
దౌత్యం చతికిలపడిందా?
జాతిహితం
నరేంద్ర మోదీ కూడా పాకిస్తాన్, చైనాలతో గట్టి సంబంధాలను కోరుతూనే పాలన ఆరంభించారు. మొదట ఇరువైపుల ఆశ మెరిసినా అంతలోనే మాయమైంది. నరేంద్ర మోదీ, వ్యూహాత్మక అంశాల కోసం పనిచేస్తున్న ఆయన బృందం ఇలా ఎందుకు జరిగిందో విశ్లేషించుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం జమ్మూకశ్మీర్‌లో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వం అసమర్థత కారణంగానే భారత్–పాక్ సంబంధాలలో ఈ గందరగోళం ఏర్పడింది. భారత్ చర్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని చైనా భావించి ఉండవచ్చు.
రెండున్నర యుద్ధరంగాలలో కూడా పోరాటం చేయడానికి తన సైన్యం సంసిద్ధంగా ఉందని జనరల్ బిపిన్‌చంద్ర రావత్ ఇచ్చిన ప్రకటన మీద భిన్నమైన స్పందనలు వచ్చాయి. ఇక్కడ రెండున్నర యుద్ధరంగాలు అంటే పాకిస్తాన్, చైనా, కొన్ని అంతర్గత ఘర్షణలు అని. రావత్ ప్రకటన ధైర్యాన్ని నూరి పోసిందన్న రీతిలో దేశీయంగా వ్యాఖ్యానాలు వినిపించాయి. చైనా నుంచి విమర్శలు వచ్చాయి. ఒకటి మాత్రం నిజం. భారత్ 1959 నుంచి బహుముఖమైన, బహుళ దశలతో ఉన్న బెడదలు ఎదుర్కొన్నది. వీటికి బదులివ్వడానికి భారత రాజకీయ నాయకత్వం సైన్యాన్ని తన ఆయుధంగా ఎంచుకుంటోంది. అయితే 1962 నాటి ఒక్క ఆ మినహాయింపు తప్ప, మిగిలిన సమయాలలో జరిగింది అదే. ఈ ధోరణి గురించి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కొన్ని దశాబ్దాల తరువాత రెండో యుద్ధరంగంలో హఠాత్తుగా చైనా మేల్కొనడం, ఆ దేశ మీడియా ప్రయోగిస్తున్న భాష నేపథ్యంలో ఈ ప్రశ్నలు రేకెత్తుతాయి. ఆ దేశ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్న తీరు మరీ ముఖ్యం. మన దేశంలో గద్దించి మాట్లాడుతున్నట్టు ఉండే కామిక్ చానళ్లలో పాల్గొనే వక్తల మాదిరిగా అక్కడి అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు.
మొదటి ప్రశ్న ఏమిటంటే– ఆ రెండున్నర యుద్ధరంగాల సవాలు ఆరంభమైన ఆరు దశాబ్దాల తరువాత– ఇంకా చెప్పాలంటే మూడు పూర్తి స్థాయి యుద్ధాలు జరిగి, పాకిస్తాన్‌తో పూర్తిగా బంధాలు తెగిపోయాక, ఈశాన్యంలో శాంతి ఒప్పందాల మీద సంతకాలు కూడా జరిగిన తరువాత, ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినా కూడా, అణ్వాయుధాలు విస్తరిస్తున్న కాలంలో కూడా– ఇప్పటికీ ఆ సవాలు ఎందుకు యథాతథంగానే మిగిలి ఉంది? ప్రపంచంలో మిగిలిన ఏ పెద్ద దేశంలో లేదా సైనిక శక్తిలో ఇన్ని కోణాల నుంచి సవాళ్లు కొనసాగుతున్నాయా? అలా ఆరు దశాబ్దాలుగా ఉన్నాయా? రెండో ప్రశ్న– ఆ సైనిక అస్థిత్వం కొనసాగింపు భారత్ దౌత్య, వ్యూహాత్మక ఆలోచనల ఫలితమేనా? ఈ ప్రశ్న అక్కడితో అయిపోలేదు. భారతీయ దౌత్యం, వ్యూహం సైనిక శక్తి శాసించినట్టు నడుస్తూ, దానికి లొంగి ఉందా? లేకుంటే ఇది మరో మార్గమా? మొదటిది ప్రచ్ఛన్న యుద్ధంతో సోవియెట్ రష్యాను తాకిన ఉత్పాతం. సైనిక దళాల భారం, సైనికపరమైన ఆలోచనల కారణంగా వార్సా ఒప్పందం చెల్లాచెదురైందనీ, దానితోనే సైద్ధాంతిక, మేధోపరమైన యుద్ధం ముగిసిపోయిందనీ ఇప్పుడు అంతా అంగీకరిస్తున్నారు.
అసలు ప్రచ్ఛన్నయుద్ధం ఎలా అంతమైందంటే, రొనాల్డ్ రీగన్ నాయకత్వంలోని అమెరికా, సోవియెట్ రష్యాను అధిగమించడం వల్ల కానేకాదు. సోవియెట్ రష్యా అఫ్ఘానిస్తాన్ మీద దాడి చేసి దుస్సాహసం చేయడం వల్లనేనని ప్రముఖ చరిత్రకారుడు నియాల్ ఫెర్గూసన్ వాదన. ఇక మూడో ప్రశ్న– అరవై ఏళ్ల తరువాత ఈ ప్రపంచం పూర్తిగా కొత్త రూపు సంతరించుకున్న తరువాత కూడా మన శత్రువులు, శత్రుత్వాలు అలాగే కొనసాగుతున్నాయంటే, మన ప్రతిష్టంభనలు కూడా అలాగే ఉండిపోయాయంటే, ఈ స్థితిలో కూడా మన ప్రయోజనాలను రక్షించే బాధ్యతను సైన్యానికి అప్పగించామంటే అర్థం ఏమిటి? దాని అర్థం ఇది కాదా? జాతీయ ప్రయోజనాలకు సంబంధించి ఎంతో ముఖ్యమైన ప్రమాణం విషయంలో మన రాజకీయ, వ్యూహాత్మక నాయకత్వం వైఫల్యం చెందినట్టు కాదా? చైనీయులను తరిమి కొట్టండి అంటూ 1962లో నెహ్రూ సైన్యానికి పిలుపునిచ్చినట్టే, పరిస్థితులు విషమిస్తున్నప్పటికీ రాజకీయ నాయకులు ఈ అర్థంపర్థం లేని మాటలు చెప్పగలరా? పనులు చేయగలరా? ఎవరైనా వాస్తవాలను పట్టించుకోవలసిన అవసరం లేదా?
రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించడమనే తప్పు హిట్లర్ చేశాడని చెప్పడం కాదు కానీ, ఏ దేశమైనా కూడా, తన రక్షణ కోసం ఎంత సాహసంతో పోరాడినా కూడా రెండు యుద్ధ రంగాలలో యుద్ధం చేసి విజయం సాధించిన దాఖలాలు లేవని చరిత్ర చెబుతుంది. కాబట్టి దౌత్యం అనేది మూడు ప్రాధామ్యాలను కలిగి ఉండాలి. జాతీయ ప్రయోజనాలను మరిం తగా కాపాడుకునేందుకు యుద్ధాన్ని నివారించేందుకు తుదికంటా ప్రయత్నించాలి. రంగంలోకి దించకుండానే సైన్యం పరపతి ఏపాటిదో తెలియచెప్పే ప్రయత్నం చేయడం మరొకటి. ఈ రెండు విఫలమైనప్పుడు, 1962, 1965 సంవత్సరాలలో మాదిరిగా యుద్ధం చేయక తప్పని పరిస్థితులు ఎదురైనప్పుడు, లేదా 1971లో మాదిరిగా యుద్ధం చేయాలని దేశం భావించినప్పుడు, మిగిలిన యుద్ధ రంగాలతో వచ్చే ప్రమాదమేదీ లేదని నిర్ధారించుకున్నప్పుడు –యుద్ధం గురించి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మీ సైన్యానికి వదిలిపెట్టాలి.
మనం యుద్ధం చేసిన ప్రతిసారి మరోపక్క కొత్త కొత్త యుద్ధరంగాలు సిద్ధమవుతాయన్న భీతి ఉండేది. ఒక యుద్ధరంగంలో చర్యను కొనసాగించే క్రమంలో ప్రభుత్వాలు రకరకాల విధానాలను ఉపయోగించేవి. 1962లో భారత్ రెండున్నర యుద్ధ రంగాలలో పోరాడుతున్నప్పుడు జవహర్‌లాల్ సాయం కోసం పాశ్చాత్య దేశాలను కోరారు. భారత్ ఎదుర్కొంటున్న క్లిష్టపరిస్థితిని ఆసరా చేసుకోవద్దని పాక్‌కు నచ్చచెప్పడానికి నెహ్రూ అమెరికా, బ్రిటన్‌లను ఆశ్రయించారు. దీనికి చెల్లించిన మూల్యం ఏమిటంటే, కశ్మీర్ వివాదంలో పాకిస్తాన్‌తో జరిపే చర్చలలో (స్వరణ్‌సింగ్–భుట్టో చర్చలు, 1962–63) మూడో పార్టీ జోక్యం.
కానీ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి అనూహ్యంగా ఈ ప్రక్రియను ఆలస్యం చేయడంతో పాకిస్తాన్ అదనుగా భావించి కశ్మీర్‌ను ఆక్రమించే క్రమంలో 1965లో సైనిక చర్య మొదలుపెట్టింది. ఇక్కడ చిన్న అంశాన్ని జ్ఞాపకం చేయాలి. 1962లో రెండున్నర యుద్ధరంగాల సమస్యలో నాగాలాండ్ తిరుగుబాటు అంశం ఉంది. ఈశాన్యం నుంచి (అరుణాచల్, నీఫా) సైన్యం తప్పుకోవడంతో అప్పుడు నాగాలాండ్ సంగతి తాత్కాలికంగా పట్టించుకోలేదు. రెండో యుద్ధ రంగాన్ని విజయవంతంగా వదిలేయడం జరిగింది. అలా మిగి లిన సగం యుద్ధరంగంలో పెద్ద బెడదకు చోటిచ్చే అవకాశం కల్పించాం.
కశ్మీర్‌లో ఏర్పడిన ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనడానికి 1965లో అనూహ్యంగా శాస్త్రి ప్రభుత్వం ధైర్యంగా లాహోర్, సియాల్‌కోట యుద్ధరంగాలకు శ్రీకారం చుట్టింది. ఇవి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్నాయి. మనం చేసిన ఆఖరి పూర్తిస్థాయి యుద్ధం 1971 నాటి యుద్ధం. ఈ యుద్ధం ప్రణాళికా బద్ధంగా జరిపిన యుద్ధం కూడా. తన కంటే ముందు ప్రధాని పదవిలో ఉన్నవారి కాలం మాదిరిగా కాకుండా, చైనా బెడద గురించి ఆమెకు బెంగ లేదు. ‘శాంతి, స్నేహం, సహకారం’ అన్న అంశాల ప్రాతిపదికగా ఆమె రష్యాతో ఆదరాబాదరా చేసుకున్న ఒప్పందం వల్ల, ఒకే శత్రువు, ఒకే యుద్ధరంగం అన్న అంశాలు రూఢీ అయినాయి. ఒప్పందం జరిగిన 13 రోజుల తరువాత అన్ని సైనిక సన్నాహాలు జరిపే పనిని మానెక్‌షాకు అప్పగించారు. ఆ సమయంలో సగం యుద్ధరంగం మిజోరం–నాగాలాండ్. అక్కడ నుంచి పోరాడుతున్న వారి స్థావరాలను తూర్పు పాకిస్తాన్‌లో ధ్వంసం చేయడం జరిగింది. దీనితో వేర్పాటువాదుల నడ్డివిరిగింది.
కానీ భారత్ దురవస్థ ఏమిటో గానీ, ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయినా, ఇస్లామిక్ ఉగ్రవాదం మీద ప్రపంచం ఆగ్రహం ప్రకటిస్తున్నా రెండు యుద్ధరంగాల బెడద తప్పడం లేదు. ఈ మార్పులు కూడా చైనా–పాకిస్తాన్ సంబంధాలలో మార్పులు తేలేకపోయాయి. పైగా ఇదివరకు ఎన్నడూ లేనంత పటిష్టమైనాయి. డొనాల్డ్ ట్రంప్ ఏకధ్రువ ప్రపంచాన్ని సవాలు చేయగల సత్తా తనకు ఉందని చైనా భావిస్తుండగా, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ పథకం ప్రకారం పాకిస్తాన్ చైనాకు మరింత సన్నిహిత మిత్రుడని తేలింది. నిజానికి కారిడార్ పథకం ఆర్థికపరమైనది కాబట్టి వ్యూహాత్మకమైనది కూడా. అది కాకపోతే, అంతకంటే కీలకమైన పథకమే అవుతుంది కూడా.
అయితే ఈ పథకం రెచ్చగొట్టే చర్య అని భారత్ భావన. ఎందుకంటే ఆ పథకం భారత్ భూభాగం ద్వారా వెళుతుంది. కాబట్టి అణ్వాయుధ సామర్థ్యం కలిగిన భారత దేశం ఇప్పుడు అణ్వాయుధ సంపద కలిగిన రెండు దేశాల నుంచి బెడదను ఎదుర్కొంటున్న దేశంగా ప్రపంచంలో మిగిలింది. ఇదంతా ప్రస్తుత ప్రభుత్వ చలవ మాత్రమే కాదు. లేదా తప్పు కాదు. మన దేశానికి చెందిన ప్రతి నాయకుడు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. రాజీవ్‌గాంధీ, వాజపేయి మరింత ముందుకు Ðð ళ్లి పరిష్కరించే యత్నం చేశారు. వారి కృషి రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన తగ్గడానికి కొంత సాయపడింది కూడా. సిక్కిం భారత్‌లో అంతర్భాగం కావడానికి చైనా అంగీకరించింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ కాలంలో ఇంకాస్త పురోగతి సాధించడం మినహా తరువాత ఎప్పుడూ రెండు దేశాల మధ్య గొప్ప సంబంధాలు కొనసాగలేదు. మన్మోహన్ అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్‌తో శాంతిని నెలకొల్పడం సులభం. పాకిస్తాన్ ప్రభుత్వ ధోరణిని మార్చామని చెప్పుకోవడానికి ప్రపంచం, ఇంకా ముఖ్యంగా అమెరికా కోరుకుంటున్నాయి. అందుకే 26/11 ఉదంతం జరిగినప్పటికీ మన్మోహన్ పాకిస్తాన్‌తో శాంతినే కోరుకున్నారు. దాని ఫలితమే షర్మెల్ షేక్ ప్రకటన.
అయితే ఆయన పార్టీయే ఆ ప్రయత్నాలకు అడ్డు తగిలింది. ఆయన కూడా తన ఆలోచనను విరమించుకున్నారు. నరేంద్ర మోదీ కూడా పాకిస్తాన్, చైనాలతో గట్టి సంబంధాలు కోరుతూనే పాలన ఆరంభించారు. మొదట ఇరువైపుల ఆశ మెరిసినా అంతలోనే మాయమైంది. నరేంద్ర మోదీ, వ్యూహాత్మక అంశాల కోసం పనిచేస్తున్న ఆయన బృందం ఇలా ఎందుకు జరిగిందో విశ్లేషించుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం జమ్మూకశ్మీర్‌లో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వం అసమర్థత కారణంగానే భారత్–పాక్ సంబంధాలలో ఈ గందరగోళం ఏర్పడింది. భారత్ చర్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని చైనా భావించి ఉండవచ్చు. అలాగే టిబెట్ ప్రవాస ప్రభుత్వ ప్రతినిధులు భారత ప్రభుత్వ కార్యక్రమాలలో కనిపించినందుకు (మోదీ ప్రమాణ స్వీకారోత్సవం నుంచి) కావచ్చు. అరుణాచల్‌లో దలైలామా పర్యటించినందు వల్ల కావచ్చు. అలాగే తాము సరిహద్దులను టిబెట్‌తోనే పంచుకుంటున్నాం గానీ, చైనాతో కాదని అరుణాచల్ ముఖ్యమంత్రి ప్రకటించడం కావచ్చు. అసలు ఇవన్నీ యథాలాపంగా జరిగినవా; లేక ఒక ప్రణాళిక ప్రకారం చెప్పిన మాటలా? మనకు తెలియదు. కానీ వ్యూహానికి సంబంధించి ఈ రెండు దేశాలకు ఒక వాస్తవం తెలియాలి. అది– ఈసారి సగం యుద్ధరంగం తూర్పు మధ్య భారతంలోని మావోయిస్టు పీడిత ప్రాంతమే.
- శేఖర్ గుప్తా
twitter@shekargupta