చంద్రబాబు ఫైల్ పిక్, పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం మీడియాతో ఎంపీ సుజనా
సాక్షి, అమరావతి : బీజేపీతో పొత్తు విషయంలో రెండు రోజులుగా సాగిన నాటకానికి టీడీపీ తెరదించింది. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయంపై ఇప్పుడప్పుడే ప్రశ్నించడంగానీ, ఆందోళనలు చేయడంగానీ వద్దని తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఆదివారం అమరావతిలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతానికి బీజేపీతోనే కలిసి ఉండాలని, అవసరమైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని ఎంపీలతో చంద్రబాబు చెప్పారు. పార్లమెంటరీ భేటీ వివరాలను ఎంపీ సుజనా చౌదరి మీడియాకు వివరించారు.
‘‘ఎప్పుడైనా సరే విడాకుల గురించి కాదు ఎలా కలిసుండాలనే ఆలోచించాలి. బీజేపీతోనే టీడీపీ కలిసి ఉంటుంది. తెగదెంపులు చేసుకోబోతున్నామంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవమేఅయినా ఇప్పటికిప్పుడు కఠిన నిర్ణయాలు వద్దని మా అధ్యక్షులవారు(చంద్రబాబు) చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఎలా సాధించాలో సర్వం ఎరిగిన ఏకైకనేత ఆయన! ఎంపీలు అందరం అధ్యక్షుడి ఆదేశాలను శిరసావహిస్తాం. బీజేపీపై పరుషవ్యాఖ్యలు వద్దన్న సూచననూ పాటిస్తాం’’ అని సుజనా చౌదరి చెప్పారు.
అమిత్ షా ఫోన్ చేశారా? : ‘పార్లమెంటరీ పార్టీ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్న చంద్రబాబుకు బీజేపీ చీఫ్ అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారని, అందుకే మెత్తబడ్డారని’ ఆదివారం ఉదయం నుంచి ప్రసారం అవుతున్న వార్తలను ఎంపీ సుజనా ఖండించారు. బడ్జెట్ తర్వాత బాబుతో అమిత్ షా మాట్లాడలేదని, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతోనూ మంతనాలు జరిగాయన్నది కూడా నిజంకాదని స్పష్టం చేశారు. సమావేశానికి ముందు కూడా బీజేపీపై ఆగ్రహం వెళ్లగక్కుతూ లోనికి వెళ్లిన టీడీపీ ఎంపీలు.. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
బీజేపీ విజ్ఞతకే వదిలేస్తున్నాం : టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరుగుతున్న తరుణంలోనే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులు అవినీతికి వారసులని, రెండెకరాల రైతును(చంద్రబాబుకు) లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వీర్రాజు వ్యాఖ్యలపై ఎంపీ సృజనా స్పందిస్తూ.. ‘అది బీజేపీ విజ్ఞతకే వదిలేస్తున్నాం’ అని అన్నారు.
జేసీకి అస్వస్థత : పార్లమెంటరీ భేటీలో పాల్గొనేందుకు అమరావతికి వచ్చిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కళ్లుతిరిగి పడిపోయిన ఆయనను వైద్యులు పరీక్షించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదంలేదని వైద్యులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment