సుజనాకు సీబీఐ నోటీసులు  | TDP leader Sujana Chowdary gets CBI summons in Andhra Bank | Sakshi
Sakshi News home page

సుజనాకు సీబీఐ నోటీసులు 

Published Fri, Apr 26 2019 12:09 AM | Last Updated on Fri, Apr 26 2019 8:20 AM

TDP leader Sujana Chowdary gets CBI summons in Andhra Bank - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రుణాల ఎగవేత కేసులో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసులు జారీ చేసింది. శుక్రవారం బెంగళూరులోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సుజనా గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రికల్‌ పరికరాల ఉత్పత్తి సంస్థ బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ ఉద్దేశపూర్వకంగా తమను రూ. 71 కోట్ల మేరకు మోసం చేసిందంటూ ఆంధ్రా బ్యాంకు 2017లో ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. చెన్నై కేంద్రంగా నడిచిన ఈ కంపెనీలో కాకులమర్రి శ్రీనివాస కల్యాణరావు సహా ఐదుగురు మేనేజింగ్‌ డైరెక్టర్ల పేర్లను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. భారత శిక్షా స్మృతిలోని నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద కంపెనీపై అభియోగాలు మోపింది. 

ఇదీ నేపథ్యం.. 
బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (బీసీఈపీఎల్‌) చెన్నైలోని ఆంధ్రా బ్యాంకుతోపాటు సెంట్రల్‌ బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులతో కూడిన కన్సార్షియం నుంచి 2010 నుంచి 2013 మధ్య రూ. 364 కోట్ల రుణం తీసుకుంది. వాటిలో ఆంధ్రా బ్యాం కు నుంచి పొందిన రూ. 71 కోట్లను బీసీఈపీఎల్‌ కొనుగోళ్లు, విక్రయాలు జరిపినట్లు నకిలీ ఎంట్రీలు సృష్టించి తద్వారా ఆ సొమ్మును కుట్రపూరితంగా డొల్ల కంపెనీల్లోకి బదిలీ చేసుకుంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆంధ్రా బ్యాంకు చేసిన ఫిర్యాదుతో నమోదైన కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంబించింది. బ్యాంకు రుణాల నిధులను సుజనా... బినామీ కంపెనీలకు బదిలీ చేసినట్లు గుర్తించింది. ఇందుకోసం పలు డొల్ల కంపెనీలను ఆయన సృష్టించినట్లు, పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌ జరిగినట్లు కూడా తేల్చింది. దీంతో కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి బదిలీ చేసింది. ఈ క్రమంలోనే సుజనా గ్రూప్‌లో పెద్ద మొత్తంలో డొల్ల కంపెనీలున్నట్లు ఈడీకి సైతం ఆధారాలు లభించాయి. సుజనా సృష్టించిన వైస్రాయ్‌ హోటల్స్‌ అండ్‌ మహల్‌ హోటల్‌ పొందిన రుణంలో నుంచి నగదును బదిలీ చేశారు. దీంతో వైస్రాయ్‌ హోటల్స్‌ అండ్‌ మహల్‌ హోటల్‌కు చెందిన రూ. 315 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులోని సంస్థ ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఈ సందర్భంగా పలు ఎలక్ట్రానిక్‌ పరికరాలు, విలువైన పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈడీ దాడుల్లో భాగంగా హైదరాబాద్‌ పంజాగుట్ట నాగార్జునహిల్స్‌లోని సుజనా కంపెనీలో ఈడీ అధికారులకు 124 రబ్బరు స్టాంపులు దొరికాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement