రెండుసార్లు తలబొప్పి కట్టినా.. | opinion on indo pak issue by shekhar gupta | Sakshi
Sakshi News home page

రెండుసార్లు తలబొప్పి కట్టినా..

Published Sat, Oct 8 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

రెండుసార్లు తలబొప్పి కట్టినా..

రెండుసార్లు తలబొప్పి కట్టినా..

జాతిహితం
ఇప్పుడు సైనిక తిరుగుబాటు జరిగే అవకాశం చాలా తక్కువని నవాజ్‌కు తెలుసు. జరిగితే అది పాక్‌ ఏకాకితనాన్ని పరిపూర్తి చేస్తుంది. తిరుగుబాటు ఫలితంగా తలెత్తే అస్థిరత అరబ్బు దేశాలు, ఇరాన్, చైనాలు సహా ప్రపంచమంతటినీ భయపెడుతుంది. ఆ భరోసాతో నవాజ్‌ ఆర్మీ చీఫ్‌ రహీల్‌ పదవీ విరమణ వరకు తన క్రీడ తాను ఆడగలుగుతారు. ఏ గత్యంతరమూ లేని స్థితిలో, అధికార వ్యవస్థలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం పోరాడుతున్న నేతగా నవాజ్‌ను మనం చూడాలి.

అధీనరేఖను దాటి భారత సైన్యం జరిపిన దాడులు బీజేపీ, శివసేన ప్రముఖుల హోర్డింగ్‌ల తయారీలో ఉన్న చిత్రకారుల ఊహాత్మకతను బోలెడంత పెంచాయి. ప్రత్యేకించి త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో ఈ సృజన బాగా వెల్లివిరుస్తోంది. రామాయణాన్ని వస్తువుగా తీసుకుని తయారు చేసిన పోస్టర్లు బాగా సంచలనాన్ని రేపుతున్నాయి. దసరా రామ్‌లీలా వారంలో ఇది అర్థం చేసుకోదగిందే. ఇలాంటి చిత్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీరాముడు ట్రిగ్గర్‌ నొక్కనున్నడా అన్నట్టు విల్లంబులతో దర్శన మిస్తుంటే... పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పది తలలతో రావణునిగా కనిపిస్తున్నారు. మోదీని రామునిగా చిత్రీకరించడంపై ఏ వ్యాఖ్యానమూ అవసరం లేదు.

అభిమాన నేతలకు దైవత్వాన్ని ఆపాదించే హక్కు అనుచరు లకుంది. గోస్వామి తులసీదాస్‌ అంతటివాడే... మీ స్వీయ భావోద్వేగాలు మలచిన రూపంలోనే మీరు భగవంతుడ్ని చిత్రీకరించుకుంటారు అన్నాడు. ఇక రెండవ చిత్రణతోనే నాకున్న పేచీ అంతా. నవాజ్‌ను ఒక రాక్షస చక్ర వర్తితో లేదా పాక్‌ను పురాణకాలం నాటి లంకతో పోల్చడాన్ని పట్టించు కోనవసరం లేదు. కాకపోతే వాస్తవాలకు సంబంధించే ఉంది అసలు పేచీ అంతా. రావణుడు తన సామ్రాజ్యంపై నిరపేక్ష అధికారంగల నియంత, అత్యున్నత సేనానాయకుడు, అగ్రశ్రేణి సైనిక యోధుడు. వాటికన్నిటికీ నవాజ్‌ ఎంతో దూరం. తులసీదాస్‌ చెప్పినది సరైనదే అయితే... రాక్షసులను, రాక్షస రాజులను కూడా ఊహించుకోవచ్చు. కానీ నవాజ్‌ ఆ పరీక్షలో ఎంత మాత్రమూ నెగ్గలేడని అత్యంత వినయంగా మనవి చేస్తున్నాను.

ప్రతి శాంతి యత్నానికీ సైన్యం ప్రతిచర్య
నేటి చర్చలు ఏ స్థాయిలో సాగుతున్నాయో దృష్టిలో ఉంచుకుంటే ఒక పాక్‌ నేతను, సైనికుడ్ని, చివరికి సినిమా నటుడ్ని ఎవరిని తెగనాడకుండా వదిలినా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అవుతుంది. ‘‘.. ఉగ్రవాదులు రాసిచ్చే స్క్రిప్టును చదివేవారు..’’ అంటూ మన ప్రధాని ఇప్పటికే పాక్‌ ప్రధానిపై తన అభిప్రాయాన్ని కొజికోడ్‌లో వెల్లడించారు. నవాజ్‌ ఇటీవల పాక్‌ నేషనల్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటనలతో ఆయన రాక్షసీకరణను మరో మెట్టుపైకి చేర్చింది. ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌పై యుద్ధ ప్రకటన చేయడంలో కాస్త జాప్యం చేశారంతే. సైన్యం తన మాట విని నవాజ్‌ను తొలగించి తనను గద్దెపై కూర్చుండబెట్టే వరకు బహుశా వేచి చూస్తారేమో. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎన్నికల ప్రచారం నుంచి బిలావల్‌ భుట్టో.. మునుపటి భుట్టో కుటుంబీకుల లాగే రంకెలేస్తున్నారు. అయినా నా దృష్టి నుంచి తప్పి పోయి ఉంటే తప్ప బిలావల్‌ తన తాత, తల్లి మాదిరి వెయ్యేళ్ల యుద్ధం చేస్తామని భయపెట్టలేదు. యుద్ధాన్ని తలపింపజేసిన 1990 వేసవిలో (ఊగి సలాడే వీపీ సింగ్‌ ప్రభుత్వ హయాంలోని భారత్‌పై పాక్‌ మొట్టమొదటిసారిగా అణు బ్లాక్‌మెయిలింగ్‌ పాల్పడినప్పుడు) అతని తల్లి నాటి జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ జగ్‌మోహన్‌ను ముక్కలు ముక్కలుగా చేస్తామని బెదిరించింది. ఆమె మాటల్లోనే ‘‘జగ్‌మోహ న్‌ను మేం జగ్‌– జగ్‌–మో–మో–హన్‌ –హన్‌గా చేసేస్తాం...’’

జియా ఉల్‌ హఖ్‌ అనంతర కాలంలో పాక్‌కు ప్రజాస్వామ్యం ‘‘తిరిగి వచ్చిన’’ప్పటి నుంచి ప్రజలు ఎన్నుకున్న నేతల తీరు భారత్‌పైకి కాలు దువ్వేదిగానే ఉంటోంది. ఒక దశలో పాక్‌ ప్రధానులు తమ పదవీ కాలం మొదట్లో భారత్‌ పట స్నేహపూర్వక చర్యలు చేపట్టకపోలేదు. ఇస్లామాబా ద్‌లో 1988 డిసెంబర్లో బెనజీర్‌–రాజీవ్‌ల శిఖరాగ్ర సమావేశం, నవాజ్‌– వాజ్‌పేయి బస్సు ప్రయాణం, 1999 లాహోర్‌ ప్రకటన, ఆ తదుపరి భారత్‌    పట్ల రాజీవాద వైఖరిని ప్రదర్శిస్తున్న బెనజీర్‌ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం, 26/11 ముంబై దాడుల తదుపరి అసిఫ్‌ జర్దారీ అసాధారణ రీతిలో తమ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ అధిపతిని భారత్‌కు పంççపడం, దాడికి పాల్పడినవారు పాకిస్తానీలేనని పాక్‌ జాతీయ భద్రతా సలహాదారు మొహమూద్‌ దుర్రానీ ధైర్యంగా అంగీకరించడం వంటి పరిణా మాలను గమనించండి. ప్రతి ఒక్కటీ వెంటనే పర్యవసానాలకు దారితీశాయి: 1990లో బెనజీర్‌ భుట్టోను పదవి నుంచి తొలగించడం, 1999లో నవాజ్‌ పదవీచ్యుతుడై ప్రవాసానికి పోయేలా చేయడం, 2007లో బెనజీర్‌ను హత్య చేయడం, దుర్రానీని ఎన్‌ఎస్‌ఏగా తొలగించి, జర్దారీని పక్కకు తోసేయడం జరిగాయి. అంతా సామాన్యమైన ఒకే క్రమం, మినహాయింపులు లేవు.

అధికారంలో ఉన్న నిస్సహాయ నేత
మోదీ పుట్టిన రోజున ఆతిథ్యం ఇచ్చినందుకు నవాజ్‌ నెత్తిన ఏదో విపత్తు వచ్చిపడుతుందని ఊహించలేకపోతే అది మన మూర్ఖత్వమే అవుతుంది. గురుదాస్‌పూర్, ఆ తదుపరి పఠాన్‌కోట దాడులు జరిగాయి. జైషే అహ్మద్‌పై నవాజ్‌ విచారణకు ఆదేశించడంతోనే కశ్మీర్‌ లోయలో ఉగ్ర క్రీడ ప్రారం భమైంది. ఈ దఫా నవాజ్‌ పదవీ కాలం మొదట్లోనే తొలి ప్రమాద సంకేతాలు వెలువడ్డాయి. నియంత ముషార్రఫ్‌కు వ్యతిరేకంగా ఆయన సాగించిన ప్రచారం, పాక్‌లో మొట్ట మొదటిసారిగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం (జర్దారీ) పూర్తి కాలం అధికారంలో ఉండటానికి సహకరించి చూపిన విజ్ఞతల ఫలితంగా నవాజ్‌కు భారీ ఎత్తున ప్రజల మద్దతు లభించింది, నేషనల్‌ అసెంబ్లీలోని పూర్తి ఆధిక్యతను, ప్రజాభిమానం వెల్లువను ఆధారంగా చేసు కుని ఆయన దేశ రాజకీయ వ్యవస్థలో, భారత్‌తో సంబంధాలలో మౌలిక  మైన మార్పులు తేవడానికి ఆయన మహా ఉత్సాహం చూపారు. భారత్‌కు వ్యతిరేకంగా లేదా కశ్మీర్‌ను ప్రస్తావిస్తూ ఒక్క మాటైనా మాట్లాడకుండా నవాజ్, ఆయన తమ్ముడు షాబాజ్‌లు భారీ ఆధిక్యతలను సాధించారు. ఎట్ట కేలకు తనకు అవకాశం లభించిందని నవాజ్‌ అనుకున్నారు. 1965–71 సుప్ర సిద్ధ యుద్ధ యోధుల కుటుంబాల వారసత్వం, వృత్తితత్వం గల పంజాబీ ఆర్మీ చీఫ్‌ను ఆయనే ఎంచుకున్నారు. అదే ఉత్సాహంతో ఆయన, ముషా ర్రఫ్‌ను దేశద్రోహ నేరానికి బోనెక్కించడానికి ఉపక్రమించారు. కానీ వ్యవస్థా పరంగా ఇది సైన్యానికి, పాత అధికార వ్యవస్థకు ఆమోదనీయమైనది కాదు. దీంతో ఆయనపై వచ్చిన ఒత్తిడికి ముషార్రఫ్‌ను వదిలిపెట్టేయడమే కాదు, సురక్షితంగా దేశం వీడిపోనివ్వాల్సి వచ్చింది. ఇమ్రాన్‌ ఖాన్‌ను, కెనడి యన్‌ పాకిస్తానీ మతపెద్ద తాహిర్‌ ఉల్‌ ఖద్రీలను ఈ తెరవెనుక తిరుగుబాటుకు కుట్రదారులు నవాజ్‌కు వ్యతిరేకంగా రెండు పనిముట్లుగా వాడుకున్నారు. ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వాధికార కేంద్రాన్ని దిగ్బంధించి, సైన్యం ఇక వదిలి పెట్టేయమని ‘‘విజ్ఞప్తి’’  చేసే వరకు వారు కదల లేదు. క్షీణించిపోతున్న నవాజ్‌ ప్రాబల్యానికి నిదర్శనం అతని నిస్సహాయతే. ఆ గందరగోళపు నెలల్లోనే పెషావర్లో సైనికాధికారుల పిల్లల ఊచకోత జరిగింది. అది దేశాన్నం తటినీ సైన్యం వెనుక, దాని అధిపతి వెనుక సమీకరించింది. మొహజిర్‌ ఖ్వామీ ఉద్యమం (ఎమ్‌క్యూఎమ్‌), కరాచీలోని దాని సాయుధ మాఫియా లపై జరిపిన దాడులను సైన్యం దాదాపు స్వయంప్రతిపత్తిని చూపింది. అది నవాజ్‌ ప్రభుత్వాన్ని పక్కకు నెట్టేసే ప్రక్రియను పూర్తి చేసింది.

నవాజ్‌ ఇక తన క్రీడ తాను ఆడగల కాలం
ఇంతకు ముందు రెండు పర్యాయాలూ నవాజ్‌ పదవీ కాలం సైన్యం చేతుల్లో అర్ధంతరంగానే ముగిసింది. ఈసారి ఆయన అధికారంలో ఉన్నా ప్రాధా న్యమేం లేని నామమాత్రపు ప్రధానిగా తానుండగా, అధికారం మరెక్కడో ఉన్న దుస్థితి. 1985 నుంచి నేనాయన రాజకీయాలను సన్నిహితంగా గమ నిస్తున్నాను, ఆయన ఇలాగే తలవంచుకుని, మరో మూడేళ్లు ఈ అవమానాన్ని భరిస్తారంటే నేను నమ్మను. ఆయన ఏదో ఒకటి చేస్తారు. అందుకే, పాకిస్తాన్‌ ఏకాకి కాకుండా ఉండాలంటే... వెనుక పెరట్లో పాములను (భారత్, పాక్‌ లలో పనిచేసే ఉగ్రమూకలు) పెంచి పోషిస్తూ, ముందు చావిట్లో కొట్టే ప్రస్తుత వైఖరి పనికిరాదని షరీఫ్‌ సోదరులు సైన్యంతో చెప్పారనడాన్ని కొట్టిపారేయ లేను. సిరిల్‌ అల్మెడా పాక్‌ పత్రిక ‘డాన్‌’లో ఆ వార్తా కథనాన్ని వెలువరిం చారు. నేడు ఆ దేశానికి చైనా ఒక్కటే నమ్మకమైన మద్దతుదారుగా ఉంది. సున్నీ ఇస్లామిక్‌ ప్రపంచం సైతం దానితో విసిగి పోయింది. ఒక ప్రపంచ శక్తిగా చైనా రష్యాకు భిన్నంగా వ్యవహరిస్తోంది. మసూద్‌ అజర్‌ను ప్రపంచ మంతా అవాంఛనీయమైన వ్యక్తిగా భావిస్తోంది. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేసి విడుదలైన ఆ ఉగ్రవాది కోసం వీటో అధికారాన్ని ప్రయోగించడానికి చైనా సిద్ధపడదు. సిరిల్‌ కథనానికి అధికారిక ఖండన అసక్తికరమైనదని. అది ఆ కథనాన్ని కాల్పనికమైనదని, అర్థసత్యమని పేర్కొంది. దాన్ని అర్థ సత్యంగానే తీసుకుందాం. నవాజ్‌ను 1993లో, 1999లో తేలికగానే కూలదోయగలిగారు. నేడు ఆయన వద్ద ప్రయోగించడా నికి అస్త్రాలు లేకపోలేదు. 2016–17లో సైనిక తిరుగుబాటు జరిగే అవకాశం చాలా తక్కువని ఆయనకు తెలుసు. జరిగితే అది పాక్‌ ఏకాకితనాన్ని పరిపూర్తి చేస్తుంది. తిరుగుబాటు ఫలితంగా తలెత్తే అస్థిరత అరబ్బు దేశాలు, ఇరాన్, చైనాలు సహా ప్రపంచమంతటినీ భయపెడు తుంది. పూర్తి అణ్వస్త్రభరితమైన ఉపఖండం మరో ఐఎస్‌ఐఎస్‌ ప్రాంతంగా మారిపోతుందేమోననే ఊహే భయం గొలుపుతుంది. ఈ ఆలోచన ఇచ్చే భరోసాతో నవాజ్, ఆర్మీ చీఫ్‌ జన రల్‌ రాహీల్‌ షరీఫ్‌ పదవీ విరమణ వరకు తన ఆట తాను ఆడగలుగుతారు. అమెరికా, పాశ్చాత్య శక్తులు సైతం సైనిక పాలనకు సుముఖంగా లేవు. కాబట్టి అవి నవాజ్‌కు దన్నుగా నిలుస్తాయి.

సైన్యం దన్నుతో అధ్యక్షుడు ఇశ్లాఖ్‌ ఖాన్‌ 1993లో తనను పదని నుంచి తొలగించిన సందర్భంగా నవాజ్‌ ‘‘ఇదే రకం వ్యవస్థ సగం కౌజు పిట్ట, సగం పూరేడు పిట్ట’’ అంటూ పంజాబీ నానుడిని ప్రయోగించి ప్రశ్నించారు. రెండో దఫా అధికారంలోకి వచ్చాక దాన్ని సరిదిద్దుతామన్నారు. కానీ కార్గిల్‌లో, జైల్లో, ప్రవాసంలో చిక్కుకున్నారు. నాకు తెలుసు, ఆయన మూడోసారి కూడా ప్రయత్నిస్తారు. ఏ గత్యంతరమూ లేని స్థితిలో, అధికార వ్యవస్థలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం పోరాటుతున్న నేతగా నవాజ్‌ను మనం చూడాలి. సర్వశక్తివంతుడైన రావణుడు కావడానికి లేదా మూర్తిభవించిన దుష్టత్వం కావడానికి ఆయన ఇంకా చాలా చాలా దూరంలో ఉన్నారు.

 

వ్యాసకర్త : శేఖర్ గుప్తా
 twitter@shekargupta

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement