Irom Sharmila
-
ఉక్కు మహిళ ట్విన్స్ ఫోటోలివిగో..
సాక్షి, బెంగళూరు : ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల (46) కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కదా.. నిక్స్ సఖి, ఆటం తారా అనే పేర్లను పెట్టారు ఇరోమ్ దంపతులు వీరి ఫోటోలనుతాజాగా విడుదల చేశారు. పిల్లలిద్దరూ 2.15, 2.16 కేజీల బరువుగా ముద్దుగా, ఆరోగ్యంగా ఉన్నారని ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు శ్రీపాద వినెక్కర్ తెలిపారు. మల్లేశ్వరంలోని ప్రైవేట్ ఆస్పత్రి క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో సిజేరియన్ ద్వారా ఇరోమ్‌కు ఇద్దరు పండంటి ఆడబిడ్డలు పుట్టారు. అదీ మాతృదినోత్సవం రోజున ఇద్దరు ఆడబిడ్డలు పుట్టడం విశేషంగా నిలిచింది. దీంతో ఐరన్ లేడీకి అభినందనల వెల్లువ కురిసింది. మణిపూర్ రాష్ట్రంలో సాయుధబలగాల ప్రత్యేక చట్టం రద్దుచేయాలంటూ 16 ఏళ్ల పాటు నిరాహారదీక్ష చేసి ఇరోమ్ షర్మిల ఐరన్ లేడీగా ఘనతకెక్కారు. దీక్ష విరమణ అనంతరం రాజకీయాల్లో ప్రవేశించినా.. ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. 2017లో గోవాలో పుట్టి బ్రిటీష్ జాతీయత కలిగిన వ్యక్తి డెస్మండ్ కొటిన్హోను ఇరోమ్ షర్మిల వివాహమాడారు. -
మదర్స్ డే రోజు ఐరన్ లేడీకి ట్విన్స్
సాక్షి, బెంగళూరు: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ మరోసారి ఐరన్ లేడీ అని నిరూపించుకున్నారు. 46 ఏళ్ల వయసులో షర్మిల కవల పిల్లలకు జన్మనిచ్చారు. అదీ మాతృదినోత్సవం (మే 12వ తేదీ ఆదివారం) రోజున ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం విశేషం. ఈ విషయాన్ని ఆమె సన్నిహితురాలు, దివ్యభారతి సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. బెంగళూరు మల్లేశ్వరంలోని క్లౌడ్‌లైన్ గ్రూప్ ఆఫ్ హాస్పటల్లో ఆదివారం ఉదయం 9.21కి షర్మిల కవలలకు జన్మనిచ్చారనీ, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆమె తెలిపారు. వీరికి నిక్స్ సఖి, ఆటం తారా అనే పేర్లను ఖాయం చేశారు షర్మిల, డెస్మండ్ దంపతులు. ఇది తనకు కొత్త జీవితమంటూ షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. అందులోనూ మదర్స్ డే రోజు కవల ఆడబిడ్డలు కలగడం చెప్పలేని ఆనందాన్నిస్తోందన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలు కావాలని మాత్రమే తాను డెస్మండ్ కోరుకున్నామని ఆమె పేర్కొన్నారు. కాగా మణిపూర్ రాష్ట్రంలో భద్రతా దళాలకు ప్రత్యేక అధికారం అందించే చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 16 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటంతో ఉక్కు మహిళగా ఘనత కెక్కారు ఇరోమ్ షర్మిల. కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే నాజల్ ట్యూబ్ ద్వారా ఆమె ఆహారంగా తీసుకున్నారు. 2000 సంవత్సరం ఈ పోరాటాన్ని కొనసాగించారు ఆమె. ఆ తరువాత 2017 ఆగస్టులో తన ప్రేమికుడు గోవాలో పుట్టిన బ్రిటిష్ జాతీయుడు డెస్మండ్ కౌటిన్హోను ఆమె వివాహమాడారు. తమిళనాడులోని కొడైకెనాల్లో ఉంటున్నారు. సుదీర్ఘ నిరాహార దీక్ష విరమణ అనంతరం శరీరాన్ని తిరిగి పూర్తి స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు ఆమె మరో పోరాటమే చేశారు. -
నిరాడంబరంగా ఇరోం షర్మిల వివాహం
-
నిరాడంబరంగా ఇరోం షర్మిల వివాహం
సాక్షి, చెన్నై : ఉక్కు మహిళ, మణిపూర్ పౌరహక్కుల కార్యకర్త ఇరోం షర్మిల వివాహం తమిళనాడులోని కొడైకెనాల్లో గురువారం నిరాడంబరంగా జరిగింది. లండన్‌కు చెందిన డెస్మండ్ కౌటిన్హోను ఆమె వివాహం చేసుకున్నారు. తమిళనాడులోని కొడైకెనాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో షర్మిల వివాహం నిరాడంబరంగా జరిగింది. ఇరువురు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి సబ్ రిజిస్ట్రార్ సమక్షంలో పూలమాలలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇరోం షర్మిల వివాహానికి పలు సంఘాలు వ్యతిరేకించడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పోలీసు భద్రత ఏర్పాటుచేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇలావుండగా ఇరోం షర్మిల వివాహానికి డాక్యుమెంటరీ చిత్ర దర్శకులు దివ్యభారతి నేరుగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో ఫోన్ ద్వారా ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నానని షర్మిల తెలిపారు. మిగతా బంధువులకు ఆహ్వాన పత్రికలు ఇవ్వలేదని, అందుకే ఎవరూ రాలేదన్నారు. కాగా వారి వివాహాన్ని కొడైకెనాల్లో జరపకూడదంటూ హిందూ మక్కల్ కట్చి, ఉళవర్ ఉళైప్పాళర్ సహా అనేక సంఘాలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. -
‘ఐరన్ లేడీ’ పెళ్లికి తొలగిన అడ్డంకి
కొడైకెనాల్: మణిపూర్ ఉక్కు మహిళ, పౌరహక్కుల కార్యకర్త ఇరోం షర్మిల(44) వివాహానికి అవరోధం తొలగింది. బ్రిటిష్ జాతీయుడైన డెస్మండ్ కౌటిన్హోను ఆమె త్వరలో పెళ్లి చేసుకోనుందనే విషయం తెలిసిందే. అయితే, ఆమె పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మహేంద్రన్ అనే లాయర్, హక్కుల కార్యకర్త అభ్యంతరం తెలిపారు. ఆ దంపతులు ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటే ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని తమిళనాడులోని కొడైకెనాల్ సబ్‌రిజిస్ట్రార్‌కు తెలియజేశారు. దీనిపై విచారణ జరిపిన ఆయన ఆ అనుమానాలను కొట్టిపారేశారు. షర్మిల, డెస్మండ్ కౌటిన్హోల వివాహానికి, ఇక్కడ నివాసం ఉండటానికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. కౌటిన్హోతో తన వివాహానికి అనుమతి ఇవ్వాల్సిందిగా జూలై 12వ తేదీన ఇరోం షర్మిల సబ్‌రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఎలాంటి అభ్యంతరాలున్నా నెల రోజుల్లోగా ఎవరైనా తెలియజేయాల్సి ఉంది. సబ్ రిజిస్ట్రార్ తాజా నిర్ణయంతో ఆమె వివాహానికి అడ్డంకులు తొలగిపోయాయి. మరోవైపు సైనిక ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్లపాటు పోరాటం చేసిన ఉక్కు మహిళ షర్మిల గతేడాది ఆగస్టు 9న ఆమరణ నిరాహారదీక్షను విరమించారు. ఈ ఏడాది మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయగా కేవలం 90 ఓట్లే సొంతం చేసుకుని ఓటమిపాలయ్యారు. ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న షర్మిల.. మళ్లీ మణిపూర్ వెళ్లాలనుకోవడం లేదని ఇటీవల స్పష్టం చేశారు. -
మణిపూర్ ఇక నా ఇల్లు కాదు
ఉక్కు సంకల్పం ఇరోమ్ షర్మిల ఇక ఎప్పటికీ సొంతూరికి పోనంటోంది. ఊరికే కాదు, సొంతరాష్ట్రానికే పోనంటోంది. నిజమే, మణిపూర్‌ని ఆమె అమితంగా ప్రేమించింది. మణిపూర్ ప్రజల కోసమే ఇన్నేళ్లు బతికింది. ఇప్పుడు తన కోసం తాను బతుకుతానంటోంది. పెళ్లి బంధంలో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇరోమ్ చానూ షర్మిల... గడచిన పదహారేళ్లుగా పోరాడింది. ప్రత్యేక అధికారాల చట్టం ఉపసంహరణ కోసం పోరాడింది. సామాన్యులు హాయిగా రోజు గడిపే రోజు కోసం పోరాడింది. ప్రభుత్వం సాయుధ బలగాలకు కట్టబెట్టిన ప్రత్యేక అధికారాల హక్కు(ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ –ఎఎఫ్ఎస్పిఎ) కు ఎదుర్కోవడానికి ఆమె దగ్గర సైనిక శక్తి లేదు. నిరాహార దీక్షనే సత్యాగ్రహ ఆయుధంగా మలుచుకుంది. పోలీసుల ఒత్తిడులకు వెరవకుండా పదహారేళ్లపాటు నిరాహార దీక్షను కొనసాగించింది. ఆమెను అరెస్టు చేయడం, మళ్లీ విడుదల చేయడం సాధారణమైపోయింది. నిరాహార దీక్షను భగ్నం చేయడానికి చేయరాని పాట్లన్నీ పడింది మణిపూర్ ప్రభుత్వం. ట్యూబుతో ద్రవాహారంతోనే దీక్షను కొనసాగించింది షర్మిల. హక్కుల పోరాటంలో నిరాహార దీక్షకు ప్రత్యామ్నాయ మార్గంగా ఈ ఏడాది ఎన్నికల్లో పోటీచేసింది ఇరోమ్. తాను ప్రజల హక్కుల పరిరక్షణ కోసమే పోరాటం చేస్తున్నానని ఆమె గట్టిగా విశ్వసించింది. ఆ నమ్మకాన్ని మణిపూర్ ప్రజలు నిలబెడతారని ఆశించింది. కానీ ఓట్లు వందకు లోపే రావడంతో యావత్తు దేశం నివ్వెరపోయింది. ఆమె పోరాటం ఆమె కోసం కాదు, తన వాళ్ల కోసం, తనలాంటి వారి కోసం. ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక బలగాలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. అది చట్టం రూపంలో అమలవుతోంది. ఆ వెసులుబాటే స్థానికులకు దినదినగండంగా మారింది. వారి బతుకులను వారిని బతకనివ్వని దారుణాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షను తెలియచేయాలని నిరాహార దీక్షకు పూనుకుంది. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం జీవితాన్ని ఫణంగా పెట్టింది. ఎన్నికలతో మలుపు! మణిపూర్‌లో గత మార్చిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పాలి. ఎవరి బతుకులు బాగుపడడానికి తన జీవితాన్ని అంకితం చేసిందో ఆ ప్రజలే ఆమెను అక్కున చేర్చుకోలేకపోయారు. ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడం ఎవరికైనా అసాధ్యమే. ఆమెకూడా అలాగే తల్లడిల్లిపోయింది. అప్పుడు ఆమె భుజం తట్టి అండగా నిలిచాడు డెస్మాండ్ కూటిన్హో. గోవాలో పుట్టిన డెస్మాండ్ ప్రస్తుతం బ్రిటన్ పౌరుడు. ఆమెతో జీవితాన్ని పంచుకోవడానికి డెస్మాండ్ ఎప్పుడూ సిద్ధమే. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఆమెను మణిపూర్ నుంచి కొడైకెనాల్‌కు తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అక్కడే ఉందామె. గడచిన బుధవారం కొడైకెనాల్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఈ హక్కుల ఉద్యమకారులిద్దరూ తమ వివాహానికి దరఖాస్తు చేసుకున్నారు. ‘‘ఇకపై మణిపూర్‌కి వెళ్లను’’ అని, అది తన వ్యక్తిగత నిర్ణయం అని మీడియాకు చాలా స్పష్టంగా వెల్లడించింది. ఐరన్‌లేడీ తీసుకునే నిర్ణయం ఏదైనా ఉక్కులా గట్టిగానే ఉండవచ్చు. వివాహం తర్వాత! ఎన్నికల తర్వాత కొడైకెనాల్లోని పెరుమామలైలో మానసిక సాంత్వన పొందింది షర్మిల. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి వారి పెళ్లికి ఆగస్టులో అనుమతి రావచ్చు. ఆ తర్వాత పెరుమలామలై చర్చిలో పెళ్లి. రెండు మతాల వ్యక్తులు పెళ్లి చేసుకోవాలంటే నెల ముందుగా అనుమతి కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు షర్మిల, డిస్మాండ్ చేసింది అదే. పెళ్లికి మణిపూర్ నుంచి పెద్దగా ఎవరూ ఉండరని, దరఖాస్తు చేసే సమయంలో తల్లి, సోదరుడు దగ్గర ఉన్నట్లు చెప్పింది. ఇకపై తాను సాధారణ మహిళగానే జీవితాన్ని గడపాలనుకుంటున్నానని 45 ఏళ్ల షర్మిల చెప్పారు. అయితే రాబోయే సెప్టెంబరు 17 నుంచి 20 మధ్యలో ఒడిషాలో జరిగే యూత్ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. కాబోయే భర్త డెస్మాండ్తో షర్మిల -
వివాహానికి ఇరోం షర్మిల దరఖాస్తు
కొడైకెనాల్(తమిళనాడు): మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల గురువారం ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహానికి దరఖాస్తు చేశారు. కాబోయే భర్త, బ్రిటిష్ జాతీయుడు డెస్మాండ్ కౌటిన్హోతో కలిసి ఆమె హిందూ వివాహ చట్టం–1955 కింద వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసినట్లు కొడైకెనాల్ సబ్ రిజిస్ట్రార్ మీడియాకు తెలిపారు. హిందూ వివాహ చట్టం ప్రకారం మతాంతర వివాహాలను రిజిస్టర్ చేయలేమని పేర్కొన్నారు. ప్రత్యేక వివాహ చట్టం–1954 ద్వారా వివాహాన్ని రిజిస్టర్ చేయగలమని చెప్పారు. ఇందుకోసం 30 రోజుల నోటీస్ సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మళ్లీ మణిపూర్ తిరిగి వెళ్లే ఆలోచన లేదని ఇరోం షర్మిల చెప్పారు. సైనిక ప్రత్యేక అధికారాల చట్టంకు వ్యతిరేకంగా 16 ఏళ్లు పోరాటం చేశాను. కానీ ఎన్నికల్లో ప్రజలు నన్ను తిరస్కరించారు. అందుకే మళ్లీ మణిపూర్ వెళ్లాలనుకోవడం లేద’ని ఇరోం షర్మిల వెల్లడించారు. 16 ఏళ్ల నిరాహారదీక్ష చేసిన గతేడాది ఆగస్టు 9న దీక్ష విరమించారు. ఈ ఏడాది జరిగిన మణిపూర్ ఎన్నికల్లో ఆమె పార్టీ తరపున పోటీ చేసిన ముగ్గురు ఓడిపోయారు. ఇరోం షర్మిల కూడా పరాజయం పాలయ్యారు. ఆమెకు కేవలం 90 ఓట్లు మాత్రమే వచ్చాయి. -
జూలైలో ఇరోమ్ షర్మిల ప్రేమ వివాహం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల ఇంగ్లండ్‌కు చెందిన డెస్మాండ్ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. తమిళనాడులోని కొడైకెనాల్లో జూలైలో ఆమె పెళ్లి నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మణిపూర్‌లో అమల్లో ఉన్న ప్రత్యేక సాయుధ దళ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో పదహారేళ్లు నిరాహార దీక్ష చేసిన షర్మిల గతేడాది విరమించిన విషయం తెలిసిందే. అనంతరం రాజకీయ పార్టీని స్థాపించి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం ఇబోబి సింగ్‌పై పోటీ చేసి కేవలం 90 ఓట్లు పొంది ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఆమె పర్యటించి సామాజిక పోరాటాలు కొనసాగిస్తానని ప్రకటించారు. -
ఉక్కుమహిళకు పెళ్లి కుదిరింది
ఇంఫాల్: ఎన్నికల్లో ఓడిపోతే పెళ్లి చేసుకుంటానని మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించినట్టుగానే ఆ రాష్ట్ర ఉక్కు మహిళ, పోరాటయోధురాలు ఇరోం షర్మిల త్వరలో తన బాయ్‌ఫ్రెండ్ డెస్మండ్ కొటిన్హోను పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారిద్దరూ ధ్రువీకరించారు. కాగా వివాహ తేదీని ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం తమిళనాడులోని మధురైలో ఉన్న ఈ జంట అక్కడే పెళ్లి చేసుకోవచ్చని భావిస్తున్నారు. షర్మిల నిర్ణయాన్ని ఆమె సోదరుడు ఇరోం సంఘాజిత్ స్వాగతించారు. వివాహం చేసుకోవాలన్న షర్మిల నిర్ణయం తమకు సంతోషం కలిగించిందని, ఆమెకు తాము అండగా ఉంటామని చెప్పారు. షర్మిల దీక్ష చేస్తున్న సమయంలో 2011లో ఆమెకు తొలిసారి బ్రిటీష్ పౌరుడు డెస్మండ్ పరిచయమయ్యారు. తర్వాత ఇద్దరూ చాలాకాలం ప్రేమించుకున్నారు. వివాహం బంధంతో తామిద్దరూ ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నట్టు డెస్మండ్ చెప్పారు. అనుమతులు తీసుకున్నాక తమిళనాడులోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ధ్రువీకరించారు. ఈశాన్య రాష్ట్రాలలో సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలన్న డిమాండుతో 16 ఏళ్లుగా చేసిన దీక్షను షర్మిల విరమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు ఘోర పరాజయం ఎదురైంది. థౌబాల్ నియోజకవర్గంలో సీఎం ఇబోబీ సింగ్‌పై పోటీ చేయగా 90 ఓట్లు మాత్రమే వచ్చాయి. -
కేరళకు ఉక్కుమహిళ
ఇంఫాల్: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న ఉక్కుమహిళ ఇరోం షర్మిల కేరళకు వెళ్లనున్నారు. నెల రోజుల పాటు అక్కడ విశ్రాంతి తీసుకోనున్నారు. గిరిజనులు ఎక్కువగా నివసించే అట్టాప్పాడి ప్రాంతంలో ఆమె సెలవులు గడపనున్నారు. మహాదాత ఉమా ప్రేమన్ నడుపుతున్న శాంతి ఆశ్రమంలో ఆమె ఉంటారు. ప్రశాంత జీవితం గడిపేందుకు కేరళ వెళుతున్న ఆమె శాశ్వతంగా అక్కడే ఉండిపోతారా, తిరిగి వస్తారా అనేది వెల్లడి కాలేదు. నేడు(మంగళవారం) 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారా, లేదా అనేదిపై స్పష్టత ఇవ్వలేదు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(అఫ్సా) రద్దు కోసం చేపట్టిన 16 ఏళ్ల నిరాహార దీక్షను విరమించి ఎన్నికల బరిలోకి దిగిన ఆమెకు ఘోర పరాభవం ఎదురైంది. థౌబాల్ నియోజకవర్గంలో సీఎం ఇబోబీ సింగ్‌పై పోటీ చేసి ఓడిన ఆమె దయనీయంగా 90 ఓట్లు మాత్రమే వచ్చాయి. -
ఉక్కుమహిళ ఎందుకు ఓడారంటే?
న్యూఢిల్లీ: మణిపూర్ ఉక్కుమహిళ ఇరోం షర్మిల రాజకీయ ప్రవేశం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(అఫ్సా) రద్దు కోసం చేపట్టిన 16 ఏళ్ల నిరాహార దీక్షను విరమించి ఎన్నికల బరిలోకి దిగిన ఆమెకు మణిపూర్ ప్రజలు పట్టం కడతారా? దీక్షకు వచ్చిన భారీ స్పందన మాదిరే ఆమె పార్టీ ‘పీపుల్స్ రిసర్జన్స్ అండ్ జస్టిస్ అలయన్స్’కి నీరాజనం పడతారా? అన్న ఆసక్తి రేగింది. దీక్ష విరమించినందుకు కొందరు షర్మిలను విమర్శించినా.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమెకు ప్రజల నుంచి విస్తృతంగానే మద్దతు లభించింది. అయితే ఈ మద్దతు ఓట్ల రూపంలోకి మారలేకపోయింది. రాజకీయ దిగ్గజం, సీఎం ఇబోబీ సింగ్‌పై పోటీ చేసి ఓడిన ఆమె దయనీయంగా 90 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పరిస్థితి మారింది..: సాయుధ బలగాల చట్టవిరుద్ధ హత్యలు, అత్యాచారాలు జాతీయ మీడియాకు ముఖ్యమైన అంశాలే అయినా.. రాష్ట్ర ప్రజలకు మాత్రం బంద్‌లు, రోడ్ల దిగ్బంధనాలు, అభివృద్ధి లేమి పెద్ద సమస్యలుగా మారిపోయాయి. అఫ్సా రద్దు ఉద్యమానికంటే దైనందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం పెరిగింది. అఫ్సా రద్దు కోసం 16 ఏళ్ల కిందట షర్మిల ఉద్యమించినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మొబైల్ ఫోన్లు, ఇతర భద్రతా సదుపాయాల రాకతో బలగాలు గతంలో మాదిరి నిరంకుశంగా వ్యవహరించే పరిస్థితి లేదు. అలాగే, ఎన్నికలు జాతి ప్రయోజనాల ప్రాతిపదికగా జరగడం, శక్తిమంతుడైన ఇబోబీ సింగ్‌తో తలపడడం కూడా షర్మిల ఓటమికి కారణమైంది. మెజారిటీ వర్గమైన మీటీలు.. తమ వ్యతిరేకులైన నాగాలను ఎదుర్కొనే నాయకుడు ఇబోబీనే అని తలపోశారు. థౌబాల్ నియోజకవర్గంతో(ఇబోబీపై)పాటు, తన స్వస్థలమైన ఖురాయ్ నుంచి కూడా పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిల తర్వాత ఖురాయ్ నుంచి పోటీ విరమించారు. ఆమె ఓటమికి ఇదీ ఒక కారణం కావొచ్చని భావిస్తున్నారు. షర్మిల మహిళ కావడం కూడా ఆమె పరాజయానికి కారణమైందని విశ్లేషకుల అంచనా. మొత్తం 268 మంది అభ్యర్థుల్లో ఆమె సహా పదిమంది మాత్రమే మహిళలు ఉన్నారు. రాజకీయాలు పూర్తిగా పురుషుల వ్యవహారమనే భావన మణిపూర్‌లో ఉంది. షర్మిల రాజకీయాల్లోకి రాకుండా మానవ హక్కుల ఉద్యమాలకే పరిమితం కావాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
మణిపూర్‌లో పెద్దపార్టీ హస్తం
⇒ అధికారానికి 3 స్థానాల దూరంలో కాంగ్రెస్.. బీజేపీ 21 సీట్లు ⇒ కీలకంగా మారిన చిన్న పార్టీలు ⇒ షర్మిలకు దారుణ పరాభవం ఇంఫాల్: తుది నిమిషం వరకూ నువ్వానేనా అన్నట్లు సాగిన మణిపూర్‌లో ఓట్ల లెక్కింపు హంగ్‌కు దారితీసింది. 60 స్థానాలున్న అసెంబ్లీలో మేజిక్ఫిగర్ అయిన 31ని ఏ పార్టీ చేరలేదు. అధికార కాంగ్రెస్ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత ఎన్నికల్లో ఒక్కసీటూ దక్కించుకోని బీజేపీ ఈసారి 21 సీట్లు సాధించి మెరుగైన ప్రదర్శన చేసింది. ఓట్ల శాతం పరంగా చూస్తే బీజేపీ కాంగ్రెస్ కన్నా ముందంజలో నిలిచింది. 59 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ 35.1 శాతం, 60 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ 36.3 శాతం ఓట్లు సొంతం చేసుకున్నాయి. గత ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకున్న ఎన్సీపీ ఈసారి ఖాతా తెరవలేదు. శనివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యం కాంగ్రెస్, బీజేపీల చేతులు మారింది. ఇక ప్రభుత్వ ఏర్పాటులో చిన్నాచితకా పార్టీలు, ఒక స్వతంత్ర అభ్యర్థి కీలకం కానున్నారు. ది నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) , ది నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్) చెరో నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి. లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ), ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ ఒక్కో సీటును కైవసం చేసుకున్నాయి. మరో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీలు చురుగ్గా పావులు కదుపుతున్నాయి. ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు సంప్రదింపులు, చర్చలు ప్రారంభించాయి. ప్రభుత్వ ఏర్పాటుపై ఇరువర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. సారీ.. ఇరోమ్!! మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల గుర్తుందా..? ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే వర్తించే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏకంగా 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ధీర! పోలీసులు కొన్ని వందలసార్లు దీక్ష భగ్నం చేయడానికి యత్నించినా.. ప్రజల హక్కుల కోసం తన పోరాటం కొనసాగించారు. ఏళ్ల తరబడి దీక్ష చేసినా ఫలితం లేకపోవడంతో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి పీఆర్‌జేఏ పార్టీ స్థాపించారు. ఈ ఎన్నికల్లో సీఎం ఇబోబిసింగ్‌పైనే పోటీచేశారు. ...అయితే ఆమెకు ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? కేవలం 90!! దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు! ఎస్పీ నేత, యూపీ మంత్రి గాయత్రి ప్రజాపతి గుర్తున్నాడా? మహిళపై గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుడు ఇతడు. ఇదే ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేశాడు. ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? 50 వేల పైచిలుకు!! ...ప్రజాస్వామ్యంలో ఇదో విషాదం కాకపోతే మరేంటి?? -
ఘోర పరాజయం: రాజకీయాలకు గుడ్ బై
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం చవిచూసిన ఇరోం షర్మిల రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారు. నేడు వెల్లడించిన మణిపూర్ అసెంబ్లీ ఫలితాల అనంతరం ఆమె రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో ఆర్మీలకు ప్రత్యేక హక్కుల చట్టాన్ని నిరసిస్తూ ఆమె 16 ఏళ్లుగా నిరహార దీక్ష చేశారు. అయితే గతేడాదే ఆ దీక్షకు స్వస్తి చెప్పి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏఎఫ్ఎస్పీఏను రద్దుచేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పదవికి ఆమె పోటీ చేశారు. అయితే ఆమెను నివ్వెరపరుస్తూ కేవలం 90 ఓట్లే ఆమె ఖాతాలోకి వచ్చి చేరాయి. దీంతో భారీగా దెబ్బతిన్న ఇరోం షర్మిల రాజకీయాల నుంచి బయటికి వచ్చేయాలని నిర్ణయించారు. ప్రజలు తనను సపోర్టు చేయడం లేదని పేర్కొంటూ ఆమె ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేముందు కూడా పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. అవేమీ పట్టించుకోని ఇరోం షర్మిల రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్యమంత్రి ఓంకార్ ఇబోబీ సింగ్ కు వ్యతిరేకంగా తోబల్ నియోజక వర్గం నుంచి పోటీకి దిగారు. -
16 ఏళ్ల దీక్షకు 90 ఓట్లు
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇరోం షర్మిలకు షాకిచ్చాయి. నిరంతరాయంగా 16 ఏళ్ల పాటు చేసిన దీక్షకు ఆమెకొచ్చిన ఓట్లు ఇరోం షర్మిల నివ్వెరపరిచాయి. కేవలం 90 ఓట్లే ఆమెకు అనుకూలంగా వచ్చాయి. 16 ఏళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షకు స్వస్తి చెప్పిన ఇరోం షర్మిల రాజకీయాల్లోకి దిగనున్నట్టు ప్రకటించారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర సీఎం ఓంకార్ ఇబోబీ సింగ్ కు వ్యతిరేకంగా తోబల్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. అయితే సీఎం అభ్యర్థి ఇబోబీ సింగే అఖండ విజయం సాధించారు. 18,649 ఓట్లను ఆయన సొంతం చేసుకున్నారు. నోటాకు వేసినన్నీ ఓట్లు కూడా కనీసం ఇరోం షర్మిలకు రాలేదు. పైన పేర్కొన్న అభ్యర్థెలవరూ తమకు ఇష్టం లేదని పేర్కొంటూ నోటాకు 143 ఓట్లు వేశారు. గతేడాది దీక్షను విరమిస్తున్న సందర్భంగా మణిపూర్ కు ముఖ్యమంత్రిగా గెలుపొంది, ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. అయితే ప్రస్తుత ఫలితాలు ఆమె లక్ష్యాన్ని నెరవేర్చేలా లేవు. ఆర్మీలకు ప్రత్యేక హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇరోం చేసిన నిరసన దీక్షకు మద్దతిచ్చిన పలువురు మహిళా కార్యకర్తలు కూడా ఆమె రాజకీయాలకు దిగడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రచార సందర్భంగాను ఇరోం షర్మిల ఒక్కతే సైకిళ్లపై తిరుగుతూ తన పార్టీని ప్రమోట్ చేసుకున్నారు. -
ఏఎఫ్ఎస్పీఏ రద్దు చేస్తాం!
ఇరోం షర్మిల పార్టీ మేనిఫెస్టో విడుదల ఇంఫాల్: హక్కుల కార్యకర్త ఇరోం షర్మిల ఇటీవలే స్థాపించిన పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలియన్స్(పీఆర్‌జేఏ) పార్టీ మణిపూర్ ఎన్నికల కోసం తన మేనిఫోస్టోను విడుదల చేసింది. సాయుధ దళాల ప్రత్యేక చట్టం(ఏఎఫ్ఎస్పీఏ) రద్దు, మహిళలకు రిజర్వేషన్లు, అవినీతి అంతానికి లోకాయుక్త ఏర్పాటు లాంటి అంశాలకు అందులో ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థితిలో తాము ఉండకపోయినా ఈ మేనిఫెస్టో 2022 అసెంబ్లీ ఎన్నికలకు దార్శనిక పత్రంగా ఉంటుందని పార్టీ కన్వీనర్ ఇరెంద్రో లీచోన్బామ్ అన్నారు. తన 16 ఏళ్ల నిరాహార దీక్షని విరమిస్తూ... సాయుధ దళాల ప్రత్యేక చట్టం రద్దే ఏకైక లక్ష్యంగా ఎన్నికల్లో పోటీచేస్తానని షర్మిల ప్రతినబూనిన సంగతి తెలిసిందే. అమె పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో పోటీచేస్తోంది. -
మణిపూర్ సీఎంపై పోటీ చేస్తున్న ఉక్కు మహిళ
-
మరో పార్టీకి విరాళం ఇచ్చిన సీఎం
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల పార్టీకి విరాళం ఇచ్చారు. కేజ్రీవాల్ 50 వేల రూపాయలను షర్మిలకు విరాళం పంపారు. అంతేగాక ఆమెకు సాయం చేయాల్సిందిగా ప్రజలను కోరారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె పార్టీ పీఆర్‌జేఏ ఆన్లైన్ ద్వారా విరాళాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 4.5 లక్షల రూపాయలను విరాళంగా సేకరించింది. థౌబల్ స్థానం నుంచి ఆమె నామినేషన్ దాఖలుచేశారు. నామినేషన్ వేసేందుకు ఇంఫాల్ నుంచి 20 కి.మీ. సైకిల్ తొక్కి షర్మిల థౌబల్ చేరుకున్నారు. -
ఇరోం షర్మిల నామినేషన్
-
ఇరోం షర్మిల నామినేషన్
ఇంఫాల్: మణిపూర్‌లో సాయుధబలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలంటూ 16ఏళ్లు నిరాహార దీక్ష చేసిన మణిపూర్ ‘ఉక్కుమహిళ’ ఇరోం షర్మిల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు. గతేడాది దీక్షవిరమించిన షర్మిల.. పీపుల్స్ రిసర్జెన్స్ జస్టిస్ అలయన్సప్ (పీఆర్‌జేఏ) తరఫున థౌబల్ స్థానం నుంచి గురువారం నామినేషన్ దాఖలుచేశారు. నామినేషన్ వేసేందుకు ఇంఫాల్ నుంచి బయల్దేరిన షర్మిల 20 కి.మీ. సైకిల్ తొక్కి థౌబల్ చేరుకున్నారు. నాలుగోసారి సీఎం పీఠంపై కన్నేసిన సీఎం ఇబోబి సింగ్‌పైనే షర్మిల పోటీకి దిగారు. -
మరో కొత్త పార్టీ వచ్చేస్తోంది!
-
మరో కొత్త పార్టీ వచ్చేస్తోంది!
మణిపూర్ రాష్ట్రంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తొలగించాలంటూ దాదాపు 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసిన ఇరోమ్ షర్మిలా చాను.. త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారు. దానిపేరు 'పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్'. వచ్చే సంవత్సరం మణిపూర్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఈ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు. మణిపూర్ రాష్ట్రంలో తాము రాజకీయంగా ఒక మార్పును తీసుకొస్తామని, ఏఎఫ్ఎస్పీఏ లాంటి చట్టాలు ఇకమీదట సామాన్యులను ఇబ్బంది పెట్టలేవని పార్టీ ప్రకటన సందర్భంగా ఆమె అన్నారు. 2000 సంవత్సరం నవంబర్ రెండో తేదీన మొదలుపెట్టిన నిరాహార దీక్షను ఆమె గత ఆగస్టు నెలలో విరమించారు. అప్పుడే తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ''నిరాహార దీక్షను ముగించినంత మాత్రాన ఉద్యమాన్ని ఆపినట్పలు కాదు. మరో కొత్త ప్రారంభం ఉంటుంది'' అని ఆమె అన్నారు. రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి కావాలని, ఆ తర్వాత సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని నిషేధించాలని భావిస్తున్నారు. అయితే తాజా సర్వేల ప్రకారం.. మణిపూర్ రాష్ట్రంలో కూడా బీజేపీయే అధికారం చేపడుతుందని.. షర్మిలా చానుకు మద్దతు పలికేవాళ్లు కేవలం 6 శాతం మంది మాత్రమేనని తేలింది. మరి ఈ పార్టీ స్థాపించి ఆమె ఏం సాధిస్తారో.. ఎంతమేరకు ఫలితాలు రాబడతారో వేచి చూడాల్సిందే. -
ఇరోం షర్మిల నిర్దోషి
ఇంపాల్: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల(44)ను నిర్దోషిగా పరిగణిస్తూ మణిపూర్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఆమె మణిపూర్‌లో సైనిక చట్టాలకు వ్యతిరేకంగా 16 ఏళ్లు నిరశన దీక్షను కొనసాగించారు. ఆమెపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్మాయత్నం కేసును నమోదు చేశారు. దీంతో రాజకీయ పార్టీ స్థాపనకు తనకు మార్గం సుగమం అయిందని బుధవారం కోర్టుకు హాజరైన షర్మిల పేర్కొన్నారు. ఈనెలలో రాజకీయపార్టీ ఏర్పాటు చేస్తానని ఆమె ప్రకటించారు. రానున్న ఏడాది మణిపూర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని, సీఎం కావాలనే తన మనసులోని మాటను గతంలోనే షర్మిల బయటపెట్టారు. మణిపూర్‌లో సైనిక చట్టాలకు వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో షర్మిల ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ యేడాది అగష్టు 9 దీక్షను విరమించారు. -
ఇక మోదీ వద్దకు ఇరోమ్ షర్మిల పయనం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసిన తర్వాత మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవ్వాలనుకుంటుంది. ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఇరోమ్ భావిస్తోంది. ఈసారి జరగబోయే మణిపూర్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆమె మేజర్ పొలిటికల్ పార్టీలను ఎలా ఓడించాలనే అంశంపై కొన్ని సలహాలు తీసుకునేందుకు గత నెల (సెప్టెంబర్ 26)న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసింది. 'మంచి సలహాలు అనేవి ఎప్పటికీ స్వీకరించాల్సిన అంశాలు. అది స్నేహితుడైనా, శత్రువైనా అతడి వద్ద కొన్ని మంచి ఆలోచనలు ఉండి వాటిని నాతో పంచుకోవాలనుకుంటే తప్పకుండా స్వీకరిస్తాను' అని ఆమె ఓ వార్తా సంస్థతో చెప్పారు. గతంలోనే తాను మోదీని కలుస్తానన్న షర్మిల త్వరలోనే ఆయనను కలవాలని అనుకుంటోంది. గతంలో కూడా మణిపూర్ లో ఉన్న ప్రత్యేక ఆయుధాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను తీసేయాలని తాను ప్రధాని విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. -
సారం ఉంది... సినిమా వస్తే బాగుంటుంది
బయోపిక్స్...నేటి సినిమా ప్రపంచంలో సరికొత్త ట్రెండ్. బాలీవుడ్లోనే కాదు టాలీవుడ్‌లోనూ ఈ సంప్రదాయం మొదలైంది. ఇప్పటికే బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్, మహానటి సావిత్రి జీవిత చరితల ఆధారంగా చిత్రాలు తెరకెక్కుతున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా సాలా ఖడూస్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కే సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో బయోపిక్‌లుగా తెరకెక్కించే అవకాశం ఉన్న మరి కొంత మంది మహిళల జీవిత గాథలు చూద్దాం. ఇరోం షర్మిల మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందిన ఇరోం షర్మిల ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని 16 ఏళ్లపాటు నిరాహార దీక్షచేశారు. ఆమె జీవితగాథ నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయం. దీక్ష విరమించే వరకు మాటకు కట్టుబడి తన పోరాటాన్ని కొనసాగించారు. సాటి మనుషుల కోసం ఆమె చేసిన త్యాగం, పోరాట పటిమను వెండితెర మీద ఆవిష్కరించగలిగితే సినిమా చరిత్రలో ఓ మైలురాయిలా నిలిచిపోతుంది. సావిత్రి బాయి ఫూలే ఈమె ఎవరో కాదు పేదల పాలిట పెన్నిధిగా పేరొందిన మహాత్మ జ్యోతీరావు ఫూలే సతీమణి. మహిళల సంపూర్ణ వికాసం కోసం నడుం బిగించిన వీర వనిత. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను, తెరచాటున మగ్గిపోతున్న వితంతువుల జీవితాలను వెలుగులోకి తెచ్చారు. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా మరాఠీలో రెండు మూడు సినిమాలు వచ్చినా అవి జనాదరణ పొందలేకపోయాయి. మిగిలిన వాళ్లెవరైనా అనుకుంటే ఆ త్యాగమూర్తి జీవితాన్ని స్ఫూర్తిమంతంగా మలచవచ్చు. జ్యోతి రెడ్డి అనాథ కాకపోయినా అనాథ శరణాలయం ఆమె ఇల్లయ్యింది. తల్లిదండ్రులున్నా కటిక పేదరికం ఆమెను అనాథనని చెప్పేలా చేసింది. అదే పేదరికం పదోతరగతి పాసవ్వగానే తనకంటే పదేళ్లు పెద్దవాడైన వ్యక్తికి భార్యని చేసింది. అదే పేదరికం కొంతకాలం వ్యవసాయ కూలీగా బతికేలా చేసింది. సేల్స్ గర్ల్‌గా, హౌస్ కీపర్‌గా, సాఫ్ట్వేర్ రిక్రూటర్‌గా మార్చింది. చివరకు ఓ మల్టీమిలియనీర్‌గా తీర్చిదిద్దింది...జ్యోతి రెడ్డి జీవితాన్ని పదిమందికి స్ఫూర్తిమంతంగా మలిచింది. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ మహిళా విభాగానికి అధిపతిగా పనిచేశారు. త్యాగం, దేశభక్తి, ధృడసంకల్పం నిండుగా మెండుగా ఉన్న ఈమె జీవితమంతా సాహసాలమయం. నేతాజీతో కలిసి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని తెల్లదొరల అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. శ్వేత కత్తి ముంబై రెడ్‌లైట్ ఏరియాలో శ్వేత కూడా దుర్భరమైన జీవితాన్ని అనుభవించిన యువతే. ఆ వ్యభిచార కూపం నుంచి ఎలాగో బయపడి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సీఏ చదివాలన్న ఆమె ఆశయానికి రాబిన్ చౌరాసియా అనే వ్యక్తి సాయం అందించడంతో ఆమె ప్రయాణం ముంబై రెడ్‌లైట్ ఏరియా నుంచి న్యూయార్క్‌లోని బార్డ్ కాలేజీ వరకు సాగింది. బయోపిక్‌కి ఇంతకంటే మంచి కథ ఏముంటుంది..? కల్పనా సరోజ్ నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి అడుగడుగునా అవమానాలు, చీదరింపులు ఎదుర్కొని వ్యాపార సామ్రాజ్యంలో మహారాణిలా వెలుగొందుతున్న ఈమె జీవితగాథ నేటి యువతకు ఓ సందేశాత్మక పాఠం. పిడికెడు కూటి కోసం ఆరాటపడే స్థాయి నుంచి వేలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన ఆమె జీవితగాథను తెరకెక్కించాలని హాలీవుడ్ దర్శకులు ప్రయత్నించినా అవి నేటికీ కార్యరూపం దాల్చలేదు. - కిశోర్‌రెడ్డి, సాక్షి ‘భవిత’ -
ఆమె భారతీయురాలే కానీ..!
ఆమె దేశంలో పేరొందిన హక్కుల కార్యకర్త. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది మద్దతుదారులున్నారు. కానీ సొంత రాష్ట్రం మణిపూర్ లో ఆమెకంటూ ఓ గుర్తింపుపత్రం లేదు. ఆమె భారతీయ పౌరురాలు అని చెప్పడానికి ఎలాంటి చట్టబద్ధ ఆధారమూ లేదు. 16 ఏళ్ల సుదీర్ఘ నిరవధిక నిరాహార దీక్షను ఇటీవల విరమించిన 44 ఏళ్ల హక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల ప్రస్తుత పరిస్థితి ఇది. వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేకాధికారుల చట్టాన్ని రద్దు చేయాలంటూ ఉద్యమించిన ఆమె ఇటీవల తన దీక్ష విరమించి ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అవసరమైన ధ్రువపత్రాలు షర్మిల వద్ద లేవు. పాన్ కార్డు, బ్యాంకు అకౌంట్, ఓటరు కార్డు, ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలేవి ఆమె వద్ద లేవు. ఈ పత్రాలుంటేనే ఆమెను భారతీయ పౌరురాలిగా గుర్తించి ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో ఆమె పేరిట గుర్తింపుపత్రాలు తీసుకొని.. ఎన్ని కల్లో పోటీచేసేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నట్టు ఇరోమ్ షర్మిల మద్దతుదారులు చెప్తున్నారు. -
అమ్మ రావడంతో ఆశ్చర్యానికి గురయ్యా..
మణిపూర్: మణిపూర్ ఉక్కు మహిళ, హక్కుల ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిల తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఆమె తల్లి సఖి కలవడానికి రావడమే ఇందుకు కారణం. అమ్మ తనను కలడానికి రావడంతో ఆశ్చర్యానికి గురయ్యానని షర్మిల అన్నారు. మణిపూర్ లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని ఆమె పదహారేళ్లుగా నిరశన దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన తల్లి తనను కలవడానికి వస్తే మనసు మార్చుకొని దీక్షను విరమించాల్సి వస్తుందని ఆమె ఇన్నాళ్లూ తల్లికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు దీక్షను విరమించడంతో కుమార్తెను తల్లి కలిశారు. సాయుధ దళాల ప్రత్యేక చట్టానికి వ్యతిరేకంగా ఇరోమ్ షర్మిల 2000 సంవత్సరం నుంచి నిరశన దీక్షను కొనసాగించారు. ఇటీవలే ఆగస్టు 9 న తన దీక్షను విరమించారు. తాను వివాహం చేసుకుంటానని త్వరలోనే రాజకీయాలలో చేరుతానని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. -
నిరశన ఫలితం ఏమిటి?
జాతిహితం అన్నా హజారే క్షేమంగా ఉన్నారు. అలాగే ఆయన అనుచరులకు మంచి అవకాశాలు కూడా కల్పించారు. వారంతా ఇప్పుడు ప్రభుత్వ పదవులలో ఉన్నారు. కొందరు ఎన్నికలలో నెగ్గారు. ఒకరైతే నెస్లేకు పోటీగా ఒక కార్పొరేట్ ప్రపంచాన్ని నిర్మించారు. మరొకరు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిపదవి చేపట్టారు. ఆ పవిత్ర గణకుడు ఈ ప్రభుత్వం హయాంలోనే పదవీ విరమణానంతర కానుకగా రెండు పనులు మంజూరు చేయించుకున్నాడు. వీరిలో ఎవరూ అన్నా హజారేను మర్యాదకు కలుసుకుని రావాలని కూడా అనుకోవడం లేదు. ఇరోమ్ షర్మల కథలో ఇటీవల వచ్చిన మలుపు, అరవైల నాటి దేవానంద్ నిర్వచనాత్మక సినిమా గైడ్‌ను ఎందుకు గుర్తుకు తెస్తోంది? ఇక్కడ దిగ్గజం అన్న మాటలకు బదులు నిర్వచనాత్మక అన్న పదమే ప్రయోగిస్తున్నాను. ఎందుకంటే ఆ అలంకారాన్ని ఇష్టారాజ్యంగా ఉపయోగించారు. అజ్మీర్ దర్గా ప్రస్తావన దగ్గర కూడా ఆ రూపకాలంకారాన్నే ఉపయోగించిన దరిమిలా నేను నా న్యూస్రూమ్నుంచి దానిని నిషేధించాను. మనందరం అరవైలలో పుట్టిన వాళ్లమే కాబట్టి గైడ్ చిత్రమే గుర్తుకు రావాలి. అరవైయ్యో దశకం సంక్షుభితమైనది. అంతేకాదు, రాజకీయాల మీద ఆమరణ నిరాహారదీక్షల ముద్రను కూడా వదిలివెళ్లింది. ఆర్కె నారాయణ్ రాసిన నవల ఆధారంగా అదే పేరుతో నిర్మించిన సినిమా గైడ్. అందులో దేవానంద్ తన ప్రియురాలు వహీదా రెహమాన్‌ను దగా చేసినందుకు, ఆమె సంతకాలను ఫోర్జరీ చేసినందుకు జైలుశిక్ష అను భవించి తరువాత ఇంటికి వెళ్లడానికి సంకోచిస్తాడు. మహరాష్ట్రలో తరుచు దుర్భిక్షాలకు గురయ్యే ఒక గ్రామంలోని ఆలయంలో తలదాచుకుంటాడు. ఆ గ్రామీణులు అతడిని చూసి ఆ యువ సాధువు, వర్షం కురిపించడానికి తమ గ్రామానికి దేవుడు పంపించినవాడిగా భావిస్తారు. అయితే అతడు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటేనే వానదేవుడు కరిగి జల్లులు వర్షిస్తాడు. ఇంతకీ గ్రామీణులు తాము విన్న ఒక జానపద కథ ఆధారంగా ఇలాంటి భావనకు వస్తారు. అయితే దేవానంద్– అంటే ఆ సినిమాలో పాత్ర రాజు; తాను ఎంతమాత్రం దైవం పంపించిన వాడిని కాదనీ, పైగా శిక్ష పడినవాడిననీ మొత్తుకుంటాడు. అయినా ఎవరూ విశ్వసించరు. చివరికి బలవంతంతో ఇష్టం లేకపోయినా నిరాహార దీక్షకు దిగుతాడు. మధ్య మధ్యలో వచ్చే బలమైన ఫ్లాష్‌బ్యాక్‌లలో రాజు తనతో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. నిజానికి అతడు జీవించాలని కోరుకుంటాడు. ఆఖరికి తన ఎదురుగా ఉంచిన దేవుడి ప్రసాదాన్ని తస్కరించడానికి కూడా వెనుకాడడు. అది తప్పు అని తెలిసినా ఆ చాపల్యం నుంచి తప్పించుకోలేక పోతాడు. ‘ఆ మేఘాల మనసులో ఉన్నదానికీ, దహిస్తున్న నా ఆకలికీ సంబంధం ఎందుకు ఉండాలి?’ అని ఒక సందర్భంలో తనలో తాను మాట్లా డుకుంటూ అనుకుంటాడు. అతడు హీరో కాబట్టి జానపద కథను నిజం చేస్తూ సరిగ్గా సమయానికి వర్షం కురుస్తుంది. ఇదంతా అర్థ శతాబ్దం నాటి ఘట్టం. ఇదంతా ఒక సినిమా దశ్యం. కానీ కాలం మారిపోయింది. మంచి ఆశయాలు కలిగిన వారు, పరిస్థితులకు బలైనవారు, సామాజిక ఒత్తిడులతో ఉన్నవారు, కీర్తి కండూతితో ఇప్పటికి కొందరు ఆమరణ నిరాహార దీక్ష పేరుతో అలాంటి బలవంతపు నిరశన వ్రతాలకు తలొగ్గి, ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. అన్నా హజారే దీనినే అన్షాన్ అంటారు. అయితే ప్రాణాలు పోగొట్టుకోవడం వీరిలో ఎవరికీ ఇష్టం లేదు.Sసరిగ్గా ఇలాంటి ఆలోచనే షర్మిలకు వచ్చింది. చెదిరిన జుట్టు, ముక్కు పుటాల గుండా వెళ్లే గొట్టం, ఒడిలిన ముఖంతో ఉండే షర్మిల ఒక లక్ష్యానికి ప్రతీకగా కనిపిస్తుంది. అది చెప్పుకోదగిన లక్ష్యమే. ఇంకా చెప్పాలంటే ఆ ఒక్క కారణంతోనే మొత్తం కెరీర్‌ను మలుచుకున్న వారికి కూడా గొప్ప లక్ష్యమే. అలాంటి ఉద్యమకారులు, పౌర హక్కుల ఎన్జీవో సంస్థలు, పూర్తి సమయం, ఒకే అంశం తప్ప మాట్లాడని టీవీ వ్యాఖ్యాతలు తమ తమ టీవీ కార్యక్రమాలకు, అవార్డులు ఇవ్వడానికి ఆమెను పిలుస్తూ ఉంటారు. వీళ్లంతా కూడా షర్మిల ఆ కార్యక్రమాలకు అలా చెదిరిన జుట్టుతో, ముక్కులో గొట్టంతో, ఒడిలిన ముఖంతోనే రావాలని కోరుకుంటారు. అయితే ఇదే లక్ష్యంతో పనిచేస్తూనే సాధారణ ముఖంతో కనిపిస్తే చాలా కారణాల వల్ల వారికి ఆమె అంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు ముక్కులో గొట్టాలు పోయాయి. దాంతో ఇప్పుడు షర్మిలకు ఉన్న బ్రాండ్ విలువ పోయింది. తనను తాను చంపుకుంటున్నంత కాలం ఆమె బ్రాండ్‌కు చాలా విలువ ఉంది. ఇప్పుడు ఆమె ఎన్నికలలో పోటీ చేయాలని అనుకుంటున్నారు. మణిపూర్ ముఖ్య మంత్రి పదవిని చేపట్టి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించి తన ఆశయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎంత బోరుగా ఉంది! సాయు«ద దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న వాస్తవం తెలియనంత మూఢురాలా షర్మిల? లేదా మన ఊహకు అందని తెలివితేటలతో ఆలోచిస్తున్నదా? తమ పొరుగునే ఉన్న త్రిపుర ముఖ్యమంత్రి కేంద్రంతో కలసి పనిచేస్తూ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేయించేందుకు కషి చేస్తున్న సంగతయినా ఆమె పేపర్లలో చదివి తెలుసుకున్నారా? షర్మిల అభిమానులు, ఆమె మీద పొగడ్తలు కురిపిస్తున్నవారు, ఆఖరికి ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఆ భ్రమలో ఉంచినా, ఆ అంశం మీద పోరాడుతున్నది తాను మాత్రమే కాదన్న సంగతి షర్మిల తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యంలో నిరశన దీక్ష ఒక ఆయుధంగా మారినప్పటి నుంచి దీనిని తెలివైన వాళ్లు, పదవీ వ్యామోహపరులు స్వప్రయోజనాలకు వాడుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తే హిందీలో ఒక నినాదం గుర్తుకు వస్తుంది. ‘తుమ్ సంఘర్ష్ కరో, హమ్ తుమ్హారే సాత్ హై’ (నీవు ప్రాణాలు ఫణంగా పెట్టు. మేం నీ వెంటే ఉంటాం. ఇంతలోకి డొమినోస్ నుంచి ఒక పిజ్జా తెప్పించు. దానితో పాటు అదనపు చీజ్, డైట్‌కోక్ కూడా తెప్పించు). ఇటీవల జరిగిన రెండు ఉదంతాలను చెప్పుకుందాం. అవి రెండూ కూడా గూగుల్ అనంతరకాలానికే కాదు, ఉపగ్రహ టీవీ యుగానికి తరువాత కాలానికి చెందినవి. ఐదేళ్ల క్రితం రామలీలా మైదాన్‌లో అన్నా హజారే నిర్వహించిన 12 రోజుల అన్షాన్ కార్యక్రమం గురించి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆయన తన ప్రాణాన్ని తనే కొస వరకు తెచ్చుకున్నారు. చివరిక్షణాలలో దీక్షా శిబిరం నుంచి నేరుగా ఎన్సీఆర్ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. తరువాత మరింత కోలువడానికి, ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవడానికి జిందాల్ ప్రకతి చికిత్సాలయానికి వెళ్లారు. ఇది యాద చ్ఛికంగా జరిగినా దేశంలో ధనికులు కొవ్వు తగ్గించుకోవడానికి ఈ చికిత్సా లయానికి వెళుతుంటారు. ఇంకా దీక్ష సాగుతూ ఉండగానే అన్నా అనుచరులు కొందరు, స్వామి అగ్నివేశ్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారంటూ విమర్శలు కురిపించారు. అన్నా హజారే వాస్తవాలను పరికించడం ఆరంభించారు. అయితే పూర్తిగా కాదు. ఒక సంవత్సరం తరువాత జంతర్‌మంతర్ దగ్గర మరోసారి దీక్ష చేశారు. ఇతరు ముఖ్య అనుచరులు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా, గోపాల్ రాయ్ వంటి వారు కూడా ఆయనతో పాటు దీక్ష చేశారు. ఇదొక పదిరోజులు సాగి, తరువాత భగ్నమైంది. ఈ మధ్యనే పదవీ విరమణ చేసిన మన 24వ సైన్యాధ్యక్షుడు దీక్షను భగ్నం చేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే రాలెగావ్లోని అన్నా ఆశ్రమంలో గోపాల్రాయ్కీ, ఆ ఆర్మీ చీఫ్కీ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి మనం చూశాం. తరువాత ముంబైలో మూడోసారి అన్నా దీక్ష చేశారు. ఇది తక్కువకాలం సాగింది. దీక్షా శిబిరానికి చాలా తక్కువగా వచ్చారు. ముఖ్యమంత్రి హామీ తీసుకుని ఆయన ఆశ్రమా నికి తిరిగి వెళ్లిపోయారు. ఆ సమయంలో జరిగిన టీవీ చర్చలలో వాదించిన అన్నా అనుచరుల ముఖాలను ఆయా క్లిపింగ్లలో గమనించి ఉంటే, అన్నా దీక్ష విరమించడం పట్ల వారంతా ఎంత అసహనానికి గురయ్యారో అర్థమవు తుంది. అయితే ఒక్క మేధా పాట్కర్ మాత్రమే తన అసంతప్తిని నిజా యితీగా బయట పెట్టారు. కాబట్టి... అన్నా... తుమ్ సంఘర్ష్ కరో...... అన్నా హజారే క్షేమంగా ఉన్నారు. అలాగే ఆయన అనుచరులకు మంచి అవకాశాలు కూడా కల్పించారు. వారంతా ఇప్పుడు ప్రభుత్వ ఉన్నత పదవులలో ఉన్నారు. కొందరు ఎన్నికలలో నెగ్గారు. కొందరు నెగ్గలేదు. ఒకరైతే నెస్లేకు పోటీగా ఒక కార్పొరేట్ ప్రపంచాన్ని నిర్మించారు. మరొకరు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిపదవి చేపట్టారు. ఆ పవిత్ర గణకుడు ఈ ప్రభుత్వం హయాంలోనే పదవీ విరమణానంతర కానుకగా రెండు పనులు మంజూరు చేయించుకున్నాడు. అయితే వీరిలో ఎవరూ కూడా అన్నా హజారేను మర్యాదకు కలుసుకుని రావాలని కూడా అనుకోవడం లేదు. ఎంతో చరిత్రాత్మక నిరశన దీక్షగా పేర్గాంచిన ఆ దీక్ష వార్షికోత్సవం సంద ర్భంగా కూడా ఆయనను పలకరించి రావాలని భావించలేదు. తమను పద వులలో కూర్చో పెట్టినందుకు కూడా ఎవరూ ఆయనకు కతజ్ఞతలు తెలియ చేయలేదు. అలాగే జన్‌లోక్‌పాల్ తేవడానికి పోరాడతానని ప్రకటించినం దుకు కూడా ఆయనను అభినందించలేదు. సరే, ఇది గాంధీజీ కలలను సాకారం చేస్తామంటూ కాంగ్రెస్ వాదులు ప్రదర్శించే భేషజం కంటే తక్కువ భేషజమే. మన చివరి ఉదాహరణ వర్తమానంలో కొనసాగుతున్నదానికి సంబం ధించినదే: ఉద్యమకారిణి మేధా పాట్కర్. తాను దీక్షకు దిగుతానంటూ ప్రభుత్వాన్ని ఎన్ని పర్యాయాలు ఆమె బెదిరించారో లెక్కించడంలో నేను విఫలమయ్యాను. నిజానికి ఆమె ఒక్కసారే దీక్షకు కూర్చున్నారు. అయితే అందులో ప్రతి దీక్షా ఆమెకు ఎలాంటి హానీ జరగకుండానే ముగిసేది. అలాగే ఆమె వేటి కోసం పోరాడుతున్నారో వాటిలో ఒక్కటి కూడా సాధించలేకపో యారు. రుతువుల ఆరంభమైనట్టే మధ్యప్రదేశ్‌లో నర్మదా నది ఒడ్డున ఎక్కడో ఆమె దీక్ష చేయబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే గుజరాత్ ఆమె దీక్షను అనుమతించదు. నిరాహార దీక్షలు సాగుతాయి. జలసమాధులు ఉంటాయి. తరువాత విలేకరుల సమావేశాలు ఉంటాయి. షర్మిల గుర్తించడా నికి 16 సంవత్సరాలు పట్టిన వాస్తవం, అన్నా హజారేకు మూడు దీక్షలతో ఒక మాసంలో అనుభవానికి వచ్చిన వాస్తవం మేధా పాట్కర్‌కు బాగా అర్థమైం దని అనిపిస్తుంది. సినిమా కోసమే కావచ్చు జనరల్ ప్యాటన్ చెప్పినట్టు, తమ దేశం కోసం మరణించకుండా ఎవరూ యుద్ధంలో గెలవలేరు. ఇంకో అమా యకుడు ఎవరో చనిపోయేటట్టు చేసి అతడు గెలిచాడు కూడా. కాబట్టి షర్మిల, అన్నా హజారే, లేదా మేధా పాట్కర్ ఎవరి నుంచి అయినా వినిపించే సందేశం ఒక్కటే – నీ ఆశయాన్ని నీవు ప్రేమించు. దాని కోసం మరణించు.- twitter@shekargupta -
ఇరోమ్ షర్మిల బాటలో మరో మహిళ
ఇంఫాల్: మణిపూర్ లో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్ఎస్పీఏ) రద్దుచేయాలంటూ 16 ఏళ్లపాటు చేసిన నిరాహార దీక్షను ఇరోమ్ షర్మిల విరమించిన నేపథ్యంలో మరో మహిళ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆరంబం రోబిత లీమా అనే 32 ఏళ్ల మహిళ నిరవధిక దీక్షకు సిద్ధమవుతున్నారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కమ్యునిటీ హాల్ లో సోమవారం నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు రోబిత తెలిపారు. ఏఎఫ్ఎస్పీఏ రద్దు చేయడంతో పాటు ఇన్నర్ లైన్ పర్మిట్(ఐఎల్పీ) వ్యవస్థను అమలు చేయాలన్న డిమాండ్ తో దీక్షకు దిగుతున్నట్టు ఆమె ప్రకటించారు. రోబితకు డైమండ్(10), తంపామణి(4) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇరోమ్ షర్మిల అంటే తనకు గౌరవమని, ఏఎఫ్‌ఎస్‌పీఏకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాన్ని తాను కొనసాగించాలనుకుంటున్నట్టు రోబిత తెలిపారు. కుమార్తెల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నిరవధిక దీక్షకు దిగొద్దని పలు మహిళా సంఘాల నేతలు రోబితను వారించారు. అయితే తన నిర్ణయానికే ఆమె కట్టుబడ్డారు. -
‘మరి కొన్నాళ్లు ఆస్పత్రిలోనే ఉండండి’
మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిలను మరికొన్ని రోజులపాటు ఆసుపత్రిలోనే ఉండాల్సిందిగా ఇంఫాల్‌లోని జవహర్‌లాల్‌నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(జేఎన్ఐఎంఎస్) వైద్యులు సూచించారు. మణిపూర్‌లో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్ఎస్పీఏ) రద్దుచేయాలంటూ 16ఏళ్లపాటు చేసిన నిరాహార దీక్షను ఇరోం షర్మిల గత మంగళవారం విరమించడం తెలిసిందే. అప్పట్నుంచీ ఆమె ఇంఫాల్‌లోని జేఎన్ఐఎంఎస్ ఆస్పత్రిలోనే కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య గడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, అయితే ఎవరైనా పదహారేళ్లపాటు నిరాహార దీక్ష చేసి.. విరమించగానే ఘనాహారం తినడం ప్రారంభిస్తే అతడు లేదా ఆమె శరీరం ఏ విధంగా స్పందిస్తున్నదనేదానిపై వైద్య చరిత్రలో స్పష్టత లేదని వారు తెలిపారు. అందువల్ల షర్మిల మరికొన్నాళ్లపాటు వైద్య పర్యవేక్షణలో ఉండడం మంచిదని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం షర్మిలకు పాలు, పండ్లరసాలతోపాటు మెత్తగా ఉడికించిన అన్నం, ఓట్స్ వంటి తేలికపాటి ఆహారం ఇస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతమిస్తున్న ఆహారానికి ఆమె శరీరం బాగానే సహకరిస్తోందన్నారు. అయితే అన్నిరకాల ఘనాహారాన్ని వెంటనే తీసుకునే స్థితిలో ఆమె శరీరం లేదని స్పష్టం చేశారు. షర్మిల ఆరోగ్య పరిస్థితిని వివిధ స్పెషలిస్టులతో కూడిన వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. కాగా ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యే వరకూ ఆసుపత్రిలో షర్మిల ఉంటుందని ఆమె సోదరుడు సింఘాజిత్ తెలిపారు. -
నిరసనపై జులుం నేరంతో నెయ్యం
సమకాలీనం షర్మిల వంటి గాంధేయవాదుల నిరసనల్ని, పోరాటాల్ని పాలకులు ఏళ్ల తరబడి లక్ష్య పెట్టకపోవడం అనర్థాలకు దారి తీస్తోంది. నిరసించే, ప్రశ్నించే పరిస్థితులే లేకుండా పోతు న్నాయి. ప్రజాస్వామ్యం పట్ల, వ్యవస్థల పట్ల మంచి వారికి విశ్వాసం సన్నగిల్లుతోంది. చెడ్డ వారికి భయం లేకుండాపోతోంది. డబ్బు, పలుకుబడిగలవారు సత్వర ఫలితాలకు నయీమ్ లను ఆశ్రయిస్తుంటే... చట్టబద్ధ వ్యవస్థల రక్షణ కరవై బడుగుజీవులు తృణమో, పణమో, సాంతమో ఈ ముఠాలకు సమర్పించుకొని ‘బతుకు జీవుడా’ అనాల్సిన దుస్థితి నెలకొంది. 24 గంటల వ్యవధిలోనే రెండు పరస్పర విరుద్ధ భావధారలు భారత రాజ కీయ తెరపైన ప్రతీకలుగా ప్రస్ఫుటమయ్యాయి. అత్యధికుల్ని చలింప జేశాయి. ఇప్పుడాలోచింపజేస్తున్నాయి. ఒకటి: ప్రజాస్వామ్యయుతమైన నైతికతకు శీర్షాయమానంగా నిలిచిన తన పదహారేళ్ల నిరాహార దీక్షకు స్పందన లేనందుకు విరమిస్తూ, వ్యవస్థలో భాగమై పోరాటం కొనసాగిస్తానని ప్రకటించిన ఈరోమ్. రెండు: అమానుష నేరగాడిగా... రాజకీయ అవినీతిని, పోలీసు దిగజారు డుతనాన్ని ఆయుధాలుగా మలచుకొని రెండు దశాబ్దాల పాటు నెలకొల్పిన నేరసామ్రాజ్యం కుప్పకూలి, నరకాసుర వధలా బతుకు చాలించిన నయీమ్. ఈ రెంటిలో ఎన్నో సామ్యాలను. మరెన్నో వైరుధ్యాలను, పరస్పర విరుద్ధమైన అంశాల్ని కలిపి చర్చించాల్సిరావడం బాధ కలిగిస్తున్నా... ఒక ప్రజాస్వామ్య ప్రక్రియను మన నయా ఉదారవాద ఆర్థిక పాలనా నమూనా నిర్దయగా తొక్కేసిన కుటిల నీతి పర్యవసానమైతే, రెండోది అదే నమూనా వల్ల ఒక దుర్మార్గపు ప్రక్రియ బలపడటం కావ డమే ఇక్కడ ముఖ్యాంశం. రెండు చోట్లా తుది ఫలితం సమాజం బలహీనపడటమే! రెండుచోట్లా స్వార్థ పర శక్తులదే ఆధిపత్యం, సామాన్యులే బాధితులు. అందుకే, కలిపి చర్చిం చాల్సి వస్తోంది. అధికార బలంతో, చట్టం దన్నుగా ‘ప్రత్యేక’ సాయుధ బల గాలు సాగిస్తున్న అరాచకాలను నిలిపివేయండన్న ఈరోమ్ షర్మిల ఆక్రందన గాలికి పోయింది. శాంతియుతంగా గాంధేయ మార్గంలో 16 ఏళ్లుగా తిండి తినకుండా ఆమె నిరసన తెలిపితే ప్రభుత్వ, రాజకీయ, అధికార వ్యవస్థల నుంచి కించిత్తయినా స్పందన రాలేదు. నిబద్ధత కలిగిన వ్యక్తిగా షర్మిల తన పంథాను మార్చుకొని, పోరాటం కొనసాగించాల్సి వస్తోంది. ఆమె పట్టుద లకు, త్యాగనిరతికి ప్రపంచమంతా నీరాజనం పలికింది. దీక్ష మాత్రమే విరమించానని, పోరాటాన్ని కొనసాగిస్తున్నాననీ ఆమె గర్వంగా ప్రకటిం చింది. ఇది అభినందించాల్సిన పరిణామం. ఆదర్శాల నిబద్ధతతోనో, పచ్చి ముసుగుగానో నక్సలైటుగా మొదలై - నేరస్తుడి రూపమెత్తాడు నయీమ్. నేరాల రుచి మరిగి, పోలీసుల, నాయకుల చేతిలో పావుగా, వారి స్వార్థమే నిచ్చెనగా అతగాడు నెలకొల్పిన నేర సామ్రాజ్యం ప్రజాస్వామ్య వ్వవస్థకు ఓ రాచపుండు. ఎన్ని కిడ్నాప్‌లు, హత్యలు, దోపిడీలు, దొమ్మీలు, మెడమీద కత్తిపెట్టి చేసిన కోట్లాది రూపాయల, స్థిరచరాస్తుల వసూళ్లు! సంపద సంగతి సరే, చట్ట రక్షకుల కనుసన్నల్లో నయీమ్ ముఠా తూటాలకు, కత్తిపోట్లకు ఎన్నో జీవితాలు బుగ్గిపాలయ్యాయి. కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. రాజకీయాల్ని అనివార్యం-అంతిమం చేశాం చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.... అనే పెదవి విరుపు నానుడొకటుంది. కాలక్ర మంలో మనం మన రాజకీయ వ్యవస్థను అంతగా అనివార్యం, అంతిమం చేసుకున్నాం. రాజ్యాంగంలో తప్ప... ఆచరణలో ఎక్కడా తనిఖీల్లేవు, సమ తూకాల్లేవు. మన జీవితాల్లో ప్రతి పార్శ్వాన్నీ శాసించే గుత్తాధికారాన్ని రాజకీయ వ్యవస్థకు తెలిసో తెలియకో ధారాదత్తం చేశాం. మంచి వాళ్లైనా, చెడ్డవాళ్లైనా అందరూ అటువైపే చూడాల్సిన పరిస్థితులిప్పుడు నెలకొన్నాయన డానికి ఈరోమ్, నయీమ్లే తాజా ఉదాహరణ. ఇద్దరూ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు! ‘మణిపూర్‌లో సానుకూల మార్పులు తీసుకురావడానికి నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను, అందుకే 2017లో స్వతంత్య్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీచేస్తాన’ని ఈరోమ్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎమ్మెల్యే కావాలని ఆశించి భూమిక సిద్ధం చేసు కుంటున్న నయీమ్, ఏమో.... కలిసొస్తే ఏకంగా ముఖ్యమంత్రే కావాలను కున్నాడేమో! తెలియదు. ఇప్పుడు నయీమ్ ఎలాగూ లేడు. రాజకీయాలవైపు రావడానికి మంచివాళ్లు సాహసించట్లేదని ప్రచారం జరుగుతున్న ఈ రోజుల్లో షర్మిల ప్రకటన ఆహ్వానించదగ్గ పరిణామం. పదహారేళ్ల దీక్షతో కానిది ఎమ్మెల్యేగా గెలిచి సాధిస్తుందా? అసలు ముఖ్యమంత్రి అవుతుందా? అయినా.. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) రద్దు చేయించగలరా? వంటి ధర్మసందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు మేధావులు. అవి పెద్దగా ప్రాముఖ్యత లేని ప్రశ్నలు. మేధావి వర్గపు ప్రతి నిధిగా చిత్తశుద్ధితో అంత సుదీర్ఘకాలం దీక్ష చేసిన షర్మిల ఇన్ని ప్రతికూలతల నడుమ కూడా... పోరాటపంథా వీడకపోవడమే గొప్ప! రూపు మార్చి పోరాటం కొనసాగిస్తాననడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీక. ఆమె ఇంకో గొప్ప మాట చెప్పారు. ‘కొందరు రాజకీయాలు మురికి అంటారు, సమాజం కూడా అంతే!’ అన్న ఆమె మాటలు కుహనా మేధావి వర్గానికి చెంపదెబ్బ. షర్మిల దీక్షకి పదహారేళ్లపాటు స్పందించని పాలనా వ్యవస్థల్ని మన సమాజం లోనే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇబ్బడి ముబ్బడిగా అధికార బలం, పట్టపగ్గాల్లేని చట్టస్వామ్యం చేతుల్లో ఉన్న నేతలు, పోలీసులు చెక్కిన వంచనా శిల్పం నయీమ్. నయీమ్ చచ్చిన తర్వాత దొంతర్లు దొంతర్లుగా ఆస్తులు, టన్నులు టన్నులుగా సమాచారం బయటకొచ్చే వరకు ఆయా ముఖ్యుల చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఈ సమాజంలో ప్రతిబంధకాలేవి? ఇప్పటికైనా ముసుగుల్లో దాగిన ముఖ్యుల బండారం బయటకొస్తుందో? రాదో? సందే హమే! రంగు మారని రాజకీయాలే వారికి రక్షణ కవచం అవుతాయనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే, రాజకీయాలు మారాలంటారు. ‘‘రాజకీయాల్లో చేర కుండా ‘రాజకీయాల్ని‘ తుదముట్టించడమో, సంస్కరించడమో కుదరదు కాక కుదరదు’’ అని జీన్ పాల్ సార్ట్రే విశ్వవిఖ్యాత నాటిక ‘డర్టీ హ్యాండ్స్’లో ఒక పాత్ర చేత పలికిస్తారు. ‘రాజకీయాల్ని ముట్టుకోకుండా నేను నా సామాజిక సేవను కూడా కొనసాగించలేను. ప్రజాస్వామ్యంలో రాజకీయం తడమని జీవన ప్రక్రియలే ఉండవు’ అని మహాత్మా గాంధీ ‘యంగ్ ఇండియా’ (1920) లో రాశారు. రాజకీయాల్లో మంచివాళ్లు, ఆలోచనాపరుల దామాషా పెరిగి వాటిలో పరివర్తనను తేవాల్సిన అవసరాన్ని సమకాలీన పరిస్థితులు నొక్కిచెబు తున్నాయి. నిరసన అస్త్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారు ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థల్లో నిరసన తెలుపడం ఒక బలమైన ఆయుధం. నిరాయుధ అహింసావాదిగా విశ్వమంతా పేరు తెచ్చుకున్న జాతిపిత బాపూజీ ఈ ఆయుధంతోనే పోరాడారు. రవి అస్తమించని బ్రిటిష్ పాలకుల మెడలు వంచి దేశానికి స్వాతంత్య్రం సాధించారు. ఆంగ్లేయుల వంటి వలస పాలకులు సైతం గౌరవించిన ‘నిరసన’ నేటి మన ప్రజాస్వామ్య పాలకులకు కంటగింపయింది. స్వాతంత్య్రం సిద్ధించిన తదుపరి తొలి దశాబ్దాల్లో ఉన్న సామరస్య ధోరణి కూడా లేదు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన చివరి రోజుల వరకూ కూడా ఏ నిరాహార దీక్షనూ నిర్లక్ష్యం చేయలేదంటారు. ఎవరైనా దీక్ష చేస్తే వారి వద్దకు ప్రధాని తరఫు నుంచో, ప్రభుత్వం వైపు నుంచో సంప్రదింపులకు, చర్చలకు పంపేవారు. కానీ, ఇప్పుడు శాంతి భద్రతల ముసుగులో శాంతియుత నిరసనలనూ కర్కశంగా అణచివేస్తు న్నారు. రేపు ఫలానా చోటకు వెళ్లి నిరసన తెలుపుతామంటే, ఈరోజే అరెస్టు చేస్తారు. లాఠీలతో హింసిస్తారు, గుర్రాలతో తొక్కిస్తారు, ప్లాస్టిక్ పిల్లెట్లతో నెత్తురు కళ్లజూస్తారు. మగ పోలీసులే మహిళా నిరసనకారులపై చేయి చేసుకుంటారు, చేతుల్లో బంధిస్తారు, ఒంటిపై గుడ్డలు చింపుతారు, రోడ్లపై ఈడ్చుకెళ్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో, కశ్మీర్లో, దేశంలోని పలు ఇతరేతర ప్రాంతాల్లో పాలకుల దమననీతి నేడు నడివీధుల్లో నెత్తురు చిమ్మిస్తోంది. అందుకే, కశ్మీర్లో బుర్హాన్ వనీ మరణానంతర పరిణామాల్లో పోలీసుల దాష్టికాల్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వారిలో మానవీయ కోణమే కొరవడిం దని నొక్కిచెప్పింది. సాయుధ బలగాల అమానవీయ చేష్టల్ని, నేరపూరిత చర్యల్ని విచారించనవసరం లేని మినహాయింపు (ఇమ్యునిటీ) తలంపే ఎక్కడా లేదని స్పష్టం చేసింది. రాజ్యం తన అణచివేత చర్యల ద్వారా రాను, రాను పౌరులు నిరసన తెలిపే ద్వారాలనే మూసివేస్తోంది. కూర్చున్న చోటే చేసే సత్యాగ్రహాన్ని, నిరసన దీక్షల్ని ఇక అసలు ఖాతరు చేయరు. ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలైనా పట్టించుకోరు. రోడ్లపైకి ప్రదర్శనగా వస్తే చతురంగ బలాలతో అణచివేతకు దిగుతారు. 108 వైద్య సర్వీసుల ఉద్యో గులు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఇందిరాపార్కు వద్ద ఏడాది పాటు దీక్ష చేశారు. ప్రభుత్వం పలకరించిన పాపాన పోలేదు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి నలిగి కడకు ఏ పరిష్కారం లేకుండానే దీక్ష నుంచి వైదొలిగారు. ఏపీలో విపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేసిన పలు నిరసన, నిరాహార దీక్షలపై పోలీసు దాష్టికాల్ని చూశాం. ముద్రగడ పద్మనాభంపై ఆస్పత్రిలో భౌతికదాడి, కుటుంబసభ్యుల్ని అవమానించడం వంటి దుర్మార్గాల్ని మీడియా కళ్లకు కట్టింది. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు, మల్లన్నసాగర్‌ను వ్యతిరేకిస్తున్న పార్టీలకు, ప్రజాసంఘాలకు ఎదురైన చేదు అనుభవాలు తెలిసినవే! జాతీయ స్థాయిలో కూడా... సాయుధ బలగాలకు చెందిన మాజీ సిబ్బంది ‘ఒక ర్యాంకు ఒక పెన్షన్’ నినాదంతో జంతర్‌మంతర్ వద్ద నెలల తరబడి దీక్ష జరిపినా పట్టించుకున్నవారు లేరు. కడకొక రాజకీయ పరిష్కారంగానే ఆ సమస్యకు తెరపడింది. బాధల వల్లే.... బాదరాయణ బంధం షర్మిల వంటి గాంధేయవాదుల నిరసనల్ని, పోరాటాల్ని పాలకులు సంవత్స రాల పాటు లక్ష్యపెట్టకపోవడం ఎన్నో అనర్థాలకు దారి తీస్తోంది. నిరసించే, ప్రశ్నించే పరిస్థితులే లేకుండా చేస్తున్నారు. విమర్శను తట్టుకోలేక విమ ర్శకుల్ని నిర్మూలించే నియంతృత్వ పోకడలు పాలకుల్లో పెచ్చుమీరాయి. ప్రజాస్వామ్యం పట్ల, దాని విభిన్న అంగాల పట్ల, వ్యవస్థల పట్ల మంచి వారికి విశ్వాసం సన్నగిల్లుతోంది. చెడ్డవారికి భయం లేకుండా పోతోంది. డబ్బు, పలుకుబడి కలిగిన వారికి సత్వర ఫలితాలకు ‘నయీమ్’వంటి వ్యవస్థలే నయమనే అభిప్రాయానికి వస్తున్నారు. చట్టబద్ధ వ్యవస్థలు తమ రక్షణకు రానపుడు తృణమో, పణమో, కడకు సాంతమో.... హంతక ముఠాలకు సమర్పించుకొని ‘బతుకు జీవుడా’ అనాల్సిన దుస్థితి బడుగుజీవులది. ఇటీవలి కాలంలో తెరపైకి వచ్చిన పాలకుల నయా ఉదారవాద అభివృద్ధి నమూనా పర్యవసానమే ఇది. ఏ కొందరికో అసాధారణ ప్రయోజనాల్ని కల్పించి, అత్యధికులకు కన్నీళ్లను మిగులుస్తోంది. కొందరి గుప్పిట చిక్కిన ‘అధికారం’ దాష్టికాలను అడ్డగించేవారే ఉండట్లేదు, ఉన్నా, నయీమ్ లాంటి కిరాయి ముఠాల ఊడిగంతో వారి అడ్డు తొలగించుకుంటున్నారు. యథేచ్ఛగా చీకటి రాజ్యాలేలుతున్నారు. లేకపోతే, వందల సెల్ఫోన్లు, వేల సిమ్‌కార్డులు, లక్షల లావాదేవీలు, వేల కోట్ల ఆస్తులు... ఒక ముఠా నేర సామ్రాజ్యంలో ఎలా పోగుపడ్డాయి? ఇరవై ఏళ్లుగా ఇది నిరాఘాటంగా సాగుతుంటే, మననిఘా సంస్థలు, నియంత్రణ వ్యవస్థలు, తనిఖీ యంత్రాంగాలు ఏం చేశాయనే సందేహం రావడం సహజం. దీనికి పాలకులు సమాధానం చెప్పాలి. లేకుంటే ప్రజలే వారికి, వారి దాష్టీకాలకు చరమగీతం పాడాలి. అప్పుడే ప్రజాస్వామ్యం! వ్యాసకర్త: ఆర్. దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
ఇరోమ్ షర్మిల దీక్ష రహస్యం ఇదే!
ఇంఫాల్‌ః మణిపూర్ ఉక్కుమహిళగా పేరొందిన ఇరోమ్ షర్మిల ఆరోగ్యం వెనుక రహస్యం యోగానట. 16 ఏళ్ళ పాటు నిరాహార దీక్షను చేసిన ఆమె.. నేటికీ ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఆమె ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా చేయడమేనని తెలుస్తోంది. ఆమె నిరాహార దీక్షకు కూర్చునే రెండేళ్ళకు ముందు 1998లో ఆమె యోగా విద్యను అభ్యసించినట్లు ఆమె సహచరులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆహారం లేకపోయినా షర్మిల శారీరక ఆరోగ్యం, మానసిక శక్తి కలిగి ఉండటానికి యోగ సాధనే ప్రధాన కారణమని ఆమె సోదరుడు ఇరోమ్ సింఘజిత్ తెలిపారు. సహజ శ్రేయస్సును, ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రకృతి వైద్యానికి షర్మిల తొంభైల్లోనే ఆకర్షితురాలైంది. అందులో భాగంగానే యోగ విద్యను కూడా అభ్యసించింది. యోగా ఫుట్‌బాల్ వంటిది కాదని, శారీరక వ్యాయామంతోపాటు, మానసిక శక్తిని ఇచ్చే యోగా పూర్తిగా భిన్నమైనదని, మనిషి ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతికేందుకు దోహద పడుతుందని షర్మిల చెప్తారు. యోగా క్రమం తప్పకుండా చేసినవారు వందేళ్ళ వరకూ ఆరోగ్యంగా జీవిస్తారని, యోగా ఇతర వ్యాయామాలు, ఫుట్‌బాల్ వంటి క్రీడల్లాంటిది కాదని, షర్మిల జీవితచరిత్ర 'బర్నింగ్ బ్రైట్' లో రచయిత దీప్తిప్రియా మెర్హోత్రా తెలిపారు. 1998-99 సమయంలో షర్మిల యోగాసనాలు వేయడం మొదలు పెట్టినదగ్గరనుంచీ ఇప్పటి వరకూ ప్రతిరోజూ చేస్తూనే ఉన్నారని దీప్తిప్రియా గుర్తు చేశారు. షర్మిల మిగిలిన వ్యక్తుల్లా కాదని, యోగా, వాకింగ్ తో ఆమె శరీరంపై నిరంతర ప్రయోగాలు చేస్తుంటారని బయోగ్రఫీ పుస్తకంలోని విరాలను బట్టి తెలుస్తుంది. జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో, పోలీసుల నిర్బంధంలో 16 సంవత్సరాలపాటు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగించిన షర్మిలకు, ముక్కునుంచి ట్యూబ్ ద్వారా కడుపులోకి ద్రవరూపంలో ఆహారాన్ని బలవంతంగా పంపించారు. సైనిక బలగాల ప్రత్యేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష కొనసాగించిన ఆమెపై పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. అండర్ ట్రయల్ ఖైదీగా ఉంటూ దీక్షను కొనసాగించిన ఆమె.. జైల్లో అధికభాగం ఒంటరి జీవితాన్నే గడిపారు. -
మణిపురి మణిపూస
-
ఇరోమ్ షర్మిల గురించి ఈ విషయాలు మీకు తెలుసా!
సాయుధ బలగాల అకృత్యాలపై పోరుబాట పట్టి.. 16 ఏళ్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్ షర్మిల మహాపోరాట ప్రస్థానం మంగళవారం మరో కీలక మలుపు తీసుకుంది. ఆమె నిర్విరామ నిరాహార దీక్షను మంగళవారం విరమించారు. రాజకీయాల్లో అడుగుపెట్టాలని నిశ్చయించారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఆమెను చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా.. ఆ బెదిరింపులను లక్ష్యపెట్టకుండా ముందుకుసాగుతున్న ఉక్కుమహిళ షర్మిల ప్రస్థానంలోని కీలకాంశాలివి.. మణిపూర్ ఉక్కుమహిళగా పేరొందిన ఇరోమ్ షర్మిల మధ్యతరగతి కుటుంబంలో 1972లో జన్మించారు. తొమ్మిది మంది తోబుట్టువుల్లో చివరి సంతానం ఆమె. మొదట్లో డాక్టర్ కావాలనుకున్నారు. కానీ హక్కుల కార్యకర్తగా మారి.. 'సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఆఫ్సా)కు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. సైనికులకు 'చంపే లైసెన్స్' ఇచ్చే చట్టంగా పేరొందిన ఆఫ్సాను రద్దుచేయాలని నినదించారు. ఇరోమ్ షర్మిల 28 ఏళ్ల వయస్సులో ఉండగా 2000 నవంబర్ 4న ఉక్కుసంకల్పంతో నిరాహార దీక్షకు దిగారు. అంతకు రెండురోజుల ముందు మణిపూర్ రాజధాని ఇంఫాల్ సమీపంలోని మాలోమ్‌లో సైనికుల కాల్పుల్లో పదిమంది చనిపోయారు. అందులో ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న టీనేజ్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ ఘటనతో చలించిపోయిన షర్మిల పోరుబాటను ఎంచుకున్నారు. మణిపూర్‌లో, దేశవ్యాప్తంగా ఆఫ్సా వ్యతిరేక ఉద్యమానికి షర్మిల కేంద్రంగా మారారు. ముక్కు ద్వారా ద్రవాహారం తీసుకుంటూ ఏళ్లకు ఏళ్లు ఆమె కొనసాగించిన దీక్ష దేశమంతటికీ చేరింది. అప్పటినుంచి షర్మిల ఇంఫాల్‌లోని సజీవ సెంట్రల్ జైలులో కస్టడీలో ఉంచారు. కానీ, ఎక్కువకాలం నగరంలోని జవహర్ లాల్ నెహ్రూ వైద్య విజ్ఞాన కేంద్రంలోనే గడిపారు. ఐదుగురు వైద్యులు, 12మంది నర్సులు, ముగ్గురు మహిళా పోలీసులు.. ఇలా దాదాపు 40మంది నిత్యం ఆమెకు బలవంతంగా ముక్కు ద్వారా ద్రవాహారం, పౌష్టికాలు అందజేసేవారు. షర్మిల 2000 సంవత్సరంలో తొలిసారి అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించారన్న కారణంతో ఆమెను అరెస్టు చేయడం, విడుదల చేయడం నిత్యకృత్యంగా జరుగుతూ వచ్చింది. ఇప్పటివరకు దేశంలో ఆత్మహత్యాయత్నం నేరంగా ఉండగా.. దీనిని నేరరహితంగా ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లును గత సోమవారం రాజ్యసభ ఆమోదించింది. ఇంకా లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది. షర్మిల మంచి రచయిత, కవి. స్థానిక మీటిలాన్ భాషలో ఆమె రచనలు చేశారు. ఆమె రచనల్లో 12 కవితలతో కూడిన 'ఫ్రాగ్రాన్స్ ఆఫ్ పీస్' పుస్తకాన్ని తన మహా దీక్షకు ముందే రచించారు. 2006లో షర్మిల తన ఆందోళనకు దేశ రాజధాని ఢిల్లీని వేదికగా చేసుకున్నారు. జంతర్ మంతర్‌లో ఆమె, కార్యకర్తలతో కలిసి దీక్ష చేశారు. వెంటనే ఆమెను అరెస్టు చేసినప్పటికీ ఆమె నిరాహార దీక్ష ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆఫ్సాలో మార్పులు తీసుకురావాలంటూ కోరుతూ యూరోపియన్ పార్లమెంటు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. అహింసాయుత మార్గంలో షర్మిల సాగించిన పోరాటం ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. 2007లో గ్వాంగ్జు మానవహక్కుల పురస్కారం, ఆసియన్ మానవ హక్కుల కమిషన్ జీవితసాఫల్య పురస్కారం, 2010లో విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ శాంతి బహుమతి ఆమెకు లభించాయి. 2013లో ఆమెస్టీ ఇంటర్నేషనల్ ఆమెను 'ప్రిజనర్ ఆఫ్ కాన్షైన్స్' (ఆత్మసాక్షికి ఖైదీ)గా కీర్తించింది. ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత షర్మిల వ్యక్తిగత జీవితం ప్రారంభమైందని చెప్పవచ్చు. 2011 మార్చిలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు డెస్మండ్ కౌటిన్హో (48) ఆమెను ఆస్పత్రిలో కలిశారు. 2009లో నుంచి వీరిద్దరూ పరస్పరం లేఖలు రాసుకుంటున్నారు. అతడు తనను ప్రేమిస్తున్నట్టు షర్మిల మీడియాకు తెలిపింది. అయితే, ఆఫ్సా వ్యతిరేక ఉద్యమం నుంచి ఆమె దారి మళ్లించేందుకే ప్రభుత్వం కౌటిన్హోను పరోక్షంగా రంగంలోకి దింపిందని అప్పట్లో అనుమానాలు వచ్చాయి. గత నెల 26న తాను దీక్షను విరమించబోతున్నట్టు ప్రకటించి షర్మిల తన మద్దతుదారులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. మంగళవారం దీక్ష విరమించి రాజకీయాల్లో చేరుతానని, పెళ్లి చేసుకుంటానని ఆమె ప్రకటించారు. -
'మహా దీక్షకు గుడ్‌బై'
-
'మహా దీక్షకు రేపు గుడ్‌బై'
ఇంపాల్: ఎట్టకేలకు తన పదహారేళ్ల అకుంటిత దీక్షకు మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల ముగింపుపలుకుతున్నారు. మంగళవారం ఉదయం ఆమె తన దీక్షను విరమించేందుకు సర్వం సిద్థం చేసుకున్నారు. ప్రముఖ హక్కుల కార్యకర్త అయిన ఇరోమ్ షర్మిల నాజల్ ట్యూబ్ ద్వారా మాత్రమే ద్రవ పదార్థం ఆహారంగా తీసుకుంటూ వచ్చారు. మణిపూర్ లో అమలుచేస్తున్న ప్రత్యేక సాయుధ బలగాల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో ఆమె 2000 సంవత్సరం నుంచి ఈ దీక్షను ప్రారంభించారు. అప్పటి నుంచి ఆమె పోలీసుల అదుపులోనే ఓ ఆస్పత్రిలో ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఆమెను జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె తన దీక్షను విరమించినట్లు ప్రకటించగానే కోర్టు ఆమె జ్యుడిషియల్ కస్టడీ ముగిసినట్లుగా ప్రకటించనుంది. అనంతరం ఆమె తన మద్దతుదారులతో సమావేశం కానున్నారు. ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఇప్పటికే వార్తా కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. -
ఇరోమ్ షర్మిలకు బెదిరింపులు
16 ఏళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షను ఆపి వివాహం చేసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్న మణిపూరి ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిళకు బెదిరింపులు వచ్చాయి. ఓ కారణం కోసం పోరాడి రాజకీయాల్లోకి ప్రవేశించిన వారందరూ ఆ తర్వాత హత్యకు గురైనట్లు సెసెస్సనిస్ట్ అలయన్స్ ఫర్ సోషల్ యూనిటీ(ఏఎస్ యూకే) షర్మిళకు గుర్తుచేసింది. అంతగా ప్రచారం లేని ఈ సంస్థ ఢిల్లీ కంట్రోల్ నుంచి మణిపూర్ ను స్వతంత్ర రాజ్యంగా చేయాలనే ఆలోచనకు దన్నుగా నిలుస్తూ వస్తోంది. ఏఎస్ యూకే కు చెందిన రెండు మిలిటెంట్ గ్రూపులు కాంగ్లయ్ యవోల్ కన్నా లుప్, కాంగ్లాయ్ పక్ కమ్యూనిస్ట్ పార్టీలు షర్మిళలను దీక్ష కొనసాగించాలని కోరాయి. ఈ నెల 9న దీక్ష విరమిస్తానని షర్మిళ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. షర్మిళ స్థానికుడినే వివాహం చేసుకోవాలని ఏఎస్ యూకే చైర్మన్, వైస్ చైర్మన్ లు బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా షర్మిళ బ్రిటిష్ యాక్టివిస్ట్ డెస్మాండ్ కౌటిన్హో తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. -
16 ఏళ్ల దీక్ష విరమిస్తా
-
ఇదీ మణిపూర్ ముఖచిత్రం!
ఢిల్లీలో నిర్భయకి జరిగింది.. ఇక్కడ మణిపూర్‌లో ప్రతి నెలా ఎవరో ఒకరికి జరుగుతూనే ఉంటుంది. కానీ.. వాటిని ఎవరన్నా పట్టించుకున్నారా? జాతీయ స్థాయి వార్త ఎప్పుడైనా అయ్యిందా? 15 ఏళ్ళగా ఇరోమ్ షర్మిల నిరాహార దీక్ష చేస్తోంది. ఎవ్వరికైనా పట్టిందా? ‘ఇండియన్ ఆర్మీ.. రేప్ అజ్’ అని బ్యానరు పట్టు కొని కాంగ్లా కోటని ఆక్రమించిన అస్సాం రైఫిల్స్ ముందు నిలబడి.. 2004లో పోరాడిన ఆ ధీర వనితల్ని కలవాలని మణిపూర్ రాజధాని ఇంఫాల్ వెళ్ళాను. ఏదో యుద్ధాన్ని దగ్గర నుండి చూసినట్టు ఉంది. సరిగ్గా మేం ఇంఫాల్ వెళ్ళే సరికి.. అక్కడ ప్రజలందరూ సమ్మె చేస్తున్నారు. తారిణి బబిత అనే యువతిని ఇండియన్ ఆర్మీ కాల్చింది. మరో ఇద్దరు కాలేజికి వెళ్తున్న కుర్రా ళ్ళని ఏ కారణం లేకుండా జవాన్లు చితక్కొట్టారు. గతంలో ఆర్మీ చేసిన మరో హత్య కేసులో ఆ రోజే ఒక జవాను, కోర్టులో నేరం అంగీకరించాడు. వీటన్నిటివల్లా ప్రజలూ, ఆర్మీ.. ఇరు వర్గాలు ఆవేశంగా ఉన్నారు. ప్రజలు ఎక్కడికక్కడ టెంట్లు వేసి ధర్నా చేస్తున్నారు. అక్కడ నిరసన చేసే పద్ధతి ఇక్కడి పరిస్థితులకి చాలా భిన్నంగా ఉంటుంది. ప్రజ లంతా ఒకే చోట కాకుండా.. ఎవరి ఇంటి దగ్గరున్న రోడ్డు మీద వాళ్ళు చేస్తారు. ఒక వర సలో రోడ్డుకి అడ్డంగా కూర్చుంటారు. వాళ్ళకి ఒక అరకిలోమీటరు దూరంలో మరి కొంత మంది కూర్చుంటారు.. వాళ్ళకి దూరంలో ఇంకొంతమంది.. అలా వరసలు వరసలుగా, అన్ని చిన్న చిన్న గల్లీలతో సహా, అన్ని రోడ్ల మీదా నిరసనకి కూర్చుంటారు ప్రజలు. ఆర్మీ వాళ్ళు మొదటి వరసలో ఉన్న వాళ్ళ మీద దాడి మొదలుపెట్టగానే, రాయి తీసుకుని కంచం మీదో, కరెంటు స్తంభం మీదో కొడుతూ.. వెనక కూర్చున్న వాళ్ళని హెచ్చరి స్తారు ఉద్యమకారులు. ఆ శబ్ద సంకేతం రాగానే తర్వాత వరసలో కూర్చున్న వాళ్ళు రాళ్ళు, మైకులు తీసుకుని అప్రమత్తమవుతారు. ఇక్కడ నిరసన చేసేది అత్యధిక శాతం ఆడవాళ్ళే. 9మంది స్త్రీలు ఉంటే ఒక పురుషుడూ ఉంటాడు.. నిరసనల్లో. అన్ని వయసులు స్త్రీలు ధర్నాల్లో ఉంటారు. మేం ఆర్మీ రాకముందే.. పశ్చిమ ఇంఫాల్‌లోని ఉరిపోక్ అనే ప్రాంతాన్ని చేరుకున్నాం. 2004లో జూలై 14న కాంగ్లా కోట ముందు.. నగ్నంగా నిరసన తెలియజేసిన 11 మంది స్త్రీలలో.. ముగ్గురు ఆ ప్రాంతంలో ధర్నా చేస్తున్నారు. వాళ్ళ పేర్లు అంగోమ్ జీబన్‌మాలా లెయిమా, సైబమ్ మామన్లెయిమా, మీతమ్ ఇబెంహాల్ లెయిమా. వాళ్ళని కలవటానికి.. చాలా వరసల నిరసన కారుల్ని దాటుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. మేం వెళ్ళేసరికి.. ఆ ముగ్గురు స్త్రీలు కొన్ని బ్యానర్లు పట్టుకుని.. ఒక షెడ్డులో కూర్చున్నారు. 2004 నాటి పోరాటానికి కారణం ఏమిటి? అని అడిగాను. ఇబున్హాల్ సమాధానం ఇచ్చారు. ‘జూలై 11వ తేదీ ముందు రోజు రాత్రి మనోరమ అనే యువతిని 17వ అస్సాం రైఫిల్స్ ఆర్మీ అరెస్టు చేయటానికి ఇంటికి వచ్చారు. ఆమె కుటుంబ సభ్యుల ఎదురుగానే, మనోరమ కళ్ళకి గంతలు కట్టి అరగంట పాటు.. జాలీ దయా లేకుండా చావబాదారు. అక్కడే ఆ వరండాలోనే లైంగికంగా కూడా హింసించారు. ఆ తర్వాత అరెస్టు నెపంతో మనోరమని తీసుకెళ్ళి పోయారు. 11వ తేదీన ఆమె శవం.. సగం సగం బట్టలతో.. వంటి మీద బుల్లెట్ గాయాతో, తొడల మీద కత్తి గాట్లతో.. రోడ్డు మీద పడి కనిపించింది. ఎన్నిసార్లు ఇలా ఎంతమంది అమ్మాయిలకి జరిగిందో తెల్సా? 15 ఏళ్ళ వయసు పిల్లల్నుంచీ..’ అని చెప్పి ఆమె ఏడవటం మొదలుపెట్టింది. ఆ టెంటులో ఆ చుట్టుపక్కల కూర్చున్న అమ్మాయిలు ఆమె భుజాలని పట్టుకుని ఓదార్చుతూ ఉన్నారు. ఇబెంహాల్ నా గడ్డం పట్టుకుని.. ‘చూడు.. ఈ అమ్మాయిల్లో ఎవరినైనా సరే రేప్ చేయొచ్చు.. చూడు.. వీళ్ళని చూడు..’ అంటూ అందర్నీ చూపిస్తోంది. నేనూ ఏడ్చాను. ఇంతలో గట్టిగట్టిగా కంచాన్ని కొడుతున్నట్టు శబ్దం వినిపిం చింది. ఏమయింది అని అడిగాను. ‘వాళ్ళు వస్తున్నారు. ఈ రోడ్డున మనకంటే ముందు దీక్షలో కూర్చున్న వాళ్ళని కొట్టేశారన్న మాట’ అని చెప్పిందో మహిళ. నేను వెంటనే టెంటు నుంచి రోడ్డు మీదకి వెళ్ళి చూశాను. ఆర్మీ జట్లు జట్లుగా నడుచుకుంటూ వస్తోంది. వాళ్లను రానివ్వకుండా కొందరు టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు.. ఆర్మీకి ఎదురెళ్ళి టెంట్ వరకూ రానివ్వకుండా నిలబడ్డారు. ఏవో నినాదాలు ఇస్తున్నారు. ఇంతలో తొంగమ్ సునీత అనే అమ్మాయి నన్ను టెంటు లోపలికి గుంజుకుని వచ్చి.. ‘తక్కువ టైం ఉంది, ఇంటర్వ్యూ త్వరగా చేసేయండి’ అన్నది. నేను మళ్ళీ టెంటులోకి వెళ్ళాను. ఇబెంహాల్ చేయిని పట్టుకుని, ‘ఆఫ్‌స్పా చట్టాన్ని ఎత్తేస్తారమ్మా.. కచ్చితంగా జరుగుతుంది’ అని చెప్పా. ‘మేము బతికుండగా చూస్తామా?’ అని మమన్ లైమా అడిగింది. నేను మౌనంగా కూర్చున్నాను. ‘ఆ రోజున కాంగ్లా గేటు ముందర నిలబడి బట్టలు తీసి పారేశాం. చెప్పు.. ఏ స్త్రీ అయినా చేయగలదా ఆ పని? ఎందుకు చేశాం? బట్టలుండి ఉపయోగం ఏంటి? ప్రతి రోజూ మణిపుర్లో ఎక్కడో అక్కడ ఒక ఆడపిల్ల చిరిగిన బట్టలతో శవమై రోడ్డున తేలుతోంది. ఏం ఉపయోగం బట్టలతో.. మేం అదే చెప్పాం.. పద కొండుమంది ఉన్నాం ఆ రోజు. మమ్మల్ని రేప్ చేయండి. ఎంత మంది జవాన్లు కావాలంటే అంతమంది.. మేం బతికి ఉన్నన్నాళ్ళూ మమ్మల్ని వాడుకోండి. కానీ.. మా పిల్లల్ని వదిలేయండి. మా అమ్మా యిల మానం చెడగొట్టద్దు. మా అబ్బాయిలని బుల్లెట్లకి బలి చేయొద్దు అని ఏడ్చాం. వాళ్ళేం అన్నారు? మా సి.ఎం. ఏం అన్నాడు? ఇలా కల్లోలాలు సృష్టించడం వల్లే ఆఫ్‌స్పా వచ్చింది, నేను సెంటర్‌తో మాట్లాడతా, మీరు పోరాటం ఆపండి అన్నారు. ఏం చేశారు? పన్నెండేళ్ళయింది? ఏమన్నా మార్పు ఉందా? అని ఆవేశంగా అరిచింది సైబమ్ మమన్ లెయిమా. మీ పోరాటం తర్వాత పరిస్థితుల్లో కాస్త కూడా మార్పు రాలేదా? అని అడి గాను. ‘వచ్చింది. ఒకే ఒక్క మార్పు. మేము పవిత్రంగా, దేవతల నిలయంగా భావించే కాంగ్లా కోట నుండి అస్సాం రైఫిల్స్‌ని పంపించేసింది కేంద్రం. దాన్ని ప్రజలకి అంకితం చేస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. అంతకు మించి ఏం జరగ లేదు. 15 ఏళ్ళగా ఇరోమ్ షర్మిల నిరాహార దీక్ష చేస్తోంది. ఎవ్వరికైనా పట్టిందా? మణిపుర్‌కి మోడి వచ్చాడు. కనీసం ఇరోమ్ షర్మిలని కలవలేదు. అసలు మాకేం విలువ ఉంది? మేం చేసిన నేరం ఏంటి? ఎందుకు మమ్మల్ని మనుషులుగా చూడరు? అని నన్నే నిలదీసినట్టు అడి గింది ఆవిడ. ‘2004లో మీరు చేసిన పోరాటానికి కూడా ప్రజలు చాలా కదిలిపోయారు. అప్పటికి సోషల్ మీడియా ఇంతగా లేకపోబట్టి ప్రచారం కాలేదు. మా తెలుగు భాషలో పత్రికల వాళ్ళు చాలా మంది మీ గురించి రాశారు. కవితలు వచ్చాయి. ఖండనలు వచ్చాయి. నేను కూడా రాశాను..’ అని నా దగ్గరున్న పీడీఎఫ్ ప్రతిని చూపించాను. వాళ్ళ మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి.. మన భాష అర్థం కాకపోరుునా.. ఏం రాశానో అక్షరం అక్షరం చదివి వినిపించుకున్నారు. ఇంకా చాలా మందే రాశారు అని శివసాగర్ కవిత చెప్పాను. ఏమన్నా ఉంటే పేపర్ కటింగ్స్ పంపమని అడ్రస్ కూడా ఇచ్చారు. ఇంతలో ఆర్మీ ఉద్యమకారులని దాటుకుని టెంట్ దాకా రానే వచ్చింది. వాళ్ళకీ, వీళ్ళకీ మాటల యుద్ధం జరుగుతోంది. ఆర్మీ వాళ్ళు మమ్మల్ని చూసి, వీళ్ళెవరు? అని అడిగారు. అప్పటిదాకా మాతో అంత ప్రేమగా మాట్లాడి, బాబుకి బంద్ టైంలో కూడా లేస్ కొనిచ్చినవాళ్ళు.. ఒక్కసారి ‘మాకు తెలీదు’ అని ఇంగ్లీషులో చెప్పారు. ‘టూరిస్టులు. బంద్ అని తెలీక రోడ్డు మీదకి వచ్చారట. ఎటు వెళ్లాలో తెలీక ఇక్కడ ఆగారు’ అని మావైపు చూసి, సైగ చేశారు. అక్కడ ఉన్న జర్నలిస్టులు కూడా, ‘మీరు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. వెళ్ళిపోండి’ అని గట్టిగా చెప్పారు. ‘మేం మొండిగా నిలబడ్డాం. ఏం జరుగుతుందో చూస్తాం, మీరుండలా, మేమూ అలాగే ఉంటాం’ అని చెప్పాం. వాళ్ళలో ఒకరు చేతికి తగిలిన దెబ్బ చూపించి, ఇదే దెబ్బ మీ బాబుకి తగలచ్చు వెళ్ళిపొండి అని చెప్పారు. ఆర్మీ వాళ్ళు మా దగ్గరకి వచ్చి, వార్నింగ్ ఇచ్చారు. మేం ఆ స్త్రీల వైపు చూస్తే.. ‘వెళ్ళిపోండి.. ఎవరు చెప్పారు మణిపుర్‌కి వెళ్ళమని. ఇక్కడ మీరు పీల్చే గాలి.. ఎందరో పిల్లల.. ఆఖరి శ్వాస’ అని అరిచి, వెళ్ళిపొండి, బాబు ఉన్నాడు అన్నట్టు సైగ చేసింది. మేము మౌనంగా మా హోటల్ వైపు నడిచాం. దారిలో టియర్‌గ్యాస్, రబ్బరు బులెట్ల ఆనవాళ్ళు... రక్తం మరకలు.. ఆ మర్నాడు పేపర్లో.. రక్తం ఓడుతున్న కుర్రాళ్ళ ఫొటోలు.. (వ్యాసకర్త : చైతన్య పింగళి, పాత్రికేయురాలు ఈమెయిల్ : chaithanyapingali@gmail.com) -
16 ఏళ్ల దీక్ష విరమిస్తా
- ఆగస్టు 9న దీక్ష విరమణకు ఇరోమ్ షర్మిల ముహూర్తం - వచ్చే మణిపూర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన - ప్రజాసంఘాల ఉదాసీనత కారణంగానే నిర్ణయం - కుటుంబసభ్యులు, సన్నిహితుల ఆశ్చర్యం ఇంఫాల్ : మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) ఎత్తేయాలని కోరుతూ 16 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉక్కుమహిళ ఇరోమ్ చాను షర్మిల ఆగస్టు 9న తన సుదీర్ఘ దీక్షను విరమించనున్నట్లు ప్రకటించారు. ఆత్మహత్యాయత్నం ఆరోపణలపై మంగళవారం ఇంఫాల్ కోర్టు విచారణకు హాజరైన 44 ఏళ్ల షర్మిల.. నిరాహార దీక్ష వల్ల సాధించేదీ లేదని భావిస్తున్నందున వివాదాస్పద ఏఎఫ్ఎస్పీఏ చట్టం రద్దుకోసం త్వరలోనే రాజకీయాల్లో చేరనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానన్నారు. ప్రజలు, ప్రజాసంఘాల నుంచి తన ఉద్యమానికి సరైన మద్దతు రాకపోవటం, ప్రభుత్వం తన డిమాండును పట్టించుకోకపోవటంతోనే నిరాహార దీక్షను విరమించాల్సి వస్తోందన్నారు. 2000లో దీక్ష మొదలుపెట్టినప్పటినుంచి ఆహారం తీసుకునేందుకు నిరాకరించటంతో.. ముక్కునుంచి వేసిన ట్యూబు ద్వారా ద్రవాలనందిస్తున్నారు. గతంలో చాలా మంది రాజకీయ నాయకులు ఈ ఉక్కు మహిళను కలసి.. తమ పార్టీలో చేరాలని కోరినా ఆమె తిరస్కరించారు. కాగా, నిరాహార దీక్ష విరమించాలని షర్మిల తీసుకున్న నిర్ణయంతో ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని విరమించాలని ఎన్నిసార్లు చెప్పినా ఇరోమ్ వినలేదని.. అలాంటిది దీక్ష విరమించి అనుకున్నది సాధించేందుకు రాజకీయ మార్గం ఎంచుకోవటం ఆశ్చర్యం కలిగించిందని ఆమె సోదరుడు సింఘాజిత్ తెలిపారు. ఆమెతో పాటు పోరాటం చేస్తున్న పలువురు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కూడా ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, వివాదాస్పద చట్టాన్ని రద్దుచేయాలంటూ నిరాహార దీక్ష మొదలైనప్పటినుంచి కేవలం ఒకసారి మాత్రమే తల్లిని కలిసిన (2009లో తీవ్రమైన అనారోగ్యం బారినపడ్డప్పుడు) ఈ ఉక్కు మహిళ దీక్ష విరమించాక తొలిముద్ద తన తల్లి చేతుల మీదుగానే తింటానన్నారు. దీక్ష విరమించాక వివాహం చేసుకోనున్నట్లు ఆమె ప్రకటించారు. ఓ భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు షర్మిలకు బాయ్‌ఫ్రెండ్ అని తెలిసింది. ఈయన ప్రోత్బలంతోనే షర్మిల నిరాహార దీక్ష విరమించుకుని.. రాజకీయ బాట పట్టారనే గుసగుసలూ వినబడుతున్నాయి. అవార్డులు, అభినందనలు ఈమె చేసిన ప్రయత్నానికి పలు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. 2007లో ‘గ్వాంగ్జు ప్రైజ్ ఫర్ హ్యుమన్ రైట్స్’ ఈ ఐరన్ లేడీకి దక్కింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు షర్మిలను బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశాయి. పలు ఎన్జీవోలు ఈమెకు మద్దతుగా ఉన్నాయి. ఈమె పేరుతో చాలా పుస్తకాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ‘మై బాడీ, మై వెపన్’ పేరుతో వచ్చిన డాక్యుమెంటరీ ఎన్నో ప్రశంసలు అందుకుంది. దీక్ష ఎందుకోసం? 2000 నవంబర్‌లో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు సమీపంలోని ఓ గ్రామంలో అస్సామ్ రైఫిల్స్ బెటాలియన్ (సాయుధ బలగాలు) 10 మందిని హతమార్చారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (అనుమానం వచ్చిన వ్యక్తులను చంపినా.. దీనికి కోర్టులో విచారణ ఉండదు) కారణంగానే ఈ హత్యలు జరగటంతో ఈ చట్టాన్ని రద్దుచేయాలని షర్మిల అమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. షర్మిల చేస్తున్న అహింసాయుత ఉద్యమానికి కొద్ది రోజుల్లోనే ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తి మద్దతు లభించింది. 2006లో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగి ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునివ్వటంతో.. ఆమెను అరెస్టు చేసి వదిలిపెట్టారు. అనంతరం పలుమార్లు ఆత్మహత్యాయత్నం కేసులో అరెస్టు చేసి, విడుదల చేశారు. ‘శరీరమే నా ఆయుధం’ ఇరోమ్ చాను షర్మిల. మారుమూల రాష్ట్రమైన మణిపూర్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యను పరిష్కరించేందుకు ప్రాణాన్నే పణంగా పెట్టిన సామాజిక వేత్త. ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన షర్మిల మణిపురీ భాషలో మంచి కవయిత్రి కూడా. 2000 నవంబర్‌లో ఇంఫాల్ సమీపంలో జరిగిన ‘మాలమ్ హత్యాకాండ’ షర్మిల జీవితాన్ని మలుపుతిప్పింది. బస్‌స్టాపులో నిలబడిన 10 మందిని అస్సాం రైఫిల్స్ బెటాలియన్ దారుణంగా కాల్చి చంపింది. మృతుల్లో 62 ఏళ్ల మహిళతోపాటు సినామ్ చంద్రమణి (18) అనే జాతీయ సాహస బాలల అవార్డందుకున్న యువతి కూడా ఉంది. దీంతో తీవ్రంగా చలించిన షర్మిల సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను రద్దుచేయాలంటూ దీక్ష ప్రారంభించారు. ఆహారాన్ని తీసుకోకపోవటం మాత్రమే కాదు.. ఈ చట్టాన్ని తొలగించేంత వరకు అద్దంలో మొహం చూసుకోనని, జుట్టును కూడా ముడివేయనని చాణక్య శపథం తీసుకున్నారు. డిమాండ్ నెరవేర్చుకునేందుకు తన శరీరాన్ని శుష్కించుకునేందుకు కూడా వెనకాడలేదు. ఒక రోజు, రెండ్రోజులు కాదు.. ఏకంగా 16 ఏళ్లుగా ఇలా నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు. ఏఎఫ్ఎస్పీఏ చట్టంపై యుద్ధం ప్రారంభించేటప్పటికి షర్మిల వయసు 28 ఏళ్లు. 2004లో 30 మంది షర్మిల మద్దతు దారులు ఢిల్లీలోని అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం ముందు నగ్నంగా ప్రదర్శన చేశారు. దీంతో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఉక్కు మహిళ ఆందోళనపై దృష్టిపెట్టాయి. జాతీయంగా పలువురు నోబెల్ అవార్డు గ్రహీతలు, అన్నాహజారే వంటి సామాజిక కార్యకర్తలు ఆమె ఉద్యమానికి మద్దతు తెలిపారు. అయినా.. ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేయించటంలో విజయం సాధించలేకపోయారు. ఇందుకోసం ప్రధానులు, మంత్రులకు లెక్కలేనన్ని సార్లు లేఖలు రాశారు. అయితే.. తన డిమాండ్ నెరవేర్చుకునేందుకు రాజకీయ పోరాటాన్ని ఎంచుకోవాలని ఉక్కు మహిళ నిర్ణయించుకున్నారు. -
‘ఉక్కుమహిళ’ కొత్త మార్గం
పదహారేళ్లుగా కొనసాగిస్తున్న తన నిరవధిక నిరాహార దీక్షను వచ్చే నెల 9న విరమించుకోబోతున్నట్టు మణిపూర్ ఉక్కుమహిళ ఇరోం షర్మిల మంగళవారం చేసిన ప్రకటన ఏకకాలంలో సంతోషాన్నీ, విచారాన్నీ కలిగిస్తుంది. సంతోషం ఎందు కంటే- ఇన్నేళ్లుగా అవిచ్ఛిన్నంగా ఆహారమూ, మంచినీరూ తిరస్కరిస్తూ వస్తున్న షర్మిల ఇకపై దానికి స్వస్తిచెప్పబోతున్నారు గనుక... తనకు నచ్చిన ఆహారాన్ని తీసు కుంటారు గనుక... తన మనసు గెలిచినవాడిని మనువాడబోతున్నారు గనుక... తనకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకోబోతున్నారు గనుక. కానీ ఇదే సమయంలో విచారించదగ్గ అంశమూ ఉంది. ఏ పార్టీలోనూ, సంస్థలోనూ సభ్యత్వం లేని, ఎలాంటి సిద్ధాంతాలకూ ప్రభావితంకాని ఒక సాధారణ మహిళ... తన కళ్లెదుట సాగుతున్న దుర్మార్గాలను కొనసాగనీయరాదన్న ఏకైక లక్ష్యంతో ముందుకొచ్చిన ప్పుడు ఆమె గొంతును వినడానికి ఏ ప్రభుత్వమూ సిద్ధపడలేదు. ఆమె డిమాం డ్‌ను కనీసం పరిశీలించి నెరవేర్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినవారు లేరు. ఇది బాధాకరమైన విషయం. 2000 సంవత్సరం నవంబర్‌లో ఆమె ఈ నిరశన దీక్షకు సంకల్పించినప్పుడు ఇంత సుదీర్ఘకాలం కొనసాగించవలసి వస్తుందని ఆమె అనుకుని ఉండరు. మహాత్మాగాంధీ చూపిన అహింసాయుత మార్గంలో తన దేహాన్నే అస్త్రంగా మలుచుకుని షర్మిల సాగించిన దీక్ష మన దేశంలోనే కాదు... ప్రపంచంలోనే నిరుపమానమైనది. ఆ దీక్షా యజ్ఞం కోసం ఆమె తీసుకున్న కఠిన నిర్ణయాలు అందరినీ అచ్చెరువొందిస్తాయి. హృదయమున్న ప్రతి ఒక్కరినీ కదిలి స్తాయి. అమ్మను చూస్తే కరిగి నీరై పోతానని, ఎంచుకున్న మార్గంనుంచి పక్కకు తప్పుకుంటానని శంకించి ఆమెను కలవబోనని షర్మిల ప్రకటించారు. తల్లి సైతం కన్నపేగు మమకారాన్ని తనలోనే అణుచుకుని, షర్మిల నిర్ణయాన్ని గౌరవించి ఆమెకు దూరంగా ఉండిపోయారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 309కింద ఆత్మహ త్యకు ప్రయత్నించారని ఆరోపించి కేసు పెట్టడం, నిర్బంధించడం...ముక్కు ద్వారా ట్యూబు పెట్టి బలవంతంగా ద్రవాహారాన్ని ఎక్కించడం మాత్రమే ఇన్నేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న పని. ప్రతి 15 రోజులకూ ఆమెపై కేసు పెట్టడం, నిర్బంధిం చడం, కోర్టులో శిక్ష విధించడం... అది పూర్తయ్యాక మళ్లీ ఇదంతా ప్రారంభం కావడం రివాజు అయింది. ఆమె కోసం ఇంఫాల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ఒక వార్డునే జైలుగా మార్చారు. అందులోనే ఆమె ఇన్నేళ్లుగా బందీగా ఉన్నారు. షర్మిల మనోభావాలేమిటో, ఆమె ఎంతటి దుర్భరమైన పరిస్థితుల్లో దీక్షను కొనసాగిస్తు న్నారో ఈ నెల 14న ‘సాక్షి’లో వెలువడిన వ్యాసం కళ్లకుకట్టింది. షర్మిల మానవమాత్రులకు తీర్చడం సాధ్యంకాని డిమాండ్నేమీ కోరలేదు. సాయుధ దళాల(ప్రత్యేకాధికారాల) చట్టాన్ని రద్దు చేయాలని ఆమె అడిగారు. ఆ చట్టం సాయుధ దళాలకు అది అపరిమితమైన అధికారాలిస్తున్నది. కల్లోలిత ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించాక అలాంటిచోట ఏ వారెంటూ లేకుండా ఎక్క డైనా సోదా చేయడానికీ, ఎవరినైనా అరెస్టు చేయడానికీ, అనుమానం వస్తే కాల్చి చంపడానికీ జవాన్లకు అధికారం సంక్రమిస్తుంది. వారి చర్యను న్యాయ స్థానాల్లో ప్రశ్నించడానికి వీలుండదు. ఇలాంటి అపరిమిత అధికారాలిచ్చిన అండతో సాయుధ బలగాలు అతిగా ప్రవర్తిస్తున్నాయని... అమాయక పౌరులపై జులుం ప్రదర్శిస్తున్నాయని... పౌరుల ప్రాణాలు తీస్తున్నాయనీ పౌరహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. తీవ్రవాదంతో, వేర్పాటువాదంతో సంబంధం లేని అనేకమంది యువతీయువకులు అకారణంగా అదృశ్యమవుతున్నారని, మహిళలపై అత్యాచారా లతోసహా అనేక నేరాలు చోటుచేసుకుంటున్నాయని ఆ సంఘాలు సవివరమైన నివేదికలిచ్చాయి. మొన్న జనవరిలో ఒక కానిస్టేబుల్ ఆరేళ్లక్రితంనాటి ఎన్కౌంటర్ వెనకున్న వాస్తవమేమిటో వెల్లడించి అందరినీ దిగ్భ్రమపరిచాడు. ఇంఫాల్ నడి బొడ్డున దుకాణ సముదాయంలో నిరాయుధంగా ఉన్న 22 ఏళ్ల యువకుడు సంజిత్ మెయితీని అప్పటి ఏఎస్పీ ఆదేశాల మేరకు కాల్చిచంపానని మీడియాకు వెల్లడించాడు. ఈమధ్యనే సుప్రీంకోర్టు సైతం దాదాపు 1,528 ఎన్‌కౌం టర్ల విషయంలో కేంద్రాన్ని నిలదీసింది. ఏదోరకమైన జవాబుదారీతనాన్ని కల్పించ కుంటే ఎలాగని ప్రశ్నించింది. ఈ విషయంలో అందరికీ సందేహాలొస్తున్నాయి...ఏలినవారికి తప్ప! కేంద్రమే నియమించిన జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి కమిషన్ ఆ చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని గతంలో తేల్చిచెప్పింది. భద్రతారీత్యా అవసరమనుకుంటే ఆ చట్టంలోని కొన్ని నిబంధనలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)లో చేర్చ వచ్చునని సూచించింది. ఒక యువతి అదృశ్యం, హత్య కేసులో నియమించిన ఉపేంద్ర కమిషన్ సైతం ఇలాగే సిఫార్సుచేసింది. యూపీఏ సర్కారు హయాంలో పదేళ్లపాటు కీలక స్థానాల్లో పనిచేసిన చిదంబరం మాజీగా మారాక ఇప్పుడు ఆ చట్టం సరికాదంటున్నారు. ఏది ఏమైనా ఇన్నేళ్లుగా మన పాలకులు ఆమె విష యంలో పాటించిన మౌనం, నిర్లిప్తత బాధాకరమైనది. 28 ఏళ్ల ప్రాయంలో దీక్షకు ఉపక్రమించిన షర్మిల ఆరోగ్యం ఈ సుదీర్ఘ దీక్షతో గణనీయంగా దెబ్బతిన్నది. మహిళగా నెలనెలా ఎదుర్కొనక తప్పని ఇబ్బందులు ఆమెను ఎంతగానో బాధిస్తున్నాయి. సాధారణ పద్ధతిలో ఆహారం తీసుకోక పోవడంవల్ల... అది కూడా ద్రవాహారమే కావడంవల్ల జీర్ణ వ్యవస్థ ఆ మేరకు అస్త వ్యస్థమైందని వైద్యులు అంటున్న మాట. ఇప్పుడు సాధారణ జీవనస్రవంతిలోకి అడుగిడాలనుకుంటున్న షర్మిలకు మన నేతలిచ్చే సందేశం ఏమిటి? దీక్ష ద్వారా సాధించలేనిది ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికై పొందగలనన్న ఆమె విశ్వాసానికి భరోసా ఇవ్వగలరా? ఆమె మాట ఇకపై అరణ్యరోదన కాబోదని హామీ ఇవ్వ గలరా? అసలు మన ఎన్నికల వ్యవస్థ షర్మిలవంటి వజ్రసదృశ వ్యక్తిత్వాలను శిరోభూషణం చేసుకుంటుందని ఘంటాపథంగా చెప్పగలరా? ఇవన్నీ చేయగలిగితే షర్మిలను మాత్రమే కాదు... ఇతరేతర మార్గాల్లో పోరాడేవారిని సైతం ఇటువైపు ఆకర్షించడం సాధ్యమవుతుంది. మన నేతలు అందుకవసరమైన చిత్తశుద్ధినైనా ప్రదర్శించాలని కోరుకుందాం. -
రాజకీయాల్లోకి ఇరోమ్ షర్మిళ!
-
రాజకీయాల్లోకి ఇరోమ్ షర్మిళ!
ఉక్కుమహిళగా పేరుగాంచిన ఇరోమ్ షర్మిల (42)... 14 ఏళ్ల తర్వాత వచ్చే నెల 9న తన నిరహార దీక్షను విరమించనున్నారు. సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలంటూ అసోంలో ఆమె గత కొన్ని సంవ్సతరాలుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టీపీఎన్ (టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్) ద్వారా ఆమె జీవిస్తున్నారు. ఆగస్టు 9న దీక్ష విరమించిన తర్వాత ఆమె వివాహం చేసుకుంటారని ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2000 నవంబర్ లో భద్రతా దళాలకు ఉన్న ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) కు వ్యతిరేకంగా షర్మిల దీక్షను ప్రారంభించారు. ఎమర్జెన్సీ సమయంలో ఈ అధికారాన్ని ఆర్మీ వినియోగించుకునే హక్కు ఉంటుంది. షర్మిల దీక్షకు కొద్ది రోజుల ముందు ఇంఫాల్ లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 10 మంది పౌరులు మృతి చెందారు. -
ఇరోమ్ షర్మిల నిర్దోషి
ఢిల్లీ కోర్టు తీర్పు న్యూఢిల్లీ: మణిపూర్ హక్కుల ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిలను ఓ కేసులో ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పదహారేళ్లుగా ఆమరణ దీక్ష చేస్తున్న ఇరోమ్‌పై 2006లో ఢిల్లీలో నమోదైన ఆత్మహత్యాయత్నం కేసులో ఈ తీర్పు వెలువరించింది. 2006లో జంతర్‌మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేపట్టిన సందర్భంలో ఇరోమ్‌పై ఆత్మహత్యాయత్నం కేసు నమోదైంది. దీన్ని విచారించిన ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ ఆమెను నిర్దోషిగా ప్రకటించారు. దీనిపై షర్మిల కోర్టుబయట మాట్లాడుతూ గాంధేయ మార్గంలో నడుస్తున్నానన్నారు తనను జైల్లో ఉంచినా, బయట ఉంచినా ఆ చట్టం ఉపసంహరించేవరకూ తన పోరాటం సాగిస్తానని వెల్లడించారు. కాగా ఆమెకు ఓ కేసులో బెయిలు మంజూరుకు కోర్టు రూ.10వేల వ్యక్తిగత పూచీకత్తును చెల్లించాలని కోర్టు ఆదేశించగా దాన్నీ ఆమె తిరస్కరించారు. తాను అహింసా మార్గంలో పోరాడతానన్నారు. -
ఆ దీక్షకు పదిహేనేళ్లు
సందర్భం మణిపూర్ సాయుధ బలగాల ప్రత్యేకాధికార చట్టం రద్దు కోసం ఒక స్త్రీ అన్నాహారాలు, మంచి నీళ్లు తీసుకోకుండా 700 వారాలుగా పోరాటం సలుపుతున్న ఘటన మానవాసక్తిని కలిగించకపోవడం బాధాకరం. తడిసిమోపిడన్ని వార్తా కథ నాలు ఇప్పటికే అల్లేశారు. లెక్కలేనన్ని కాలమ్‌లు రాసే శారు. బోలెడన్ని నిజనిర్ధార ణలు, బోలెడు విశ్లేషణలు పూర్తయ్యాయి. ఆ అమ్మాయి కథవెనుక ఉన్న రెండు వెర్షన్ లను ప్రపంచ జర్నలిస్టు మిత్రులు ఇకచాలు బాబో అన్నంత విస్తృతంగా ఇప్పటికే చూపించేశారు. కానీ నేను ఈరోజు ఈ కథనాన్ని ఒక జర్నలిస్టుగా రాయడం లేదు. జీవితంలో కాస్సేపు నా జర్నలిస్టు ఉడుపులను వదిలేస్తు న్నందుకు నా సహచరులకు క్షమాపణ చెబుతున్నాను. వృత్తిలో ఎన్నడూ ఏకపక్ష ధోరణిని కలిగి ఉండరాదని నాకు జర్నలిజం అధ్యయనం బోధించింది. కానీ ఆ నీతిని నేను ఇవ్వాళ ఉల్లంఘిస్తున్నాను. ఈరోజు నేను ఉద్దేశపూర్వకంగానే పాక్షిక దృక్పథంతో ఉండాలనుకుం టున్నాను. ఇవ్వాళ ఒక పక్షం కథనాన్నే చెప్పాలనుకుం టున్నాను. అది ఇరోమ్ షర్మిల గాథ. పరమ నిరంకుశ పూరితమైన సాయుధ బలగాల ప్రత్యేకాధికార చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)పై ఇరోమ్ షర్మిల చేస్తున్న అలుపెరుగని పోరాటం మరో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా నేను ఈ కథనాన్ని రాస్తు న్నాను. ఆమె పోరాటం 2000 నవంబర్‌లో ప్రారంభ మైంది. మణిపూర్ చరిత్రలో మాయని మచ్చలా మిగిలి పోయిన రోజది. మణిపూర్‌లోని ఇంఫాల్ లోయలో ఉన్న మలోమ్ పట్టణం ఆరోజు దారుణ మారణకాండకు నెలవైంది. భారత పారామిలటరీ బలగాల్లో ఒకటైన అస్సాం రైఫిల్స్ దళం బస్టాపులో వేచి ఉంటున్న ప్రయా ణికులపై కాల్పులు జరిపి పది మంది అమాయకులను పాశవికంగా కాల్చి చంపింది. మృతులలో మహిళలు, సీనియర్ పౌరులు, మైనర్ పిల్లలు ఉన్నారు. ఆ పది మంది అమాయక ఆత్మలు పెట్టిన విలాపం సాయుధ బలగాలు చిందించిన రక్తధారల్లో కొట్టుకుపోయింది. ఆ వీధి ఇప్పుడు భయంకర మౌనం పాటిస్తూ ఉండవచ్చు కానీ క్రూరమైన ఎన్‌కౌంటర్‌కు అది సాక్షీభూతంగా నిలి చిపోయింది. దానికి లెసైన్స్ ఇచ్చింది సాయుధ బల గాల ప్రత్యేకాధికార చట్టం. ప్రతి గురువారం లాగే ఇరోమ్ చాను షర్మిల ఆ రోజు కూడా ఉపవాస దీక్షలో ఉండింది. కాని ఆ రోజు నుంచి ఆమె ఉపవాసం కొనసాగుతూనే ఉంది. 15 ఏళ్లు పూర్తయినా ఆమె నిరాహార దీక్ష ఆగటం లేదు. అన్నా హజారే 12 రోజులపాటు సాగించిన దీక్ష జాతిని కదిలిం చింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ షర్మిల 15 ఏళ్లుగా సాగిస్తున్న సుదీర్ఘ పోరాటం జనం జ్ఞాపకాల్లో కలిసిపోయింది. ఒక వ్యక్తి అన్నా హారాలు, నీళ్లు తీసుకోకుండా 700 వారాలుగా పోరాటం సలుపుతుండటం ఇప్పుడు మానవాసక్తిని కలిగించక పోవడం బాధాకరం. సాయుధ బలగాల ప్రత్యేకాధికార చట్టం నిబంధ నల ప్రకారం వారంట్ లేకుండా సైన్యం దాడులు నిర్వహించవచ్చు. సాధారణ సైనికులకు కూడా ఈ చట్టం తిరుగులేని రక్షణ కల్పిస్తోంది. ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. అనుమానం వచ్చినా సరే అదుపులోకి తీసు కోవచ్చు. బలప్రయోగం కూడా చేయవచ్చు. ఈరోజు ప్రముఖ వార్తా వెబ్సైట్లను చూస్తుంటే ఒక వార్త కనిపించింది. ‘భారత్ ప్రపంచంలోనే 7వ అత్యంత విలువైన జాతీయ బ్రాండ్ కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. 2.1 బిలియన్ డాలర్లతో ఇండియా బ్రాండ్ విలువ 32 శాతం పెరుగుదల నమోదు చేసింది.’ అత్యంత విలువైన జాతి? నిజమే కావచ్చు. ఎందు కంటే ఆర్థికవ్యవస్థ మానవ వేదనను ఎన్నటికీ పరిగణన లోకి తీసుకోదు. బహుశా ఈ దేశంలో మానవ ప్రాణాల కంటే కరెన్సీకే ఎక్కువ విలువ ఉంటోందేమో మరి. ఈ దశాబ్దిన్నర కాలంలో ప్రభుత్వాలు మారాయి. ఆమె నిరాహారదీక్షపై అనేక సంప్రదింపులు జరిగాయి. కానీ 15 ఏళ్ల తర్వాత కూడా దానికి ఒక తార్కిక ముగింపు లభించడం లేదు. ఆమె పోరాటం చాలామందికి రాజ కీయ ప్రయోజనాలకు ఉపయోగపడి ఉండవచ్చు. కానీ గార్డుల పహారాలో ఉన్న ఆ ఆసుపత్రి గది ఇరోమ్ షర్మి లకు శాశ్వత ఖైదుగా మారిపోయింది. ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటోందన్న ఆరోపణపై పదేపదే ఆమె అరెస్టులకు గురవుతూనే ఉన్నారు. ఈ మొత్తం ఉదంతంలో లోపం ఎక్కడుంది? ప్రతి ఏడాది ఆమె ఉద్యమాన్ని, పోరాటాన్ని తలుచుకుంటూ అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, దురదృష్టవశాత్తూ మనం ఈవిషయంలో మరింత చేయలేకపోతున్నావేమో! ఇరోమ్ షర్మిలపై, ఈశాన్య భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై వందలాది వ్యాసాలు రాసి ఉంటారు. వారిలో నేనూ ఒకడిని. ఈ పదిహేనేళ్ల కాలంలో ఆమెకు దక్కిందేమిటి? ‘మణిపూర్ ఉక్కుమహిళ’, ‘ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ నిరా హార దీక్షాపరురాలు’, ‘ఠాగూర్ శాంతి బహుమతి’. ఒక మనిషి ఆశయాన్ని ఫలింపచేయలేని పనికిరాని అవా ర్డులూ, గుర్తింపులు ఇవి. 28 ఏళ్ల ప్రాయంలో అత్యంత వేదనామయమైన పోరాటం మొదలెట్టిన షర్మిలకు ఇప్పుడు 43 ఏళ్లు. విషాదం ఏమిటంటే, ప్రభుత్వ పాలనాతీరును మార్చడంలో వైఫల్యం పొందిన అద్భుత స్త్రీమూర్తిగా ఆమె మిగిలిపోవడమే. మనం కేవలం తలుపు తట్టగలం. కానీ తాళాన్ని తెరవవలసింది వ్యవస్థ మాత్రమే. మనం తలుపులు బద్దలు కొట్టవచ్చు. కానీ మనపై వ్యవస్థా వ్యతిరేకులనే ముద్రపడుతుంది. బహుశా ఇది చైతన్యవంతమైన కార్య క్రమాలు చేపట్టడానికి కాస్త ప్రోత్సాహం అందించ వచ్చు. మనం చేయవలసింది ఏమిటంటే, షర్మిల ఇప్పటికీ బలవంతంగా ఆహారం తీసుకుంటుండగా.. మన శాసనకర్తలు ఈ సమస్యపై మూసిన తలుపుల మధ్య అల్పాహారం తీసుకుంటూ, భోంచేస్తూనే చర్చలు జరుపుతూ అంతిమ పరిష్కారం వెదికేంతవరకు ఓపి కగా మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవడమే. (మణిపూర్‌లో సాయుధ బలగాల ప్రత్యేకాధికార చట్టం రద్దు డిమాండ్‌తో ఇరోమ్ షర్మిల చేస్తున్న ఆమ రణదీక్షకు 15 ఏళ్లు అయిన సందర్భంగా...) (countercurrents.org సౌజన్యంతో...) వ్యాసకర్త ఈశాన్య భారత జర్నలిస్టు, రచయిత షమీమ్ జకారియా -
ఇరోం షర్మిల మళ్లీ అరెస్టు
ఇంఫాల్: సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలని 14 ఏళ్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఇరోం షర్మిలను పోలీసులు శుక్రవారం మళ్లీ అరెస్టు చేశారు. ఆమెపై ఆత్మాహత్యాయత్నం అభియోగాలను తిరస్కరించిన కోర్టు, షర్మిలను గురువారం విడుదల చేసింది. ఆమె విడుదలైన తర్వాత మళ్లీ నిరశనకు దిగారు. దాంతో మళ్లీ అదే అభియోగంపై పోలీసులు అరెస్టు చేశారు. అదే అభియోగంపై అరెస్టు చేసినప్పటికీ, ఇది వేరే కేసు అని తెలిపారు. -
ఇరోం షర్మిల విడుదల.. మళ్లీ దీక్ష
ఇంఫాల్: సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దుచేయాలన్న డిమాండ్‌తో 14 ఏళ్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఇరోం షర్మిలను గురువారం ఇంఫాల్ జ్యుడీషియల్ కోర్టు విడుదల చేసింది. షర్మిలపై మోపిన ఆత్మహత్యాయత్నం అభియోగాలను కోర్టు తిరస్కరించింది. షర్మిల ఆత్మహత్యకు యత్నించారన్న దానిపై ప్రాసిక్యూషన్ ఎలాంటి ఆధారాలను సమర్పించలేకపోయిందని కోర్టు తెలిపింది. గురువారం సాయంత్రం విడుదలైన షర్మిల స్థానిక మార్కెట్లోని ఓ షెడ్లో తిరిగి నిరాహార దీక్షకు కూర్చున్నారు. -
ఇంద్రధనుస్సు
దక్షిణాసియాలోనే అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్ విబ్జీఆర్. ప్రతి ఏడాది కేరళలో జరిగే ఈ పండుగ ఈసారి బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో రెండురోజులపాటు జరిగింది. మానవత్వం, లైవ్లీహుడ్, పర్యావరణం, అభివృద్ధి, ప్రజాస్వామ్యం, ఆరోగ్యం, సెక్యులరిజం, లింగవివక్ష, మానవహక్కులు, సంప్రదాయాలు... ఇలా సమాజం చర్చించడానికి వెనుకాడుతున్న అనేక కీలక అంశాలపై తీసిన ఫిల్మ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. - ఓ మధు మణిపూర్ చట్టాలకు వ్యతిరేకంగా 11 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్ షర్మిల గురించిన చిత్రం ‘మై బాడీ మై వెపన్’ను కవితా జోషి రూపొందించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న యురేనియం మైనింగ్ మానవ జాతికి, పర్యావరణానికి ఎంతటి హానికారిగా మారనుందో అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైన్.. చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు. కాకినాడ, కోనసీమ జాలర్లు, రైతులు భూదోపిడీకి గురవుతున్న తీరు గురించిన చిత్రం ‘ ఏ స్ట్రగుల్ ఫర్ సర్వైవల్’. అరుణాచల్‌ప్రదేశ్, డమ్రూలో ఆదివాసీలు నిర్మించిన బ్రిడ్జ్ ఇంజనీర్లను కూడా ఆశ్చర్యపోయేలా చేస్తోంది. వారి నైపుణ్యం తెలిపే చిత్రం ఇన్ ది ఫారెస్ట్ హ్యాంగ్స్. ఇలా సామాజికాంశాలపై తీసిన చిత్రాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. 3డీ స్టీరియో క్యాస్ట్ సంగీతానికి భాష, జాతి, లింగ విబేధాలు లేవంటారు. కానీ కుల వివక్ష వుందనిపిస్తుంది ఈ చిత్రం చూస్తే. మలయాళ సంగీత, నృత్య కళాకారులతో రూపొందిన ఈ చిత్రానికి దర్శకత్వం అజిత్ కుమార్ ఏఏస్. కులం వల్ల కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యల కళ్లకు కట్టారాయన. కుల వ్యవస్థకు సంబంధించిన మరో సమస్యాత్మక కోణాన్ని జాడు కట్ట చిత్రం ఆవిష్కరిస్తుంది. టామ్ గాళ్ కొడుకులు లేకపోతే విలువ ఉండదని భావించిన ఓ తండ్రి కూతురిని అబ్బాయిలా పెంచుతాడు. ఆమె, ఆయనగా 70 ఏళ్ల జీవితాన్ని గడుపుతుంది. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇన్నేళ్ల తర్వాత తాను ఆడైనా, మగైనా ఒరిగేదేమీ లేదని చెప్పే టామ్ కళ్లలోకి చూస్తే... ఆ జీవితంలో వేదన కనిపిస్తుంది. స్త్రీత్వానికి దూరంగా గడిపిన టామ్ కథ చూసిన ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. లెట్ ద బటర్‌ఫ్లైస్ ఫ్లై స్త్రీగా జీవితం గడపాలనుకుని జెండర్ మార్చుకుంది శిల్ప. అది బలవంతపు ప్రక్రియగా భావించిన పోలీసులు అందుకు సహకరించినవారిని అరెస్టు చేశారు. శిల్పను మళ్లీ పురుషుడిగా మార్చేందుకు సర్జరీ చేశారు. ఈ క్రమంలో శిల్ప తల్లిదండ్రులు, సన్నిహితులు ఎదుర్కొన్న పరిస్థితులు, వారు దగా పడ్డ తీరును డాక్యుమెంటరీలో చిత్రీకరించారు దర్శకులు గోపాల్ మీనన్. సేవింగ్ ఫేస్ భర్త, ప్రేమించిన వ్యక్తుల చేతుల్లో అలాంటి దాడులకు గురైన పాకిస్తానీ స్త్రీల గాథ ఈ చిత్రం. ఈ దాడులను చూసి చలించిన లండన్‌లోని ప్రముఖ డాక్టర్ మహమ్మద్ జావేద్ ఈ స్త్రీలకు అందిస్తున్న సేవలు, వారి నిజ జీవిత గాథలను కళ్లకు కట్టారు డేనియల్ జంగ్, షర్మీన్ ఒబైద్ షెనాయ్. మంచి ప్రయత్నం... పారలల్ సినిమాలతో సమాజాన్ని సెన్సిటైజ్ చేసే ప్రక్రియకు ఆద్యుడు చార్లీచాప్లిన్. ప్రస్తుత సెమీ ఫాసిస్ట్ సొసైటీని సెన్సిటైజ్ చేసే సినిమాలు చాలా అవసరం. ఫాసిజానికి వ్యతిరేకంగా చిత్రాలు తీసినప్పుడు దాడులు జరుగుతున్నాయి. పీకే సినిమాపై దాడి ఇందుకు నిదర్శనం. సామాజిక సమస్యలపై చిత్రాలు తియ్యటం, చర్చించటం మంచి ప్రయత్నం. - ప్రొఫెసర్ హరగోపాల్ ఆనందంగా ఉంది... డైవర్సిటీని, మానవ హక్కులను గౌరవించటం చాలా ముఖ్యం. అందుకు ఉపకరించే ఇలాంటి చిత్రాలు ప్రదర్శించటం ఆనందంగా వుంది. - వసంత కన్నభిరన్ -
మరోసారి అరెస్ట్ అయిన ఇరోం షర్మిల
ఇంపాల్ : మణిపూర్ హక్కుల కార్యకర్త ఇరోం చాను షర్మిల మరోసారి అరెస్ట్ అయ్యారు. మణిపూర్‌లో అమల్లో ఉన్న వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)పై తన పోరాటాన్ని విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తున్న ఆమెను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిల ఆత్మహత్యకు యత్నిస్తున్నందున అరెస్ట్ చేసినట్లు మణిపూర్ అడిషినల్ డీజీ సంతోష్ తెలిపారు. కాగా కోర్టు ఆదేశాలతో రెండు రోజుల క్రితమే షర్మిల జైలు నుంచి విడుదలయ్యారు. అమానుష చట్టమైన ఏఎఫ్‌ఎస్‌పీఏకు వ్యతిరేకంగా ఆమె గత 14 ఏండ్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఇంఫాల్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ హాస్పిటల్‌లోని ఓ గదిని ప్రత్యేక జైలుగా మార్చి.. పోలీసు నిర్బంధంలో ఆమెకు ఇన్నాళ్లు ముక్కు ద్వారా ద్రవ ఆహారాన్ని అందించారు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ 2000 సంవత్సరం నవంబర్‌లో ఆమె ఈ దీక్ష ప్రారంభించారు. -
అసాధారణ నిరశన!
దృఢమైన సంకల్పానికి, సడలని విశ్వాసానికి ప్రతీకగా పద్నాలుగేళ్ల నుంచి అలుపెరగని రీతిలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న మణిపూర్ మణిపూస ఇరోం షర్మిల ముందు చివరకు చట్టమే ఓడిపో యింది. ఒక రాజకీయ సమస్యపై నిరశన సంధించిన మహిళపై ఆత్మ హత్యాయత్నం కింద కేసు పెట్టడం తగదని, ఆమెను తక్షణం విడుదల చేయాలని అక్కడి న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ 2000 సంవత్సరం నవంబర్‌లో ఆమె ఈ దీక్ష ప్రారంభించారు. అమ్మను చూస్తే కరిగిపోతానని, దీక్షనుంచి తప్పుకుంటానని భయ పడి ఇరోం షర్మిల ఇన్నేళ్లుగా తల్లిని కూడా కలవలేదు. తన యవ్వ నాన్ని, తన కుటుంబ జీవితాన్ని...చెప్పాలంటే తన సమస్తాన్నీ నమ్మిన సిద్ధాంతం కోసం, తోటి పౌరుల క్షేమం కోసం త్యజించిన షర్మిల 14 ఏళ్ల ప్రస్థానాన్నీ గమనిస్తే మన ప్రజాస్వామ్యంలోని డొల్ల తనం బయటపడుతుంది. తన డిమాండు విషయంలో రాజ్యం ఇంత నిర్దయగా వ్యవహరిస్తుందని బహుశా షర్మిల దీక్ష ప్రారంభించిన ప్పుడు అనుకొని ఉండరు. అప్పటికామె సాధారణ మహిళ. ఇలాంటి మహిళలో ఇంతటి పట్టుదల దాగివున్నదని అటు పాలకులకూ తోచలేదు. కానీ... మంచినీళ్లు కూడా ముట్టనని చేసిన ప్రతిజ్ఞను ఆమె కాస్తయినా సడలించుకోలేదు. కనుక ఆమెపై ఆత్మహత్యకు ప్రయత్నించారన్న ఆరోపణతో భారత శిక్షాస్మృతి సెక్షన్ 309 కింద ప్రభుత్వం కేసు పెట్టడం, న్యాయస్థానాలు జ్యుడీషియల్ కస్టడీకి పంపడం రివా జుగా వస్తున్నది. ఆమె ఆహారం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు గనుక ముక్కు ద్వారా ట్యూబు పెట్టి బలవంతంగా ద్రవాహారాన్ని ఎక్కించడం ప్రారంభించారు. ప్రతిసారీ 364 రోజులు గడిచాక నామమాత్రంగా విడుదల కావడం, మళ్లీ అదే సెక్షన్‌కింద కేసు పెట్టి ఆమెను జైలుపాలు చేయడం కొనసాగుతూ వస్తున్నది. ఈ కాల మంతా ఇంఫాల్‌లోని ప్రభుత్వాస్పత్రి వార్డునే జైలుగా మార్చి ఆమెను నిర్బంధించారు. ఎవరూ కలవ కుండా కట్టడిచేశారు. ఇరోం షర్మిల నిరాహార దీక్షకు దారితీసిన కారణాల పైనా, వాటి పరిష్కారానికి తాము తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టిపెట్టాల్సిన పాలకులు ఆమెకు బలవంతంగా ఆహారాన్ని ఎక్కించడానికి ప్రయత్నించి తమ ‘మానవత్వాన్ని’ చాటుకున్నారు. ఇలా చేయడం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే మనకు సిగ్గుచేటని, ప్రపంచానికి సత్యాగ్ర హమనే ఆయుధాన్ని అందించిన మహాత్ముడి స్మృతికి అపచారమని ఏ దశలోనూ వారికి తట్టలేదు. ఇరోం షర్మిల రద్దు చేయాలని పోరాడిన ఆ చట్టం ఎలాంటిది? జాతీయోద్యమాన్ని అణచడం కోసం బ్రిటిష్ పాలకులు తెచ్చిన సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం అత్యంత కఠినమైనది. ఆ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలతో కల్లోలిత ప్రాంతాల్లో పని చేస్తున్న జవాన్లు వారెంటు లేకుండా ఏ ఇల్లయినా సోదా చేయొచ్చు. ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. అనుమానం వస్తే కాల్చి చంపొచ్చు. వారి చర్యలను న్యాయస్థానాల్లో ప్రశ్నించడానికి వీల్లేదు. ఇలాంటి అప రిమిత అధికారాల అండతో అమాయక పౌరులపై జులుం ప్రదర్శి స్తున్నారని, తీవ్రవాదంతో సంబంధం లేని అనేకమంది యువతీయు వకులు అకారణంగా అదృశ్యమవుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నా రని మానవ హక్కుల సంస్థలు చాన్నాళ్లుగా ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండు చేస్తున్నాయి. ఈ చట్టం సమీక్షకు జస్టిస్ జీవన్‌రెడ్డి నేతృత్వంలో 2004లో యూపీఏ సర్కారు కమిషన్ కూడా ఏర్పాటుచేసింది. ఆ కమిషన్ సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాల్సిందేనని స్పష్టంచేసింది. అవసరమనుకుంటే అందులోని కొన్ని నిబంధనలను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలో చేర్చవచ్చునని సూచించింది. ఒక యువతి అదృశ్యం, హత్య విషయమై నియమించిన సి. ఉపేంద్ర కమిషన్ సైతం ఈ తరహాలోనే సిఫార్సుచేసింది. అయితే, సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం అండ లేకుండా తాము కల్లోలిత ప్రాంతాల్లో పనిచేయలేమని సైనిక దళాలు స్పష్టంచేయడంతో చట్టం కొనసాగించడానికే పాలకులు సిద్ధపడ్డారు. ఈ చట్టం మణిపూర్‌లోనే కాదు...ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోనూ, జమ్మూ-కాశ్మీర్‌లోనూ కొనసాగుతున్నది. ఆత్మహత్యాయత్నం నేరంగా పరిగణించడం తగదన్న లా కమిషన్ సూచనను ఆమోదించి, ఆ సెక్షన్‌ను రద్దు చేయడానికి నిర్ణయించినట్టు ఈమధ్యే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జీవితంలో దగాపడ్డామని, మరణం తప్ప తమకు శరణ్యం లేదని భావించి ఆత్మహత్యకు సిద్ధపడి విఫలురైనవారిని నేరస్తులుగా జమకట్టడం అమానవీయమని లా కమిషన్ అభిప్రాయపడింది. సెక్షన్ 309 కి రోజులు దగ్గరపడిన సమయంలోనే... రాజకీయ కారణాలతో చేసే నిరశనను ఆత్మహత్యాయత్నంగా పరిగణించడం తగదని మణిపూర్ కోర్టు తీర్పునివ్వడం గమనించదగింది. ఈ సెక్షన్ తొలగింపుపై ‘మానవీయ కోణం’లో ఆలోచన చేస్తున్న తరహాలోనే సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం రద్దుపై కూడా దృష్టిపెట్టడం అవసర మని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఎలాంటి రాజకీయ అభిప్రా యాలూ లేని, ఏ సంస్థతోనూ సంబంధబాంధవ్యాలు లేని ఒక సాధా రణ మహిళ ఇన్నేళ్లనుంచి అలుపెరగని రీతిలో పోరాడుతున్న తీరు చూశాకైనా ఆ విషయమై ఆలోచించాలి. ఇరోం షర్మిల విషయంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లి ఆమెను మరోసారి అరెస్టు చేయడమనే సులభమైన మార్గాన్ని ఎంచుకోవాలో... నిరంకుశ శాసనంగా నిర్ధారణ అయిన సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలో కేంద్రం తేల్చుకోవాలి. -
'ఉక్కు మహిళ'కు ఎట్టకేలకు విముక్తి
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో 14 ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్న మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని ఆస్పత్రి నుంచి ఆమె బుధవారం విడుదలయ్యారు. తనను విడుదల చేయడం పట్ల ఇరోమ్ షర్మిల సంతోషం వ్యక్తం చేసింది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ పై వెనక్కు తగ్గబోనని స్పష్టం చేసింది. నిరాహారదీక్ష కొనసాగిస్తానని ఆమె తెలిపింది. ఆస్పత్రి ప్రత్యేక వార్డులో ఉంచి ఇప్పటివరకు బలవంతంగా ఆమెకు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఆమె ఉంటున్న గదినే సబ్ జైలుగా మార్చారు. అయితే ఇరోమ్ షర్మిలను విడుదల చేయాలని మణిపూర్ కోర్టు ఆదేశించడంతో ఆమెకు విముక్తి ప్రసాదించారు. -
ఐరోమ్ షర్మిల చానును విడుదల చేయండి:కోర్టు
న్యూఢిల్లీ:ఉద్యమ నాయకురాలు ఐరోమ్ షర్మిలను విడుదల చేయాలని మణిపూర్ కోర్టు ఆదేశించింది. గతంలో ఎఎఫ్ఎస్పిఎ(ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) రద్దు కోరుతూ ఆమరణ దీక్షకు దిగిన షర్మిలను జ్యూడిషియల్ కస్టడీలో ఉంచిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం విచారించిన కోర్టు.. ఆమె ఆత్మహత్య చేయడానికి యత్నించినట్లు సరైన అధారాలు లేనందున విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 1958 చట్ట పరిధిలో ఉన్న ఎఎఫ్ఎస్పీఏ రద్దు చేయాలని కోరుతూ ఆమె 2000 వ సంవత్సరం నవంబర్ 4 వ తేదీన ఆమరణ దీక్ష కు దిగింది. -
‘ఉక్కు మహిళ’కు ఓటు లేదు!
చట్టం పేరిట ఇరోం షర్మిల ఓటు హక్కును అడ్డుకున్న ఈసీ సార్వత్రిక ఎన్నికల సాక్షిగా ప్రజాస్వామ్యం అపహాస్యం ఇంఫాల్: ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో సార్వత్రిక ఎన్నికల సాక్షిగా ఓ ఉద్యమ తరంగం ఓటు హక్కు ‘చట్టబద్ధ అణచివేత’కు గురైంది! హత్యలు, అత్యాచారాలు, దోపిడీల వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వ్యక్తులు జైళ్ల నుంచి సైతం పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు అభ్యంతరం చెప్పని ఎన్నికల కమిషన్... సామాన్యుల తరఫున దశాబ్ద కాలానికిపైగా అలుపెరగని పోరాటం సాగిస్తున్న ఓ మానవ హక్కుల కార్యకర్తకు మాత్రం నిబంధనల పేరుతో ఓటును దూరం చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో 13 ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్న మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలకు ఎన్నికల అధికారులు ఓటు హక్కు నిరాకరించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయిందంటూ గత ఎన్నికల్లో ఓటేయని ఆమె ఈసారి ఓటేసేందుకు ముందుకొచ్చినా ఆమెను చట్టం పేరు చెప్పి అడ్డుకున్నారు. షర్మిల నిరవధిక నిరాహార దీక్షకు దిగడంతో ఆమెపై పోలీసులు ఆత్మహత్య అభియోగాలు నమోదు చేశారు. ఈ అభియోగం కింద ఆమెను ఏక బిగువన ఏడాదిపాటు జైల్లో పెట్టే వీలుంది. షర్మిల బలహీనంగా ఉండటంతో ఆమెను మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని ఓ ఆస్పత్రి ప్రత్యేక వార్డులో ఉంచి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. ఆమె ఉంటున్న గదినే సబ్ జైలుగా మార్చారు. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 62 (5) ప్రకారం జైల్లో ఉండే వ్యక్తికి ఓటేసే హక్కు లేదు. ఈ నిబంధన కారణంగానే షర్మిలకు మణిపూర్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించలేకపోయినట్లు ఓ అధికారి చెప్పారు.