నిరశన ఫలితం ఏమిటి? | Is indefinate fast of Irom sharmila worked? | Sakshi
Sakshi News home page

నిరశన ఫలితం ఏమిటి?

Published Sat, Aug 20 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

నిరశన ఫలితం ఏమిటి?

నిరశన ఫలితం ఏమిటి?

జాతిహితం
అన్నా హజారే క్షేమంగా ఉన్నారు. అలాగే ఆయన అనుచరులకు మంచి అవకాశాలు కూడా కల్పించారు. వారంతా ఇప్పుడు ప్రభుత్వ పదవులలో ఉన్నారు. కొందరు ఎన్నికలలో నెగ్గారు. ఒకరైతే నెస్లేకు పోటీగా ఒక కార్పొరేట్‌ ప్రపంచాన్ని నిర్మించారు. మరొకరు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిపదవి చేపట్టారు. ఆ పవిత్ర గణకుడు ఈ ప్రభుత్వం హయాంలోనే పదవీ విరమణానంతర కానుకగా రెండు పనులు మంజూరు చేయించుకున్నాడు. వీరిలో ఎవరూ అన్నా హజారేను మర్యాదకు కలుసుకుని రావాలని కూడా అనుకోవడం లేదు.

ఇరోమ్‌ షర్మల కథలో ఇటీవల వచ్చిన మలుపు, అరవైల నాటి దేవానంద్‌ నిర్వచనాత్మక సినిమా గైడ్‌ను ఎందుకు గుర్తుకు తెస్తోంది? ఇక్కడ దిగ్గజం అన్న మాటలకు బదులు నిర్వచనాత్మక అన్న పదమే ప్రయోగిస్తున్నాను. ఎందుకంటే ఆ అలంకారాన్ని ఇష్టారాజ్యంగా ఉపయోగించారు. అజ్మీర్‌ దర్గా ప్రస్తావన దగ్గర కూడా ఆ రూపకాలంకారాన్నే ఉపయోగించిన దరిమిలా నేను నా న్యూస్‌రూమ్‌నుంచి దానిని నిషేధించాను. మనందరం అరవైలలో పుట్టిన వాళ్లమే కాబట్టి గైడ్‌ చిత్రమే గుర్తుకు రావాలి. అరవైయ్యో దశకం సంక్షుభితమైనది. అంతేకాదు, రాజకీయాల మీద ఆమరణ నిరాహారదీక్షల ముద్రను కూడా వదిలివెళ్లింది.


 ఆర్‌కె నారాయణ్‌ రాసిన నవల ఆధారంగా అదే పేరుతో నిర్మించిన సినిమా గైడ్‌. అందులో దేవానంద్‌ తన ప్రియురాలు వహీదా రెహమాన్‌ను దగా చేసినందుకు, ఆమె సంతకాలను ఫోర్జరీ చేసినందుకు జైలుశిక్ష అను భవించి తరువాత ఇంటికి వెళ్లడానికి సంకోచిస్తాడు. మహరాష్ట్రలో తరుచు దుర్భిక్షాలకు గురయ్యే ఒక గ్రామంలోని ఆలయంలో తలదాచుకుంటాడు. ఆ గ్రామీణులు అతడిని చూసి ఆ యువ సాధువు, వర్షం కురిపించడానికి తమ గ్రామానికి దేవుడు పంపించినవాడిగా భావిస్తారు. అయితే అతడు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటేనే వానదేవుడు కరిగి జల్లులు వర్షిస్తాడు. ఇంతకీ గ్రామీణులు తాము విన్న ఒక జానపద కథ ఆధారంగా ఇలాంటి భావనకు వస్తారు. అయితే దేవానంద్‌– అంటే ఆ సినిమాలో పాత్ర రాజు; తాను ఎంతమాత్రం దైవం పంపించిన వాడిని కాదనీ, పైగా శిక్ష పడినవాడిననీ మొత్తుకుంటాడు. అయినా ఎవరూ విశ్వసించరు. చివరికి బలవంతంతో ఇష్టం లేకపోయినా నిరాహార దీక్షకు దిగుతాడు. మధ్య మధ్యలో వచ్చే బలమైన ఫ్లాష్‌బ్యాక్‌లలో రాజు తనతో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. నిజానికి అతడు జీవించాలని కోరుకుంటాడు. ఆఖరికి తన ఎదురుగా ఉంచిన దేవుడి ప్రసాదాన్ని తస్కరించడానికి కూడా వెనుకాడడు. అది తప్పు అని తెలిసినా ఆ చాపల్యం నుంచి తప్పించుకోలేక పోతాడు. ‘ఆ మేఘాల మనసులో ఉన్నదానికీ, దహిస్తున్న నా ఆకలికీ సంబంధం ఎందుకు ఉండాలి?’ అని ఒక సందర్భంలో తనలో తాను మాట్లా డుకుంటూ అనుకుంటాడు. అతడు హీరో కాబట్టి  జానపద కథను నిజం చేస్తూ సరిగ్గా సమయానికి వర్షం కురుస్తుంది.


ఇదంతా అర్థ శతాబ్దం నాటి ఘట్టం. ఇదంతా ఒక సినిమా దశ్యం. కానీ కాలం మారిపోయింది. మంచి ఆశయాలు కలిగిన వారు, పరిస్థితులకు బలైనవారు, సామాజిక ఒత్తిడులతో ఉన్నవారు, కీర్తి కండూతితో ఇప్పటికి కొందరు ఆమరణ నిరాహార దీక్ష పేరుతో అలాంటి బలవంతపు నిరశన వ్రతాలకు తలొగ్గి, ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. అన్నా హజారే దీనినే అన్షాన్‌ అంటారు. అయితే ప్రాణాలు పోగొట్టుకోవడం వీరిలో ఎవరికీ ఇష్టం లేదు.Sసరిగ్గా ఇలాంటి ఆలోచనే షర్మిలకు వచ్చింది. చెదిరిన జుట్టు, ముక్కు పుటాల గుండా వెళ్లే గొట్టం, ఒడిలిన ముఖంతో ఉండే షర్మిల ఒక లక్ష్యానికి ప్రతీకగా కనిపిస్తుంది. అది చెప్పుకోదగిన లక్ష్యమే. ఇంకా చెప్పాలంటే ఆ ఒక్క కారణంతోనే మొత్తం కెరీర్‌ను మలుచుకున్న వారికి కూడా గొప్ప లక్ష్యమే. అలాంటి ఉద్యమకారులు, పౌర హక్కుల ఎన్జీవో సంస్థలు, పూర్తి సమయం, ఒకే అంశం తప్ప మాట్లాడని టీవీ వ్యాఖ్యాతలు తమ తమ టీవీ కార్యక్రమాలకు, అవార్డులు ఇవ్వడానికి ఆమెను పిలుస్తూ ఉంటారు. వీళ్లంతా కూడా షర్మిల ఆ కార్యక్రమాలకు అలా చెదిరిన జుట్టుతో, ముక్కులో గొట్టంతో, ఒడిలిన ముఖంతోనే రావాలని కోరుకుంటారు. అయితే ఇదే లక్ష్యంతో పనిచేస్తూనే సాధారణ ముఖంతో కనిపిస్తే చాలా కారణాల వల్ల వారికి ఆమె అంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు ముక్కులో గొట్టాలు పోయాయి. దాంతో ఇప్పుడు షర్మిలకు ఉన్న బ్రాండ్‌ విలువ పోయింది. తనను తాను చంపుకుంటున్నంత కాలం ఆమె బ్రాండ్‌కు చాలా విలువ ఉంది. ఇప్పుడు ఆమె ఎన్నికలలో పోటీ చేయాలని అనుకుంటున్నారు. మణిపూర్‌ ముఖ్య మంత్రి పదవిని చేపట్టి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించి తన ఆశయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎంత బోరుగా ఉంది! సాయు«ద దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న వాస్తవం తెలియనంత మూఢురాలా షర్మిల? లేదా మన ఊహకు అందని తెలివితేటలతో ఆలోచిస్తున్నదా? తమ పొరుగునే ఉన్న త్రిపుర ముఖ్యమంత్రి కేంద్రంతో కలసి పనిచేస్తూ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేయించేందుకు కషి చేస్తున్న సంగతయినా ఆమె పేపర్లలో చదివి తెలుసుకున్నారా? షర్మిల అభిమానులు, ఆమె మీద పొగడ్తలు కురిపిస్తున్నవారు, ఆఖరికి ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఆ భ్రమలో ఉంచినా, ఆ అంశం మీద పోరాడుతున్నది తాను మాత్రమే కాదన్న సంగతి షర్మిల తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యంలో నిరశన దీక్ష ఒక ఆయుధంగా మారినప్పటి నుంచి దీనిని తెలివైన వాళ్లు, పదవీ వ్యామోహపరులు స్వప్రయోజనాలకు వాడుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తే హిందీలో ఒక నినాదం గుర్తుకు వస్తుంది. ‘తుమ్‌ సంఘర్ష్‌ కరో, హమ్‌ తుమ్హారే సాత్‌ హై’ (నీవు ప్రాణాలు ఫణంగా పెట్టు. మేం నీ వెంటే ఉంటాం. ఇంతలోకి డొమినోస్‌ నుంచి ఒక పిజ్జా తెప్పించు. దానితో పాటు అదనపు చీజ్, డైట్‌కోక్‌ కూడా తెప్పించు).


ఇటీవల జరిగిన రెండు ఉదంతాలను చెప్పుకుందాం. అవి రెండూ కూడా గూగుల్‌ అనంతరకాలానికే కాదు, ఉపగ్రహ టీవీ యుగానికి తరువాత కాలానికి చెందినవి. ఐదేళ్ల క్రితం రామలీలా మైదాన్‌లో అన్నా హజారే నిర్వహించిన 12 రోజుల అన్షాన్‌ కార్యక్రమం గురించి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆయన తన ప్రాణాన్ని తనే కొస వరకు తెచ్చుకున్నారు. చివరిక్షణాలలో దీక్షా శిబిరం నుంచి నేరుగా ఎన్‌సీఆర్‌ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. తరువాత మరింత కోలువడానికి, ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవడానికి జిందాల్‌ ప్రకతి చికిత్సాలయానికి వెళ్లారు. ఇది యాద చ్ఛికంగా జరిగినా దేశంలో ధనికులు కొవ్వు తగ్గించుకోవడానికి ఈ చికిత్సా లయానికి వెళుతుంటారు. ఇంకా దీక్ష సాగుతూ ఉండగానే అన్నా అనుచరులు కొందరు, స్వామి అగ్నివేశ్‌ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారంటూ విమర్శలు కురిపించారు. అన్నా హజారే వాస్తవాలను పరికించడం ఆరంభించారు. అయితే పూర్తిగా కాదు. ఒక సంవత్సరం తరువాత జంతర్‌మంతర్‌ దగ్గర మరోసారి దీక్ష చేశారు. ఇతరు ముఖ్య అనుచరులు అరవింద్‌ కేజ్రీవాల్, మనీష్‌ సిసోదియా, గోపాల్‌ రాయ్‌ వంటి వారు కూడా ఆయనతో పాటు దీక్ష చేశారు. ఇదొక పదిరోజులు సాగి, తరువాత భగ్నమైంది. ఈ మధ్యనే పదవీ విరమణ చేసిన మన 24వ సైన్యాధ్యక్షుడు దీక్షను భగ్నం చేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే రాలెగావ్‌లోని అన్నా ఆశ్రమంలో గోపాల్‌రాయ్‌కీ, ఆ ఆర్మీ చీఫ్‌కీ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి మనం చూశాం. తరువాత ముంబైలో మూడోసారి అన్నా దీక్ష చేశారు. ఇది తక్కువకాలం సాగింది. దీక్షా శిబిరానికి చాలా తక్కువగా వచ్చారు. ముఖ్యమంత్రి హామీ తీసుకుని ఆయన ఆశ్రమా నికి తిరిగి వెళ్లిపోయారు. ఆ సమయంలో జరిగిన టీవీ చర్చలలో వాదించిన అన్నా అనుచరుల ముఖాలను ఆయా క్లిపింగ్‌లలో గమనించి ఉంటే, అన్నా దీక్ష విరమించడం పట్ల వారంతా ఎంత అసహనానికి గురయ్యారో అర్థమవు తుంది. అయితే ఒక్క మేధా పాట్కర్‌ మాత్రమే తన అసంతప్తిని నిజా యితీగా బయట పెట్టారు. కాబట్టి... అన్నా... తుమ్‌ సంఘర్ష్‌ కరో......


అన్నా హజారే క్షేమంగా ఉన్నారు. అలాగే ఆయన అనుచరులకు మంచి అవకాశాలు కూడా కల్పించారు. వారంతా ఇప్పుడు ప్రభుత్వ ఉన్నత పదవులలో ఉన్నారు. కొందరు ఎన్నికలలో నెగ్గారు. కొందరు నెగ్గలేదు. ఒకరైతే నెస్లేకు పోటీగా ఒక కార్పొరేట్‌ ప్రపంచాన్ని నిర్మించారు. మరొకరు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిపదవి చేపట్టారు. ఆ పవిత్ర గణకుడు ఈ ప్రభుత్వం హయాంలోనే పదవీ విరమణానంతర కానుకగా రెండు పనులు మంజూరు చేయించుకున్నాడు. అయితే వీరిలో ఎవరూ కూడా అన్నా హజారేను మర్యాదకు కలుసుకుని రావాలని కూడా అనుకోవడం లేదు. ఎంతో చరిత్రాత్మక నిరశన దీక్షగా పేర్గాంచిన ఆ దీక్ష వార్షికోత్సవం సంద ర్భంగా కూడా ఆయనను పలకరించి రావాలని భావించలేదు. తమను పద వులలో కూర్చో పెట్టినందుకు కూడా ఎవరూ ఆయనకు కతజ్ఞతలు తెలియ చేయలేదు. అలాగే జన్‌లోక్‌పాల్‌ తేవడానికి పోరాడతానని ప్రకటించినం దుకు కూడా ఆయనను అభినందించలేదు. సరే, ఇది గాంధీజీ కలలను సాకారం చేస్తామంటూ కాంగ్రెస్‌ వాదులు ప్రదర్శించే భేషజం కంటే తక్కువ భేషజమే.


మన చివరి ఉదాహరణ వర్తమానంలో కొనసాగుతున్నదానికి సంబం ధించినదే: ఉద్యమకారిణి మేధా పాట్కర్‌. తాను దీక్షకు దిగుతానంటూ ప్రభుత్వాన్ని ఎన్ని పర్యాయాలు ఆమె బెదిరించారో లెక్కించడంలో నేను విఫలమయ్యాను. నిజానికి ఆమె ఒక్కసారే దీక్షకు కూర్చున్నారు. అయితే అందులో ప్రతి దీక్షా ఆమెకు ఎలాంటి హానీ జరగకుండానే ముగిసేది. అలాగే ఆమె వేటి కోసం పోరాడుతున్నారో వాటిలో ఒక్కటి కూడా సాధించలేకపో యారు. రుతువుల ఆరంభమైనట్టే మధ్యప్రదేశ్‌లో నర్మదా నది ఒడ్డున ఎక్కడో ఆమె దీక్ష చేయబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే గుజరాత్‌ ఆమె దీక్షను అనుమతించదు. నిరాహార దీక్షలు సాగుతాయి. జలసమాధులు ఉంటాయి. తరువాత విలేకరుల సమావేశాలు ఉంటాయి. షర్మిల గుర్తించడా నికి 16 సంవత్సరాలు పట్టిన వాస్తవం, అన్నా హజారేకు మూడు దీక్షలతో ఒక మాసంలో అనుభవానికి వచ్చిన వాస్తవం మేధా పాట్కర్‌కు బాగా అర్థమైం దని అనిపిస్తుంది. సినిమా కోసమే కావచ్చు జనరల్‌ ప్యాటన్‌ చెప్పినట్టు, తమ దేశం కోసం మరణించకుండా ఎవరూ యుద్ధంలో గెలవలేరు. ఇంకో అమా యకుడు ఎవరో చనిపోయేటట్టు చేసి అతడు గెలిచాడు కూడా. కాబట్టి షర్మిల, అన్నా హజారే, లేదా మేధా పాట్కర్‌ ఎవరి నుంచి అయినా వినిపించే సందేశం ఒక్కటే – నీ ఆశయాన్ని నీవు ప్రేమించు. దాని కోసం మరణించు.- twitter@shekargupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement