చంద్రబాబు నాయుడి ఫోన్ సంభాషణ(ఫైల్ ఫొటో)
సాక్షి, అమరావతి : బడ్జెట్‌లో ఏపీకి అన్యాయంపై స్పందన విషయమై తెలుగుదేశం పార్టీలో హైడ్రామా కొనసాగుతున్నది. బీజేపీపై విమర్శలు వద్దని చంద్రబాబు నాయుడు పైకి అంటున్నప్పటికీ, ఎంపీలు మాత్రం గొంతులు సవరిస్తూనేఉన్నారు. శివసేనతో బాబు మంతనాలు చేశారని, తొందరపాటు నిర్ణయాలు వద్దంటూ బీజేపీ చీఫ్ అమిత్ షా వారించారనే వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అమరావతిలో జరుగుతున్న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కీలకంగా మారింది.
ఈ భేటీలోనే బాబు బీజేపీతో పొత్తుపై ఏదో ఒకటి తేల్చేస్తారని కొందరు ఎంపీలు చెబుతుండగా, ‘డిస్కషన్ తప్ప ఏమీ జరగదన’ని ఇంకొందరు కుండబద్దలు కొట్టారు. గడిచిన నాలుగేళ్లు బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్న టీడీపీ.. హామీల అమలులో దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరుగనుండటంతో టీడీపీ అధిష్టానం అనివార్యంగా కొత్త నాటకాలకు తెరలేపింది.
ఠాక్రేకు బాబు ఫోన్! : బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో చంద్రబాబు కూటమిని ఏర్పాటుచేస్తారనే ఊహాగానాల నడుమ ఇంకోవార్త వెలుగులోకి వచ్చింది. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో టీడీపీ అధ్యక్షుడు మంతనాలు చేసినట్లు తెలిసింది. శనివారం రాత్రి ఠాక్రేకు చంద్రబాబు ఫోన్ చేశారని శివసేన పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీతో పొత్తు తెంచుకోవడం, జాతీయ స్థాయిలో కలిసిపనిచేయడం లాంటి అంశాలపై ఇరు నేతలు చర్చించుకున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా బాబుకు ఫోన్‌చేసి తొందరపాటు నిర్ణయాలు వద్దని వారించారట. ఈ ఫోన్‌కాల్స్ వ్యవహారంపై టీడీపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలేదు. టీడీపీ, శివసేనలు రెండూ ఎన్టీఏలో భాగస్వాములేనన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment