
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. విజయసాయిరెడ్డి లేఖకు బదులిస్తూ రాష్ట్రపతి కార్యాలయం.. ఆ లేఖను హోం మంత్రిత్వ శాఖకు పంపింది. ఈ క్రమంలో హోం మంత్రిత్వ శాఖ సదరు లేఖను సంబంధిత శాఖలకు పంపించింది. దీంతో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి వ్యవహారాలపై ఏ క్షణంలోనైనా విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. కాగా వివిధ బ్యాంకులకు కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చినట్లు సుజనా చౌదరిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయనకు చెందిన విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే జప్తు చేసింది.
ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఆర్థిక నేరాలు, ఆయన అక్రమ కంపెనీలు, మనీ లాండరింగ్ వ్యవహారాలు, వ్యాపార కుంభకోణాలపై విచారణ జరపాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సుజనా చౌదరి టీడీపీని వీడి.. బీజేపీలో చేరడంతో స్వప్రయోజనాల కోసమే ఆయన బీజేపీలో చేరారంటూ విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment