ఆంధ్రప్రదేశ్‌ మాల్యా... సుజనా! | ED Summons MP Sujana Chowdary In Bank Loans Fraud Case | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 25 2018 3:06 AM | Last Updated on Sun, Nov 25 2018 2:40 PM

ED Summons MP Sujana Chowdary In Bank Loans Fraud Case - Sakshi

సాక్షి, బిజినెస్‌ ప్రతినిధి : సుజనా చౌదరి అలియాస్‌ ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చాలా ఆలస్యంగా స్పందించిందనే చెప్పాలి. ఎందుకంటే ఈయన కేబినెట్‌ మంత్రి అయినప్పుడే... కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తిని కేబినెట్‌కు పంపించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన విమర్శలొచ్చాయి. ఇక మోదీ కేబినెట్‌లోకి ఇలాంటి వ్యక్తులు చేరడంపై ఆశ్చర్యమూ వ్యక్తమైంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక సుజనా మాత్రం చక్రం తిప్పారు. అప్పటికే భారీ నష్టాల్లో కూరుకుని, వ్యాపారం సైతం లేకుండా నెగటివ్‌ నెట్‌వర్త్‌లోకి వెళ్లిపోయిన తన కంపెనీలకు కొత్త రుణాలు ఇప్పించారు. ఆ రుణాలను అనుబంధ కంపెనీల ద్వారా సొంత అవసరాలకు, తన పార్టీ పెద్దల చేతుల్లోకి మళ్లించారు. ఫలితం... 2017 మార్చి 31 నాటికి తన మూడు లిస్టెడ్‌ కంపెనీల రుణాలు రూ. 7,503 కోట్లకు చేరిపోయాయి. ఇక సుజనా చౌదరి వెనక నుంచి నడిపిస్తున్న బార్‌ట్రానిక్స్‌ ఇండియా లిమిటెడ్‌ రుణాలు రూ. 1,100 కోట్లు. వీటన్నింటిపై గడిచిన ఏడాదిన్నర కాలంగా పేరుకున్న వడ్డీని కూడా కలిపితే ఈ మొత్తం రూ. 9,500 కోట్ల పైనే.!! అంటే... దాదాపుగా కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యా ఎగ్టొట్టిన మొత్తంతో సమానం. ఇద్దరూ రాజ్య సభ సభ్యులే కనక సుజనాను ఆంధ్రప్రదేశ్‌ మాల్యాగా అభివర్ణించవచ్చేమో!! 

ఇదో చిన్న ఉదాహరణ చూద్దాం... 
సుజనా టవర్స్‌ అనేది సుజనా చౌదరి లిస్టెడ్‌ కంపెనీల్లో ఒకటి. ఇప్పుడు న్యుయన్‌ టవర్స్‌గా పేరు మార్చుకుంది. ఆర్‌ఓసీకి సమర్పించిన లెక్కల ప్రకారం 2017 మార్చి 31 నాటికి వివిధ కంపెనీల నుంచి దీనికి రావాల్సిన మొత్తం (ట్రేడ్‌ రిసీవబుల్స్‌) రూ. 1,290 కోట్లు. నిజానికి ఆ కంపెనీలు కూడా సుజనా చౌదరివే. ట్రేడ్‌ రిసీవబుల్స్‌ అంటే... వ్యాపారపరంగా వస్తువులు విక్రయించినందుకు, సేవలందించినందుకు ఆయా కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం. నిజానికి సుజనా కంపెనీల మధ్య జరిగేదంతా బోగస్‌ ట్రేడింగే. ఈ విషయాన్ని 2006లో ఏపీ సర్వీస్‌ ట్యాక్స్‌ అధికారుల విచారణలో సుజనా చౌదరే స్వయంగా అంగీకరించారు. భారీ టర్నోవర్‌ జరిగినందుకు సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టాలని అధికారులు నోటీసులు ఇవ్వడంతో... అవన్నీ బోగస్‌ లావాదేవీలని, టర్నోవర్‌ కోసం తమ కంపెనీల మధ్యే ఆ లావాదేవీలు జరిగినట్లు చూపిస్తామని, అందుకని పన్ను కట్టాల్సిన అవసరం లేదని చెప్పారాయన. అది నిజమేనని తేలింది కూడా. ఎందుకంటే అప్పట్లో కొన్ని వాహనాల నంబర్లు ఇస్తూ... ఆ వాహనాల్లో వందలాది టన్నుల వస్తువుల్ని తరలించినట్లు పేర్కొన్నారు. తీరా చూస్తే అవి టూవీలర్‌ నంబర్లు. అదేంటని సుజనాను విచారిస్తే ఈ బోగస్‌ ట్రేడింగ్‌ వ్యవహారం బయటపడింది. మరి ఆ బోగస్‌ టర్నోవర్‌ను చూపించి దాని ఆధారంగా బ్యాంకుల నుంచి రూ. వేల కోట్ల రుణాలు తీసుకున్న వ్యక్తి మోసగాడు కాదా? 


అప్పులు, అడ్వాన్స్‌ల రూపంలో మళ్లింపు... 
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని అప్పులు, అడ్వాన్స్‌ల రూపంలో తన సొంత కంపెనీలకు మళ్లించారు సుజనా. ఉదాహరణకు సుజనా యూనివర్సల్‌ సంస్థ పీఏసీ వెంచర్స్‌కు రూ. 42.74 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చింది. అంటే అది సుజనా సొంత జేబులోకి వెళ్లిపోయిందన్న మాట. అలాగే సుజనా మెటల్స్‌కూ (ఇప్పుడు స్ప్లెండిడ్‌ మెటల్‌ ప్రొడక్ట్స్‌గా మారింది) ట్రేడ్‌ రిసీవబుల్స్‌ భారీగానే ఉన్నాయి. తన కంపెనీల మధ్యే లావాదేవీల్ని చూపించడం కేవలం రుణాల్ని వ్యాపారానికి వాడకుండా మళ్లించడానికేనని ఎవరికైనా చెప్పకనే తెలుస్తుంది. మొత్తంగా చూస్తే తన లిస్టెడ్‌ కంపెనీల పేరిట సుజనా చౌదరి రుణాలు తీసుకుని బ్యాంకులకు చెల్లించకుండా ఎగ్గొట్టిన మొత్తం ఇప్పటికి దాదాపు రూ. 8,400 కోట్లు. ఇందులో ఎంత మొత్తాన్ని తన డబ్బా కంపెనీల ద్వారా మళ్లించారో, ఎంత మొత్తం ఎవరెవరి జేబుల్లోకి వెళ్లిందో తేల్చాల్సింది మాత్రం దర్యాప్తు సంస్థలే.  

అందరూ పాత్రధారులే
కేంద్ర కేబినెట్‌లోకి ప్రవేశించే నాటికే సుజనాకు బకాయిలు ఎగ్గొట్టిన చరిత్ర ఉంది. వందల కొద్దీ డబ్బా (షెల్‌) కంపెనీలు సృష్టించి వాటికి నిధులు మళ్లించడం, ఆదాయపు పన్ను (ఐటీ), సర్వీస్‌ ట్యాక్స్, వ్యాట్, ఈపీఎఫ్‌ ఎగవేయటం వంటి పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయినా చంద్రబాబు సిఫారసుతో కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లగలిగారు. అప్పటి నుంచీ దర్యాప్తు సంస్థలేవీ ఆయన కేసులపై పెద్దగా దృష్టి పెట్టలేదు. వడ్డీ కూడా చెల్లించకపోయినా... హామీగా ఆస్తులేవీ లేకున్నా... బ్యాంకులు కొత్త రుణాలిచ్చాయి. వాటిని చెల్లించడం మానేసినా మిన్నకున్నాయి. చిత్రమేంటంటే దివాలా చట్టం వచ్చాక కూడా ఈ కంపెనీలు తమ బకాయిలు ఎగ్గొట్టాయి కనక దివాలా తీసినట్లు ప్రకటించాలంటూ ఏ బ్యాంకూ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించలేదు. బహుశా.. తాము గనక ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయిస్తే వాటిని కొనేందుకు ఎవరూ ముందుకురారని ఆ బ్యాంకులకు తెలిసే ఉంటుంది. సుజనా కంపెనీల ఆస్తులు విక్రయిస్తే తమ బకాయిల్లో 3 నుంచి 5 శాతం కూడా వసూలు కావనే వాస్తవం కూడా వాటికి తెలియనిది కాదు.

మనీల్యాండరింగ్‌... జరిగిందిలా!! 
నిజానికి సుజనా కంపెనీల్లో దశాబ్దం కిందటే మనీల్యాండరింగ్‌ మొదలైందని చెప్పొచ్చు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను వ్యాపారంపై పెట్టకుండా, సొంత ఖాతాలకు మళ్లించడానికి ఆయనో తెలివైన పద్ధతి ఎన్నుకున్నారు. వందలకొద్దీ షెల్‌ కంపెనీలను సృష్టించడం... ఆ కంపెనీలకు–తన ప్రధాన కంపెనీకి మధ్య ట్రేడింగ్‌ జరిగినట్లు చూపించడం... ఆ ట్రేడింగ్‌ అనంతరం అనుబంధ కంపెనీ చెల్లించాల్సిన మొత్తాన్ని బకాయి పెట్టేయడం!!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement