సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీమంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరికి సీబీఐ గురువారం సమన్లు జారీ చేసింది. 2017లో నమోదు చేసిన కేసులో ఆయనకు సీబీఐ బెంగళూరు బ్రాంచ్ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు రూ.కోట్ల నష్టం చేకూర్చినట్లు సుజనా చౌదరిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆయన రేపు మధ్యాహ్నం బెంగళూరు సీబీఐ అధికారుల ముందు హాజరు కానున్నారు.
కాగా ఈ కేసుకు సంబంధించి సుజనా చౌదరికి చెందిన రూ. రూ.315 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీఈపీఎల్), దాని అధికారులపై సీబీఐ దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఈ చర్య తీసుకుంది. ఆ సంస్థ అధికారులు 2010-2013లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లను ‘మోసగించడానికి’ నేరపూరిత కుట్రకు పాల్పడటంతో బ్యాంకులకు రూ.364 కోట్ల మేర నష్టం కలిగినట్లు ఈడీ పేర్కొంది. టీడీపీకి ఆర్థిక వనరుగా పేరొందిన సుజనా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో కొంతకాలం మంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయనపై ఇప్పటికే డీఆర్‌ఐ, ఫెమా, సీబీఐ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment