పెను సంక్షోభం ఊబిలో సీబీఐ | Shekhar Gupta Article On CBI | Sakshi
Sakshi News home page

పెను సంక్షోభం ఊబిలో సీబీఐ

Published Sat, Nov 17 2018 12:41 AM | Last Updated on Sat, Nov 17 2018 12:41 AM

Shekhar Gupta Article On CBI - Sakshi

కేంద్ర అవినీతి నిరోధక సంస్థ సీబీఐ రెండు దశాబ్దాల సంస్కరణను ఉల్లంఘించిన కారణంగానే దాని ఉన్నతాధికారులు పరస్పరం దొంగలుగా ఆరోపించుకుని సంస్థ ప్రతిష్టను మంటగలిపారు. దీన్ని సాకుగా తీసుకుని, ఏపీ సీఎం చంద్రబాబు తన రాష్ట్రంలో కేసుల దర్యాప్తునకు సీబీఐకి ఇచ్చిన అధికారాలను సైతం ఉపసంహరించే సాహసానికి పూనుకున్నారు. సీబీఐని సంస్కరించాలని చేసిన ప్రతి ప్రయత్నమూ విఫలమవడానికి కారణం ఏమిటంటే, సంస్థాగత సంస్కరణకు వెలుపల ఉండేలా సీబీఐని రూపొందించడమే. ప్రస్తుత కార్యం మరింత సంస్థాగతమైన క్రమశిక్షణతో సీబీఐని నియంత్రించడమే తప్ప దానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టడం కాదు.

‘హమ్‌ సీబీఐ సే హై... అస్లీ వాలే‘ (మేం సీబీఐ నుంచి వచ్చాం, నిజమైన సీబీఐ), అని 2013లో నీరజ్‌ పాండే తీసిన అద్భుతమైన సినిమా స్పెషల్‌ 26లో ఒక రైడింగ్‌ పార్టీకి నేతృత్వం వహిస్తున్న సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ వసీమ్‌ఖాన్‌ పాత్రను పోషించిన మనోజ్‌ బాజ్‌పేయి అంటాడు. అస్లీ వాలే అంటూ అతడు చెప్పుకోవడానికి కారణం ఏదంటే, అక్షయ్‌ కుమార్‌ నేతృత్వం లోని మరొక బృందం, తాము సీబీఐ నుంచి వచ్చామని చెప్పుకుంటూ సంపన్నులపై దాడి చేసి వారి సంపదను తీసుకుని మాయమవుతుండటమే. 

సరిగ్గా దీన్ని పోలిన మరొక డ్రామా ఇప్పుడు నిజజీవితంలో చాలావరకు గౌరవనీయ సుప్రీంకోర్టులో ప్రదర్శితమవుతోంది. సీబీఐలో ఉన్న నంబర్‌ వన్‌ గ్రూప్, నంబర్‌ టు గ్రూప్‌ తమ్ము తాము అస్లీ వాలే అని చెప్పుకుంటూ ఇతరులను దొంగలు అని పిలుస్తున్నారు. ఈ పేలవమైన ఆరోపణలు మరికొన్ని మసాలాలను కలిగి ఉన్నాయి: కేంద్రప్రభుత్వం ఒక పక్షానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు కనబడుతోంది. ఇక ఒక చీఫ్‌ విజి లెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ) సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఆయన నెత్తిపై ఒక రిటైరైన న్యాయమూర్తి కూర్చుని ఉండటమే. ప్రతి ఒక్కరూ భారత్‌లో అత్యంత కాఠిన్యవంతులై కార్యకర్తలు, న్యాయవాదుల ఆగ్రహావేశాలకు గురి అవుతున్నారు.

ఎందుకంటే ఎవరూ ఎవరినీ నమ్మడంలేదు, ప్రతి ఒక్కరినీ మరొకరు నిశితంగా గమనిస్తున్నారు. అందుచే మనం ఏం చేయాలి? ఇక నిర్ణయించడానికే సంకోచిస్తున్నప్పుడు ఉన్నతాధికారులు చేసేది ఏమిటి? వారు కాలాన్ని వృథా చేస్తున్నారు. అందుకే, నాకు మరో రెండు వారాలు ఇవ్వండి. రోజుల తరబడి వేచి ఉండే సంప్రదాయం ప్రకారం ఇది మరింత ఆలస్యం అయినట్లయితే, ప్రస్తుత డైరెక్టర్‌ పదవీబాధ్యత వచ్చే జనవరిలో ముగియనుంది. ఆయన్ని వెళ్లనిద్దాం. నంబర్‌ టూని మాతృసంస్థకు తరలిద్దాం. అప్పుడు కొత్త సీబీఐ బాస్‌ కోసం శోధన ప్రారంభిద్దాం. ఇదే కథకు ముగింపు. ఈలోగా, మన అత్యంత ముఖ్యమైన అవి నీతి నిరోధక సంస్థ, దాని బాస్‌లు ఒకరిపై ఒకరు లీకులు, పుకార్లు రేపుకుంటూ ఉన్నందున నేటికీ స్తంభించిపోయి ఉంది. నా సహోద్యోగి అనన్య భరద్వాజ్‌ దీన్ని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇనెక్టివిటీ అంటూ సరిగ్గా వర్ణించారు. మరొకరి స్థానంలో పనిచేస్తున్న డైరెక్టర్‌ కూడా అనుమానాల మధ్య చిక్కుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో మరొక పోలీసును పట్టుకోవడానికి మీరు ఏ పోలీసును నియమిస్తారు?

ఈ సంకుల సమరాన్ని అనువుగా తీసుకుని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాష్ట్రంలో కేసుల దర్యాప్తుకు సీబీఐకి ఇచ్చిన అధికారాలను ఉపసంహరించే సాహసానికి పూనుకున్నారు.  పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వెంటనే బాబుకు తన మద్దతును ప్రకటించేశారు. ప్రత్యేకించి సీబీఐ దర్యాప్తు, విచారణ కింద ఉన్న ఇతర రాష్ట్రాలు, ప్రతిపక్ష నాయకులు కూడా ఈ ప్రక్రియలో భాగమవడాన్ని దీని ఫలితంగా సీబీఐ ప్రథమస్థాయి రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించవచ్చు కూడా. ఏదేమైనా, కోర్టులను నిందించాలంటే ఇప్పటికే ఆలస్యమైపోయింది. మన కోర్టులు గత రెండు దశాబ్దాలుగా ఏదో ఒకటి చేయాలని కనీస ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. సీబీఐని సంస్కరించడంలో ఈ వైఫల్యానికి నేను న్యాయస్థానాలను నిందించలేను. మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా, తనను కోర్టులు, ప్రభుత్వం, లేక సామాజిక కార్యకర్తలు.. చివరకు ఇండియన్‌ పోలీసు సర్వీసులు వంటి ఏ సంస్థ కూడా పరి శుద్ధం చేయలేనటువంటి రాకాసిలా సీబీఐ మారిపోయింది.

ఎందుకంటే, గత రెండు దశాబ్దాలుగా పలువురు మంచి వ్యక్తులు దాంట్లో పనిచేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు తన మంచి పేరును సైతం ఉల్లంఘించిన క్రూర జంతువులా సీబీఐ మారిపోయింది. ఒకప్పడు పంజరంలో చిలుక అని తిరస్కారానికి గురైన ఇదే సంస్థ ఇప్పుడు మన రాజకీయాలకు, రాజకీయ నేతలకు డబ్బులు తీసుకుని శిక్షలు లేకుండా చేయగలిగే స్థాయికి చేరుకుంది. 1990ల్లో (జైన్‌ హవాలా కేసును గుర్తుతెచ్చుకోండి) సీబీఐ రాజకీయనేతల కెరీర్లనే ధ్వంసం చేసి వారిని మళ్లీ పునరుత్థానం చేసింది. వాస్తవానికి ఎల్‌.కె. అడ్వాణీ (జైన్‌ హవాలా), పీవీ నరసింహా రావు (జేఎమ్‌ఎమ్‌ ముడుపులు) ఎ. రాజా (టూజీ), దయానిధి మారన్‌ (టెలిఫోన్‌ ఎక్చేంజ్‌ కేసు) వంటి సీబీఐ ప్రాసిక్యూట్‌ చేసిన ప్రముఖులందరూ చివరికి నిర్దోషులుగా బయటపడ్డారు. అదే సమయంలో సీబీఐ సాగించిన సాక్ష్యాలు లేని తరహా కుంభకోణాల ఉన్మాదం టెలికాం నుంచి మైనింగ్‌ దాకా మన ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసేసింది. 

సీబీఐ ప్రభుత్వాలకు ఎంత ప్రశంసాత్మకంగా ఊడిగం చేసిందంటే, బోఫోర్స్‌ కేసును తుంగలో తొక్కింది లేక తన అభీష్టం ప్రాతిపదికన తిరగదోడింది కూడా. ఈ క్రమంలో ఏ ఒక్కరూ శిక్షలకు గురికాలేదు. పైగా ఆయా కేసుల్లోని నిందితులు అప్పటికే చనిపోయి ఉండటం కూడా తట స్థించేది. సీబీఐకి జవసత్వాలు కలిగించడానికి సుప్రీంకోర్టు ప్రయత్నిం చింది. రెండు భారీ కుంభకోణాలకు సంబంధించి ఉన్నత న్యాయస్థానం నేర విచారణ ప్రక్రియను, విచారణ బృందాలను తన నియంత్రణలోకి తీసుకోకపోయి ఉండవచ్చు గానీ తన ప్రత్యక్ష పరిరక్షణలో ఉంచి పనిచేయించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షించినప్పటికీ జైన్‌ హవాలా, టూజీ స్పెక్ట్రమ్‌ కేసులు ఫలితం లేకుండా నీరుగారిపోయాయి.

సుప్రీంకోర్టు పదే పదే సీబీఐకి సాధికారత కల్పించేందుకోసం జోక్యం చేసుకుంది, దానికి మరింత స్వతంత్రత కల్పించి, నిష్పాక్షికంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకుంది. ఆ సంస్థ డైరెక్టర్‌కి రెండేళ్ల పదివీకాలాన్ని ఫిక్స్‌ చేసింది కూడా. సీబీఐ డైరెక్టర్‌ ఎంపికకోసం త్రిసభ్య ప్రభుత్వ కమిటీని నియమించింది, తర్వాత చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన మరింత నూతనమైన, సృజనాత్మకమైన స్వతంత్ర యంత్రాంగాన్ని రూపొందిం చింది కూడా. నిజానికి ప్రభుత్వ వ్యవస్థ చరిత్ర మొత్తంలో భారత ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఒక కార్యనిర్వాహక పదవికి నియామకం జరిపిన ఘటన ఇదొక్కటి మాత్రమే కావడం విశేషం. అంటే సీబీఐని మన వ్యవస్థ ఎంత తీవ్రంగా పట్టించుకుంటోందో దీన్ని బట్టి తెలుస్తుంది. తర్వాత, అది సాధించిన ఫలితాల బట్టే దాన్ని తూచాల్సి ఉంది. బలహీనపడిన సీబీఐది ఒక ఘోర స్థితి అయితే, మళ్లీ బలోపేతం చేసిన సీబీఐ మరింత ఘోరంగా మారింది.

న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో నూతన వ్యవస్థలో నియమితులైన అదే డైరెక్టర్ల ఆధ్వర్యంలోని సీబీఐని ప్రభుత్వాలు వరుసగా ఎలా దుర్వినియోగం చేస్తూ వచ్చాయి అనే అంశంపై ఏ పరిశోధకుడైనా మొత్తం పీహెచ్‌డి థీసీస్‌గా మల్చగలడు. అలాంటి దుర్వినియోగానికి చెందిన అంశాలను కొన్నిం టిని గుర్తుకు తెచ్చుకుందాం. పార్లమెంటులో యూపీఏ ప్రభుత్వం ఎప్పుడైనా విశ్వాస తీర్మానం పరిధిలోకి వచ్చినట్లయితే, అప్పటికే అనుమానితులుగా ఉన్న ములాయం సింగ్‌ యాదవ్, మాయావతిలపై సాగుతున్న కేసులు అద్భుత పురోగతి సాధించినట్లుగా జాతీయ పత్రికల పతాక శీర్షికల్లో ఊహాజనిత కథనాలు ప్రత్యక్షమయ్యేవి. అలాగే నరేంద్రమోదీ, అమిత్‌ షా, గుజరాత్‌లో వారి నమ్మిన బంటు పోలీసులకు వ్యతిరేకంగా సీబీఐని స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌గా ఇలాగే ఉపయోగించారు. చివరకు ఇష్రాత్‌ జహాన్‌ కేసులో అత్యున్నత ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఆఫీసర్‌ని ఇరికించేత స్థాయికి సీబీఐ వెళ్లిపోయంది.

ఈ కేసులో మీ అభిప్రాయం ఏదైనా కావచ్చు, అది సంకేతించే అంశం ఏది: ఏం జరిగింది? యూపీఏ బలహీనపడుతోందని సీబీఐ అధిపతి గ్రహించగానే ఆ కేసును సాగదీశారు. తర్వాత మోదీ అధికారంలోకి రాగానే ఆ కేసునే రద్దు చేసి పడేశారు. ఎందుకంటే అడ్డం తిరిగిన సాక్షులు ఈ కేసులో వందకు చేరుకున్నారు మరి. సీబీఐని సంస్కరించాలని చేసిన ప్రతి ప్రయత్నమూ విఫలం కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే, సంస్థాగతంగా సంస్కరణకు వెలుపల ఉండేలా సీబీఐని రూపొం దించడమే. న్యాయవ్యవస్థ  మందకొడిగా పనిచేస్తున్న వ్యవస్థలో మితిమీరిన అధికారం కలిగివున్న ఏ పోలీసు వ్యవస్థ అయినా ఒక ప్రక్రియలో దండనాధికారిగానే మారిపోతుంది. ఈ స్థితిలో యువకులుగా ఉన్నప్పడు జైలుపాలయిన వారు మధ్య వయస్సు వచ్చినప్పటికీ ఆ జైళ్లలోనే ఉంటారు. అప్పటికి కూడా వారి విముక్తి పొందలేరు. అందుకే  ప్రస్తుతం మనకు కావలసింది మరింత సంస్థాగతమైన క్రమశిక్షణ, సీబీఐని నియంత్రించడమే తప్ప దానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టడం కాదు. 

వినీత్‌ నారాయణ్‌  కేసులో తానిచ్చిన తొలి చారిత్రక తీర్పులో సుప్రీంకోర్టు సీబీఐ అధికారాలను పెంచి, దాని అధిపతి పదవీకాలానికి రక్షణ కల్పించింది. ప్రాసిక్యూషన్‌ని కొట్టేయడం లేక  నిందితుడిని నిర్దోషిగా ప్రకటించడం జరిగిన ప్రతి సందర్భంలోనూ ప్యానెల్‌లోని ఒక లాయర్‌ తప్పకుండా సమీక్షించాలి. బాధ్యతలను ఉపేక్షించిన వారిపైనే  బాధ్యతను మోపాలి. తన విధిని విస్మరించిన అధికారిపై కఠిన చర్య తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ ఇంతవరకు అలాంటివేమీ జరిగిన పాపాన  పోలేదు. ఎందుకంటే కోర్టు తీర్పులో తమకు అనుకూలమైన వాటినే రాజకీయ నాయకులు అందిపుచ్చుకుని ఉపయోగించుకుంటారు. ఇటీవలి కాలంలో నలుగురు సీబీఐ డైరెక్టర్లలో ముగ్గురు వివిధ స్థాయిల్లో అవినీతీ ఆరోపణలను ఎదుర్కొనడంలో ఆశ్చ ర్యపడాల్సింది ఏమీ లేదు. తదుపరి సీబీఐ డైరెక్టర్‌ ఇంతకు మంచి ఉత్తమంగా ఉండగలరనడానికి గ్యారంటీ ఏదీ లేదు. సీబీఐ కార్యాలయంలో అపరిమితాధికారం ఉంది. కానీ చాలా తక్కువ జవాబుదారీతనం ఉంది. ఇలాంటి పరమ గందరగోళపు సంస్థాగత  నిర్మాణంలో సూపర్‌మ్యాన్‌ మాత్రమే అస్లీ వాలేను నేనే అని ప్రకటించుకోగలడు.

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement