
సాక్షి ప్రతినిధి, చెన్నై: బ్యాంకులకు రూ.6,000 కోట్ల మేర రుణాలను ఎగ్గొట్టిన కేసులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు, సీఎం చంద్రబాబు సన్నిహితుడైన వై.సుజనా చౌదరి సోమవారం చెన్నైలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణకు హాజరు కావాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సుజనా ఉదయం 11 గంటల సమయంలో తన వ్యక్తిగత సహాయకుడు, న్యాయవాదితో కలసి ఖరీదైన లగ్జరీ కారులో వచ్చారు. సుజనా చౌదరిని ఈడీ కార్యాలయంలో అధికారులు మూడున్నర గంటలకు పైగా విచారించారు. రుణాలకు సంబంధించి సుజనా చౌదరి సమాధానాలను పరిశీలించిన అనంతరం మరోసారి విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది.
మీడియాపై చిందులు
ఎవరి కంట పడకుండా ఈడీ కార్యాలయానికి చేరుకోవాలన్న ప్రయత్నం విఫలం కావటంతో మీడియాపై సుజనా చిందులు తొక్కారు. కారులో వేగంగా ఈడీ కార్యాలయ ప్రాంగణంలోకి చేరుకుని వడివడిగా నడుస్తూ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజనా తిరిగి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చి కారులో కూర్చున్నారు. మీడియాతో మాట్లాడకుండా వేగంగా నిష్క్రమించారు.
డొల్ల కంపెనీలతో రుణాల ఎగవేత
సుజనా ఏకంగా 126 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రూ.6,000 కోట్ల రుణాలు తీసుకొని ఎగ్గొట్టడం తెలిసిందే. ఈ వ్యవహారంపై పగడ్బందీగా ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు మరింత లోతుగా విచారించేందుకు చెన్నైలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సుజనా చౌదరిని ఆదేశించడం తెలిసిందే. దీన్ని తప్పించుకునేందుకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవటంతో తాజాగా చెన్నై నుంగంబాక్కంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన శాస్త్రి భవన్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు సుజనా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment