సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి రూ.6,000 కోట్లు రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చేసిన పాత మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అనేక డొల్ల కంపెనీలను సృష్టించి వ్యాపారం చేయకుండానే వేల కోట్ల లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు చూపించి బ్యాంకులను మోసం చేసిన సుజనా చౌదరి ఇప్పుడు ఏకంగా తండ్రి పేరును కూడా మార్చి రెండు డైరక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్లు(డిన్) తీసుకున్న వైనం తాజాగా బయటకొచ్చింది. వై. సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి) తన తండ్రి వై.జనార్ధనరావు పేరు మీద నిబంధనలకు విరుద్ధంగా రిజిష్ట్రార్ ఆప్ కంపెనీస్(ఆర్వోసీ) నుంచి ఈ రెండు డిన్ నంబర్లు పొందారు.
పేరు చివరన కేవలం రెండు అక్షరాలు మార్చి ఒకే ఇంటి చిరునామా, పాన్ నంబర్లతో ఈ రెండు డిన్ నంబర్లను తీసుకున్నారు. వైఎస్ చౌదరి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న చిరునామా, పాన్ నంబర్లతోనే వైఎస్ జనార్ధనరావు, వైఎస్ జనార్ధనరెడ్డి పేరు మీద వీటిని పొందారు. దీనిపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయవాదులు 2016 ఫిబ్రవరిలో ఆర్వోసీకి ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఇక్కడి న్యాయవాది ఇమన్నేని రామారావు కూడా ఫిర్యాదు చేయడంతో ఆర్వోసీలో కదలిక వచ్చింది. ఈ ఫిర్యాదుపై ఆర్వోసీ అధికారులు దర్యాప్తు చేపట్టగా రెండు డిన్ నంబర్లను కలిగివున్న విషయం బహిర్గతమైంది. దీంతో వైఎస్ జనార్ధనరెడ్డి పేరు మీద 2006లో తీసుకున్న డిన్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 15న రద్దు చేశారు. కాగా, ఈ డిన్ నంబర్‌కు సంబంధించిన డైరెక్టర్ వరుసగా ఫైలింగ్ చేయకపోవడంతో డియాక్టివేట్ అయినట్లు ఆర్వోసీ అధికారులు చెపుతున్నారు. అయిత ఒకసారి డిన్ జారీ చేస్తే అది జీవితకాలం ఉంటుందని, ఇలా ఎందుకు డియాక్టివేట్ చేశారో అర్థం కావట్లేదని చార్టర్డ్ అకౌంటెంట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒక వ్యక్తి ఒకే డిన్ కలిగి ఉండాలి..
కంపెనీల చట్టం ప్రకారం వివిధ కంపెనీల్లో డైరెక్టర్‌గా చేరేవారికి ఒక డిన్ నంబర్‌ను ఇస్తారు. దీన్ని రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ) జారీ చేస్తుంది. డైరెక్టర్ కంపెనీ మారినా డిన్ నంబర్ మారదు. ఎన్ని కంపెనీల్లో ఉన్నా సరే తెలుసుకోవచ్చు. కంపెనీల చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకే డిన్ కలిగి ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ కలిగి ఉంటే కంపెనీల చట్టంలోని సెక్షన్ 266ఏ నిబంధనను అతిక్రమించినట్లే. దీనికి గరిష్టంగా ఆరునెలల జైలుశిక్ష లేదా రూ.5,000 లేదా ఈ రెండు కలిపి కూడా విధించే అవకాశముంది. బ్యాంకులను మోసం చేసిన సుజనా చౌదరి.. ఏకంగా తండ్రి పేరును సైతం మార్చి డిన్ నంబర్లు తీసుకోవడం వెలుగు చూడడంతో రాబోయే రోజుల్లో ఆయన మోసాలు ఇంకా ఎన్ని బయటకు వస్తాయోనని చార్టర్డ్ అకౌంటెంట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
‘తండ్రి పేరు’తోనూ సుజనా అక్రమాలు
Published Sat, Dec 1 2018 4:21 AM | Last Updated on Sat, Dec 1 2018 4:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment