లోక్‌సభలో ప్రధాని మోదీ చిద్విలాసం; ప్రసంగం సందర్భంగా నమస్కరిస్తున్న ములాయం
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజలు విస్పష్ట మెజారిటీ కట్టబెట్టడంతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీంతో భారత్ పట్ల ప్రపంచ దేశాల వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పారు. అస్థిర ప్రభుత్వాలతో ఇంతకుముందు ఎన్నో ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజైన బుధవారం మోదీ లోక్‌సభలో ప్రసంగించారు. 2019–20 తాత్కాలిక బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ చేపట్టకుండానే రాజ్యసభ బుధవారం బడ్జెట్‌కు పచ్చజెండా ఊపింది. అనంతరం లోక్‌సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదాపడ్డాయి. దీంతో 16వ లోక్‌సభా కాలంలో చివరి పార్లమెంట్ సమావేశాలు ముగిసినట్లయింది. ఈ లోక్‌సభా కాలంలో మొత్తం 219 బిల్లులు ప్రవేశపెట్టగా 203 బిల్లులు ఆమోదం పొందాయి. లోక్‌సభ కార్యకలాపాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ సమర్థంగా నిర్వహించారని మోదీ ప్రశంసించారు. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ సవరణ బిల్లులకు జూన్ 3న గడువు తీరనుంది.
భూకంపం వస్తుందన్నారు..ఏదీ?
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యస్త్రాలు కొనసాగిస్తూ.. రఫేల్ ఒప్పందంపై మాట్లాడితే భూకంపం వస్తుందన్న ఆయన మాటలు డొల్ల అని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభలో రాహుల్ తనను కౌగిలించుకుని తరువాత కన్ను గీటడాన్ని ప్రస్తావిస్తూ.. మొదటిసారి లోక్‌సభ ఎంపీ అయిన తనకు ఇలాంటివి చాలా కొత్తగా అనిపించాయని చురకలంటించారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట పెరగడానికి తాను కానీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కానీ బాధ్యులు కారని, ఈ క్రెడిట్ సంపూర్ణ మెజారిటీ సాధించిన ప్రభుత్వానికి, దేశ ప్రజలకు దక్కుతుందని మోదీ అన్నారు. నాలుగున్నరేళ్ల తమ ప్రభుత్వ విజయాల్ని మోదీ ప్రస్తావిస్తూ..భారత్ 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పారు. ఈ లోక్‌సభ సమావేశాల్లో మొత్తం 17 సెషన్లు జరగ్గా, అందులో 8 సెషన్ల లో వందశాతానికి పైగా ఉత్పాదకత సాధించా మన్నారు. మొత్తం మీద లోక్‌సభ సఫలతా శాతం 85 శాతంగా నమోదైందని తెలిపారు.
అంచనాలు అందుకున్నారా: స్పీకర్ ఐదేళ్లలో ప్రజల అంచనాలను అందుకున్నారో? లేదో? ఆత్మపరిశీలన చేసుకోవాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభ సభ్యులకు సూచించారు. సభ ఏర్పడినప్పటి నుంచి సభ్యుల ఆందోళనల వల్ల 422 గంటల 19 నిమిషాల సమయం వృథా అయిందన్నారు. మొత్తం 331 సిట్టింగ్‌లలో 1,612 గంటల పాటు కార్యకలాపాలు కొనసాగాయి.
మళ్లీ మోదీనే ప్రధాని కావాలి: ములాయం
నరేంద్ర మోదీనే మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించి ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం లోక్‌సభలో అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీనికి మోదీ స్పందిస్తూ ములాయంకు చేతులు జోడించి నమస్కరించారు. ప్రస్తుత సభ్యులు మళ్లీ లోక్‌సభకు ఎన్నిక కావాలని కోరుకుంటున్నట్లు ములాయం తెలిపారు. తరువాత మోదీ వైపు చూస్తూ ‘మీరే మళ్లీ ప్రధానిగా రావాల’ని అనడంతో అధికార పక్ష సభ్యులు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆయన పక్కనే కూర్చున్న యూపీయే అధ్యక్షురాలు సోనియా గాంధీ కాస్త ఇబ్బందిపడినట్లు కనిపించింది. తనను ఆశీర్వదించిన ములాయంకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment