ఐఎంజీ భారత సంస్థకు అక్రమ భూ కేటాయింపుపై దర్యాప్తు చేస్తాం..
వెనుక ఉన్న వారెవరో తేలుస్తాం.. తెలంగాణ హైకోర్టుకు తెలిపిన సీబీఐ
సాక్షి, హైదరాబాద్: ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్)కు అక్రమంగా భూములు కేటాయించడంపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ హైకోర్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తెలిపింది. కోర్టు ఆదేశిస్తే నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై విచారణ చేపడతామని పేర్కొంది.
అక్రమ భూ కేటాయింపు వెనుక ఉన్న వారెవరో తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తునకు తాము ఎప్పుడూ వెనకడు గు వేయలేదని, వసతుల లేమి కారణంగా ప్రాథమిక విచారణ సీబీసీఐడీతో చేయిస్తే, తదుపరి దర్యాప్తు తాము చేపడతా మని చెప్పామని, అదే విషయం ఈ కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లోనూ వెల్లడించామని వివరించింది.
‘హైదరాబాద్ పరిధిలో రూ.వేల కోట్ల విలువైన (నేటి విలువ ప్రకారం రూ.లక్ష కోట్లు) 850 ఎకరాల ప్రభుత్వ భూములను కారుచౌకగా ఓ బోగస్ కంపెనీకి నాటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. ఆ కంపెనీకి రూ.వందల కోట్ల రాయితీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ లోని స్టేడియాలు కూడా అప్పగించింది. దీని వెనుక చంద్రబాబు సర్కార్ పెద్దలు ఉన్నారు.
బోగస్ కంపెనీకి ఇన్ని వందల ఎకరాలు, రూ.వందల కోట్లు ఎందుకు కేటాయించారు? దీని వెనకున్న వారెవరో తేలాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి..’అని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, న్యాయ వాది శ్రీరంగారావు 2012లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖ లు చేశారు.
నాటి నుంచి ఈ పిటిషన్లపై విచారణ సాగుతూనే వస్తోంది. తాజాగా బుధవారం ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాస్‌రావు ధర్మాసనం ఈ వ్యాజ్యాల పై మరోసారి విచారణ చేపట్టింది.
విచారణకు అభ్యంతరం లేదు: సీబీఐ
సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ.. ‘కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధంగా సీబీఐ ఉంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సొనెల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ), సీబీఐ అఫిడవిట్ కూడా దాఖలు చేశాయి. విచారణ చేపట్టడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. అత్యంత భారీ కుంభకోణమైన ఐఎంజీ భారత్‌కు భూ కేటాయింపుల వెనుక ఎవరున్నారో తేల్చేందుకు సిద్ధంగా ఉన్నాం..’అని చెప్పారు.
అసలేంటీ కేసు
క్రీడాభివృద్ధి పేరిట ఐఎంజీ భారత్‌కు 2003లో మామిడిపల్లి, శేరిలింగంపల్లిలో 850 ఎకరాల అత్యంత విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 450 ఎకరాలకు సేల్‌డీడ్ కూడా చేసి ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలోని స్టేడియాలను ఆ సంస్థకే అప్పగించింది. అలాగే నిర్వహణ కోసం రాయితీలు ఇస్తూ ఒప్పందం చేసుకుంటూ జీవోను విడుదల చేసింది. అయితే తర్వాత వ చ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో, అదీ ఆ సంస్థ పెట్టిన నాలుగు రోజుల్లోనే భూములు ఇవ్వడాన్ని ఆక్షేపించింది.
ఎలాంటి క్రెడిబులిటీ లేని సంస్థకు స్టేడియాలు, రాయితీలు ఇవ్వడం ప్రజా ధనం దుర్వినియోగం కిందకే వస్తుందని భావించి ఒప్పందాన్ని, జీవోను రద్దు చేసింది. దీనిపై బిల్లీరావు హైకోర్టులో పిటిషన్ వేయగా.. వైఎస్సార్ ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. ఆ భూములను స్వా«దీనం చేసుకోవాలని 2024 మార్చిలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇదే అంశంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ పలు పిల్స్ దాఖలు కాగా, వాటిపై విచారణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment