బ్యాంకులకు కుచ్చుటోపీ: సుజనాకు ఈడీ షాక్‌..  | Enforcement Directorate Raids on Sujana chowdary Companies | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 24 2018 6:28 PM | Last Updated on Sat, Nov 24 2018 7:22 PM

Enforcement Directorate Raids on Sujana chowdary Companies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరి చుట్టు ఉచ్చు బిగుస్తోంది. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా చౌదరి కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శనివారం దాడులు నిర్వహించింది. ఈ నెల 27న తమ విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది. సుజనా చౌదరి మొత్తం 120 డొల్ల కంపెనీలు సృష్టించి.. బ్యాంకుల నుంచి ఏకంగా రూ. 5,700 కోట్లు కొల్లగొట్టారని ఈడీ వెల్లడించింది. ఇప్పటికే సుజనా చౌదరి అక్రమాలపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. పలు విడతలుగా సుజనా కార్యాలయాలపై ఈడీ, సీబీఐ దాడులు జరిపింది. టీడీపీకి ఆర్థిక వనరుగా పేరొందిన సుజనా నిన్నమొన్నటివరకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయనపై ఇప్పటికే డీఆర్‌ఐ, ఫెమా, సీబీఐ కేసులు ఉన్నాయి. సుజనాకు బినామీ పేర్లతో ఉన్న ఫెరారీ, రేంజ్‌ రోవర్‌, బెంజ్‌ తదితర ఆరు కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

నాగార్జున హిల్స్‌లో ఉన్న సుజనా కంపెనీపై శుక్రవారం అర్ధరాత్రి వరకు ఈడీ తనిఖీలు కొనసాగాయి. గత అక్టోబర్‌లోనూ ఆయన కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి.. సుజనా చౌదరి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన కంపెనీ ఉద్యోగులను డైరెక్టర్లుగా పెట్టి.. షెల్‌ కంపెనీలు ఆయన ప్రారంభించినట్టు తెలుస్తోంది. గంగా స్టీల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, భాగ్యనగర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌, తేజస్విని ఇంజినీరింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఫ్యూచర్‌ టెక్‌ ఇండస్ట్రీస్‌ తదితర డొల్ల కంపెనీలకు ఆయన పెద్ద ఎత్తున డబ్బు తరలించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే.. కేవలం రశీదుల రూపంలో భారీగా డబ్బుగా మళ్లించినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై 2016 ఫిబ్రవరిలోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో 2017 ఫిబ్రవరి, 2018 జులైలో మరోసారి ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసింది. గత అక్టోబర్‌లో ఈ కేసులకు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహించి.. పెద్ద ఎత్తున హార్డ్‌డిస్క్‌లు, ఫైల్స్‌తోపాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఇక, మూడు బ్యాంకుల నుంచి రూ. 304 కోట్ల రూపాయల రుణం తీసుకొని.. వాటిని దుర్వినియోగపరిచినట్టు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఆంధ్రా బ్యాంకు నుంచి రూ. 304 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంకు నుంచి రూ. 120 కోట్లు, సెంట్రల్‌ బ్యాంకు నుంచి రూ. 124 కోట్లు సుజనా అప్పుగా తీసుకొని.. చాలావరకు నిధులను డొల్ల కంపెనీలకు తరలించారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌లోనూ ఈ విషయం తేటతెల్లమైంది. ఆయన బినామీ కంపెనీలు కేవలం రశీదులు రూపొందించి డబ్బు తరలించుకుపోయినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. గత మూడేళ్లుగా సాగుతున్న ఈ విచారణ ప్రస్తుతం కీలకదశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈడీ చేసిన సోదాల్లోనూ పెద్ద ఎత్తున డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement