సుజనాచౌదరి బ్యాంకుల లూటీ మొత్తం 6,000 కోట్లు | ED Certified Sujana Chowdary Money Laundering | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 25 2018 2:47 AM | Last Updated on Sun, Nov 25 2018 8:02 AM

ED Certified Sujana Chowdary Money Laundering - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఆయన బినామీగా భావించే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సాగించిన భారీ ఆర్థిక నేరాల ‘సృజన’బట్టబయలైంది. పుట్టగొడుగుల్లా 120 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి వాటి పేరిట ఏకంగా రూ. 6 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు పొంది ఎగ్గొట్టిన ఉదంతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడుల్లో వెలుగులోకి వచ్చింది. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులనే కంపెనీల డైరెక్టర్లుగా నియమించి బ్యాంకులను బురిడీ కొట్టించిన వైనం బయటపడింది. బ్యాంకులకు రూ. వందల కోట్లు ఎగ్గొట్టిన సుజనా గ్రూపులోని ఓ కంపెనీ లావాదేవీల్లో ఫెమా చట్ట ఉల్లంఘనలు జరిగాయన్న సీబీఐ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఈడీ... శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వరకు హైదరాబాద్‌తోపాటు ఢిల్లీలో చేసిన సోదాల్లో సుజనా అక్రమాల పుట్ట బద్దలైంది.

ఒకే చిరునామాపై షెల్‌ కంపెనీలు... 
హైదరాబాద్‌ పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లోని సుజనా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయం అడ్రస్‌తో ఉన్న బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (బీసీఈపీఎల్‌)లో ఈడీ సోదాలు ప్రారంభించింది. బీసీఈపీఎల్‌ మూడు బ్యాంకుల నుంచి రూ. 364 కోట్లు రుణాలుగా పొంది ఎగవేసింది. దీంతో రుణాలు జారీ చేసిన బ్యాంకులు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఫిర్యాదు చేయడంతో సీబీఐ ఇందుకు సంబంధించి మూడు కేసులు నమోదు చేసింది. ఈ కంపెనీల్లో జరిగిన లావాదేవీల్లో ఫెమా చట్ట ఉల్లంఘన జరిగిందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు సీబీఐ ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ చెన్నై బృందం హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించింది. బీసీఈపీఎల్‌ కంపెనీ చేసిన నేరంపై దర్యాప్తు చేస్తుండగా సుజనా చౌదరి సాగించిన భారీ ఆర్థిక నేరాల కుట్ర బయటపడింది. సుజనా చౌదరి చైర్మన్‌గా ఉన్న సుజనా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల గొడుగు కింద ఏర్పాటు చేసిన 120 షెల్‌ òకంపెనీల జాబితా ఈడీ అధికారుల చేతికి చిక్కింది. ఈ కంపెనీలన్నీ పంజాగుట్టలోని ఒకే చిరునామాపై ఏర్పాటు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. అంతే కాకుండా ఈ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న వారికి ఈ కంపెనీలు సాగించిన లావాదేవీల విషయాలు ఏవీ తెలియకపోవడంతో ఈడీ మరింత లోతుగా సోదాలు చేపట్టింది. 
సుజనా చౌదరి ఇల్లు

అన్నీ సుజనా చెప్పినట్లే... 
సుజనా చౌదరి 120 షెల్‌ కంపెనీల పేరుతో రూ. 6 వేల కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గుర్తించింది. ఈ కంపెనీల్లో సాగించిన ఆర్థిక నేరాలకు, కుట్రకు దారి తీసిన అంశాలన్నీ ఆయా కంపెనీల ఈ–మెయిల్స్‌లో లభించాయి. డైరెక్టర్లకు, సుజనా చౌదరికి మధ్య జరిగిన కీలక వివరాలు ఈ–మెయిల్స్‌లో లభ్యమయ్యాయి. వాటికి సంబంధించిన హార్డ్‌డిస్క్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న వారిని ఈడీ శనివారం విచారించగా సుజనా చౌదరి చెప్పినట్లే తాము వ్యవహరించామని, కంపెనీల్లో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియదని, ఈ మొత్తం వ్యవహారం సుజనా కనుసన్నల్లోనే జరిగినట్లు వాంగ్మూలాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. సుజనా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల్లో సుజనా చౌదరే దగ్గరుండి వ్యవహారాలు చక్కబెట్టారని, ఆయన చెప్పిన చొట, చెప్పిన సమయంలో సంతకాలు మాత్రం డైరెక్టర్లు పెట్టినట్టు ఈడీ గుర్తించింది. బీసీఈపీఎల్‌ సంస్థకు వచ్చిన రుణాలు ఎక్కడి నుంచి ఎక్కడి పోతున్నాయో కూడా తమకు తెలియదని డైరెక్టర్లు వాంగ్మూలాల్లో పేర్కొన్నారు. ఈ మొత్తం కుట్ర, ఆర్థిక నేరానికి కీలక నిందితుడిగా సుజనా చౌదరియేనని పూర్తిస్థాయిలో ధ్రువీకరించుకున్నట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు.  

ఫెమా చట్టాల ఉల్లంఘన... 
సుజనా చౌదరి సాగించిన ఈ నేరాలన్నీ ఫెమా చట్టం ఉల్లంఘన కిందకు వస్తాయని, ఇందులో ఈడీతోపాటు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ), సీబీఐ కూడా విచారణ సాగించేందుకు అవకాశం ఉన్నట్లు దర్యాప్తు అధికారుల ద్వారా తెలిసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లో ఏడు చోట్ల, ఢిల్లీలో ఒక చోట ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 126 రబ్బర్‌ స్టాంపులు, షెల్‌ కంపెనీల పేర్ల మీద కొనుగోలు చేసిన ఆరు లగ్జరీ కార్ల (ఆడీ, ఫెరారీ, బెంజ్‌ రేంజ్‌ రోవర్‌ మొదలైనవి)ను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు స్పష్టంచేశారు. అదే విధంగా ఈ కంపెనీల ద్వారా ఫొరెక్స్‌ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు.  

27న విచారణకు రావాలంటూ సుజనాకు సమన్లు... 
పుట్టలకొద్దీ షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి రూ. వేల కోట్లు కొల్లగొట్టిన టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి ఉచ్చు మరింత బిగుసుకోనుందని స్పష్టమవుతోంది. ఇన్ని కంపెనీలు, రుణ ఎగవేతలు, ఫెమా చట్టాల ఉల్లంఘనలకు పాల్పడ్డ ఆయన్ను లోతుగా విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 27న చెన్నైలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని సమన్లు జారీ చేసింది. ఈ పరిణామం టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆ పార్టీ పెద్దలను షాక్‌కు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈడీ విచారణలో తమకు సంబంధించిన వివరాలేమైనా బయటకు వచ్చాయేమోనని వారు కంగారు పడ్డట్లు తెలిసింది. 

వ్యాపార నియమాలకు లోబడే..: సుజనా గ్రూప్‌ 
పదేళ్ల క్రితం నాటి కేసు విషయంలో ఈడీ అధికారులు సమాచారం కోరేందుకు తమ కార్యాలయానికి వచ్చారని, వారికి కావాల్సిన సమాచారాన్ని ఇచ్చామని సుజనా గ్రూప్‌ శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. వ్యాపార నియమాలకు లోబడే తాము వ్యాపారం చేస్తున్నామని, కొంత మంది కావాలనే దురుద్దేశపూరితంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. తమ డైరెక్టర్లపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. 
సుజనా ఆఫీసు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement