రక్షణ కొనుగోళ్లలో ‘సెల్ఫ్‌గోల్‌’ | Shekhar Gupta Article Over NDA Govt Rafale Deal | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 15 2018 1:09 AM | Last Updated on Sat, Oct 20 2018 5:26 PM

Shekhar Gupta Article Over NDA Govt Rafale Deal - Sakshi

రాఫెల్‌ యుద్ధ విమానం (ప్రతీకాత్మక చిత్రం)

రక్షణరంగ ఏజెంట్లు, ఫిక్సర్లు, కార్పొరేట్‌ లాబీయిస్టులు, స్వయం ప్రకటిత జ్ఞానులతో కూడిన ఈ దయనీయ నగరంలో జరిగే ఏ కీలకమైన రక్షణ ఒప్పందాన్నయినా కుంభకోణం అనే చెప్పాల్సి ఉంటుంది. బోఫోర్స్‌ అనంతర దశాబ్దాల్లో ప్రతి ప్రభుత్వమూ అలాంటి అపనిందలనుంచి తప్పించుకోవడానికి అత్యంత సంక్లిష్ట నిబంధనలను చేరుస్తూ వచ్చింది. కానీ అలాంటి అవినీతి నిరోధక వ్యవస్థ సాధనలో ఎలాంటి పురోగతి కనిపించకుండా పోయింది. మోదీ ప్రభుత్వం పారదర్శకతతో ఈ పరిస్థితిని మార్చే అవకాశాన్ని దక్కించుకుంది కానీ మోదీ ప్రభుత్వమే దాన్ని ధ్వంసం చేయడమే కాకుండా సెల్ఫ్‌గోల్‌ వేసుకుంది.

రాఫెల్‌ ఒప్పందం కుంభకోణమే కాదు. బీజేపీ ప్రభుత్వం అతి జాగ్రత్తతో, పిరికితనంతో ఆయుధాల కొనుగోలు వ్యవహారాల్లో వ్యవహరిస్తోందనడానికి ఇది చక్కటి ఉదాహరణ. ఈ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పం దంలో భారీ కుంభకోణం ఉందనడానికి తగినంత సాక్ష్యాధరాలు లభ్యమౌతున్నాయిగాని ‘కుంభ కోణం’ అనే మాట స్థానంలో ‘మూర్ఖత్వం’ అనే పదం వాడాలి. ‘మూర్ఖత్వం’ అనే మాట మరీ ఎక్కువవుతుందనుకుంటే మరో పదం వాడవచ్చు. ఎందుకంటే దాదాపు వేయి కోట్ల డాలర్ల ఈ కొను గోలు ఒప్పందంలో విమానాల ధర నిర్ణయంపై అడిగిన ఏ ప్రశ్నకూ జవాబు చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఈ ఒప్పందం రెండు ప్రజాతంత్ర ప్రభుత్వాల మధ్య జరిగింది. కాని, ఒప్పందంలోని వివరాలను వెల్లడించకూడదనే (రహస్యంగా ఉంచాలనే) నిబంధన ఉందని చెప్పడం అడ్డగోలు వాదన.

పార్లమెంటు నిశిత పరిశీలన తర్వాతే ఇంతటి భారీ కొనుగోలు ఒప్పందానికి ఆమోదముద్ర లభిస్తుంది. అందుకే సర్కారు వివరణ హాస్యాస్పదంగా ఉంది. నేటి అంతర్జాతీయ ఆయు ధాల విపణిలో ఆయుధాలు, వాటి రకాలు, ఉపకర ణాలకు సంబంధించి రహస్యా  లేవీ ఉండవు. రాఫెల్‌ విమానాలతో ప్రయోగించే మిటియోర్‌ క్షిపణులు కూడా కొనే ఆలోచన మీకుంటే, వాటి గురించి స్మార్ట్‌ఫోన్‌ ఉండి, రక్షణ వ్యవహరాల నిపుణుడిగా భావించే ఏ కుర్రాడైనా ఉపన్యాసం దంచగలడు. ఈ విషయంలో రహ స్యంగా ఉంచాల్సింది సున్నితమైన ఎలక్ట్రానిక్స్, వ్యూహాలు మాత్రమే. మిటియోర్‌ క్షిపణి, పైలట్‌ ధరించే 360 డిగ్రీల ఇజ్రాయెలీ హెల్మెట్‌ అంచనా ధరల గురించి కూడా నేడు సులు వుగా దొరికే ఆయుధాల వివరాలు తెలిపే పుస్తకాలు, పత్రికల్లో బహిరంగంగానే చర్చిస్తున్నారు. కాబట్టి రాఫెల్‌ ఒప్పందంపై బహిరంగంగా చర్చించడంలో తప్పేమీ లేదు. దాచ డానికి కారణాలు కూడా లేవు.

రక్షణ ఒప్పందంపై మమ్మల్ని ప్రశ్నించడానికి ఎవరి కైనా ఎంత ధైర్యం? బోఫోర్స్‌ శతఘ్నిల ఒప్పందం జరిగిన కాలం నాటి కాంగ్రెస్‌ పార్టీ అనుకుంటు న్నారా మమ్మల్ని? అనే అహంకారపూరిత ధోరణితో కేంద్ర సర్కారు మాట్లా డుతోంది. అయితే, ఇప్పుడు బీజేపీకి విషయం అర్థమౌతోంది. బోఫోర్స్‌ కుంభ కోణం తర్వాత, భారీ ఆయుధాల కొనుగోలు ఒప్పందం చేసుకునే ఏ ప్రభు త్వమైనా తనను దొంగ అని పిలుస్తారనే అంచనాతో ఉండక తప్పదు. ఇలాంటి సమస్యపై మూడు రకాలుగా వ్యవహరిం చవచ్చు. మొదటిది, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పద్ధతి. అంటే, ఏమీ కొనకుండా ఉండడమే గాక, అన్ని అంతర్జాతీయ ప్రైవేటు ఆయుధాల కంపెనీలను నిషేధించడం. ఆయన హయాంలో ప్రభుత్వాల మధ్యే ఆయుధాల కొనుగోళ్లు జరిగాయి. ఆయుధాల ధరల విషయంలో పారదర్శకత పాటిం చని రష్యా ప్రభుత్వం నుంచి ఆయుధాలు కొన్నారు. అలాగే, అమెరికా నుంచి ప్రాణాతకం కాని ఆయు ధాలను కొనుగోలు చేశారు.

రెండో పద్ధతి, పార దర్శక విధానంతో ధైర్యంగా కొనుగోలు చేయడం. చివరికి ఎదురయ్యే ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం. ఇక మూడోది, రాజు లాగా ఆయుధాలు కొనడం. అంటే, భద్రతపై కేబినెట్‌ కమిటీ పరిశీలన వంటి అన్ని రకాల ‘విసుగు పుట్టించే’ ప్రక్రియలకు  స్వస్తి పలకడం. ఇందులో భాగంగా విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు మీడి యాలో భారీ ప్రచారం వచ్చేలా చూసుకోవడమేగాక ఇలాంటి రక్షణ ఒప్పందాలపై అడిగే ప్రశ్నలకు సమా ధానం చెప్పడానికి మొండిగా నిరాకరించడం. ఈ పద్ధతిలో మోదీ ప్రభుత్వం అహంకారపూరితమైన మూర్ఖత్వంతో పదే పదే రాఫెల్‌ ఒప్పందంపై వ్యక్త మైన అనుమానాలు తీర్చడానికి నిరాకరిస్తూ పెద్ద తప్పు చేసింది. అనవసరంగా తనకు తాను గొయ్యి తవ్వుకుంది.

లోతుగా గొయ్యి తవ్వుకుంటున్న ప్రభుత్వం!
ఈ వ్యవహారంలో ప్రభుత్వం రోజు రోజుకూ తాను ఇరుక్కుపోయే ప్రమాదమున్న లోతైన గొయ్యి తవ్వు కుంటూనే ఉంది. మొదట అనుకున్న ఒప్పందం ప్రకారం 126 రాఫెల్‌ విమానాల్లో 108 విమానాలను ప్రభుత్వరంగ సంస్థ హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ (హెచ్‌ఏఎల్‌) తయారు చేయాలి. అయితే, హెచ్‌ఏ ఎల్‌ వద్ద ఈ విమానాల ఉత్పత్తికి తగినంత మౌలిక సౌకర్యాలు లేని కారణంగా 126 విమానాలు కొనా లన్న నిర్ణయం మార్చుకున్నామని ప్రభుత్వం వివ రణ ఇచ్చింది. అత్యంత ఆధునిక విదేశీ యుద్ధ విమానాలకు ప్రపంచంలోని ఏ కంపెనీలోనూ తక్షణ ఉత్పత్తి–అమర్చే (అసెంబ్లీలైన్‌) సౌకర్యాలుండవు. ఏ కంపెనీ రూపొందించిన యుద్ధ విమానాలనైనా లైసె న్స్‌పై ఉత్పత్తి చేయడానికి అన్ని విధాలా మెరుగైన కంపెనీ హెచ్‌ఏఎల్‌ అని హేతుబద్ధంగా ఆలోచించే ఎవరైనా అంగీకరిస్తారు. ఈ సంస్థ తనకు ఎదురులేని గత కొన్ని దశాబ్దాల కాలంలో చేసిన పని ఇదే. అంత సమర్ధంగా చేయకపోయినా ఆయుధాలు ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ కంపెనీని ఎవరూ చులకనచేసి మాట్లాడరు.

వాజ్‌పేయి పాలనాకాలంలో మిరాజ్‌– 2000 రకం విమానాలన్నింటినీ ఇండియాలోనే రూపొందించాలని భారత వైమానికిదళం(ఐఏఎఫ్‌) ప్రతిపాదించింది. అయితే, అప్పట్లో తెహెల్కా వ్యవ హారంతో భయపడిన రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ అందుకు అంగీకరించలేదు. ఒకే కంపెనీ చేతిలో పెడితే అనుమానాలొస్తాయని భయపడ్డారు. ఒకేసారి 126 రాఫెల్‌ విమానాల భారీ కొనుగోలుకు అవస రమైన నిధులు సమకూర్చడం కష్టమనే వాస్తవాన్ని చెప్పడానికి ప్రభుత్వం ఏదో కారణం వల్ల సిద్ధంగా లేదు. నిజంగా ఇన్ని విమానాలు కొనాలంటే ఆర్మీ, నేవీ దళాల బడ్జెట్లకు కోత పెట్టాల్సి ఉంటుంది. అందుకే ప్రస్తుతానికి రెండు స్క్వాడ్రన్ల విమా నాలు(36) చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, రాఫెల్‌ విమానాల తయారీకి వేరే ఇతర కంపెనీకి అవకాశం ఇవ్వడం కోసం హెచ్‌ఏఎల్‌ను వదిలేశారని నిందించడానికి ఎవరూ సిద్ధంగా లేరు.

కాని, కొనుగోలు చేసే విమానాల సంఖ్య తగ్గిం చుకున్నారనీ, కలిసి ఉత్పత్తి చేసే అవకాశం పోగొ ట్టుకున్నారని మాత్రం విమర్శిస్తున్నారు. ఈ వ్యవహా రంలో వాస్తవాలు వెల్లడించి అనుమానాలు నివృత్తి చేసే అవకాశం ఉండగా ప్రభుత్వం అనవసరంగా అర్థం లేని వాదనలు వివరణలతో వివాదంలో చిక్కు కుంటోంది. యుద్ధ విమానాలు వైమానిక దళానికి తక్షణమే అత్యవసరమైనందునే రాఫెల్‌ విమానాల కొనుగోలు చేయాల్సివస్తోందనేది కేంద్ర సర్కారు చెప్పే మరో కారణం. తగినన్ని యుద్ధ విమానాలు లేవనేది 15 ఏళ్లుగా తెలిసిన విషయమే. 2001లోనే మొదటిసారి విమానాల అవసరం గుర్తించి, కొనుగో లుకు ప్రతిపాదించారు. రెండు దశాబ్దాల క్రితమే అవ సరమైన యుద్ధవిమానాలను కొనలేకపోవడం అగ్ర రాజ్యంగా అవరించాలనే కలలుగనే దేశం బలహీన తకు అద్దంపడుతోంది.

ఈ 36 రాఫెల్‌ విమానాలు సైతం యుద్ధరంగంలో వినియోగించడానికి 2022 వరకూ పూర్తిగా సిద్ధం కావు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా వంటి అసమర్ధ ప్రభుత్వం గానీ, ప్రభుత్వ వ్యవస్థగానీ (ఏ పార్టీ అధికారంలో ఉన్నాగాని) తన జాతీయ భద్రత బాధ్యతను మరో అగ్రరాజ్యానికి అప్పగించడం లేదా కశ్మర్‌ను పాకిస్తాన్‌కు, అరుణా చల్‌ప్రదేశ్‌ను చైనాకు ఇచ్చేయడం మంచిది? అలా చేయగా మిగిలే సొమ్మును దేశ ప్రజల విద్య, ఆరో గ్యానికి ఖర్చు చేయవచ్చు!

జాతీయ భద్రతపై హామీతోనే అధికారం
2014 ఎన్నికల్లో నరేంద్రమోదీని అధికారంలోకి తీసు కొచ్చిన ప్రధాన వాగ్దాల్లో ఒకటి జాతీయ భద్ర తపై ఇచ్చిన హామీ. జాతీయ భద్రత విషయంలో నిర్ణ  యాత్మకంగా, కఠినంగా వ్యవహరిస్తామని ఎన్డీఏ వాగ్దానం చేసింది. సైనిక దళాలకు కొత్త ఆయుధాలు కొనుగోలు చేసే ధైర్యం చేయలేని యూపీఏ సర్కారు వాటిని బలహీనపరిచిందని మోదీ ఆరోపించారు. ఆయన సరిగానే మాట్లాడారు కాబట్టి అప్పుడు ప్రజలు ఆయన మాటలు నమ్మారు. అందుకే, లోపాలు సరిదిద్దుకోవడానికి కొద్ది నెలలే ఉన్నందున ‘మీరేం చేశారు?’ అని ప్రధానిని అడగడంలో తప్పేమీ లేదు. రక్షణ ఆయుధాలకు సంబంధించి కొన్ని ఇండియాలోనే తయారు చేస్తున్నట్టు ప్రచారం చేయడం, కొన్ని వైమానిక ప్రదర్శనలు జరపడం మాత్రం ఈ ప్రశ్నకు జవాబు కాజాలదు. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చాలా తక్కువ అనేది వాస్తవం. ఆ విషయం చెప్పడానికి కూడా ప్రభుత్వం వెనుకాడుతోంది.

ఈ విషయంలో యూపీఏ ఎన్నడూ గొప్పలు చెప్పుకోలేదు. కాని, దాని కంటే మెరుగైన రీతిలో పనిచేస్తానని చెప్పిన బీజేపీ అందులో విఫలమైంది. వచ్చే ఏడాది రాఫెల్‌ విమనాలు భారత గగన తలంలో ఎగిరే మాట వాస్తవమే కావచ్చు. కానీ, ఈ వ్యవహారంలో బీజేపీ ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల భవిష్యత్తులో జరిగే ఆయుధాల కొనుగోళ్లపై దాని నీడ పడుతుంది. ఆయుధాలు దేశంలోనే ఉత్ప త్తిచేయాలనే లక్ష్యం ఘోరంగా దెబ్బతింది.  కొన్ని దశాబ్దాల కాలంలో అతి పెద్దదిగా భావించే రక్షణ కొనుగోలు ఒప్పందంలో దేశంలోని అత్యంత వివా దాస్పదమైన కార్పొరేట్‌ సంస్థను లబ్ధిదారుగా చేయడం ద్వారా ప్రభుత్వం తప్పటడుగు వేసింది. ఇప్పటి వరకూ ప్రైవేటు రంగంలోని ఏ కంపెనీ కూడా సైన్యానికి అవసరమైన ప్రధాన ఆయుధాలను తయారు చేసి ఇవ్వలేదు.

రక్షణరంగ ఏజెంట్లు, ఫిక్సర్లు, కార్పొరేట్‌ లాబీయిస్టులు, స్వయం ప్రకటిత జ్ఞానులతో కూడిన ఈ దయనీయ నగరంలో జరిగే ఏ కీలకమైన రక్షణ ఒప్పందాన్నయినా కుంభకోణం అనే చెప్పాల్సి ఉంటుంది. బోఫోర్స్‌ అనంతర దశాబ్దాల్లో ప్రతి ప్రభుత్వమూ అలాంటి అపనిందలనుంచి తప్పించుకోవడానికి అత్యంత సంక్లిష్ట నిబంధనలను తీసుకుంటూ వచ్చింది. కానీ అలాంటి అవినీతి నిరోధక వ్యవస్థ సాధనలో ఎలాంటి పురోగతి కనిపించకుండా పోయింది. ఎవరూ సాధించలేరు కూడా. మోదీ ప్రభుత్వం పారదర్శకతతో ఈ పరిస్థితిని మార్చే అవకాశాన్ని దక్కించుకుంది కానీ మోదీ ప్రభుత్వమే దాన్ని ధ్వంసం చేసి పడేసింది.
వ్యాసకర్త : శేఖర్‌ గుప్తా, ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement