బాబుగారి ‘బడ్జెట్‌’ డ్రామా! | CM Chandrababu drama in the name of budget | Sakshi
Sakshi News home page

బాబుగారి ‘బడ్జెట్‌’ డ్రామా!

Published Sat, Feb 3 2018 3:57 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

CM Chandrababu drama in the name of budget - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులపై ఒత్తిడి పెంచి విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు న్యాయంగా రావాల్సిన వాటిని సాధించటంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కనీసం ప్రశ్నించే సాహసం కూడా చేయకపోవటంపై రాష్ట్రమంతా తీవ్ర చర్చ జరుగుతోంది. నాలుగేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా, బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న  ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపటం లేదు. ఓటుకు కోట్లు కేసుతో సహా ఈ నాలుగేళ్లలో పలు అవినీతి, అక్రమాల్లో మునిగిపోయిన ముఖ్యమంత్రి సీబీఐ కేసులు పెడతారనే భయంతోనే దిక్కులు చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అభిప్రాయం రాష్ట్రంలోని అన్నివర్గాల్లో నెలకొందని, దీన్ని పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వ పెద్ద ఇన్నాళ్లూ మౌనం దాల్చారని అంటున్నారు.

సమావేశాలతో కాలహరణం
కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత రాష్ట్రాధినేతగా తన అభిప్రాయాన్ని మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన చంద్రబాబు తెరవెనుక నుంచి నాయకులతో టెలికాన్ఫరెన్సులు, అభిప్రాయ సేకరణలు, సమన్వయ కమిటీ, కేబినెట్‌ సమావేశాలు, ఎంపీలతో మీటింగ్‌లు అంటూ కాలం గడుపుతున్నారు. ఇదంతా అయోమయానికి గురి చేసే కొత్త డ్రామాయేనని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి పలుమార్లు వెళ్లినట్లు చెప్పుకుంటున్న చంద్రబాబు అక్కడ ఆయన  సొంత పనులు చక్కపెట్టుకోవడమే తప్ప ఆంధ్రప్రదేశ్‌ గురించి పట్టించుకోలేదనే విషయం తాజా బడ్జెట్‌ కేటాయింపులతో తేటతెల్లమైంది. పోలవరం కాంట్రాక్టు పనులు తనకు నచ్చిన సంస్థలకు అప్పగించుకోవడం, అసెంబ్లీ సీట్ల పెంపు లాంటి వ్యవహారాలే తప్ప ఇతర అంశాలను చంద్రబాబు ప్రస్తావించలేదని స్పష్టమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

క్యాబినెట్‌లోనూ ఆయన మంత్రులే 
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చంద్రబాబు భాగస్వామిగా కొనసాగుతున్నారు. నాలుగేళ్లుగా కేంద్రంలో ఆయన పార్టీకి చెందిన వారు మంత్రులుగా ఉన్నారు. వారు మంత్రులుగా ఉన్న కేబినెట్టే కేంద్ర బడ్జెట్‌ను ఆమోదించి పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేబినెట్లో, పార్లమెంటులో బడ్జెట్‌ను తన వారితో ఆమోదింప చేసిన చంద్రబాబు బయటకు వచ్చాక రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తాపీగా అనటాన్ని తప్పుబడుతున్నారు. రాష్ట్రానికి కేటాయింపులు ఏమీ లేకున్నా గత నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్‌ అద్భుతంగా ఉందంటూ పొగిడిన చంద్రబాబు ఇప్పుడు సర్దుకుని సరిగా లేదంటూ తప్పించుకునే యత్నం చేస్తున్నారు. ఓటుకు కోట్లు కేసుతో సహా పలు అక్రమాలపై సీబీఐ కేసులు నమోదవుతాయనే భయంతో బడ్జెట్‌పై బహిరంగంగా మాట్లాడకుండా తెరవెనుక నుంచి అనుకూల మీడియా ద్వారా లీకులు ఇప్పిస్తున్నారు. కేసుల భయంతో కనీసం ప్రెస్‌మీట్‌ పెట్టే సాహసం కూడా చేయలేకపోతున్నారని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని పేర్కొంటున్నారు.

తన ప్యాకేజీ కోసం ముందునుంచే...
బడ్జెట్‌ కన్నా ముందే చంద్రబాబు ఈ డ్రామాకు తెరలేపారని గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే నాటకాన్ని నడిపిస్తున్నారని పేర్కొంటున్నారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమీ ఇవ్వకున్నా ఫర్వాలేదు, పోలవరం ప్రాజెక్టు పనులు మాత్రం తాము చెప్పిన కాంట్రాక్టర్‌కే అప్పగించాలనే ధోరణితో వెళుతున్నారు. బడ్జెట్‌కు ముందు ఢిల్లీలో జరిగిన సమావేశంలో చంద్రబాబు పేర్కొన్న సంస్థకు కాంట్రాక్టు బదలాయింపు జరగడాన్ని ఉదహరిస్తున్నారు. అందుకే బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు లేకున్నా మారు మాట్లాడకుండా తెరవెనుక మాత్రం ఆగ్రహం అంటూ పక్కదారి పట్టించే యత్నాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో కమీషన్ల కోసమే ఈ వ్యవహారాన్ని నడిపారన్నది అందరికీ తెలిసిందేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు చేయటం లేదనే విషయం చంద్రబాబుకు ముందే తెలుసని అంటున్నారు.

ప్రతిపక్షం హితోక్తులు పెడచెవిన...
ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అంటూ చంద్రబాబు ప్యాకేజీని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు  ప్యాకేజీలోనూ ఏమీ ఇవ్వడం లేదనే లీకులు ఇస్తున్నారు. ప్యాకేజీతో లాభం లేదని, హోదా ఉంటేనే రాయితీలు, ఇతర సదుపాయల వల్ల పరిశ్రమలు వాటంతట అవే వస్తాయని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయని ప్రతిపక్షం పదేపదే చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. ‘కోడలు మగబిడ్డను కంటానంటే ఏ అత్త అయినా వద్దంటుందా?’ అని చలోక్తులు విసిరారు. కేంద్రంలో భాగస్వాములుగా ఉంటూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మాట్లాడకుండా అధికారాన్ని అనుభవిస్తున్న చంద్రబాబు నెపాన్ని ఇతరులపైకి నెట్టే ప్రయత్నాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇన్నాళ్లూ ఏం చేశారు?
ఇప్పటికే నాలుగు బడ్జెట్‌లు ముగిశాయి. విభజన చట్టం హామీలు నెరవేరడం లేదు. లోటు బడ్జెట్‌ను తొలి ఏడాదిలోనే భర్తీ చేయాలని చట్టంలో ఉన్నా నెరవేరలేదు. ఇంత జరుగుతున్నా రాష్ట్రాధినేతగా ఉన్న పెద్ద అడగడం లేదెందుకన్న ప్రశలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ సంస్థలకు నిధులు అరకొరగా ఇస్తున్నా నోరు మెదపడం లేదు. రైల్వేజోన్‌పై ఇన్నాళ్లూ మొద్దు నిద్ర నటించి ఇప్పుడు ఇక వచ్చే అవకాశం లేదని తన పార్టీ నాయకుల ద్వారా సంకేతాలు ఇస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నిధులకు బదులు మట్టి, నీరుతో సరిపెట్టినా చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకున్నారు. కేంద్రం నుంచి ఇతోధిక సాయం సాధిస్తామని పలు సమావేశాల్లో చెప్పుకొంటూ వచ్చారు. దుగరాజపట్నం ఓడరేవును సాధించాల్సింది పోయి తన స్వార్థం కోసం ఎకనమిక్‌ జోన్‌ అంటూ అదీ నెరవేరకుండా చంద్రబాబు అడ్డుతగలటాన్ని నిపుణులు పేర్కొంటున్నారు.

అప్పులపాలైన రాష్ట్రం
చంద్రబాబు తీరుతో ఒకపక్క కేంద్రంనుంచి నిధులు రాకపోగా మరోపక్క రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని నిపుణులు చెబుతున్నారు. తాత్కాలిక నిర్మాణాలు, పర్యటనల కోసం భారీగా నిధులు వ్యయం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సైతం తప్పుడు గణాంకాలతో మాయచేస్తున్నారని మండిపడుతున్నారు. ఫిస్కల్‌ రెస్పాన్సిబులిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంటు (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) 3 శాతం వరకు మాత్రమే రుణాలు తీసుకోవచ్చునని, కానీ చంద్రబాబు ఎక్కువ అప్పులు చేసేందుకు 12 శాతం వృద్ధి శాతం చూపించారని పేర్కొంటున్నారు. జాతీయస్థాయిలో జీడీపీ గ్రోత్‌రేట్‌ 6, 7 శాతానికి మించిలేదని, యూరోప్‌ లాంటి దేశాల్లో కూడా 3 శాతానికి మించిలేదని చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం గ్రోత్‌రేట్‌ను భారీగా పెంచి రుణాలు తీసుకున్నారని, ఫలితంగా గతంలో ఏపీకి 96 వేల కోట్ల అప్పులుంటే చంద్రబాబు 1.20 లక్షల కోట్లు అప్పుచేశారని ఇదంతా కమీషన్ల కోసమేనని అందరికి తెలుసునంటున్నారు. 

అంతా ఊదరగొట్టే ప్రకటనలు
కోట్ల రూపాయలు వెచ్చించి ఈవెంట్లను నిర్వహిస్తూ రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ ప్రభుత్వ పెద్దలు ఊదరగొట్టారు. తీరా అవన్నీ పచ్చి బూటకమేనని ఇండస్ట్రియల్‌ ఎంటప్రెన్యూర్స్‌ మెమొరాండం (ఐఈఎం) నివేదికల్లో తేటతెల్లమైందని గుర్తుచేస్తున్నారు. 2015 డిసెంబర్‌ 31 నాటికి రూ. 4500 కోట్లు, 2016 డిసెంబర్‌ 31 నాటికి 10వేల కోట్లు, 2017 డిసెంబర్‌ చివరి నాటికి 4400 కోట్లు మేరకు మాత్రమే పెట్టుబడులకు అవకాశముందన్న అంశం ఆయా నివేదికలు స్పష్టంచేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు లక్షల కోట్లు పెట్టుబడులు అంటూ చంద్రబాబు చెప్పినవన్నీ తప్పుడు ప్రకటనలేనని అంటున్నారు. ఎన్నికల హామీలు ఒక్కటీ నెరవేర్చకపోవడం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం, ప్రత్యేక హోదా లేక రాష్ట్రానికి కొత్తగా ప్రాజెక్టులు రాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, దీన్ని  పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు ఆడుతున్న డ్రామాలో భాగమే తాజా ఎత్తుగడలనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement