సాక్షి, అమరావతి: సుజనా చౌదరి అలియాస్ యలమంచిలి సత్యనారాయణ చౌదరి.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సయామీ కవల. జాతీయ బ్యాంకులకు రూ.ఆరు వేల కోట్లకు పైగా ఎగ్గొట్టిన ఘనుడు! రాజధాని ప్రాంతంలో తనకుగానీ తన కుటుంబ సభ్యులకుగానీ ఒక్క సెంటు భూమి కూడా లేదని బుకాయిస్తున్నారు. సెంటు కాదు.. ఏకంగా 623.12 ఎకరాల భూములు సొంతం చేసుకున్నది మాత్రం నిజం! సుజనా చౌదరి తన కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీల పేర్లతో అమరావతి ప్రాంతంలో 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు గత ఎన్నికల ముందు విచారణలో స్వయంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిగ్గు తేల్చింది. టీడీపీ అధికారం కోల్పోయిన తక్షణమే చంద్రబాబు కనుసైగతో బీజేపీలో చేరిన సుజనా ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా తాము, తమ సన్నిహితులు రైతుల నుంచి తక్కువ ధరకు కాజేసిన రూ.లక్ష కోట్ల విలువైన భూములను కాపాడుకునేందుకు యత్నిస్తున్నారనేది తాజా పరిణామాలతో స్పష్టంగా తెలుస్తోంది.
చదవండి: ఏపీ రాజధానిపై మహాకుట్ర!
భూ దోపిడీ ముగిశాక తాపీగా ప్రకటన
రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు అధికారంలో ఉండగా అదిగో రాజధాని.. ఇదిగో రాజధాని అంటూ లీకులిచ్చారు. ఈ సమయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా సుజనా తదితర టీడీపీ నేతలు రాజధానిలో రైతుల నుంచి తక్కువ ధరలకే భూములను కొనుగోలు చేశారు. ఈ భూ దోపిడీ ముగిశాక 2014 సెప్టెంబరు 4న శాసనసభలో చంద్రబాబు రాజధానిపై తాపీగా ప్రకటన చేశారు. రాజధానిలో తనకు సెంటు కూడా స్థలం లేదంటున్న సుజనా తన బినామీలు, సన్నిహితుల పేర్లతో కృష్ణా, గుంటూరు జిల్లాలో కొనుగోలు చేసిన భూముల చిట్టా చూస్తే కళ్లు తిరగడం ఖాయం..!
సెంటు భూమి లేదా.. మరి ఇవి ఎవరివి?
- కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నెంబర్లు 432–1, 403–5, 433, 434, 402–1ఏ, 429, 428, 412, 410–2, 427–2, 413, 415, 416, 431, 437, 399–7, 404–11, 407–4లలో 110.6 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే ఎకరం రూ.ఐదు లక్షల చొప్పున కొనుగోలు చేస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. రాజధాని ప్రకటన వెలువడ్డాక గుడిమెట్లలో ఎకరం రూ.50 లక్షలకుపైగా పలుకుతోంది. ఈ లెక్కన రూ.50 కోట్లకుపైగా సుజనా చౌదరి దోచుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ భూములను 2018లో సుజనా తన సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సుజనా సోదరుడు యలమంచిలి జతిన్ కుమార్ పేరుతో ఏర్పాటు చేసిన శివజ్యోతి ఫ్లైకాన్ బ్లాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నెంబర్లు 404–1, 404–5, 404–6లలో 11.56 ఎకరాలను రాజధాని ప్రకటన రాకముందే ఎకరం రూ.5 లక్షల చొప్పున కొనుగోలు చేసి 2014లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం.
- నందిగామ మండలం చందాపురంలో ఎస్‌జేకే బయోటెక్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సుజనా చౌదరి సర్వే నెంబర్లు 6–1ఏ, 7–1, 8–1, 9–2ఏ, 6–2, 6–3ఏ, 8–1, 9–1ఏ, 9–1సీ, 9–1డీలలో 87 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. 2018లో తన సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
- సుజనా సోదరుడు యలమంచిలి జతిన్ కుమార్ తన సోదరుడి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసే హర్షానంద పేరుతో శ్రీ కళింగ గ్రీన్‌టెక్ కెమికల్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరుతో రాజధాని ప్రకటనకు ముందే కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో సర్వే నెంబర్లు 399–7, 402–1ఏ, 403–4, 5, 6, 404–1, 5, 6, 9బీ, 11, 12, 410–2, 412, 413, 415, 416, 417–4, 427–2, 428–1, 2, 429, 431, 432–1, 433, 434, 437లలో 126.44 ఎకరాల భూమిని ఎకరం రూ.ఐదు లక్షల చొప్పున కొనుగోలు చేశారు. అంటే రైతులను మోసం చేసి రూ.56.89 కోట్ల మేర లబ్ధి పొందినట్లు విశదమవుతోంది. వాటికి సమీపంలోనే ఉన్న 130 ఎకరాల అటవీ భూములును కబ్జా చేయడానికి పావులు కదుపుతున్నారు.
- సుజనా తన సోదరుడి కుమారుడు యలమంచిలి సుధీర్ పేరుతో కంచికచర్ల మండలం మొగులూరులో సర్వే నెంబరు 88–1, 88–2ఏలో ఎకరం, 115–3, 116–3, 91–3, 98–2, 97–1, 90–4, 92–1, 88–3, 100, 91–1, 97–2ఏ, 58, 69–2, 102–4, 101–2బీ, 89–2 తదితర చోట్ల 36 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే అగ్రిమెంట్ చేసుకుని తరువాత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
- కంచికర్ల మండలం బత్తినపాడులో యలమంచిలి సుధీర్ పేరుతో 38–1, 22–1, 39–1ఏ, 20–1ఏ1, 50–1బీ, 21–2ఏ, 59–1బీ తదితర సర్వే నెంబర్లలో 25 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకే అగ్రిమెంట్ చేసుకుని 2015లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
- తాడికొండ మండలం రావెలలో సుజనా తన సమీప బంధువు యలమంచిలి ఝాన్సీ లక్ష్మి పేరుతో సర్వే నెంబర్ 295లో 1.26 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు కొనుగోలు చేసి 2015లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
- యడ్లపాడు మండలం యడ్లపాడు గ్రామంలో 461–ఈ, 459, 460, 461–ఏ, 460–1డీ, 461–ఎఫ్, 460–ఎఫ్‌లలో ఎనిమిది ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే సుజనా తన సమీప బంధువు యలమంచిలి ఝాన్సీ లక్ష్మి పేరుతో తక్కువ ధరకే కొనుగోలు చేసి 2015లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
- మంగళగిరి మండలం నవులూరు సర్వే నెంబరు 364–3ఏ, 370–బి1, 371–ఏ1లో 1.2 ఎకరాలు, సర్వే నెంబర్లు 364–3ఈ, 371–ఏ2లో 0.60 ఎకరాలను సుజనా తన సమీప బంధువు యలమంచిలి రత్నకుమారి పేరుతో కొనుగోలు చేశారు.
- నందిగామ మండలం అడవిపావులపాడులో సత్యవతి బయోలైఫ్ సైన్సెస్ పేరుతో సర్వే నెంబరు 174–3, 174–5, 176–2లో 19.5 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందు సుజనా రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేశారు.
- సుజనా తన సోదరుడు యలమంచిలి శివలింగప్రసాద్ పేరుతో పెనుగంచిప్రోలు మండలం కొనకంచిలో సర్వే నెంబర్లు 40, 41–2ఏ, 41–2సీలలో 4.385 ఎకరాలు, వీరులపాడు మండలం వెల్లంకిలో సర్వే నెంబర్లు 251–1, 251–2లో 1.99 ఎకరాలు భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు కొన్నారు.
- సుజనా తన సోదరుడి కుమార్తె యలమంచిలి రుషికన్య పేరుతో వీరులపాడు మండలం గోకరాజుపల్లిలో సర్వే నెంబర్లు 15–04, 7–2, 7–3బీ, 7–3సీ, 8.2ఏ, 9–1బీ, 9–2బీలలో రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు 14.07 ఎకరాలను కొన్నారు.
- వీరులపాడు మండలం పొన్నవరంను దత్తత తీసుకున్న సుజనా అక్కడ తన తండ్రి వై.జనార్దనరావు పేరుతో సర్వే నెంబరు 38–1, 40లలో 13.39 ఎకరాలు, సోదరుడు వై.శివరామకృష్ణ పేరుతో సర్వే నెంబరు 41లో 3.5 ఎకరాలు, సోదరుడు వై.శివలింగ ప్రసాద్ పేరుతో సర్వే నెంబరు 78లో 4.03 ఎకరాలు, తన భార్య యలమంచిలి సుశీలాకుమారి పేరుతో సర్వే నెంబరు 38–2లో 6.14 ఎకరాలు వెరసి 31.09 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.
- బాపులపాడు మండలం కనుమోలులో సుజనా తన సమీప బంధువులు యలమంచిలి ఝాన్సీ లక్ష్మి పేరుతో సర్వే నెంబరు 330లో 2.9 ఎకరాలు, సర్వే నెంబర్లు 331, 303, 325, 332లలో 19.11 వెరసి 22.01 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇదే మండలం అరుగొలనులో ఝాన్సీ లక్ష్మి, యలమంచిలి రాఘవేందర్‌ల పేరుతో 196, 199, 192, 181 సర్వే నెంబర్లలో 13 ఎకరాలు, యలమంచిలి కిరణ్‌కుమార్ పేరుతో 180, 181, 196, 199, 192, 352 తదితర సర్వే నెంబర్లలో 20 ఎకరాలు, యలమంచిలి రత్నకుమార్ పేరుతో 180, 196, 352, 199, 192, 181లలో 18 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే సుజనా చౌకగా కొనుగోలు చేశారు.
- కంకిపాడు మండలం గొడవర్రులో విజయ ప్రదాత అగ్రో ఇండస్ట్రీస్ పేరుతో 256, 257, 235, 273, 123, 260 తదితర సర్వే నెంబర్లలో 80 ఎకరాలు, సమీప బంధువు యలమంచిలి రామకృష్ణ పేరుతో 34.37 ఎకరాలు, యలమంచిలి రంజిత్ పేరుతో 6 ఎకరాలు, యలమంచిలి సంపత్ పేరుతో 43.97 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే రైతుల నుంచి సుజనా తక్కువ ధరకు కొట్టేశారు.
- కృష్ణా జిల్లా పెనమలూరులో యలమంచిలి సంపత్, యలమంచిలి రామకృష్ణ పేర్లతో సర్వే నెంబరు 188, 188–2, 188–3లో 1.36 ఎకరాలు, విజయప్రదాత ఆగ్రో ఇండస్ట్రీస్ పేరుతో 2.73 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి 2015లో సుజనా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment