‘డిజిటల్’ తీరాన ‘నల్ల’ నావ
‘డిజిటల్’ తీరాన ‘నల్ల’ నావ
Published Sat, Dec 10 2016 10:55 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
జాతిహితం
నరేంద్ర మోదీ ప్రభుత్వం సృష్టించిన నేటి గందరగోళ పరిస్థితి దేశానికి స్వాతంత్య్రం లభించిన తొలిరోజుల నాటి ఓ కథను గుర్తుకు తెస్తోంది. మన ప్రథమ రక్షణ మంత్రి, ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు సర్దార్ బల్‌దేవ్‌సింగ్ (1902–61), ప్రధాని నెహ్రూలపై పరిహాసోక్తులను విసరడానికి కుష్వంత్ సింగ్ ఎన్ని కథలైనా అల్లేవారు. హాస్యానికి తావు లేని ఈ రోజుల్లో నాకు అలాంటి లైసెన్స్ లేదనుకోండి. దేశవిభజన తదుపరి నెలకొన్న గందర గోళాన్ని, భారీ ఎత్తున సాగిన వలసలను, కశ్మీర్‌లో రేగిన యుద్ధాన్ని బల్‌దేవ్‌సింగ్ నిభాయించుకువచ్చిన తీరు అద్భుతం. అయినా కుష్వంత్ సింగ్ ఆయన గురించి మహదానందంతో ఓ కథ చెప్పేవారు.
సర్దార్ బల్‌దేవ్ సింగ్‌కు ఎంతగా తీరుబడి లేకుండా పోయిందంటే, రక్షణమంత్రి అయ్యాక కొన్ని నెలలకు రోపార్‌లోని (నేటి రూపానగర్) తల్లిని చూడటానికి వెళ్లలేక పోయారు. ‘‘నువ్వు ఓ పెద్ద మంత్రివి అయినందువల్ల ఒరిగిందేమిటి? అని అంతా అడుగుతున్నారు. ఇంగ్లిషువాళ్లు వెళ్లిపోయాక చిల్లరకు ఎంతో కటకటై పోతోంది, జనం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మంత్రైన నా కొడుకు దీనికి ఏమైనా చేయగలడా?’’అని తల్లి నిలదీసింది. ఢిల్లీకి తిరిగొచ్చాక రక్షణ మంత్రి తల్లి చిల్లర సమస్యను తీర్చేయాలని అనుకున్నారు. తన జీతాన్ని చిల్లర నాణేలుగా మార్చి సాధ్యమైనంత చిల్లర దాచాలని ప్రయత్నించారు. ఒకటి లేదా రెండు ట్రంకు పెట్టెల నిండా చిల్లరను కూడబెట్టాక సగర్వంగా వాటిని తల్లికి పోస్టల్ మనియార్డర్ చేశారు.
తలకిందులైన నల్లధనంపై పోరు
కుష్వంత్‌సింగ్ ఇప్పుడు ఉండివుంటే నాటి రక్షణ మంత్రి చిల్లర కష్టాన్ని, నల్లధనంతో మోదీ ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని పోల్చి అంతకు మరింత ఎక్కువ నవ్వు తెప్పించేవారు. రద్దు చేసిన కరెన్సీ నోట్లన్నీ బల్‌దేవ్‌సింగ్ ట్రంకు పెట్టెల్లో దాచిన చిల్లరలాగే ఉన్నాయి. ఒక సర్వసత్తాక దేశం మొత్తం నగదులో 86 శాతాన్ని పనికిరానిదిగా చేసే పనిని ఇంతవరకు ఏ ప్రజా స్వామిక దేశమూ చేయలేదు. ఇంతటి భారీ చర్యను చేపట్టింది దేనికంటే ప్రజలు నగదు రహిత డిజిటల్ లావాదేవీలు జరిపేలా చేయడం కోసం. ఇది ట్రంకు పెట్టెలతో చిల్లరను తల్లికి పంపడం లాంటిది ఎంతమాత్రమూ కాదు. అత్యంత తీవ్రమైన హేతువిరుద్ధమైన పని. కాకపోతే మనందరి మీదా జోకులు పేలుతున్నాయంతే.
బహిరంగ చర్చను నల్లధనం మీది నుంచి, డిజిటల్ ధనం మీదికి మరల్చి హఠాత్తుగా శీర్షాసనం వేయించారు. ప్రజలను ఒప్పించగల ప్రధాని అమోఘ వాక్చాతుర్యం, ప్రజాభిప్రాయాన్ని నియంత్రించడంపై ఆయనకున్న అధికారాలదే ఈ ఘనత. బహిరంగ చర్చను అలా దారి మళ్లించడంతో పాటే ఆర్థిక మంత్రి సేవా పన్ను తగ్గింపులు, ప్రభుత్వం లేదా రైల్వేలు, జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టోల్స్, పెట్రోలు పంపులు వంటి ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే అమ్మే ఆవశ్యక వస్తు, సేవల డిజిటల్ చెల్లింపులకు తగ్గింపు రేట్లు వగైరా రాయితీల జాబితాను ప్రకటించారు. దీని నుంచి రెండు ముఖ్య ప్రశ్నలు తలెత్తుతాయి. ఒకటి, చెల్లింపులను డిజిటలైజ్ చేయడం గొప్ప విషయమే కానీ...
మీకు కావాల్సింది అదే అయితే, మొత్తం ఆర్థిక వ్యవస్థకు 1,100 వోల్టుల షాక్‌లాంటి పెద్ద నోట్ల రద్దు ఎందుకు? ఈ ప్రోత్సాహ కాలు, తగ్గింపులు, అవసరమనుకుంటే డిజిటల్ చెల్లింపులన్నిటిపైనా స్వల్ప మైన ఆదాయపు పన్ను రాయితీని ఇస్తే సరిపోయేదిగా? ఇక రెండవది నైతిక పరమైన ముప్పునకు సంబంధించినది. నేటి మన 130 కోట్ల జనాభాలో 2.5 నుంచి 3 శాతమే డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. మరి ఇంకొంత శాతం ఈ–వ్యాలెట్లను వాడుతుండొచ్చు. ఏదిఏమైనా సమాజం లోని ఆర్థికంగా ఉన్నతస్థాయి వర్గానికి చెందిన ఇలాంటి వారంతా కలిసి 4 నుంచి 6 కోట్ల వరకు ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వ రంగం రాయితీలు ఇస్తున్నది వీరికే. లేదా ఇప్పటికే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారికే ప్లాస్టిక్ ఆర్థిక వ్యవస్థ అనే విశేష సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఆర్థికంగా నిర్లక్ష్యానికి గురవుతున్న అ«ధిక సంఖ్యాకుల కంటే ఇప్పటికే వారికి ఎక్కువ ప్రతిఫలం దక్కుతోంది.
ప్లాస్టిక్ సత్యం
పెద్ద నోట్ల రద్దు కంటే ఎక్కువ ఊహాత్మక వైఖరిని చేపట్టాలంటే లోతుగా ఆలోచించడం అవసరమయ్యేది. కానీ ఊపిరిç Üలపని ఈ రోజుల్లో లోతుగా ఆలోచించడం కష్టమే. గత వారం, సరిగ్గా మెజగాన్ డ్రై డాక్‌లో ఐఎన్‌ఎస్ బెత్వా అనే 3,800 టన్నుల ఫ్రిగేట్ దొర్లిపడ్డ రోజునే, రక్షణ మంత్రిత్వ శాఖ.. మరుసటి రోజున రక్షణమంత్రి తమ శాఖకు చెందిన అధిపతులకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ గురించి పాఠాలు నేర్పుతారని ప్రకటించింది. అయితే నాకు బాగా నచ్చినది మాత్రం.. మన సమాచార సాంకేతిక శాఖా మంత్రి తెలం గాణలో పర్యటిస్తూ పంక్చర్ రిపేర్ షాపు నడుపుకునే గంగయ్య పేటీఎం చెల్లింపులను స్వీకరిస్తున్న వైనాన్ని మహోత్సాహంతో తన మంత్రివర్గ సహచరులొకరితో సహా ప్రపంచానికి ట్వీటర్ ద్వారా చాటడమే. కనీసం రెండు త్రైమాసికాల వృద్ధిని నాశనం చేసినది, పదుల కోట్ల మంది ప్రజలను వేధిస్తున్నది, ఆర్‌బీఐ వంటి గొప్ప సంస్థ పనిని దిగజార్చినది తెలివిమాలిన మన భారతీయులకు జీవితం అంటే ప్లాస్టిక్కేనని నచ్చజెప్పాలన్న ఆలోచనే, అద్భుతం (బార్బీ గర్ల్ ఆ సత్యాన్ని ఎన్నడో చెప్పింది, మనం పట్టించుకో లేదు). బార్బీ ప్రపంచంలోనే కాదు నిజ జీవితంలో కూడా ఇది అద్భుతమే.
సాహసోపేతమైన ఈ చర్యను ప్రధాని ప్రకటించిన రాత్రి మనం ఉద్వి గ్నులమయ్యాం. నిర్ణయాత్మకమైన ఇలాంటి పని శైలిని చూసి మన ఊహాత్మ కత ఉత్తేజితమైంది. దీనికి తగ్గట్టుగా ప్రధాని ముందస్తు కసరత్తును పూర్తి చేశారని, నగదు రూపంలోని నల్లధనం సమాచారాన్ని సేకరించి, సరిపడే టన్ని కొత్త నోట్లను సిద్ధం చేసి పర్యవసానాలను ఎదుర్కొనడానికి సిద్ధమై బరిలోకి దిగారని మనమంతా అనుకున్నాం. చలామణిలోని నోట్లలో పెద్ద మొత్తంలో దొంగనోట్లు ఉన్నాయనే కచ్చితమైన ఆధారాలను గూఢచార సంస్థలు, ద్రవ్య నిపుణులు ఆధారాలు చూపి ఉంటారని లక్ష్యిత దాడి అనే భావన, కనీసం తక్షణమే అయినా ఉత్తేజితంచేసేది, ఆకట్టుకునేది. అక్కడే మనలో చాలా మందిమి పొరబడ్డాం.
ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోలేరా?
మనమంతా (నాతో సహా) పప్పులో కాలేశామనేది ఇప్పుడు స్పష్టమే. ఏ ఈ విషయాన్నీ దాచలేకపోవడానికి అలవాటు పడ్డ ప్రభుత్వం ఎంత విజయ వంతంగా ఈ రహస్యాన్ని దాచి ఉంచిందా అని ఉప్పొంగిపోయాం. అది అంత రహస్యంగా ఉండటానికి కారణం ప్రభుత్వానికి కూడా అది తెలియక పోవడమే అని ఇప్పడు మనకు తెలుసు. మంత్రివర్గ సమావేశంలో లేదా అత్యున్నత స్థాయిలోని కొందరు మంత్రుల ముందైనా చర్చకు తేకుండా నిర్ణయాన్ని ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందే మీరు వారికి చెప్పా రంటే... మీరు నల్లధనం దాచిన వంచకులపైనే కాదు దురదృష్టవశాత్తూ మీపైన కూడా ఊహించని రీతిలో మాటలదాడికి పాల్పడుతున్నారన్న మాట. మంత్రివర్గ సహచరులతో ఈ విషయాన్ని చర్చించడమంటేనే బయటకు పొక్కుతుందనుకుంటే సమస్యే. మరి వారి చేత పదవీ స్వీకారానికి, అధికారిక రహస్యాల రక్షణకు వాగ్దానం చేయించింది ఎందుకు? మంత్రివర్గ వ్యవస్థ, సమష్టి బాధ్యత ఎందుకు? అత్యున్నత స్థాయిలోని పదిమంది లేదా నలుగురు కేంద్ర క్యాబినెట్ మంత్రులను కూడా మీరు నమ్మలేరా? అలా అయితే మీరు యుద్ధానికి దిగడానికి ముందు సంప్రదించేది, మేధో మథనం సాగించేది, విశ్వాసంలోకి తీసుకునేది ఎవరిని?
ప్రధాని సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవడం పట్ల ప్రజల్లో ఇంకా ప్రశంసా భావం విస్తృతంగా ఉన్నమాట నిజమే. క్యూలలో నిలబడుతున్న దిగువ మధ్యతరగతి, పేద వర్గాలలోని అధికులలో అది ఉండటమే విచిత్రం. ఓ నెల తదుపరి, ఇదేమిటా అని వారు గందరగోళపడుతున్నారు. అయినా దశాబ్దాల యథాతథవాదుల పాలన తర్వాత ఇంత నిర్ణయాత్మకంగా ఉండే నాయకుడు వచ్చినందుకు విస్మయం చెందుతున్నారు. ఆయన తమను ఈ కరెన్సీ యుద్ధంలోకి దించడానికి ఏదో కారణం ఉండే ఉంటుందని, ఈ ప్రమా దానికి తగిన ప్రతిఫలం ఏదో అందబోతోందని వారు భావిస్తున్నారు. వారు ఆశించేది కేవలం డిజిటల్ చెల్లింపులకు పరివర్తన మాత్రమే కాదనేది ఖాయం. నల్లధనాన్ని హతమార్చడానికి బయల్దేరి చివరకు ఇది పేటీఎంను తగిలించ డంతో ముగియడం చిల్లరను మనియార్డర్ ద్వారా పంపడం లాగా హాస్య భరితమైనదేమీ కాదు. అందులో అర్ధభాగం తెలివితో కూడినది కూడా.
తాజా కలం : ఎంతటి ఘోర నిర్లక్ష్యాన్నయినా సాహసం– ఘనత నిండి నదిగా చక్కగా మలిచి చూపిస్తే ప్రతిఫలం లభిస్తుందని చరిత్ర రుజువు చేస్తుంది. క్రిమియా యుద్ధంలో ద లైట్ బ్రిగేడ్‌ను నడిపిన ఎర్ల్ ఆఫ్ కార్డి గాన్‌ను సత్కరించి, బహుమానాలిచ్చి, పదోన్నతిని కల్పించారు. ఆ యుద్ధాన్ని ఆశ్వికదళ సాహసోపేతపు అజరామర మైన పోరుగా కవి టెన్నిసన్ కీర్తించాడు. కాగా, సుప్రసిద్ధ యుద్ధ నిపుణుడు నార్మన్ డిక్సన్ దాన్ని ‘‘అది అద్భుతమేగానీ యుద్ధం కాదు, వెర్రిబాగులతనం’’ అన్నాడు. అయినా దాన్ని గొప్పదిగా చెప్పడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధంలో సామ్, ఫ్లాండర్స్ యుద్ధరంగాలలో ఊచకోతకు గురయ్యే వరకు అది బ్రిటిష్ ఆశ్వికదళాలను ఉత్తేజితపరుస్తూనే వచ్చింది.
- శేఖర్ గుప్తా
twitter@shekargupta
Advertisement
Advertisement