రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థ సిద్ధంగా ఉన్నాయి
ఐఎంజీ భారతకు భూ కేటాయింపుపై పిటిషనర్ల వాదన
సీబీఐ విచారణకు ఆదేశిస్తేనే అక్రమ భూకేటాయింపు
వెనకున్నవారు తేలతారని వెల్లడి
తీర్పు రిజర్వు చేసిన తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్)కు భూముల అక్రమ కేటాయింపుపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సిద్ధంగా ఉన్నప్పుడు అనధికారిక ప్రతివాదులు (బిల్లీరావు, మాజీ మంత్రి పి.రాములు)కు అభ్యంతరమెందుకని హైకోర్టులో పిటిషనర్లు ప్రశ్నించారు. భూముల కేటాయింపు అక్రమమని ఇదే హైకోర్టు తేల్చిందని, అయితే ఆ అక్రమాలకు, అవినీతికి పాల్పడిన వారెవరో నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు.
సీబీఐ విచారణ చేపడితే నిందితులుగా మారబోయే వారికి విచారణ వద్దు అని వాదించే హక్కు లేదని తేల్చిచెప్పారు. 12 ఏళ్ల క్రితం దాఖలైన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో వాదనలు పూర్తి కావడంతో సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. ‘హైదరాబాద్ పరిధిలో రూ.వేల కోట్ల విలువైన (ప్రస్తుత విలువ రూ.లక్ష కోట్లు) 850 ఎకరాల ప్రభుత్వ భూములను ఓ బోగస్ కంపెనీకి నాటి చంద్రబాబు ప్రభుత్వం కారుచౌకగా కేటాయించింది. ఆ కంపెనీకి రూ.వందల కోట్ల రాయితీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్‌లోని క్రీడా స్టేడియంలు కూడా అప్పగించింది.
దీని వెనుక చంద్రబాబు సర్కార్ పెద్దలు ఉన్నారు. బోగస్ కంపెనీకి ఇన్ని వందల ఎకరాలు, రూ.వందల కోట్లు ఎందుకు కేటాయించారు.. దీని వెనకున్న వారెవరో తేలాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి..’అని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, న్యాయవాది శ్రీరంగారావు తదితరుల తరఫు న్యాయవాదులు రఘునాథ్‌రావు, గాడిపల్లి మల్లారెడ్డి 2012లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
అక్రమాలను అధికారుల కమిటీ తేల్చింది..
శ్రీరంగారావు తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘భూ కేటాయింపులో అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమి టీ 2006లో తేల్చింది. ఈ నివేదిక మేరకు నాటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్ భూముల కేటాయింపు రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. దీనిపై బిల్లీరావు పిటిషన్ దాఖలు చేయగా, భూ కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఇదే హైకో ర్టు ఈ ఏడాది మార్చిలో ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. రూ.లక్ష కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూ ముల అప్పగింత విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.
అక్రమాల వెనకున్న వారెవరో తెలియాలంటే సీబీఐతో పార దర్శక దర్యాప్తు జరిపించాల్సిందే. రాజకీయ దురుద్దేశాలతో ఈ పిల్‌లు దాఖలయ్యాయని చెప్ప డం హాస్యాస్పదం. శ్రీరంగారావుకు ఏ పార్టీతోనూ ఎలాంటి సంబంధాలు లేవు. పిటిషనర్లే కాదు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీబీఐ విచారణ కోరిన విషయాన్ని మరవద్దు. భూ కేటాయింపుపై విచారణ జరిపించాలని కేంద్రానికి వినతిపత్రం సమర్పించాం. ఎలాంటి స్పందన లేకపోవడంతోనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది..’అని వెల్లడించారు. ఏబీకే తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, ప్రముఖ జర్నలిస్ట్‌గా సుపరిచితులని చెప్పారు.
కాగా ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ కేసు గానీ, ఫిర్యాదు గానీ నమోదు కాని అంశంలో సీబీఐ విచారణ చేయడం సరికాదని బిల్లీరావు తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు. మాజీ మంత్రి పి.రాములు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం తీర్పు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment