. 

తరువాతి వాదన లేదా ప్రశ్న రాజకీయాలకు సంబంధించినది. మధ్య తరగతిని ప్రభుత్వాలు (ఒక్క బీజేపీ ప్రభుత్వాలే కాదు, మొత్తం అన్ని ప్రభు త్వాల గురించి) అంత కర్కశంగా చూడడానికి కారణం వారి వెనుక ఎలాంటి లాబీ లేకపోవడమే. అలాగే ఎన్నికలను నిర్దేశించే ఎలాంటి శక్తి వారి వద్ద లేకపోవడం కూడా. ఈ తరహా బడ్జెట్‌ మీ రాజకీయాల వరకు సానుకూల మైనదే కావచ్చు. కానీ పేదలను ఒప్పించగలగాలి. అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి కూడా కావలసినంత వెచ్చిస్తామని చెప్పాలి. ఎందుకంటే వారికి కూడా ఓటు హక్కు ఉంది. మీ ప్రభుత్వాన్ని ఓట్లతో ముంచెత్తిన మధ్య తరగతికి నష్టం జరగకుండా అదనపు పరిహారాలు ఇవ్వాలి. కొన్ని గణాంకాలు మన విశ్లేషణలో కనిపిస్తాయి. అందులో ఒక అంశం– కేవ లం 1.7 శాతం భారతీయులు ఆదాయపు పన్ను చెల్లిస్తారు. 2015–16 నాటి అంచనాల అధికారిక సమాచారంలో ఈ విషయం పేర్కొన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో, అదికూడా అత్యధికంగా మధ్య తరగతి ఉన్న దేశంలో ఈ విషయం భయంకరంగా అనిపిస్తుంది. దీనిని మరో ప్రశ్న రూపంలో చెప్పవచ్చు. అంటే దేశంలో వంద శాతం పన్నును ఈ 1.7 శాతమే చెల్లిస్తున్నారా?

పన్ను చెల్లింపుదారులు ఇంతేనా?
గొప్ప ప్రభుత్వం ఆ 1.7ను గొప్పగా విస్తరింపచేయడానికి ఏదో ఒకటి చేయాలని ఇది సూచిస్తుంది. ఆ క్రమంలో మొదటి తెలివైన చర్య పెద్ద నోట్ల రద్దు అని భావించారు. తర్వాత జీఎస్టీని తీసుకొచ్చారు. కానీ ఆశించిన పెరుగుదల ఏదీ? వాస్తవానికి ఈ ఒక్క లక్ష్య సాధనలోనే అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఫలితంగా, పెద్దమొత్తంలో పన్ను ఎగ వేతదారులను, లేదా పన్ను చెల్లించని కోట్లాదిమందిని పట్టుకోవడానికి బదులుగా దాచుకోవడానికి తమవద్ద ఏదీ లేని వారిపైనే దాడిచేయడా నికి సిద్ధమవుతున్నారు.

ఇప్పుడు వేతన జీవులు తమ పొదుపులను ఎక్కడ పెడతారు? ఎందుకంటే వారివద్ద నగదు లేదు. వీరు ఆస్తుల కొనుగోళ్లవైపు అడుగు పెట్టడం కష్టం. పైగా ఎన్డీయే నాలుగేళ్ల పాలనలో ఆస్తులు తమ విలువను వేగంగా కోల్పోయాయి. బ్యాంకులు, ప్రభుత్వ పొదుపు పథకాలు కూడా వడ్డీ రేట్లను తగ్గించివేశాయి. కానీ ఈ బ్యాంకులే తాము అప్పులిచ్చినవారికి ఈఎమ్‌ఐ రేట్లను తగ్గించడానికి పూనుకోవడం లేదు. ప్రభుత్వాలలాగే దురాశాపూరితమైన బ్యాంకులు కూడా భారీస్థాయి ఎగవేతదారులు ధ్వంసం చేసిన బ్యాలెన్స్‌ షీట్లను మళ్లీ పూరించుకోవడానికి నివాస గృహాలు, విద్య, వాహనాలను ఆశించే మధ్యతరగతి డిపాజిట్‌దారులు, రుణగ్రహీతలపైనే కన్నేస్తున్నాయి.

నాటి ఆర్థిక మంత్రి చిదంబరం 2004లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మార్కెట్ల తక్షణ పతనానికి కారణమైనప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఆర్థికమంత్రులు తరచుగా చెప్పే మాటలనే వల్లె వేశారు. నేను బడ్జెట్‌ను రైతుకోసం రూపొం దించాలా లేక బ్రోకర్‌ కోసం రూపొందించాలా? అప్పుట్లో నేను దీనిపై వ్యాఖ్యానిస్తూ ఆధునిక ఆర్థిక వ్యవస్థ పనితీరు ఇకపై రైతు వెర్సెస్‌ బ్రోకర్‌గా ఉండకూడదని, అది ఇక నుండి రైతు, అలాగే బ్రోకర్‌లాగా కూడా ఉండాలని రాశాను. ఎందుకంటే వ్యవసాయం, ద్రవ్యమార్కెట్లు ఒక దాన్నొకటి నిషేధిం చుకోవడం లేదు. అందుకే చిదంబరం బడ్జెట్‌ తర్వాత అనేక దిద్దుబాట్లకు గురైంది. పలు నష్టనివారణ చర్యలు చేపట్టింది. జైట్లీ సమర్పించిన ఈ బడ్జెట్‌ కూడా దాన్నే అనుసరించాల్సి ఉంటుంది.

భారతీయ మధ్యతరగతి దాదాపుగా పట్టణ స్వభావంతో కూడి ఉంటోంది. గుజరాత్‌ ఎన్నికల్లో మాదిరి అది ఇప్పటికీ నరేంద్రమోదీ పట్ల అభిమానం చాటుతోంది. గత నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం తగ్గిన చమురు ధరల ప్రయోజనాన్ని మధ్యతరగతికి అందించకుండా, దానినుంచి అదనపు వసూళ్లకు పూనుకుంటున్నప్పటికీ ఆ వర్గం మోదీ పట్ల విశ్వాసం ప్రదర్శిస్తూనే ఉంది. ఇప్పుడు పొదుపులను నిరుత్సాహపరుస్తున్న ప్రభుత్వ చర్య మధ్య తరగతికి మరింత గాయాన్ని కలిగిస్తోంది.

- శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupt

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement